ఎం.ఏ.వనజ
ఉపాధి హామీ చట్టం, కనీస వేతనాల చట్టం, పిల్లలు పనిచేయడాన్ని నిషేధించే చట్టం, కట్టు బానిసత్వాన్ని (బాండెడ్ లేబర్) నిషేధించే చట్టం, 14 ఏళ్ళ లోపు పిల్లలకు నిర్భంధ ఉచిత విద్యాచట్టం లాంటి అనేక చట్టాలు చేశాక, భారతదేశ స్వాతంత్య్రం షష్టిపూర్తి జరుపుకోడానికి సమాయత్తమవుతున్న క్షణాన ఎక్కడున్నామో సమీక్షించుకునే ధైర్యం మనకి ఉందా?
ఏవో స్వచ్ఛంద సంస్థలు ”అతిశయోక్తి” వచనాలు పలుకుతున్నాయనో, పత్రికలు గోరంతను కొండంత చేసి రాస్తున్నాయనో కొట్టి పారేసినా, మన గౌరవ ప్రభుత్వం వారే స్వయంగా చెబుతున్న లెక్కలు అక్షర సత్యాలని నమ్మినా, మన రాష్ట్రంలో 4.5 లక్షల మంది, దేశంలో 1.7 కోట్లు మంది పిల్లలు బాల కార్మికులుగా కష్టిస్తూ బాల్యపు హక్కును కోల్పోతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశంగా, ఏటా 26 మిలియన్ల మంది పిల్లల్ని ప్రపంచ బాలల జనాభాకు కలుపుతూ పోతున్న మనదేశంలో బాల సంపదను భవిష్యత్ వనరుగా మలచుకునే ప్రయత్నాలేవీ జరగడం లేదు. పిల్లల మేధాశక్తికి పదునూ పెట్టలేక, మేధ శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడానికీ సిద్ధంగా లేక ”పిల్లలెందుకు బడికి పోవడం లేదు” అని అడిగితే ”పాపం, తల్లి దండ్రులు పేదోళ్ళు. పిల్లలు కూలినాలీ చేసి సంపాదిస్తేనే కుటుంబం గడుస్తుంది” అని నిస్సంకోచంగా ఠక్కున జవాబివ్వడానికి మన యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది. కానీ, ఈ జవాబు మన చట్టాల అమలు తీరును వెక్కిరింతకు గురి చేస్తాయని ఆలోచించే పరిణతి మన యంత్రాంగంలో రాలేదింకా.
పిల్లలు పనికి ఎందుకు పోతున్నారు? వారిని పనిలోకి తీసుకుంటున్నదెవరు?
పిల్లలు కారు చౌకగా లభించే నాణ్యమైన శ్రామికులు. పెద్దల కంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ఎక్కువ ఫలితం చూపిస్తారు. రెండు దెబ్బలు కొట్టినా ఎదురు తిరగకుండా పడుంటారు. అన్నిటికంటే మించి, ”ఇంతే ఇచ్చారేం” అని పారితోషికం గురించి ప్రశ్నించే ధైర్యం ఎన్నడూ చేయరు. ఇచ్చింది పుచ్చుకుని తృప్తిగా చూసుకుంటూ మరింత చాకిరికి ‘సై’ అంటారు! ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, చదువుకున్నా, చదువుకోకపోయినా, వృత్తి నైపుణ్యం ఉన్నా, లేకున్నా, అనుభవం ఉన్నాలేకున్నా అన్ని రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వాదిస్తోంది. ఒకవేళ ఈ వాదన నిజమని నమ్మితే, మరి కనీస వేతనాల చట్టాల అమలు ఏమైంది? వివిధ రంగాలకు, కాలానుగుణంగా ప్రభుత్వం నిర్ణయించాల్సిన కనీస వేతనాలు నిర్ణయం అవుతూ, అమలు జరిగితే అసలు పిల్లలను పనికి పెట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? తమ పసికూనల్ని పనికి పంపడానికి ఏ తల్లి దండ్రులు సిద్ధమవుతారు? ఈ విధంగా పిల్లలు పనికి వెడుతున్నారంటే కనీస వేతనాల చట్టం నగుబాటుకు గురైనట్టే కదా!
ఇక పాఠశాలల్లో వాతావరణమూ జుగుప్సాకరంగానే ఉంది. మన రాష్ట్రంలో ఉన్న 66,528 ఆవాసాల (హాబిటేషన్స్) లో ఇప్పటికీ 14,310 ఆవాసాలలో ప్రాథమిక సదుపాయం లేదు. ఇక్కడి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ లోపు పిల్లలు చదువుకోవడానికి ఒక కిలోమీటరు, ఆపైన దూరం నడిచి పోవాలి. కేవలం 16,291 ఆవాసాల్లో మాత్రమే ప్రాథమికోన్నత పాఠశాలల సదుపాయం ఉంది. 49,717 ఆవాసాల బాలలు ఆరు, ఏడు తరగతి చదవాలంటే 3 కిలోమీటర్లు, ఆపైన దూరం నడిచి వెళ్లాలి. అంటే రోజుకి కనీసం ఆరు కిలోమీటర్ల దూరం నడవగలిగితే ఆరోతరగతి చదవచ్చు! ఉపాధ్యాయులు లేని బళ్ళు (2002 అక్టోబర్ 1 నాటికి 2.80 శాతం స్కూళ్ళలో ఒక్క టీచరు కూడా లేరు) సింగిల్ టీచర్ స్కూళ్ళు, చెట్లు కింద నడిచే బళ్ళు, టాయ్లెట్లంటే ఏమిటో తెలీని బళ్ళు, తాగు నీటిని విద్యార్థులే ఇరుగు పొరుగు వారిని బతిమాలి కుండలతో మోసుకుని తెచ్చుకోవాల్సిన స్కూళ్ళు, రాష్ట్రంలో, రాజధాని మొదలుకొని ఏ పట్టణం, ఏ గ్రామంలో చూడాలనుకున్నా సూనాయాసంగా దర్శనమిస్తాయి.
బడిలో విద్యార్థికి అనకూలమూ, ఆహ్లాదకరమూ అయిన వాతావరణాన్ని సృష్టించడం మొదలుకొని, పిల్లల్ని పనికి పెట్టుకుంటే శిక్ష తప్పదనే భయాన్ని ”పెద్ద యాజమానుల్లో” కలిగించడం వరకు అడుగడుగునా ప్రభుత్వం విఫలం కావడం వల్లనే బాల కార్మికుల సంఖ్య పెరగడమో, నిలకడగా ఉండటమో జరుగుతోంది తప్ప తల్లిదండ్రులూ, వారి పేదరికం ఎంత మాత్రం కారణం కాదు. హెల్మెట్, సీటుబెల్ట్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడానికి భారీ జరిమానాలు విధించడంలో పోలీసులు కనబరుస్తున్న శ్రద్ధాసక్తుల్ని బాల కార్మికుల యజమానులపై కొరడా ఝళిపించడంలో ఫ్యాక్టరీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, కనీస వేతనాల అమలు అధికారులు ఎందుకు చూపలేక పోతున్నారో చెప్పే సమర్థనీయ కారణం ఉందా?
మన రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్య పది లక్షలు దాటిందనీ, అందులోనూ 70 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉన్నారని యునిసెఫ్‌తో సహా వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఇది కాకుండా, కనీసం రెండు లక్షల మంది పిల్లలు ఇళ్ళలో పని వారుగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇళ్ళలో పనిచేయడాన్ని ప్రమాదకర పనుల జాబితాలో చేర్చడం మరచింది. ఇళ్ళలో గ్యాస్ స్టౌలపై పనిచేయడం, బ్లేడులూ, కత్తి కటార్లతో శుభ్రం చేసే పనులో, కూరలూ, పళ్ళూ తరిగే పనులో చేస్తూ, నిరంతరం నీటిలో నానిన శరీరంతో చర్మ వ్యాధులకు, కాళ్ళు పాలిపోవడం లాంటి అనారోగ్యానికి గురవడానికీ మించిన ప్రమాదకర పనులుంటాయా?
”ఐనా, ”బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి, బడి బయట కాదు” అని గుర్తించడానికి సమయం ఆసన్నమైందని వేరే చెప్పనక్కరలేదు. 14 ఏళ్ళ లోపు పిల్లలందరికీ చట్ట బద్ధంగా ఆహార (పౌష్టికాహార) భద్రత కల్పించి, వారికి బడిలోనే ఆహారం సరఫరా చేసేలా ఏర్పాటు జరగాలి. పాఠశాలల్లో అర్థంతరంగా నిలిపేసిన ఆరోగ్య భద్రత పథకాలను పునరుద్ధరించడం, పిల్లలందరికీ ఆరోగ్య భీమా సదుపాయం కల్పించడం తక్షణావసరాలు. ఉన్ని కృష్ణన్ జె.పి. వెర్సస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్.సి.సి 645 (1993) కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం 14 ఏళ్ళ వరకు చదువు ప్రాథమిక హక్కుగా కలిగి ఉంటారు” అని చారిత్రక తీర్పునిచ్చింది. కోర్టు తీర్పులూ, రాజ్యాంగమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982 ఉండనే ఉంది. దీనికి బూజు దులిపేందుకు నడుం బిగిద్దాం. (తర్జని నుంచి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags