స్త్రీల ఉద్యమం ముందున్న ప్రశ్నలు

డా. కె. లలిత
స్త్రీల ఉద్యమం ప్రభావంతో 1960, 70వ  దశాబ్దాలలో ప్రపంచం పూర్తిగా మారిపోయిందనటంలో సందేహం లేదు. సమాజంలో స్త్రీల పరిస్థితిని నిర్దేశించే ‘నిశ్శబ్దపు కుట్ర’ మొదటిసారి భగ్నమయింది. ‘శరీర ధర్మమే అంతిమ గమ్యం’ అనే కల్పితం తల్లకిందులయింది. స్త్రీలను పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే చూసే సమాజ దృష్టిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చరిత్రలో మొదటిసారి ‘సెక్సువాలిటీ’ ప్రధానమైన అంశాలలో ఒకటిగా చర్చ కొచ్చింది. వేతనం లేని ఇంటిచాకిరీ, కుటుంబంలో స్త్రీ వివక్ష, ఆమె ఎదుర్కొనే మానసిక, శారీరక హింస ‘రాజకీయాలలో’ భాగాలయినాయి. ఇంటి చాకిరీకి జీతం, గుర్తింపు కావాలనే నినాదం ముందు కొచ్చింది. ‘ప్రైవేటు’, ‘రహస్యం’ అనుకున్న విషయాలన్నీ అణచివేత రాజకీయాలుగా గుర్తించటం ప్రారంభమైంది. ఈ ఉద్యమాలన్నీ ప్రధానంగా పాశ్చాత్య దేశాలలోముందు కొచ్చినా, మన దేశంలో 70లలో వామపక్ష ఉద్యమంలో భాగంగా రూపొందిన స్త్రీల ఉద్యమం పైన ప్రస్తావించిన అంశాలను మన ముందుకు తీసుకొచ్చింది.
70లలో ఉవ్వెత్తుగా ముందుకొచ్చిన స్త్రీల ఉద్యమం, అది లేవనెత్తిన ప్రశ్నలకు తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చిన ఐక్యరాజ్య సమితి 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా, 75-85 ను మహిళా దశాబ్దంగాను ప్రకటించింది. అదే సంవత్సరంలో మెక్సికోలో మొదటిసారి జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఎన్నో దేశాల ప్రతినిధులు, స్త్రీ సంఘాల ప్రతినిధుల దాదాపు 3000 మంది హాజరయ్యారు. బొలీవియన్‌ గని కార్మిక స్త్రీ అయిన దొమితిలా ది చుంగారా స్త్రీల జీవితాలు, హక్కులు, కార్మిక స్త్రీ సమస్యలు, తన జీవితాన్ని గురించి భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఆ సమావేశానికి పతాకస్థాయి. అంతేకాక మూడవ ప్రపంచ దేశాల్లో స్త్రీల ఉద్యమాలకు కూడా ఈ ప్రసంగం ఊపునిచ్చింది.
75-85 దశాబ్దంలో ప్రపంచం నలుమూలల నుంచీ స్త్రీలు తమ జీవితాలను విశ్లేషించి కుటుంబ సమస్యల నర్థం చేసుకుంటూ, కొత్త అవగాహనలను ఏర్పరుచుకుంటూ స్త్రీల ఉద్యమాన్ని నిర్మించే కృషి చేశారు. స్త్రీల పనికి విలువ, గుర్తింపు ఉండాలని, ఇంటి చాకిరీకి వెలగట్టాలని, సమాన పనికి సమాన వేతనం ఉండాలని 75లలో వచ్చిన డిమాండ్లకు కొత్తవి తోడయినాయి. ‘స్త్రీ శరీరంపై హింస’ అనే అంశం ప్రధానంగా ముందుకొచ్చింది. 80 ప్రారంభంలో మన దేశంలో ఎన్నో మహిళా సంఘాలు ‘రేప్‌’ చట్టాలలో మార్పుల కోసం, వరకట్న ‘మరణాలు’ వంటి సమస్యలపై కేంద్రీకరించారు. అదే పద్ధతిలో ‘స్త్రీ శరీరంపై దౌర్జన్యం’గా అర్థం చేసుకున్న ‘కుటుంబ నియంత్రణ రాజకీయాలు’ మరొక ముఖ్య సమస్య అయింది. అంటే ‘సెక్సువాలిటీ’ ‘హింస’ అనే అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయి. ‘అత్యాచారాలు, వరకట్న హత్యలు’ ‘కుటుంబ నియంత్రణ సాధనాలు’ వంటి సమస్యలకు సంబంధించిన చట్టాలలో మార్పులకోసం ఉద్యమాలు చేపట్టటం జరిగింది.
1980 దశాబ్దంలో స్త్రీల సమస్యలపైన కేంద్రీకరించే స్త్రీ సంఘాలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున పని ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రీకరించి పనిచేసే సంస్థలు కొత్తగా స్త్రీల సమస్యల గురించిన అంశాలకు ప్రాధాన్యత నివ్వటం ప్రారంభించాయి. 1990ల వరకు దాదాపు 18000 సంస్థలు ప్రభుత్వం అనుమతితో విదేశాల నుంచి వచ్చే నిధులతో పనిచేయటం మొదలయింది. ‘స్త్రీలపై హింస’ వంటి సమస్యలకు స్త్రీల ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నల గురించి వీటి కార్యక్రమాల్లో ప్రాముఖ్యత చోటు చేసుకుంది. అయితే ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించటానికి స్వచ్ఛంద సంస్థలకు ఊపునిచ్చిన విదేశీ సంస్థలు కూడా ‘స్త్రీ వివక్ష’ ‘లింగ వివక్ష’ వంటి అంశాలకు ప్రాధాన్యత నివ్వటానికి అంతర్జాతీయ స్త్రీల ఉద్యమ వాతావరణం దోహదం చేసింది. 1975 మెక్సికో సమావేశానికి తరువాత దశాబ్దం చివర మళ్ళీ 1985లో నైరోబీ(కెన్యా, ఆఫ్రికా)లో  జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో ఈసారి 18000 మంది స్త్రీలు పాల్గొన్నారు. అందులో ఎక్కువ శాతం ఆఫ్రికా, ఆశియా దేశాల ప్రతినిధులుండటం గమనించదగ్గ విషయం. అయితే 1975లో ఉద్యమం అప్పుడే ఊపునందుకుంటున్న పరిస్థితి ఉంటే 1985 వరకు, స్త్రీ సంఘాలే కాకుండా, స్వచ్ఛంద సంస్థలు స్త్రీ సమస్యను ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక మీదికి తీసుకొచ్చే పరిస్థితి రూపొందింది. ”95లో ”సమానత్వం – అభివృద్ధి, శాంతి” అనే నినాదంతో ఈ బీజింగ్‌ సమావేశం నిర్వహించటం జరిగింది.
అయితే 1985 నుంచి 95 వరకు జరిగిన మార్పులేమిటి అని ఆలోచిస్తే ఒక విషయం బోధపడుతుంది. ఇప్పటి వరకు కార్యాచరణ స్వభావం కలిగి ఉన్న ఉద్యమం ఒక వైపు వేళ్ళూనుకొని నిలదొక్కుకుంటే, ఆ నిలదొక్కుకునే క్రమంలో ఇంకొక వైపునుంచి ఆ స్వభావాన్నే కోల్పోతూ ఉద్యమానికి ఉన్న రాజకీయ పదునును పోగొట్టుకునే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్త్రీల సంఘాలలో చురుకైన పాత్ర వహించిన స్రీలెందరో స్వచ్ఛంద సంస్థలలో పనిచేయటం ప్రారంభించారు. ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి రాజకీయ పార్టీల వరకు ప్రతివాళ్ళు స్త్రీ సమస్యను ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితితో పాటు అదే స్త్రీల సమస్యను ఒక ‘హింస’, ‘మానవ హక్కులు’ పరిధిలోనే చూడటం ఒక యాంత్రిక ధోరణిగా తయారయింది. ప్రధానంగా మధ్య తరగతి స్త్రీ అనుభవాల ఆధారంగా రూపొందించిన స్త్రీ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలకు అంతర్జాతీయ సదస్సులు, ప్రపంచదేశాలు, వాటి ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేశాయి. స్త్రీల సమస్యకు ఎంత విశ్వసనీయత ఉందనుకున్నా ప్రత్యేక రాజకీయ పరిస్థితులలో ఆయా ప్రాంతాలకు, దేశాలకు, సమాజాలకు, జాతులకు, మతాలకు, కులాలకు సంబంధించిన వైవిధ్యతను అర్థం చేసుకోకుండా స్త్రీలందరిదీ ఒకే రకమైన సమస్యగా చూడటం పొరపాటవుతుందనే అవగాహన 90 లలో ఉద్యమంలో ఏర్పడింది. ప్రధానంగా ఈ అవగాహనకు మనదేశంలో, మత సమస్య, దళిత సమస్య పునాదిగా స్త్రీల ఉద్యమం గురించి వచ్చిన విమర్శలు కారణం అని చెప్పుకోవచ్చు. వైవిధ్యతలను దృష్టిలో ఉంచుకోకుండా స్త్రీల సమస్యల నర్థం చేసుకోవాలంటే తిరిగి ఆ విశ్వజనీతకు ప్రాధాన్యత నివ్వటం అవుతుంది.
అయితే బీజింగ్‌ సదస్సుకు ఇక్కడ ప్రస్తావించిన అంశాలకు సంబంధం ఏమిటనే ప్రశ్న రావచ్చు. చాలా పెద్ద సంబంధం ఉంది. అందులో మొదటి అంశం ‘స్త్రీల హక్కులను మానవ హక్కులు’ గానే అర్థం చేసుకొనే ప్రయత్నం. ఇందులో తప్పేముంది అనే ప్రశ్న వస్తుంది. తప్పేమీ లేదు. ‘మానవుడు’ అంటే పురుషుడే అనే సాంఘిక అర్థంవున్న పరిస్థితుల్లో స్త్రీలను కూడా మానవుల కింద పరిగణించాలనే కోరటం మానవ హక్కు కూడా. అయితే ఈ ‘విశ్వజనీనత’ రూపంలో, స్త్రీల సమస్యలకున్న వైవిధ్యత మరుగున పడిపోతుంది. ఉదాహరణకి మనదేశంలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడితే, అందులో దళిత స్త్రీల హక్కులు, బ్రాహ్మణ స్త్రీల హక్కులు ఒకే పద్ధతిలో అర్థం చేసుకోవటం తప్పవుతుంది. ఈ రెండు గ్రూపుల మధ్య వర్గం, విద్య, సాంఘిక స్థాయి వంటి అంతరాలెన్నో కనిపిస్తాయి. అందుకే మనందరం స్త్రీలుగా ఒకటే రకమైన సమస్య నెదుర్కొంటున్నామనిపించినా ఆ సమస్యలను అవగాహన చేసుకోవటానికి ఆయా రాజకీయ పరిస్థితులను భిన్న దృష్టిలో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే హక్కులకు విశ్వజనీనతని ఆపాదిస్తే, ఆ సమస్యల రాజకీయ పదునును పోగొట్టిన వాళ్లమవుతాం. బీజింగ్‌ సమావేశంలో ప్రధానంగా జరిగిందదే. హిల్లరీ క్లింటన్‌ దగ్గర నుంచి విశ్వమానవ హక్కుల గురించి వినాల్సిరావటం మన దౌర్భాగ్యం. అంతేకాదు. చైనావంటి దేశాలలో మానవ హక్కుల మాటే వినిపించదని క్లింటన్‌ దగ్గరనుంచి మన దేశం పత్రికలు, టి.వి. వరకు దుమ్మెత్తి పోయటం మరొక ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించిన వాళ్ళు చాలా తక్కువ.
మెక్సికో, నైరోబీ వంటి అంతర్జాతీయ సదస్సులకూ, బీజింగ్‌ సదస్సుకూ తేడా వుంది. ఎప్పుడూ జరుగనంత పెద్ద ఎత్తున ఈ సదస్సుకు సన్నాహాలు జరిగాయి. సన్నాహక వర్గం దాదాపు ఆరుసార్లు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరుపుకుంది. ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి ప్రభుత్వాలూ నిధులు నియామకం చేశారు. సదస్సుకు మనదేశం నుంచి స్త్రీలను పంపటానికై ఒక కో-ఆర్డినేటింగ్‌ కమిటీ ఏర్పడింది. కొద్ది మందిని మినహాయిస్తే, ఈ సదస్సుకు హాజరైన వాళ్ళెవరైనా ఆ కమిటీ అందజేసిన విదేశీ నిధులతోనే. దాదాపు 300 మంది స్త్రీలు పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సదస్సు జరగటానికి ప్రధానంగా విదేశీ సహాయ సంస్థలే కారణం అంటే అతిశయోక్తి లేదు. ఇది ఆలోచించాల్సిన విషయం. గత దశాబ్దంలో జరుగుతున్న, పైన ప్రస్తావించిన మార్పులకు ఈ సదస్సు జరిగిన తీరుకూ, సదస్సులో ప్రధానంగా చర్చకొచ్చిన సమస్యలూ వాటిపట్ల అవగాహనకూ సంబంధం వుంది. జరిగిన చర్చలన్నింటిలోనూ గ్లోబల్‌ ఆర్థిక విధానం, గ్లోబల్‌ ఆర్డర్‌, నెట్‌వర్కింగ్‌ (సంస్థల మధ్య సమన్వయం), సయోధ్య వంటి పదాలే ఎక్కువగా వినిపించాయి. కాని, సామ్రాజ్యవాదం, దోపిడీ, అణిచివేత అనే పదాలు ఎక్కువ వినపడలేదనే చెప్పాలి. ఇంతకుముందు సదస్సులలో కనిపించిన విభిన్న రాజకీయ వాతావరణం కానీ, స్పాంటేెనిటీ కానీ, ఈ సదస్సులో కనిపించలేదు. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, స్త్రీల సంఘాలు అందరూ మాట్లాడేది ఒకటే రకమైన భాష. ఎక్కడో చిన్న సైజు వర్క్‌ షాపుల్లో ఆసక్తికరంగా, ఉత్సాహకరంగా రాజకీయ చర్చలు జరగలేదని కాదు. బైలేటరల్‌ సమస్యల మీద జరిగిన వర్క్‌ షాపులన్నింటి లోనూ చర్చలు చాలా ఆసక్తికరంగా కొనసాగాయి. ఉదాహరణకు లెబనాన్‌ స్త్రీలు నిర్వహించిన చర్చల్లో తప్పనిసరిగా వారికీి ఇజ్రాయిల్‌ స్త్రీలకూ వాగ్యుద్దాలు జరిగాయి. అట్లాగే జపనీస్‌, చైనీస్‌ స్త్రీల మధ్య చైనీస్‌ అమెరికన్ల మధ్య అనేకరకాల చర్చలు జరిగాయి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది దళిత స్త్రీలు నిర్వహించిన చర్చలు. బెంగుళూరు, మద్రాసు, హైద్రాబాద్‌ నుంచి దళిత స్త్రీలు మూడు వర్క్‌షాపులు, ఒక పానెల్‌ చర్చ నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చర్చలు జరగటం మొదటిసారి. అయితే ఇటువంటి అంశాలు ప్రధాన సదస్సులలో (ప్లీనరీస్‌లో) చోటు చేసుకోలేదు. ఇంకొక ఉదాహరణ- తూర్పు యూరప్‌ నుంచి వచ్చిన దళిత స్త్రీలు జరిపిన చర్చలు మనందరికీ చాలా అవసరమైన అంశాల గురించే కాకుండా చాలా ఉత్సాహకరంగా కొనసాగాయి. అక్కడ ఈ మధ్య వరకూ వున్న కమ్యూనిస్ట్‌ ప్రభుత్వాల మూలంగా ఆ స్త్రీలు అనుభవించిన సౌకర్యాలు, ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చలు కొనసాగాయి. ప్రభుత్వాలు కూలిపోవటంతో అప్పటివరకూ ప్రజల కందుబాటులో ఉన్న సౌకర్యాలు చివరికి శిశు కేంద్రాల దగ్గరనుంచీ అన్నీ మాయమవటాన్ని గురించి ఈ స్త్రీలు మాట్లాడారు. ఆ ప్రభుత్వాలు అలాగే కొనసాగితే మంచిదా అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. అప్పుడు ఎదురైన సమస్యలను పరిష్కారం చేసుకుంటూనే, అందులో మంచి అంశాలను పోగొట్టుకోకుండా కొత్త తరహా పాలనను స్త్రీల కనుగుణంగా ఉండే పద్దతిలో రూపొందించుకోవాల్సిన అవసరం గురించి ఈ స్త్రీలు మాట్లాడారు. ఇటువంటి ముఖ్య సమస్యల గురించి ప్రధాన సదస్సులలో ప్రస్తావన ఎందుకు రాలేదని మనం ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీల ఉద్యమం ప్రధానంగా  రూపొందించిన ‘సూక్ష్మ రాజకీయాల’ స్థానే ”గ్లోబల్‌ రాజకీయాలు” చోటు చేసుకున్నాయి. ఒకవేళ రువాండా, బురుండీ వంటి సాయుధ ఘర్షణలూ, బోస్నియా, సెర్బియాలలో జరుగుతున్న మారణ హోమాల గురించి ప్లీనరీస్‌లో మాట్లాడినా, ఆ పరిస్థితులలో స్త్రీలు ఎన్ని రకాల రాక్షస కృత్యాలను ఎదుర్కొంటారనే కాని ఆ పరిస్థితుల వెనక ఉన్న రాజకీయాలు, దేశాల గురించి ఎక్కడా ప్రస్తావన కనపడలేదు. వాటికి సంబంధించిన తీర్మానాలూ లేవు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనదేశం తరపున బీజింగ్‌ ప్రభుత్వ సదస్సులో పెట్టిన ‘కంట్రీ పేపర్‌’లో స్త్రీ ఉద్యమం చరిత్ర గురించి రాస్తూ ప్రభుత్వం 20 ఏళ్ళుగా ఎదుగుతున్న ఉద్యమం గురించి రాసింది. అందులో 70లలో మొదట్లో వరకట్నం వంటి సమస్యలపై ఉద్యమం నిర్మించిన పి.ఓ.డబ్ల్యూ గురించి ప్రస్తావించటం నాకాశ్చర్యం కలిగించింది. ఈ సంస్థ అత్యవసర పరిస్థితిలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంది. కానీ ఇవాళ అదే ప్రభుత్వ చరిత్రలో గర్వించదగ్గ స్థానాన్ని సంపాదించింది. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం.
చివరగా ఒక విషయం చెప్పక తప్పదు. నా కన్నింటకంటే బాధ కల్గించిన విషయం సంపన్న దేశాలు ”చైనా బాషింగ్‌” నే ధ్యేయంగా పెట్టుకోవటం. చైనాలో మానవ హక్కులను మట్టి కరిపించాయనే విషయం ఒక ఎత్తు. నియంతృత్వంగా చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న ‘ఒకే కుటుంబం – ఒకే బిడ్డ’  పాలసీ మరొక ఎత్తు. దీని గురించి వ్యాఖ్యానించింది ఇంకెవరో కాదు. సాక్షాత్తూ హిల్లరీ క్లింటన్‌ మాత్రమే. మనదేశంలో నియంతృత్వ కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టడానికి, అమలు చేయటానికి కారకులెవరో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే అమలు చేయాల్సిన ఈ బలవంతపు కుటుంబ నియంత్రణ పాలసీలకు ఈ అంతర్జాతీయ సంస్థలూ, ప్రపంచ బ్యాంక్‌లూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎమ్‌.ఎఫ్‌) అమెరికన్‌ ప్రభుత్వాలు కాకపోతే ఇంకెవరు బాధ్యులు? గురివింద గింజ నలుపెరగనట్లు ఆ రాజకీయాన్ని పక్కకి పెట్టి ఒక్క చైనా ప్రభుత్వంపై దాడి చేయటం దేనికి? చైనాలో మానవ హక్కులు లేవు నిజమే – అమెరికాలో ఉన్నాయా, ఉంటే ఎవరికున్నాయి? మానవ హక్కుల పేరిట గత ఎన్నో దశాబ్దాలుగా క్యూబా, వియత్నాం, నికరాగూవా, చిలీ వంటి ఎన్నిదేశాల మీద అమెరికా దాడి నిర్వహించలేదు? ఈ విషయం ఎవరికి తెలియంది? ఇప్పటికీ క్యూబా అనుభవిస్తోంది ఈ దాడి ప్రభావం. ఈమధ్య టీ.వీ.లో ప్రసారం చేసిన క్లింటన్‌ ప్రసంగంలో, క్యూబాకు తామెలా సహాయపడదల్చుకున్నదీ, అందులో భాగంగా అక్కడ మానవ హక్కుల నుద్దరించటానికీి స్వచ్ఛంద సంస్థలను తామెలా ప్రోత్సహించ దల్చుకున్నదీ వింటే పై విషయాలన్నింటికి చక్కటి సాక్ష్యం కూడా దొరుకుతుంది. ఇంత స్పష్టంగా కనిపిస్తున్న విషయాలను అప్రస్తుతం చేసి ‘చైనా బాషింగ్‌’ నిర్వహించిన సంపన్న దేశాల పత్రికలు, ప్రచార సాధనాలను పక్కకి పెట్టినా, వాటిని గుడ్డిగా అనుసరించిన మన మీడియా విధానం మరింత ఆశ్చర్యంగా అనిపించింది. మన పత్రికలలో వచ్చిన వ్యాసాలన్నింటిలో కూడా చైనా ఎటువంటి నియంతృత్వం, చివరికి అక్కడికి వెళ్ళిన ప్రతినిధులందరి మీదా పోలీస్‌ నిఘా నిర్వహించిందన్న అభియోగాలు అన్నీ కల్పితాలే అని చెప్పటం నా బాధ్యత. నిజానికి సమావేశాలు ప్రారంభం కాకముందే ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ వంటి అమెరికన్‌ సంస్థలు చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, లేదా ప్రతినిధులు కష్టాలెదుర్కొంటే ఎవరిని సంప్రదించాలి అని తెలియజేసే కరపత్రాలు పంచింది. దీనికి అర్థం అట్లాంటివి అక్కడ తప్పకుండా జరుగుతాయని నమ్మటమే కదా! ప్రపంచంలో ఏ దేశం చేయలేనటువంటి పద్ధతిలో చైనా ఈ సదస్సును నిర్వహించింది. 36,000 మంది ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఏలోటూ లేకుండా నిర్వహించటం మాటలు కాదు. అయినా సౌకర్యాలు లేవనే అభియోగం. కావల్సినంత మందికి వీసా పంపలేదని నింద. పాల్గొన్న 36,000 వేల మందిలో ఆరువేల అమెరికన్లు, ఆరువేల మంది యూరోపియన్లు, ఆరువేల మంది జపాన్‌ స్త్రీలు. మిగిలిన 180 దేశాల నుంచి 18,000 మంది ప్రతినిధులు వచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒప్పుకున్న సంఖ్య కంటే ఎక్కువ మందికి చైనీస్‌ ప్రభుత్వం వీసాలు ఏర్పాటు చేసింది. గతంలో అంతర్జాతీయ సదస్సు ఒక దానిలో పాల్గొనటానికి యాసర్‌ అరాఫత్‌ (పాలస్తీనా) వీసా కోరితే అమెరికా తిరస్కరించినందుకు, సదస్సునే జెనీవాకు మార్చాల్సి వచ్చిందని చదవటం గుర్తుకు వస్తోంది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 50 సంవత్సరాల ఉత్సవాలకు హాజరయిన 150 దేశాల ప్రతినిధుల్లో , కాస్త్రో (క్యూబా) కు, యాసర్‌ అరాఫత్‌కు కొన్ని ప్రభుత్వ విందులకు అమెరికన్‌ ప్రభుత్వం ఆహ్వానాలు ఇవ్వలేదు. వాళ్ళ ఆహ్వాన పత్రాలను కుక్కలు నమిలేశాయని జోకులు వేశారు.
చివరగా నేను చెప్పదల్చుకున్న విషయం ఈ అంతర్జాతీయ పరిస్థితులలో మనముందు కనిపించే కొన్ని ప్రశ్నల గురించి తీక్షణంగా ఆలోచించాల్సిన బాధ్యత మనమీదే వుంది. స్త్రీల ఉద్యమం రూపొందించిన ‘రాజకీయాల్ని స్థానికం చేయటం’ (పాలిటిక్స్‌ ఆఫ్‌ లొకేషన్‌) అనే అవగాహనను ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏవిధంగా అర్థం చేసుకుంటాం. స్త్రీల ఉద్యమం ముందు ఈ రోజు ఎటువంటి ప్రశ్నలున్నాయి. వాటికి, అంతర్జాతీయ ఎజెండాలకు ఎటువంటి సంబంధం వుంది. స్త్రీల ఉద్యమం స్వచ్ఛంద సంస్థలను ఏ విధంగా అర్థం చేసుకుంటుంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, స్త్రీల ఉద్యమాల మధ్య సంబంధాలు, వాటిపట్ల మన అవగాహన ఏమిటి? వీటి గురించి అన్ని స్థాయిలల్లో చర్చలు జరగాల్సిన అవసరం వుంది. (జూలై -సెప్టెంబరు 1995)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.