టెలివిజన్‌లో ఆడపిల్లల కార్యక్రమాలు

జి. వసుంధర
టెలివిజన్‌ చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. ప్రజలను చైతన్య పరచడంలో తిరుగులేని ఆయుధం. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఘనత ఛానళ్ళదే. ఇంతటి శక్తివంతమైన టెలివిజన్‌లో రోజు ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తుంటాం. అయితే ప్రమాదఘంటికలు మోగిస్తున్న ఆడపిల్లల తగ్గుదల గురించి, తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించడంలో ఛానళ్ళు కీలకపాత్ర పోషించాలి. మనిషి ఏ పనులు చేయాలో, చేయకూడదో శాసించే స్థాయికి చేరింది టెలివిజన్‌. మనిషికి రోజువారీ పనులలో భాగమైన టీవీ, ఆడపిల్లల మీద ఉన్న వ్యతిరేకతను పోగట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వారిని కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఛానళ్ళమీద ఉంది. అసలు ఆడ పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఛానళ్ళలో ఏ విధంగా ప్రసారమవుతున్నాయో మనం ఒక్కసారి పరిశీలిద్దాం.
గత కొన్ని సంవత్సరాలుగా సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ఛానళ్ళలో ప్రసారమవుతున్న రకరకాల కార్యక్రమాలను రీసెర్చ్‌ చేసి విశ్లేషిస్తోంది. ఎన్నో రకాల సర్వేలు, రిపోర్ట్‌లు తయారుచేసింది. 3 సంవత్సరాల నుండి యునిసెఫ్‌తో కలసి సంయుక్తంగా తెలుగు టీవీ ఛానళ్ళలో ఆడపిల్లల కార్యక్రమాలు కు సంబంధించి ప్రాజెక్ట్‌ చేస్తోంది. ఛానెళ్ళలో ఆడపిల్లల సమస్యలకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు, ఆడపిల్లల అవసరాన్ని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి, చైతన్యం తీసుకురావడానికి సరైన సాధనంగా తెలుగు టీవీ ఛానళ్ళను యునిసెఫ్‌ ఎంచుకుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఛానళ్ళకు కార్యక్రమాల నాణ్యత, ప్రసారం చేసే తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రధానం చేస్తున్నారు.
మొదటి సంవత్సరం (2009 – 2010) 70 రోజులపాటు రాత్రి 7 నుండి 10 గంటలవరకు 17 ఛానళ్ళను రికార్డ్‌ చేయగా, 11 ఛానళ్ళు మాత్రమే ఆడపిల్లల కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అంటే 3519 గంటలు రికార్డ్‌ చేస్తే కేవలం 14.1 గంటలు మాత్రమే ఆడపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఇందులో న్యూస్‌ఛానళ్ళతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ళు కూడా ఉన్నాయి. కేవలం 0.40% మాత్రమే ఆడపిల్లల కార్యక్రమాలు వచ్చాయంటే ఛానళ్ళకు ఆడపిల్లల సమస్యల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ఆడపిల్లల మనుగడకు ఆదిలోనే ప్రధాన ఆటంకంగా ఉన్న భ్రూణ హత్యలు మరియు పురిటిపాపల హత్యల మీద 102.37 నిమిషాలు మాత్రమే కేటాయించింది. చచ్చో చెడో బతికి బట్టకట్టిన బాలికలు అయినవాళ్ళ చేతుల్లోనో, కసాయి మనుషుల చేతుల్లోనో పడి అక్రమరవాణాకు గురవుతున్నారు. నరకకూపంలో చిక్కుకుపోయి ఎందుకు మాకీ జన్మ అంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఇంతటి ఘోరమైన సమస్యను 37.22 నిమిషాలు ప్రసారం చేసింది. మరో ముఖ్యమైన సమస్య బాల్య వివాహాలు. 18 సంవత్సరాలు నిండకుండానే చిట్టితల్లుల మెడకు తాళి అనే ఉరితాడు వేస్తున్నారు. ఆడుకునే వయసులో ఆలిని చేస్తే ఏమిచేయాలో, ఎలా ఉండాలో తెలియక అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య అనేకం. ఈ సమస్యను 90.11 నిమిషాలు ప్రసారం చేసింది. బాల్యంలోనే వివాహం చేయడం, పోషకాహార లోపం మొదలగు కారణాలవలన మాతాశిశుమరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య గురించి ఒక్క సెకండ్‌ కూడా సమయం కేటాయించలేదు. మరి ప్రసూతి మరణాలు జరగడం లేదనా? లేక చూసీచూడనట్లు వ్యవహరించడమా? ఆడపిల్లల మీద ఉన్న వివక్షతో ‘చదువుకుని ఏమి చేస్తుంది, అత్తగారింటికి వెళ్ళిపోతుంది. లేదా ఎక్కువ చదువులు చదివిస్తే, ఎక్కువ చదువుకున్న అబ్బాయిని తెచ్చి పెళ్ళిచేయాలన్న’ ఉద్దేశ్యంతో మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. దీనిమీద కేవలం 14.47 నిమిషాలు ప్రసారం చేసింది. చిన్న వయస్సులోనే కార్మికులుగా మారి కష్టాలు అనుభవిస్తున్న చిట్టి తల్లుల గురించి 30.40 నిమిషాలు కేటాయించారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, కిడ్నాపులు ఇలా ఆడపిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సిఎమ్‌ఎస్‌ మానిటర్‌ చేయడం జరిగింది. 70 రోజులలో కేవలం 112 కార్యక్రమాలు మాత్రమే ప్రసారమయ్యాయి. కార్యక్రమాల సంఖ్యే కాదు సమయం కూడా చాలా తక్కువే. అయితే ఆడపిల్ల అత్యాచారానికి గురైనప్పుడు ఆమె పేరు చెప్పకుండా, ముఖం చూపించకుండా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఆలోచించాలి. పేరు, ముఖం చూపించాల్సిన అవసరముంది అనుకుంటేనే ప్రసారం చేయాలి.
రెండవ సంవత్సరం (2010-2011) 100 రోజులపాటు రాత్రి 7 గంటలనుండి 11 గంటలవరకు 18 ఛానళ్లను రికార్డ్‌ చేశారు. ఇందులో 3 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ళు గర్ల్‌చైల్డ్‌కు సంబంధించిన కార్యక్రమాలేవి ప్రసారం చేయలేదు. మొత్తం 6000 గంటలు రికార్డింగ్‌ చేయగా, 87.24 గంటలు ఆడపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఛానళ్ళకు విలువైన ప్రైమ్‌టైమ్‌లో 1.46% ఆడపిల్లల మీదే ఫోకస్‌ చేసింది. మొదటి సంవత్సరంకన్నా చాలా ఎక్కువ సమయం కేటాయించింది. బాలికల బాధలపట్ల ఛానళ్ళకు స్పృహ కలిగిందని చెప్పవచ్చు. చాలా ఆసక్తిగా సృజనాత్మకంగా కార్యక్రమాలను రూపొందించాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రభావం చూపించే ప్రోమోస్‌ అద్భుతంగా చేశారు. కేవలం 10 సెకన్లపైన 60 సెకన్ల లోపు ఉండే ఈ ప్రోమోస్‌ ప్రేక్షకులమీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మొదటి సంవత్సరం నాలుగు ఛానెళ్ళలో ప్రారంభమైన ప్రోమోస్‌ రెండవ సంవత్సరంలో సృజనాత్మకంగా 7 ఛానెల్స్‌ పోటాపోటీగా రూపొందించాయి. టెలివిజన్లో ఆడపిల్లలమీద కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించిన సంవత్సరానికన్నా చాలా మెరుగైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయనే చెప్పవచ్చు.
మొదటి సంవత్సరం 90.11 నిమిషాలు బాల్యవివాహాలమీద కార్యక్రమాలను ప్రసారం చేస్తే, రెండవ సంవత్సరం 444.43 నిమిషాలు సమయం కేటాయించింది. ఆడపిండాల హత్యలు, పురిటి పాపల హత్యల మీద 102.37 నిమిషాలు ఉంటే, 2010-2011 సంవత్సరం ఆ సమయం 670.50 నిమిషాలకు చేరింది. అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. 37.21 నిమిషాలు ఆడపిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న విషయం ప్రసారం చేస్తే, రెండవ సంవత్సరం ఆ సమయం 211.56 నిమిషాలకు చేరింది. ఇంతటి పాశవిక చర్యను అన్ని ఛానెల్స్‌ ప్రసారం చేయకపోయినా 3 ఛానళ్ళు చాలా ప్రభావవంతంగా ప్రసారం చేశాయి. మరో ప్రధాన సమస్య మాతాశిశు మరణాలు. మొదటి సంవత్సరం మాతా శిశుమరణాల సమస్య దరిదాపులకు కూడా వెళ్ళని ఛానళ్ళు రెండవ సంవత్సరం రెండు ఛానళ్ళు 35.18 నిమిషాలు ప్రసారం చేశాయి. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం, పోషకాహార లోపం, రక్తహీనత వెరసి మాతాశిశు మరణాలకు కారణమవుతున్నాయి. ఇక ఆడపిల్లల విద్య గురించి ఛానళ్ళు ప్రసారం చేసిన తీరు తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఉన్నాయి. 711.01 నిమిషాలు ఆడ పిల్లల విద్యకు ఎదురవుతున్న అవాంతరాలు, ఆడపిల్లకు చదువు ప్రాముఖ్యత వంటి విషయాలమీద ఫోకస్‌ చేశారు. జీడిపప్పు ఫ్యాక్టరీలు, పత్తి చేలల్లో పనిచేసే బాలికా కార్మికుల దీనగాధను ఆరోగ్య పరిస్థితి గురించి 231.52 నిమిషాలు ప్రసారం చేశాయి. అమ్మాయిలపై క్రైమ్‌ స్టోరీల ప్రసారాలలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మొదటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఛానళ్ళలో ఆడపిల్లల సమస్యలకు ప్రాధాన్యం కనిపిస్తోంది. అత్యాచారాలు కిడ్నాపులు, లైంగిక వేధింపులు, హత్యలు మొదలైన వాటిపైన చాలా కథనాలే ప్రసారమయ్యాయి. దీనికి కారణం నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూండటమే. క్లాస్‌ ఆడియన్స్‌ నుండి మాస్‌ ఆడియన్స్‌ వరకు చాలా ప్రభావవంతంగా పనిచేసే సీరియల్స్‌ ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపలేక పోయాయి. ఒక ఛానల్‌ మాత్రమే ప్రత్యేకించి ఆడపిల్లల గురించి సీరియల్‌ ప్రసారం చేసింది.
మూడవ సంవత్సరం (2011-2012) 100 రోజులపాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 10.30 వరకు 18 ఛానళ్ళను రికార్డింగ్‌ చేయగా అందులో 3 ఛానళ్ళు బాలికలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయలేదు. అంటే 6000 గంటలు రికార్డింగ్‌ చేస్తే 93.15 గంటలు బాలికల కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. అంటే 1.55% ఆడపిల్లల కార్యక్రమాలకు కేటాయించింది. ఆడపిల్లల పట్ల ఛానళ్ళ ప్రసారాలలో మార్పు వచ్చింది. బాలల దినోత్సవం లాంటి ఏ సందర్భం వచ్చినా దానికి అనుగుణంగా బాలికల మీద కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాల్య వివాహాల మీద ప్రసారమైన సమయం తక్కువే. 290.50 నిమిషాల సమయం కేటాయించింది. ఆడపిండాల హత్యల మీద 450.46 నిమిషాలు కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈ సమయం రెండవ సంవత్సరానికి తక్కువగా, మొదటి సంవత్సరానికి ఎక్కువగా ఉంది. అయితే ఈసారి మొదటి రెండు సంవత్సరాలకన్నా మాతా శిశు మరణాల మీద ఏకాగ్రత పెంచాయి. 97.49 నిమిషాలు కేటాయించాయి. ఈ సంవత్సరం ఆడపిల్లల అక్రమ రవాణా మీద కూడా ఎక్కువ సమయం కేటాయించాయి ఛానళ్ళు. 318.23 నిమిషాలు వ్యభిచార కూపంలో నరకయాతన అనుభవిస్తున్న చిట్టి తల్లుల గురించి వచ్చింది. 373.54 నిమిషాలు ఆడపిల్లల చదువు మీద కేటాయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆడపిల్లలు చదువు మానేయడానికి కారణాలైన వాటిలో ప్రధానమైన మరుగుదొడ్ల నిర్మాణం నవంబర్‌ 2011 చివరి నాటికి పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో కొన్ని ఛానళ్ళు కార్యక్రమాలను ప్రసారం చేశాయి. మూడు సంవత్సరాలను పరిశీలిస్తే బాల్య వివాహాలు, ఆడపిండాల హత్యలు, చదువువంటి సమస్యల మీద ప్రసారాలు ఎక్కువగానే ఉన్నాయి. సమస్యలను చూపిస్తున్నాయే కానీ వాటి పరిష్కార మార్గాలను చెప్పడంలో విఫలమవుతున్నాయి. ఉదా|| ఆడపిల్లలను మధ్యలోనే చదువు మాన్పిస్తున్నారనడానికి కారణాలు ఎన్నో. ఆ కారణాలను చెప్పడం మీదే ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు కానీ చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు ఈ విధంగా ఉన్నాయని, ఎన్‌జివోలు సహాయం చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో బాలికలకు నాప్‌కిన్స్‌ సదుపాయాలున్నాయి వంటి పరిష్కార మార్గాలు చూపాలి. నాప్‌కిన్స్‌ సదుపాయంలేని స్కూళ్ళలో ఇచ్చే విధంగా ఒత్తిడి చేయడం లాంటివి చేయాలి. మగ పిల్లవాడే చదివి తమను ఉద్ధరిస్తాడన్న భావన తొలగిపోయేలా చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి బడులలో మరుగుదొడ్ల నిర్మాణం చేయాలి. ఇది ఆడపిల్లల చదువుకు అవరోధంగా మారుతోందంటూ కథనాలను ప్రసారం చేశాయే కానీ గత రెండు సంవత్సరాలలో ఛానళ్ళు సొంతంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయలేదు.
ఈ సంవత్సరం కార్యక్రమాలలో గమనించాల్సిన విషయం చట్టాల ప్రస్తావన. ఆడపిండాల హత్యల మీద కార్యక్రమం చేస్తే దానికి సంబంధించిన చట్టాలు శిక్షలు గురించి చెప్తున్నారు. అలాగే వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం, గృహ హింస తదితర సంబంధిత చట్టాల గురించి తమ కార్యక్రమాలలో ప్రసారం చేయడం కొత్త ట్రెండనే చెప్పుకోవచ్చు. చట్టాల గురించి కనీస అవగాహన లేని ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరో ఉదాహరణ చిన్న వయసులో పెళ్ళిని ఎదిరించి, తల్లిదండ్రులే హింసించడంతో కష్టాలననుభవించి, అధిగమించిన కరీంనగర్‌ జిల్లా కిష్టంపేటకు చెందిన పద్మ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. పద్మ నేడు ఆదర్శంగా నిలుస్తోందంటే కారణం ఛానళ్ళే. అన్ని ఛానళ్ళు ప్రసారం చేసినప్పటికీ, అసలు పద్మను ఎందుకు తల్లిదండ్రులే తీవ్రంగా గాయపరిచారో కనుగొనడానికి హెచ్‌ఎంటీవీ ముందుకెళ్ళింది. ఆమె కష్టాలను తెలుసుకుని ప్రసారం చేసిన కథనంతో పద్మ జీవితమే మారిపోయింది. చదువుకునే అవకాశం కలిగింది. ఇదంతా ఛానళ్ళ విజయమనే చెప్పవచ్చు.
యూనిసెఫ్‌తో కలసి సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ చేసిన ఈ గర్ల్‌ చైల్డ్‌ క్యాంపెయిన్‌ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోందని చెప్పవచ్చు. టాయిలెట్ల సదుపాయం లేక ఎంతోమంది ఆడపిల్లలు బడులకు దూరమవుతున్నారని, టాయిలెట్ల నిర్మాణానికి కృషిచేసి ఆడపిల్లలను చదువుల తల్లులుగా మార్చండి అంటూ హెచ్‌ఎంటీవీ, టీవీ9 లాంటి కొన్ని ఛానళ్ళు క్యాంపెయిన్‌ నిర్వహించడం అభినందనీయం. అయితే ఇది సరిపోదు. కొండంతలో ఇది గోరంత మాత్రమే. ఎప్పుడైతే ఆడపిల్లల మీద వివక్ష తొలగి, నిష్పత్తి పెరిగి, విద్యావంతులుగా మారి, అక్రమరవాణాలో చిక్కుకోకుండా, ఏ కార్మికురాలిగానో మిగిలిపోకుండా చిన్నవయస్సులో పెళ్ళి చేసుకుని ప్రసూతి మరణాలకు బలవ్వకుండా ఉంటుందో అటువంటి కార్యక్రమాలు, వార్తలు ఎప్పుడైతే ఛానెల్స్‌ లో ప్రసారమవుతాయో అప్పుడే యూనిసెఫ్‌, సీఎమ్‌ఎస్‌ తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. ఛానెళ్ళు కూడా కేవలం అవార్డులను దృష్టిలో పెట్టుకోకుండా ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఇది నిరంతర ప్రక్రియగా జరగాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

2 Responses to టెలివిజన్‌లో ఆడపిల్లల కార్యక్రమాలు

  1. Babu says:

    చాలా బాగా వ్రాసావు వసుంధరా…

  2. Raghunathreddy says:

    వెరి గుడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.