ఈ మార్చి నెల మూడు సమూహాలకు ప్రత్యేకమైనది. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం! మార్చ్ 3న అంతర్జాతీయ రచయితల దినోత్సవం. అలానే మార్చ్ 21న అంతర్జాతీయ కవుల దినోత్సవం.
మహిళలు, రచనలు, కవిత్వం అను కుంటూ మ్యాచ్ ది ఫాలోయింగ్ మొదలు పెడితే ఏయే గీతలు కలుస్తాయి? సంభాష ణలు, పాటలు, కథ, నవల, సినిమా, సీరియల్, వెబ్ సిరీస్ – ఇందులో జెండర్ లెక్కలు వేస్తే లాభపడిన స్త్రీలు ఎక్కడెక్కడ? ఎంతమంది? కొందరున్నారు గాని లెక్కవేస్తే పదిమంది కన్నా ఎక్కువ తేలరు. ఎందుకు? ఎందుకో!
రచయితలలో మహిళా రచయితలు వేరయా. శ్రీనాధుడి రసికత, ముద్దుపళని దాకా వచ్చేసరికి పరమ బూతు అవుతుంది. శ్రీశ్రీ గర్జింపు జయప్రభ నీలిరాతగా మారు తుంది. విప్లవానికి కూడా లింగం ఉంటుంది. మహిళల తర్జని గయ్యాళితనం ఐతే మగవారి గద్దింపు ప్రశ్నగా మారుతుంది.
స్త్రీవాద రచనలకు పురుషులు ఆమోద ముద్రపడాలి మరి. పడకపొతే బూతు కరపత్రాలు పంచబడతాయి. అది కోర్టు దాకా సాగే అవకాశం ఉంటే మహిళా రచయి త్రులపైనే రంజు(కు) కథలు రాయ బడతాయి. మౌంట్ రోడ్డుపై పుస్తకాలు తగలబడతాయి, బెదిరింపులు అతిశయించి హింస వరకు పెరుగుతాయిÑ సృజనాత్మకత జోడిరచి బూతు పంచాంగాలు, అవయవ వర్ణనలు, ఇంట్లో కొట్లాటలు, వీధులలో సంజాయిషీలు, సహాయ నిరాకరణలు…
నీకెందుకు ఇవన్నీ? రాయవలసిన అవసరమేమిటి? నువ్వు రాస్తే ఇవన్నీ నువ్వు చేసిన పనులే అనుకుంటారు. నీ కుటుంబం గురించి ఆలోచించు. ఆమెకు పెళ్లి కాలేదు, ఆమె రాస్తుంది. నీకు పిల్లాడున్నాడు, గుర్తు పెట్టుకో. ఇంటి పరువు కాపాడుకో..
ఏ ఇబ్బందులు లేని రచన చేయడం ఎందుకు? నా ఇబ్బందులు నేను చెబితే మిగిలిన వారికి వెరపు ఎందుకు?
సరే అక్కడో పువ్వు, ఇక్కడో నవ్వు, భర్త మీద (మాత్రమే) అనురాగం, పిల్లల మధ్య ప్రేమ, వర్షం, చినుకులు, మా ఆయన తెచ్చిన ఎర్ర చీర ఇటువంటి రచనలు చేసుకోనా? తొడల మధ్య నొప్పి, గడ్డలు గడ్డలుగా కారిన రక్తం, రహస్య ప్రేమ ముగిసిన బాధ, సుఖం కోసం పెనుగు లాడే తనువు ఉహు ఇవేం వద్దుగాక వద్దు.
సరే, యుద్ధం, యుద్ధంలో రక్తం అని రాస్తున్నారుగా మగాను రచయితలు, అటు ప్రయత్నిద్దాం. యుద్ధం, యుద్ధంలో కోల్పోతున్న ప్రాణాలు. ఠండా ఘోష్ అని మంటో ఎప్పుడో రాస్తే ఇప్పటికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాము. మరి ప్రతి రాత్రి నా శరీరం కుటుంబ బజార్లో ఠండా ఘోష్‌గా ఫ్రీజ్ మోడ్లోకి మారుతుందని రాస్తే? వద్దా.. సరే, యుద్ధం మధ్యలో ఇరుక్కుపోయిన ఆ అమ్మాయిల సంగతి. వార్ బేబీస్ గురించి వీరంగానలుగా వీరతిలకం దిద్ది ఊరవతల పారేసిన యుద్ధ శకలాల గురించి..
వద్దు వద్దు, పువ్వు-నవ్వు, ఆకు-ఆకాశం, రాత్రి, జాబిలి, చూపులు, పాటలు, చెలి చెంగు, తల్లి కొంగు ఇది సరేలే అందరికి సరిపడతాయి.
కానీ ఎక్కడ రాయాలి? ఈ ఇరుకు ఇంట్లో నాకో స్థలం ఉందా? ఉందే అనుకో ఆ స్థలంలో కూర్చునేందుకు సమయం
ఉందా? ఉందే అనుకో, దానికి తగ్గ స్థిమితం మెదడులో ఉందా?
కుక్కర్లు, గిన్నెల మూటలు, పిల్లలు, పికప్పులు, పూజలు, ఉపవాసాలు, డబ్బాలు, టిఫిన్లు, పాపాయి డాన్స్ క్లాసులు, అబ్బాయి టోర్నమెంటులు, క్వశ్చన్లు-ఆన్సర్లు, స్లీప్ ఓవర్లు, మధ్యే మధ్యే భర్తలకు కాఫీలు, చుట్టాలకు చక్కర్లు, అతికించిన నవ్వులు, బంధించిన ఆలోచనలు, నిద్రపుచ్చిన దేహాలు.. మొబైల్ ఫోనులు, లంచ్ బాక్సులు.
పోనీ రాజకీయ కథలు గ్లోబలైజేషన్ కథలు, పోస్ట్ మోడరన్ కవిత్వం? అవన్నీ మగవారి లెక్కల్లో చేరతాయి. నువ్వు స్త్రీవాద రచనలు చేసుకో, భయమేస్తే ప్రకృతిని వర్ణించుకో, పైత్యమొస్తే అమలిన ప్రేమ కవిత్వం రాసుకో.
‘ఎ రూవ్‌ు ఫర్ సెల్ఫ్’, అన్నది వర్జీనియా వూల్ఫ్. గది మాత్రమేనా? నాకో ఆలోచనల అలమారా కావాలి. భయపెట్టని పాఠకులు కావాలి, బెదిరించని దేశభక్తి కావాలి, బూతులు తిట్టని భక్తులు కావాలి. మనసుకు వింజామర వంటి సాంత్వన కావాలి, ప్రశ్నల మంటను ఎగదోసే విసనకర్ర కావాలి, పటకారు మధ్య నలుగుతూన్న వేళ్ళను విడిపించుకుని, పరిగెత్తికెళ్ళి కలాన్ని సానబెట్టేందుకు ఆ కొంత సమయం, పాత సాక్సుల కోసం విసిగించని ఆ కొంత సందర్భం, ఇరుకుపడిన ఊహల దేహాన్ని, ఆకాశం క్రిందకు చేర్చి పొడుగ్గా సాచి, చేతుల పురివిప్పి ఒళ్ళు విరుచుకునే ఆ చోటు కావాలి.
ఏమమ్మా అంతర్జాతీయ మహిళా, రచయితా, కవి దినోత్సవం ఇవన్నీ మాకు ఇస్తావా?