రమాసుందరి
ఉక్కపోత, ఉక్కపోత!
మంచుకొండల్లో, ముసిరే చలిలో
ఉక్కపోత, ఉక్కపోత!
శీతల పవనాలలో, సంధ్యా వాహ్యాళిలో
ఉక్కపోత, ఉక్కపోత!
ఏ.సి. గదిలో, నా సావాసాల్లో కూడ ఉక్కపోత!
నా ఆహార్యాన్ని, అలంకరణను గమనిస్తున్న ఉక్కపోత!
నా కదలికలను శాసిస్తున్న ఉక్కపోత,
నా కలాన్ని దిద్దిస్తున్న ఉక్కపోత!
నా నవ్వును, మాటను రహస్యంగా ఎవరో ఆలకిస్తున్న ఉక్కపోత!
నే చదివే పుస్తకాన్ని, దాన్ని వెన్నంటే నా ఆలోచనను ఎక్కడో
ఊహిస్తున్న ఉక్కపోత!
నా హృదయపు పొరలను గాలిస్తున్న ఉక్కపోత!
నా శ్వాసను బంధిస్తున్న ఉక్కపోత, నా ఊపిరిని నియంత్రిస్తున్న ఉక్కపోత!
మర్చిపోయాను!
దీన్నే ప్రేమంటారని అన్నావు కదూ!