భ్రమణ కాంక్ష – భ్రమణ కాంక్ష మనుష్యులను ఇరుకైన ఇంటినుండి విశాలమైన ప్రపంచంలోకి ప్రయాణించేలా చేస్తుంది. ”లోకసంచారి ఒంటరిగా తిరుగుతాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. తనకి పరిచయమైన ప్రతివారిమీదా అనంతమైన స్నేహభావాన్ని కురిపిస్తాడు. లోకసంచారీ హృదయంలోని ఈ స్నేహభావమే అతనికి నిత్యం మధురస్మృతులను కలిగిస్తుంది” అన్న రాహుల్ సాంకృత్యాయన్ గారి మాటలు గుర్తొస్తాయి కొండవీటి సత్యవతి గారి ”తుపాకీ మొనపై వెన్నెల-యాత్రానుభవాలు” చదువుతుంటే. అయితే ఒక్కటే తేడా. సత్యవతి గారి ప్రయాణాలు చాలామటుకు సన్నిహితులతోనూ, స్నేహితులతోనూ కలసి చేసినవి.
సత్యవతి గారంటే వుమన్ ఆన్ వీల్ అనే సత్యవతి గారి మాట అక్షరాల నిజం. ఆమె ఒకేచోట నిలబడిపోకుండా భిన్న దారుల్లో ప్రవహించే చైతన్య స్రవంతి. ప్రయాణాలు చేయడం ఎంత ఇష్టమో, ప్రయాణ విశేషాలు అనుభవాలు హృద్యంగా అక్షరబద్ధం చేసి పాఠకులను తనతోపాటు మానసికంగా ప్రయాణం చేయించే అద్భుతమైన నేర్పు ఆమె కలానికుంది. ఆ ప్రయాణం ప్రకృతి అందాలను తిలకించే కాశ్మీర్, అమర్‌నాథ్, అండమాన్ యాత్రలు కావచ్చు లేదా పీడిత మహిళలకు సంఘీభావం తెలిపే సెజ్ సెగల్లో ఉన్న పోలేపల్లికై కావచ్చు లేదా కషీధ్ బీచ్ రిసార్ట్స్‌లో రైటర్స్ కాంప్ కావచ్చు రచయిత్రితోపాటు మనం ప్రయాణించాల్సిందే. చలికి వణికిపోవాల్సిందే. పొగలు కక్కే టీ కాఫీలు రుచి చూడాల్సిందే. పున్నమి వెన్నెలలో బంగాళాఖాతం అందాలలో ఓలలాడాల్సిందే. పెద్ద వాగులో నీటిని వాటేసుకొని విన్యాసాలు చేయాల్సిందే.
కాశ్మీర్ యాత్రకు ”తుపాకీ మొనపై వెన్నెల” అనే పేరును వేమన వసంత గారు పెట్టారు అని రాశారు. ఎంత సరైన పేరు. ఇప్పుడున్న పరిస్థితులలో కాశ్మీర్ అందమంతా తుపాకీల నీడలలోనే ఉంది. అయినా మంచుకొండలు చూస్తే మనసు కరుగుతుంది. ఏదెలా ఉన్నా కాశ్మీరు లోయ, మంచుకొండలు, ఆకాశాన్నంటే పైన్, దేవదారు, పొప్లర్ వృక్షాలు అందమైన పూల తోటల్లో పూసిన రంగురంగుల పూలు ఇలాంటి అందాలనూ చూడటం అద్భుతమైన విషయం. ప్రకృతి అందాలకు పరవశించిపోయే సత్యవతి గారు ఆ పరవశాన్నంతా కలంలో పోసి రాశారా అనిపిస్తుంది.
గోదావరి ఒడ్డున ఉన్న ఊళ్లో పుట్టిన సత్యవతి గారికి నదులన్నా, నీళ్ళన్నా విపరీతమైన ప్రేమ. గంగానది వివిధ రూపాల్లో చూసినప్పుడు ఆమె పొందిన ఉద్వేగం, ఆనందం వర్ణించిన తీరు ఎంత గొప్పగా ఉందంటే చదువుతున్న మనం కూడా అంతే ఉద్వేగాన్ని పొందుతాం. స్వర్గపు అంచుల్లో విహారం చేస్తాం. జీవనదుల్లోని జీవాన్ని మనలో కూడా నింపుకుంటాం.
”ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయత్వం కలుగుతుంది.”
”విమానం గాల్లోకి లేవంగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చుంది.”
”కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగవుతుందో అని చేపలాగా అనిమేషను అయినాను.”
ఇలా ప్రతి పేజీలోను అద్భుతం అనిపించే ఉద్వేగ భావాలు.
ప్రకృతి వర్ణనలో ఎంత ఆనందపు ఆకాశంలో గిరికీలు కొట్టిస్తారో, సమస్యలను గురించి రాసేటప్పుడు అంతే ఆలోచింపచేస్తారు.
ఇంఫాల్ ప్రయాణంలో ఇరోమ్ షర్మిల విడుదలను దగ్గరుండి చూడడం, తొమ్మిది సంవత్సరాలుగా అభోజనంగా ఉంటూ మణిపురి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముప్ఫై ఐదు సంవత్సరాల షర్మిలను చూసినప్పుడు తన గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతోపాటు, ఆమె వజ్రసంకల్పం ముందు తన శిరస్సు వాలిపోయింది అని రాశారు. ఇరోం షర్మిల గురించి, అస్సాం స్త్రీల వెతలను గురించి చదువుతున్నప్పుడు కళ్ళు నీటి చెలిమలే అవుతాయి.
సబర్మతి ఆశ్రమాన్ని చూసినప్పుడు ”కస్తూర్బా గాంధీ గది” అని బోర్డ్ తప్ప ఆ గదిలో కస్తూర్బాకు సంబంధించిన వస్తువులేవీ లేకపోవడం కనీసం ఆమె ఫోటో కూడా లేకపోవడం పట్ల తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తారు. జాతిపితగా పిలవబడే గాంధీగారికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉన్న కస్తూర్బా గాంధీ దేశానికి మాతృసమానురాలు కదా, ఆమెకు ప్రత్యేక గౌరవం అక్కర్లేదా అని వాపోతారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్నిలో ఉన్న సమతా నిలయం పిల్లల్ని కలిసినప్పుడు తాను కూడా వాళ్ళతో కలసి ఆడతారు పాడతారు. వయసు మరచిపోయి చెట్లు కొండలు ఎక్కినట్లు రాశారు. అమ్మమ్మా అని పిలిచే అమాయక పసి హృదయాలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీస్తారు. ఈ చిన్నారులంతా దురదృష్టవంతులైన తల్లిదండ్రులు వొద్దని వొదిలేసుకున్న మట్టిలో మాణిక్యాలు. ఈ విషయాల్ని చదువుతుంటే మనసంతా చేదుగా ఐపోతుంది. ఐతే వాళ్ళ మీద జాలితోనో, సానుభూతితోనో కాకుండా ఎంతో వాత్సల్యంతో ఆమె పిల్లల్ని చేరదీసి వాళ్ళతో గడిపిన రెండు రోజులు వారితో ఆడిన ఆటలు పాడిన పాటలు చదువుతుంటే మనం కూడా అంతసేపు వర్నిలో ఉండిపోతాం.
సత్యవతి గారికి చుట్టూ ఉన్నవాటిని ఉపయోగించడం, ఆ క్షణంలో జీవించడం, ప్రస్తుతాన్ని ప్రేమించడం వెన్నతో పెట్టిన విద్య. చెరుకుతోట కనబడితే చెరుకుగడలను అందుబాటులో ఉన్న బండమీద కొట్టి తినడం, తాటిపండు దొరికితే చితుకులు పేర్చి వాటిని కాల్చి అందరికి రుచి చూపించడం ఇలాంటివన్ని చదువుతూ ఉంటే అనవసర భేషజాలలో ఉండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఎంత కోల్పోతున్నామో కదా అనిపిస్తుంది.
ప్రతి ప్రయాణం ఎంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్డ్‌గా ఆర్గనైస్ చేసారో అంతే పర్‌ఫెక్ట్‌గా రాశారు పుస్తకంలో.
ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న సంఘటన, ప్రయాణాల్లో తనకు సహకరించిన ప్రతి వ్యక్తి గురించి ఎంతో శ్రద్ధగా రాయడం కనబడుతుంది పుస్తకమంతా. చిన్న సహాయం అందించినవారిని కూడా మరిచిపోకుండా పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పడం చదివితే ఆమె మనసు భేషజం లేని స్వచ్ఛమైన మల్లెపూవు కదా అనిపిస్తుంది.
ఆత్మీయపలుకులులో అమృతలత గారు ”ఆమె తన యాత్రల్లో తీసుకున్న ఫోటోలని, అందునా కలర్ ఫోటోలని వారి ట్రావెలాగ్‌లో పొందుపర్చి దాన్ని ‘సారేజహాసే అచ్ఛా, హిందూసితా హమారా’ పేర ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే – అది భారతదేశ పర్యటనకి వచ్చే విదేశీయులకి ఒక టూరిస్ట్ గైడ్‌గా ఉపయోగపడుతుంది” అని రాశారు. ఈ మాటలు అక్షరసత్యాలు. విదేశీయులకే కాదు మనకూ ఉపయోగపడుతుంది.
సత్యవతిగారు తన ముందుమాటలో ”ప్రయాణం ఎవరితో చేస్తామన్నది కూడా ముఖ్యమే. ప్రతి చిన్న అసౌకర్యానికి ముఖం చిట్లించే వాళ్ళతో ప్రయాణం కష్టమే. అన్ని సౌకర్యాలు ఇంట్లో అమరినట్టు ప్రయాణాల్లో కూడా అమరాలనే వాళ్ళతో వేగడం చాలా కష్టం. చింతల్ని, చికాకుల్ని వెంటేసుకొని తిరిగితే మన ఆనందం కూడా ఆవిరైపోతుంది. ఎక్కడ ఏది దొరికితే అది తినగలిగినవాళ్ళు, పరుపు లేకపోయినా హాయిగా నిద్ర పోగలిగివాళ్ళు ప్రయాణాల్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.”
”ప్రయాణాల్లో విమానాలు కూలుతాయో, రైళ్లు పడిపోతాయో అని భయపడుతూ కూర్చోవద్దు. ప్రయాణం మొదలుపెట్టేముందు ఎన్ని వస్తువులు సర్దుకున్నా భయాన్ని మాత్రం బ్యాగుల్లో సర్దుకోవద్దు. దాన్ని వదిలేస్తేనే ప్రకృతి అందాన్ని ఆస్వాదించగలుగుతాము” అంటారు. ఈ మాటలన్నీ అక్షరలక్షలు.
”నేను పొందిన గాఢమైన అనుభూతిని యధాతథంగా పఠితులకు అందించడమే నాకిష్టం. నాతోపాటు ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించడం కష్టమే కానీ నేను ఈ కళలో ఆరితేరాను. నా ట్రావెలాగ్స్ చదివేవాళ్ళు నాతో ప్రయాణం చేయాల్సిందే. నేను పొందిన గాఢానుభూతిని పొందాల్సిందే” అన్న మాట నూటికి నూరుపాళ్ళు నిలబెట్టుకున్నారు.
పుస్తకం చేతిలోకి తీసుకోవడం రిలాక్స్‌గా కుర్చీలో కూచోవడం మొదటి పేజీ తెరవడం వరకే మనం చూస్తాం. తరువాత క్షణం నుంచి రచయిత్రి వెంటే పరుగులు. ఒక్కో యాత్రావిశేషం చదువుతుంటే ఒక్కో అనుభూతి.
ఇలాంటి అనుభూతులు పొందాలనుకునేవారు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. ప్రయాణాలు ఇష్టపడేవారు ఎలాగూ చదువుతారు. ప్రయాణాలు అంతగా నచ్చనివారు కూడా తప్పకుండా చదవండి. హాయిగా ఇంట్లో కూచునే అన్ని ప్రయాణాలు చేయొచ్చు.
పుస్తకం : తుపాకీ మొనపై వెన్నెల
రచయిత్రి : కొండవీటి సత్యవతి
వెల : రూ.150/-
ప్రతులకు : భూమిక
హెచ్.ఐ.జి. II, బ్లాక్ 8, flat -1,
బాగ్‌లింగంపల్లి, హైద్రాబాద్ – 500 044.
ఫోన్ : 040-27660173
లేదా అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లో.