టీ.వీ.యస్. శాస్త్రి
మదర్ ఆఫ్ సోషల్ వర్కర్‌గా పిలువబడే శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన తెలుగు వీర వనిత! ఆవిడ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ఒక దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమర యోధు రాలిగా, సంఘసంస్కర్తగా, సంఘసేవకురాలిగా, రచయిత్రిగా, వక్తగా, బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా గుర్తింపు పొందిన వ్యక్తి శ్రీమతి దుర్గాబాయమ్మ గారు. నేటి మహిళలకు గొప్ప స్ఫూర్తినిచ్చే ఆదర్శ మహిళ!
పదేళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్రోద్యమంపై అమిత ఆసక్తిని కనబరిచారు. పన్నెండేళ్ల వయసులో విరాళాలు సేకరించి మహాత్మాగాంధీకి అందజేయడమే కాకుండా, ఆయన చెప్పిన వెంటనే చేతికున్న బంగారు గాజులను కూడా తీసి ఇచ్చేశారు! వయోజనులకు చదువులు లేకపోవడం వల్లే మూఢాచారాలు పాటిస్తున్నారని గుర్తించి అప్పట్లోనే పెద్దల బడిని ప్రారంభించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఆంధ్ర మహిళా పత్రిక’ స్థాపించి స్వయంగా సంపాదకత్వం వహించారు. ఈమెకూ, ఆమె భర్త సి.డి. దేశ్‌ముఖ్‌కూ భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ దక్కింది. భారత జాతీయ కాంగ్రెస్ 1923లో కాకినాడలో సమావేశమైంది. సమావేశ స్థలికి పక్కనే ఏర్పాటుచేసిన ఖాదీ ప్రదర్శన ప్రవేశ ద్వారం వద్ద వలంటీర్‌గా ఓ పద్నాలుగేళ్ల పిల్లను వుంచారు. జవహర్‌లాల్ నెహ్రూ అంతటి నేతను లోపలికి అనుమతించేది లేదని ఆ పిల్ల వలంటీరు అడ్డగించేసింది. ఎంతటివారైనా టికెట్టు కొనాల్సిందేనని పట్టుబట్టింది. ఓ కార్యకర్త టికెట్టు కొనుక్కొచ్చి ఇచ్చాకగానీ నెహ్రూను లోపలికి పోనివ్వలేదు. నెహ్రూ మెచ్చిన ఆ చిచ్చర పిడుగే భారత స్వాతంత్య్రోద్యమపు ‘జోన్ ఆఫ్ ఆర్క్’గా ప్రసిద్ధి చెందిన మన దుర్గాబాయమ్మ. 1909 జులై 15న రాజమండ్రిలో శ్రీ రామారావు, శ్రీమతి కృష్ణవేణమ్మలకు పుట్టిన దుర్గాబాయి పన్నెండేళ్లకే స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించి, ఇరవయ్యో ఏటనే కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం వంటి హేమాహేమీల సరసన నిలిచే నేతగా ఎదిగింది. గాంధీ ఆంధ్రదేశంలో ఎప్పుడు పర్యటించినా ఆయన హిందీ ప్రసంగాలన్నింటినీ దుర్గాబాయి అనువదించాల్సిందే. అది గాంధీజీ కోరిక! ఒకసారి బాపూ పర్యటన సందర్భంగా దుర్గాబాయి ఆయన చేత ముస్లిం మహిళలు, దేవదాసిల కోసం ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గాంధీ నిధికి రూ. 5,000 అందిస్తేనే అనుమతిస్తామని కొండా వెంకటప్పయ్య షరతు పెట్టారు. మూడు గంటల్లోనే దుర్గాబాయి రూ. 25,000 సేకరించి ఇచ్చేసింది!
స్వాతంత్య్రోద్యమంతో పాటే, సాంఘికసంస్కరణోద్యమంలోనూ చురుగ్గా పాల్గొంది. మహిళాభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైల్లో ఉండగా తోటి మహిళా ఖైదీలకు హిందీ నేర్పించింది. విడుదల కాగానే, ఆంధ్రదేశంలో మొదటి హిందీ పాఠశాలను ప్రారంభించి, తల్లికి గురువయింది.
అయిదో తరగతిలో ఆగిపోయిన చదువులను ఆమె తిరిగి కొనసాగించింది. పందొమ్మిదో ఏట ఏబీసీడీలు దిద్ది, ఇరవయ్యో ఏట బెనారస్ మెట్రిక్ పూర్తి చేసింది. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేసి క్రిమినల్ లాయర్‌గా దిట్ట అనిపించుకుంది. నాటి రాజధాని మద్రాసులో 1938లో ఏర్పాటైన ‘ఆంధ్ర మహిళా సభ’ నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోని ‘ఆంధ్ర మహిళా సభ’ వరకు ఆమె చేతి చలువే. 1946-52 మధ్య రాజ్యాంగ సభలో సభ్యురాలిగా ఉన్న దుర్గాబాయి ఆ తదుపరి ప్రణాళికా సంఘం సభ్యురాలైంది. ముఖ్యంగా ‘హిందూ కోడ్ బిల్’ తయారు చేయటంలో ఈమె పాత్ర శ్లాఘనీయం! భారత రిజర్వు బ్యాంకు తొలి గవర్నరు, మొదటి ఆర్థికమంత్రి చింతామణి దేశ్‌ముఖ్‌ను ఆమె 1953లో పెళ్లాడింది. ప్రధాని నెహ్రూయే వారి పెళ్లి పెద్ద. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె పలు మహిళా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర సాంఘిక మంత్రిత్వశాఖ ఏర్పాటు ఆమె కృషి ఫలితమే. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రితో పాటు పలు వైద్య కేంద్రాలు, మహిళా కళాశాలలు, నర్సులు మంత్రసానుల శిక్షణా కేంద్రాలను కూడా ఆమె ఏర్పాటు చేశారు. ఈమె ‘ఆంధ్ర మహిళ’ అనే పత్రికను నిర్వహించింది. తరువాత దానిని ‘విజయదుర్గ’ అనే పేరుతో ఆంగ్లంలోనూ, తెలుగులోనూ ప్రచురించింది. జైలులో వుండగా ఈమె వ్రాసిన ‘లక్ష్మి’ అనే నవలను ఒక పత్రిక సీరియల్‌గా ప్రచురించింది. ఆమె చిన్న తనంలోనే – శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్ర మహిళ లాంటి అనేక పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాసింది. ప్రేమ్ చంద్ కథలను హిందీ భాష నుండి తెలుగులోకి అనువదించింది. ‘చింతామణి మరియు నేను’ అనే ఆత్మకథను కూడా వ్రాసింది. ఈవిడ రచించిన ‘భారత దేశంలో సాంఘిక సంక్షేమం’ను ఒక అమూల్య గ్రంధంగా నేటికీ ఎందరో భావిస్తుంటారు. దుర్గాబాయి దంపతులు యావదాస్తిని ఆంధ్ర మహాసభకే అందజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, పద్మవిభూషణ్, నెహ్రూ, యునెస్కో లిటరసీ అవార్డులు దుర్గాబాయికి లభించిన పురస్కారాలలో కొన్ని. మహిళా సంక్షేమానికి, అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన ఆమె 1981, మే9న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె భర్త శ్రీ సి.డీ. దేశ్‌ముఖ్ అక్టోబర్, 1982లో పరమపదించారు.
ఆ మహిళా శిరోమణికి నా వినయాంజలి మరియూ శ్రద్ధాంజలి!!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags