వంశోద్ధారకుడు పుడితే లాభమని, ఆడపిల్ల జన్మిస్తే అంతా నష్టమేనన్న ఛాందస భావాలు వర్ధిల్లుతున్న మన దేశంలో ఓ కుగ్రామం ఇందుకు పూర్తిగా విరుద్ధం. వెనుకబడిన రాష్ట్రమైన బీహార్‌లోని ఆ గ్రామంలో ఆడశిశువు జన్మిస్తే అంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. ఆడపిల్ల జన్మించిన సందర్భానికి గుర్తుగా కనీసం పది పండ్ల మొక్కలు నాటుతారు. ఆడపిల్ల జన్మిస్తే సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట వెలిసిందని వారు పొంగిపోతారు.
భాగల్పూర్ జిల్లాలోని దర్‌హర గ్రామం పేరు ‘పచ్చదనం-పర్యావరణం’ కారణంగా ఇటీవల దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. బాలికల సంఖ్య తగ్గడం, పర్యావరణ ప్రమాదం, కట్నం చావులు, పేదరికం వంటి సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు ఈ గ్రామస్థులు నడుం బిగించారు. బీహార్ తూర్పు ప్రాంతంలోని దర్‌హర గ్రామం దశాబ్దాల తరబడి వరద నష్టాలను చవిచూసేది. దీంతో గ్రామస్థులు తిండిగింజలను కూడా నోచుకునేవారు కాదు. చెట్లను ఇష్టారాజ్యంగా నరికేయడం వల్ల తమకు వరద ముప్పు కలుగుతోందని గ్రహించాక వీరు మామిడి తదితర మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. పేదరికంతో పాటు ఇతర సామాజిక సమస్యలను అధిగమించాలని గ్రామస్థులు ఏకతాటిపై నడిచారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్ల జన్మిస్తే కనీసం పది పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన భాగల్పూర్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్‌హర గ్రామం సమీపాన గంగ, కోసి నదులు ప్రవహిస్తున్నాయి. జలసంపద పుష్కలంగా ఉన్నా తమను కష్టాలు వెంటాడుతున్నాయని గుర్తించి గ్రామస్థులు విరివిగా మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఊరకనే మొక్కలు నాటేందుకు ఎవరూ ముందుకురారు గనుక, ఆడపిల్ల జననాన్ని ఒక సందర్భంగా వీరు ఎంచుకున్నారు. మొక్కలను నాటడం ద్వారా ఆడశిశువులకు వీరు స్వాగతం పలుకుతారు. ఎదిగే మొక్కల వలే ఆడ పిల్లలు పెరుగుతారని వీరి విశ్వాసం. ఇదే నమ్మకాన్ని వీరు కొనసాగించడంతో గ్రామ పరిసరాల్లో 20వేల పైచిలుకు ఫలజాతుల వృక్షాలు వెలిశాయి. గ్రామం నుంచి భారీ ఎత్తున పండ్లను మార్కెట్లకు తరలించి వీరు ఆర్థికంగా లబ్దిపొందుతున్నారు.
క్షీణించిన పర్యావరణం, భ్రూణహత్యలు, కట్నం సమస్యలు వంటి సమస్యలపై పలు దేశాల్లో నేడు ఎంతో చర్చ జరుగుతోందని, అయితే ఆడపిల్ల పుట్టినపుడు మొక్కలు నాటడం ద్వారా తాము ఈ సమస్యలను పరిష్కారం కనుగొన్నామని దర్‌హర గ్రామ పరమానంద్ సింగ్ చిన్నకుమార్తె శ్రుతి గర్వంగా చెబుతోంది. కాగా, సాంఘిక దురాచారాలు, పేదరికం తాండవించే బీహార్‌లోని చాలా పల్లెల్లో ఆడపిల్ల పుట్టిందంటే ఆర్థిక భారమని ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ పరిస్థితులను దర్‌హర సులభంగా అధిగమించింది. కట్నం చావుల మాటే ఇక్కడ వినిపించదు. ఆడపిల్ల జన్మించినపుడు నాటిన మొక్కల ధనం ఆమెకే చెందుతుంది. ఫలసాయాన్ని అందించే ఈ వృక్షాలు ఆడపిల్ల ఆస్తులే. వారి పెంపకం, విద్య, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు ఫలసాయాన్ని వినియోగిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టినపుడు నాటే మొక్కలే వారి భవిష్యత్ అవసరాలను తీరుస్తున్నాయని, ఇవి తమ పాలిట ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’ అని గ్రామ మాజీ ప్రధాన్ ప్రమోద్ సింగ్ చెబుతున్నారు. తన కుమార్తె పుట్టిన సందర్భంగా పన్నెండేళ్ల క్రితం పది మామిడి మొక్కలు నాటానని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆమె స్కూలు ఫీజులు ఇతర అవసరాలు తీరుతున్నాయని ఆయన వివరించారు. తమ కుమార్తె పెళ్లికి కూడా ఇలాగే ఫలసాయం ద్వారా మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
వరకట్నం ఆచారాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యమైనప్పటికీ, ఆడపిల్లల పెళ్లిళ్లకు తాము ఇపుడు ఆందోళన చెందనక్కర్లేదని ఇక్కడి మహిళలు అంటున్నారు. ఆడపిల్లల పేరిట ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నందున వారి భవిష్యత్ అవసరాలకు ఇబ్బంది ఉండదని వీరు ధీమాగా ఉన్నారు. మొక్కల పెంపకం వల్ల మహిళల ఆర్థిక స్థోమత పెరగడం అభినందనీయమని, ఉపాధి రంగంలోనూ వీరు ప్రవేశించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 8వేల మంది వృక్షాల ద్వారా మంచి రాబడి పొందుతున్నారు. భారీ సంఖ్యలో కూలీలకు కూడా ఉపాధి లభిస్తోంది. వృక్షాల వల్ల లభించే కలపతో గ్రామస్థులు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్ల సమయంలో ఫర్నిచర్ తయారు చేయించి ఇస్తున్నారు. శత్రుఘన్ సింగ్ (86) తన కుమార్తెలు, మనవరాళ్లు, గ్రామంలోని ఇతర ఆడపిల్లల పేరిట 25 ఎకరాల విస్తీర్ణంలో 600 మొక్కలు నాటి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక్కడి నుంచి ఏటా వేసవిలో లక్షలాది రూపాయల మామిడి పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మొక్కలు పెంచడం ద్వారా ఆడశిశువుల పట్ల ఆదరణ పెరుగుతోందని, ఇదే పద్ధతి కొనసాగితే బీహార్‌లో ఆడ, మగపిల్లల మధ్య నిష్పత్తి పెరగడం ఖాయమని సామాజికవేత్తలు అంటున్నారు. ( ఆంధ్రభూమి సౌజన్యంతో )
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags