జమాలున్నీసాబాజీ –

రజియా బేగం (హైద్రాబాదు)

బాజి: 1928లో మాకు పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసు. అప్పట్నుంచే మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. అంటే మత ద్రోహులమని. ”నిగార్‌” అనే పత్రిక తెప్పించుకుని చదివేవాళ్ళం. అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది. నేను స్వదేశీ బట్టలనే కట్టుకునేది. పైగా, హస్రత్‌ మోహనీ మా నాన్న దగ్గరి బంధువు కూడా మమ్మల్ని ప్రభావితం చేశాడు. యుద్ధం రోజుల్లో ఇక్కడే మల్లేపల్లిమాస్క్‌ దగ్గర కొన్ని సంవత్సరాలున్నాడు. ఒక చిన్న యిల్లుండేది. అతని రెండో భార్య మా నాన్నకు కోడలు వరస, మాకు సరియైన పాఠశాలలో విద్య లభించలేదు.

రజియా: మా కుటుంబం చాలా సంకుచిత స్వభావం కలది. ఒక్క మా తండ్రిగారే ఉదారస్వభావం కలవాడు. మేము పల్లెటూళ్ళో ఉండేది. బాజీ పెళ్లయిం తర్వాత మాకు పట్నంలో ఒక చోటంటూ దొరికింది. మేము ఉర్దూ, పర్షియన్‌ నేర్చుకున్నాం. ఇంగ్లీషు వచ్చేది కాదు. ఒక గోడపత్రిక ‘తమీర్‌’ అని ప్రారంభించాం. అంతాచేత్తోనే రాసేవాళ్ళం. మేం చదివి ఇతరులను కూడా చదివించేవాళ్ళం. ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు డిక్ష్నరీలు ఉర్దూ-ఇంగ్లీషు-ఉర్దూ పెట్టుకుని నేర్చుకున్నాను. షేక్స్ప్‌యర్‌, విక్టర్‌ హ్యూగో చదివాను. అర్థమయినపుడు యెంతో ఆనందించాను. మెల్లిగా అనువాదాలు చేయడం ప్రారంభించాను. ‘ఐవాన్‌’ అనే పత్రిక చదవటం మొదలు పెట్టాను. చిన్న చిన్న కథలు రాయటం, తర్వాత ఉస్మానియా జర్నల్‌లో ప్రచురించటం మొదలు పెట్టాను. ఒక నవల కూడా రాశాను. దాంట్లో మా అక్క, మా బావగారు ముఖ్యమైన పాత్రలు. ఇప్పుడెక్కడపోయిందో తెలియదు.

బాజీ: రజియాకు ఇంగ్లీషు చెప్పటానికి ఒక బ్రాహ్మణ అబ్బాయి వచ్చేవాడు. మా కుటుంబం అభ్యంతరం పెట్టింది. బంధువులంతా వెలివేశారు. చాలా కొద్దిమంది అమ్మాయిలు ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు. మా అమ్మ మమ్మల్నెప్పుడూ సపోర్టు చేసేది. ఒక స్నేహితురాలిలాగా.

రజియా: మా తాత గారు మమ్మల్ని చదివించినందుకు మా నాన్నను అభినందించేది. మలక్‌పేటలో, బజ్మె ఎహ్‌బాబ్‌ అంటే మిత్రుల సంఘం ఒకటి ప్రారంభించాం పర్దాను వ్యతిరేకించడానికి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ చాలామంది వచ్చేవాళ్ళు. యూనుస్‌ సలీమ్‌, ముస్లిమ్‌ జియా, ఇంకా చాలా మంది రచయితలు, నియాజ్‌, జాకిర్‌ హుస్సేన్‌, సాహిర్‌, జిగర్‌, సిద్దిఖీలాంటి కవులు వచ్చేవాళ్లు. కొంత మంది మాయింట్లోనే వుండేవాళ్లు. సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగేవి. మేమంతగా మార్కిస్ట్స్‌ సాహిత్యం చదవలేదు. కాని నిగార్‌లో కొన్ని వ్యాసాలు వచ్చేవి. ఉర్దూపత్రికలు చాలా వుండేవి. రాజకీయ సమస్యలు కూడా చాలా చర్చించేది. యుద్ధం, జర్మనీ, హిట్లర్‌ మొదలైనవి. ఉర్దూ, ఇంగ్లీష్‌ పుస్తకాలు చాలా తెప్పించుకుని ఎన్నో నేర్చుకునే వాళ్లం. నేను, రాబియా ఇంటర్‌ సైన్సు చేసి మెడిసన్‌ చేయాలనుకున్నాం. కాని బి.ఎ. చేసిన తర్వాత ఎం.ఏ. చేశాం. టాంగా (గుర్రంబండి) లోనో, రిక్షాలోనో పరదాలేసుకొని కాలేజికి వేళ్లేవాళ్ళం. బజారు వెళ్లినప్పుడు పర్దా వేసుకోవడం మానేశాం. ఒకసారి జష్నె-మెహతాబ్‌ అనే పండగ చేసుకున్నం. అది ఛౌద్‌వీ కా-చాంద్‌- పున్నమి ముందురోజు జరుపుకునే పండగ. చాలా మంది వచ్చారు. మా వదిన కుటుంబం వాళ్లు కూడా వచ్చారు. తెల్ల గుడ్డలు వేసుకొని, అమ్మాయిలంతా మలక్‌పేట నుంచి నాంపల్లి దాకా పర్దాలేకుండా నడిచారు. కవిత్వం కూడా చదివారు. వదిన తండ్రి మహ్యఖాన్‌ ఎక్సైజ్‌ డిపార్టుమెంటులో పని చేసేవాడు. ఆయన ఉదారస్వభావుడు. పిల్లల్ని బయటకు వెళ్ళనిచ్చేవాడు. చాలామంది అమ్మాయిలు కాలేజీకెళ్ళిన తర్వాత పర్దాలు తీసేవాళ్ళు. బయట కూడా తీసేయాలని మేము వాళ్ళతో వాదించేవాళ్ళం. బస్తీలోవాళ్ళు మంచివాళ్ళు కారని, అందుచేత వేసుకోవాల్సి వస్తుందని వాళ్ళనే వాళ్ళు. నేను ఏడోతరగతిలో వున్నప్పటి నుంచి ప్రార్థనలు చేసేదాన్ని. ఖురాన్‌ చదవటం నేర్చుకున్నాను. నమాజ్‌ చేయటం, ‘రోజా’ అంటే రంజాన్‌ పండగప్పుడు ఉపవాసాలు చేయటం, ఇవన్నీ చేసేది. కాలేజీ కొచ్చిం తర్వాత ఇవన్నీ మానేశాను. ఈ కర్మకాండలన్నీ మానేశాను. దేవుడు, కర్మకాండలు వేర్వేరనిపించింది. ‘ణిగార్‌’ ప్రభావం ఉండేది.

బాజీ: మిలాద్‌ (మహమ్మద్‌ ప్రవక్త పుట్టినరోజు) పండగ చేసుకునేప్పుడు బంధువులకూ, వచ్చిన వాళ్ళకూ మతం యొక్క నిజమైన సారాంశం. ఈ కర్మకాండలు ఆచారాలలో లేదని వాదించేవాళ్ళం. సీరత్‌-ఉన్నబీ/ మహమ్మద్‌ ప్రవక్త జీవితం) పుస్తకం చదివి దాని వివిధ ఆర్థాలు చెప్పేవాళ్ళం.

మొదట్నించీ మేము వామపక్షానికి దగ్గరగా వుండేవాళ్ళం. 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దాం, నజర్‌ హైద్రాబాద్‌ ఎప్పుడూ వస్తుండేవారు. మేం నలుగురు అక్క చెల్లెళ్ళం ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మ కూడా వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల వెనక కూర్చునేవాళ్ళు. తస్సదుఖ్‌ పంజేతన్‌ అప్పుడే ఇంగ్లండు నుంచి వచ్చినా బహిరంగంగా మీటింగులకి వచ్చేది కాదు. సజ్జద్‌ జహీర్‌, ఓంకార్‌ పర్షాద్‌ లాంటి వాళ్ళు చాలా మంది అండర్‌ గ్రౌండ్లలో వున్నప్పుడు మా యింట్లోనే వుండేవాళ్ళు. 1947 తర్వాత లక్నోలో హిందీ కాన్ఫరెన్స్‌ – మౌలానా ఏషియాటిక్‌ కాన్ఫరెన్స్‌ – వెళ్ళాం. అక్కడ ఎర్రజెండాలు ఎగరేశాం. చాలా మంది అరెస్టయ్యారు. నేను 1946లో పార్టీ సభ్యురాలి నయ్యాను. ప్రమీలాతాయిని పార్టీలో కలుసుకున్నాను. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. కాని సానుభూతి వుండేది. గాంధీ కంటె ఎక్కువగా నెహ్రూనే ఇష్టపడేవాళ్ళం. సుభాష్‌బోస్‌ను కాంగ్రెసు నుంచి తీసేసినపుడు మాకు చాలా కోపం, బాధ కలిగింది. మొదట్నించీ జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడం లేదని ఎప్పుడూ అనిపించేది. మేము అజంతాలో వున్నపుడు మహమ్మద్‌ అలీ, ఆయన భార్య అక్కడికొచ్చారని తెలిసింది. మేము, ఆఖ్తర్‌, మా పెద్దనాన్న మా పాకట్‌ మనీ – 15.20 రూపాయలు జమ చేసి బేగం మహమ్మద్‌ అలీకి ఇచ్చాం. దాంతర్వాత ఆయన కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. బేగం ఆలీ సిగరెట్లు తాగుతుంటే మేం ఆశ్చర్యం పోయేవాళ్ళం.

ఒకసారి ఇండొనేషియా రోజు జరుపుతుంటే 1949లో విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఒక పెద్ద మీటింగు పెట్టారు. ఒక ఊరేగింపు కూడా చేశాం. సంజీవరెడ్డి ఒక ముఠాతోవచ్చి మమ్మల్ని ఆటాక్‌ చేశాడు. చాలా మందిని తప్పించటానికి వెనక తలుపులోంచి వెళ్ళిపోయాం. మా అత్తవారిల్లు చాలా వెనకబడ్డ కుటుంబం. మొదట్లో చాలా బాధేసేది, కష్టంగా ఆనిపించేది. నేను కొంత సరిపుచ్చుకోవాల్సి వచ్చేది. మా నాన్న ఉత్తరప్రదేశ్‌ వారు, మా అమ్మ ఇక్కడివారే. నాన్న మాజిస్ట్రేట్‌గా హైద్రాబాద్‌లో అన్ని ప్రాంతాల్లో పని చేశాడు. మేం పర్దా పాటించకపోయేది. మా మామ వరస ఒకతను హస్రత్‌మొహనీతో పనిచేసేవాడు. ఆయన భార్య పర్దా పాటించేది కాదు. నన్ను ఒక సంవత్సరం దాకా మా వాళ్ళు మా అమ్మ ఇంటికి పోనివ్వలేదు. మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళుతుండేవాడు. నా భర్త అన్న, అతని భార్య చాలా సంకుచిత స్వభావం కలవారు. ఎవర్నీ బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. మూడు సంవత్సరాలు నేను ఒక కుటుంబ స్త్రీగానే ఉన్నాను. కుట్టుపని నేర్చుకున్నాను. ఇంట్లో కట్టేసినట్టుండేది కాని నాకున్న కొన్ని అభిప్రాయాలు మాత్రం నేను దాచలేదు. పుస్తకాలు చదివేదాన్ని కాని ఏదో సర్దుకుపోయేదాన్ని – కుటుంబ జీవితంలో, తర్వాత మేం వేరే ఇల్లు ఉస్మాన్‌ పుర, కట్టెలమండి దగ్గర తీసుకున్నాం. నా కొడుకప్పుడు మూడేళ్ళవాడు. సెలవుల్లో మా నాన్న దగ్గరకు వెళ్ళుతుండేదాన్ని. అది మా అత్తవారింట్లో ఇష్టం కాలేదు. క్రమంగా నా అన్నలు, చెలెళ్ళు అంతా నా ఇంటికి రావడం ప్రారంభించారు. ఇంట్లో సామిత్య సమావేశాలు జరిపేవాళ్ళం. నా భర్త చాలా నెమ్మదస్తుడు, జోక్యం చేసుకునేవాడు కాదు. నేను బయటకు వెళ్ళకపోయేదనాన్ని కాదు కాని అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు వచ్చి ఉండిపోయేవారు. భర్తతో వాళ్ళు నా అన్న స్నేహితులని చెప్పేదాన్ని. మా కుటుంబం వాళ్ళనంతా చూసి క్రమంగా ఆయనకొక నమ్మకం కుదురింది. నా అన్న తమ్ముళ్ళంతా కాలేజీలు వదిలి ఉద్యమంలో చేరి చాలా బాధలు పడ్డారు. ఆయుధాలిక్కడే దాచేవారు. అన్వర్‌, జఫర్‌, నా అన్న వరస హఫీజ్‌ వీళ్ళంతా కలిసి పనిచేసేవారు. వాళ్ళంతా ఆరెస్టయ్యారు. అన్వర్‌ చాలా సీరియస్‌ జబ్జుతో బాధపడుతుండేవాడు. ఖమర్‌, మజర్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉండి అరెస్టయ్యారు. అన్వర్‌ అత్తగారిల్లు ఎక్కడో దూరంగా హబ్సిగూడా రామాంతపూర్‌లో వుండేది. మఖ్దాం, ఓంకార్‌ అక్కడే వుండేవాళ్ళు. ముఖ్దాం, జఫర్‌, ఝఫీఖ్‌, బెవ్‌జద్‌తోపాటు అరెస్టయ్యాడు. అన్వర్‌ అరెస్టయినపుడు అఖ్తర్‌, అంటే అన్నయ్య, వదిన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అరెస్టయినట్లు చెప్పింది. అమె భర్త పోలీసు డిపార్టుమెంటులో పని చేసేవాడు. అతనే అన్నయ్య రహస్యస్థావరాల గురించి బయట పెట్టాడు. జఫర్‌ సాయుధ పోరాటం జరుగుతున్న ఊళ్ళకి వెళ్ళి, అక్కడి పరిస్థితులను చూసి నిరాశతో తిరిగి వచ్చాడు. జఫర్‌ రివాల్వర్లను దాచిపెడితే, ఆఖ్తర్‌ వాటిని ఒక పెట్టెలో పెట్టి, పోలీసు వచ్చినపుడు వాటిపైన కూర్చుంది. ఆమె మురాద్‌నగర్‌ వెళుతూ రివాల్వర్‌ నాకిచ్చింది. నేను దాన్నిక్కడే దాచాను.

జిన్నా ఇంటరిమ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లజండా ప్రదర్శనలిమ్మని పిలుపునిచ్చాడు. అందరూ దాన్ని పాటించారు. కాని మేము పాటించలేదు. మా అన్నలు ఎర్రజెండా ఎగరేశారు. చుట్టుపక్కలవాళ్ళంతా ఇష్టపడలేదు. రాజ్‌ (రాజ్‌ బహుదుర్‌ గౌడ్‌) జవాద్‌ (జవాద్‌ రజ్వీ) హాస్పిటల్‌ నుంచి తప్పించుకుని ఇక్కడికే మొదలు వచ్చారు. 1947 ప్రారంభంలో ఎక్కడ చూసినా పోలీసులుండేది. రిక్షాకు పరదా కట్టించి వాళ్ళనిక్కడ నుంచి వేరే చోటికి తీసుకెళ్లాం. రాజ్‌ మమ్మల్ని అండర్‌ గ్రౌండ్‌ వెళ్ళిపొమ్మన్నాడు. అఖ్తర్‌ మధ్యలో ఒకసారి పరోల్‌ మీదవచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. 1949లో నా భర్త చనిపోయాడు. నేను తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాను. పార్టీ కొరకు డబ్బు వసూలు చేయటం మొదలుపెట్టాను. తాయి, (ప్రమిలాతాయి) యశోదాబెన్‌, బ్రిజ్‌రాణి అంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ మీద నిషేదం వచ్చిన తర్వాత అంతా ఇక్కడికి రావడం ప్రారంభించారు. అభ్యుదయ రచయితల సమావేశాలు కూడా జరిగేవి. పార్టీలో విబేధాలు ఎక్కువైపోయాయి. ఆర్‌.ఎన్‌ (రావి నారాయణ రెడ్డి) బొంబాయి వెళ్లాడు. తర్వాత అఖ్తర్‌, గోపాలన్‌ (ఎ.కె.గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహ్మద్‌తో ఏర్పడిన డిలిగేషన్‌ ఒకటి వచ్చి – 1951లో సాయుధపోరాటం కొనసాగించాలా విరమించాలా అనే విషయం చర్చించడానికి వచ్చారు. మా ఇంటి ముందున్న యింట్లోనే వాళ్ళకు ఉండటానికి ఏర్పాటు చేశాము. మా నాన్న సహయం చేశాడు. చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి.

పోరాటం విరమించుకున్న తర్వాత, మహిళా సంఘాలు ప్రారంభించాం. కామ్రేడ్‌ ఘనీ ఆసిఫ్‌నగర్‌లో అతని భార్యతో ఒక మహిళా సంఘం పెట్టాడు. పర్దా వేసుకునే స్త్రీలు ఒక సెంటర్‌ నుంచి ఇంకో సెంటర్‌ వెళ్ళేవారుకారు. ఆఘాపురాలో ఒక రాత్రిబడి, మాస్క్‌ దగ్గర ఇంకో సెంటర్‌ పెట్టారు. కథలు, గోర్కి రచనలు చదివేవాళ్ళం. చాలా రోజులు అలా చేశాం. కొంతమంది అమ్మాయిలు పార్టీ సభ్యురాళ్ళయ్యారు, ఎన్నికల్లో పనిచేశారు. నాతో కలిసి గుంటూరు, విజయవాడ వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని, ఏమీ చేయటం లేదు.

రజియా:- పార్టీ ఇనాక్టివ్‌ అవడంతో, ఈ కార్యక్రమాలు కూడా ఆగిపోయావి.

బాజీ:- 1952లో ముఖ్దాం విడుదలయిన తర్వాత నన్ను స్త్రీలతో పనిచేయమన్నాడు. మేమెట్లా చేయగలుతాం? తాయి ఇంకా విడుదల కాలేదు. ఆహార ధాన్యాల ధరల సమస్య బాగా పనికొచ్చింది. ముస్లింలలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఈ సంఘాలు వారిని ఎక్కువ ఆకర్షించలేదు. ఇంకా కొంత ఆకర్షనీ యమైనవి కావల్సి వచ్చింది. ఓంకార్‌ స్త్రీల ప్రజాస్వామ్య సంఘం పెట్టడానికి తోడ్పడ్డాడు. దాని నియమావళి తయారుచేశాడు. నలభై మంది స్త్రీలు కుట్టుపని, చేతిపని నేర్చుకునేవారు. మేము రాయటం, చదవటం నేర్పించేవాళ్ళం. పత్రికలు, పుస్తకాలు కొనేవాళ్లం. చదవటం, చర్చలు పెట్టడం చేసేవాళ్ళం. డబ్బు సరిపోయేదికాదు. కో ఆపరేటివ్‌ ఇన్ప్సెక్టరు కో ఆపరేటివ్‌ పెట్టమని సలహా యిచ్చాడు. చాలా మంది కాలేజీ టీచర్లు షేర్‌ హోల్డర్స్‌గా చేరారు. ఆడవాళ్ళకు జీవనాధారం చూపించటం, ఏదైనా పనిగానీ ఒక స్కిల్‌గాని నేర్పిం చటం ఆ కో ఆపరేటివ్‌ ఆశయం. చాలామంది పరీక్షలిచ్చి పాస్‌ ఆయ్యారు కూడా. ఇప్పుడు కూడా ఆపని జరుగుతుంది కాని, తక్కువ శక్తితో. ఇద్దరు టీచర్లున్నారు. తెలుగు, ఉర్దూ ఎనిమిదవ తరగతి దాకా నేర్పుతారు. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు కూడా దీన్ని గుర్తిం చింది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాదులో బ్రాంచ్‌లు కూడా వున్నాయి.

ఇది వరకు పర్దాలాంటి సమస్యల గురించి చర్చించేవాళ్ళం. చాలామంది, రజీయా సజ్జద్‌ జహీర్‌, ఇస్మత్‌ ఛోగ్తాయి లాంటి వాళ్లు వచ్చి మాట్లాడేది, ఆ రోజుల్లో స్త్రీలు చదువుకున్న వాళ్లు కాకపోయినప్పటికి, ప్రశ్నలడిగి ఎన్నో నేర్చుకునేవారు. ఇప్పుడెవరికీ ఆ కుతూహలం లేదు. పార్టీ గురించి కాని, రాజకీయ సమస్యల గురించి కానీ తెలియదు. బహుళ గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే డబ్బు కారణం కావచ్చు. కొంతవరకు, పార్టీకి ఆసక్తి లేదు, ఏమీ పట్టించుకోదు. మహిళా ప్రజాస్వామిక సంఘం ఏమైనా కాన్ఫరెన్స్‌ కెళ్ళాల్సివచ్చినపుడే పనికొస్తుంది. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు, ఎన్నాళ్ళు నేనింకా చేయగలను?

1952-53లో ఢిల్లీ కాన్ఫరెన్స్‌లో మేము అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్‌ (జు|ఇ్పు) నుంచి వేరుపడ్డాం. 54లో కలకత్తా సమావేశంలో మహిళా ప్రజాస్వామిక సమాఖ్య నిర్ణయించబడి, ఒక నియమావళి తయారుచేశారు. రేణు చక్రవర్తి, హాజ్రాబేగం పాల్గొన్నారు. అఖిలభారత మహిళా కాన్ఫరెన్స్‌ గొప్ప వాళ్ళకే ఎక్కువగా, నేను కలకత్తా, ఢిల్లీ సమావేశాలకి వెళ్ళాను. ఇక్కడ పని చేస్తున్న బద్రున్నీసాను తీసుకెళ్ళాను. ఆమెకు రెండేళ్ల పాప వుండేది. ఆమె కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు పేపర్లో వస్తే ఆమె ఆత్తవారి వాళ్ళు అభ్యంతర పెట్టారు. తర్వాత ఆమె భర్త విడాకులిచ్చాడు. ఆమె చాలా భయపడిపోయి ఇక్కడే వుండేది. ఆమెనొక ముసలతనికిచ్చి పెళ్ళి చేయాలని చూశారు. ఆమెకది ఇష్టంలేక ఒప్పుకోలేదు. ఇక్కడే టీచరు పని చేస్తూ, ఎంతో బాగా పని చేస్తుంది. ఇప్పుడు చాలా మంది స్త్రీలు కోఆపరేటివ్‌ సెంటరుకి నేర్చుకోవటానికి వస్తారు. కాని చాలా కొద్ది మంది పనిచేయటానికి వస్తారు. వాళ్ళకు పని అంతగా అవసరం లేదు. వాళ్ళ వాళ్ళెవరో ఒకరు బయటపని చేస్తుంటారు కాబట్టి. మా బంధువొక అమ్మాయి క్లాసులు తీసుకోడానికి ప్రయత్నించింది. కాని ఎక్కువ మంది రాలేదు. నాకేవిధంగా ఈ పని సాగించాలో తెలియడం లేదు. మతోన్మాదము కూడా కొంత కారణమైయింటుంది. ఇది వరకు పర్దాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. ఇప్పుడట్లాకాదు. ఇది వరకు ముస్లిం స్త్రీలు ఊరేగింపుల్లో వచ్చేవారు. నేనే ఎన్నో సార్లు ఎలక్షన్‌ మీటింగులకి, కాంపేన్లకి (ప్రచారాలకి) తీసుకెళ్ళాను. హిందూ స్త్రీలు కూడా అంతగా పట్టించుకోవటంలేదు.

రజియా:- ఆ రోజుల్లో చాలామంది కామ్రేడ్లతో పోరాటం గురించి మాట్లాడేదాన్ని, జైల్లో వున్నప్పుడు, ఒక స్త్రీ కామ్రేడ్‌తో మాట్లాడేదాన్ని, ఆమెకు తెలుగొక్కటే తెలుసు. ఒక డైరీ కూడా రాసేదాన్ని. అది దొరికితే ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి. నాకొక గది వుండేది.

బాజీ:- తెలుగు తెలిసివుంటే ఇంకా పనిచేయడానికి తోడ్పడేది. చాలా మంది బాగా ఉత్సాహంగా ఉండే అమ్మాయి లుండేవారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు జ్ఞాపకం రావడం లేదు. మమ్మల్నెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి ఎలా వెళ్ళడం అని కూడా అడక్కపోయేవాళ్ళం. ఆర్‌.ఎన్‌ (రావి నారాయణరెడ్డి) వెళ్ళమనేవాడు, మేం వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి ఆర్‌.ఎన్‌తో హుజూర్‌నగర్‌ ఎలక్షన్‌ ప్రాపగాండాకై వెళ్ళాం. ఒక ముసలమ్మ నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టింది. కామ్రేడ్లని ఎప్పుడూ బాగా చూసుకునే వారు ప్రజలు.

రజియా:- నేను 1944 ఎం.ఏ. చేసి లెక్చరర్‌నయ్యాను. వుమెన్స్‌ కాలేజి అప్పుడు గోల్డన్‌ధ్రెస్‌ హోల్డ్‌లో ఉండేది. నాకు చదవటం, రాయటంలో చాలా ఆసక్తి. 1966లో యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజి చేరాను. పర్షియన్‌లో పి. హెచ్‌.డి ఇరాన్‌లో చేశాను. కాలేజీలో సాహిత్య గోష్ఠులు జరిపేవాళ్ళం. లీలామణి నాయుడు (సరోజిని నాయుడు కూతురు) అక్కడే వుండేది. రాజకీయాల్లో సాధారణంగా అంత ఎక్కువ ఆసక్తి వుండేది కాదు. నాన్న రిటైర్‌ అవడంవల్ల, మిగతా వాళ్ళంతా పార్టీలో పనిచేస్తుండటం వల్ల నేనే కుటుంబాన్ని సపోర్టు చేసేది. అయినప్పటికి పురుషులతో సమానమని ఆనిపించకపోయేది.

బాజీ:- మనకు రెండు రకాల బాధ్యతలుంటవి. పురుషులు ఒకేరకం పనిచేస్తారు. మనకయితే రెండూ…

రజియా:- ఇంట్లో అంతా తోడ్పడేవాళ్ళు. పురుషులు కూడా కొంత పని చేసేవాళ్ళు. పిల్లలు కూడా కొంత చేసేవాళ్ళు అయినప్పటికీ కొంత మన బాధ్యతే అనిపిస్తుంది. కొన్ని కారణాలు పరిశీలించాలి. స్త్రీగా వుండటమనేది ఒకటి. యుగాల నుంచి వస్తున్న సాంఘిక వ్యవస్థ ఆమెను తక్కువ స్థాయిలోనే వుంచింది. ఆర్ధిక స్వాతంత్య్రం వున్నప్పటికీ, స్త్రీ పురుషుని కంటే తక్కువగానే భావిస్తుంది. అతని మీదే ఆధారపడుతుంది. స్త్రీ ఒంటరిగా ఉండటమనేటువంటి భయం ఘోరమైంది, ప్రపంచమంతటా వుంది. ఆమె తను ఒంటరిగా ఉండలేననుకుంటుంది. అమ్మాయిలు ఒంటిరిగా బయటకెళ్ళడానికి భయపడతారు, పురుషుడైతే ఒంటరిగా వెళతాడు. ఎవరూ బాధించరు. పురుషుడుకి స్వేచ్ఛ వుంది. స్త్రీలను ఏ విధంగా చూస్తారనేదాని గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఈ బంధాలెలా తెంచుకుంటామనేది చూడాలి. సిండరెల్లా అనే చక్కని పుస్తంలో, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పటికీ ఇంకా విముక్తి పొందకుండా వుండటమనే సమస్య గురించి చర్చించారు. ఆ రోజుల్లో ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యమైన సమస్య అని అనుకునేవాళ్ళం. నేను చదువుకుని, సంపాదించి ఎవరి మీదా ఆధారపడకుండా వుంటానని నిర్ణయించుకున్నాను. నాన్నకు చెప్పాను, ఆయన ఏమీ అభ్యంతర పెట్టలేదు, కానీ బంధువులు విమర్శించారు. తర్వాత కూడా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నా పనిలోనే నిమగ్నురాలినై, దాని గురించి ఆలోచించలేదు. బహుశా సరియైన సమయంలో ఎవరూ కనిపించ లేదేమో! అన్ని సంబంధాలు కూడా వరకట్నం, భేరాలతో నియమిం చబడేవి. అవంటే అసహ్యం వచ్చి, ఎవరితోటీ ఆ విషయం గురించి మాట్లాడకపోయేది. నాన్న కూడా వాటిని వ్యతిరేకించేది. మా కుటుంబంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు.

బాజి:- ఖైఫీ ఆజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళి చేసుకున్నాడు. జకియా (నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందని ఆయన అన్నాడు. ఆదిల్‌ పార్టీ సభ్యుడవడమే ముఖ్యకారణం. అంటే పార్టీ సభ్యులంటే ఆ రోజుల్లో మంచి ఆభిప్రాయముండేది. వ్యక్తిగత సామర్థ్యముగాని, క్లాసు, కల్చరల్‌ బ్యాగ్రౌండ్‌ గురించిగాని ఆలోచించే వాళ్ళం కాదు. బతుల్‌ ఇంకొక ఉదాహరణ ఆమె పార్టీ సమావేశాల కొచ్చేది, పాటలు పాడేది, కవిత్వం చదివేది. ఆమె ఒక నవాబు కూతురు, పార్టీలోకి వచ్చింది. ఆమె తండ్రికి ఇంకొక స్త్రీతో సంబంధముండేది. తన తల్లి చనిపోయిందనే కసితో బతుల్‌ పార్టీలో చేరింది. ఆటువంటప్పుడు ఎన్నాళ్ళుంటుంది పార్టీలో ? కొంతవరకు కమిట్‌మెంట్‌, ఆసక్తి ఉండి రావడం వేరు – ఆమెకొక పదకొండు సంవత్సరాల కొడుకు కూడా ఉండేవాడు. ఆ దశలో పార్టీలోకి చాలా మంది స్త్రీలు, పురుషులు వచ్చారు. పార్టీ వాళ్ళకు సైద్ధాంతికంగా సరియైన శిక్షణ కూడా ఇవ్వలేదు. మానసికంగా బతుల్‌షియా అవటం వల్ల బాధను ఓర్చుకోగల్గాలి అనే భావంతోనూ, తన మానసిక సమస్యలతోనూ పార్టీలోకి వచ్చింది. వాటిని దాటలేకపోయిందామె, తర్వాత ఆమె భర్త నొదిలేసింది. పార్టీ ఆమెను సపోర్టుచేసింది. జహీర్‌ ఇంకో ఉదాహరణ. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబాన్ని వదిలి, పార్టీలో కొచ్చింది. మోఇన్‌ను పెళ్ళిచేసుకుంది. ఇద్దరూ పార్టీలో చాలా ఆక్టివ్‌గా ఉండేవాళ్ళు. ఆమె చివరిదాకా, మూడేళ్ళ క్రితం ఆమె కాన్సర్‌తో చనిపోయింది. అతను మెదక్‌ పార్టీ యూనిట్‌కి సెక్రటరీ.

ఇప్పుడు పార్టీలో సరియైన ప్రోగ్రాం గాని, పని గానిలేదు. పైగా ఆత్మవిమర్శన చేస్తూ వుంటాము, నేను అమ్మాయిలనీ, అబ్బాయిలనీ పిలిచి మీటింగు పెట్టాను. మహేంద్ర కూడా వచ్చాడు ఎలక్షన్ల తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. యువకుల్ని చైతన్యవంతుల్ని చేసి కార్యకర్తలుగా తయారుచేయడానికి ఎటువంటి గట్టిప్రోగ్రాం లేదు. చిన్నవాళ్ళను తేవాలి. మేమింకా ఎన్నాళ్ళు చేస్తాము? 25, 30 సంవత్సరాలు చేశాము. పార్లమెంటరీ బై ఎన్నికలప్పుడు రాజ్‌ (రాజ్‌ బహదూర్‌ గౌడ్‌)కి చెప్పాను – ఎక్కువగా వోటువచ్చింది ఆసిఫ్‌ నగర్‌ నుంచి-2200 దాకా, దాంట్లో 25-30 దాకా మాకుటుంబం దే, రాజ్‌ అభ్యర్ధి కాబట్టి మేము తప్పనిసరిగా పనిచేయాలనుకున్నాం.

ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే… వాళ్ళు పార్టీకై ఏమీ చేయరు. కొంతమంది మాస్కో వెళ్లి వచ్చారు. అయితే పార్టీకేం చేశారు? నా అన్నదమ్ములా – జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. అన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నా జైల్లో వున్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌.సి చేస్తున్నది. భార్య తర్వాత చదువకుని ఉద్యోగం చేసింది. నా ఇంకో చెల్లెలు రాబియా పిల్లలు అంతా బాగా చదువకున్నారు. కెనెడాలో వున్నారు. అంతా గోల్డ్‌మెడలిస్టులు. ఉద్యోగాలున్నాయి. ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగే దాన్ని. ఇప్పుడు 50 మంది రారు.

రజియా:- గతం భవిష్యత్తు లేదనిపిస్తుంది. వర్తమానమే ఉంది. అదీ ఇప్పటి వ్యవస్థ విలువ.

(‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.