కుప్పిలి పద్మ
నగరాలని ఆధునీకరణ చెయ్యాలనే నిర్ణయాలు తీసుకొన్నప్పట్నుంచి, నగరాలలో నైట్ లైఫ్ వుంటేనే నగరం అత్యాధునికతని సంతరించుకొంటుంది కాబట్టి నగరంలో నైట్ లైఫ్ అనేది పాలసీలో భాగమైంది. యీ పాలసీలు చేస్తున్నప్పుడు స్త్రీలకి సంబంధిం చిన సేఫ్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసలు స్త్రీల స్వరమే కనిపించని, వినిపించని ప్రాంతాలు చాలా వున్నాయి. అందులో ప్రధానమైనది నగరాలలో పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్.
నగరాన్ని అభివృద్ధి చేసే సమయంలో అనేకానేక మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్, పబ్స్, మల్టీప్లక్స్, స్పా సెంటర్స్, జిమ్స్, హెల్త్‌క్లబ్స్, ట్యూషన్ సెంటర్స్ సూపర్ బజార్స్ యిలా అనేకానేక వాణిజ్య సముదా యాలు వెలిసాయి. వీటితో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు, కాల్ సెంటర్లు వుండనే వున్నాయి. వీటన్నింటిలో స్త్రీలు పెద్ద యెత్తున వుద్యోగాలలో ప్రవేశించారు. సాయంకాలం ఐదు గంటలకో, ఆరు గంటలకో పని చేస్తున్న ప్రదేశం నుంచి యిళ్లకి బయలుదేరే పద్ధతి యెప్పుడో పోయింది. నైట్ షిప్ట్స్‌లో పనిచేస్తున్నారు. రాత్రి పది, పదకొండు వరకు పని చేస్తున్నవాళ్లు వున్నారు. పనిచేసే ప్రాంతానికి, యింటికి దూరమూ యొక్కువే. యీ కొత్తగా పనిని కలిపిస్తున్న వాణిజ్య మంతా యెక్కువగా కొత్త సిటీలోనే వుంది. యిక్కడ యింటి అద్దెలు చాలా యెక్కువ. చాలా కొద్దిమందికి మాత్రమే యిళ్ళు, హాస్టల్స్ దగ్గర.
సాఫ్ట్వేర్ రంగంలో పని చేసేవారికి క్యాబ్‌లో పికప్ డ్రాపింగ్ పద్దతి వుంది. కొన్ని కంపెనీలకి, హాస్పటల్స్‌కి స్టాఫ్‌ని వారి వారి సంస్థలకి సంబంధించిన బస్సులో మిని వ్యాన్స్ వుండటంతో వుద్యోగస్థులకి పికప్ డ్రాపింగ్ సర్వీసుని యిస్తున్నారు. కానీ చాలా సంస్థల్లో పని చేసేవారికి యిలాంటి సౌకర్యం లేదు. యీ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగ్గా వుందా అంటే అదీ లేదు.
రాత్రివేళ యిళ్లకి బయలుదేరిన స్త్రీలకి కొంత దూరం షేరింగ్ ఆటోల్లోను, మరి కొంత దూరం బస్సుల్లోను వెళ్లి, ఆ బస్సు దిగిన చోట నుంచి యింటికి వరకు నడిచి వెళతారు. చాల చోట్ల రాత్రి దీపాలుండవ్. ప్రతి రోజు స్త్రీలు యింటి చేరుకోటానికి దాదాపు గంట నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. యిదంతా రాత్రి పూట 8 గంటల నుంచి 12 గంటలలోపు జరుగుతుంది. యీ మొత్తం ట్రావెల్‌ని మాని టర్ చేసే సిస్టమ్స్ మనకింకా ఇవాల్వ్ కాలేదు.
గత కొంత కాలంగా స్త్రీలపై బహిరంగ ప్రదేశాలలో జరుగుతోన్న హింసని చూస్తుంటే మన నగరాలు యీ విషయంలో స్త్రీలకి సంబంధించి భద్రత గురించి యేమా లోచిస్తోందని మనం తెలుసుకోవలసి వసరం వుంది. మనం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ని యెలా మెరుగుపరుచుకోవాలి. ఆర్గనైజడ్ సెక్టర్ అయినా అన్ఆర్గనైజడ్ సెక్టర్ అయినా వుద్యోగం వుద్యోగమేగా. అందరి భద్రతా ముఖ్యమేగా. అది యీవ్టీజింగ్ కావొచ్చు. అత్యాచారం కావొచ్చు. అసలు స్త్రీలు కనిపిస్తే చాలు వాళ్లని యేమైనా అనొచ్చు లేదా వారిని యెలాగైనా హింసిం చొచ్చు అనుకొనే మానసిక ధోరణి మగవారిలో పెరుగుతున్న నేపథ్యంలో మనల్ని మనం రక్షించుకోటానికి మనకున్న సెల్ఫ్ డిఫెన్సివ్ మెధడ్స్ యెన్ని వున్నా మనకి మన ప్రభుత్వాలు, మనం పని చేస్తున్న సంస్థలు వుద్యోగులందరికి స్థాయి బేధం లేకుండా రాత్రిపూట మనం మన యిళ్లకి చేరుకొనే అవకాశం కల్పించాలి.
పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కావాలనుకొనే మీకు యీ విషయంలో యిలాంటి పట్టింపు యేంటని లేదా అలాంటి వుద్యోగాల్లోకి వెళ్లకండనో యెవరైనా ఆకతాయిగా అంటే పురుష ధృక్పథం మా దృక్పథంతో సమానంగా యెదగనప్పుడు మాకు అదనపు భద్రత చాలా చాలా అవసరం అని నిక్కచ్చిగా నిర్మొహ మాటంగా చెప్పాల్సిందే.