కొండవీటి సత్యవతి
జూపాక సుభద్ర కవిత్వసంపుటి ‘అయ్యోయ్యో దమ్మక్కా’ గురించి రాద్దామని కూర్చున్నపు నా చిన్నపుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. మా ఊరు సీతారామపురం చాలా చిన్న గ్రామం. ఇక్కడ మాములుగా అన్ని గ్రామాల్లోను ఉండే వివిధ వృత్తుల వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక కమ్మరి ఉన్నట్టు గుర్తు. మా ఊరిలోకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు మీద ఎర్ర బస్సు దిగి ఓ కిలోమీటర్ నడవాలి. ఇప్పటికీ అంతే. అయితే కొత్తతరం బైకులు కొనుక్కొన్నారు. ఆడవాళ్ళు నడిచే వెళ్ళాలి. బస్సు దిగి నడుస్తుంటే మొదట ఎదురయ్యేది మాలపల్లి. రోడ్డుకి అటూఇటూ ఓ పదిపదిహేను తాటాకుల ఇళ్ళుండేవి. మా నాన్నతరం మాల కుటుంబాల వాళ్ళు భార్య భర్తలిద్దరూ మా పొలాల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు మా ఇళ్ళకు వచ్చేవాళ్ళు కానీ మా వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు కాదు. ఆ ఊరిలో నేను కాస్త చదువు వెలగబెడుతున్నందువల్ల నేను మాలపల్లిలోని ఇళ్ళకి వెళ్ళేదాన్ని. వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళేదాన్ని. అలా మాలపల్లితో పరిచయం వుండింది. అయితే మాదిగగూడేలతో అసలు, అసలు సంబంధం లేదు. అప్పట్లో మాదిగలు అంటే మాకు తెలిసింది రెండు విషయాలే. ఒకటి వాళ్ళు డప్పు కొడతారు. రెండు ఊళ్ళో చచ్చిన పశువుల్ని మోసుకుపోతారు. ఓ సారి వాళ్ళు మా ఇంట చనిపోయిన గేదెను చాలా కష్టపడి మోసుకెళుతుంటే మా చిన్నాన్న అన్నమాట నాకు బాగా గుర్తు. ” ఒరేయ్! రెండు జతల చెప్పులు కుట్టుకురా” అని ఆర్డర్ వెయ్యడం. చచ్చిన గేదె నుంచి చెప్పులెట్లా వస్తాయో అర్థం కాని వయస్సు.
మాదిగలు మా ఊళ్ళో ఎక్కడుంటారో చాలా కాలంవరకు తెలియదు. కొంచం పెద్దయ్యాకా తెలిసింది నాకు వాళ్ళు మా ఊళ్ళో వుండరని. ఊరి అంచుమీద, బయట వుంటారని. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే సుబ్బారాయుడు షష్టి తీర్ధానికెళ్ళినపుడు అక్కడికి దగ్గరలోనే వున్న మాదిగ గూడాన్ని తొలిసారిగా చూసాను. నాలుగైదు గుడిసెలే గూడేమంటే.
ఆ కాలంలో మాల, మాదిగల్ని పిలవాలంటే మాల నా కొడుకు, మాదిగ నా కొడుకు. ఇవే పిలుపులు. మాల స్త్రీలను చూసాను కానీ మాదిగ స్త్రీలను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ కట్టుబొట్టు, జీవనశైలి…ఊహూ…ఏమి తెలియదు. వాళ్ళ ఇళ్ళవేపు కన్నెత్తి చూస్తే కదా ఏమైనా తెలియడానికి?
ఈ నేపథ్యంలోంచి నగరానికొచ్చిన నేను జూపాక సుభద్ర, కయితల దొంతి ”అయ్యోయ్యో దమ్మక్కా…” పుస్తకానికి సమీక్ష రాయడానికి చాలాకాలం వెనుకాడాను. సుభద్ర ఎన్నిసార్లు అడిగినా రాస్తాను.రాస్తాను అంటూ నాన్చాను గాని రాయలేదు. ఈ పుస్తకానికి సమీక్ష రాయాలంటే నా పునాదుల్లోకి వెళ్ళే దమ్ము నాకుండాలి. అపుడే దమ్మక్క గురించి రాయగలను.
30 కవితలున్న ఈ పుస్తకం చదవడం, చదివి అరిగించుకోవడం చాలా కష్టం. బానిసకొక బానిసగా రెండు రకాల వివక్షతలతో సతమతమయ్యే దళిత స్త్రీ రూపం రెండు కళ్ళ ముందు కొచ్చి కన్నీరు పెట్టిస్తుంది. సౌకర్యాల సాగరాల్లో ఊయలలూగుతూ బతికే వర్గాల వారి ఊహకు కూడా అందని వాడ, గూడేల జీవితాలు ఈ పుస్తకం నిండా పరుచుకుని వున్నాయి. ‘అబ్బ! ఇంత చిన్న గుడెసెలో ఎలా వుంటారో? ఎలా బ్రతుకుతారో అంటూ ఆశ్చర్యార్థకాల ముఖాలతో తెల్లబోయే వాళ్ళ చెంపలు చెళ్ళుమనేలా, తరతరాల నుంచి గుడెసెల్లోనే. పుట్టుక, పెరుగుదల, పెళ్ళిళ్ళు, పిల్లలు, చావులు అన్నీ..అంటూ విప్పి చూపించే సుభద్ర రాతల్ని చాలా లోతుగా అధ్యయనం చెయ్యాలి. దళిత స్త్రీ రెండు రకాల అణిచివేతని, ఆమె దు:ఖాన్ని అర్థం చేసుకోవాలంటే మన గుండె విప్పి ఆమెను లోనికి ఆహ్వానించాలి. ఆమె సమస్యను ఆవాహన చేసుకోవాలి. అపుడే ఆమె అర్థమౌతుంది. ఆమె సమస్యా అర్థమౌతుంది. ఇది పుస్తక సమీక్ష కాదు. పుస్తక పరిచయం మాత్రమే. జూపాక సుభద్ర కలం పాళీయులుకు కన్నా పదునైంది. అది ప్రతి కవితలోను కనబడుతుంది. మట్టిపూల సుభద్రకి మనసారా అభినందనలు.
అయ్యయ్యో దమ్మక్కా… కయితల దొంతి
జూపాక సుభద్ర
దండోరా ప్రచురణలు
వెల రూ. 50