498ఏ చట్టం మీద జరుగుతున్న విషప్రచారం గమనిస్తూంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. మామూలు మగవాళ్ళు మొదలుకొని మహామేధావులమని విర్రవీగే వారు సైతం ఎందుకని 498ఏ పట్ల ఇంత వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నారు? ఈ సోకాల్డ్ మేధావుల బయట ముఖం చాలా అభ్యుదయకంగా కనిపిస్తుంది. మీటింగ్‌లో చాలా పురోగామి దృక్పధాలను ప్రదర్శిస్తారు. వీరు అన్నిటా అభ్యుదయంగానే వుంటారు… స్త్రీల అంశాలొచ్చేటప్పటికి పరమ తిరోగమనంలోనే వేలాడుతుంటారు. కుటుంబం, పెళ్ళి, సంప్రదాయం, కట్టుబాట్లు వీటి ముసుగులోనే మనుగడ సాగిస్తారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను తూ.చ తప్పకుండా పాటించాలంటారు. న్యాయమూర్తులు కూడా దీనికి అతీతంగా లేరని ఇటీవలి కొందరు న్యాయమూర్తుల వ్యాఖ్యలు చూసే అర్ధమాతుంది. తీవ్ర గృహ హింస నెదుర్కొంటున్న స్త్రీలు ఉపయోగించుకునే క్రిమినల్ చట్టం 498ఏ గురించి వీరి ధోరణి, కామెంట్స్ చూస్తుంటే భయమేస్తుంది. వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఒక గాలివాటు ప్రచారంలో కొట్టుకుపోతూ ముక్త కంఠంతో 498ఏ దుర్వినియోగమవుతోంది అని రంకెలు వేస్తున్న వ్యక్తులు, వ్యవస్థలు ఈ రోజు 498ఏ చట్టాన్ని సవరించాలని మాట్లాడుకున్నారు.
ప్రతి గంటకి ఓ వరకట్న హత్య జరుగుతోందని ప్రభుత్వం వారి లెక్కలే చెబుతున్నాయి. 2013లో అక్షరాల మూడు లక్షల పదివేల నేరాలు స్త్రీల మీద జరిగాయని ఏలినవారి నివేదికలు రుజువు చేస్తున్నాయి. ఇందులో ఇంటి నాలుగ్గోడలు మధ్య జరిగిన నేరాలే ఎక్కువగా వున్నాయి.
నిన్న హెల్ప్‌లైన్‌కి వచ్చిన ఓ కేసు… అదనపు కట్నం తెమ్మని ఆ అమ్మాయి వొళ్ళంతా వాతలు పెట్టారు. ఈ ఎండవేళ… గంట కాల్చి వొళ్ళంతా వాతలు పెట్టినపుడు ఆమె ఏం చెయ్యాలి. నోట్లో గుడ్డలు కుక్కి, కాల్చి, ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోతే ఆమె బతుకేం కావాలి… ఆమె చావాలి కానీ, తన రక్షణ కోసం వున్న చట్టాన్ని వినియోగించుకోకూడదు??? 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టకూడదని, ఆమెకు కౌన్సిలింగ్ చెయ్యాలనుడం ఎలాంటి న్యాయం?
ఎన్ని రకాల హింసలు? ఎన్ని రకాల అత్యాచారాలు? గృహహింస మీద ఎంత చర్చ జరిగితే ఈ 498ఏ చట్టం వచ్చింది. ఎంతమంది నవ వధువులు కిరోసిన్ స్టవ్‌లు పేలిపోయి చనిపోయారు? అప్పటకీ, ఇప్పటికీ హింసలపరంగా ఏమైనా మార్పొచ్చిందా? చట్టాలను వినియోగించుకోవడం తెలియని వాళ్ళు దుర్వినియోగం చేసే స్థాయికి చేరిపోయారా? అలా అయితే ప్రతి సంవత్సరం పెరిగిపోతున్న మహిళలపై హింసల నేరాల నివేదిక మాటేమిటి? అది ప్రభుత్వమే తయారు చేస్తుంది కదా!
498ఏ ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల వచ్చిన సమస్యలివి. హింసనెదుర్కునే మహిళలు పోలీస్టేషన్‌కొచ్చి ఫిర్యాదు చేయడమే కష్టం. ఒకవేళ కష్టపడి చేసినా… ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసిన పోలీసులు దర్యాప్తులో ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం… శాస్త్రీయంగా, చట్టప్రకారం ఎంక్వయిరీ జరపకపోవడం, తూతూ మంత్రంగా కోర్టులో చార్జిషీటు వెయ్యడం, సరైన సాక్ష్యాధారాలు సేకరించి… కోర్టు ముందు పెట్టకపోవడంతో తొంభై శాతం పైనే కేసులు నిలబడడం లేదు. కొట్టేయబడుతున్నాయి. నాన్‌బెయిలబుల్ నేరం కాబట్టి అరెస్టులు జరిగినా శిక్షలు పడినవి మాత్రం వేళ్ళమీద లెక్క పెట్టొచ్చు. 498ఏ అమలు మీద జరిగిన అధ్యయనాలు తేల్చిన సారాంశం కూడా ఇదే… అయినప్పటికీ స్త్రీలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గగ్గోలు పెట్టడం ఎలాంటి సంస్కృతి??
హింసలో ముగ్గుతున్న బాధితురాలినే బాధ్యురాలిని చేయడం అంటే ఆమెమీద కుటుంబ హింసతో పాటు న్యాయహింస కూడా అమలు చేయడం కాదా?? ఇదెలాంటి న్యాయమౌతుంది.??
ఈ దేశంలో పక్షుల్ని చంపితే నేరం… కొన్ని రకాల జంతువుల్ని చంపితే నేరం… ఆయా నేరాలకు చట్టాలున్నాయి…. అరెస్టులున్నాయి.. శిక్షలున్నాయి. అంతేనా? ఎర్ర చందనం చెట్టు కొడితే ఆ కొట్టిన వాళ్ళని ఏకంగా ఎన్‌కౌంటర్ చేసేస్తారు… పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. ఈ న్యాయం ఆడవాళ్ళని కాల్చుకుతింటున్న వాళ్ళకు వర్తించదా? ఇంకా ఎంతమంది ఈ హింసల కొలుముల్లో మాడిమసైపోవాలి? చెట్టూ, పిట్టా పాటి చెయ్యదా ఈ దేశంలో ఆడది? పులులు జనాభా తగ్గిపోతోందని ఆందోళన చెందే వాళ్ళకి ప్రతి నిమిషం ఓ ఆడపిండం చిదిమేయబడుతోందని, స్త్రీల జనాభా తగ్గిపోతోందని తెలియదా? పులులను రక్షించుకునే చర్యలెన్నో…ఆడవాళ్ళ రక్షణ కోసం చేసిన చట్టాలను మాత్రం వినియోగించుకోకూడదట. హింసింపబడే మహిళలు కుటుంబ సొత్తు… ఏమైనా చేసుకోండి… మేం పట్టించుకోం అని అన్యాపదేశంగా చెప్పినట్టేకదా?
మరి చేసిన చట్టాలన్నీ ఎందుకు? ఎవరి ప్రయోజనం కోసం? అమలు చెయ్యని చట్టాలు వున్నా వొక్కటే లేకపోయినా వొక్కటే కదా! అందుకే 498ఎ తో సహా… మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన అన్ని చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
498ఏ ని నీరుగారుస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యరాదు… దుర్వినియోగం ఎక్కడ అవుతందో… ఎవరు చేస్తున్నారో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి… 498ఏ ని పటిష్టంగా, సక్రమంగా అమలు చేసి కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీలకు వెన్ను దున్నుగా నిలవాలి. 498ఏ కి ఎలాంటి సవరణలు అవసరం లేదని, పటిష్టంగా అమలు చేయాలని చెప్పిన లా కమీషన్ నివేదిక అనుగుణంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags