– మల్లవరపు విజయ
వెన్నెల రాత్రి పండు వెన్నెల రాత్రి
కవిత్వమల్లే కవులకు
అది ఒక కమ్మని రాత్రి
రచనలు సలిపే దిట్టలకది
ఒక రమ్యపు రాత్రి
కడు రమ్యపు రాత్రి – కాని –
రక్కసి చేతుల మ్రగ్గిన
మగువల కది ఒక మృగ్యపు రాత్రి
కుంకుమ చెదిరిన విధవలకది ఒక
హేళన రాత్రి, అవహేళన రాత్రి
అయినా అది వెన్నెల రాత్రే, పండు వెన్నెల రాత్రే
వలపుల రేపే ప్రియులకు
అది ఒక వసంతరాత్రి
వివాహమొందిన దంపతులకది
ఒక ముత్యపు రాత్రి
ఆణిముత్యపు రాత్రి – కాని –
భగ్న ప్రేమికులకది ఒక భీకర రాత్రి
కసాయి చేతిలో బలి అయిపోయే
అసహాయ జీవికి అంతిమ రాత్రి
అది ఒక అంత్యపు రాత్రి, ప్రాణాంతక రాత్రి
అయినా అది వెన్నెల రాత్రే పండువెన్నెల రాత్రే
పసికూనలకది లాలనా రాత్రి
పడుచు వారికి అది ఒక పండుగ రాత్రి
పరమ పండుగ రాత్రి – కాని –
బాధలు తీరని బీదలకది ఒక శోకపు రాత్రి
ఆ భాదలనెరుగని భోగులకది ఒక బంగరు రాత్రి
అయినా అది వెన్నెల రాత్రే, పండు వెన్నెల రాత్రే
మొరటు చేతులలో మ్రగ్గిపోయే
గులాబికది ఒక కఠోర రాత్రి
కవులకు కావ్యమై రచనకు సారమై
గానాలాపములు సలిపే కోకిలకది ఒక
వసంత రాత్రి నిత్య వసంత రాత్రి