మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం ను మళ్ళొకసారి తలుచుకునే సమయం వచ్చింది. మహిళా పోరాట దినంగా అన్ని దేశాల స్త్రీలు జరుపుకునే ఈ దినం గొప్ప స్ఫూర్తిని మహిళోద్యమానికి అందించింది. వందేళ్ళకుపైగా ఈ స్ఫూర్తి కొనసాగుతూనే వుంది. హక్కులకై ఉద్యమిస్తున్న స్త్రీలు పోరాట దినంగా చూస్తే, ప్రభుత్వాలు మార్చి ఎనిమిదిని పండగలా మార్చాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ ప్రభుత్వాలు ఆర్భాటంగా జరపడం చూస్తున్నాం. ఏదో ఒక కొత్త స్కీమును ప్రకటించడం, మహిళల హక్కుల కోసం మా ప్రభుత్వాలు కట్టుబడి వున్నాయి అని ప్రకటించుకోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొన్ని వ్యాపార సంస్థలు, ముఖ్యంగా పాండ్స్, ఫెయిర్ &లవ్లీ లాంటి కార్పోరేట్ వ్యాపార సంస్థలు మార్చి 8 ని మార్కెట్ సరుకుగా చెయ్యడం, తమ ఉత్పత్తుల ప్రచారానికి, అమ్మకాలకి వాడుకోవడం కూడా జరుగుతోంది.
ఈ సంవత్సరం మార్చి ఎనిమిదికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. క్రితం సంవత్సరం డిశంబరు 16న ఢిల్లీలో నిర్భయమీద జరిగిన లైంగిన దాడి, పర్యవసానంగా మృత్యువుతో పోరాడి ఆమె చనిపోవడం యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ప్రతి వొక్కరి చేత కన్నీరు పెట్టించిందీ దుస్సంఘటన. దుఃఖావేశంతో యువత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ వీధుల్లో కదంతొక్కింది. చలిని, చన్నీళ్ళ క్యాన్లని, రబ్బర్ తూటాలను లెక్కచేయకుండా రోజుల తరబడి రాత్రింబవళ్ళు రోడ్లమీద నినదిస్తూ ఉండిపోయారు. సంఘటన జరిగిన ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, యువత ఎన్నో భిన్నమైన మార్గాల్లో తమ నిరసనని, ఉద్రేకాన్ని, దుఃఖాన్ని వ్యక్తం చేసి నిర్భయకి సంఘీభావం, సంతాపం తెలియచేసారు.
భూమిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో జరిగిన మౌన ప్రదర్శనలో వందలాది మంది మహిళలు, పురుషులు, యువజనం పాల్గొన్నారు. నోటికి నల్లగుడ్డ కట్టుకుని తమ తీవ్ర నిరసనని వ్యక్తం చేసారు. మునుపెన్నడూ జరగని రీతిలో మీడియా రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను ఈ మౌన ప్రదర్శనని దేశ ప్రజలకి చూపించింది.
ఆ తర్వాత ఓ ఆర్ధరాత్రి ట్యాంక్ బండ్ మీద జరిగిన ”మిడ్నైట్ మార్చ్”లో వేలాది మహిళలు పాల్గొని ‘పగలు మాది, రాత్రి మాది… అర్ధరాత్రి కూడా మాదే’ అంటూ ఇచ్చిన నినాదాలు ట్యాంక్ బండ్ మీద హోరెత్తాయి. నాలుగైదు గంటలపాటు సాగిన ఈ మార్చ్, అందులో పాల్గొన్న ప్రజలు నిర్భయకు జరిగిన దారుణ అన్యాయాన్ని నిలదీస్తూ, ఆమెకు న్యాయం జరగాలని గొంతుచించుకుంటూ నినాదాలిచ్చారు. హైదరాబాదులో జరిగిన మౌన ప్రదర్శన, మిడ్నైట్ మార్చ్‌లను చారిత్రాత్మకమైన సంఘటనలుగా చూడాల్సి వుంటుంది. జనాగ్రహం ఎలా వుంటుందో ఢిల్లీ యువత చూపిస్తే, హైదరాబాద్ బాధితుల పక్షాన నిలబడుతుందని ఈ రెండు సంఘటనలు రుజువు చేసాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 14న ‘ఒన్ బిలియన్ రైజింగ్’ స్త్రీలపై హింసకి వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం పేరుతో ముప్ఫైరెండు సంఘాలు కలిసి నెక్లెస్ రోడ్లో పెద్ద ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత బహిరంగ సభను జరిపి స్త్రీలపై హింసను ఇంకెంత మాత్రం సహించబోం అంటూ నినదించారు. మొట్ట మొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాలలో ప్రజలు ఇళ్ళ నుంచి, ఆఫీసుల్నించి, ప్యాక్టరీల నుంచి వీధుల్లోకి వచ్చి హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజలు తమ గళాన్ని విప్పారు. ఈ శతకోటిలో హైదరాబాద్ ప్రజలు కూడా మమేకమవ్వడం ఓ గొప్ప చారిత్రక సంఘటన.
ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రభుత్వం జస్టిస్ వర్మ కమీషన్ వెయ్యడం, ఒక ఆశావహమైన రిపోర్ట్‌ను ఆయన ప్రభుత్వానికి సమర్పించడం జరిగినా, ప్రభుత్వం మాత్రం తనదైన ధోరణిలో హడావుడిగా ఒక ఆర్టినెన్స్‌ను తేవడం, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన మరణ శిక్షను అందులో చేర్చడం అనేది అత్యంత విషాదకరమైన అంశం. దీని మీద దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఆర్డినెన్స్ తేవడంలో మహిళల హక్కులపట్ల నిబద్ధత కన్నా, ఒక రాజకీయ ఎజండాకి ప్రాధాన్యత నివ్వడం క్షంతవ్యం కాదు. సమగ్రమైన చట్టం కోసం ఉద్యమించడం తప్ప మనముందు మరో దారిలేదు. ప్రతిరోజూ వందల్లో స్త్రీలమీద అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. మార్చి ఎనిమిది పోరాట చైతన్యంతో, మహిళలపై అమలవుతున్న అన్ని రకాల హింసల నిరోధానికి సమగ్రమైన చట్టం కోసం పోరాడడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. పదండి! మన పోరాట రూపాలకు పదును పెడదాం!!!