తస్లీమా నస్రీన్
అనువాదం : ఎనిశెట్టి శంకర్
ఆ రోజు నేను, ఓ విదేశీ వ్యక్తి బంగ్లాదేశ్ గూర్చి చర్చి స్తున్నాం. బహుశా ఒక మహిళ ప్రధానిగా వుండడం అతణ్ణి ఆశ్చర్యపరిచి వుండొచ్చు. ‘మీ దేశానికి ఓ మహిళ ప్రధానిగా వుందంటే – ఇక్కడ మీ మహిళలంతా స్వేచ్ఛగా వున్నారన్నమాట.’ అతని మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఆశ్చర్యపరచాయి ‘ఒక మహిళ ప్రధానిగా వుందంటే మహిళలంతా స్వతంత్రులా? ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా వుందంటే మహిళలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్గివున్నట్లా? అంటే పురుషులు, స్త్రీలు సమానంగా వున్నారనా? ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య తారతమ్యం లేదనా? కాదు. బహుశా కానే కాదు.
నేనా విదేశీ మిత్రునికి ఆ ఇద్దరు మహిళలు ఆ ఉన్నత స్థానాల్లోకి ఎలా వచ్చారు, కేవలం వాళ్ళు భర్త, తండ్రుల ప్రాపకంతో ఎలా ఆ స్థితికి చేరుకున్నదీ వివరించాను. ఆ ఉన్నత స్థానాల్లోకి వాళ్ళ శక్తి సామర్థ్యాలతో రాలేదు. ‘ప్రధానిగారూ! ఏమంటారు? – పేరెన్నికగన్న, ప్రతిపక్షనాయకిగారు! మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరించ నిరాకరిస్తారా? మీరు మీ భర్త, తండ్రుల పేరు ప్రతిష్ఠలనాధారం చేసుకొని ఈ స్థితికి వచ్చారని తెలుసు. మీ ఈ గొప్ప పదవులపట్ల నేనైతే అంత గర్వపడదలచుకోలేదు. కాని మీరు మహిళలైనందుకు గర్వపడతాను. ఐతే మీరు మహిళలుగా ఏం సాధించారు? ఉన్న చట్టాల కనుగుణంగా మసులుకోవడం తప్ప – మీరేం చేశారని గర్వపడాలి? ఈ దేశ అస్థిరత పట్ల మౌన ప్రేక్షకులుగా వున్నారు. కాని మార్పు కోసం శ్రమించడంలేదు. మన చట్టాలు పనికిరానివిగా వున్నా మీరేం చేశారని? నేను రాజ్యాంగం గూర్చి గాని, ద్రవ్యోల్బణం, ఓట్లు మొ|| వాటి గూర్చి గాని అడుగుతలేను. నా ఆశ, ఆవేదన, ఆలోచనంతా స్త్రీల గూర్చి – బలహీన, అంధ, చెవిటి, మూగ, అత్యాచారాలకు గురైన, క్రుంగి, కృశించి అలసి సొలసిపోయిన ఈ మూడవ ప్రపంచ స్త్రీల గూర్చి.
మీరు రాజకీయాల్లోకి అడుగిడగానే తలలపై కొంగులు కప్పుకొన్నారు. మరి మగవాళ్ళు ఎప్పుడూ తలలపై టోపీలు ధరించరే!?
ఇస్లాం మహిళలు తలలపై (ఆచ్ఛాదనం) కప్పుకోవాలని ఆదేశిస్తే, పురుషులు టోపీలు పెట్టుకోవాలని, గడ్డాలు పెంచుకోవాలని ఆదేశిస్తుంది గదా! ఈ దేశంలో మతపరమైన ఆంక్షలు స్త్రీలపై వున్నంతగా పురుషుల మీద లేవు – దీనికేమంటారు? ఓ గౌరవ, పేరున్న ప్రధానిగారు! ప్రతిపక్షనాయకులుగారు! నాకు తెల్సు – మీలో ఏ ఒక్కరికీ తలలపై (ఆచ్ఛాదనం) కప్పుకోవటం అలవాటుగా లేదు. కళాశాల, విశ్వవిద్యాలయంలో చదివిన ఒక స్త్రీ లెఫ్టినెంట్ జనరల్‌కు భార్య అయిన ఒక స్త్రీకి తలలపై కప్పుకునే అలవాటు లేదని నాకు తెల్సు. మీమీ పురుష రాజకీయ నాయకులు హెచ్చరించినందుకు, ప్రజల్లో ఓ విశ్వాసాన్ని పొందాలనీ మీరు మీ తలలను కప్పుకుంటున్నారు. కాబట్టి మీరిప్పుడు సామాన్యులు మీ పక్షం నిలబడ్డారని తలుస్తూ ఆశిస్తూ మీరు కదులుతున్నారు. అంటే ఇలా చేయడం వల్ల ఎవరినో కాదు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మరిచిపోని విషయం – మరుద్దామన్నా మరువలేని విషయం ఏమిటంటే – మనం స్త్రీలుగా పుట్టడం కాదు – క్షణక్షణం ‘స్త్రీత్వం’గూర్చి మనకు విధించిన ఆంక్షల గూర్చి మనం ఎప్పుడూ జ్ఞప్తి పెట్టుకోవాలనే ఈ సమాజం నిర్దేశిస్తుంది. మహిళలుగా మనల్ని ఎప్పుడూ నియంత్రిస్తుంది. మన ముందు, వెనుక, కుడి, ఎడమ – చుట్టూ వున్న ఈ ఆంక్షలు, కట్టుబాట్ల గూర్చి ఆలోచించారా? మీరు ఆలోచించాలి. మీరు విధిగా ఆలోచించాలి. ఎప్పుడన్నా, మహిళలుగా, అధికారంలో వున్న స్త్రీలుగా మీరు ఈ కట్టుబాట్లను దూరం చేయడం గూర్చి ఆలోచించారా? ఆలోచించాలి. మీ చేతుల్లో ఇప్పుడు అధికారపగ్గాలున్నాయి. మీచేతుల్లో అధికారం వుంది. ఎప్పుడూ కొద్ది మంది పురుష నాయకుల ఆలోచనలకనుగుణంగా నర్తించేబదులు – కొన్ని – కొన్నింటినైనా స్త్రీలను బానిసలుగా చూసే ఈ పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించలేరా? వాటికి వ్యతిరేకంగా ఎదిరించలేరా? గొంతెత్తగలరా? ఈ రోజు మహిళలపై ఆసిడ్లు పోయడం, రేపు అత్యాచారం, ఎల్లుండి హత్య ఇవన్నీ రొటీన్‌గా మనదేశంలో జరుగుతున్న అకృత్యాలే గదా! చట్టంలోని లొసుగులనాధారం చేసుకొని నేరస్థులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారు. ఈ లొసుగులను మీరు సవరించలేరా? మేడం! మీ అచంచల ధైర్యసాహసాలను ఎప్పటికీ కొనియాడ్తాను. మీ గూర్చి గర్వపడ్తాను. మన దేశీయులంతా మీకు అత్యున్నత గౌరవాన్నివ్వాలని కోరుకుంటాను.
అసంఖ్యాక కార్ల సందడి, సైరెన్ మోతల మధ్య, గట్టి పటిష్ఠ భద్రతల మధ్య మీ రాక మాకు తెలుస్తుంది. నాలాంటి అతి సాధారణ స్త్రీలకెలాంటి భద్రతా లేదు.
మేడం! ఒక్కసారి – ఒక్కసారి మా సాధారణ మహిళల మధ్య నడవండి – ఈ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న ‘పురుషాధిక్యత, ఆడవాళ్ళను అంగడి సరకులుగా అమ్మే విధానం వ్యభిచారులుగా మారుస్తున్న పరిస్థితుల్ని మీరు కళ్ళారా చూడండి. నా ఈ విన్నపాన్ని ప్రతిపక్షనాయకులైన మీక్కూడా వినిపిస్తాను. మీరెప్పుడైనా ఈ ఫుట్‌పాత్ మీద నడిచి 20, 30 టాకాలకు అమ్ముకో బడుతున్న అసంఖ్యాక దీన స్త్రీలను చూశారా? కనబడ్తలేదా? మనం – మనమే (కారుచౌకగా) అమ్మబడ్తున్నట్లు కనబడ్తలేదా? అక్కడ ఒక స్త్రీ కూరగాయల కంటే ఏమంత విలువైనది కాదనే భావన కల్గుతలేదా? నేను ధైర్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా రాజకీయాల్లో మీరెంతటి ఉన్నత స్థానంలో వున్నా – ఈ స్త్రీలను అంగడి వస్తువుగా చూసే/మార్చే విధానాన్నుంచి మీరు తప్పించు కోలేరు.
మహిళలుగా మీరే ఈ వ్యభిచార గృహాలను మూసేయించి, (వ్యభిచారిణులు) ఈ బాధితులకు పునరావాసం కల్పించకుంటే ఎవరు కల్పిస్తారు? ప్రప్రథమంగా మీరు మహిళలా? లేక భర్తల, తండ్రుల వారసత్వం పుణికిపుచ్చుకున్న ప్రజా ప్రతినిధులా? మీ సంబంధీకుల హత్యలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం కోసం రాజకీయాల్లోకి రావడమనేది వేరే విషయం. కాని ఉన్నత విలువలతో ఆకర్షింపబడ్డవారుగా – బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే – యుగాలుగా వస్తున్న పురుషాధిక్య సమాజాన్ని కొరడాతో ఝలిపించాలనుకుంటే – పెళ్ళి కూతుళ్ళ హత్యలు తగ్గాలనుకుంటే – కిడ్నాపింగ్, రేప్ అత్యాచారాలను, వ్యభిచారాన్ని అరికట్టాలనుకుంటే – సమాజాన్ని పట్టి పీడిస్తున్న జెండర్ వివక్షను అరికట్టాలనుకుంటే – మీరు పురుష నాయకుల కంటే మరింత కట్టుదిట్టంగా పకడ్బందీగా కృషి చేయగలరని నా భావన.
ఆస్తిపాస్తులు విలాసవంతమైన జీవితానికి సోపానాలే కావచ్చు – కాని అవి సామాజిక అంతస్థుకు చిహ్నాలు కూడా. వంశపారంపర్యంగా వస్తున్న ముస్లిం చట్టాలు స్త్రీలకు ఎప్పుడూ అన్యాయం చేసే విధంగా వున్నాయి. ఒక స్త్రీ మరణిస్తే, భర్తకు నాలుగవవంతు ఆస్తిదక్కుతుంది. ఒకవేళ వాళ్ళకు పిల్లల్లేకుంటే అతనికి సగం ఆస్తి ధారాదత్తం. అదే ఒక భర్త చనిపోతే భార్యకు ఎనిమిదవవంతు ఆస్తి దక్కుతుంది. ఒక వేళ పిల్లల్లేకుంటే 1/4 వంతు ఆస్తి. ఎందుకీ స్త్రీ పురుషుల ఆస్తి పంపకంలో వివక్ష? ఈ వివక్ష కొడుకులు, బిడ్డల మధ్య కూడా చూస్తాం. తల్లితండ్రులిద్దరూ చనిపోతే ఆ ఆస్తికి కొడుకు వారసుడు. అదే ఒక వేళ కూతురు ఒక్కతే వుంటే కేవలం సగం ఆస్తికే వారసురాలు. గౌరవ ప్రధాని, ప్రతిపక్ష నాయకులు! ఈ వివక్ష ఇప్పటికీ ఎందుకున్నదో వివరించగలరా? జెండర్ వివక్షను రూపుమాపితే వర్గ వివక్షత నిర్మూలన కోసం దారివేయడమేకదా!
మీరిది చేయలేని పక్షంలో యావత్ ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వపరం చేయొచ్చుగదా! బహుశా మీరు చేయలేకపోవచ్చు – ఎందుకంటే పెట్టుబడిదారీ విధానంతో సాగుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మత శక్తుల ప్రాబల్యం, వారి కనుసన్నల్లోవున్న మీ అధికార పీఠం చేయనివ్వకపోవచ్చు. ఇస్లాం, విదేశీ సహాయం మొ|| వాటి చేత మీరు వెనుకడగు వేస్తే మిమ్మల్ని మీ భర్తల తండ్రుల నిజమైన ప్రతినిధులనవలసిందే. మీరు వాళ్ళ ఆలోచనల్ని, ఆశయాల్ని చెక్కుచెదరనీయకుండా రక్షించే నమ్మినబంటులన్నమాట.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags