శాంతా రామేశ్వర్‌రావు – ఆంగ్లమూలం: వసంత కన్నబిరాన్‌ అనువాదం : అబ్బూరి ఛాయాదేవి

    మీ వివాహం గురించి చెబుతారా?
నేను ఎక్కడో దారి పక్కన పాత పుస్తకాల దుకాణంలో ‘వివాహ చిత్రణ’ అనే పుస్తకాన్ని చూశాను. మీరు చదివారా?Shantha ram
    లేదనుకుంటాను.
నాకు అంతగా గుర్తులేదు. చాలా కాలం క్రితం దాన్ని చదవడం వల్ల. ఏమైనా, ఆ పుస్తకం చదివినప్పటి నుంచీ ‘వివాహచిత్రణ’ అనే పుస్తకం స్వయంగా రాయాలను కున్నాను. అదే పేరుతో కాదు, ఆ అంశం మీద. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ, ఆడైనా మగైనా, తమ వివాహం గురించి పుస్తకం రాయవచ్చు. అందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అందుకే (ఆగి), మీ ప్రశ్నలు చాలా సందర్భోచితంగా ఉంటాయి. ఈ విషయం గురించి రాయాలనే కోరిక తీరనే లేదు.
    ఇప్పుడు మీరు రాయడం ప్రారంభించవచ్చు కదా.
అవును. అదే చేస్తున్నాను. మీరు అడిగే ప్రశ్నలు నాకు సహాయపడతాయి కనుక నేను కూడా రాస్తున్నాను. లేకపోతే ఇప్పుడు కూర్చుని ‘అనగనగా…’ అంటూ మొదలు పెట్టిరాయలేను. అలాగే ఉంటుంది అటువంటి పుస్తకం. అంటే, నా ఉద్దేశ్యం, మీ ప్రశ్నలకు జవాబులు చెబుతుంటే, కొంత వరకైనా, నేను పుస్తకం రాసినట్లే ఉంటుంది.
    అవును మీ బాల్యం గురించి చెప్పండి.
మా అమ్మ ఎంతో భక్తి పరురాలు. మా అమ్మ ఎంతో చక్కని కథలు చెప్పడం వల్ల నాకు పురాణాలలో అత్యంత ఆసక్తి ఏర్పడింది. మా నాన్న స్వయంగా రచయిత అవడం వల్ల ఆయన వేరే రకంగా కథలు చెప్పేవారు. అభినయ పూర్వకంగా ఎంతో ఆహ్లాదకరంగా చెప్పేవారు. నా తలని తన తొడ మీద పెట్టుకుని మా అమ్మ చెప్పేకథలు వేరేగా ఉండేవి – కౌరవుల గురించీ, పాండవుల గురించీ, వాళ్లు చేసిన వాటన్నిటి గురించీ. అందుచేత నేను పురాణాల గురించి ఎంతో తెలుసుకుంటూ ఎదిగాను. మా అమ్మ చాలా ఆకర్షణీయంగా ఉండేది, చాలా సాదాసీదాగా ఉండేది. తనదైన రీతిలో ఎంతో కవితాత్మకంగా ఉండేది. కథల్ని ఎంతో చక్కగా చెప్పేది. అందువల్లనే నా కథలు అంత వర్ణనాత్మకంగా ఉంటాయి. నేనేం చెయ్యలేను. అలాగే రాస్తాను, అన్ని వివరాలతో, అయితే, ఈ రోజుల్లో కథలు సంక్షిప్తంగా ఉండాలి. మా నాన్న స్వయంగా రచయిత కదా ఆయనకి ఇంగ్లీషు అంటే చాలా ఇష్టం, ఆయన కన్నడంలో రాశారు, కన్నడంలో మాట్లాడేవారు. కానీ ఆయనకి ఇంగ్లీషు అంటే ఇష్టం. ఆయన నాకు చాలా పుస్తకాలు ఇచ్చారు. కొన గలిగినన్ని పుస్తకాలు కొనేవారు. దారి పక్కన అమ్మే పుస్తకాల్ని, హిగిన్‌ బాథమ్స్‌కి వెళ్ళి, రైలుస్టేషన్లలో అమ్మే పుస్తకాల్ని, అన్ని రకాల పుస్తకాలూ కొనే వారు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎదిగినా, బోలెడు పుస్తకాలతో ఎదిగాను. ఆంగ్ల సాహిత్యాన్ని ఎంతగానో చదివాను, మాతృభాషలో పుస్తకాల్ని కూడా వదిలి పెట్టకుండా. వివేకానంద, శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి మొదలైన వారందరి విశేషాల్లో మునిగిపోయేవాళ్ళం. ఈ విషయాలన్నీ మా జీవితాల్లోకి సహజంగానే వచ్చాయి.
అంతే కాక, మేము గుడికి వెళ్ళే వాళ్ళం. గుళ్ళో నృత్యాలు జరిగేవి. మా అత్తయ్య, మా నాన్నకి ఇష్టమైన సోదరికి ఒక పూజారితో వివాహం జరిగింది. ఆయన పోయినప్పుడు ఆవిడకి పాతబడిన చీకటి ఇరుకు గదుల్లో ఒక దాన్ని ఇచ్చారు. అందులోనే ఉండేది. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం ఆవిడని చూడటానికి, ఆ గుడి తాలూకు ఆవుల్ని ఆవిడకి అప్పజెప్పారు – ఆవిడ బాగా సమర్థురాలు. ఎంతో రుచికరమైన భోజనాన్ని తయారుచేసి మాకు తినిపించేది. గుడికి కావల్సిన ప్రసాదాల్ని కూడా తయారుచేసేది. సంప్రదాయ బద్ధమైన వంటలు ఆవిడ బ్రహ్మాండంగా చేసేది. ‘అప్పి’ ఇంటికి వెళ్ళడం – ఆవిడ చేసిన లడ్డూలు, కాచిన పాలు! ఆ దూడలు – ఆ దూడల్ని ఎంత బాగా చూసుకునేది! ఎంత బావుండేదో తెలుసా! నేను ఆ గుడి చుట్టూ తిరిగి ఆడుకునేదాన్ని. అక్కడికి ఒక కుర్రవాడు వచ్చేవాడు, నాతో కలిసి ఆడుకునేవాడు. పదకొండేళ్ళు ఉండొచ్చు. పూజారి అవడానికి శిక్షణ పొందుతూండేవాడు. నాకు ఏడేళ్ళుంటాయి. నేనంటే అతనికి చాలా ఇష్టం. అతని పేరు నందు. నేను గుడి చుట్టూ పరుగెడుతూంటే, ”విను కృష్ణుడు మురళి వాయిస్తూంటే విను” అంటూ ”ఈ …” అనేవాడు. ”అదుగో, కృష్ణుడు, కృష్ణుడు వాయిస్తున్నాడు” అనేదాన్ని నేను. వినేవాళ్ళం. నిజంగానే వినిపిస్తున్నట్లు అనిపించేది తెలుసా!
నందూ నేనూ మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. తరవాత మాయమైపోయాడు. శ్రీరళికి అతన్ని తీసుకు వెళిపోయారు. సంగీతం నేర్చుకున్నాడు. కొండల్లో అనుకుంటాను. అక్కడికి తీసుకుపోయి జనానికి దూరంగా దాచి ఉంచారు. అక్కడే సంగీతం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను గొప్ప సంగీత విద్వాంసుల్లో ఒకడు.
    ప్రేమకథ
మా అత్తయ్య ఇంటికి నన్ను ఎందుకు పంపించారో తెలుసా? నాకు పేచీలు పెట్టడం అలవాటు. ఒకసారి మా అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు, మా అమ్మ ఆవిడతో అందిట, ”నాకు ఈ పిల్లతో ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఎంత పేచీలు పెడుతుందో, ఏడుస్తూ, అరుస్తూ, నేలమీద పడి దొర్లుతుంది” అని. ”దీన్ని నా దగ్గరికి తీసుకురా, ఆ గుడి, ఆవులు, ఆ వాతావరణం దాన్ని ప్రశాంతంగా ఉండేట్లు చేస్తాయి” అందిట మా అత్తయ్య. నేను మా అత్తయ్య ఇంట్లో ఉండాలను కునేదాన్ని. ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు, గుడికి పారిపోయేదాన్ని. ఓ! ఆ గుడిలో ఎంతగా ఆడుకునేదాన్నో! దాని చుట్టూ తిరిగేదాన్ని, గుడి మూసి ఉండటం వల్ల. అయితే అది సంతృప్తికరమైన జీవితం. ఒకవైపు ఇంగ్లీషు ప్రభావం ఉన్న స్నేహితులు. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు, ”చెప్పులు లేకుండా ఎలా వెళ్ళను!” అనే దాన్ని. దానికి మా నాన్న ”ఫరవాలేదు, చెప్పులు లేకుండా వెళ్ళు” అనే వారు. వాళ్ళు మా పట్ల ఎంతో దయగా ఉండేవారు. వాళ్ళకి టెన్నిస్‌ ఆడుకునే స్థలాలూ, పిల్లల ఆటపాటలతో పార్టీలూ ఉండేవి. నేను ఇంటికొచ్చి నాకూ ‘పిల్లల పార్టీ’ కావాలనేదాన్ని. అప్పుడు నా తల్లిదండ్రులు, నిరాడంబరమైన జీవితం గురించి చెప్పేవారు. నిరాడంబర జీవితం ఎవరికి కావాలి? నాకు విలాసవంతమైన జీవితం గడపాలని ఉండేది!
    మీకు విలాసవంతమైన జీవితం ఎప్పుడు లభించింది? మీరు నిరాడంబరంగా ఉండాలనుకున్నారు కదా! మొదటి రోజుల్లో మీ అనుబంధం ఎలా ఉండేది?
ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే, ప్రేమలు అనేక రకాలుగా ఉంటాయి కదా? పాతకాలపు భారతీయులు ఎప్పుడూ అనేవారు – పాశ్చాత్యులు పెళ్ళికి ముందే ప్రేమించుకుంటారు. ఆ తరువాత విడిపోతారు, అని. అది పూర్తిగా నిజం కాదు. మనలో మాత్రం, పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకోరు కూడా, అయినా ప్రేమ పెరుగుతుంది. అది నిజం కాదు, కేవలం ఒక నానుడి మాత్రమే. అలాగనే అది అబద్ధమూ కాదు.
    కాదు
నా మటుకు నేను రామేశ్వర్‌ని కాలేజీలో చూశాను. అతని గురించి ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు. కాలేజిలో అతని కన్న ఆకర్షణీయమైన కుర్రాళ్ళు, వేరే ఉన్నారు అనిపించేది. ‘నువ్వు ఒక ‘రాజకుమారుణ్ణి’ చేసుకుంటావా? అతను ఎంత మంది ఆడవాళ్ళని పెట్టుకుంటాడో” అన్నాడు మా అన్నయ్య. రామేశ్వర్‌ నవ్వి, ”మీ అన్నయ్యతో చెప్పు, నా దివాణంలో బోలెడంత మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నువ్వొకత్తివి” అన్నాడు, వాడిని వేళాకోళం చేశాడు.
    రామేశ్వర్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
అతి తెలుసుకునే మార్గం తెలియదు నాకు. తెలుసుకునే మార్గం నాకు ఎందుకు లేదంటే, నేనింకా లోక జ్ఞానంలేని అమాయకురాలిని. లోకజ్ఞానం ఉన్నప్పటికీ, పదహారు, పదిహేడేళ్ళ వయస్సుల్లో ఒక వ్యక్తి గురించి ఎలా తెలుస్తుంది? లౌక్యంగా ఆలోచించడం చాతనవుతుందా? కాదు కదా?
    కాదు.
నాతో ఏ కుర్రవాడు మంచి గా ఉన్నా, అతన్ని ఇష్టపడేదాన్ని, అతను చూడటానికి కాస్త బావుంటే చాలు. (నవ్వుతూ) రామేశ్వర్‌ ఫరవాలేదు. కానీ అతని జీవన విధానం గురించి భయపడేదాన్ని. ఇటువంటి రాజాలూ, నవాబులూ వంటి వాళ్ళు నిజాం కాలేజీలో చాలా మంది ఉండేవారు. నేను చాలా భయపడేదాన్ని.
    మళ్ళీ రామేశ్వర్‌ దగ్గరికి వద్దాం.
అదే కదా. అలాగ వీళ్ళందరూ… రామేశ్వర్‌ ఎలాగో ఆ వర్గంలోకే వచ్చాడు. అతను చాలా తరచుగా ”షేర్వానీ” వేసుకునేవాడు. నేను చాలా భయపడేదాన్ని. కానీ రామేశ్వర్‌కి కూడా సిగ్గు ఎక్కువ. అతను నాతో స్నేహం చెయ్యాలనుకున్నాడు. కాని చాలా సిగ్గు పడేవాడు. ఒక రోజున అతను మా ఇంటికి వచ్చాడు. మా అన్నయ్య ఇంట్లో లేడు. మా అమ్మ ఉంది. అతను కేవలం పలకరించడానికి వచ్చాడు. మా అమ్మ అతనికి ఒక కప్పు కాఫీ చేసి ఇచ్చింది. అతను తాగుతున్నాడు. మా అన్నయ్యకేం పట్టుకుందో తెలియదు. వెంటనే తిరిగి ఇంటికొచ్చాడు. అతన్ని అక్కడ చూశాడు. నాకు చాలా భయం వేసింది. మా అన్నయ్య  అతన్ని పట్టించుకోలేదు. ఏమాత్రం పట్టించుకోలేదు. నాకు తెలియలేదు వాడు… ఏమైనా నేను చాలా భయపడ్డాను. రామేశ్వర్‌ వెళ్ళిపోయాడు. అతను చాలా మర్యాదగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఏ పుస్తకమో ఏదో అడిగి తీసుకువెళ్ళడానికి వచ్చి ఉంటాడు.
మేము నిజాం కాలేజిలో ఆరుగురం మాత్రమే ఆడపిల్లలం. ఒకసారి మమ్మల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. రామేశ్వర్‌ మమ్మల్ని ఆరుగుర్నీ ‘గ్రీన్‌ గేట్స్‌’ కి తీసుకువెళ్లాడు. అక్కడే అతని పాత ఇల్లు ఉండేది. వాళ్ళమ్మ గారిని మేము కలుసుకునేందుకు తీసుకువెళ్తున్నానన్నాడు. తరవాత నాతో అన్నాడు ”నిన్ను మా అమ్మకి చూపించాలని తీసుకు వెళ్ళాలనుకున్నాను. నిన్ను ఒక్కర్తినీ పిలిస్తే రావని, మిగిలిన ఆడపిల్లల్ని కూడా పిలిచాను” అని. మేమందరం వెళ్ళాం. కానీ ఆ సన్నివేశం నా పైన ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఏమైనా, రామేశ్వర్‌తో స్నేహం వల్ల నేను కోరుకుంటున్నదేమీ లేదు. నేను ఎవరితోనైనా సరే, అన్నయ్యకి కోపం వచ్చేది. మాది గందరగోళపు సమాజం అనుకుంటాను. పరిధి దాటి వెళ్ళడం వల్ల ఏమవుతుందో నాకు స్పష్టంగా తెలియదు.
మగపిల్లలతో కలిసి తిరగడాన్ని నేను ఇష్టపడేదాన్ని. నిజంగానే! ఆడపిల్లలతో, ముఖ్యంగా హిందువుల పిల్లలతో కలిసిన్పుడు కన్న ఎక్కువ ఇష్టపడేదాన్ని. నాకు వాళ్ళంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ దృక్పథం సంకుచితంగా ఉండేది. వాళ్ళ సంభాషణ చప్పగా ఉండేది… పదుకోన్‌ దీను నేనూ మంచి స్నేహితులం. మా అన్నయ్యకది ఇష్టం లేదు. నేను తప్పు చేసినట్లు అనుకుని, అతనికి దూరంగా ఉన్నాను. రామేశ్వర్‌తో నిజంగా స్నేహం చెయ్యలేదు, కానీ చెయ్యాలని ఎంతగానో అనిపించేది… నేనెప్పుడూ అనుకునేదాన్ని – సరియైన వ్యక్తితో పెళ్ళి జరిగితే, సర్దుకుపోగలగుతాను అని.
నేను లక్నోకి దాదాపు పారిపోయాను. నేను ఇంకొక సోదరుడింట్లో ఉన్నాను. వాళ్ళు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజప్ఫర్‌ నగర్‌లో ఉన్నారు. అందుచేత వాళ్ళు నన్నులక్నోకి పంపి అక్కడ కాలేజి హాస్టల్‌లో చేర్పించారు. అక్కడ నేను చాలా ఆనందంగా ఉన్నాను. అది ఆడపిల్లల కాలేజి, చక్కని గ్రంథాలయం, అమెరికన్‌ ఉపాధ్యాయులతో, ఆ మధ్య ఎవరితోనో చెబుతున్నాను. నాకు క్రిస్‌మస్‌ అంటే ఎంత ఇష్టమో అనీ, వాస్తవానికి నేను క్రిస్టియన్‌ నే ననీ. క్రిస్టియన్స్‌ చేతుల్లో పెరిగాను. ఆ అమెరికన్‌ మిషనరీ వాళ్ళు నన్ను చాలా, చాలా బాగా చూసుకునేవారు. నేను రాజకీయశాస్త్రం, చరిత్ర, ఆంగ్ల సాహిత్యం తీసుకున్నాను నా పాఠ్యాంశాలుగా. ఆ విషయాన్ని వాళ్ళు ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు.
    ప్రేమ మాటేమిటి?
అది చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే, ఎవరైనా ప్రేమలో ఎలా పడతారో నాకు తెలియదు. నేను ప్రేమలో పడ్డాననుకోను. అది ఎవరితో నైనా కావచ్చు! దీనుకావచ్చు. దీను, నేనూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అతను మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళాడు. అతను ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. మా అన్నయ్య ఆ ఉత్తరాల్ని తెరిచి చూసేవాడు. అయితే అతను చక్కని ఉత్తరాల్ని మంచి ఇంగ్లీషులో రాసేవాడు. నాకు పదిహేడో పదహారో ఉంటాయి… స్వాతంత్య్రోద్యమం కొనసాగుతోంది. నిజంగా, అతను ఎన్నో అద్భుతమైన విషయాల్ని వర్ణించేవాడు తన ఉత్తరాల్లో వాటికి నేను చక్కని సమాధానాలు రాసేదాన్ని. అతను ‘ఎప్పటికీ నీ..’ అంటూ సంతకం పెట్టేవాడు. వాటిలో ఉన్న ప్రణయం అంతా అదే! (గట్టిగా ఊపిరి తీసుకుంటూ) మా అన్నయ్య ఎంత రాద్ధాంతం చేశాడు! ‘ఏమిటీ – ”ఎప్పటికీ”? దాని అర్థం నీకు తెలుసా?” అంటూ. (నవ్వు).
    అది హాస్యాస్పదమే, ఇటువంటిది నేనూ ఎదుర్కొన్నాను.
ఏమైనా, నేను ఎవరితోనైనా ప్రేమలో పడ్డానికి సిద్ధంగా ఉన్నాను, అయినా, నేను ఎవరి ప్రేమలోనూ పడ్డానికి సిద్ధంగా లేను. అదీ పరిస్థితి… ఇది నా జీవితాన్ని అస్తవ్యస్తం చెయ్యనివ్వదలుచుకోలేదు. సరే, చివరికి నేను ”చూడు, రామేశ్వర్‌ నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు” అన్నాను. పెద్దగొడవ, రాద్ధాంతం! ఓ! నన్ను ఇంట్లో బంధించి ఉంచారు. ”ఈ రాజాలు ఏం చేస్తారో నీకు తెలియదు. వాళ్ళు ఎత్తుకుపోతారు, దొంగతనంగా తీసుకుపోతారు. ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఆడవాళ్ళని ఉంచుకుంటారు” ఘోరం!
అన్నదమ్ములిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు నిందారోహణలతో, ”నువ్వు దాన్ని దాని ఇష్టానికి వదిలేస్తున్నావు. వగైరా అంటూ, అప్పుడు నన్ను బొంబాయికి పంపించారు. నేను బి.ఎ. పూర్తి చేశాను. అప్పటికి రామేశ్వరరావు నాకు రాయడం మొదలుపెట్టాడు, తనని పెళ్ళిచేసుకోమన్నాడు. నాకు అభ్యంతరం లేదు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది కూడా అని చెప్పాను. కానీ మా వాళ్ళు అంగీకరిస్తే గాని, నా అంతట నేను ముందుకి అడుగు వేసే ధైర్యం చెయ్యలేను” అని చెప్పాను. నేను సాహసించలేను అంతే. ఎలా చెయ్యాలో నాకు తెలియదు. నేను లేచి పోగలనని నాకు తెలియదు. నేను చాలా భయపడ్డాను. నేను వాళ్ళని నమ్మాను మీరు పెడదారిని పట్టించే రకం అని అనగానే మా అక్కయ్యే ఆమాట వాడింది. దాని అర్థం ఏమిటో నాకు తెలియదు. అప్పుడు ఎవరో అన్నారు… ”అతనికి, ఈ రాజాల సంగతి తెలుసుగా, రోగాలు కూడా ఉండి ఉంటాయి” అని.
    ఏమిటి.
వాళ్ళకి రోగాలుండవచ్చు! సుఖ వ్యాధి మొదలైన వాటి గురించి ఒక సినిమా కూడా వచ్చింది. ”నీకు ఈ రాజాల సంగతి తెలియదు” అన్నారు. నాలో అన్ని రకాల భయాలూ ప్రవేశపెట్టారు. అందుచేత నేను భయపడ్డాను, రామేశ్వర్‌ని నమ్మిన దానికన్న మా వాళ్ళని ఎక్కువ నమ్మాను. చివరికి వాళ్ళకి లొంగిపోయాను. ”నేను ఒప్పుకోలేను” అని రామేశ్వర్‌కి రాశాను.
అప్పుడు నన్ను బాగా చదువుకున్న వాడికిచ్చి పెళ్ళిచేశారు. అతన్ని నేను ప్రేమించాలి, అదే చేశాను. అతని మంచి చెడులన్నీ చూసుకున్నాను. అతను… ఇప్పుడు అతనికి ఏదో మానసిక వ్యాధి ఉంది. మామూలుగా లేడు అనుకుంటాను, ఎందుకంటే, నన్ను చచ్చేటట్లు కొట్టే వాడు తెలుసా. తెగబాదేవాడు. అదంతా భరించాను – నన్ను నేనొక పతివ్రత లాగ, భర్తని బాగు చేసుకుని అతనికి ప్రేమని అందించాలనుకుని, ఈ లక్షణాన్ని నా దగ్గరికి వచ్చి నాతో తమ ఆంతరంగిక విషయాలు చెప్పుకునే స్త్రీలలో చూస్తున్నాను. అదే మళ్ళీ చూస్తున్నాను. భర్తలు కొందరు భార్యల కాళ్ళ మీదపడి ”నువ్వు వెళ్ళిపోతే నేను శిథిలమైపోతాను” అంటారు. ఒకావిడ ఉంది – ఇక్కడకొచ్చి కూర్చుని తన జీవితం గురించి చెబుతుంది – అచ్చు నాలాంటి జీవితమే… దాదాపు. ఈ స్త్రీలందరూ అటువంటి బంధాలలో ఇరుక్కుపోయారు.
స్త్రీలు ఎప్పుడూ అనుకుంటారు అటువంటి వ్యక్తిని ఎలాగో అలాగ మార్చవచ్చునని!
అది ఎప్పుడూ మారలేదు. ఒకసారి రామేశ్వర్‌ ఫోటోని చూశాను. అప్పటికి అయిదేళ్ళు గడిచాయి. అయిదేళ్ళు. స్వాతంత్య్రం వచ్చింది. దాన్ని (రాచరికాన్ని) వదులుకున్నారు కదా. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో అతని ఫోటో, అతని గురించిన వివరాలూ ఉన్నాయి. అందులో అతన్ని ‘సోషలిస్ట్‌ రాజా’ అని అంటూ, అతను తన రాష్ట్రం కోసం రాజ్యాంగ పరంగా కృషి చేశాడనీ, గాంధీ గారితో కొంత కాలం గడిపారనీ రాశారు. అప్పుడు నాలో అనుకున్నాను – ‘ఇతనే కదా ఆడవాళ్ళని ఉంచుకున్నది!’ అని.
బొంబాయిలో ఉన్న మా అక్కయ్య కూడా ఈ వ్యాసాన్ని చూసిందట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను అంది – ”శాంతా, ఇతని గురించే కదా నువ్వు చెబుతూండే దానివి? అయ్యో, నేను ఏం ‘చేశాం’ మేము? నీతో ‘ఎలా’ ప్రవర్తించాం మేము?” అని.
అప్పటికే మా వాళ్ళకి తెలుసు నేను ఎటువంటి అవస్థలు పడుతున్నానో, నాకు ఒక బిడ్డ పుట్టడం జరిగింది. మరొక బిడ్డని కనబోతున్నాను. తక్కినవన్నీ ఎలా ఉన్నా, ఇతను ఏదీ చెయ్యడు. మంచి యోగ్యతలున్నాయి. బెనారస్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్‌.టెక్‌ చేశాడు. సమర్థత ఉన్నవాడైనా పని చెయ్యడు. అందువల్ల నేను ఉపాధ్యాయురాలుగా పని చేశాను. ఆ రోజుల్లో మా యోగ్యతలేమున్నాయి, నెలకి 70 రూ||లకి పని చెయ్యాల్సి వచ్చింది.
ఏమైనా, నేను నిజంగా దుస్థితిలో ఉన్నందువల్ల, చాలా తొందరపడి, రామేశ్వర్‌కి ఉత్తరం రాశాను. నాకొక స్నేహితుడు కావాలనిపించిందంతే. అందుచేత స్నేహపూర్వకంగా ఉత్తరం రాసి, తన జవాబుని మా అక్కయ్య చిరునామాకి పంపమనిరాశాను. మా అక్కయ్య రామేశ్వర్‌ రాసిన ఉత్తరం అందుకుని, అతనే రాశాడని ఊహించుకుంది. ఆవిధంగా మెల్లిగా పెరిగింది. నిజానికి చాలా త్వరగా పెరిగింది. రామేశ్వర్‌ వచ్చి, బయటికి ఎక్కడికైన వెళ్ళి భోజనం చేద్దామా”! అన్నాడు. నేను ”సరే” అన్నాను. మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం. అంతకు ముందు నేనెప్పుడూ చాకు, ఫోర్క్‌లతో తినలేదు. అది కూడా మాంసాహారం! బొంబాయిలో ‘ఇరోస్‌’ థియేటర్‌ పక్కనున్న రెస్టారెంట్‌కి వెళ్ళాం. నాకెంతో భయం వేసింది. నేనిదివరకు ఎప్పుడూ అటువంటి ప్రదేశాలకు వెళ్ళలేదు. సినిమాలు పాత కాలపువి – పల్లెటూరి పిల్లలు మగ స్నేహితులతో కలిసి వెళ్ళడం – డబ్బున్న కుర్రవాళ్ళతో కలిసివెళ్ళడం. అలా ఉండేది. నేను ఎంతో భయపడ్డాను. ”రామ్‌, నాకు చాకు, ఫోర్క్‌లతో తినడం చాతకాదు” అన్నాను ”ఫరవాలేదు. నేను చేతి వేళ్ళతోనే తింటాను. నువ్వూ అలాగే ”తిను” అన్నాడు. అలా మేమిద్దరం కూర్చుని తిన్నాం. అతను ఎంత మంచివాడో కదా? మెల్లిగా మాటలు నోటి వెంట వచ్చాయి.
”నువ్వు నన్ను ఎందుకు పెళ్ళిచేసుకోవు? నీ దుస్థితి గురించి విన్నాను. ఇతరులు చెప్పగా,” అన్నాడు.
    అతను మీ గురించి తెలుసుకుంటూండే వాడా?
ఊ. నాకు తెలియదు ఎలా తెలుసుకునేవాడో. అతను నన్ను పెళ్ళిచేసుకోమని అడగ్గానే పెద్ద గొడవైంది. ఎందుకంటే, నేను విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. నా భర్త నాకు విడాకులు ఇవ్వడు, ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. ఎలాగైనా నేను విడాకులు తీసుకోగలగాలి – నేను గర్భవతిని అయినా ఫరవాలేదు, ఆ బిడ్డ తన బిడ్డలాగే అవుతుంది, అన్నాడు. నా కొడుకుని వదులుకోవలసి వస్తుందని గ్రహించలేదు నేను. నేను ఫలానా అతన్ని పెళ్ళిచేసుకుంటానని నా భర్తతో చెప్పడం తొందరపాటయింది. అతను రామేశ్వర్‌ని బెదిరించడం మొదలుపెట్టాడు. అతన్ని చాలా ఘోరంగా బెదిరించి, చివరికి నా కొడుకుని తనతో తీసుకుపోయాడు. నేను అంతగా బాధపడలేదు. కొడుకంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి. నా కొడుకు చివరికి నా దగ్గరికి వచ్చిన తరవాత ఎప్పుడు నాతో చెప్పలేదు తనని తండ్రి హింసించాడని. ఇతరులు ద్వారా కూడా విన్నాను అతను బాగానే ఉండేవాడని. కానీ, ఈ మధ్య – ఇప్పుడు అతను పోయాడు – ఈ మధ్యనే నా కొడుకు చెప్పాడు. కొడుకు అతనికి ఎంత దుర్భరంగా అనిపించేవాడో. ఒక్క మంచి విషయం ఏమిటంటే, అతని కుటుంబంలోని తక్కిన వాళ్ళందరూ కుర్రవాడితో బాగా ఉండేవారుట. వాడి బాబయ్యలూ వాళ్ళూ వీణ్ణి బాగా చూసుకునేవారుట. కానీ చిన్న కుర్రవాడికి తల్లి దగ్గర లేకపోవడం, తండ్రి క్రూరమైన వాడు కావడం ఘోరమైన విషయమే. ఆ విషయమై నేను తప్పు చేసినట్లు బాధపడ్డాను… ఆ అపరాధ భావన నాకెప్పుడూ ఉండేది.
నా కొడుకు పద్దెనిమిదేళ్ళ వాడయ్యాడు. వాడి బాబయ్య నాకు ఉత్తరం రాస్తూ, ”ఇప్పుడు కుర్రవాడు పద్దెనిమిదేళ్ళవాడు అయాడు. ఇంక మీరు వాణ్ణి తీసుకువెళ్ళవచ్చు. తీసుకువెళ్తే మంచిది” అని రాశాడు. అప్పుడు మేము బొంబాయికి వెళ్ళాం. రామేశ్వర్‌ నాతో పాటు వచ్చాడు. వాడి బాబయ్యనీ పిన్నినీ కలుసుకున్నాం. వాళ్ళు మాతో చాలా మంచిగా ఉన్నారు. ముఖ్యంగా రామేశ్వర్‌తో ఎంతో మంచిగా ఉన్నారు. ఎంత మంచిగా ఉన్నారో చెప్పలేను. నా కొడుకు కూడా రామేశ్వర్‌ని చాలా ఇష్టపడ్డాడు. చాలా, చాలా ఇష్టపడ్డాడు. దాన్నిబట్టి ఎటువంటి…
    అతను ఎటువంటి వ్యక్తి అని…
అతను ఎటువంటి వ్యక్తి అన్నది తెలుస్తుంది. మా ఇద్దరి మధ్యా ఏ విభేదాలు ఉన్నా, మాలో ఎవరిపైనా కోపం చూపించలేదు, పిల్లలపైన అసలు ఎప్పుడూ చూపించలేదు. నాపైన చూపించలేదు, ఎన్నడూ. అందుకే నా కొడుకు రామేశ్వర్‌ అంటే చాలా ఇష్టపడేవాడు. అలాగే వాడి భార్య, కూతురూ కూడా. వాళ్ళమధ్య ఒక బంధం
ఉండేది. అందుకే రామేశ్వర్‌ మా అన్నయ్యల కన్న ఎంతో భిన్నమైనవాడు. ముఖ్యంగా నా మొదటి భర్త కన్న ఇంకా ఎంతో భిన్నమైన వాడు. వాళ్ళిద్దరూ భిన్నమైన వ్యక్తులు. మానవుడి లక్షణాల గురించి చెప్పాలంటే నాకు తెలిసిన మనుషుల గురించే చెప్పగలను : నా అన్నయ్యలూ, నా మేనత్త, మేనమామ పిల్లలూ. వాళ్ళని ఎంతో ఇష్టపడేదాన్ని – నాకున్నవాళ్ళు వాళ్ళే కాబట్టి. ఇంకెవర్ని చూస్తాం? హఠాత్తుగా ఈ మనిషిని చూశాను – ఎంతో… ఇప్పుడు నీకు చెబుతూంటే, అతను నిజంగా అసాధారణమైన వాడుగా అనిపిస్తున్నాడు. రామేశ్వర్‌ అనే వాడు ”మీ అన్నయ్యలనే ఎందుకు ప్రామాణికంగా చూస్తావ్‌?” అని. ఇప్పుడు అందులోని నిజాన్ని గ్రహిస్తున్నాను… ఇప్పుడే అనుకుంటున్నాను – హింస, అభద్రతలతో, సంబంధాన్ని ఎలాగో అలాగ నిలుపుకోవాలనే పరిస్థితి నుంచి ఎంతో అనునయం, ఆదరాభిమానాలూ లభించే సంబంధంలోకి రావడంలో ఎంత తేడా ఉందని. మంచిదే. కానీ నీకు రామేశ్వర్‌ తెలుసు. నేను రామేశ్వర్‌ని పెళ్ళి చేసుకున్నాక ఎన్నో జరిగాయి.
కానీ ఇలా ప్రేమని పొందడం.
నాకు ప్రేమంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే అది ఇలా పెరిగింది. నేను నిజంగా ఎవరినైనా ప్రేమించగలిగే దాన్నో లేదో నాకు తెలియదు. రామేశ్వర్‌ని ప్రేమించగలిగాను, గౌరవించగలిగాను. ఇంకా అన్ని విధాలా, ఎందుకంటే, ఒక మనిషిలో ఉండాలని కోరుకునేవన్నీ ఉన్నాయి అతనిలో. అతనిలో అది ఉంది. అతను సిగరెట్‌ కాల్చడం ఇష్టపడేదాన్ని అలా చాలా బావుండేది కనుక. నేనెంత తెలివితక్కువ దాన్ని అనుకున్నాను. ”ఎంత అద్భుతం!”.
అదొక అదనపు విలువ, ఎందుకంటే, అతను చాలా పుస్తకాలు చదివాడు. అందుకు ప్రశంసించాను. అతను చదివిన దాన్ని నాతో పంచుకునేవాడు, ఎప్పుడూ. ఇటువంటివి సాధారణ జీవితంలో లభించవు – సాధారణ వైవాహిక జీవితంలో. భార్యలు చదువుతున్నారో లేదో, భర్తలు చదువుతున్నారో లేదో ఎవరు పట్టించుకుంటారు? నేను కేవలం ఆయన చొక్కా, బొత్తాలు కుట్టడంతో ఆయన సంతృప్తిపడలేదు. నేను ఆ పని చెయ్యలేదు కానీ, నేను చదివినదాన్ని తనూ చదివేవాడు. తను చదివిన దాన్ని నన్ను చదవమనేవాడు, నేను చదివిన దాన్ని తనూ చదివేవాడు. అంటే, క్రమంగా తెలియకుండానే ఇద్దరూ కలిసి ఎదుగుతారు. మీకు అలా అనిపించదూ?
తప్పకుండా!
అవును! భారతీయ స్త్రీలు జీవితం పొడుగునా చదువుతూనే ఉంటారు. నేను అలాగే చేశాను. ఇప్పటికీ చదువుతూ ఉంటాను. నేనేమైనా చవకబారువి చదువుతూంటే పట్టించుకునేవాడు కాదు. కానీ నాకే చవకబారు సాహిత్యం అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అతను నాకు అద్భుతమైన పుస్తకాలు ఇచ్చేవాడు చదవడానికి. ప్రయాణాలు చెయ్యడం ఒకటి. అదంతా అతని దగ్గర డబ్బుండటం వల్ల సాధ్యమైంది.
    మీరిద్దరూ కలిసి ఎక్కడెక్కడికి వెళ్ళారు?
మేమిద్దరం కలిసి చాలా ప్రయాణం చేశాం. ఎంతోమంది ఆసక్తికరమైన వాళ్ళని కలిశాం. అధికార రీత్యా ఘానా హై కమిషన్‌ పదవిలో ఉన్నప్పుడు గాని, రాజా పార్లమెంట్‌ మెంబర్‌గా ఉన్నప్పుడు గాని, గత జీవితాన్ని బట్టి గాని, ఏ విధంగానైనా, ఎంతో మంది ఆసక్తికరమైన వ్యక్తుల్ని చాలా సన్నిహితంగా కలవగలిగాను. సంబంధబాంధవ్యంలో అది చాలా ముఖ్యం. లేకపోతే, ఇంటికి కావల్సిన సరుకులు కొనిపట్టుకురావడం, పార్కుకి వెళ్ళడమో, సెలవల్లో, ఇక్కడికీ అక్కడికీ వెళ్ళి కాలక్షేపం చెయ్యడం, ఎండలో ఒళ్ళు కాచుకోవడం లాంటి పనులు చేస్తూ చవకబారు జీవితాన్ని గడపవచ్చు. మేమూ అలాంటి పనులు చేసి ఉండవచ్చు కదా? కానీ మా సంబంధ బాంధవ్యం వాటికి అతీతమైంది. అతను ఆలోచనాపరుడు, మేధావి, సహనశీలి, విజ్ఞాన సంపన్నుడు, చాలా చాలా తెలివైనవాడు. అతను గొప్పలు చెప్పుకోవడం నేను వినలేదు.
    లోపల కొంచెం శూన్యంగా ఉన్నప్పుడే గొప్పలు చెప్పుకుంటారనుకుంటాను. కాదూ?
అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. గడుసుగా కూడా. అయితే మా మధ్య కొన్ని తేడాలున్నాయి : జీవన విధానంలో. నేను డబ్బు విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాను అతను పట్టించుకోలేదు. కానీ నాకనిపించేది, ఇప్పటికీ అనిపిస్తుంది – ఇంట్లో అలంకరణ కోసం గొప్పగా కనిపించే సామాను గురించీ, నా దుస్తుల గురించీ మరీ దుబారా ఖర్చులు చేసేవాడు. నేను అటువంటి రకం కాదు. మామూలు నూలు బట్టలు వేసుకుంటాను ఇక్కడ అతను లేడు కూడా కదా. అతను బతికి ఉండగా అయితే! ఓయి దేవుడా! నన్ను అవి కంచి – ఆ కంచి పట్టు చీరల్ని కట్టుకోమనే వాడు ఎప్పుడూ. నాకు చిరాకు వేసేది. నాకోసం అందమైన పట్టు చీరలూ, నగల బహుమతులూ పట్టుకొచ్చేవాడు. ఓ!.. వాటిని కట్టుకోకపోయినా, పెట్టుకోకపోయినా ఎంతో బాధ పడేవాడు. వాటిని కట్టుకుంటే నాకు అసంతృప్తిగా ఉండేది. మరీ ఎక్కువగా ముస్తాబు చేసుకున్నట్లుండేది. ఈ విషయంలోనే మా మధ్య ఎన్నో విభేదాలు ఏర్పడ్డాయి. ఎందుకో తెలియదు. నేను ఆ ముత్యాలూ, వజ్రాలూ ధరించాలని ఉండేది అతనికి. అందుకే మేమిద్దరం మనసు పాడుచేసుకునేవాళ్ళం. అదోకరకం… నాకు తెలియదు. నేను ఎప్పుడూ ముస్తాబు చేసుకుని ఉండాలనుకునేవాడు. (నవ్వు).
నిజంగా, వసంత్‌. ఆ విధంగా ముస్తాబు చేసుకోవడం నేర్చుకున్నాను తెలుసా. కొంతకాలం అయాక, ”ఉండండి, అయితే ఇది కూడా భారతీయ సంస్కృతే” అంటూ ఇలా పెద్ద బొట్టూ, బోలెడు ఆకు పచ్చ గాజులూ, ఎర్ర గాజులూ ధరించడం మొదలు పెట్టాను. నాకు ఆ గాజులు చూస్తే ఎంత మోజుగా ఉండేదో. ఒక రోజున, నేనింకా మా అన్నయ్య ఇంట్లో ఉంటున్నప్పుడు నేను గాజులు వేసుకుంటే చూసి, ”ఛీ! వెళ్ళు … అవి తీసి పారేయ్‌!” అన్నాడు. నేను ఒకే ఒక్క బంగారు గాజు వేసుకోవలసి వచ్చింది. అక్కడ గాజులు వేసుకోకపోతే ఆ మిషనరీ దానిలా ఉంటావు అంటారు. అందుకని ఒక బంగారు గాజుని చచ్చినట్లు వేసుకోవల్సి వచ్చేది. కానీ ఇక్కడ నాకు నచ్చినవి వేసుకునే స్వేచ్ఛ నాకుంది – అంటే గాజు గాజుల్లాంటివి. కానీ, ఆ బంగారు నగలూ అవీ ధరిస్తే మరీ ఎక్కువగా ముస్తాబు చేసుకున్నట్లుండేది. ”నేను ఎందుకు ధరించాలి అలాగ?”.
నాకిప్పటికీ ఆ సమస్య ఉంది. ఆ పెద్ద పెద్ద సిల్కు చీరలవీ అందరికీ అసూయ కలిగిస్తాయి. అలా చేస్తే ఏమీ మంచిది కాదు. వాటిని ఇస్త్రీ చేయించడమో? బాబోయ్‌! ఆ సిల్కు బట్టల్ని సరిగ్గా పెట్టుకోవడానికి ఎంతమంది నౌకర్లు కావాలి! వాటన్నిటినీ పెట్టుకోవడానికి ఎంత చోటు కావాలి! వాటి విషయమై ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఆ పెంపుడు కుక్కల్లాగ! ఆ పెంపుడు కుక్కలు పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది. చివరికి వాటికి మీరు బానిసలైపోతారు. అలాంటిదే ఈ జీవన విధానం నేను భరించలేక…
    మరి ఎలా సర్దుబాటు చేసుకున్నారు, ఏం చేశారు?
ఏం చెయ్యలేదు. నాకు మేనత్త కొడుకులతో, వాళ్ళతో ఎన్నో సమస్యలుండేవి. అదొక వేరే జీవన విధానం. దాన్ని భరించలేకపోయాను. నీకు తెలుసుగా, నేను అసలు భరించలేకపోయాను. ప్రయత్నించాను. దానికి అలవాటుపడటానికి శాయశక్తులా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు.
    మీకు ఉపాధ్యాయురాలు అవాలని ఉండేదన్నారు, దాని గురించి చెప్పండి.
అవును. పెళ్ళికి ముందు నేను ఉపాధ్యాయినిగా పనిచేశాను. ఉపాధ్యాయ వృత్తి మా కుటుంబంలో ఉండేది. మా నాన్న ఉపాధ్యాయుడు. మా అక్కయ్య ఉపాధ్యాయిని. మేము అందరం ఉపాధ్యాయులమే మా కుటుంబంలో. ఇప్పటికీ మా కుటుంబంలో  బోధన గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. విద్య గురించి చర్చ జరిగేది. అందుచేత బోధన నా రక్తంలో ఉంది. రామేశ్వర్‌ కుటుంబంలో అతని తల్లి ఆ విషయమై బాగా ఉండేది. ఆవిడ మద్రాసు నుండి వచ్చింది కదా? ఆవిడ పద్ధతిలో ఆవిడ విద్య గురించి ఆలోచించేవారు. కానీ కొందరు ”ఏమిటి, స్కూలు ప్రారంభిస్తానంటుంది. వద్దు వద్దు, స్కూలు ప్రారంభించవద్దు” అన్నారు. (మనం స్కూలు ప్రారంభించడం ఏమిటి? వద్దు!). అయితే రామేశ్వర్‌ కూడా అంత సంతోషంగా లేడు. కానీ ఒప్పుకున్నాడు. ఒకసారి ఒప్పుకున్నాక, నాతో పూర్తిగా సహకరించాడు, అదే అతనిలో ఉన్న మంచి గుణం. అయితే, వేళాకోళం చేసే వాడు విజిత (విజిత శాంతా రామేశ్వర్‌ కి మరదలు.), రామేశ్వరరావు వదిన, ( నేనూ) అతను ఊళ్ళోలేనప్పుడు స్కూలు ప్రారంభించామని. అతన్ని కాంగోకి పంపించారు. తిరిగి వచ్చాక చూశాడు మేము స్కూలు ప్రారంభించడం. దాని గురించి ఊరికే వేళాకోళం చేసే వాడు. ఆ సమయంలో స్కూలు ఇంట్లోనే ఉండేది. వచ్చిన అతిథులతో ‘నా భార్య స్కూలు ప్రారంభించింది. ఒంటెలాగ ఇంటిని తనపైన పెట్టుకుంది. ఇప్పుడు నా కోసం వేరే ఒక ఇల్లు కట్టుకోవాలి” అనేవాడు. కానీ ఆ స్కూలు విషయంలో నిజంగా ఆసక్తి చూపించాడు. నాకోసం మళ్ళీ పుస్తకాలు తెప్పించాడు. ఆ రోజుల్లో నాకు కృష్ణమూర్తి (జిడ్డు కృష్ణమూర్తి ఇరవైయన శతాబ్దంలోని మహాతత్త్వవేత్తలతో ఒకరు) పట్ల ఆసక్తి ఉండేది. అతనికి ఆయనలో అంత ఆసక్తి ఉండేది కాదు. అతనికి వేరే గురువు ఉండేవాడు. అతనికి సంప్రదాయబద్ధమైన విషయాల్లో ఎంతో ఆసక్తి ఉండేది – అద్వైతం మొదలైన వాటిలో. కృష్ణమూర్తి ప్రసంగాలను వినడానికి నేను వెళ్తూంటే అభ్యంతరం ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడూ చెప్పలేదు. ఢిల్లీకి, బొంబాయికి, మద్రాసుకి – ఎక్కడికైనా టిక్కెట్టు కొనేవాడు.
నేను కృష్ణమూర్తిని వినడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా, ”ఏం చెప్పారు? ఏం జరిగింది?” అని నన్ను అడిగేవాడు. నా కోసం ఎన్నో పుస్తకాలు తెప్పించాడు. అదే రామేశ్వర్‌లోని గొప్ప విషయం. అటువంటి వ్యక్తిని గౌరవించకుండా ఎలా ఉండగలం? సంబంధం ఈ విధంగానే పెరుగుతుంది, వసంత్‌.
ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ‘అన్వేషి’ ద్వారానే నేను శతృఘ్న అనే వ్యక్తిని కలుసుకున్నాను. అతనితో నాకు అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందో నాకు తెలియదు.
అతను మా స్కూలుకి వచ్చినాతో మాట్లాడేవాడు. రామేశ్వర్‌కీ అతనికీ రాజకీయ విషయాల్లో నమ్మకాలు పూర్తిగా వేరు అని నాకు తెలుసు. అయినా శతృఘ్నతో నా స్నేహాన్ని హర్షించాడు… శతృఘ్న పోయినప్పుడు, ‘ఇపిడబ్‌ల్యూ’ (ఇకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లి) లో ఒక మంచి వ్యాసం వచ్చింది. రామేశ్వర్‌ దాన్ని తీసుకొచ్చి నాకిస్తూ ”ఇది మీ మిత్రుడి గురించి” అన్నాడు. ”శతృఘ్న నీకు మిత్రుడే కదా?” అన్నాడు. అది అతనిలోని మంచితనం. శతృఘ్నతో నాకున్న స్నేహాన్ని మెచ్చుకునేవాడు. కసిలేదు, కోపం లేదు, అసూయ లేదు, అనుమానం లేదు, నేను ఏ మగవాడితోనైనా, ఏ మగవాడితోనైనా స్నేహం చెయ్యవచ్చు. నిజంగా అతనిలో అంత ప్రత్యేకత…. ఇక మా అన్నయ్యలు? అది వేరే ప్రపంచం.
    మీ వివాహం అయిన ఎన్నేళ్ళకి స్కూలు స్థాపించారు.
రామేశ్వర్‌ని కలుసుకున్న పదకొండేళ్ళ తరవాత, మాకు పెళ్ళయిన ఎనిమిదేళ్ళ తరవాత.
ఆ దుస్తులూ వాటి గురించి ఏమైంది? కొద్దికాలం తరవాత పట్టించుకోలేదా? త్వరలోనే ఆ విషయాన్ని వదిలేసి ఉంటారేమో?
అతనికి బాధ కలిగిందనుకుంటాను. అతను దాని గురించి బాధపడ్డాడు. నిన్ననే నేను అనుకున్నాను – అతను మిగిలిన వాళ్ళు ఎలాంటివి కట్టుకుంటున్నారో, నేను ఎలాంటివి కట్టుకుంటున్నానో గమనించేవాడు అని. అబ్బ! అతనికి దుస్తుల్లో ఎంత ఆసక్తి ఉందో, మీరు ఊహించలేరు. ఏదైనా దుకాణానికి వెళ్తే, అక్కడ చీరలవైపూ, నగలవైపూ చూసేవాడు. వెళ్ళి కూర్చునేంత ఓర్పు ఉండేది కాదు.
ఆయనికి అందమైన దుస్తులంటే ఇష్టం. ఆయన భార్య అందంగా ఉన్నా అందమైన దుస్తులు వేసుకోవడం ఇష్టం లేదు. ఎటువంటి శిక్ష ఆయనకి!
నిజమే, అది అతనికి శిక్షే. వరకట్నపు చావుల గురించి ఊరేగింపులు జరుపుతూంటే వాటికి అభ్యంతరం ఎన్నడూ చెప్పలేదు. ఎన్నడూ అభ్యంతరం తెలుపలేదు. ”పదండి, పదండి” అంటూ ఉండేవాడు.
నేను అటువంటి రాజకీయ రీతిలో ఆలోచించే రకం కాదు, అదే ఎంతో ఆశ్చర్యకరం. అయితే నాకు రాజకీయ సిద్ధాంతాల పట్ల చాలా ఆసక్తి ఉంది. నేను చాలా ఆదర్శవాదిని. నేను మొదట్లో కమ్యూనిజం గురించి చదివినప్పుడు నాకు పదిహేడో, పద్దెనిమిదేళ్ళో ఉన్నాయి. ఓహో! నేను ఎంత ముగ్ధురాలినయానో! ”ఇదే మనకి కావలసిన పరిష్కారం. దీన్ని జనం ఎందుకు జీవితంలో అనుసరించదు?” అనుకున్నాను. మరోవైపు గాంధీగారు. నాకు ఖద్దరు దుస్తులు ధరించాలనీ, రాట్నం ఒడకాలనీ మాత్రమే కోరుకున్నాననుకుంటాను. రాట్నం ఎలా ఒడకాలో నాకు తెలియదు, కానీ చెయ్యాలని ఇష్టపడేదాన్ని. రామేశ్వర్‌ అందుకు ఒప్పుకుని, ఒక బస్తీలో పని చేయమని ప్రోత్సహించాడు. కానీ నేను చెయ్యలేకపోయాను. నేను ఒకచోట కూర్చుని ఏదైనా నవల చదివి ఆలోచించగలను. నేను కూర్చుని ఆలోచించే రకం.
వెళ్ళి ఏదైనా పని చెయ్యలేను. ఇప్పటికీ చెయ్యలేను. ఇక్కడ స్కూలులో తప్ప నేను ఏది చదువుతూ కూర్చున్నా అతనికి అభ్యంతరం లేదు. ఏ పుస్తకాల్నీ నిషేదించలేదు. దేనిమీదా తీర్పు చెప్పలేదు. ‘ఈ పుస్తకం నువ్వు చదవదగినది కాదు’ అని ఎన్నడూ నాకు చెప్పలేదు ”మంచిది చదువు” అనేవాడు ఎప్పుడూ.
    మీ అంతట మీరు ఎదగడానికి రామేశ్వర్‌ అవకాశం ఇచ్చారు కదా?
అవును. కానీ నేను మంచి దుస్తులు ధరించాలనీ, ముస్తాబు చేసుకోవాలనీ పట్టుపట్టేవాడు. అది పెద్ద సమస్య కాదు. కానీ అతను కోరుకున్న విధానం. నేను ఇష్టపడేదాన్ని కాదు. కానీ చివరికి నేర్చుకున్నాను. లొంగిపోవడం, నేర్చుకున్నాను. అతను కూడా లొంగిపోవడం నేర్చుకున్నాడు. నాకు జ్ఞాపకం ఉంది – స్కూలుని ప్రారంభించాక, ఒకసారి నేను ”స్కూలుకి కంచి పట్టు చీరలు కట్టుకు వెళ్ళడం నాకిష్టం లేదు, నేను కట్టుకోను” అన్నాను. ”సరే” అన్నాడు అతను అయిష్టంగానే.
ఒకరోజు నాకు జ్ఞాపకం, ఎన్నటికీ మరిచిపోలేను. అది చిన్న విషయమే. ఖరీదైన పూనా చీరని కట్టుకున్నాను. అది నీలం రంగు చీర, ఆకు పచ్చరంగులో పూనా అంచుతో ఉన్నది. చాలా ఆకర్షణీయంగా, కళ్ళకింపుగా ఉంది. కళ్ళకింపైన దుస్తులు వేసుకోవడం నాకిష్టం, నాకు ఆ బూడిద రంగువీ లేత కలనేత రంగులవీ నాకు ఇష్టం లేదు! నేను స్కూలుకి వెళ్ళడానికి తయారయాను. ఆ చీర ఖరీదు ముప్ఫయి రూపాయలో నలభయ్యో అంతకన్న తక్కువో అయి వుంటుంది. ఆ రోజుల్లో ఆ ధరకి అటువంటి చీరలు దొరికేవి. నేను ఆకర్షణీయంగా ఉన్న ఆ చీర కట్టుకుని ”వెళ్ళొస్తా రామేశ్వర్‌. స్కూలుకి వెళ్తున్నాను” అన్నాను. అతను వార్తాపత్రిక చదువుతున్నాడు. తలెత్తి చూశాడు. అతని ముఖంలో అతని చూపుని చూడాలి! అతనికి ఆ రంగు నచ్చింది. ఆ చూపుని నేను ఎన్నటికీ మరచిపోలేను. అతనికి ఆ రంగు నచ్చింది నేను గమనించగలిగాను. ”వాన్‌!” అన్నాడు.
గౌలిగూడా దుకాణాలకి నాతో రావడం నేర్చుకున్నాడు. తక్కువ  ధరలు ఉన్న బట్టల్ని చూడటం నేర్చుకున్నాడు అన్ని వేళలా కాకపోయినా… సికింద్రాబాద్‌లో షాపులకి కాదు, అక్కడ గద్వాల్‌ చీరలూ అవీ అమ్ముతారు. అవి ఈనాటికీ ఉన్నాయి. నగల దుకాణాలకి అతనితో పాటు వెళ్ళడానికి నేను ఒప్పుకోలేదు. అక్కడ కూర్చోవడం నాకు విసుగు. నాకు ఒళ్ళు మండిపోయేది. అక్కడ కూర్చోవడం నాకు విసుగు. నాకు ఒళ్ళు మండిపోయేది. అతను ఏదైనా కొని తీసుకొస్తే వద్దనలేదు కానీ, వాటిని చూసికొనడానికి నాకు ఓపిక ఉండేది కాదు. అతను బలవంతపెట్టే వాడు కాదు. ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నాకు ఆసక్తి కలిగి, ‘నేనూ వస్తాను’ అనేదాన్ని. ఎందుకంటే విజిత వాళ్ళూ వెళ్ళాలనుకునేవారు. విజిత వెళ్ళేది, వాళ్ళవాళ్ళూ వెళ్ళాలనుకునేవారు… ”శూదూ అక్క ఇటు ఇటూ… అంటుంటే నాకు ఆసక్తి కలిగి… ”సరేవస్తాను’ అనేదాన్ని. నేనక్కడికి వెళ్ళగానే ”ఇటు ఇటు” మాయమైపోయేది. అక్కడికి వెళ్ళగానే ఆ తళతళలాడే వాటిని చూస్తే చిరాకు వేసేది. ఓ! స్త్రీలు, ఎంత సమయం వృధా చేస్తారు. నగలు చేసే వాళ్ళని కలుసు కోవడానికి మాత్రం ఇష్టపడేదాన్ని వాళ్లు ఆసక్తి కరమైన వాళ్ళు చాలా తెలిసినవాళ్ళు తెలుసా! ఏమైనా, రామేశ్వర్‌ ప్రాచీనమైన నగల గురించి చాలా చెప్పాడు. సంగీత సభలకీ, నాటకాలకీ, నృత్య ప్రదర్శనలకీ వాటికీ నాతోపాటు రావడానికి అతనకి తీరిక ఉండేది కాదు. నా అంతట నేనే ”పోతున్నా, రామేశ్వర్‌” అంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ అతను ఎన్నడూ ఆ విషయమై గొడవ పెట్టలేదు.
మీ మీద ఆధారపడేవాడని మీకెలా అనిపించింది?
ఆ విషయాన్ని నేను చెప్పాలనుకోవడం లేదు. అతను నా మీద చాలా చాలా ఆధారపడేవాడు. కొన్ని సార్లు అతనికి నా మీద చాలాకోపం వచ్చేది. నా వ్యవహారమంతా చూసి, గొప్పలకి పోయే వ్యవహారం అనేవాడు. ”వద్దులే, నేను వెళ్ళిపోతున్నానులే, నేను వెళ్ళిపోతున్నాను” అనేదాన్ని. ”నేను వెళ్ళిపోతున్నాను” అనేసినప్పుడు, ”నువ్వు వెళ్ళిపోతున్నావా. ఎక్కడికి వెళ్తావు? నీకేం జరుగుతుందో” అని ఎప్పుడూ అనలేదు ”నాకు ఏమవుతుంది?” అనేవాడు ఎప్పుడూ. ఓ భగవంతుడా! అతను ఊహించలేకపోయే వాడు. అది వాస్తవానికి అతీతమైన స్థితి.
కొన్నేళ్ళ తరవాత, మేమిద్దరం డెబ్బయిలలో ఉన్నప్పుడు, అతను నాకన్న ఒక్క సంవత్సరమే పెద్ద. నాకు గుండెపోటు వచ్చింది. నన్ను ‘కేర్‌’ హాస్పిటల్లో చేర్చారు. నా పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు డాక్టర్లు. అతను వచ్చి హాస్పిటల్లో కూర్చున్నాడు. బెంగ పెట్టుకోవడం అదేం లేదు. ఏదో పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. నా కూతురు వచ్చి ఏదో వాదన మొదలుపెట్టడం నాకు గుర్తు. నేను కోలుకుంటున్నాను ”పాపా (బేటా) ఇప్పుడు కాదమ్మా అమ్మ గురించి ఆందోళన పడుతున్నాను” అన్నాడు. అటువంటివి చెప్పడం నేనెప్పుడూ వినలేదు. నేను వేళాకోళంగా అనేదాన్ని ఎవరు ముందు పోతారో ఎవరికి తెలుసు అని. ”లేదు శాంతా, నువ్వు ముందుపోవడం లేదు. నేనే ముందు పోతాను. నువ్వు ముందు వెళ్ళడానికి వీల్లేదు, నేనే ముందుపోతాను” అనేవాడు. ”నిజంగానే?” అన్నాడు, అవును నిశ్చయంగా నాకన్న ముందు నువ్వు పోవడానికి వీల్లేదు అన్నాడు. అప్పట్లో అతని దగ్గర సుదీర్ఘమైన ఇన్‌కమ్‌టాక్స్‌పేపర్లు ఉండేవి, వాటి మీద నేను సంతకం పెట్టాలి. కూర్చుని ఆ కాగితాలన్నిటినీ ఒక క్రమంలో ఏర్పరిచేవాడు. అవన్నీ చూసి సరి చేయటానికి ఎంత సమయం పట్టేదో. వాటి మీద సంతకం చేయడానికి నా దగ్గరికి తీసుకుని రావాలి. అతను అవన్నీ చేస్తూంటే, నేను వెళ్ళి సంగీతం వినడం, వీళ్ళనీ వాళ్ళనీ కలుసుకోవడం, స్కూల్లో సరదాగా గడపడం చేసేదాన్ని తరవాత గ్రహించాను అవన్నీ జరిగితీరాలని. ”రామేశ్వర్‌ ముందుగా పోయేటట్లయితే, నేను ఇవన్నీ నిర్వహించలేను” అనుకున్నాను, అన్నీ అతనికే వదిలేశాను కనుక. ”శాంతా, నువ్వు అర్థం చేసుకోవాలి” అనేవాడు. టాక్స్‌ల గురించీ, రాయితీల గురించీ, నేను అర్థం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నించేవాడు. అయినా నేను వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు కొంచెం నయం.
ఒక రోజున నేను ఈ పేపర్ల మీద సంతకం పెడుతూ వేళాకోళంగా అన్నాను – ”రామేశ్వర్‌, నువ్వు ముందు వెళ్ళొద్దు. ప్లీజ్‌, రామేశ్వర్‌. నేనే ముందు వెళ్తాను, ఎందుకంటే, నువ్వు ముందు వెళ్తే, ఈ పనులన్నీ నాకు ఎవరు చేసిపెడతారు” రామేశ్వర్‌ మంచం మీద కూర్చుని ఉన్నాడు, నేను ఆ గదిలోనే కుర్చీలో కూర్చుని
ఉన్నాను. అతను నా వైపుకి తిరిగి, ”అలాగా! సరే, నువ్వు కోరుకుంటున్నది నేను ముందు పోకూడదని, నువ్వే ముందు పోవాలని. సరే ఊ” ఆ తరవాత, అతను ”కానీ శాంతా, విను. నేను ముందువెళ్తే, అక్కడ అన్నీ సర్ది ఉంచుతాను, నువ్వు వచ్చినప్పుడు నువ్వు సుఖంగా హాయిగా ఉండొచ్చు. నీ వస్తువుల్ని ఇటూ అటూ పారెయ్యవచ్చు. నువ్వు నీక్కావల్సినట్లు సరదాగా ఉండొచ్చు. వాటిని నేను మళ్ళీ సర్దిపెడతాను. నీకు కావాల్సిన భోజనాల్ని, అన్నిటినీ తెప్పించిపెడతాను”. ఎంతమంచివాడో తెలుసా. అతను ఆ మాటల్ని అంటున్నప్పుడు నవ్వను కూడా లేదు. కానీ అతని కళ్ళలో ఒక మెరుపు ఉంది. అతను అన్న పద్ధతి గురించే ఆలోచిస్తూ ఉంటాను, ఆశ్చర్యపోతుంటాను. ”రామేశ్వర్‌ అక్కడికి వెళ్ళి అన్నీ సరిగ్గా ఏర్పాట్లు చేస్తున్నావా?”. అక్కడ స్వర్గంలో కూర్చుని! ”అన్నీ సరిగ్గా ఏర్పాటు చేసి,” అన్నాడు అంటే, అతను నా మీద ఆధారపడ్డాడు, ఎందుకంటే…
దురదృష్టవశాత్తూ అలా కాదు. అతను, కేవలం మిమ్మల్ని ప్రేమించాడు అంతే మీరు ఎలా ఉన్నారని చూసుకుంటూ ఉండేవాడు. మిమ్మల్ని గమనించేవాడు. తెలుసుకున్నాను. మళ్ళీ మళ్ళీ అడిగాడు. నాకు తెలియదు, బహుశా మీరు ఇంకా తయారుగా లేకపోవడం వల్ల కావచ్చు మీకు జ్ఞాపకం ఉందా, మీరనేవారు, మీరు మనసు విప్పి ఉండేవారు కాదని, మీరు అనుకున్నదానితో సర్దుకుపోవడానికి మీరు సిద్ధంగా లేరన్నది ఆయనకి తెలుసునేమో. అందుచేత అది కాలేజీ రోజు అప్పటి నుంచీ ఉన్నది కావచ్చు.
చిత్రంగా లేదూ, అతనికి పదిహేడో, పద్దెనిమిదో ఉంటాయి. అది బాల్య వివాహం వంటిదే. మాకు అప్పుడే పెళ్ళయి ఉంటే, అది బాల్య వివాహం అయి వుండేది. నేను పదహారో పది హేడేళ్ళ దాన్ని. నాకన్న అతను ఒక సంవత్సరం పెద్ద అర్థం లేదు మాకప్పుడు పెళ్ళికానందుకు సంతోషిస్తున్నాను. ఓయి దేవుడా!
కానీ అతనికి మొదటి నుంచీ అలా ఉండి ఉంటుంది. మీకు కూడా అలాగే అయి వుండొచ్చు. కానీ మీరు అప్పుడు గ్రహించలేదు. కానీ అతను గ్రహించాడు, ఎదురు చూశాడు, ఎదురు చూశాడు.
అది చాలా అల్ప విషయం కానీ ఆదర్శవంతంగా ఉండటం ఒకవైపు, చాలా చాలా, అల్ప విషయమై ఉండటం మరోవైపు నేనెక్కడ ఉన్నానో నాకే తెలియదు. అంతే నా జీవిత కథ. అయిపోయింది.
అతను లేకుండా ఎలా ఉంది?
లేదు, బాగానే ఉంది, ఎందుకంటే తరచుగా… అతను పోయిన తరువాత అతన్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకునే దాన్ని, నెరాల్కర్‌ అతను ఉండగా వస్తూండేవాడు. రామేశ్వర్‌ అతన్ని పాడమని అడిగేవాడు, ”మాస్టర్‌ గారూ, పాట పాడండి” అనేవాడు. రామేశ్వర్‌ కోసం అతను కూర్చుని పాడేవాడు. రామేశ్వర్‌ తనదైన మహారాజ ఠీవితో వంద రూపాయల నోటో మరేదో తీసి అతనికిచ్చేవాడు. నెరాల్కర్‌ దాన్ని ఇష్టపడేవాడు. అది లేకపోయినా నెరాల్కర్‌ అతని కోసం పాడి ఉండేవాడు. ఆడపిల్లలు నవ్వుతూ ”తాన్‌సేన్‌, ఆ స్థాన గాయకుడు వచ్చేశాడు” అనేవారు. కానీ రామేశ్వర్‌ చనిపోయిన తరవాత, నెరాల్కర్‌ ఏదో పాట పాడగానే నేను ఏడ్చాను. మదన్‌ అక్కడే కూర్చుని ఉన్నాడు. నేను ఏడవటం మొదలుపెట్టి లోపలికి వెళ్ళిపోయాను. మదన్‌తో తరవాత చెప్పాను. నెరాల్కర్‌ వెళ్ళాక, నేను ఎన్ని నెలలు బతికానో అంతు లేకుండా, అతను లేకుండా. అతను ఎన్నో సార్లు బయటికి వెళ్తూ ఉండేవాడు, కొన్ని నెలలపాటు బయట ఉండేవాడు. పిల్లలతో నా అంతట నేను ఉండేదాన్ని, అన్ని పనులూ చేసుకుంటూ, పిల్లల్ని పెంచుతూ. తరవాత ఇంగ్లండ్‌లో ఒక్కర్తినీ ఉన్నాను, తరచుగా ఆఫ్రికాలో ఒంటరిగా ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్నాను, నా పని నేను చేసుకుంటూ. అలాగే ఉంది అనిపిస్తోంది. అలాగే
ఉంది. అతను ఇక్కడ లేడు. ఎక్కడికో వెళ్ళాడు. మేము మళ్ళీ కలుస్తాం. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఏడ్చాను, హఠాత్తుగా ఎందుకు ఏడ్చాను? మదన్‌ అన్నాడు ”మీకు తెలుసా? ఎందుకంటే, ఇది వరకు అతను వెళ్ళినప్పుడు, అతను తిరిగి వస్తాడని మీకు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు, అతను తిరిగి రాడని. అందుకే మీరు ఏడుస్తున్నారు” అదే నిజం కావచ్చు.
ఇప్పుడు నేను పెద్దదాన్ని. నేనూ పోతానని తెలుసు నేను శాశ్వతంగా బతికి ఉండను. మనం వృద్ధుమైనప్పుడు, మనం చనిపోయినప్పుడు, మనం పోయినప్పుడు మనకి ఏమవుతుందో నాకు తెలియదు. మనం తిరిగి వస్తామనీ, మళ్ళీ అంతా అలాగే ఉంటుందనీ అనుకోవడం తెలివితక్కువ తనం, బాల్యం లక్షణం, చాలామంది అలాగే చిన్నపిల్లల్లా ఎన్నో అనుకుంటారు పునర్జన్మ గురించి. అన్నిటి కన్నా సులభం స్వర్గం గురించీ నరకం గురించీ మాట్లాడటం, ఇంకా ఇదీ అదీ, పూర్వ జన్మ గురించీ, పునర్జన్మ గురించీ. వాటిలో ఏదైనా నిజం అవునో కాదో తెలియదు. మనుషులకు ఏమవుతుంది? మనం అలాగే ఉంటామా? ఒకరినొకరు దగ్గరవడానికి వీలవుతుందా? ఒకరినొకరు బాధించుకుంటే, వాళ్ళు తమ తప్పు తెలుసుకోవడానికి వీలవుతుందా? మళ్ళీ ఎప్పుడూ అలా చెయ్యను అని చెప్పడానికి వీలవుతుందా? ఆ పని నేను మళ్ళీ ఎప్పుడూ చెయ్యను అనగలమా ఇప్పుడు? మళ్ళీ మనకి అవకాశం లభించదు! నేను ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఇవి మరిన్ని విషయాలకు దారి తీస్తాయి…. సరే, ఇప్పుడు రామేశ్వర్‌ లేడు. రామేశ్వర్‌ బతికి ఉండగా ఇద్దరం ఒకరినొకరం బాధించుకున్నాం. ఎన్నోసార్లు అతను నన్ను బాధించాడు. నేను కూడా అతన్ని బాధించాను – కొన్నిసార్లు చాలా చాలా ఘోరంగా.
కొన్నిసార్లు నేను అతనితో ”నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు సృష్టించిన ఈ విచిత్రమైన ఇంట్లో నేను ఉండను. అతని ప్రమాణాలు ఎంతో భిన్నమైనవి. అతను అంత పెద్ద ఇంటిని కట్టించాడు. నేను అందులో ఉండలేను, అది ఎంతో అసౌకర్యంగా ఉంటుంది కనుక. ఎంతో గొప్పగా కనిపించడం మాట అటుంచి, చచ్చేటంత అసౌకర్యంగా ఉంటుంది. ”రామేశ్వర్‌, ఎవరైనా ఈ ఇంటిలో ఒక మూల హత్యకి గురి అయినా, ఎవరైనా చచ్చిపోయినా నేను తెలుసుకోలేను. కొన్ని రోజుల పాటు నాకు తెలియదు… కంపు కొట్టేవరకూ ఓ మనిషి ఇందులో చచ్చిపడునన్నాడని నాకు తెలియదు”, అన్నాను. నా మాటలు భయపెట్టాయి. ”సరే ఇంకొక ఇల్లు కట్టుకుందాం” అన్నాడు. అప్పుడు ఈ ఇంటిని కట్టించాడు. అతని ఉద్దేశంలో ఇది చిన్న ఇల్లు! ”నేను ఒక చిన్న ఇంటిని కట్టించాను. శాంతా, నేనొక చిన్న ఇల్లు కట్టించాను” అన్నాడు. ఏం చిన్న ఇల్లు!
రామేశ్వర్‌ విషయంలో అతని అభిప్రాయాలు భిన్నమైనవి – పూర్తిగా ప్రజాస్వామికమైనవి, సున్నితమైనవి, ఆప్యాయతతో కూడుకున్నవి. కొంతమంది మగవాళ్ళలో ఈ పార్శ్వం కూడా ఉంటుంది. అందుచేత, అతను లేకుండా జీవితం గడపడం ఎలా ఉంది.
ఓ! నన్ను చాలా స్వతంత్రంగా ఉండేట్లు తీర్చిదిద్దాడు. కాదు… నా చుట్టూ ఆవరించినది రామేశ్వరే. ఈ మధ్య నేను ఈ స్కూలుకి రావడం అంతకంతకు ఎక్కువైందని గ్రహించాను. ఆదివారాలు వస్తున్నాను. సాయంకాలాలు చీకటిపడ్డాక వస్తున్నాను. ప్రస్తుతం ఉదాహరణకి తరచుగా అంటున్నాను ”స్కూలుకి వెళ్దాం పదండి” అని. నిన్న నువ్వు వెళ్ళగానే స్కూలు చుట్టూ తిరిగాను. స్కూలు చుట్టూ తిరిగాను. నా పెళ్ళి అవగానే ఇక్కడికే వచ్చాను. మాకు పెళ్ళయాక, రామేశ్వర్‌, నేనూ గ్రీన్‌ గేట్స్‌లో వివాహ భోజనం ఏర్పాటు చేశాం. ఇక్కడికే మా క్లాస్‌మేట్స్‌ ఆరుగుర్ని తీసుకురావడం జరిగింది. ఈ చిరునామాకే నేను ఉత్తరం రాశాను అతనికి. ‘గ్రీన్‌గేట్స్‌’ సైఫాబాద్‌, హైదరాబాద్‌ – అదే చిరునామా. అందువల్ల ఈ ఇంటికి నా దృష్టిలో ఎంతో అంతరార్థం ఉంది. కొన్నిసార్లు నేను రాజభవనంలో ఉంటున్నాను అనేదాన్ని నాకు పెళ్ళి జరిగాక నేను పురాతన భవనానికి వచ్చాను. చాలా అసహ్యంగా, చాలా శిథిలావస్థలో ఉంది. అయినా, అటువైపుకి వెళ్ళాను. అటువైపు కొందరు నౌకర్లు వెళ్తున్నారు. అది తెలవారుఝాము. నేను ఆ క్రితం రాత్రి వచ్చాను. నౌకర్లు నాకు నమస్కారం చెప్పారు చేతులు జోడించి. నేను కూడా అదే చేశాను. కొంచెం సేపయాక, అతను ”ఏమిటి చేస్తున్నావ్‌? నౌకర్లకు నమస్కారం పెడుతున్నావా?! అన్నారు. (నవ్వు)
నేను చుట్టూ చూస్తూ, ”బాబోయ్‌, ఎంత పెద్ద ఇల్లు రామేశ్వర్‌!” అన్నాను. ఇప్పుడున్నంత పెద్ద ఇల్లు కాదది. నాకు నాలుగు వందల మంది పిల్లలు కావాలి ఇక్కడ. నాకు బోలెడంత మంది పిల్లలు కావాలి. నాలుగు వందల మంది” అన్నాను ఆ సమయంలో అన్నాను నాకొక స్కూలు కావాలి ఇక్కడ అని. ‘రామేశ్వర్‌, నాకిక్కడ ఒక స్కూలు కావాలి” అని. ”మొదలైందా నీ స్కూలు, స్కూలు, స్కూలు, స్కూలు స్కూలు”  అన్నాడతను. ”ఇక్కడ నేనొక స్కూలుపెట్టొచ్చు”అన్నాడు. ఆ ఆలోచనని నేను వదిలిపెట్టలేదు. ఈనాటికీ నాకు అనిపిస్తుంది, ఎంతో మంది తమ ఆస్తుల్ని అమ్మేసుకుని, అసహ్యంగా దుకాణాలూ అవీ కడుతుంటారు. తిండికి ఏమీ లేనట్లు! ఇంకా సంపాదించాలి. ఇంకా సంపాదించాలి అనుకుంటారు. ఈ  రోజున మా దత్తపుత్రుడు ప్రదీప్‌ నాతో ”అమ్మా, మనకీ స్కూలు ఉండటం చాలా బావుంది. ఇది చాలాప్రాచుర్యం పొందింది. నగరం నడిబొడ్డులో ఉంది. దీన్ని ఏర్పాటు చేయడం చాలా మంచిదైంది” అన్నాడు గవర్నింగ్‌ కమిటీలో. రామేశ్వర్‌కి అంతగా ఇష్టం లేకపోయినా,నన్ను సమర్థించాడు. ఒకసారి ఒకటి సరే అనుకున్నాక, ఇక నావైపే ఉన్నాడు. అలాగ ఇప్పుడు మాకు ఈ స్కూలు ఉంది. సెలవల్లో తరచుగా దీని చుట్టూ తిరుగుతూంటాను. నాకిక్కడ ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా
ఉంటుంది కదా.
మీరు వచ్చిన చోటు ఇదే మరి.
అవును. ఇక్కడికి వచ్చాను, హఠాత్తుగా గ్రహించాను. ఈ మధ్య ఒకరోజున అనుకున్నాను – ”బాబోయ్‌. ఇది ఒక రాణి గారి భవనంలా ఉంది. కానీ పిల్లలు మాత్రం లేరు. కానీ నేను పోయినా నాదే అవుతుంది” కాదు నాది కాదు, రామేశ్వర్‌ దీన్ని నడపడానికి ఏర్పాటు చేసిన ట్రస్టుది అవుతుంది.
అవును.
ట్రస్ట్‌ ఆధీనంలో ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నాకు బావుందనిపిస్తోంది. విద్యా విషయమై కాదు. ఇది నాది అనిపిస్తుంది. ఇక్కడే రామేశ్వర్‌, నేనూ కలిసి ఉన్నాం.
స్కూలు నడవడంలో ఏ విధమైన ఆటంకాలు లేవని అర్థమైంది. ఇక్కడ చక్కగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది అన్నప్పుడు. ఈ స్థలంతో ఇన్ని అనుబంధాలు ఉన్నాయని అనుకోలేదు.
ఇప్పుడు నేను స్కూల్లోనే చాలా సమయం గడుపుతున్నాను. ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్లుండదు. అదే నా జీవిత కథ.
చక్కని కథ.
నిజంగానా? నేను ఇంకో రకంగా అనుకున్నాను, దాన్ని ఏమనాలి? ఏదోపూర్వకాలపు కథ అనాలా? లేకపోతే సంసార పక్షపు కథ అనాలేమో.
మరీ సామాన్యమైన కథ మాత్రం కాదు.
సామాన్యమైనది…. ఇలాంటి మాటలన్నీ..
ఇది సామాన్యమైనది అనుకుంటున్నారా?
సామాన్యమైన, సంసారపక్షపు, పూర్వకాలపు. కాదా?
    జీవితంసామాన్యమైనది, ఎందుకంటే, అందులో ఎప్పుడూ సంఘర్షణ ఉంటుంది. కానీ ఇది ఎంతో గొప్పది, ఇందులో ఎన్నో అద్భుతమైన సంఘటనలున్నాయి. మీరు అంతకంతకు ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నారు, మీరు ఇక్కడ పని చేస్తున్నారు.
ఎన్నో పనులు. అతను అనేవాడు, ”కారు నడపడం నేర్చుకో. నేను నేర్పను నీకు. భర్తలు మంచి టీచర్లు కారు. డ్రైవింగ్‌నేర్పమని ఇంకెవరినైనా అడుగు” అని. ”మనం డ్రైవింగ్‌ నేర్చుకుంటే మనం చాలా స్వతంత్రంగా అవుతాం. ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలి. బొంబాయిలో నేను ఆధునిక యువతిలా ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఎప్పుడూ బ్యాంకుకి గాని, పోస్టాఫీసుకి గాని ఎక్కడికీ వెళ్ళను. ఆఫీసులో ఉన్న వాళ్ళని అడుగుతాను. నా పనులు చేసిపెట్టమని. రామేశ్వర్‌ ఉన్నప్పుడు నేనే పనీ చెయ్యవలసిన అవసరం ఉండేది కాదు. అన్నీ ఎవరో నాకోసం చేసి పెట్టేవారు. ఇటువంటి పనులు చెయ్యడం మరిచిపోయాను… రైలు టికెట్టు ఎలా కొనుక్కోవాలో, నా సామాను ఎలా తూకం వేయించాలో… ఏమీ చాతకాదు ఇప్పటికీ (ఇటువంటి పనులు ఎలా చెయ్యాలో నాకు జ్ఞాపకం లేదు).
రామేశ్వర్‌ మాటేమిటి?
ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మనం ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం. అతను ఎంతో విశిష్టమైన వ్యక్తి అని నాకెప్పుడూ తెలుసు. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు ”ఓయి దేవుడా, నేనెప్పుడూ గ్రహించలేదు ఈ విషయం” అంటాను. ఎందుకంటే, ఎవరైనా కలిసి ఉంటారు, కలిసి భోజనం (అన్నం, పప్పు, వాటితో) చేస్తారు. సంసారపక్షంగా అన్ని పనులూ చేస్తారు, కానీ వీటి గురించి ఆలోచించరు.
మనం మాట్లాడినప్పుడే, వాటి గురించి మొత్తం ఆలోచిస్తాం.
అతను అసాధారణమైన వాడు.
మీతో అన్నాను కదా, నామటుకు గాను రామేశ్వర్‌తో మీకున్న సంబంధమే అన్నిటికన్నా ముఖ్య విషయం.
రామేశ్వర్‌తో నాకున్న సంబంధంలో ఈ విషయాలన్నీ పూర్తిగా కలగలసి ఉన్నాయి.
అవును, తప్పనిసరిగా మన సంబంధాలన్నీ రకరకాలు కలిపివేసినట్లుగానే ఉంటాయి. ఆ కలనేతే దాని ప్రత్యేకత అదే దాని పటుత్వం.
అంతేమరి, లేకపోతే అది ఒక సరళరేఖలా అవుతుంది.
అప్పుడది మిల్స్‌ అండ్‌ బూన్స్‌ రాసిన ఒక ప్రణయ కథలా ఉంటుంది.
అవును. నువ్వు చెప్పినది నిజం. నాకు ప్రణయం గుర్తులేదు. అది విచిత్రంగా ఉంటుంది.
ఇదంతా చెప్పడం మీ బాధ్యత. ఎందుకంటే, మీకూ నాకూ తెలుసు, మనం పుస్తకాల నుంచి ఎంతగా నేర్చుకున్నామో. ఏది తెలుసు కోడానికైనా చదవడం అవసరం.
అది నిజమే. నువ్వుదాన్ని సూచించినందుకుసంతోషం. అవును. మనంనేర్చుకునేందుకు మరో మార్గం లేదు. ఈనాటికీ పుస్తకాలేనన్ను సజీవంగా ఉంచుతున్నాయనుకుంటాను. నిజంగా సజీవంగా ఉంచుతాయి. అవినన్ను వివిధ కోణాలనుంచి చూసేలా చేస్తాయి. లేకపోతే, స్కూలోతోనూ,కుటుంబంతోనూ ఉన్న సంబంధాలు అంతే. వాటన్నిటి మధ్యా ఇలా….
ఇంతవరకు గౌరవం గురించి చెప్పారు. ఏ విధంగా మీరిద్దరూ పరస్పరం ఆధారపడ్డారు? మీ సంబంధం మిమ్మల్ని ఎలా సంపూర్ణంగా చేసింది?
ఇది క్లిష్టమైన ప్రశ్న… క్లిష్టమైన ప్రశ్న. ఆధారపడటం…
రాజేశ్వర్‌ మీద మీరు ఏవిధంగా ఆధారపడ్డారు? ఆయన మీ పైన?
మీరు గంభీరమైన ప్రశ్న అడిగారు. రామేశ్వర్‌లో ఉన్న మంచి గుణం, అద్భుతమైన గుణం ఏమిటంటే, అతను నిత్యం పనిచేస్తూ ఉండేవాడు. తన పైననేను ఆధారపడకుండా ఉండేలా చేసేవాడు. నేను విడాకులు తీసుకోక ముందు, అతను చేసిన పని చాలా ముఖ్యమైనది. ఇతను మనల్ని చాలా ఇబ్బందిపెడుతున్నాడు. అందుకని ”నువ్వు ఈ దేశంలో ఉండకుండా ఉంటే నయం. నీకు పిచ్చెక్కేటట్లు చేస్తున్నాడు” అన్నాడు రామేశ్వర్‌, తను తూర్పు ఆఫ్రికాకి ఉద్యోగ రీత్యా తిరిగి వెళ్ళాలి కనుక. నన్ను ఇంగ్లండుకిపంపే ఏర్పాటు చేశాడు. అతను అంతకు ముందెప్పుడూ ఇంగ్లండుకి వెళ్ళలేదు. యుద్ధం పూర్తి అయింది. యుద్ధానంతరం ఇంగ్లండుని పునర్నిర్మించడం జరుగుతోంది. శిధిలాల్లో ఉంది. రేషను ఇవ్వడం చాలా పొదుపుగా జరుగుతోంది. మాకు భోజనం దొరికేది కాదు గాని, జనం బలంగా ఉండేవారు.
ఆదర్శవాదం ఎంత గానో ఉండేది. రామేశ్వర్‌ ఆఫ్రికాలో ఉన్నాడు. మావ్‌-మావ్‌ ఉద్యమం సాగుతోంది. ‘మావ్‌-మావ్‌’ పట్ల సానూభూతి పరులు ఇంగ్లండ్‌లో ఉన్నారు. అక్కడ ఎంతో మంది ఆఫ్రికన్లు, దక్షిణాఫ్రికా వాళ్ళు, వీళ్ళందరు అక్కడ ఉన్నారు. వారిలో అభ్యుదయ భావాలున్న వాళ్ళు, తూర్పు ఆఫ్రికా వాళ్ళు, కెన్యన్సు, పశ్చిమాఫ్రికన్లు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ సమయంలో అట్లీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలోనే రామేశ్వర్‌ నన్ను ఇంగ్లండుకి పంపించాడు. హోమ్‌ స్టేడ్‌లో ఒక చిన్న బేస్‌మెంట్‌ ఫ్లాట్‌ని అద్దెకి తీసుకుని అక్కడ ఉండమన్నాడు. అందుచేత నేనక్కడ చేరాను. ”నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో” అని చెప్పి వెళ్ళిపోయాడు. తన సన్నిహిత మిత్రులు కొందరితో, మధ్య మధ్య నన్ను పలకరించమని చెప్పాడు. తను నాకు కొన్ని చిరునామాలు పంపించి, వాళ్లు చాలా మంచి వాళ్ళని చెప్పాడు. వాళ్ళతో ”శాంతని చూసుకోండి” అని చెప్పాడు, అంతే, వారిలో చాలా మంది విదేశీయులు. వాళ్ళతో నాకు పరిచయం ఏర్పరిచాడు. రామేశ్వర్‌కి ఆఫ్రికన్‌ విద్యార్థులతో సూటిగా పరిచయం లేదు.
కానీ వీళ్ళు ఎన్నో ఉపన్యాసాలు వినడానికి తీసుకువెళ్ళేవారు. ఆ విధంగా నిజంగానే నేను ఎంతో నేర్చుకున్నాను. జాన్‌ లెవి అనే అతను చాలా సంపన్నుడు. ఆయన తను ‘జ్యూ’ అనే విషయమై చాలా ప్రాధాన్యం కనపరిచేవాడు. అతనికో ఇల్లు ఉండేది. బేస్‌ వాటర్‌లో ఆకర్షణీయమైన ప్లాట్‌ ఉండేది. బి.బి.సి. కోసం వివిధ దేశాలనుంచి సంగీతం సేకరించేవాడు. చైనీస్‌ సంగీతం, లాటిన్‌ అమెరికన్‌ సంగీతం, ఇంకా అనేకరకాల సంగీతం. నేను హోలీ రోజరీ కాన్వెట్‌ విద్యార్థినిని! విశాల ప్రపంచానికి నాకున్న ద్వారం కాన్వెంట్‌లూ, బోధకులూ, నేను చేసినదంతా అంతే. నేను హైదరాబాద్‌లోని ట్రూప్‌ బజార్‌ (ఇప్పుడు సుల్తాన్‌ బజార్‌) నుంచి వచ్చినదాన్ని బొంబాయి నుంచి కూడ అవును, బొంబాయి లక్నో కన్న ఎక్కువ బహిరంగంగా ఉండేది. నేనది గ్రహించలేదు. కానీ అప్పటికింకా నేర్చుకుంటున్నాను. తెలుసుకోకుండానే నేర్చుకుంటున్నాను.
ఆ ఇంటికోసం అతను నన్ను కొంత సామానూ, ఇతర వస్తువులూ కొనమన్నాడు. ఎలా కొనాలో నాకు తెలియలేదు. ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళి దుకాణాలు చూపించాడు. ”ఇది ఇక్కడ దొరుకుతుంది, అదిఅక్కడ దొరుకుతుంది” అని చెప్పాడు. అదీ రాజా పద్ధతి. ఈ మాత్రం మాత్రమే కొనమని నాకు చెప్పలేదు. ఇంటి కోసం ఏం కావాలో కొనమన్నాడు. నేను మొదటిసారి చూశాను – అది చక్కని సామాను. పిల్లల కోసం అటువంటి సామాను నేనెక్కడ అంతక ముందు చూడలేదు. వాటిలోని అందాన్ని చూపించాడు అతను. ఎంతోమంది రకరకాల వాళ్ళని నిజంగా నాకు పరిచయం చేశాడు. అతని స్నేహితులు నన్ను మ్యూజియమ్‌లూ, చిత్రాలూ… అన్నీ… నాకు లండన్‌ బాగా పరిచితమైంది. లండన్‌ గురించి నాకు బాగా తెలిసింది. నేను పరిచయాలు చేసుకోవడం మొదలుపెట్టాను. నేను చదివినది దీన్ని గురించే కదూ – బేకర్‌ స్ట్రీట్‌ వంటి పేరు జనం మాట్లాడుకుంటుంటే చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడుకునే భాషను పుస్తకాల్లో మాత్రమే చూసిన దాన్ని గురించి. పాలవాడు ఒక రకం భాషలో మాట్లాడతాడు. ఇంకొకరు ఇంకొరకం భాషలో మాట్లాడుతారు. ఎందరో చైనా దేశీయులు, ఎంతో మంది ఆఫ్రికా వాసులూ ఉన్నారు. వివిధ సంస్కృతులను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. రామేశ్వర్‌ నాకు పుస్తకాలు ఇచ్చేవాడు. ప్రతి జన్మదినానికీ, నూతన సంవత్సరానికీ, బహుమతులు ఇవ్వడానికి, ఏదో ఒక వంక. మా వదిన మాటలు నాకు జ్ఞాపకం. మంచి ప్రేమాస్పదురాలు, భావుకురాలు. ”ఓ! ఇతన్ని పెళ్ళి చేసుకోబోతున్నావుకదా!” ఆవిడ అభిరుచి తగినట్టే ”శాంతా, నీకు బహుమతులు పంపించడం మొదలుపెట్టాడా?” అని అడిగింది. ఆవిడ ఉద్దేశంలో సెంట్లూ, జార్జెట్‌ బట్టలూ, ఆవిడకవి ఇష్టం. ఆవిడ ఎంతో ప్రేమగా ఉంటుంది! ”అతని దగ్గర నుంచి బహుమతులు వస్తున్నాయా? నగలు పంపిస్తాడా? ఏం పంపిస్తాడు?” అని అడిగింది. ”పుస్తకాలు, యానీ, పుస్తకాలుపంపిస్తాడు” అన్నాను.
”ఓ! బాగా చదువుకున్నవాడు, పుస్తకాలు, చాలా బావుంది” అంది
కానీ అది ఆమెకి నచ్చలేదు, అది మంచిపని అనుకోలేదు.
అన్నిరకాల ఆసక్తికరమైన వాళ్ళనీ కలుసుకునే అవకాశం కలిగించాడు నిజంగా అతను. వెస్ట్‌మినిస్టర్‌ బిషప్‌ మాకు విందు ఇచ్చాడు – రామేశ్వర్‌కీ నాకూ. నేను (భారత) రాయబారి కాబోతున్నాను. అందుకే చక్కని విందు ఇచ్చాడు మాకు.వెస్ట్‌ మినిస్టర్‌ ఆర్చ్‌బిషప్‌ అనగానే చాలా భయపడ్డాను. కానీ ఆయన్నిచూడగానే, ఆయన చాలా దయగల, ఉదారుడైన, స్నేహపూర్వకమైన ఆత్మీయుడుగా అనిపించాడు. ఆయన భార్య ప్రేమగొల్పేటట్లు ఉంది. వాళ్ళూ మనలాంటి వాళ్ళే. అంటే నేనెంతో ప్రేమగొల్పేటట్లు ఉంటానని కాదు.నా ఉద్దేశం, వాళ్ళూ మనలాంటి సామాన్యులే.
అటువంటి మంచి బ్రిటిష్‌ వాళ్ళని కలుసుకున్నాను. వాళ్ళు టీ ఇచ్చి, వాళ్ళని కలుసుకుని వాళ్ళతో కొంత సమయం గడపమని చెప్పేవారు. ”అలా నడుస్తూ వెళ్దాం” అనీ, ”బెర్రీలు ఏరుకుని వద్దాం’ అనీ, ”దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్దాం” అని అనేవారు. కానీ, వాళ్ళు చదివినవీ, నాకు చెప్పినవీ వేరు.
ఆ సమయంలోనే నేను బాగా చదివాను. అన్నీ చదివాను, ఆఫ్రికా గురించి పుస్తకాలు చదివాను, మంచి పుస్తకాలు, యాత్రా చరిత్రలూ అవీ. నేను రకరకాల సంగీతం వినేదాన్ని, భారతీయ సంగీతం కూడా, ఎలాగంటే, జాన్‌ లెవి దగ్గర మంచి భారతీయ సంగీతం ఉండేది, వినేదాన్ని. ఉపన్యాసాలు వినడానికి వెళ్ళేదాన్ని. అక్కడ ఒక సంవత్సరం ఉన్నాను, ఆ తరవాత నా విడాకుల ఘట్టం పూర్తయింది. ఆ తరవాత రామేశ్వర్‌ నేనూ వివాహాం చేసుకున్నాం. భారతదేశంలో బొంబాయిలో. అప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడింది. రామేశ్వర్‌ నన్ను మొదట చూసినప్పుడు 70 పౌండ్లు ఉన్నాను. పుల్లలాగ సన్నగా, ఘోరంగా ఉన్నాను చూసేందుకు. జుట్టు సన్నగా తాడులా ఉండేది. మెల్లిగాకొంచెం స్వేచ్ఛగా ముస్తాబు చేసుకోవడం మొదలుపెట్టాను. కొంచెం బాగా ముస్తాబు చేసుకోవడం మొదలు పెట్టాను. వేరుగా కనిపించడం మొదలు పెట్టాను. కొంచెం బరువు పెరగడం మొదలుపెట్టాను. నలుగురితో మరింత బాగా తిరిగేదాన్ని, అప్పటికే నా ఇంగ్లీషు ఎప్పుడూ బావుండేది. ఇప్పుడు మాట్లాడినట్లు అప్పుడు మాట్లడలేక పోయేదాన్ని. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడటం మొదలుపెట్టాను. చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. మాకు పెళ్ళయాక, మేము హైదరాబాద్‌కి వచ్చాం.
అతను కుటుంబం బాగుందా?
అతన్ని తల్లి చాలా కోపంగా ఉన్నారు. మేము రాసుకున్న కొన్ని ఉత్తరాలు ఆవిడకంట పడ్డాయి. బాబోయ్‌! ఆవిడ మండిపోతూ ఉన్నారు. ఆవిడ అక్షరాలా రాణీ గారూ! అయినా ఆవిడ గొప్పలు చూపించుకునే వారుకారు, ఎన్నో మంచి పనులు చేస్తూండేవారు. ఎంతో మంది అనాధలకి సమాయం చేసేవారు. ఆంధ్రయువతీ మండలికి అధ్యక్షురాలుగా ఉండేవారు. అక్కడి ఆడపిల్లలతో చాలా నిష్కర్షగా ఉండేవారు. హైదరాబాద్‌లో ఆవిడ చాలా ప్రసిద్ధురాలు. కానీ రామేశ్వర్‌ కుటుంబంలో రెండు వైపుల వాళ్ళమధ్య కోపం ఉండేది.
అతను ఆ కోపం, ద్వేషం, అనుమానం ఉన్న వాతావర ణంలోనే పెరిగాడు.
నేను స్నేహలతనీ, భూపాల్‌నీ యూరోప్‌లో కలిశాను… మొత్తం వాళ్ళ వంశం వాళ్ళందరూ పెళ్ళికి వచ్చారు, అంటే. వనపర్తి వంశం వాళ్ళు.
మీ అత్తగారు మీతో బాగానే ఉండేవారా?
ఆహా! బాగా ఉండటమా! బొత్తగా లేరు! కానీ ఒక మంచి విషయం ఏమిటంటే, నాకు స్నేహలత, విజిత మొదలైన ఎంతో మంది స్నేహితులు నాతో చాలా బాగా ఉండేవారు. మేమందరం ఎంతో బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అందరం కలిసి తరుచుగా ఇక్కడికీ అక్కడికీ వెళ్ళవాళ్ళం. నేనిక్కడ దాదాపు రెండు నెలల పాటు ఉన్నాను. ఎందుకంటే, రామేశ్వర్‌కి ఆఫ్రికా నుంచి దొరికిన సెలవు అంత మాత్రమే. తరువాత అతనికి పశ్చిమాఫ్రికాకి ఉద్యోగం బదిలీ అయింది. అక్కణ్ణించి పశ్చిమాఫ్రికాకి వెళ్ళాడు, కుటుంబానికి సంబంధించిన అసంతోషకర పరిస్థితి వెనక వదిలేసి, పశ్చిమాఫ్రికాలో చాలా బావుంది.
నాకు పశ్చిమాఫ్రికాలో ఎందుకు బావుందంటే, వాళ్ళు అప్పుడు స్వాతంత్య్రం పొందే దశలో ఉన్నారు. మీకు తెలుసుగా, భారతదేశానికి అప్పుడప్పుడే స్వాతంత్య్రం లభించింది. అందుచేత ప్రతి ఒక్కరూ మనకేసి, ఇండియా వైపుకి చూస్తున్నారు మార్గదర్శనం కోసం, స్ఫూర్తి కోసం. ఆ సమయంలో నేను గ్రహించలేదు… మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం లోని ప్రాధాన్యతని నేను గ్రహించలేదు. ఒక సందర్భంలో నేను బ్రిటీష్‌ రాణినీ, డ్యూక్‌ ఆఫ్‌ ఎడింబరోనీ కలుసుకోవలసి వచ్చింది. మేము ఎంతోమంది స్వాతంత్య్ర పోరాట వీరుల్నీ, ఎంతోమంది సంగీత వేత్తల్నీ, ఆఫ్రికన్‌ నాయకుల్నీ, రకరకాల వాళ్ళనీ కలుసుకోవలసి వచ్చింది. నేను ఇంగ్లండ్‌లో ఉన్నప్పటి రోజుల్లోలాగే ఉంది. నా ముందు ఇంకొక కొత్త ప్రపంచం తెరుచుకుని ఉంది, అధికారికంగా మేము కొన్ని విషయాల మూలంగా పరిమితమైనప్పటికీ, భారతదేశం, నెహ్రూ ముఖ్యంగా…
అది మంచిదే, వసంతా, చాలా మంచిదైంది. ఎందుకంటే, నేను ఎప్పుడూ ప్రత్యేక ప్రవర్తనని నేర్పే స్కూలుకి వెళ్ళలేదు. హుందాగా నడవడం గాని, రాణి ముందు వొంగి అభివాదం చెయ్యడం గాని నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆఫ్రికన్లు కూడా చాలా ఉత్తేజపడుతున్నారు. వాళ్ళు కొత్త గౌన్లు కుట్టించుకున్నారు, కొత్త టోపీలు చేయించుకున్నారు. ఇటు నేనూ ఉద్రిక్తతలో ఉన్నాను. ”అవును, నువ్వు వెళ్ళి ఆవిడని కలుసుకోవాలి. అయితే ఏమిటి?” అన్నాడు. ‘అదికాదు, వాళ్ళంతా నేను వొంగి సలాం చెయ్యాలంటున్నారు. అలా సలాం చెయ్యడంనాకు రాదు!” అన్నాను. నువ్వేం సలాం చెయ్యనక్కర్లేదు! ఎంత మాత్రం చెయ్యక్కర్లేదు. మనకి మన సంస్కారవంతమైన చక్కని పద్ధతి ఉంది – రెండు చేతులూ జోడించి అభివాదం చెయ్యడం” అన్నాడు. నాకు చాలా ధైర్యం ”ఫరవాలేదు, అదే బాగుంటుంది”అనుకున్నాను.
ఆ విధంగా ప్రవర్తనా నియమావళి అక్కడే నేర్చుకున్నాను. అందుకోసం నేను ఏ స్కూలుకో వెళ్ళలేదు. అది ఎంత ముఖ్యమైనదైనా, రామేశ్వర్‌ నాకు కావల్సిన విధంగా సహాయపడ్డాడు. ”అలా చెయ్యొద్దు” అనో ”ఇలా చెయ్యి” అనో చెప్పేవాడు. ఎప్పుడైనా డ్రైవరు మాకోసం నిరీక్షిస్తున్నాడని తెలిసి కారు దగ్గరికి పరుగెడుతూంటే, ”పరుగెత్తకు, మెల్లిగా వెళ్ళు, దర్జాగా” అనేవాడు. ”రా తొందరగా రా, టాక్సీ డ్రైవరు నిరీక్షిస్తున్నాడు” అని నేను అంటే, ”ఫరవాలేదు, నెమ్మదిగా నడు’ అనేవాడు.
నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామేశ్వర్‌ నాకు ఎన్నో విషయాలు చాలా నెమ్మదిగా నేర్పాడు. చాకు, ఫోర్కు వాడటం నేర్పాడు విసుక్కోకుండా, ఫరవాలేదు. ఇలా తిను, ఏదైనా పొరపాటు చేస్తే కొంపమునిగిపోదు, ఫరవాలేదు” అనేవాడు. వైన్‌ రకాల్లో ఏది కోరుకోవాలో నేర్పాడు. మీకు తెలుసు, ఆ విందులంటే నాకు చాలా ఇష్టం… ఆకొవ్వొత్తుల వెలుతురులో … సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి…. భారతదేశం నుంచి కొందరు వచ్చి మమ్మల్ని కలుసుకునేవారు. అన్నిటికన్నా గొప్ప విషయం మా అన్నయ్య చెరుకుపంటలో నిపుణుడు, వాణ్ణి ఆఫ్రికాకి పంపించిందట భారత ప్రభుత్వం. చెరుకు విత్తనాల కోసం, దీన్ని హైబ్రిడ్‌గా తయారు చేయడం కోసమూ. మా అన్నయ్య మేము పెళ్ళి చేసుకుంటామంటే తీవ్రంగా వ్యతిరేకించాడు. అందరికన్నా ముందువాడే అన్నాడు. ”నువ్వు కూడా ఆ ఉంచుకున్న ఆడవాళ్ళలో ఒకర్తివి అవుతావు” అని. రామేశ్వర్‌తో మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. వాడు వచ్చి మా దగ్గర రెండు రోజులున్నాడు. వాళ్ళిద్దరూ బాగానే కలిసిమెలిసి ఉన్నారు. ఎంతో బావుంది నిజంగా!
మేము ఆఫ్రికాలో ఉన్నప్పుడు, నేను వంట చెయ్యడం బాగా నేర్చుకున్నాను తెలుసా. ఎన్నో రకాల పాశ్చాత్య వంటకాలు చెయ్యడం నేర్చుకున్నాను, చేపలతో చేసేవి, ఇంకా ఇవీ, అవీ, రామేశ్వర్‌ పుస్తకాలు తీసుకొచ్చి, ”చదివి, ప్రయోగాలు చెయ్యి” అనేవాడు. నేను అన్ని రకాల వంటలూ నేర్చుకున్నాను. వైన్‌తోనూ, వైన్‌ లేకుండానూ, ఆలివ్‌ నూనెతోనూ… మొదలు పెట్టాను, ముందుకి దూసుకుపోయాను. అంటారు కదా! ఒకటే దూసుకుపోయాను. నాకు చెప్పే వాళ్ళెవరూలేరు ”వద్దు, అది చాలా ఖరీదెక్కువ” అని. నన్ను ఆపేందుకేమీ లేదు.
నాకు వంటలు చేయడంలో ఉన్ననైపుణ్యం నిజంగా వికసించింది. వంటంతా నేనే చేసేదాన్ని, బొంబాయిలో గ్యాస్‌ చూశానుగాని, ఎలెక్ట్రిక్‌ ఒవెన్లూ అవీ చూడలేదు.ఎలెక్ట్రీక్‌ ఒవెన్లు! నాకు గుర్తుకొస్తొంది. నేను ఎన్నో క్రిస్‌మస్‌ కేక్‌లను తయారు చేశాను! అవన్నీ వంటలపుస్తకాలు చదివి చేసినవే. నేను ఏ క్లాసుకీ వెళ్ళలేదు, అలాంటిదేమీ చెయ్యలేదు. చదివేదాన్ని. కొలిచేదాన్ని ఆ కొలత కప్పుల్ని కొన్నాను. నేను విందుకు పిలిచేదాన్ని. నిజంగా నాకు అందరినీ పిలిచి విందులివ్వడం ఇష్టం. నాకు కొవ్వొత్తి దీపాలంటే ఇష్టం. అందర్నీ ఆహ్వానించడం నాకిష్టం. భారతదేశం గురించి మాట్లాడటం నాకిష్టం. వాళ్ళు భారతీయ సంగీతంగురించి అడుగుతుంటారు. వాళ్ళకి భారతదేశం గురించి సరిగ్గా చెప్పాల్సి ఉంటుంది. అందుకని నేను పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. నేను రామేశ్వర్‌ని అడిగాను వాళ్ళకి ఏమేం చెప్పాలని. ”అందుకే శాంతా చదువు. అప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావు” అన్నాడు.
    మతం మాటేమిటి? మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉందా?
రామేశ్వర్‌కి ఆసక్తి ఉంది. పూర్తిగా సైద్ధాంతికంగా, మొత్తం అద్వైతం గురించి తెలిసినవాడు. అతని గురువు ఆత్మానందదగ్గరికి తీసుకువెళ్ళాడు త్రివేండ్రమ్‌కి. అన్ని రకాలవాళ్ళు వచ్చేవారు అక్కడికి, వసంతా, సోమర్‌సెట్‌ మామ్‌ వచ్చేవాడు. రాజేశ్వర్‌ దయాల్‌ (విజిత శాంతా రామేశ్వర్‌కి మరదలు) వచ్చేవాడు. నేను కూడా వెళుతూండేదాన్ని. గురువుగారు (గురునాథ్‌) ఇలా కుర్చీలో కూర్చునేవారు. అందరూ కూర్చుని అన్ని రకాల విషయాలూ చర్చించేవారు. కొన్ని నాకు అర్థమయేవి కావు. బాబోయ్‌! విసుగు పుట్టి పోయేది. ఎంతోమంది

ఉండేవారు అక్కడ. కొంతమంది హైదరాబాదు నుంచి వచ్చే వారు. రామేశ్వర్‌ ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉండాలని తపన పడేదాన్ని. రామేశ్వర్‌ అధ్వైతం గురించి మాట్లాడేవాడు. దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకునేదాన్ని. తరవాత, నాదైన సాదాసీదాపద్ధతిలో మామూలుగా అడిగాను ”గురునాథన్‌, నేను భగవద్గీత చదివితే మంచిదేనా?” అని. భగవద్గీతకి ఆయన దృష్టిలో అంత విలువ లేదు. అందుకని ఆయన నాకు ”అష్టా వక్ర సంహిత’ని ఇచ్చారు. నేను దాన్ని చదివాను. అది చాలా చాలా చక్కని పుస్తకం. దారిలో మరొక ప్రయాణం ప్రారంభం….
(తడి ఆరని గాయాలు, ప్రేమ, పని, వియోగ విషాద స్పృతులు, వసంత కన్నబిరాన్‌, సంపాదకత్వం – ఓల్గా)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.