జరిగే విభజన మంచికని అనుకోవటమే మనపని!

– జి.వి. రామ్‌ ప్రసాద్‌

తెలంగాణా సమస్యను ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్‌ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి రాస్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్‌ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవిన్యూ లేదంటూ సీమాంధ్రలోని శక్తివంతమయిన వర్గాలయిన రాజకీయ పార్టీలు, ఉద్యోగస్తులు ఏకమై యావత్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టించి జై సమైఖ్యాంద్ర అంటూ ఓ ఆదేశిక టోన్‌తో నినాదాలు చేయిస్తూ సమ్మెలు, బంద్‌లు చేస్తూ గత నలభై రోజులకుపైగా సామాన్య బడుగు జనాలను, విద్యార్థులను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. విభజన వలన వచ్చే సమస్యలను తెలియచేయాల్సిన బాధ్యత, హక్కు అన్ని రాజకీయ పార్టీలకు, ఉద్యోగస్తులకు, మీడియా వారికి వున్నది. కాని రాష్ట్ర విభజన జరగటానికి వీల్లేదు. ‘జై సమైఖ్యాంధ్ర’ ఒక్కటే అమలు చేయాలని డిమాండ్‌ చేసే హక్కు ఎవరికీ లేదు.

ప్రియమైన విద్యార్థుల్లారా! పెద్ద మనుషుల ఒప్పందాలతో, ముల్కీ రూల్స్‌తో, ఆరు సూత్రాలతో, 610 జి.ఓ.లతో, ఆజోన్‌లతో, ఈజోన్‌లతో కూడుకున్న హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేని, ఎన్నో తారతమ్యాలున్న ‘సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌’ అనే జైలు నుండి మీరు బయట పడితేనే మీకు, యావత్‌ తెలుగు ప్రజలకు భవిష్యత్‌ ఉంటుంది. అసలు హైదరాబాద్‌లో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? విడిపోతే కొత్త రాజధానిలో రావా? ప్రతిభ వుంటే ప్రైవేట్‌ కంపెనీలలో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం పొందగలిగే ఈ రోజుల్లో హైదరాబాద్‌లో ఎందుకురావు? మా తాతలు తవ్వించిన నుయ్యి, ఆ ఉప్పు నీటినే త్రాగు తూ బ్రతుకుతానంటే ఎట్లా? హైదరాబాద్‌పై లేనిపోని ఆందోళనలకు స్వస్తి చెప్పి మీ చదువులలో మీరు నిమగ్నమవ్వండి.

ప్రియమైన రైతుల్లారా! నీటి సమస్య లంటూ సి.ఎమ్‌తో సహా వాలు-ఈలు, గాలిపాటు చూసుకొనే కొంతమంది రైతాంగ రాజకీయ వేత్తలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు వ్యవసాయాన్ని దివాళా తీయించిందెవరు? రైతుల ఆత్మహత్యలకు కారణంగా వున్న ఈ వ్యవస్థకు కారకు లెవరు? నీరు పుష్కలంగావున్న గోదావరి డెల్టాలో ‘క్రాప్‌ హాలిడే’ ప్రకటించు కునే దుస్థితి కల్పించిందెవరు? సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌లోనే నీటి విడుదలలో న్యాయం చేయకుండా రైతులను గాలికి వదిలేసిన వారు భవిష్యత్తులో చేస్తారా? ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల సత్వర పూర్తి కై రైతులంతా సమిష్టిగా పోరాడి పూర్తి చేయించుకుంటేనే వ్యవసాయానికి నికరమయిన మనుగడ లభిస్తుంది గాని రాష్ట్రం కలసి వుంటేనో లేక విడిపోతేనో గాదు.

ప్రియమైన ఉద్యోగస్తుల్లారా! రాష్ట్రం ఒకటిగా వుండాలి లేదా రెండు, మూడుగా చేయాలా అనేది అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల నిర్ణయం. మీకు ఉద్యోగ రీత్యా ఎదురయ్యే సమస్యలు తెలుపుకొని పరిష్కరించుకోవాలే గాని ‘జై సమైఖ్యాంధ్ర’ అంటూ జెండా పట్టుకుని సమ్మెలకు దిగటం సరికాదు. కొందరికి బాధ కల్గించే విషయమే అయినప్పటికీ వారి కోసమని కోట్లాది మంది ప్రజల మధ్య తలెత్తిన విభజన సమస్యను పరిష్కరించకుండా పార్టీలు, ప్రభుత్వాలు ఎంత కాలము విస్మరిస్తాయి? అయినా బాధలు లేనిదెవరు? అత్యధిక శాతం ఉద్యోగస్తులచే ప్రజలు బాధలు పడటం లేదా?ప్లాట్‌ కొనుక్కుంటే రిజిష్ట్రేషన్‌కు లంచం. ఇల్లు అనుమతికి లంచం, పైప్‌ కనెక్షన్‌కు లంచం, ఎలక్ట్రిక్‌ మీటర్‌కు లంచం, హాస్పిటల్‌లో చేరాలంటే లంచం, శవం తీసుకుపోవాలంటే లంచం, వివాహ, జనన, మరణ, కుల సర్టిఫికేట్‌లకు లంచం. అంతెందుకు మీ పి.ఎఫ్‌. పెన్షన్‌లకు సంబంధించి మిమ్మల్ని మీరే పీక్కుతినే వ్యవస్థ! కొత్తగా పరిశ్రమలు పెట్టే వారిని, వ్యాపారాలు పెట్టే వారిని మూడు చెరువులు నీళ్ళు తాగించి మూడు జేబులూ నింపుకుపోయే మీరు, సాటి తెలుగోడ్ని ఆఫీస్‌ కొస్తే నుంచో బెట్టి మాట్లాడే మీరు, ప్రభుత్వ లెక్చరర్లుగా, టీచర్లుగా భారీ జీతాలు, పెన్షన్‌లు పొందుతూ మీ పిల్లలను చైతన్య, నారాయణలలో చదివించుకునే మీరు, జీతాలు-పెన్షన్‌లు సరిగా రావేమోనన్న శంకతో నేడు ‘జై సమైక్యాంధ్ర’. ఆహా! ఇదంతా ఎవరి కోసమటండి! సీమాంధ్రుల కోసమేనా? గుండె మీద చేయి వేసుకుని చెప్పండి! అసలు ప్రజలు మీ గురించి చెప్పుకునేవన్నీ కాగితం మీద పెట్టలేను. మీరు, ఆర్‌.టి.సి. వారు మీకు గాని సమస్యల్లో, పోరాటంలో దూరారు. అసలు ఏ పెద్ద మనిషి చెప్పాడు. ఆర్‌.టి.సిని లేకుండ చేస్తామని? కుక్కను పిచ్చి కుక్క అని చంపే రీతిలో రాష్ట్ర విభజన చేస్తే, సంస్థే ఉండదని అటు సిబ్బందిని ఇటు ప్రజల్ని తప్పుదారి పట్టించటమేనా? రాను పోను 20 రూ||లతో పోయే చార్జీకి 40 రూ||లు ఆటోలకు ఎంత కాలం, ఎక్కడి నుండి తెచ్చి సామాన్యులు చెల్లించుకుంటారు? అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్ర విభజన ఆగదు. నిండా మునగక ముందే తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరటం మీకు సంస్థకు ప్రజలకు శ్రేయస్కరం. ప్రజాస్వా మ్యం అనేది ఎవరి హద్దుల్లో వారుంటేనే పరిఢవిల్లగలదు.

ప్రియమైన రాజకీయుల్లారా! ఇటీవల మీరు సమన్యాయం అంటూ ఓ సరికొత్త సుభాషితం వల్లిస్తున్నారు! అసలు మీ మంత్రి వర్గంలో సమన్యాయం ఉందా? ఒక వర్గం వారెంతమంది? అసలు చోటేలేని వారెంత మంది? తండ్రిపోగానే కొడుకు సి.ఎమ్‌ కవాలనటం లేదా అదే కుటుంబలో వారే ప్రజాప్రతినిధి అవటం సమన్యాయమా? మీ పాలనల్లో సీమాంధ్ర ప్రాంతానికి సమ న్యాయం జరిగిందా? పట్టుమని ఓ నాలుగు వేలమంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్ర మన్నా పెట్టారా? విజయవాడలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నిధులు ఇవ్వటానికి చేతులొచ్చాయా? హైకోర్ట్‌ బెంచ్‌కు, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు, బందరు పోర్ట్‌కు, ఐటి పార్క్‌కు ఏ గతి పట్టించారు? అసలు ఈ ప్రాంతం అంటేనే అంతులేని ఈర్ష్యతో రగిలిపోయే మీరు నేడు సమన్యాయమా? ఎవరి కోసమండీ? మీరు చేయని, చెప్పని సమ న్యాయాన్ని ఏ ముఖం పెట్టుకుని సోనియాను అడుగుతూ, అమాయక ప్రజల్ని రెచ్చగొడుతున్నారు? శ్రీమతి ఇందిర తెలుగుజాతి సమైక్యతకు పాటుబడిందట! శ్రీమతి సోనియా విచ్ఛిన్నం చేసిందట! అంత గొప్ప ప్రేమానుబంధాలతో పెనవేసుకుని బ్రతుకుతోందా తెలుగు జాతి? అసలు పంజాబ్‌లో శ్రీమతి ఇందిర చేసింది ఏమిటి? పంజాబ్‌లోని హిందువులంతా పాటియా లాను. ఇప్పుడున్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని భాగాలను కలిపి అఖండ పంజాబ్‌ను ఏర్పాటు చేయమని పోరాడగా దీనికి పూర్తి విరుద్ధంగా సిఖ్ఖులు పంజాబ్‌ను విడగొట్టమని సమ్మెలు, బంద్‌లు, ఆమరణ నిరాహార దీక్షలు చేసి మన కన్నా ఎంతో త్యాగస్ఫూర్తితో పోరాడారు. అయినా జవహర్‌లాల్‌ బ్రతికి వున్నంత వరకు వారి కోర్కె నెరవేరలేదు. అయితే వారి తరువాత వారి తనయురాలు శ్రీమతి ఇందిర, హుకుంసింగ్‌ కమిటీ నివేదిక సూచించిన విధంగా 1966లో రాష్ట్రపతి పాలన విధించి మరీ పంజాబ్‌ను రెండుగా చేసి, చండీగఢ్‌ను ఉమ్మడి రాజధానిగా చేసిన విషయం మీకు తెలియదా? సీమాంధ్రలోనే భావ సమైక్యత ఏమాత్రం లేని, నాయకత్వం లేని, పరిష్కారం దొరకని, ఎవరి స్వార్థంతో వారుచేస్తున్న ఈ పాల పొంగుజై సమైక్యాంధ్ర ఉద్యమానికి తలొంచేదెవరు? శ్రీమతి సోనియానా? బిజెపి నా? డబుల్‌ గేమ్‌లకు ఇకనైనా స్వస్తి చెప్పి, రాష్ట్రాన్ని విభజించ కుండా ఎవరమూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని ధైర్యంగా ప్రజలకు వివరించి తెలుగు ప్రజల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళండి!

ప్రియమైన సీమాంధ్రులారా! టి.వి. ఛానల్స్‌ ముందుకొచ్చి వారినీ, వీరిని నిందించడం రాజీనామాలు చేయమని డిమాండ్‌లు చేయడం, అదేదో పెద్ద శాశ్వత పరిష్కారమవుతుందను కుంటున్నారా? వెయ్యిమంది తెలంగాణా పిల్లలు చనిపోయినా శ్రీ జైపాల్‌ రెడ్డి, తెలంగాణా మంత్రులు రాజీనామాలు చేయనపుడు సీమాంధ్ర మంత్రులు ఎందుకు చేయాలి? మీరు అవునన్నా, కాదన్నా రాష్ట్రం విడిపోవడం అనేది మనమంచికే! ఆంధ్రనాట ఇదో చారిత్రాత్మక శుభ పరిణామం! అసలు శంకితుడు పవిత్రుడు కాదని గౌతమ బుద్ధుడు చెప్పాడు. నిత్య శంకితులు, స్వార్థ రాజకీయులు చేసే ఆందోళనల్లో భాగం కావద్దు.రాష్ట్రం విడిపోతే లాభ, నష్టాలేమిటి? విడగొడుతున్న కేంద్రం, కొత్త రాజధానికి, నూతన రాష్ట్రానికి ఆర్థిక జవసత్వాలు అంద చేయమని రాజకీయ వాదులంతా పోరాటం చేసేలా మీరు ఆందోళనలు చేయండి! ఇకపోతే నూతన రాజధానిగా ఇపుడున్న భౌగోళిక పరిస్థితులలో సీమాంధ్రలో విజయవాడ- గుంటూరులకు మించింది లేదు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌. బందరు పోర్ట్‌. అతి పెద్ద రైల్వే జంక్షన్‌. నీటి సమస్య లేకుండా పవిత్ర కృష్ణవేణీ తీరాన వెలసిన స్వతహాగా ఎంతో కొంత అభివృద్ధి చెందిన పట్టణాలు. విజయవాడ యావత్తు తెలుగు ప్రజలంతా ఇష్టపడే ఫ్యాన్సీ వున్న బ్లూ చిప్‌ సిటీ. అటు అనంతపూర్‌కు 480 కి.మీ. దూరంలోను ఇటు శ్రీకాకుళంకు 482 కి.మీ సమదూరంలోను వున్న ప్రాంతం. అనేక రకాలయిన రుగ్మతలతో, సీమ వారికి విజయవాడ ఇష్టం కాదని, ఏదో ఓ ప్రాంతాన్ని, ఏ హంగులూ లేనిచోట రాజధాని ఏర్పాటు చేస్తే అది హైదరాబాద్‌ను తలదన్నే మహానగరం అవుతుందనేది కేవలం భ్రమ, తెలియనితనం మాత్రమే. రాజధాని వున్నంత మాత్రాన అది మహానగరం అవటం జరగదు. 20 కోట్ల జనాభాతో 70 జిల్లాలతో వున్న ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో (29 లక్షలు), పదిన్నర కోట్ల జనాభా కల బీహార్‌ రాజధాని పాట్నా (20.5 లక్షలు), ఏడున్నర కోట్ల జనాభా కల మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ (19 లక్షలు) మహా నగరాలు అయినాయా? ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్‌, పంజాబ్‌ హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లు నేడు 10 లక్షలలోపు జనాభాతో అసలు విజయవాడ కన్నా తక్కువ జనాభాతోనే వుండి మహానగరాలుగా ఎదగలేదని అందరూ గుర్తుపెట్టుకోవాలి.

ఇకపోతే విజయవాడ నేడు భారత పట్టణాలలో 30వ స్థానంలోనున్నది. ఉడా పరిధిలోని విజయవాడ – గుంటూరులను రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటే 13వ స్థానంలోకి వెంటనే వస్తాయి. కేవలం 5-10 సం||రాలలో 8వ స్థానంలోకి విజయవంతంగా చేర్చ గలిగే, ఉపాధి నగరంగా రూపొందించగల సత్తా, శక్తి సమర్థ్యాలు సీమాంధ్రులకు వున్నాయి. ఇక విజయవాడ- గుంటూరుల కన్నా పెద్ద నగరాలుగా బొంబాయి, ఢిల్లీ, కొలకత్తా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పూణేలు మాత్రమే వుండ గలవు. కేవలం రెండున్నర కోట్ల జనాభా కల హర్యానాలో 19 జిల్లాలు, మన కన్నా తక్కువ జనాభా గల మధ్యప్రదేశ్‌లో 48జిల్లాలున్నాయి. మనముకూడా వెంటనే 20 జిల్లాలుగా చేసుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావచ్చును. కాశ్మీర్‌, మహారాష్ట్ర, కర్నాటకలలో లాగా అసెంబ్లీ కార్యకలాపాలను రెండు ప్రాంతా లలో ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సుహృ ద్భావాన్ని కాపాడుకోవచ్చును. అలాగే హైకోర్ట్‌ బెంచ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును. సీమాంధ్రను 60 సం||లుగా దారుణంగా నిర్లక్ష్యం చేసిన కేంధ్రప్రభుత్వం సుప్రీమ్‌ కోర్ట్‌ బెంచ్‌ను ఈ ప్రాంతానికి ఇవ్వాలి. విస్తారంగా భూములు ఉన్నచోట భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చేసి వారికి సబ్సిడీలు ఇవ్వాలి. నూతన రాజధాని కోసం హైదరాబాద్‌ రెవిన్యూను 15 సం||రాల పాటు జనాభా దామాషాగా సీమాంధ్రకు కేటాయించాలి. కేంద్రం కూడా అంతే మొత్తాన్ని చట్టం చేసి మరీ సీమాంధ్రకు ఇవ్వాలి. ఇకపోతే కోస్తా వారితో కలసి నడవలేమంటే సీమ వారికి తక్షణమే నాలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి నిరోధక ఆందోళనలకు స్వస్తి చెప్పి, చారిత్రాత్మక దశలో వున్నాము గనుక ఎంతో సంయమనంతో, నేడు జరుగుతున్న విభజన మన మంచికేననే ఆశాభావంతో, భవిష్యత్‌ పట్ల ధైర్యంతో ముందుకు సాగితే తెలుగు వారికి కోస్తా తీర ప్రాంతాన ఓ మహానగరం వెలియటం, సీమాంధ్రులు ప్రగతి బాట పట్టడం నూటికి నూరు పాళ్లు ఖాయం. సర్వేజనా సుఖినోభవన్తు!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.