దళిత బహుజన ఉద్యమాలపై సవాలక్ష ప్రశ్నల ”లక్షింపేట”

హేమలలిత

అట్టడుగు వర్గాల ఊచకోతే అభివృద్ధికి తొలిమెట్టేమో! అందుకే  కారంచేడు, ఖైర్లాంజీ, చుండూరు, నీరుకొండ…ఇప్పుడు లక్షింపేట. లక్షింపేట హత్యాకాండ సంధిస్తున్న సవాలక్ష ప్రశ్నల్ని విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది. దాని వెనకాల శక్తులు, అది రేపిన ప్రతిస్పందనలు, మన ముందుంచిన కర్తవ్యాలు, స్వీకరించాల్సిన, తిరస్కరించాల్సిన అనేక అంశాలను ముందుకు తెచ్చింది.
ప్రపంచీకరణలో అభివృద్ధి నీడల్లోకి నెట్టివేయబడి మిగులు మనుషులుగా మిగిలిపోయిన దళిత బహుజనుల దైన్యస్థితికి ‘లక్షింపేట’ అద్దంపడుతుంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో రాజ్యమే భాగం కావడాన్ని మరియు పాలక పార్టీలతో మిలాఖత్‌ అవుతున్న దళిత బహుజన రాజకీయ నాయకుల దగుల్బాజీతనాన్ని చర్చకు పెట్టింది. రాజ్యాంగ యంత్రాంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకులు వున్నారని, పాలనా యంత్రాంగంలో విద్యాధికులైన దళితులు రాజ్యాంగపరంగా లభించే వాగ్దానాలను, హామీలను అమలు చేస్తారని, అంతేగాకుండా ఇతర అస్థిత్వ ఉద్యమాలు (స్త్రీ, మైనారిటీ) తమ పోరాటాలకు బాసటగా నిలుస్తాయని, చివరిగా కుల అస్థిత్వ ప్రాతిపదికన దళిత, శూద్ర కులాల ఐక్యత కోసం వచ్చిన బహుజనవాద రాజకీయాల లక్ష్యసాధనలో ఒక వ్యూహంతో మనగలుగుతాయని అనుకున్న ప్రచారంలో లక్షింపేట అనేక ప్రశ్నల్ని సంధిస్తుంది.
జూన్‌ 12, 2012 ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని లక్షింపేట దళిత కుటుంబాలు తమ పని పాటల్లో నిమగ్నమయ్యారు. సభ్య సమాజం విస్తుపోయేలా అదే గ్రామానికి చెందిన బిసి కులస్థులైన భూస్వామ్యకాపులు మూకుమ్మడిగా బరిసెలు, గండ్రగొడ్డళ్ళు, బాంబులు, కత్తులతో  ఒక్కొటింటిని 20 మంది చొప్పున చుట్టుముట్టి ఇంట్లో వున్నవారిని బయటికిలాగి, బయట వున్నవారిని తరిమికొడుతూ అమానుషంగా పైశాచిక చర్యలతో దాడి చేశారు. అడొచ్చిన వారిని తెగ నరుకుతూ, గాయపరుస్తూ, పరుగులు తీయిస్తూ వారి తడినెత్తుటితో భూమిని తడిపేశారు. స్త్రీలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు.  వలస వాదుల్ని మైమరిపించే జలియన్‌వాల్‌బాగ్‌ పునరావృతమైంది.నివర్తి వెంకటేష్‌ (60), సంగమేష్‌ (35) బూరాడ సుందర్రావు, చిత్తం అప్పడు(25) దాడిలో చనిపోగా, బొద్దూరి పాపయ్య (60) విశాఖపట్నం కెజిహెచ్‌ ఆస్పత్రిలో చనిపోయారు ఇరవై మందిపైగా గాయపడ్డారు. ఇదే గ్రామంలో ఉన్న పది కుటుంబాలు ఓ బి.సి కులాలకు చెందినవారు వున్నారు. దాడి జరుగుతున్నపుడే వారు దాడుల్ని ప్రతిఘటించలేకపోయారు.
 దళితులపై జరుగుతున్న దాడులలో స్వభావరీత్యా అనేక మార్పులు వచ్చాయి. అనాదిగా సాగుతున్న వ్యక్తిగత దాడుల స్థాయి దాటి సామూహికంగా మొత్తం కమ్యూనిటీనే నిర్మూలించే స్థాయికి వీటి తీవ్రత పెరిగింది. ప్రపంచీకరణలో భాగంగా మొదలైన సెజ్‌ లలో గ్రామాలు గ్రామాలుగా దళితులు తరలించబడుతున్నారు. ఒక్క కాకినాడ సెజ్‌లో ఏకంగా ఐదు దళిత గ్రామాల్ని సమూలంగా ఖాళీ చేయించారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల పరిస్థితి నానాటికి తీసికట్టుగా వుంటుంది.
భారతసమాజంలో అట్టడుగు వర్గాలు అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు లేక దళిత బహుజనులు లేక మహిళలు. వీరు అట్టడుగు వర్గాలుగా మారడానికి కారణం సుమారు నాలుగు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వున్న వర్గ, కుల వ్యవస్థ. అందులో రెండువేల సంవత్సరాలకు పైగా వున్న చాతుర్వర్ణ వ్యవస్థ, వైదిక లేక హిందూ మత సామాజిక ఆర్థిక వ్యవస్థ. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అగ్రవర్ణాలు. సమాజంలో 5%గా వుండే వీరికి ఆస్తుల యాజమాన్యం, వ్యాపారాలు, విద్యా, అధికారం ప్రత్యేక హక్కులుగా చేయబడ్డాయి. నిమ్మ వర్గమైన శూద్రులు వీటినుండి మినహాయించబడి, అవి శూద్రులుకు నిషేదించబడి వారికి దూరం చేయబడ్డాయి. జనాభాలో 95% పైగా వుండే శూద్రులు ఈ విధంగా ఆస్థి, ఆదాయం, విద్య, అధికారాలకు దూరం చేయబడి అభివృద్ధికి మార్గాలల్ని మూసివేయబడి అగ్రవర్ణాలవారికి సేవలు చేసేవారుగా మార్చబడ్డారు. ఈ పరిణామ క్రమంలో వర్ణవ్యవస్థ రూపాంతరం చెంది కులవ్యవస్థగా మారితే అగ్ర వర్ణాలు అగ్రకులాలుగా  శూద్ర వర్ణం వేలాది కులాలుగా విడిపోయింది. అదే క్రమంలో అంటరానివారుగా చూడబడ్డ పంచములు అతిశూద్రకులాలుగా ఏర్పడ్డారు. వర్ణ కుల వ్యవస్థలో భూములకు చట్టపరంగా రాజు యజమానిగా వుండడంవలన వ్యక్తిగత ఆస్థి లేదు. కాని రాజులు బ్రాహ్మణ పూజారులు, పండితులు, గ్రామాధికారులు, సైన్యాధికారులు, సామంతులకు భూదానం, గ్రామదానాలు చేయడంతో భూస్వామ్య సంబంధాలు వృద్దిచెందాయి.
బ్రిటిష్‌ పాలనలో చట్టపరంగా భూస్వామ్య వ్యవస్థను ఏర్పరచడంతో అగ్రకులాలకు చెందినవారు భూస్వాములు, జమీందారులుగా శూద్ర అతి శుద్రకులాలు, రైతాంగం, చేతివృత్తులు, వ్యవసాయకూలీలుగా మారారు. అలాగే బ్రిటిష్‌్‌ కాలంలో బ్రాహ్మణులు గ్రామాల్లో భూములను వదిలి పట్టణాలకు వెళ్ళి పాశ్చాత్య విద్యా, ఉద్యోగాలు, వైద్య, వకీళ్ళ వంటి వృత్తులు, వ్యాపారాలలోకి వెళ్ళిపోవడంతో, భూములు శూద్రులలోని పై కులాలవారికి బదిలీ అయి, ఆ కులాలు శూద్ర ఆధిపత్యకులాలుగా మార్పు చెందాయి. ఫలితంగా 20వ శతాబ్దంలో  ఇతర ‘శూద్రకులాలు’ ‘బిసి’లుగా, అతిశూద్రులు ‘ఎస్‌సి’లుగా ఆదివాసీలు ఎస్‌టిలుగా మారారు. ఈ ఎస్‌సి ఎస్‌టి, బిసిలు దళిత బహుజనులుగా పిలువబడుతున్నారు. కుల భూస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి చెంది అగ్రకులాలకు చెందినవారు పెట్టుబడిదారీ వర్గంగా, దళిత బహుజనుల కార్మిక వర్గంగా మారారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ దేశంలోని సామాజిక వ్యవస్థ కుల భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ. ఒక మిశ్రమ ‘కుల వర్గ వ్యవస్థ.’
ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థలో నిత్యం అసమానతలు, ఆధిక్యత, అణచివేత, దోపిడీ, వివక్ష, అంటరానితనాలకు గురవుతూ వెనుకబాటుతనానికి దళిత బహుజనులు బలవుతూనే వున్నారు. లక్షింపేట దాని కొనసాగింపే.
లక్షింపేట…’అభివృద్ధి’ యజ్ఞఫలం. కాళీపట్నం రామారావు, యజ్ఞం కథలో అభివృద్ధి పేరిట ఒక ఊరిలో అణగారిన వర్గాలు ఎలా విధ్వంసానికి గురయ్యారో వివరంగా చెబుతారు. ఈ దేశంలో ‘అభివృద్ధి’కి బలిపశువులు దళితబహుజనులే.
‘లక్షింపేట’ శ్రీకాకుళ పోరాట జిల్లాలోనిది, నక్సల్బం పోరాటాన్ని తిరిగి రగిల్చిన పోరాట జ్వాల శ్రీకాకుళం, ఆ పోరాటవారసత్వం. అణగారిన వర్గాలవారికి అందకుండా అడ్డుగోడగా నిలిచిన సామాజిక , ఆర్థిక రాజకీయ పరిస్థితులేవో చూద్దాం!
లక్షింపేట సంఘటన వ్యక్తిగతమైనదేమి కాదు. మొత్తంగా అక్కడ వున్న దళిత బహుజనులకు సంబంధించిన భూవివాదం. ఈ వివాదం గత పదేళ్ళుగా నడుస్తున్నదే. కాకపోతే ఒక్కసారిగా నరమేధంతో అట్ట్టుడికి పోవడంతో దాని తీవ్రత బయట పడంది. నాగావళి సువర్ణముఖి మీద నదుల మద్దివలస రిజర్వాయరు ప్రాజెక్టుకోసం పదేళ్ళుక్రితం గ్రామాన్ని తరలించడంతో వివాదం మొదలైంది. అంతవరకూ వివిధ కులాల వద్దనున్న భూమిని సేకరించి రిజర్వాయరు నిర్మించడంతో 250 ఎకరాలు భూమి ముంపుకు గురికాని ప్రాంతంగా మిగిలిపోయింది.  అప్పటివరకు ఒక గ్రామంలా వుండి  విస్థాపనకు గురైన వారిలో రెండు రకాల భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. నష్టపరిహారం  తీసుకున్న కాపులు తిరిగి భూమిని స్వాధీనపరుచుకోదలిచారు. ఏ లబ్ది పొందక,  వ్యవసాయ ఉత్పత్తి పనులు దొరకక  కుటుంబ పోషణ కష్టమై వేరే దారిలేక దళితులు కూడా భూమిని సాగుచేసుకోదల్చారు. కాపులు 190 ఎకరాలు చేసుకుంటే మిగిలిన 90 ఎకరాలను సాగుకౖైె 88 మంది దళిత కుటుంబాలు ముందుకు వచ్చాయి. మౌఖికంగా ఆనాటి జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకున్నాయి. తమ ప్రక్కన యిప్పటివరకు సామాజికంగా అణగారిన  దళితులు మిగిలిన భూమిని సాగుచేసుకోవటం కాపులు  జీర్ణించుకోలేక దాడులకు దిగారు.  కాపుల దౌర్జన్యం తట్టుకోలేని దళితులు వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌సి,ఎస్‌టి అట్రాసెటీల కేసులను  పెట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే   జిల్లా కలెక్టరు ఓ కమిటికి ఏర్పాటు చేసి యిరువర్గాలవారికి భూమిని దున్నుకోవద్దుని అంక్షలు విధించారు. దళితులు పదేళ్ళుగా పట్టువిడవకుండా భూమిని సాగుచేసుకుంటూ అర్థికంగా నిలదొక్కుకోవడం, ఆ భూమిపై హక్కు సంపాదించుకోవడం కోసం ప్రయత్నించడం ‘కాపు-కులాలు’కు కన్నెర్ర అయ్యింది. దళి తుల మీద కక్ష పెంచుకొని దాడుల్ని ఉధృతం చేసారు. ఫలితంగా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటయ్యింది. అదునుకోసం ఎదురుచూస్తున్న కాపు వర్గాలు నర్సన్నపేటలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా వ్యూహాత్మకంగా పోలీస్‌ పికెట్నిఎత్తివేయించి 12.06.12న లక్షింపేట హత్యకాండను సాగించారు. అసలైన ముద్దాయిల్ని వదిలేసి కంటి తుడుపుగా కొందర్ని అరెస్ట్‌ చేశారు. మొత్తంగా దాడికి మూలం భూవివాదంగా కన్పించినా గ్రామంలోని హిందూకులాల దురంహాకా రమే ప్రధాన పాత్ర వహించింది.
 ఇందుకు నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో గణాంకాలే సాక్ష్యం. దీనిప్రకారం ప్రతిరోజు యిద్దరు దళితులు హత్య చేయచేయబడుతున్నారు. ముగ్గురు దళిత స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇద్దరు దళితుల యిళ్ళు తగలబడుతున్నాయి.  పందకొండుమంది చావు దెబ్బలు తింటున్నారు అన్న వాస్తవాలు వెనుక ఈ కుల దురంహాకారంతో పాటు వారిని అభివృద్ధి నీడల్లోకి నెట్టేెసిన  ఆర్థిక నేపథ్యం వుంది. వాస్తవానికి 1947 తర్వాత బ్రిటిష్‌ వారి నుండి అధికార మార్పిడి అయితే జరిగింది కాని ప్రజాస్వామీకరణ చెందలేదు. మొదటి  పంచవర్ష ప్రణాళికలలోనే దేశ ఆర్ధిక ప్రగతికి వ్యవసాయంలో అనూహ్యమైన మార్పులకు డ్యాంలు, రిజర్వాయర్లు దోహదపడతాయని, తద్వారా పంటపొలాలు విస్తీర్ణం పెరగడం, లేదా విద్యుత్‌ ఉత్పాదక  పెరిగి పరిశ్రమలు పెరుగుతాయని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశించింది. కాని అప్పట్నుంచి పునరావాసానికి ఒక స్పష్టమైన అవగాహనతో చట్టాలు చేయకపోవడం, వనరులు ఉన్న వారే లబ్దిపొందడం, నష్టపరిహారంలో అందివ్వడంలో కుల వర్గాలకు  తేడాలు కన్పిస్తుంది. సర్వసత్తాక రాజ్యంగా పేర్కొన్న దేశంలో నెహ్రూ నాయకత్వంలోని భూస్వామ్య వర్గాలు రాజ్యాధికారం పొందడంలో  సర్వజనులకు భూమిపై హక్కు కల్పించలేదు. ఈ వైరుధ్యం ఆరు దశాబ్దాల తర్వాత కూడా  లక్షింపేటలో కొనసాగింది.
దేశంలో వచ్చిన కంటితుడుపు భూసంస్కరణలు, దున్నేవాన్కి భూమి లక్షింపేట దళితులకు ఏ ఆసరా కల్పించలేదు. బలమైన రాజకీయ ఆకాంక్షతో పెట్టినది కాదు కాబట్టి సహజసిద్ధంగానే అది విఫలమయ్యాయి. భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు మౌలిక సదుపాయల కల్పనతో  పారిశ్రామీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని వక్కాణించిన ప్రభుత్వం శ్రీకాకుళంలో జిల్లాలో ఎలాంటి పరిశ్రమల్ని స్థాపించలేక పోయింది. కాబట్టి విధిగా లక్షింపేట ప్రజలు భూమినే  నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఆ తర్వాత వచ్చిన  ఇందిరమ్మ ‘గరీబి హాఠావో’ అన్న నినాదం ఆమె రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయి తప్ప సుమారు 100 కుటుంబాలున్న లక్షింపేట దళిత బహుజనులకు ఒరిగిందేమీ లేదు. 1980లలో ప్రవేశించిన ఉదారవాదం, ప్రైవేటీకరణతో రిజర్వేషన్ల వెసులుబాటుతో చదువుకున్న దేశంలో అతికొద్దిమంది దళితులు ఉపాధి అవకాశాల్ని గండి కొట్టినట్టే లక్షంపేటలోని కొద్దిశాతం చదువుకున్న దళితుల్ని  గండి కొట్టింది. 1990లలో బాహాటంగా వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంవలన ఈ దళిత బహుజనులను ఉత్పత్తికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యత వున్న హక్కుదారులుగా రాజ్యం గుర్తించక కేవలం లబ్దిదారులుగా గుర్తించి లక్షింపేట నుంచి ఖాళీ చేయించింది. పోలవరంలో వచ్చిన ప్రతిఘటన యిక్కడ రాకపోవడం ప్రధాన కారణమయ్యిండొచ్చు. స్త్రీలకు పావలా వడ్డీ, యువజనులకు రాజీవ్‌యోజన, ఉపాధి, పేదరిక నిర్ములనా పథకాలు రుణసహాయం అప్పుడప్పుడే కొత్త గ్రామంలో కుదురుకుంటున్న దళితులకు అందలేదు.
దేశంలోగాని, రాష్ట్రంలోగాని గమనిస్తే మొదట్నుంచి సంస్కరణల రూపంలో వచ్చిన అభివృద్ధి ఫలాలను 1960లను నుంచి ఆధిపత్య  కులాలు అందిపుచ్చుకుంటునే వున్నాయి.  ఈ  ఫలాల ద్వారా వచ్చిన మిగులుని పారిశ్రామికీరణకు తరలించారు. పరిశ్రమలు వారి సొత్తయ్యాయి. సహజంగానే అధికారం వాడికి బట్వాడా జరిగింది. అందుకే భూస్వామి వర్గాలు బూర్జువా శక్తులతో కలిసిపోయి భూస్వామి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించలేక పోయాయి. ఈ పరిణామంతో పుట్టినవే జాతీయంగా కాంగ్రెస్‌, రాష్ట్రంలో టిడిపి పారిశ్రామీకరణతో వృత్తులు కోల్పోయిన బి.సిలు,  కూలీలుగా, పట్టణాలకు వలసవెళ్ళపోయారు. ఏ దిక్కులేక భూమిని నమ్ముకుని దళితులు పల్లెలలో ఉండిపోయారు. వారిలోని  చదువుకున్న దళితులు వ్యవస్థలోని వివక్షను  ప్రశ్నించడంతో కారంచేడు, చుండూరు, నీరుకొండ మారణహోమానికి ప్రతీకలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఏ ఆధిపత్య కులాలు అధికారంతో వుంటాయో దళితులపై ఆ కులాల దాడులు, దౌర్జన్యాలు జరిగాయి.
బహుజనులలో భాగమైన బి.సి కులానికి చెందిన తుర్పు కాపులు దళితులపై దాడి దానికి భిన్నమైనది. యిప్పటివరకు ఆధిపత్య కులాలుగా వున్న రెడ్లు, కమ్మలు కాకుండా బి.సిలు ఎందుకు ఈ ఘటనకు పూనుకున్నాయి. అన్న దానికిి రాజకీయ కోణం కారణాల వున్నాయి. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రపంచీకరణగా మారుతున్న క్రమంలో, బహుళజాతికంపెనీలు రూపంలో ఎమ్‌.ఎన్‌సిలు గుత్త పెట్టుబడిదారివర్గం ఆధిపత్య కులాలతో జతకట్టింది. దేశంలో దళారీ బూర్జువా వర్గం మరింతగా బలపడింది. పాలకవర్గాలు వారికి అనుకూలంగా తోలుబొమ్మలుగా మారాయి. తమకు అనుకూలమైన చట్టాలు చేశాయి. ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం 2005  తెచ్చింది. ఎగుమతులు, ఉపాధిపేరిట వేల ఎకరాలు సమకూర్చాయి. రాష్ట్రంలో 17-18%వున్న కాపు కులాల వారు కృష్ణా, గోదావరి ఆనకట్టలవలన లబ్దిపొంది సామాజిక ఆర్థికంగా  కోస్తాలో రాజకీయంగా బలంగా వుంది. వారు తమ ఆధిపత్య వాటాకోసం పోటీ పడుతూనే బిసిలుగా మారడానికి ఉద్యమాన్ని చేపట్టారు. వీరు ఉత్తరాంధ్రలో, తెలంగాణలో బిసిలుగాను, రాయలసీమ, కోస్తాంధ్రలోను ఓసిలుగా వున్నారు. వీరు ఎక్కడ వున్న ప్రధానవృత్తి వ్యవసాయం.
పోటీలో భాగంగా వున్న కాపు వర్గం గోదావరిజిల్లాకు చెందిన  చిరంజీవిని సామాజికన్యాయం పేరిట రాజకీయరంగ ప్రవేశం చేయించింది. అణగారిన వర్గాలను, కులాలను కలుపుకొంటూ  అధికారాన్ని పొందాలని అనుకుంది. ఆ సంకల్పం విఫలమయ్యి 2009 ఎన్నికలలో  ఘోరంగా పరాజయం పాలయ్యింది. ఇది అప్పుడప్పుడే రాజకీయం శక్తిగా ఎదగాలనుకున్న కాపుల ఆకాంక్షను అనూహ్యంగా దెబ్బతీసింది. ఈ లోపు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోవడం, జగన్‌ మరో పార్టీ పెట్టడం అందులోకి రెడ్లు, దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.ఈ దెబ్బతో ముక్కలు చెక్కలుగా వున్నకాపు ఉపకులాల్పి ఏకంచేసే బాధ్యతను బొత్స తన భుజాన వేసుకున్నాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడాలన్న నెపంతో తన కాపు వర్గాన్ని బలపరచటానికి బొత్సాసత్యనారాయణ (పిసిసి అధ్యక్షుడు కూడా) నడుము బిగించాడు. దాంతో రెండేడ్లలోనే ప్రజారాజ్యాన్ని గాలికొదిలేసి చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయాడు. యిలా  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు కాపులకు వరంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో కాపులు మొత్తంగా అన్ని రంగాలను తమ ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే లక్షింపేట దాడి జరిగిందని మనం అర్థం చేసుకోవాలి.
 పథకాలు, పాలసీలు, ఎన్నికలు అన్ని కూడా కుల వ్యవస్థను బలపరచాయే తప్ప  బలహీనపర్చలేదు. శ్రీకాకుళంలో  నెలకొల్పుతున్న విద్యుత్‌ ప్రాజెక్టులో ఎక్కువభాగం లబ్ది పొందింది రెడ్లు, రాజులు, కమ్మలే. అలాగే చంద్రబాబు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెజ్‌లే పేరిట జరిగిన భూపంపకాలలో లాభపడింది వారే. కాబట్టి తమ వాటాకోసం కాపులు బొత్స నాయకత్వంలో ఏకమయ్యేందుకు సిద్ధపడ్డారు. జిల్లాపై తమ అధిపత్య పట్టును బిగించారు. అందుకే గత పది ఏళ్ళుగా భూవివాదం లక్షింపేటలో వున్నా కాపులు దళితులపై దాడిచేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశలో పయనించడం, రాష్ట్రంలో వారి ఉపకులాల ఐక్యత కాపులను దోపిడి దౌర్జన్యాలకు పాలు పడటానికి ప్రేరేపించాయి. భూమిలేని పేద కులాలు వలస వెళ్ళుతున్న కొద్ద్ది గ్రామాలు, భూమి కాపు కులాల సొంతం అవుతూ వచ్చాయి. శ్రీకాకుళం, ఎచ్చర్ల, కోట బొమ్మాళి, హీరా, ఆముదాలవలస, ఎల్‌ఎన్‌ పేట మండలాల్లో సైతం కాపు వర్గానికి చెందినవారు దళితులపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వున్నారు. ఇందుకు పాలనాయంత్రాంగం సహకారం కూడా వుందనటానికి జూలై 6న పాలకొండలో లక్షింపేట దాడి నాయకుడు బొత్స వాసుదేవనాయుడిని అరెస్ట్‌ చేసినందుకు ధర్నా చేసినవారిని అరెస్ట్‌ చేయకపోగా వారికి సహకరించారు. చంపబడ్డ జనం తాలూకూ వాళ్లేకాదు, చంపినవారు సైతం ధర్నాలు చెయ్యగలిగే ప్రజాస్వామ్యం మనది.
రాజ్యాంగ యంత్రం కుమ్మక్కు
కులం పేరుతో జరిగే దాడుల్ని పరిశీలిస్తున్నపుడు సామాజిక సంబంధాల్లో  హిందూ కులాల మధ్య కొనసాగుతున్న అసమానత ఉన్నది, దళితులకు రాజ్యాంగపరమైన మద్దతు, రక్షణ యంత్రాంగం వున్నప్పటికీ ఈ అసమాన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక సంబంధాల్లో అసమానత కొనసాగడం కులవ్యవస్థ అంతర్గత లక్షణం. దళితులు ఈ అసమానతని అణచివేతని అంగీకరించినంత కాలం ఏ వివాదం ఉండదు. సామాజిక సంబంధాల చలనం సాధారణంగా ఆయా కులాల, వర్గాల బలాన్ని బట్టి రెండు శిబిరాలుగా కొనసాగుతుంది. రాజ్యం కీలకపాత్ర పోషిస్తూ రక్షణ యంత్రాంగం ద్వారా దళితుల అభ్యున్నతికి తోడ్పడాలి. కాని మొత్తంగా దళితులపై జరిగిన దాడుల్ని పరిశీలిస్తే రాజ్యాంగం యిచ్చిన అన్ని భద్రతా చర్యల విషయంలో రాజ్యాం వైఫల్యం నిర్లక్ష్యం కన్పిస్తుంది. రాజ్యాం పూర్తిగా పాలక వార్గల సేవలో కుల సంబంధాల్ని కొనసాగించడంలో నిమగ్నమైంది.  అందుకే దాడికి కొన్ని రోజుల ముందే లక్షింపేట దళిత పోలీస్‌స్టేషన్‌ వున్న దళిత అధికారిని వేరే స్టేషన్‌కు ఉద్ధేశపూర్వకంగానే బదిలీ చేసారు.ఈ రాజ్యాన్కి వుండే అగ్రకుల ఆధిపత్య స్వభావం వలన దళితులపై జరిగిన దాడుల అనంతరం ఎవర్ని వెంటనే అరెస్టు చేయలేదు.   వేసేంతవరకు ఇతర  ప్రజాస్వామిక సంఘాలు ప్రతిఘటించే వరకు అసలైన ముద్దాయిని అరెస్ట్‌ చేయ్యలేదు. దాడుల అనంతరం కూడా ములాఖత్‌ స్పష్టంగా తెలుస్తుంది. దాడులు జరిపినపుడు కేసు నమోదు చేయకపోవడం, సాక్ష్యాధారాలను ఘటన స్థలంలోనే వదిలెయ్యడం, నేరస్థుల కొమ్ముకాయడం చేస్తున్నది. ఈ దాడుల్ని నిలవరించడంలో రాజ్యాం పాత్ర ఏ మేరకు పెరిగినా కారంచేడు సంఘటన మళ్ళీ మళ్ళీ తిరగబడేవి కావు.
చట్టాలు/భూస్వామ్య ఆధిపత్య హిందూ కులాల చుట్టాలు
ఓటు బాంకు రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని రక్షణ చట్టాలను దళితులకు చేయవలసిన అవసరం ఏర్పడింది.  అది ఎస్‌.ఎసి. అట్రాసిటీస్‌ చట్టం (1989).  ఎన్ని దాడులు దళితకులకు జరిగినా కేవలం 30% మాత్రమే రిజిస్టర్‌ అవుతున్నాయి. కేంద్ర సామాజిక న్యామంత్రిత్వశాఖ పార్లమెంట్‌ స్థాయిసంఘం స్వయంగా ప్రకటించినట్లుగా 80% కేసులు పెండింగ్‌ వున్నాయంటే  రాజ్యం యొక్క  పక్షపాత ధోరణి తేటతెల్లమయ్యింది. ఈ చట్టం నియమాలు 1995 ప్రకారం ఆరునెలలకొకసారి ముఖ్యమంత్రి  ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరిగి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేక కాబట్టే ఈనాడు కారంచేడులు మళ్ళీ మళ్ళీ చరిత్ర తెరమీదకొస్తున్నాయి. ఓట్ల కోసం చేసే ఫీట్లు చేసే అగ్రకులా రాజకీయ నాయకులు సమావేశాల పట్ల దళితులకు భ్రమలు లేవు. కాని అసలైన సూత్రధారి బొత్స సత్యనారాయణను అరెస్టు చేయటానికి ఈ చట్టం ఉపయోగపడలేదంటే రాజ్యం యొక్క పాత్ర స్పష్టంగా తెలుస్తుంది. బాధితుల్ని అణచివేయ డానికి పోలీసులు ప్రారంభంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసారు. ఇందులో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యం, డబ్బు ప్రధానపాత్ర పోషించాయి. దళితులతో జరిగే  ఏ వ్యవహారంలో నైనా తమకెవరూ అడ్డు చెప్పరన్నది ఆధిపత్య కులాలవాళ్ళకు తెలుసు. లక్షింపేటలో దోషులని గుర్తించిన కూడా ఈ మద్దతు హామీ కన్పించడంతో దళితులు తమకు ప్రత్యేక కోర్టును అదే గ్రామంలో పెట్టి విచారణ చేయాలన్న డిమాండ్లను చేస్తున్నారు. ఇంత జరిగినా నిజమైన నేరస్థులు శిక్షింపబడతారా అన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పోలీస్‌ వ్యవస్థ
లక్షింపేట ఘటన జరిగినప్పుడు, తదనంతర  ఆధిపత్య, దాడుల్లో పోలీసులు కుల ఆధిపత్యాన్కి అండగానే నిలిచారు.
భూవివాదంలో ఎన్ని సార్లు  కేసులు నమోదు చేయమని పోలీసుల్ని అభ్యర్థించినా కోరినా కేవలం నాలుగు కేసులే నమోదు చేసారు. పోలీసులు మొత్తం ఘర్షణల క్రమాన్ని, వివాదాల్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి ఉంటే లక్షింపేట ఘటన జరిగి వుండేది కాదు. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే రాలేదు ఇది చాలా అసాధారణంగా కన్పించినా జరుగుతున్నది అదే.
దళిత బహుజన ఉద్యమాల దశ-దిశ
అస్థిత్వ ఉద్యమాలు కారంచేడు మారణహోమం తర్వాత ఊపందుకున్నాయి. అప్పటివరకు కేవల అంబేద్కర్‌ సంఘాలుగా వున్న దళితుల్ని ‘దళిత మహాసభ’ ఏకం చేసింది. ఆ తర్వాత  చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం దాడుల్ని నివారించడంలో తిరుగులేని శక్తిగా ఎదగలేకపోయింది. కారణం అస్థిత్వ ఉద్యమాలు రాజకీయనాయలకు ప్రయోజనం చేకూర్చాయి. దళిత ప్రజానికానికి మాత్రం ఉట్టి నినాదాలు, బోలు చిహ్నాలు తప్ప ఏమి మిగలలేదు. దళితుల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడం , పరిష్కరిచండం కాకుండా అస్థిత్వ రాజకీయాలకు పాలకవర్గ రాజకీయాల్లో భాగంగా చేసారు. అందుకు ఉదాహరణగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక విస్థాపన ప్రాజెక్టులలో ఉపాధిని, భూమిని కోల్పోతున్న దళితుల పట్ల ఏ దళిత సంఘాలు యిప్పటివరకూ అండగా నిలబడలేదు వాస్తవానికి కాకినాడ సెజ్‌, వాప్‌సిక్‌ , కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టులలో కొందరు దళిత నాయకులు దళితుల ప్రయోజనాలు  దెబ్బ తీస్తూ పాలకవర్గాలతో  మిలాఖాత్‌ అయ్యి ఉద్యమాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా జాతి భవిష్యత్తుని పాలకవర్గాలకు తాకట్టు పెట్టారు. ఈ కారణం వల్లనే ప్రత్యామ్నాయ రాజకీయాలను దళితులు దరిచేరనివ్వటం లేదు.
గత ఆర్నెళ్ళ క్రితం రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి  అవమానం జరిగితే రాష్ట్రమంతా వెల్లువెత్తిన ప్రజానికం  ప్రభుత్వం దిగివచ్చేదాకా నిరసనను కొనసాగించింది. ఈ విషయంలో వచ్చిన ప్రతిస్పందనలతో పోలిస్తే లక్షింపేటను ఖండిస్తూ వచ్చిన స్పందన తక్కువే. విగ్రహానికి జరిగిన అవమానం అందుకు  తీవ్రంగా వచ్చిన స్పందన, ఆగ్రహం దారుణ అవమానాలను, హత్యకు గురైన మనుషుల విషయంలో రాలేదు. దీన్ని బట్టి చూస్తే అస్థిత్వ చిహ్నాల పట్ల ఉన్న స్పందన సజీవమైన మనుషుల విషయంలో లేకపోయింది. ఇక్కడ రెండు అనుకూల ప్రతికూల ప్రభావాన్ని గమనిస్తాం. దళిత పోరాట వారసత్వ చిహ్నామైన అంబేద్కర్‌ విగ్రహం భావితరాల్ని పోరాటంలో ఉత్తేజపరచటం ఒకటైతే అంబేద్కర్‌ దేవుడై పోవడం రెండవది నిజానికి పాలకవర్గాలు రెండవ అంశాన్నే ఆసరా చేసుకుని మరింతగా మత ప్రచారంలా అంబేద్కర్‌ విగ్రహాల్ని ప్రతిష్టింపచేసి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.
 ఇలాంటి అనేక విషయాల్ని లక్షింపేట  బయటపెట్టడమే కాదు దళిత శక్తులు పునరాలోచించుకునే దిశను చూపించింది. వ్యూహాత్మకంగా చూస్తే  దళిత ఉద్యమాలు ప్రజలతో కలిసి తమ ప్రాముఖ్యాంశాలను ఖచ్చితంగా తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది ఆత్మగౌరవం పట్ల అంబేద్కర్‌ విగ్రహానికి జరిగిన అవమానాన్ని సహించని మన సున్నిత స్పందన సజీవ మనుష్యులపట్ల  దర్శించగలిగినపుడే సరైన చైతన్యాన్ని ప్రదర్శించిన దళిత ఉద్యమం ఆవిర్భవిస్తుంది.కాని దాడులకు మూలకారణమైన సామాజిక ఆర్థిక అంశాల్ని గుర్తించడంవల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశం తోటే నాయకులు వాటిని గుర్తించ నిరాకరిస్తారు. అందుకే లక్షింపేట గ్రామ సర్పంచి దళిత స్త్రీకు ఎన్ని అవమానాలు ఎదురైనా అక్కడి దళిత సంఘాలు ఎలాంటి చర్యలు తీసుకులేకపోయారు. లక్షింపేట నియోజక వర్గ ప్రజాప్రతినిధి రాష్ట్రమంత్రి  కొండ్రు మురళి దళితుడైనా రాజ్యం చేతిలో కీలుబొమ్మాయ్యాడు. 
యింకో వైపు రాజ్యాధికారం లక్ష్యంతో పార్లంటరీ రాజకీయ పార్టీలు ఎన్నికలలో మెజార్టీ కోసం దళిత బహుజనులను ఒక గాడిన కట్టడం జరుగుతుంది. కాని యిప్పటికీ గ్రామాలలో వారి మధ్య అనేక వైరుధ్యాలు వున్నాయి. దళితుల బట్టలు ఉతకని చాకళ్ళు, సామాజికంగా దరిచేరని బి.సి కులాలు గ్రామాల్లో వున్నారు.  అందులో లక్షింపేట తూర్పు కాపులు వున్నారు. వీరు సామాజికంగా బి.సిలు అయినా బ్రాహ్మణ వాదానికి ప్రతినిధులు. వారి సామాజిక ఆర్థిక పునాదులు మిగతా భూ సొంతదారులతో సంబంధాలు తీసుకుంటే దళితులతో కలిసి బహుజనంగా అధికారంకోసం జరిగే సమీకరణలో భాగం కాగలరా? బి.సి కులాల మహాజనసభ నాయకులు ఉ. సాంబశివరావు వ్యవసాయాధారిత తూర్పు కాపులను బి.సిల నుంచి ఎత్తివేయాలని డిమాండ్‌ పెట్టారు. మరి తెలంగాణాలోకి మున్నూరు కాపుల సంగతేమిటి? ఉత్తరాంధ్రలో, తెలంగాణలో కాపులు బి.సిలు అయితే కోస్తా, రాయలసీమలో కాపులుగా  ఓసిలు వున్నారు..  అసలు 1956 వరకు అన్ని కాపులకులాలు  బిసిలుగా వున్నాం కాబట్టి అన్ని ప్రాంతాల కాపుల్ని  బిసిలుగా చేర్చాలన్న  కాపునాడు డిమాండుకు ప్రపంచీకరణ కులాన్ని పొగుడుతుందనే భ్రమలో వున్న బహుజన ఉద్యమం ఏమీ సమాధానం చెబుతుంది?
వాస్తవానికి నిచ్చెనమెట్ల కుల సమాజంలో దళితులు తక్కువవారనే ధోరణి, దళితులపై దాడి జరిపినా తమ సామాజిక, రాజకీయ బలాలతో బయటపడవచ్చన్న  భరోసా ఆధిపత్య కులాలకు పెరుగుతుండగా బాధితులకు న్యాయవ్యవస్థ మీద ఆధిపత్య కారణాలపై నమ్మకం సన్నగిల్లుతుంది. దళితుల ఆత్మరక్షణకు ఆయుధాలు యివ్వాలని, ప్రతిహింస జరగాలని, కారంచేడు తిరగబడాలన్న వాదనలు విన్పిస్తున్నాయి. భూమి వాటి వనరుల ఆధిపత్యంపై  కొన్ని కులాల నుండి తప్పించగలమా అన్నది నేటి ప్రశ్న. స్వాతంత్య్ర ప్రకటన తర్వాత దళితులకు యిన్నేళ్ళు అయినా భూ సంస్కరణల పేరిట దోబుచులాటే తప్ప భూమిపై హక్కు ఏర్పడలేదు. అందుకే 2004లో నక్సల్స్‌కు ప్రభుత్వంకు మధ్య జరిగిన చర్చలలో వారి ఉనికి కంటే భూసమస్యపైనే  ఎక్కువ దృష్టిపెట్టారేమో!  దళిత బహుజన దార్శికుడు డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు భూవనరులను జాతీయం చెయ్యగలమా? అలా జరిగినట్లయితే ఈ కులవ్యవస్థ యొక్క మూలాలు కదిలేవి.  పాలకులకు తమ స్వార్థ ప్రయోజకులకు అది అడ్డుకట్ట. అందుకే యింతటి విప్లవాత్మ ఆదరణకు భారత రాజకీయవ్యవస్థ పూనుకోలేదు. కాబట్టే బలిమి కల్గిన కులాలు భూమిని, మార్కెట్టును శాసిస్తున్నాయి.
పాలనాయంత్రాంగంలో దళితులు అధిక సంఖ్యలో ఉన్నారని వాళ్ళు దళితులకు న్యాయం చేస్తారని కాన్షిరాం తెచ్చిన బహుజన రాజకీయాలతో సహా అనేక భ్రమల్ని బ్రద్ధలు కొట్టింది లక్షింపేట. ఇక్కడ సర్పంచ్‌ దళిత స్త్రీ, అప్పటివరకు వున్న పోలీస్‌ ఆఫీసర్‌ దళితుడే, యింకా అనేక మంది ఐఎస్‌ఎస్‌, ఐపిఎస్‌ దళిత అధికారులు వున్నారు. అయితే లక్షంపేట విషయంలో మొత్తం రాజ్యం వైఫల్యం వుంది. దళిత అధికారలు అంతా వ్యవస్థలో ఒక భాగమే. ఒక దళితుడు ఉన్నాతాధికారిగానో పాలనా యంత్రాంగంలోనో ఉంటే దళిత ప్రయోజనాలను కాపాడుతాడనుకోవడం అమాయకత్వమే. ఈ  అమాయకత్వమే దళితుల్ని రాజకీయ అచేతనానికి నెట్టేెసింది. వ్యక్తులుగా ఎంత ఉన్నత స్థితిలో వున్నా సమాజాన్ని మార్చలేరని, వాళ్ళ సమిష్టి రాజకీయ ఆచరణ మొత్తం సమాజాన్నే మార్చుతుందని, ఆ పోరాటం సమాజంలోకి అన్ని రంగాలకు ప్రభావితం చేస్తుందని విషయం మర్చిపోయారు. అందుకే భౌతిక వాద తాత్వికతో వచ్చిన సామాజిక ఉద్యమాలనుండి చారిత్రకంగానే దళిత ఉద్యమాలు దూరమయ్యాయి. ఈ తిరోగమన ఆలోచనా విధానం సమిష్టి మనుగడకు తీరని నష్టం చేసింది. ఫలితంగా కారంచేడు పునరావృతమయి లక్షింపేట మారణహోమంగా ముందుకు వచ్చింది. అందుకే దళిత బహుజన ఉద్యమాలు కార్మిక వర్గంతో మొత్తంగా కదలాలంటే కుల పునాదులు పెకిలించాలంటే ఏ సమీకరణ అవసరం అన్నది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం యిది. నయా ఉదారవాదం సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో అన్ని విధాల నష్టపోతున్న దళిత బహుజనుల, ఈ ఉద్యమాలకు సరైన దిశ నేడు  అత్యవసరం.
 లక్షింపేట మరిన్ని వైవిధ్యాల్ని మన ముందుంచింది.  ఒకటి దళిత బహుజనులతో భాగమైన స్త్రీలు లక్షింపేట దమనకాండలో ప్రత్యక్షంగా పాల్గొనటం, రెండు మహిళా సమస్యల్ని ఫెమినిస్టు ఫిలాసిపితో దోపిడీ మూలాల్ని వెతుక్కునే స్త్రీ ఉద్యమం, అల్ప సంఖ్యక వర్గాల  హక్కులకై పోరాడే మైనార్టీల ఉద్యమాలు  లక్షింపేట పోరాటాలకు  బాసటగా నిలుస్తాయని ఆశించిన దానికి భిన్నంగా జరగడం. లక్షింపేట దమనకాండలో అదే గ్రామానికి చెందిన పలాస ఉమ, కేతు లక్ష్మికాంతన్డు, ఆవు కళ్యాణి, గండేడి కళావతి, గంటాడి లక్ష్మి, కేతు రాములమ్మ, గొలుసు పద్మ మొదలగు మహిళలు భర్తలకు సహకరిస్తూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ట్రెండ్‌ ఈ మధ్యకాలంలో భైర్లాంజి సంఘటన (2006) నుంచి ఎక్కువయింది. అంతకుముందు సామాజిక దాడులతో అణగారిన వర్గాల స్త్రీలు ధన, మానాలు పురుషుల చేతుల్లోనే పోగొట్టుకునేవారు. మరి లక్షింపేట విషాదం గురించి ఏమనుకోవాలి?
 స్త్రీలకు స్త్రీలే శత్రువులని, ఆడది బాల్యంలో తండ్రి చాటున, యవ్వనంలో  భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకు చాటున, నస్త్రీ స్వాతంత్య్రం మర్హతి అని నూరుపోసిన పితృస్వామిక సమాజం ఇది. మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ కులాన్ని తమ ప్రయోజనాలకు వాడుకున్నట్టే పితృస్వామ్య భావజాలాన్ని తమ ప్రయోజనాలకు వాడుకొంది. ఉన్నత విద్య, పట్టణీకరణ కూడా తమ స్వంత ప్రయోజనాలికి పెట్టుబడిదారి విధానం ఉపయోగించుకుంది. అందుకే స్త్రీని ఒక వైపు అంగడి సరుకుగా మరోవైపు భర్త వుండే వర్గానికి అనుకూలంగా మార్చివేసి, పోటీ సమాజంలో వీరిని దోషులుగా నిలబెడుతుంది. అందుకే స్త్రీవాదులు అన్నట్లుగా స్త్రీలు అంతా ఒక వర్గంగా లేరు. ఎన్నో వర్గాలుగా విడిపోయి సమాజంలో ఆయా సామాజిక వర్గాల్లో భాగంగా దళిత, బి.సి, ఆధిపత్య కులాల స్త్రీలుగా విడిపోయి ఆ వ్యవస్థ లక్షణాలకు ప్రతినిధులుగా మారిపోయారు.
దళిత అంటే విడగొట్టబడిన, అణచబడిన అనే అర్ధంలో స్త్రీలు కూడా వున్నారు. లక్షింపేట తూర్పు కాపు స్త్రీలు యిందుకు మినహాయింపు కాదు. వాస్తవానికి దాడిలో పాల్గొన్న స్త్రీలకు  భూమిలో హక్కు  లేదు. కుటుంబంలో  వివక్షతకు గురికానివారు కాదు. కాని పితృస్వామ్యపు భావజాలంపట్ల అవగాహన లేని వారు తమ మగవారి వెంట నడవడమే కాకుండా హింసతో కూడిన చర్యలు దాడిలో చేపట్టారు. వారిలో స్వార్ధం లేదనటానికి వీలులేదు. కాని స్వార్థం కంటే పితృస్వామ్యపు భావజాలం, పోటీ తత్వపు ప్రపంచీకరణ ప్రభావం వారిని ముందుకు నడిపించిందేమో!.
మరో వైపు చూసినట్లయితే విస్థాపన ఉద్యమంలో భూమిని కాపాడుకోవటానికి ప్త్రీలు విరివిగా పాల్గొన్నారు. కాకినాడ వ్యతిరేకసెజ్‌ మహిళా పోరాట కమిటి ఏర్పడింది.  బొంబాయి  మహాసెజ్‌ వ్యతిరేక ఉద్యమకారిణి, ఉల్కా మహాజన్‌, మంగూళూరు సెజ్‌ వ్యతిరేక ఉద్యమకారిణి విద్యా నటేశన్‌, గోవా సెజ్‌ వ్యతిరేక ఉద్యమ కారిణి స్వాతి కేల్కర్‌ యిలా ఎందరో తమ ఉద్యమ ఆచరణలో ముందున్నారు.  ముస్లిం స్త్రీలపైన దాడులు గుజరాత్‌లో, హైద్రాబాద్‌లో యింకా యితర ప్రదేశాలలో జరిగినపుడు, క్రైస్తవ మైనార్టీ స్త్రీలపై మంగళూరులో బిజెపి ఆధ్వర్యంలో జరిగినప్పుడో మైనార్టీ ఉద్యమకారులు స్పందించారు. ఈ మధ్యకాలంలో చంద్రబాల అనే సోషల్‌వర్కర్‌ పై ఒక ఛానల్‌ అంభాండాలు వేసినపుడు, తారాచౌదరి అనే స్త్రీ  వ్యభిచార వివాదంలో యిరుక్కునప్పుడు స్త్రీవాదులు, స్త్రీ సంఘాలు స్త్రీల హక్కులకై ప్రశ్నించారు. కాని లక్షింపేట మారణహోమంలో  ఒక వర్గానికి చెందిన స్త్రీలు,  మరో వర్గంలోని స్త్రీలపై దాడి చేస్తే ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనను ఏ కారణాలచేతనో తీవ్రంగా ఖండించలేదు?  స్త్రీ ఉద్యమం స్త్రీవాద దృక్పథంతో స్త్రీలకు  అవగాహన కల్పించడంలో ఎందుకు విఫలమవుతుంది? లక్షింపేట వ్యతిరేక ఆందోళనలు జరిగినపుడు వారు దళితులకు మద్దతు తెలపాల్సింది. మరికొంతమంది మర్యాదపూర్వకమైన ప్రగతిశీల నిరసన తెలియచేసారు. ఈ ప్రగతిశీలశక్తులు మైనార్టీలు, స్త్రీల అణచివేత విషయంలో స్పందించినంతగా కుల అణచివేత విషయంలో స్పందించడంలేదు. దీన్ని బట్టి చూస్త్తే భారతదేశంలో ప్రగతి శీల భావనలోనే కుల వ్యతిరేకత ఉండే అవకాశం లేదోమోనన్పిస్తుంది. స్త్రీవాద, మైనార్టీ  ప్రగతిశీల భావాలుగల వారు మరొక్కసారి ఆత్మావలోకం చేసుకోవ డానికి లక్షింపేట ఒక సందర్భం కావాలి.
అందరూ  డిమాండ్‌ చేస్తున్నట్లుగా సిబిసిఐడి విచారణ, ప్రత్యేక కోర్టులకంటే దాడుల మూలాలను లక్షింపేట బాధితులు ప్రశ్నిస్తున్నారు. అన్యాయపు వ్యవస్థను నిలదీస్త్తున్నారు. శూద్ర, దళిత కులాలు ఐక్యమై సీట్ల బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న బహుజన రాజకీయాల పగుళ్ళ తీవ్రతను లక్షింపేట మరొక్కసారి రుజువు చేసింది. ఆయా కులాల స్థితి వల్ల దళిత బహుజనులు ఐక్యమవుతారడంలో సందేహం లేకపోయినా  అవర్ణ, (దళితులు) సువర్ణ (శూద్రులు)ల మధ్య వున్న అనేక అనైక్యతలను ఈ దాడి తేటతెల్లం చేసింది. ఈ అనైక్యత నిరోధించాలంటే  పూర్తిగా భిన్నమైన మార్గాన్నే అనుసరించాలి. అది వర్గ దృక్పథం.
అభివృద్ధి అంటే సామాజిక సంబంధాలలో మార్పుని, ఉత్పతి చేయగలిగిన శక్తి సామర్థం ఉండి, ప్రపంచీకరణ ఉత్పత్తి సంబంధంలో భాగం కానివ్వని హిందూకులాల దురహంకారానికి బలైన దళితులు భూమి వాటి వనరుల ఆధిపత్యం కోసం రాజీలేని పోరాటం చెయ్యడమే ఏకైక మార్గం. అభివృద్ధి, కుల రాజకీయ గుట్టు విప్పుతూ కార్మిక, కర్షక, విద్యార్థి మేధావి బాధిత వర్గాలతో భుజం భుజం కలిపి తమ విముక్తి కోసం ఉద్యమించడమే దళిత బహుజనుల కర్తవ్యం. (రచయిత మానవ హక్కుల కార్యకర్త, లక్షింపేట బాధితుల న్యాయవాది)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.