నంబూరి పరిపూర్ణ
భారతజాతీయుల్లో అత్యధికులు హైందవ మతస్థులు. వీరిలో భాగమైన మాలలు, మాదిగలు, యితర దళితకులాలవారు – అందరూ హిందూమత విశ్వాసులనేది – సంపూర్ణ నిజం.
అయితే – ఈ దళిత జనులు – హైందవ సమాజపు చాతుర్ వర్ణ పరిధిలోనివాళ్లు గారు. పంచములన్న ముద్రతో మనుగడ సాగిస్తున్నారు. అస్పృశ్యులుగా పరిగణింపబడుతూ గ్రామాల్లోని ఆధిక్య కులాలకు బాగా దూరంగా మాల పల్లెల్లో, మాదిగవాడల్లో నివసిస్తుండడం అందరం ఎరిగిన విషయం. వర్ణవ్యవస్థచేత వెలివేయబడిన ఈ జనం, తిరిగి అదే వ్యవస్థకు చెందిన మతధర్మాలను, కర్మకాండలను అతినమ్మకంగా, అత్యంత భక్తిగా పాటిస్తుండడం విశేషం!
ఆంగ్ల పాలకులు – నిమ్నజాతుల్లోని కొద్ది శాతాన్ని క్రైస్తవంలోకి మార్చినప్పటికీ – అత్యధికశాతం దళితులు హైందవమతధర్మ నిష్ఠులే. అయితేనేమి – సవర్ణ హిందువులు మాత్రం – వీరిని తమ సాటి హిందువులుగా చూడరు, గుర్తించరు, ఆదరణ చూపరు.
ఇందుకు ప్రధాన కారణం – ఈ మతం నెలకొల్పిన వర్ణవ్యవస్థ. తిరిగి అది సృష్టించిన అసంఖ్యాక కులవ్యవస్థ. మానవుల గుణకర్మల ననుసరించి – ‘చాతుర్‌వర్ణ్యం – మయాస్రష్టం’ అంటూ భగవద్గీతలో వక్కాణించిన శ్రీకృష్ణుడు – పంచమకులసృష్టికి ఎందుకని పూనుకున్నాడుగాదో! – ఆ కొరతను హైందవం తీర్చి పుణ్యం గట్టుకుంది. పంచమ కులస్థులను అంటరానివాళ్లనీ, చూడరానివాళ్లనీ, ఛండాలురనీ ముద్రవేసి, నీచంగా, దీనంగా చూడ్డం ప్రారంభించింది. శతాబ్దాల తరబడినించీ – ఈ పంచమ బడుగుజీవులు – సాంఘిక, ఆర్థిక, వైజ్ఞానిక, పాలనారంగాల్లో ఎంతగా వెనుకబడి వున్నదీ – వారికిచ్చిన ఆ మూడు బిరుదులనుబట్టి అర్థమవుతాయి!
హైందవం – కోట్లాది దేవుళ్లు దేవతలు సృష్టించి జనంమీదికి వదిలింది. అనేక మూఢవిశ్వాసాల్ని, తాంత్రికవిద్యల్ని, శక్తిఉపాసనల్ని వ్యాప్తిలో వుంచి, ప్రోత్సహించింది. వీటినన్నిటినీ, అమాయక దళితులు, ప్రత్యేకించి దళిత మహిళలు అత్యంత విశ్వాసంతో పాటిస్తుంటారు. మత ఆదేశాల ననుసరించి, వీరు మొదటగా తమ భర్తల ధాష్టీకానికీ, హీనకులాలకు చెందినవారుగానేమో ఆ తరవాత – పైకులాల అవమాన తిరస్కారాలకు గురిఅవుతుంటారు. పలుచోట్ల అగ్రకుల భూస్వాములు దళితులపైన జరుపుతున్న దాడుల్లో – మొట్టమొదట మూకుమ్మడి అత్యాచారాలకు, హత్యలకు బలి అవుతున్నది దళిత స్త్రీలే. 1979లో ఉత్తరప్రదేశ్ నారాయణగాఁవ్‌లో, తరవాత కారంచేడు, చుండూరు దాడుల్లో, అనేక మన్యపు గిరిజనవాడల్లో అత్యాచారాలకు, హత్యలకు గురి అయ్యింది అణచబడ్డ వర్గాల స్త్రీలే గదా! దేశమంతటా – వెలుగుచూడని బడుగుల హత్యలు మరెన్నో!
కులపరమైన అణచివేతను, దోపిడీని ధర్మసహితమని, శూద్రులూ, దళితులూ అగ్రవర్ణాలకు సేవ చేయవలసినవారని హైందవధర్మం నిర్దేశించింది. అంతేగాక అది శాసించిన నీతిధర్మ సూత్రాలు పూర్తిగా పురుషపక్షంగా, పురుషాధిక్యతను ప్రతిష్టించేవిగా వున్న సంగతి తెలియనిదెవరికి! ఈ సూత్రాలు స్త్రీజాతిని క్రూరంగా అణగద్రొక్కాయి. భర్తలకు దాసీలుగా మార్చాయి. మహిళలను అస్వతంత్రులుగా, ఆర్థిక బలహీనులుగా నిలిపాయి.
ఆర్థికంగా మాత్రం యిందుకు మినహాయింపుగా వుంటారు దళితస్త్రీలు. కారణం – తమ భర్తలతో సమానంగా కష్టపడి, సంపాదించడం. భర్త దూరమైనా, కాయకష్టం చేసి, తమనూ తమ బిడ్డల్నీ పోషించుకోగల్గడం. చిత్రమేమిటంటే, వీరు సయితం, మత సంబంధిత మనుధర్మసూత్రాలకు కట్టుబడి వుంటుంటారు! మొగుడు తన కూలి డబ్బులన్నీ తాగుడికి వెచ్చించినా, రిక్షావాలా తన రోజువారీ సంపాదననంతా తాగుడికి తగలేసినా – కిమ్మనకుండా వుండి, మంచి భార్య అవుతుంది. పైగా చేపలు, మాంసము వండి వుంచనందుకు మొగుడు దండించి రభసచేస్తే భరిస్తుంది. తన కూలితోనే వండివార్చి అతగాడికీ, బిడ్డలకీ పెడుతుంది. వ్యసనాల మొగుణ్ణి, అతని దెబ్బల్ని ఎంతగా భరించితే, అంతగా పతివ్రత గుర్తింపు పొందుతుంది మరి. విద్యలేని నిరుపేద దళిత స్త్రీలలోనే ఎక్కువగా మూఢవిశ్వాసాలు పీఠం వేసుక్కూచుంటాయి. మంత్రతంత్రాల్నీ, మహాత్మ్యాల్నీ బాగా నమ్ముతారు. పిల్లలకి జ్వరమొస్తే రక్షరేఖలకు, తాయెత్తులకి పరిగెట్టడం, పెద్దవాళ్లు జబ్బుపడితే చేతబడి, బాణామతి అన్న భయంతో భూతవైద్యుణ్ణి ఆశ్రయించడం వీరిలో ఎక్కువగా చూస్తాం. చివరకు ”కళ్లకలక” కూడా ఏ దేవత ఆగ్రహం వల్లనో వచ్చిందన్న భయం!
దళిత స్త్రీలకు తమ ఊరి దేవాలయాల ప్రవేశం నిషిద్ధమవ్వడం, ఒక విధంగా కీడులో మేలనే అనుకోవచ్చు. కష్టపడితే తప్ప కడుపునిండని స్థితిలో, పైకులం స్త్రీలలా నోములు, వ్రతాలకు సమయమెక్కడ! పొద్దుపొడవగానే, ఎగాదిగా యింత ఉడకేసుకు కూలిపనికి పరిగెట్టే వీళ్లు – స్థితిమంతుల ఆచారాల్ని పట్టించుకునే వీలేది! పై కులాలవాళ్లు – వీళ్లను పూజలు, ఆచారాల ముఖమెరగని ‘హల్కీ’ జనంగా చూడవచ్చుగాక. పైవారిలాగా నిత్యం మడితడుల్లో, నోములు వ్రతాల్లో మునిగి, ఆజన్మ ఖైదీలుగా ఇళ్లలో మగ్గే కర్మ దళితస్త్రీకి లేనందుకు సంతోషించాలి.
ఆదినించీ ప్రజల్ని మతమూ, మతవిశ్వాసాలూ ఆకట్టుకుని, బ్రతుకుల్ని శాసించగలిగినట్టుగా మరే శక్తీ చేయలేదు. పురోహితవర్గం (క్లెర్జీ) కర్మసిద్ధాంతాన్నీ స్వర్గనరకాల్నీ సృష్టించి, ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి, భ్రమల్లో ముంచి తమ తమ స్వార్థాన్నీ, బ్రతుకుదెరువును నెరవేర్చుకుంటూ వచ్చాయి. దేవుళ్ల అనుగ్రహాలు, దుర్ముహూర్తాలు, దుష్ట ఘడియలు-వాటి నివారణోపాయాలు-మతాచార్యవర్గపు దోపిడీ విధానాలు అయినాయి. రాజరిక వ్యవస్థ – పురోహిత వర్గానికి పూర్తి అండదండలనిచ్చింది. వీళ్లు వల్లించే కట్టుకథలు, చేసే కర్మకాండల సాయంతో, ప్రజల్ని తన కాలికింద పెట్టుకుంటూ వచ్చింది రాజరికం. రాజు సాక్షాత్తు విష్ణ్వాంశసంభూతుడని, అతడే దేవుడని ప్రజల్ని నమ్మించారు మతగురువులు. మఠాధిపతులూ, పాలకవర్గాలూ కలిసి, దేవుడి పేరు మీద జరిపేటంతటి దోపిడీ, మరే మార్గంగానూ జరగడం లేదని మేధావులు నిర్ధారించారు. ఈ మతం -ప్రత్యేకించి -ఆంధ్రదేశపు దళిత మహిళల సౌశీల్యాన్ని, మానవతావిలువల్ని అత్యంత దారుణంగా దోపిడి చేస్తూ – ‘జోగిను లను’, ‘మాతంగిలను’ గ్రామాల పెత్తందార్లకందిస్తోంది. వాళ్ల కామతృష్ణకు బలిచేస్తోంది.
ఈ మతదోపిడీ, మతమౌఢ్యం – నేటి వైజ్ఞానిక యుగంలో మరింత వేలంవెర్రిగా, జోరుగా సాగడం – ఆశ్చర్యకరం! నేడు మతం, కులం – రాజకీయరంగం మీద వీరంగమాడుతున్నాయి. రామమందిర నిర్మాణం రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంది. క్రైస్తవ మిషనరీలు గావించిన మతవ్యాప్తి, బ్రిటీష్ వ్యాపార వర్గాల్ని, భారతదేశ పాలకులుగా మార్చింది! ఇప్పుడు మన యిరుగుపొరుగు దేశాలు కూడా ‘ఇస్లాం’ పరిరక్షణ పేరుతో తమ ప్రజను ఉత్తేజపరిచి, అదుపులో పెట్టుకోడం చూస్తున్నాం.
దళితజనులు, ప్రత్యేకించి దళిత స్త్రీలు – తాము నిష్టగా విశ్వసిస్తున్న తమ దేశీయమతం తమను వెలివేసి వుంచడం తప్ప, ఎలాంటి రక్షణ కల్పించజాలదు అన్న వాస్తవాన్ని గ్రహించవలసి వుంది.
హైందవమేగాదు, మరే మతం కూడా స్త్రీకి అందించేవి రకరకాల ఆంక్షలు, ప్రత్యేక నీతిసూత్రాలు, ఆజన్మ బానిస బ్రతుకులు. సమాజంలోని మిగిలిన స్త్రీలతోపాటు, దళిత మహిళలంతా మతాల మార్మికబోధలనించి బయటబడి, విద్యలు నేర్చుకొని, శాస్త్రీయ ఆలోచనను అలవర్చుకోవడం ఈనాటి అవసరం. డా|| అంబేద్కర్ తన నిరంతర, నిరుపమాన కృషితో – అణగారిన వర్గాలందరికోసం అనేక ప్రత్యేక రిజర్వేషన్లను సాధించారు. విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. వీటన్నింటిని సద్వినియోగపరచుకొని – అణగారిన, అస్పృశ్యులుగానే బ్రతుకుతున్న దళిత మహిళలు సాంఘిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో తమ ప్రతిభను, సమర్ధతను, వ్యక్తిత్వాన్నీ రుజువుపరచుకుందుకు ప్రతిజ్ఞ పూనాలి. సార్థక జీవులవ్వాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags