దొంగపిల్లి

పి. సత్యవతి
కరెంట్‌ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్‌ ఆటో ఎక్కి, బస్‌ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి  వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది.. పెళ్ళి వారి బస్సుతో వెళ్ళిన అతను ఇవ్వాళ రాడు అనుకుంది. అతను రావటమే కాదు తనకీ టీ కలిపి వుంచాడు. క్యాండిల్సూ అగ్గిపెట్టె సిద్ధంగా వుంచాడు. వరండాలో మడతమంచం కూడా వాల్చాడు. దానిమీద నుంచీ వచ్చే ”కొలవెరి” గందరగోళంతో పాటు ఆ గందరగోళాన్ని సృష్టిస్తున్న వస్తువు చీకట్లో దొంగపిల్లి కళ్ళలా పచ్చగా మెరుస్తోంది.
”పగిలిపోయిందిగా మళ్ళీ బాగుచేయించావా ఏంది?” అంది ఉలిక్కిపడి
అతను దాన్ని అందుకుని ఇగ్నోర్‌ నొక్కి,
”క్యాండిల్‌ వెలిగించుకుని, టీ వేడి చేసుకో! పో!…. వస్తూ వస్తూ కర్రీ పాయింట్‌లో ఒక కూరా సాంబారూ కూడా తెచ్చాలే… కాసేపు పడుకో నువ్వు” అన్నాడు..
”ఇవ్వాళ రానంటివిగా?” అంది సీతారత్నం పమిట కొంగుతో చెమట తుడుచుకుంటూ మళ్ళీ
”అన్నాన్లే… నాబదులు డేవిడ్‌ ని పంపించాను. పెళ్ళి వాళ్ళకి. నేను ఒక వారం సెలవు పెట్టేసాను.. ఆ సంగతి కుమారికి చెప్పక. దాని ఫోన్లో సిమ్‌ కార్డు ఇందులో వేశాను. అడిగితే ఊడ్చి పారేశానని చెప్పు”
కూతురు కుమారి ఇంకా ఇంటికి చేరలేదు. అసలు ఒక వారం రోజులనించీ దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏమడిగినా చెప్పకపోగా విసుగూ ఎక్కువైంది. దిగులుగా వుంటుంది. తిండికూడా సరిగ్గా తినడంలేదు మళ్ళీ పోన్‌ రాగానే అందుకుని బయటికిపోయి దానికి అతుక్కుపోతుంది. ఎప్పుడు అడిగినా సౌమ్య అనే అమ్మాయి ఫోన్‌ చేసిందని చెబుతుంది. ఆ మధ్యన ఒక సెంట్‌ సీసా కూడా ఆ పిల్లే ఇచ్చిందని చెప్పింది. ఎప్పుడడిగినా ఎవరింట్లోనో కంప్యూటర్‌ కోసం పోతున్నానంటుంది. మరీ వారం నించీ దాని వాలకం అసలు బాగాలేదు. కాసేపు ఇంట్లో కుదురుగా కూచోమన్నందుకు నూరు చదివింది.
”ఏం చెయ్యాలీ చీకటికొంపలో కూచునీ? ఒక చార్జింగ్‌ లైటన్నా లేదు? నాకు కంప్యూటర్‌తో పనుంది శారదా వాళ్లకి ఇన్వర్టరుంది అక్కడికి పోయి చదువుకుని వస్తాను.. అదీ తప్పే! అసలు నన్నెందుకు ఇందులో చేర్పించారు? ఒక కుట్టు మిషను కొనిస్తే పోయేదిగా? అమ్మ పెట్టదూ అడుక్కు తిననివ్వదూ!” ఆ కుట్టుతోనేగా నిన్నకాక మొన్న సెల్‌ ఫోను కొనిచ్చింది? ఇరవై ఏళ్ళొచ్చిన పిల్లకి ఇంగిత జ్ఞానం వుంటుందనుకోడం తప్పా, తనది? ఎండనక వాననక ఎప్పుడూ సారూ, మీరూ తప్ప మరో మాట అనే పనిలేకుండా అసలు డ్యూటీలూ, అదనపు డ్యూటీలూ చేసీ చేసీ అలసిపోయిన ఆ పెద్దమనిషి నాలుగు కేకలెయ్య తగడా? సౌమ్య సౌమ్య అంటూ ఒకే మైన ఫోనుకు అతుక్కుపోతుంటే ఆ సౌమ్య ఎవరో తెలుసుకోవాలనుకోడం తప్పా? అది తన విధి కాదా? అందుకు ఎదురు దాడికి దిగుతుందా? ఫోన్‌ పగలగొడుతుందా? ఎందుకంత విసుగు దానికి? ఎందుకంత దిగులు మొహంతో తిరుగుతోంది? యేమైంది ఈ పిల్లకి? అనుకుంటూ పొద్దున సూదిలో దారం ఎక్కిస్తూ కసిక్కిన వేల్లో దించుకుంది. ఆ నెత్తురు బొట్లు చూసిన బేబమ్మ కంగారెత్తిపోయింది అవి కుట్టే చీరెలమీద పడ్డాయేమోనని! ఇంకా నయం తను వరండా చివరికి బాగా వెలుగొచ్చే చోటికి పోయి ఆ సన్న సూదిలో దారం ఎక్కిస్తుంది కనుక సరిపోయింది.
ఆంధ్రదేశంలో తెలుగు పత్రికలన్నీ తపాలా బిళ్లలంత ఫోటోలు వేసే తలకాయ మీద 590 అంకె వేస్తే, ఆ పేపర్లన్నీ కొనుక్కొచ్చి దాచి ”లెక్కల్లో దీనికి నూటికి నూరు… తప్పకుండా ఇంజనీరే మనమ్మాయి..” అని సంతోషంతో ఎగరలేని ఎత్తుకు ఎగిరిన ఆ మనిషి ఆవేదన అర్థం కాదా దీనికి?
మొన్న మధ్యాహ్నం తన మీద పర్యవేక్షణకన్నట్టు కుర్చీ వేసుకుని కూచుని చెల్లెలితో లోకాభిరామాయణం మొదలుపెట్టింది బేబమ్మ. పిల్లల పెంపకం గురించి, వాళ్ళతో గడపవలసిన ”క్వాలిటీ టైం” గురించి.
”క్వాలిటీ టైం” అంటే ఏమిటి మేడమ్‌” అంది తను. దానితో ఎక్కడలేని హుషారొచ్చింది ఆవిడకి. పిల్లలతో మంచీ చెడూ మాట్లాడుకుంటూ ఆనందంగా రహస్యాల్లేకుండా మనసులు కలబోసుకునే సమయం అని విడమర్చింది. అసలు అంతా కలిసి మాట్లాడుకునే సమయం అంటూ వుందా? పొద్దున లేచిన దగ్గరనుంచీ, సమయాన్ని అమ్ముకు బ్రతికే వాళ్లకి క్వాలిటీ సమయం ఎక్కడ నించొస్తుంది?
”మీలా చదువుకున్న వాళ్ళతో పిల్లలు సరదాగా మాట్లాడతారు మేడమ్‌… చదువురాని తల్లులతో మాట్లాడ్డానికేం వుండదు పిల్లలకి.. ఏమీ చెప్పరు. డబ్బులకీ అన్నానికీ తప్ప మాట్లాడ్డానికేం వుండదు వాళ్ళకి.” అంది సీతారత్నం.
”ఎందుకుండదు? సినిమాల గురించి మాట్లాడొచ్చు రాజ కీయాలగురించి మాట్లాడొచ్చు మంచీ చెడ్డా చెప్పుకోవచ్చు మాట్లాడ దలుచుకుంటే ఏమైనా వుంటుంది” అందావిడ.
”నేను సినిమాకెళ్ళి సంవత్సరం అయింది మేడమ్‌! మా అమ్మాయి నాతో సినిమాకి రాదు మా ఆయనకసలు తీరదు అసలు ఆ ధ్యాసే లేదు. టీవీలో చూద్దామన్నా నిద్దరొస్తోంది. పైగా సినిమాలూ బాగోడం లేదు… దేనికీ టైం లేదు” అని సూదిలో దారం గుచ్చుకోడానికి వెలుగులోకి పోయింది అక్కడితో ఆగిపోయింది సంభాషణ. తన కూతురసలు తనతో మాట్లాడ్డమే మానేసింది.. మంచీ చెడ్డా చదువురాని తల్లికేం తెలుసని దాని ఉద్దేశం కావచ్చు. ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం అడుగుతుంది. తండ్రి తెచ్చే జీతం తన చేతిలోనే పొస్తాడని ఆ మాత్రం గౌరవం ఆ పెత్తనం అతని చేతిలోవుంటే తనతో మాట్లాడే పనే ఉండేది కాదేమో! ఎంతమారిపోయింది కుమారి! మారితే మారింది. మాట్లాడక పోతే పోయింది. అదిట్లా దిగులుగా వుంటే తనకసలు బాగోడం లేదు. ఎవరికోసం ఈ కష్టం అనిపిస్తుంది.
పెద్దదానికి లాగానే దీనికి పద్దెనిమిదేళ్ళకి ఒక గంతకుతగ్గ బొంతను తెస్తే బాగుండేదేమో!! దానికేం తక్కువైంది? పెళ్ళయ్యాక అల్లుడు దానికి ఫిజియో థెరపీ కోర్సు చెప్పించాడు. ఇద్దరూ చెరికాస్త సంపాదించుకుని బాగానే వున్నారు. అయిదొందల తొంబై మార్కులు రానందువల్ల నిలబడి నీళ్ళు తాగుతోందది. అన్ని మార్కులొచ్చి ఇది పరిగెత్తి పాలు తాగాలనుకుంటోంది. పోనీ అదయినా నయమే… అటూ నీళ్ళూ లేవు ఇటు పాలూ లేవు గడ్డితినకుండా వుంటే నయమే అన్నందుకు. కన్నవాళ్ళన్న జ్ఞానం లేకుండా ఝూడించి పారేసింది. అసలీ గోలంతా వాళ్ల మూలంగానే.. మార్కులొచ్చాయోలేదో స్కూలువాళ్లు డప్పు కొట్టుకున్నారు. అట్లా పేపర్లో పేరు పడగానే కార్పోరేట్‌ కాలేజీ వాళ్ళొచ్చారు. అమ్మాయికి ఫీజు లేకుండా ఇంటర్లో సీటిస్తామన్నారు. అక్కడినించీ ఎన్ని పరీక్ష ఫీజులు కట్టాల్సొచ్చింది? పుస్తకాలు నోట్సులు బస్‌ ఛార్జీలు బట్టలు|| సీటైతే ఊర్కే ఇచ్చారు. మిగతా వాటి మాటేమిటి? బియ్యం రూపాయి అయితే పదమూడు రూపాయలు అరలీటరు పాలు, ఎనభై రూపాయలు కందిపప్పు చందంగా||
”నువ్వు చేసేపనికి, నీకొచ్చే జీతానికి.. పెద్దకూతురు పెళ్ళికి చేసిన అప్పుకి ఈ పిల్లని ఎట్లా ఇంజనీర్ని చేద్దామనుకున్నా” వని అడిగితే ఇంతెత్తున లేచాడు.
నువ్వు నోర్ముయ్యమన్నాడు. ఎమ్సెట్లో ఆ పిల్లకొచ్చిన ఆ ర్యాంక్‌ కే అది అమెరికా విమానం ఎక్కేసినట్లు సంబరపడిపోయాడు.. ఉన్న ఊరికి మరీ అంత దూరం కానిదీ, కాస్త మంచిదీ అనుకున్న కాలేజీలోనే సీటూ ఫీజు రాయితీ వచ్చాయి. కాలేజీకి సరాసరి బస్సూ వుంది. బస్సుకి సంవత్సరం మొత్తానికి ఫీజు కట్టాడు. ఎక్కడ తెచ్చావయ్యా డబ్బంటే చీటీ ముందుగానే పాడేశానన్నాడు. అయ్యో ఎంత నష్టమంటే నువ్వు నోరు ముయ్యమన్నాడు. ఎప్పుడూ అదే అంటాడు పెద్ద పిల్లకు అంత కట్నంతో ఆ సంబంధం ఎందుకయ్యా అంటే అప్పుడూ నోరుముయ్య మన్నాడు.
ఎప్పుడైనా స్టవ్‌మీద కాసిన పాలు కాగబెట్టడమో కుక్కర్‌ పడెయ్యడమో చేసే పిల్ల అయిదొందల తొంబై వచ్చిన్నాటినించే ఆ పన్లన్నీ మానేసి అప్పటికప్పుడే ఇంజనీరైపోయింది. దానికి టైంలేదు. పొద్దున ఏడున్నరకి వెడితే మళ్ళీ రాత్రి ఏడింటికి రావడం. మొదటి సంవత్సరం బాక్సు పట్టుకెళ్ళేది. ఇప్పుడు పట్టుకెళ్ళదు. అందరూ క్యాంటీన్‌లో తింటారట బాక్సులెవరూ తెచ్చుకోరంది. క్యాంటీన్‌ కి డబ్బులు! సెల్‌ కి మూడు మూడు రోజులకీ కార్డయిపోతుంది. అన్నిటికీ ఒకటే అంటుంది. ”ఈ చదువుకి అన్నీ అవసరమే! మీరేమీ కొనలేరు. అన్నింటికీ స్నేహితులని దేవిరించాలి నేను ఫోన్‌లో సందేహాలు అడుగుతాను. వాళ్ల కంప్యూటర్లు వాడుకుంటాను. వచ్చే సంవత్సరం నేనూ ల్యాప్‌టాప్‌ కొనుక్కోవల్సిందే ముందే చెబుతున్నా.. మీ వల్ల కాకపోతే మాన్పించెయ్యండి.”
‘ఒక్క రెండేళ్ళు కష్టపడదాం, సీతా. ఎంత అదృష్టం చేసుకుంటే మనపిల్లాకిట్టా సీటొచ్చింది చెప్పు. లక్షలు పోసి చదివించుకుంటున్నారు ఆడపిల్లల్ని… అది బాగా చదువుకుని సీటు తెచ్చుకుంది..” అని ఎప్పటికప్పుడు తన నోరు మూస్తాడు… అంతగా నమ్మిన మనిషిని, అంతగా కష్టపడే మనిషిని. ఎన్ని అదనపు డ్యూటీలు చెయ్యొచ్చో అన్నీ చేసి చెమట తుడుచుకోడానికి కూడా ఆగక మొహన్నే ఆరబెట్టుకునే మనిషిని ఎన్ని మాటలంది? ఎక్కడినించీ వచ్చాయి ఈ మాటలన్నీ? ఎవరు నేర్పుతున్నారీమాటలు?
తెల్లవారి ఇది కాలేజీకి పోతుందా? ఇక చదవను పొమ్మంటుందా? ఇప్పటికీ పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లేనా? ఏమో సూర్య భగవానుడే చెప్పాలి. అనుకుంది నిన్న.
సూర్య భగవానుడొచ్చాడు. కూతురు నిద్రలేచి మొహం కడిగింది. ఏమీ ఎరగనట్టే ఏదో తిన్నాననిపించి కాలేజీకి పోయింది. అతను పెళ్లివారి బస్సుతో డ్యూటీకి వెళ్ళాడు.
సీతారత్నం త్వరగా వంట చేసి నాలుగు మెతుకులు తిని బేబమ్మ ఇంటికి వెళ్ళడానికి అందితే బస్సూ, అందకపోతే షేర్‌ ఆటో కోసం నిలబడింది. అదివరకు వస్త్రనందనం అనే పెద్ద బట్టలషాపు వాళ్ళ టైలరింగ్‌ సెక్షన్‌లో ఇట్లాగే ఖరీదైన చీరెలకి ఫాల్సూ నెట్లూ కుట్టేది. అప్పుడు బేబమ్మ తనని ”డిస్కవర్‌” చేసింది.. తనకి వాళ్ళిచ్చే డబ్బుకీ, వాళ్ళు వసూలు చేసే డబ్బుకీ చాలా తేడా వుందని కనిపెట్టి ఇద్దరికీ లాభించే రేటొకటి మాట్లాడుకుని తనని అక్కడనించీ ఎత్తుకొచ్చి ఆమె కూతురు పెళ్ళి బట్టలు జాగ్రత్తగా ఇంట్లోనే కుట్టించుకోడానికి తన ఇంట్లో ప్రతిష్టించింది. అందువల్ల తనకీ అదనంగా కాస్తో కూస్తో వస్తోంది. తనలాంటి వాళ్ళకి శాశ్వతమైన ఉద్యోగం అంటూ వుండదు. ఎక్కడ నాలుగు డబ్బులొస్తే అక్కడ! నాలుగు డబ్బులు నాలుగు అవసరాల్ని వెంట బెట్టుకొస్తాయి. నాలుగు అవసరాలూ నాలుగురెట్లు ధర పెంచుకుని వస్తాయి. పోనీలే. సరదాగా నేర్చుకున్న పని అక్కరకొస్తోంది. తనకి చదువొస్తే ఎంత బాగుండేదో అని చాలా సార్లు అనుకుంది.. కుమారి ఇంకా ఇంటికి రాలేదు. ఆవురుమంటూ వస్తుంది. కరెంట్‌ రాగానే కుక్కర్‌ పడెయ్యాలి. పొద్దున్న టిఫినైనా సరిగ్గా తినలేదు.
ముత్యాలు కూర్చిన పట్టు పీతాంబరాలు, జర్దోసీలూ గాగ్రాలు పట్టు లంగాలు వాటికి జానెడూ జానెడు జరీ అంచులు సువాసన ఫినాయిల్‌తో తుడిచిన పాలరాతి గచ్చు మీద పరిచిన తివాచీ మీద, పరిచిన తెల్లని ఇస్త్రీ దుప్పటిమీద పరిచిన చీని చీనాంబరాలు.
కుట్టేటప్పుడు మొహానికి చెమట పట్టి ఒక చుక్క చీరెమీద పడినా మరక పడుతుంది కదా. అలా సీలింగ్‌ ఫాన్‌ కిందకి జరుగు సీతారత్నం. ఇది పెళ్ళి కూతురు ఎంగేజిమెంట్‌ చీరె ఉల్లిపాయ రంగు జాగ్రత్త!! అది తల్లిచీర. లేతరంగు జాగ్రత్త! ఇది చెల్లిచీరె పాతికవేలు జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త!
చీకట్లో కళ్ళుమూసుకు కూచున్న సీతారత్నం కళ్ళు ఇంకా జిగేల్‌ మంటూనే వున్నాయి కళ్ళముందు మెరుపులు మెరుస్తున్నాయి. కన్ను మూసినా తెరిచినా మెరిసేరాళ్లు ముత్యాలు వదలడం లేదు తనని.
అమ్యయ్య!! వచ్చింది విద్యుత్తు. ఉలిక్కిపడి లేచి వంటగదిలోకి పరిగెత్తింది సీతారత్నం. వచ్చింది కుమారి. పుస్తకాలు టేబిల్‌ మీద పడేసి.
”ఫోనేం చేశావ్‌” అంది కాస్త శాంతంగానే. నిన్నటి దూకుడు లేదు. వాకిట్లో తండ్రిని చూసినందుకేమో!
”పగిలిన ముక్కలన్నీ ఏరి బయట చెత్తకుండీలో యేసొచ్చాను. ”సీతారత్నం కూడా నిబ్బరంగానే చెప్పింది.
‘సిమ్ము పారేసుకుంటారా? అదుంటే ఏదో ఒక ఫోన్‌ కొనుక్కుని యేసుకోవచ్చు కదా?”
”అయ్యన్నీ నాకేం తెలుస్తయ్యమ్మా! మీ నాన్న కాల్లో గుచ్చుకుంటుంది ఏరి పారెయ్యమన్నాడు పారేసాను”
తల్లిని ఓ మూర్ఖురాలిని చూసినట్టు చూసి స్నానానికి పోయింది కూతురు. సెల్లుండుంటే ఈ పాటికి అది ఎన్ని సార్లు కొలవెర్రులు పోయేదో!! అవునూ స్నేహితురాలితో మాట్లాడుకోడానికి దూరంగా పోడం ఎందుకన్నందుకేగా అంత కోపం వచ్చింది. ఇప్పుడేం చేస్తుందో మరి చూడాలి.
ఏమీ జరగనట్టే ముగ్గురూ భోజనం కానిచ్చారు. కూతురు పెద్ద చదువులో కొచ్చాక ఉన్న మూడు గదుల్లో ఒక దాన్ని ఆమెకి ఇచ్చేశారు. తనూ అతనూ చెరో మడత మంచం వేసుకుని ముందుగదిలో పడుకుంటారు. పిల్ల చదువు చెడుతుందని అతి తక్కువ వాల్యూంలో టీవీ పెట్టుకుని దగ్గరగా కూచుని చూస్తారు. అతనికి నైట్‌ డ్యూటీలుంటే తనొక్కతే టీవీ చూసుకుని పడుకుంటుంది సీతారత్నం.. కూతురు మాత్రం చదివినంత సేపూ సెల్లులో మాట్లాడుతూనే వుంటుంది. ఇవాళ టీవీ చూడాలనిపించలేదు. చాలాసేపు నిద్రపట్టక అవస్థపడి ఎప్పుడో కళ్ళుమూసింది.
తెల్లవారింది. ముభావంగా కాలేజీకి పోయింది కూతురు.
తండ్రి ఆ పిల్లవంక నిశితంగా చూశాడు. ఇది అయిదువందల తొంభైకి ముందు పిల్ల కాదు. ఇంజనీరింగ్‌ సెకండియర్‌ స్టూడెంటు. నడక మారింది. మాట మారింది.. ఇంటర్లో చేరగానే నాలుగు డ్రెస్సులు కొంటే ”ఎందుకు నాన్నా ఇంత ఖర్చిప్పుడు” అన్న పిల్లకాదు. పుట్టిన రోజుకి పన్నెండొందలు పెట్టి అడిగిన డ్రెస్‌ కొనలేదని అలిగినపిల్ల ఇది. తన చేతివాచీ, తను వేసే బట్టలు ఏవీ నచ్చడం లేదిప్పుడు ఈ పిల్లకి. తన తల్లి కుట్టుపని చేస్తోందంటే నామూషీ, తన తండ్రి బస్‌ డ్రైవర్‌ అంటే నామూషీ ఇప్పుడు… ఈ పిల్ల ఎందుకింత మారింది? అదివరకటి కుమారి ఏమైంది?
అదే ఆలోచిస్తోంది సీతారత్నం కూడా… పిల్లలు మారడానికి కారణం బేబమ్మ చెప్పినట్టు వాళ్లతో క్వాలిటీ టైం గడపకపోవడమేనా? ఇవ్వాళా రేపూ పిల్లలతో కూచుని కాలక్షేపం చెయ్యడానికి ఎవరి సమయం ఎవరి స్వంతం? ఎప్పటికప్పుడు డబ్బులాగానే టైం కూడా అప్పు తీసుకోవడం అడ్మాన్సు తీసుకోడంగానే వుందికదా తనలాంటి వాళ్ళకి!
”నీకైనా బుద్ధుండాలి సీతా! మీ తాహతుకి ఆ పిల్లకా చదువెందుకు చెప్పు! మళ్ళీ దానికి పెళ్ళి చెయ్యాలా? దీనికన్న పెద్దింజినీర్ని తేవాలా? ఎక్కడినించీ తెస్తావు?” అని చేంతాడంత పురాణం చదివి, మూతికాలిపోయేంత బుల్లి స్టీలుగ్లాసుతో గుక్కెడు బురద కాఫీ ఇచ్చి సాగనంపింది చిన్నాడబడుచు, పనికట్టుకుని అంతదూరం పదివేలు అప్పుకోసం పోతే! అది కాలేజీలో చేరినప్పుడు…
సీతారత్నం భర్త, కుమారి తండ్రి అయిన అతను వారం రోజుల సెెలవులో కాలేజీ చదువులగురించీ అక్కడి స్నేహితుల గురించి ఆడపిల్లలకి బాయ్‌ ఫ్రెండ్సూ. మగపిల్లలకి గర్ల్‌ ఫ్రెండ్సూ వుండడం ఎంత ప్రతిష్టో తెలుసుకుని దిమ్మెరపోయి తన జ్ఞాన సముపార్జన ఖరీదు వారం రోజుల జీతం గుర్తు తెచ్చుకుని హతాశుడైపోయాడు. పేపర్లో చదువుతాడు తను అప్పుడప్పుడూ!! రిక్షా కార్మికుడి కొడుకు ఇంజనీరయ్యాడు ఇంకోపేదవాని కూతురు కలెక్టరయింది ఎట్లా? వాళ్ల స్వేదంలో అమృతమూ తన స్వేదంలో విషమూ వున్నాయా? సీతారత్నం ఎడమచేతి చూపుడు వేలు చూశాడు నిన్న.. అదంతా సూది గుచ్చుళ్ళ జల్లెడ! ఈ పిల్ల తమ గుండెని కూడా అట్లా జల్లెడ చేస్తుందా? ఎట్లా? ఎట్లా? అని ఆక్రోశించాడు.. అయిదొందల తొంబై నిచ్చెన పై మెట్టుమీదనించీ ఇప్పుడీ ఇంజినీరింగ్‌ సెకండియర్లో దాని మార్కులు యాభై శాతానికి పడిపోయాయని తెలిసే ఆక్రోశించాడు.
”అదంతా బట్టీ చదువు. ఈ చదువు వేరు మనసు పెట్టి విషయం అర్థం చేసుకుంటూ చదవాలి” అన్నాడు తన చెల్లి కొడుకు వాసుదేవుడు. ఏమైంది తన కూతురికి? ఎవరు మార్చేస్తున్నారు దాన్ని? అని కన్నీరు కార్చాడు సీతారత్నం లాగే అతను కూడా!! రోజుకి కొన్ని వందల మందిని క్షేమంగా గమ్యం చేర్చే అతనికి తన కూతుర్ని ఒక్క దాన్నీ ఎట్లా గమ్యం చేర్చాలో అర్థం కావడం లేదు. అతనికి ముఖ్యంగా తన కూతురు సౌమ్య అని చెప్పే వ్యక్తి ఎవరో తెలుసుకున్నాక ఆ రోజు ఫోన్‌ పగలకొట్టిన రోజు ఎన్ని మాటలంది తనని? భరించలేక ఒక చెంపదెబ్బ వేసినందుకు ఎంత భీభత్సం సృష్టించింది? ఎన్ని అబద్ధాలాడింది? సౌమ్య అనే కల్పిత పాత్రని ఎంత చక్కగా బొమ్మ కట్టించింది? ఎవరిచ్చారీ తెలివితేటలు?
”నాకు రేపట్నించీ క్యాంటీన్‌ కి డబ్బులొద్దులే నాన్నా. ఎంత చవకదైనా సరే ఒక ఫోన్‌ కొనియ్‌. అంత దూరం కదా కాలేజీ… అందరికీ ఫోన్లుండాలి. నేను ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పడానికైనా…” అని పొద్దున్నే అడిగింది పిల్లిలా వెనకాలే వచ్చి.
”అట్టాగే నమ్మా.. తడవకీ పగలేసేదానికి ఖరీదైన ఫోన్లెందుకు? చవకదే కొందాం. రెండ్రోజులాగు.” అన్నాడతను కూడా అంతే సౌమ్యంగా.. సాయంత్రం కాలేజీనించీ వస్తూనే గదిలోకి పోయి పడుకుంది. రోజులా స్నానం చేసి చదువుకోలేదు. తల్లిని అన్నం పెట్టమని అడగలేదు. మంచంమీద ముడుచుకుని పడుకుంది. ఎంత పిలిచినా అన్నానికి రాలేదు. ఏడుస్తోందని అర్థమైంది.
అప్పుడే అతని జేబులో కొలవెరి. కూతురికి వినపడకుండా గబ గబ వీధిలోకి పరిగెత్తి మొదట్లో నిలబడి ఫోన్‌ తీశాడు… సౌమ్యా కాలింగ్‌… అవతలినించీ. ”ఫోన్‌ పోయిందని అబద్ధాలాడతావా” అని తిట్లు. గబగబ అనాల్సిన పది మాటలూ అప్పజెప్పేశాడు. రేపు తనతో కలిసి రమ్మన్న చోటికి రాకపోతే ఏం జరుగుతుందో చూసుకోమన్నాడు. ఒక బస్‌ డ్రయివర్‌ కూతురికి అంత పొగరా అన్నాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఇంట్లోకొచ్చి పడ్డాడు, ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ బస్‌ డ్రయివర్‌ తండ్రి. కూతురు తినలేదని తనూ తినకపోతే ఆమెకి కడుపులో మంటొస్తుంది. తినక తప్పదు. అతను సుగర్‌కి మందేసుకోవాలి. తినాల్సిందే. ఇద్దరూ అలా బలవంతంగా తిని పడుకున్నా కూతురు లేచి రాలేదు. అప్పుడు సీతారత్నాన్ని అవతలికి తీసుకుపోయి అంతా చెప్పేశాడు. ఆవిడ ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు అరమూసింది. అరమూసిన ఆ కళ్ళముందుకు కొన్ని నీడలొచ్చాయి.
”ఎవరు బాబూ మీరు?” అంది సీతారత్నం.
”వీడు కొబ్బరిబొండాలకత్తితో మీ అమ్మాయి తల నరికిన వాడు. వీడు కత్తితో మీ అమ్మాయి గొంతు కోసిన వాడు. వీడు పెట్రోలు పోసి మీ అమ్మాయిని తగలబెట్టిన వాడు, వీడు మీ అమ్మాయిని కాలవలో తోసిన వాడు…..వీడు….మీ అమ్మాయి మీద అత్యాచారం చేసి దిండుతో అదిమి చంపిన వాడు…..వీడు….”
అదిరిపడి మంచం మీద లేచి కూచుంది సీతారత్నం చమటతో ఆమె నిలువెల్లా తడిసి పోయింది. గజగజ వణికి పోయింది. ‘ఏది నా కూతురు’ అని చూసింది…. అప్పుడే వంట గదిలోనించి వస్తున్నాడు అతను…. చేతిలో కర్ర!
”దొంగ పిల్లి మజ్జిగ మీద మూత తోసేసి మూతి పెట్ట బోయింది కర్రతో ఒక్కటిచ్చాను. ఇక మళ్ళీ రాదు. అయినా నువ్వు మజ్జిగ అలమార్లో పెట్టక అట్లా గట్టుమీద వదిలావేమిటి?” అన్నాడు. అని చెమటతో తడిసిపోయిన సీతారత్నాన్నీ, ఆమె ఏడుపునీ, వొణుకునీ, గమనించకుండా.
”పోన్లే! ఎన్ని పనులని చేస్తావు నువ్వు? నిద్ర లేచినదగ్గర్నుంచీ పనే పని! పరుగే పరుగు! రేపు ఈ కిటికీకి ఇనుప జాలీ తెచ్చి బిగిస్తాను ఇంకరాదులే. వస్తే నడ్డి విరగ్గొడతాను…. అదేమిటట్లా వొణుకుతున్నావు? పోయి పడుకో! పో!” అన్నాడు.
అదేమి వినిపించుకోకుండా కూతురు గదిలోకి పరిగెత్తింది సీతారత్నం. అమ్మయ్య! వుంది తన కూతురు. ఇవ్వాళ్టికి వుంది. మరి రేపో? రేపూ ఇంకా ముందు ముందూ వుంటుందా? రెండుచేతుల్లో మొహం దాచుకుని గోడవారగా కూలబడి ఏడుస్తోంది సీతారత్నం. కాసేపటికి స్థిమిత పడి కూతురు పక్కన ముడుచుకుని పడుకుంది. ఆమెకి కాస్త కునుకు పడుతూండగా తల్లి డొక్కలో దూరడానికి ప్రయత్నిస్తోంది కుమారి. ఇప్పుడు వదిలిపోతే దొరకదన్నట్టు కూతుర్ని పెనవేసుకుంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.