మృదంగం
రాజుగారి బొటనవేలు

కొండేపూడి నిర్మల
కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో రాజు గారి బొటనవేలు దొరికింది. జరిగిన విధ్వంసాన్ని తలుచుకుని యావత్‌ ప్రజానీకం వొణికిపోయింది. నా వరకు నేను కూడా టి.వికి అతుక్కు పోయాను. రాజభక్తితో తల్లడిల్లుతూ నేను వొండిన బొగ్గుల కూరలో బంగాళాదుంపల ఆనవాళ్ళు వెతుక్కుని, పుల్ల మజ్జిగ కలుపుకుని (పెరుగు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోనే దొరుకుతుంది. కానీ టి.వి వదిలి వెళ్ళేవారెవరు…? ఇంట్లో అంతా దాదాపు చావు భోజనమే చేశారు..పక్కింటి ఊర్మిళ తన మూడ్నెల్ల కొడుక్కి విటమిన్‌ డ్రాప్స్‌ వెయ్యడం మరిచిపోయి ఆనక అత్తగారితో చివాట్లు తింది. కొత్తగా కంటి ఆపరేషను చేయించుకున్న శేషగిరి మామయ్య ఉత్కంఠ కొద్దీ, ఒక్కంటితో వార్తలు చూసెయ్యడం వల్ల తిక్క కుదిరేంత తల్నొప్పి వచ్చి పడింది. నెలలు నిండిన మా అక్క కూతురు అనంతకి రాక రాక ఈ టైములోనే ఎక్కడ కాన్పు వస్తుందో అని చుట్టాలంతే ఒకటే గొణుక్కు న్నారు. మిన్ను విరిగి మీద పడినా సరే, మృత్యుశకలాల నుంచి చూపు తిప్పడం ఎవరికీ సాధ్యం కాలేదు. వార్త విన్న తక్షణమే మూడు వందల నలభై మంది దాకా గుండె ఆగి మరణించారని మీడియా అదే పనిగా చెప్పింది. పనిలో పనిగా నష్టపరిహారాల ప్రకటన కూడా అయిపోయింది. వేలాది వేళ్ళు ప్రార్ధనలు చేశాయి. వందలాది బొటనవేళ్ళు కెమెరాకి పనిచెప్పాయి. పదుల కొద్ది బొటనవేళ్ళు తదనంతర పరిణామాల కోసం పావులు కదిపాయి. ఇక లక్షలాది ప్రేక్షక బొటనవేళ్ళు రిమోట్‌ మీదే మూర్చ పోయాయి.
ఒకే ఒక బొటనవేలు మూగబోయిన కారణంగా ”ప్రపంచం అంధకార బంధురమై పోయింది” తెగిపడ్డ శరీరాలు చూడ్డం మనకి కొత్త కాదు, ఏ ఛానల్‌ పెట్టినా ఒక దోసెడు రక్తం నట్టింట్లో కురుస్తుంది. అది రాజుగారి బొటనవేలు కదా!
కుర్చీలో వున్నప్పుడు ప్రత్యర్ధిని ఓడించి విజయ కేతనాలు ఎగరేసింది. పాద యాత్రల మధ్యలో మహోధ్రతమైన ఉపన్యాసాలకి అభినయ విన్యాసంతో ఊగిపోయింది. చరి త్రని గిర గిర తిప్పే ఒప్పందాలమీద ”తనదైన ముద్ర” వేసింది.
దురదృష్టవశాత్తూ సాంకేతిక లోపం కారణంగా ఇప్పుడది అడవి పాలైంది. లేక పోతే ఇంకా ఎన్ని పధకాలు రచించేదో..? అశేష ప్రజానీకం వన్స్‌మోర్‌ చెప్పిన ఆ పరిపాలన ఎన్ని మలుపులు తిప్పేదో.. ఇప్పుడు మాత్రం ఏం పోయింది..? ఆయన రక్తం పంచుకుని పుట్టిన బొటనవేలే రాజరికాన్ని అనుభవించాలని ఆయన ఉప్పు(?) తిన్న, తిన్నట్టు తెలీకూడదను కుంటున్న, ఇంకా తిందామనుకున్న మంత్రివర్యులంతా ముక్తకంఠంతో కోరు కుంటున్నారు. ప్రజాస్వామ్యమంటే రాజుగారి గొడ్ల సావిడి అని, మంత్రి పదవి అంటే పెద్ద కోమటిశెట్టి దొడ్డికి వెళ్ళి వచ్చే లోపు దుకాణాన్ని కావలి కాసే చిన్న కోమటి చర్య- అని ఇలాంటప్పుడే కదా మనకి తెలిసేది. ప్రత్యేకించి రాజుగారి చిర్నవ్వు గురించి సంపాదకీయాలు వచ్చాయి. అవును దేశంలో ఎంత ఘోరం జరిగినా గానీ, ”చట్టం దాని పని అది చేసుకుపోతోంద”ని చెబుతున్నపుడు ఎటువంటి చిర్నవ్వు అది..? ముదిగొండ కాల్పులు, వాకపల్లి అత్యాచారాలు, వానల్లేక రైతాంగం అహోరించి పోతుంటే జలయజ్ఞం, వరదలో మునిగిన వారికి నష్టపరిహారం, పత్రికా స్వేచ్ఛ మీద దాడి- ఎప్పుడు అయినాగాని, చిరునవ్వు బీటవారిందా చెప్పండి! ఇంత క్రితం మనల్ని ఏలుకున్న చంద్రగిరి రారాజుది మాత్రం తక్కువ నవ్వా..? మబ్బుల్లో దోబుచులాడిన నెలవంక కాదూ..? నవ్వుల పోటీ పెట్టాలేగాని ఓడిపోయే వాళ్ళెవరూ లేరు.. ఆకలి చావులకి మాస్‌ హిస్టీరియా అని పేరు పెట్టినపుడు గానీ, ఇల్లు కూలడం ప్రభుత్వ నష్టపరిహారాల కోసం – అని వెటకరించినప్పుడు గానీ చీమంత తేడా వచ్చిందా? లేదు..రోమ్‌ నగరం తగలబడుతుంటే వీణ వాయించే కళాకౌశలం సామాన్యులకి చాతకాదు.
కానీ నేను అనుకుంటూ వుంటాను.. .ఏ రాజు అయినా సరే ఒక్క ఇరవై నాలుగు గంటల కిరీటాన్నీ. వంధిమాగధుల్ని పక్కన పెట్టి, ఒక కొండలోనో గుహలోనో అనామ కంగా గడిపివస్తే, ఆకలి అంటే తెలు స్తుందేమో, వలస అంటే అర్ధమవు తుందేమో, చట్టము, న్యాయమూ ఎంత దుర్భ రంగా పనిచేస్తున్నాయో, ఒంటరి ఆక్రందన ఎలా వుంటుందో. అవగతమవు తుందోమో.. అది తెలిసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చాక అయినా వారి మనస్తత్వంలో ఏమయినా మార్పు కనబడుతుందోమో..అని బహుశా నాది దురాశ కావచ్చు.. బాధితులందరూ ఇలా దురాశతో కూడిన కలలే కంటూ వుంటారు కావచ్చు..పగవాడికి కూడా రాకూడదని మరణం ప్రభువులకి వచ్చి పడిందని ”నిండు మనసుతో(?) ప్రతిపక్షాలు కూడా మొహం పెట్టాల్సి వచ్చింది. నాకు తెలిసిన రాజ మరణాల్లో ఇది నాలుగవ భీభత్సవం. ప్రజల ప్రాణాలంటే రాజులకున్నంత ఉదాసీనత, రాజుల బొటనవేళ్ళ పట్ల ప్రజలకుండదు కాబట్టి నెత్తిమీంచి ఆకాశం మీదుగా ఏ హెలికాప్టరు ఎగిరినా, ప్రమాదంలో కూలినా పరిగెత్తుకు వెడతారు. సామ్రాజ్యనేతని అంత దగ్గరగా చూసిన తబ్బిబ్బుతో, తనకి తెల్సిన పసరు వైద్యం చెయ్యడానికే చూస్తారు. సంతాప దినాలు పూర్తవగానే, అదే మనుషుల్ని తరిమికొట్టి, అవే అడవుల్ని కూల్చి కుప్పలు చేసి, రేపు ఆ బొటనవేలుకి స్థూపం కట్టి పర్యాటక ప్రాంతంగా మార్చినా సరే, ప్రజలు ఏమీ చెయ్యలేకపోవచ్చు. భారత రత్న ఇవ్వడం కంటే ఇది పెద్ద దుశ్చర్య. రాజులు తల్చుకుంటే రాళ్ళ దెబ్బలు కొదవా..? ఇప్పటికే సగం పర్యావరణం కాంక్రీటు దిబ్బ అయిపోయింది. వాదం మోపడానికి ప్రజల తలకాయలు తప్ప ఇంకెక్కడా చోటు లేదు.
మరి, పాపం అభాగ్య ప్రజలకి కూడా బొటనవేళ్ళు వున్నాయి కదా. నిశానీ వెయ్యడానికి అక్కరకొస్తున్నాయి కదా, ఎవరిగూట్లో వాళ్ళు వుండగానే అందరి ఓట్లూ ఉండేలు దెబ్బ తాకిన పిట్టల్లా ఒకే బుట్టలో పడుతుంటే నోరు మూసుకుని వూరుకున్నాయి కదా..
ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న దాన్ని ప్రజాస్వామ్యమని తెలుసుకోవడం ముఫ్ఫె అయిదు మార్కుల కోసం మాత్రమే అని అనేక సార్లు రుజువైపోయింది కదా, రాజుగారి బొటనవేలు ప్రజల కంట పడ్డానికి ఎంత సాంకేతిక అనర్ధం కారణమో నాకు తెలీదుకానీ.. ప్రజల పీకలు తెగడానికి నేల విడిచి ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. ప్రజాస్వామ్యం చాలు. ప్రజాస్వామ్యంలో కనబడుతున్నంత సాంకేతికలోపం ఇంకెక్కడైనా వుందా..?
కవిత్వం
ఆమె ఎవరైతే నేం?
(అక్టోబరు 16 న ప్రముఖ కవయిత్రి ఆదూరి సత్యవతిదేవి ప్రధమ వర్ధంతి)
నిజానికామో మౌన ఝరి
ఒక సౌందర్య మోహవని!
నవ్వు వెన్నెల తునకలూ
పెదవి వంపుల మెరుపులూ
మొగ్గ జాబిలి నిగ్గులూ
లాలి వూయలల ముంగురులూ
పారంపర్య బహుమతులుగా అందుకొని
యుగయుగాల ప్రాకృతిక పచ్చదనాన్ని తనలో నింపుకొని
అభినయ నాట్యవేదాల
వినయపు విద్యాభ్యాసం నెరపి
రసజగమై ఎదిగిన ఆమెపై
ఎన్నెన్నో చూపుల తూనీరాలు గుచ్చుతాయి
నునుపు తివాచీపై వెండి జరీలా మెరిసి పడే
గెలుపు మహోత్సవాల ఇంద్రధనుస్సులో
పసిపాపలా మురిసిపోయే
ఆ సువర్ణగంధి యౌవన పతాక రెపరెపలపై
మాంత్రికుని వేట ప్రారంభమౌతుంది.
మనసు పరవశించో..మాటల వెన్నలకు మురిసో
స్వాప్నిక జగత్తులోని జానపద లోకానికై
కళని కైమోడ్చి ఆ పొగడ్తల చేతుల్లో వుంచుతుంది. మెలమెల్లగా.. తెరమీద పొరపొరగా
తన అస్థిత్వాన్ని రాల్చుకుంటుంది.
విద్యుత్‌ జలపాతాల మీద ఊగే ఊయలలోకి
తన ప్రమేయం లేకుండానే చేరుకుంటుంది.
సర్కస్‌ ఫీట్ల మధ్య రింగు మాష్టారి ఆజ్ఞానుసారం చరిస్తూ
రెండో ఊయల నందుకోలేక
ఒక మాంసాకృతిగానే మిగిలిపోతుంది!
వాడు ప్రఖ్యాతుడూ చతురుడే అయినా
ఆమె సురభిళసోయగాన్ని
కొలిచి చూచే చూపులేక
మనసు ఎదుగుదల చాలక
ఎక్కడెక్కడినించో ఏరి తెచ్చుకున్న
వెర్రి మానసిక వ్యాధుల్తో
సమస్త హీన దీన దౌర్భాగ్భ భావజాలాల్తో
ఆమెను ముక్కలు ముక్కలుగా కత్తిరించి
రూపాయి బిళ్ళకటూ యిటూ అతికిస్తాడు
జూదాన్ని తారస్థాయికి చేర్చి
క్రూర మృగాల్ని ఉసిగొలిపి
నందనవనాన్ని నాశనం చేస్తాడు.
ఒక దేవలోక బహుమతిని
మురికి కాలువ పాల్జేస్తాడు
తిలా పాపంలో తలాగుప్పెడూ భాగమై
అలా ఛిద్రమైపోతుందా సౌందర్య కలశం!
(ఆంధ్రజ్యోతి దినపత్రిక-ఏప్రిల్‌ 18, 1996)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో