భూమిక మిత్రులకు, నమస్తే!
ఇండియాస్ డాటర్ నిషేధంపై పిడికిలెత్తిన భూమికకు జేజేలు. ‘ముదిమిసిమి’ లాంటి మోహ పరవశ కథలు 70, 80ల్లో బాగానే వస్తుండేవి. ఆ మాటకొస్తే శారదా అశోకవర్ధన్ గారే అటువంటి చక్కని కథలు రాశారు. ఇప్పుడు కావలసింది అటువంటి కథల పునర్వికాసం కాదు, నిజంగా ఆవిధంగా జీవితాన్ని నడుపుకుంటున్న అపురూపమైన వ్యక్తుల్ని కనుగొని, వారిని సత్కరించడం. ఆమె ఎడంచేత్తో పుంఖానుపుంఖాలుగా రాసే రచయిత్రికాదు అంటూ ఎవరిని విమర్శించారో తెలియదు, ఇప్పటి స్త్రీవాద రచయితల్లో అటువంటి పుంఖానుపుంఖ రచయిత్రులెవరూ లేరనే నేను తలుస్తాను. స్త్రీ సంతానవతి కావడానికి పర పురుషుని వినియోగించడం అనేది వేద, రామాయణ, భారతాల కాలంనుంచే వుందని విజయభారతి గారు రుజువు చేస్తున్నారు కానీ, వాస్తవంలో భారతీయుల మనోఫలకాలపై ముద్రితమైనది మనుధర్మ శాస్త్రమే. మను ధర్మశాస్త్రంపై దెబ్బకొట్టకుండా, ఏ పుక్కిటి కథల్లో ఏ ఆదర్శాలు చూసుకున్నా వ్యర్థమే. డెబ్బయి ఏళ్ళ క్రిందే బాబా సాహెబ్ అంబేద్కర్ పబ్లిక్‌గా మనుస్మ ృతిని దహనం చేసినట్టు యిప్పటికైనా స్త్రీ వాదులు ఆ పని చేయగలరా? అలా చేయగలిగితేనే భారత స్త్రీకి నిజమైన న్యాయం చేయగలుగుతారు. అప్పటి ఆయన గట్స్ యిప్పటి స్త్రీవాదులకున్నాయా? తెలుగు సాహిత్యాన్ని హిందీలోకి వంద పుస్తకాలకి పైగా అనువదించిన వారు శ్రీమతి పారనంది నిర్మలగారు వున్నారు. ఆమె శాంతసుందరిగారి కంటే చాలా సీనియర్. ఆమె గురించిన యింటర్వ్యూ కూడా యివ్వండి.
మొత్తం సంచికలో ‘ఒక నడక’ అంటూ ‘మోదుగుపూలు’ శీర్షిక గుండెలమీద కాస్తంత పన్నీరు చిలకరించింది.
– డి. నటరాజ్, వైజాగ్.
……..ఙ……..
”ముదిమిసిమి – ఓల్గా” ఓపిక, డబ్బుకు ఇబ్బంది లేని తల్లీ కూతుళ్ళకు సంతోషంగా ఉండడానికి ఎన్ని చెయ్యచ్చో గొప్పగా చూపించారు. ఉద్యోగ బాధ్యతల్తో జీవితంలో సంగీతం, సాహిత్యం ఇంకా చిన్న చిన్న సంతోషాలకు ఎలా దూరమవుతారో, అవి మళ్ళీ తిరిగి జీవితంలోకి తెచ్చేటట్టు చేసిన తల్లి కూతురే అదృష్టవంతురాలని ఆనడంలో ఔచిత్యం ఉంది. పెద్ద వయసులో, పాత స్నేహితులను కలవాలనుకోడం, అది కూతురు అమలు పరచడం అపురూపంగా కల్పనికంగా ఉంది. – చిమట రాజేంద్రప్రసాద్, ఇమెయిల్.
……..ఙ……..
‘భూమిక’ సంపాదకులు శ్రీమతి సత్యవతిగార్కి, నమస్కారం,
మార్చి నెలలో ప్రచురితమైన ఓల్గా గారి, ”ముదిమిసిమి” కథ చదివిన తర్వాత, ”ఔను నాకూతురే నా కన్నతల్లయింది. నేనే దాన్నట్లా చేశా. అందరూ నా అదృష్టం అంటారుగాని, అసలదృష్టం సుజాతదేనే” – తన కూతురు గురించి రంగమ్మ తన మేనగోడలుతో అనిపించిన చివరి మాటలతో రంగమ్మ పాత్రను పునర్జీవింప జేశారు ఓల్గా గారు. అంతేకాదు చిన్నప్పుడు నాతో అన్నీ చేయించుకున్నావ్; యిప్పుడు నువ్వు నాకు చెయ్యాలనే ‘డిమాండ్’ ఆ మాటలలో ధ్వనించింది. ఆ విధంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలు మానసికంగా దగ్గర కావాలని, వీలైనంత మేర వారికి సేవలందించాలనే ఒక బలమైన సందేశాన్ని యీ కథ ద్వారా నేటి యువ తరానికిచ్చారు; హేట్సాఫ్ టు ఓల్గా గారు. కెరీర్ వెనుక, వస్తు వినిమయ సంస్కృతి వెనుక పరుగులు తీస్తున్న నేటి యువతీ యువకులను యీ కథ కొంత వరకైనా ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను.
ఏప్రియల్ నెల ‘ప్రతిస్పందన’లో శ్రీమతి శారదా అశోక్‌వర్ధన్ గారు ఎల్లలు దాటిన వారి ఆనందాన్ని – యించుమించు – ”ముదిమిసిమి” కథను రిపేట్ చేస్తూ పొంగిపోయారు. చాలా సంతోషం. ఆ ఆనంద ఝరిలో కొట్టుకుపోతూ ”ఇక భూమిక, స్త్రీల పాలిటి చక్కటి వేదిక. దాన్ని నడిపించే శక్తిమంతురాలు సత్యవతిగారు. ఆమెకు భగవంతుడు ఇంకా ఎంతో శక్తి నివ్వాలని తద్వారా, బాధిత, పీడిత వర్గాలకి, ఎంతో మేలు జరగాలని ఆశిస్తున్నాను” అని శ్రీమతి శారదా అశోక్‌వర్ధన్ గారు ఆకాంక్షించారు. మంచిదే. సత్యవతిగారికి ఆ శక్తిని ఆర్ధిక పరంగా మనమందరమూ చేకూర్చాలని నా విన్నపం. అందుకు ఉడతా భక్తిగా నేను 1000/- రూ||ల డొనేషన్‌ను ఆన్లైన్లో ఈ రోజే పంపిచాను. ”భూమిక”కు చందాదారులను చేర్పించడానికి కృషి చేస్తాను.
‘భూమిక’ పాఠకుల మందరమూ తలో చెయ్యీ వేద్దాం! ‘భూమిక’ లో రచనలు చేసే వారందరూ తలో చెయ్యీ వెయ్యాలని నా వ్యక్తిగత విన్నపం. – గొట్టుముక్కల సూరి, హైదరాబాదు.
……..ఙ……..