‘‘ఎక్కడి గొడ్దుది దాపురించిందో, కడుపనుకుని సంతోషపడేలోపే రెండు నెల్లకో ముట్టు లేదా పండుగ పూట పదిహేను రోజులకే చాపెక్కటం’’ ఊర్లో ఇంకా ఇట్లాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య, ఇలాంటి వాళ్ళు పెట్టే ఒత్తిడి వల్ల మరింత తీవ్రమవుతుంది. అలాంటి మనుషులు పిఎంఎస్ని, మానసిక, శారీరక బాధని ఏ
మాత్రం అర్థం చేసుకోకపోగా, వారసులు కావాలంటూ పీక్కుతింటారు. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్య వల్ల పిల్లలు కలగకపోవటం పట్ల నోళ్ళు నొక్కుకుంటారు. ప్రతి ఫంక్షన్లో ఆడ, మగా అని లేకుండా ప్రతి ఒక్కరూ ‘‘గుడ్ న్యూస్’’ చెప్పేది లేదా అనుకుంటూ అక్కసు వెళ్ళబోస్తారు. ఆడపిల్ల తల్లినీ, ‘‘ఇంకెప్పుడు ఇస్తుందట మనవడ్ని’’ అని ఈ వయసులో అమ్మమ్మ అనిపించుకోవటం తప్ప ఇంకో లక్ష్యం ఉండకూడదనే స్థితికి తెస్తారు.
పిల్లలు వద్దని ఎవరైనా అనుకుంటే వారిలో లోపం ఉందనే ముద్ర వేసేస్తారు. డాక్టర్లు కూడా వీళ్ళు చెప్పగలిగినంత త్వరగా నిర్థారించలేరు. పిల్లలు లేని మనుషుల్ని పాపాత్ముల్లాగానో, జాలిపడవలసిన వాళ్ళలాగానో చూస్తారు. మీలాగే లోకంలో అందరూ పిల్లలు వద్దనుకుంటే, భూమ్మీద మనుషులే లేకుండా పోతారని వాదిస్తారు. పోతే ఏం? మనుషుల్ని కని, దేశాన్ని ఏదో ఉద్ధరించాలన్నట్లు, చెత్తను రోడ్డుమీద విసిరేవాళ్ళు, ఒక్క మొక్క పెంచలేనివాళ్ళూ, పిల్లల్ని కనటం దేశ ఉద్ధరింపు కోసమని ఫీలవుతారు. కనీసం భార్య శరీరం, మనసు పిల్లల్ని కనటానికి ఇప్పుడు సహకరిస్తుందా లేదా అనే ఆలోచన గల భర్తలు అరుదు.
మాతృత్వం వరమే కానీ, అది హక్కుగా కాక, ఒక obligation లా, జీవన్మరణ సమస్యలాగా పరిణమించి, సంవత్సరాల తరబడి ఐవిఎఫ్ సెంటర్ల చుట్టూ తిప్పటం ఎంత ఘోరం! అది కూడా భార్యాభర్తల పరస్పర అంగీకారంతో గాక పరోక్షంగా సమాజం, కుటుంబ ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకోవటం. సూటిపోటి మాటలతో పిల్లలు కలగలేదని బాధపెట్టేవారికి, కనేవారి ఆరోగ్యం, ఆర్థిక, మానసిక పరిస్థితులు కనక ముందు, కన్నాక కూడా పట్టవు. సఖ్యంగా లేని భార్యాభర్తలకు పిల్లల్ని కంటే అంతా సర్దుకుంటుంది అనే సలహా ఒకటి పడేయడానికి ప్రతివాళ్ళూ మానసిక నిపుణుల్లాగే ప్రవర్తిస్తారు. ఈ మాటలు నమ్మినవాళ్ళు తర్వాత సమస్యలు ఇంకా తీవ్రమవుతున్నా, చచ్చీ చెడీ పిల్లల కోసం ఒకే ఇంట్లో పడి ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు పాడు చేసుకుంటూ. పిల్లలుంటే కుటుంబంలో ప్రేమానురాగాలు ఏర్పడి కొంత సఖ్యత కుదురుతుందేమో! ఆ వారంటీ ఎంతకాలం దాకా ఇవ్వగలరు ఈ సలహాలిచ్చినవాళ్ళు? పసిపిల్లలతో కెరీర్లు పోగొట్టుకుని, డైపర్లు మార్చటానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా, ఇంట్లో చులకనైపోయేది ఆడవాళ్ళే.
ముసలితనంలో పిల్లలే కదా ఆసరా అని నోళ్ళు నొక్కుకునేవాళ్ళు కనిపిస్తారు. వృద్ధాప్యంలో సేవలు చెయ్యటానికి పిల్లలు కావాలన్నమాట! ఇంతకన్నా స్వార్థం ఎక్కడైనా ఉందా? పిల్లల్ని పోషించడానికయ్యే ఖర్చులు కూడబెట్టి, ముసలితనంలో ఎవరిమీదా ఆధారపడని లైఫ్స్టైల్ని అలవాటు చేసుకోవచ్చు. ఆశ్రమంలో చేరవచ్చు. మనుషుల్ని నియమించుకోవచ్చు పనుల కోసం.
ఆస్తిని అనుభవించడానికి వారసులే కావాలనే స్వార్థం ఉంటుంది, కళ్ళముందే అనాధాశ్రమాలు పెరుగుతున్నా. భూమ్మీద ప్రతి ఉద్యోగానికీ అర్హత కావాలి కానీ ఒక జీవిని భూమ్మీద వదలటం ఎంత పెద్ద ఉద్యోగం! అందుకు అర్హులమా కాదా అనే ఆలోచన లేకుండా కనెయ్యటం ఎంత నష్టం? పిల్లలకు తగినంత ప్రేమ, స్వేచ్ఛ, మంచి చదువులు, ఆర్థిక భరోసా ఇవ్వగలమా? బిడ్డని సమాజానికి హాని తలపెట్టకుండా, కావాల్సిన సంస్కారాన్నిచ్చి పోషించగలమా? ముప్ఫయ్యేళ్ళొచ్చినా, తల్లిదండ్రుల సంపాదనతో బండిలో పెట్రోలు కొట్టించుకునే అఘత్యంలేని పుత్రుడ్ని చేయగలమా? కూతురికి జాగ్రత్తలే కాక, ధైర్యాన్ని నింపగలమా?
తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి హాని కలిగించకుండా, బాధ్యతగా పెంచగలమనే నమ్మకం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పిల్లల్ని కనటం చాలా నేరం. అట్లాగే ఆడమనిషి శారీరక సమస్యలను పట్టించుకోకుండా పిల్లలకోసం హింసించే హక్కు భర్తకు, కుటుంబానికీ, సమాజానికీ ఉండనివ్వకూడదు. ఇంకో జీవిని సృష్టించి, ఈ చెడుకు కృశింపచేయటమో, చెడులో భాగస్వామ్యం ఇవ్వటమో ఇంకా క్షమించరాని నేరం. పిల్లలు పుట్టకపోవటం కోడలి తప్పుగా చూసే అత్తలు, సమస్య కొడుకులో ఉందేమో ఒకసారి డాక్టర్ని కలవమనకపోయారా అంటే సహించరు. అలాంటి పితృస్వామ్య భావజాలంతో పిల్లలు పెరిగితే ముందు తరాలు ఎట్లా అవుతాయో చెప్పక్కర్లేదు.
పక్కింటి రెండేళ్ళ పిల్ల కనిపించినపుడు, మూడేళ్ళ మనవడితో ‘‘అదిగో నీ పెళ్ళాంరా’’ అని ఇకిలించే వాతావరణంలో పిల్లలు ఎట్లా సభ్యత నేర్చుకోగలరు? ఆడపిల్లని మగరాయునిలాగా అదేం నడక అనే ఆ తల్లి కూతురి జీవితాన్ని ఏం చేస్తుందో ఏమిటో!
ఇంకా అండం, వీర్యం పిల్లల్ని కనటానికి అర్హతని నమ్ముతున్నారా?