– సామాన్య
సిండ్రెల్లా, రాపుంజేల్, ప్రాగ్ ప్రిన్స్, స్లీపింగ్ బ్యూటీ.. వంటి అనేకానేక ప్రపంచ ప్రఖ్యాత జానపద కథల సేకర్తలు ”బ్రదర్స్‌గ్రిమ్” సేకరించిన జర్మన్ జానపద కథే ”స్నో వైట్ అండ్ ది సెవన్ డ్వార్ఫ్స్”. వాల్ట్ డిస్నీ 1937లో ఈ కథని యానిమేషన్ సినిమాగా రూపొంది ంచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రం అనేక పసి హృదయాలనూ, పసి హృదా యాలున్న పెద్దలనూ అనవరతంగా ఆకట్టుకుం టూనే వుంది. నయనానందాన్నే కాక వీనులకు విందును కూడా చేసే ఈ సినిమా చూడటం ఒక ఆనందకర సుందర హృద యానుభవం.
స్నో వైట్ తల్లీ తండ్రీలేని పిల్ల. సవతి తల్లి ఆ అమ్మాయి అందాన్ని చూసి ఓర్వలేక స్వంత ఇంటిలోనే పనిమనిషిగా మార్చి వేస్తుంది. సవతి తల్లి ఒక మంత్రగత్తె. ఆమె దగ్గర ఒక మాయా దర్ఫణం వుంటుంది. ఆమె దాని ముందు నిలుచుని ప్రపంచం లోకెల్లా తెల్లనైనది ఎవరు అని అడిగితే అద్దం ఇంకెవరూ నువ్వే అని చెప్తూ వుంటుంది. అలాంటిది ఒకరోజు ఆ అద్దం ప్రపంచంలో కెల్లా స్నో వైట్ తెల్లనైనది, చింకి పాత్రలలో కూడా ఆమె దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటుంది. అంతే సవతి తల్లికి పట్టలేనంత అసూయ కలిగి ఉగ్రురాలై స్నో వైట్‌ని చంపి ఆమె గుండెకాయ తీసుకు రమ్మని వేటగాడిని ఆజ్ఞాపిస్తుంది. ఇదేమీ తెలీని స్నో వైట్ తన పాట విని వచ్చిన రాకుమారుడిపై మనసు పారేసుకుంటుంది. వేటగాడు స్నో వైట్‌ని అడవికి తీసుకొచ్చినా చంపలేకపో తాడు. ఆమెకి నిజం చెప్పి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకో మంటాడు. పంది గుండె కాయను తీసుకెళ్ళి రాణికి ఇస్తాడు.
అడవిలో కెళ్ళిన స్నో వైట్‌కి రకరకాల జంతువులు, పక్షులు స్నేహితులై ఆమె నివాసానికి ఒక ఇంటిని చూపెడతాయి. మురికిగా వున్న ఆ ఇంటిని చూసి అది ఎవరో అనాధ పిల్లల ఇల్లు అనుకుంటుంది స్నో వైట్. జంతువుల సాయంతో ఇల్లంతా శుభ్రం చేసి నిద్రపోతుంది. ఇంతలో వజ్రాల గనిలోకి పనికి వెళ్లి వుండిన ఆ ఇంటి యజమానులైన ఏడుగురు మరుగుజ్జు అన్నదమ్ములు డాక్, గ్రంపీ, హేపీ, స్లీపీ, బెష్ పుల్, స్నీజీ, డోపీలు సాయంత్రం వేళకి ఇంటికి తిరిగి వస్తారు. రూపు రేఖలు మారి వున్న ఇంటిని చూసి మొదట భయపడ్డా చివరికి స్నో వైట్ వారితో కలిసి ఉండేందుకు అనుమతిస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు.
ఇక్కడ సవతి తల్లి మళ్ళీ అద్దాన్ని పాత ప్రశ్నే అడుగుతుంది. అద్దం చాలా వివరంగా ఓపన్ ది సెవన్ జువెల్డ్ మిల్స్ / బియాండ్ ది సెవెంత్ ఫాల్ / ఇన్ ది కాటేజ్ ఆఫ్ సెవన్ డ్వార్ఫ్స్ / డ్వెల్స్ స్నోవైట్, ఫెయిరెస్ట్ వన్ ఆఫ్ ఆల్ అని స్నో వైట్ ఎక్కడ వుందనే విషయం కూడా విశదం చేస్తుంది. అంతే మంత్రాల రాణికి కోపమెచ్చి తనను తాను ముసలిదానిగా మార్చుకుని విషపు ఆపిల్ని తయారు చేసి స్నో వైట్ దగ్గరకు వెళ్తుంది. ఆ ఆపిల్ తిన్న వాళ్ళు దీర్ఘ నిద్రలోకి (స్లీపింగ్ డెత్) వెళిపోతారు. ప్రేమించిన వారి తొలి ముద్దు మాత్రమే ఆ విషానికి విరుగుడు. అది ఎలాగూ జరగదని భావించి మంత్రాల రాణి స్నో వైట్‌ని మభ్యపెట్టి ఆ ఆపిల్‌ని తినేలా చేస్తుంది. అనుక్నుట్టుగానే స్నోవైట్ స్లీపింగ్ డెత్‌లోకి వెళుతుంది. అడవి జంతువుల ద్వారా ఇదంతా తెలుసుకున్న అన్నదమ్ములు మంత్రాల రాణిని తరుము కుంటారు. మరుగుజ్జులను మట్టుబెట్టే ప్రయత్నంలో మంత్రగత్తె కొండ చరియ విరిగి పడి తనే మరణిస్తుంది.
ఎంత సేపు గడచినా మరణించినట్లు కాక నిద్రపోతున్నట్లు వున్న స్నో వైట్‌ని అన్నదమ్ములు ఒక గాజుపేటికలో భద్రపరచి సంరక్షిస్తూ వుంటారు. అంతలో ఒక రోజు స్నో వైట్‌ని ప్రేమించిన రాకుమారుడు ఆమెని వెతుక్కుంటూ వచ్చి ఆమె స్థితి చూసి దుంఖితుడై ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అంతే ఆమెకి శాప విముక్తి కలిగి, రాజకుమారుడిని పెళ్ళి చేసుకుని సుఖంగా వుంటుంది.
ఈ కథ ఎక్కడో విన్నట్లు, తెలిసినట్లే వుంటుంది కానీ, దీనిని వాల్ట్‌డిస్నీ సినిమాగా మలచిన తీరు మాత్రం అసమానం. అడవి పక్షుల, జంతువుల హావభావాలు, ముచ్చట గొలిపే తాబేలు, అమ్మ నాన్నల నుండి తప్పి పోయిన బుజ్జి పిట్ట, గ్రంపీ హావ భావాలు, వాళ్ళ ఇంటి సెట్టింగు, స్నో వైట్ బావిలోకి చూస్తూ పాడే పాట… ఒకటేమిటి ఈ సినిమా ఫ్రేము ఫ్రేము అద్భుతమైన సంగీతంతో, కంఠ స్వరాలతో సినిమా చూస్తున్న మన మనసుకు రిలాక్సేషన్‌ను కలిగిస్తుంది. పిల్లలే కాదు పెద్ద వాళ్ళం కూడా ఎన్ని సార్లైనా చూడదగ్గ సినిమా ఈ స్నో వైట్ అండ్ ది సెవన్ డ్వార్ఫ్స్.