రచయితలూ, కవులూ, సాహిత్యకారులూ, సాహితీ సంఘాలూ మౌనం వీడి ఒకచోట చేరారు. విభిన్న నేపథ్యాలు, వివిధ ఆస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన కలం యోధులు, సాహితీ సాంస్కృతిక సృజనశీలురు ఒకే వేదికపై సమైక్యంగా ఆలోచించారు. కారణం ”వర్తమాన సామాజిక సంఘర్షణలు – రచయితల బాధ్యత” అన్న అంశంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన కార్యక్రమం. ఈ అపూర్వ సంఘటన 25 అక్టోబర్, 2015న తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదికలో జరిగింది.
ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనభయ్యో దశకంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ అవసరం ఏర్పడింది. మనం చూసీ చూడనట్టు ఉండడం వల్లే, సెక్యులర్ వాదుల మౌనం వల్లే నేడీ పరిస్థితి దాపురించింది. శత్రువు అది అవకాశంగా తీసుకుని పెచ్చరిల్లిపోవడం, ఆధిపత్య ప్రదర్శనలు చేయడం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమాజం అంచులలో ఉన్న వర్గాలపైనే కాకుండా కలంయోధులపై దాడులు జరుగు తున్నాయి. కల్బుర్గి హత్య, సుదింద్ర కులకర్ణిపై దాడి వంటివి ముందస్తు బెదిరింపు చర్యలు మాత్రమే. మనం మౌనం వీడకపోతే, నిరసన తెలపకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అందుకు నిరసనగా అవార్డులు తిరిగి ఇవ్వడంతోనే సరిపోదు. అది ఒక నిరసన రూపం మాత్రమే. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు యువతరంలోకి నవతరంలోకి వెళ్ళడం లేదు. లౌకిక భావజాల వ్యాప్తి విస్తృతంగా జరగాలి. ఆ దిశగా ప్రచారం జరగాలి. విస్తృతంగా రచనలు రావాలి. ఎవరికి వారుగా ఉన్న వ్యక్తులపై, సంస్థలపై శత్రువు దాడి చేయడం సులువు కాబట్టి సంఘటితంగా ఎదుర్కోవాలని, విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం ఆవసరం అని పిలుపునిచ్చారు వక్తలు. ఒకవైపు డిస్ట్రక్షన్ పెద్ద ఎత్తున జరిగిపోతోంది. నమ్ముకున్న విలువల్ని కాపాడుకోవడానికి మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతున్నాయనీ వాటిని ఎదుర్కొంటూ నూతన సంస్కృతీ నిర్మాణం జరగాలనీ, వాదాలను, విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలనీ అభిలషించారు.
సమాజంలో పెరిగిపోతున్న అసహనం, మత దురహంకారం, అసలు సమస్యని తప్పుదారి పట్టించడం జరుగుతోంది. ప్రగతిశీల శక్తులపై ప్రభుత్వ అనుకూలంగా బృందాలు దాడులు చేయడం, ఏకీభవించని వారి పీక నొక్కేయడం సాధారణం అయింది. మతం వ్యక్తిగతం అన్న స్థితి మారింది. దాన్ని ప్రభుత్వం స్వీకరించింది, పండుగలు పబ్బాలు నిర్వహిస్తోంది. అందుకు ప్రజా ధనం ఉపయోగిస్తోంది. మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది. లౌకిక శక్తులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులను చేస్తోంది.
ఈ సందర్భంలో జరిగిన చర్చలో కార్యాచరణకు వచ్చిన అంశాలను క్రోడీకరించి చూస్తే స్థూలంగా వచ్చిన నిరసన రూపాలివి:
సృజనశీలురు, సాహితీవేత్తలు మౌనంగా ఉండడం, రాయకుండా ఉండడం నేరంగా భావించాలి. మౌనం వీడాలి. కలాలకు, గళాలకు పదునుపెట్టాలి. విస్తృతంగా రచనలు చేయాలి. లౌకిక వాద భావప్రచారం జరగాలి.
* కళాశాల స్థాయిలో లౌకిక వాద భావ ప్రసారం, ప్రచా రం జరిగే కార్యక్రమాలు చేపట్టాలి.
* మార్చ్ పెద్ద ఎత్తున హైదరా బాద్లో జరగాలి.
* నిరసన ప్రదర్శనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టులు, సభలు జరపాలి.
* జాతీయ స్థాయిలో రచయితలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది.
* అన్ని అస్తిత్వ ఉద్యమాలు కలిసి శత్రువుని ఎదుర్కోవాలి.
* నిరసన తెలపడానికి వివిధ రకాల టూల్స్ తీసుకోవాలి.
* నిరసన కార్యక్రమాలు ఒక ఉద్యమంలా సాగాలి.
* సోషల్ మీడియాని లౌకిక వాద భావప్రసారానికి సాధనంగా వాడుకోవాలి.
* చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం
* కరపత్రాలు పంచడం
* వివిధ జానపద కళారూపాల ద్వారా లౌకిక భావ వ్యాప్తితో పాటు వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగించడం
* సామూహిక స్వరం వినిపించడం
* రచయితల డిక్లరేషన్ ప్రకటించడం
* జిల్లాలలో, పట్టణాలలో నిరసన కార్యక్రమాలు జరపడం
* భావ ప్రకటన కాపాడుకోవడం
* మత కలహాలు జరిగే ప్రాంతాల్లో, గ్రామాల్లో లౌకిక వాద ప్రచారం జరపడం
* ట్రేడ్ యనియన్లలోకి, విద్యార్థులలోకి, ప్రజల్లోకి వెళ్ళడం.
* జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం
* ప్రజల ఆహారపు అలవాట్లని శాసించడాన్ని ధిక్కరించడం
* వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం
* ఖండనలు, ప్రకటనలకి మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం
* సంతకాల సేకరణ రూపంలో నిరసన తెలపడం
* రచయితల భద్రత కోరుతూ ముందే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం
అనంతరం కొండవీటి సత్యవతి, యాకూబ్, బమ్మిడి జగదీశ్వరరావు, పసునూరి రవీందర్ కన్వీనర్లుగా ఒక కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీలో వీరితో పాటు ఉష ఎస్. డానీ, స్కై బాబా, అరుణోదయ విమల, జి.ఎస్. రామ్మోహన్, కాత్యాయనీ విద్మహే, శివారెడ్డి, తెల్కపల్లి రవి, రెహనా, రివేరా సభ్యులుగా భవిష్యత్ కార్యక్రమ కార్యాచరణ జరుగుతుంది.
దాదాపు 200 వందల మందికి పైగా కలం యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రొ. హారగోపాల్, వరవరరావు, తెల్కపల్లి రవి, అల్లం నారాయణ, కె. శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, రమా మెల్కోటే, వీణా శత్రుఘ్న, విమల, అనిల్ అట్లూరి, నాళేశ్వరం శంకరం, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, కాకరాల, వేంపల్లి షరీఫ్, కత్తి మహేష్, దేవి, జ్వలిత, తిరునగరు దేవకీదేవి, రమాసుందరి, అరణ్య కృష్ణ సుమిత్ర, ఇంద్రవెల్లి రమేష్, శిలాలోలిత, తారకేశ్వర్, రామారావు, ఎన్. వేణుగోపాల్, కృష్ణుడు, వినోదిని, రాజేంద్రప్రసాద్, ఆలీ సిద్ధికి, వర్మ, వనజ సి., గోపరాజు సుధ, రజని, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, కందుకూరి రాము, ప్రరవే సభ్యులు కాత్యాయనీ విద్మహే, మల్లీశ్వరి, శాంతిప్రబోధ, భండారి విజయ, మెర్సీ మార్గరెట్, పి. రాజ్యలక్ష్మి, కొండేపూడి నిర్మల, తాయమ్మ కరుణ, కవిని ఆలూరి, కొమర్రాజు రామలక్ష్మి, బండారి సుజాత, సమతా రోష్ని, శివలక్ష్మి, హేమలలిత, లక్ష్మీ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సౌజ్యంతో జరిగింది.