పౌరాణిక స్త్రీ పాత్రలలో సీత, ద్రౌపది, కుంతి, గాంధారి, అహల్య, శూర్పణఖ, ఊర్మిళల గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ వుంటాము. అందులోనూ సీత గురించి మాట్లాడేటప్పుడు ఆమె కష్టాలకు ప్రతిరూపమనో పదే పదే శీల పరీక్షలకు గురై విసిగి తల్లి ఒడి చేరిందనో చాలా సానుభూతితో మాట్లాడడం సామాన్యులకు అలవాటు. మన వ్యాఖ్యాతలు రామాయణ పండితులు కొందరు ఆ భావాలను బలంగా నాటారు. అవనిజ అయిన సీత వ్యక్తిత్వ పరిణామాన్ని మనం ఇపుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతను అర్థం చేసుకోవడం ద్వారా మనని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా రూపొందాలి? మనపై మన అధికారాన్ని ఎట్లా నిలుపుకోవాలి? అన్ని రకాల అధికారాల నుంచి భ్రమల నుంచి ఎట్లా విముక్తం కావాలి? సీత కేంద్రంగా శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళల అంతరంగాలను, వారి అంతరంగ జ్ఞానం ద్వారా సీత వ్యక్తిత్వ పరిణామాన్ని తద్వారా స్త్రీలు తమని తాము స్థిరీకరించుకోవలసిన అవసరాన్ని అద్భుతంగా చిత్రించిన కథా గుచ్ఛం ఓల్గా ”విముక్త”.
తమ భర్తలను ప్రేమిస్తూ సేవిస్తూ అదే తమ కర్తవ్యంగాను, జీవన ధ్యేయంగాను భావిస్తూ జీవిస్తున్న నలుగురు స్త్రీలు ఆ భర్తల అనుమానానికి వారిచే అవమానానికి, నిర్లక్ష్యానికి గురై ఆ బాధ లోనుంచి అవమానం లోనుంచి నిర్లక్ష్యంలో నుంచి తల విదిల్చుకుని లేచి నిలబడి తమను తాము స్వతంత్ర వ్యక్తులుగా ప్రతిష్టించుకున్న విధమూ, వారు అలవరచుకున్న జీవన తాత్వికతా ఈ నాటి స్త్రీలు తప్పక తెలుసుకోవలసిన అవసరాన్నికూడా ఈ కథల ద్వారా ఓల్గా హెచ్చరించారు. వాల్మీకి రామాయణంలో రామునితో పోలుస్తూ శూర్పణఖను ఇలా పరిచయం చేస్తాడు ”రాముని ముఖము చాలా అందమైనది. ఆమె (శూర్పణఖ) ముఖము వికృతముగానున్నది. అతని నడుము సన్నగా వున్నది. ఆమె పొట్ట చాలా పెద్దది. అతని నేత్రములు విశాలమైనవి, ఆమె నేత్రములు వికృతముగా వున్నవి. అతని జుట్టు అందముగా నల్లగా వున్నది ఆమె జుట్టు ఎర్రగా వున్నది. చూచువారికి ఆనందము కలిగించే రూపమతనిది. ఆమెది వికృతమైన రూపము. అతని కంఠధ్వని మధురమైనది. ఆమె కంఠధ్వని కర్ణ కఠోరమైనది. అతను నవయౌవ్వనవంతుడు. ఆమె వెగటు కలిగించే వృద్ధురాలు. అతడు మాటలలో నేర్పరి. ఆమె వంకరగా మాట్లాడును. అతడి నడవడి న్యాయసమ్మతమై వుండును. ఆమె చాలా చెడ్డ నడత గలది. అతడు చూచువారికి ఆనందము కలిగించును, ఆమె ఏవగింపు కలిగించును.” (ఆచార్య పుల్లెల రామచంద్రుడు తెలుగు అనువాదం)
ఈ వర్ణనతో ఆమెను లక్ష ్మణుడు విరూపిని చెయ్యడాన్ని వాల్మీకి సమర్థిస్తున్నట్లు ముందే అనిపిస్తుంది. అటు పిమ్మట ”న్యాయవర్తనులైన” ఆ అన్నదమ్ములిద్దరు ఆమెతో ఆడిన పరిహాసము, ఆమెను విరూపిని చేసిన తీరు ఆమెపై సానుభూతి కలిగిస్తాయే గాని వాల్మీకి భావించినట్లు ఏవగింపు కలిగించవు. ఒక వంక ఆమెకు పరిహాసాలను అర్థం చేసుకునే జ్ఞానం లేదంటూనే ఆమెతో పరిహాసాలాడ్డమూ ఆమెను శిక్షించడాన్నీ ఎంతోమంది పండితులు సమర్థించినా, సున్నితమైన మనసు కల పాఠకులు సమర్థించలేరు. శూర్పణఖ పట్ల అసహ్యాన్ని కలిగించే విధంగా వాల్మీకి పరిచయం చెయ్యగా ఓల్గా ఆమె పెంచినతోట పరిమళాన్ని అందాన్ని పరిచయం చేస్తూ సీతా శూర్పణఖల ”సమాగమం” కథ ప్రారంభిస్తుంది.. అందం, అంద విహీనతల గురించిన చర్చ, జీవన విధానంలో సాధించవలసిన సౌందర్యం, దానికోసం తపస్సు, విరూపిగానే అనంత సౌందర్యాన్ని జీవితంలో నింపుకుంటున్న శూర్పణఖ, తనను అంద విహీనను చేసిన రాముని పత్ని పట్ల ఏమాత్రం కోపం కనపరచదు. ఆమెను రాముడు పరిత్యజించాడని తెలిసి జాలిపడుతుంది. ఎప్పుడైనా తన వనానికి వచ్చి వుండవచ్చని చెబుతుంది. పురుషుల రాజకీయాలలో పావులు స్త్రీలే అనే అవగాహన సీతకు కలుగుతుంది. ఆమె రావణాసురుని సోదరి కాకపోతే ఆమె ముక్కు చెవులు కోయించి వుండేవాడు కాదేమో రాముడు! ఏ విధంగానైనా రావణాసురుని రెచ్చగొట్టడమే రాముని ఆశయమేమో! అతని అధికార కాంక్షకి ఇద్దరు స్త్రీలు బలయినారు కదా! బాహ్య సౌందర్యానికి అమిత ప్రాధాన్యమిచ్చే లోకంలో ముక్కు చెవులు లేకపోయినా తనకి వున్న రెండు చేతులతో ఒక అందమైన తోటను పెంచుతూ జీవితాన్ని హృదయాన్నీ పరిమళ భరితం చేసుకున్న శూర్పణఖ ఆ విధంగా జీవితాన్ని మలుచుకోడానికి పెద్ద యుద్ధమే చేసింది. కాని సాధారణంగా ఆమెను ఎవరూ పట్టించుకోరు. పైగా ఆమెకు తగినశాస్తి అయిందని వాల్మీకితో సహా అందరూ భావిస్తారు.
అహల్య అసమాన సౌందర్యవతి. గౌతముని పత్ని. ఆమె శారీరక సౌందర్యాన్ని కాంక్షించిన ఇంద్రుడు ఆమె భర్త వేషంలో వచ్చి ఆమెను అనుభవించి పోతూ వుండగా గౌతముడి కంటపడ్డాడు. గౌతముడు భార్యను క్రోధంతో శపించాడు. ఇంద్రుడిని కూడా శపించాడు. అయితే ఆ శాపం దేవతల సహకారం వలన అతడిని పెద్దగా బాధించలేదు. అహల్యనే బాధించింది. ఆ అరణ్య ప్రాంతంలోకి రాముడు అడుగుపెట్టే వరకు అన్న పానాదులు లేకుండా ఎవరికీ కనపడకుండా అక్కడే అలమటిస్తూ వుండమని, రామునికి ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఆమె శాప విముక్త అయి చేసిన పాపం నుంచి విముక్తం అవుతుందని గౌతముడు సెలవిస్తాడు. రామునితో పాటు అరణ్యవాసానికి వచ్చినప్పుడు అహల్యను కలసిన సీత ఆమె సౌందర్యానికి అచ్చెరు వొందుతుంది. ఆమె సౌందర్యవతే కాని సౌశీల్యవతి కాదని రాముడన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఆమెతో సత్యా సత్యాల గురించిన చర్చ చేస్తుంది. ఎవరు నమ్మినది వారికి సత్యమని, సత్యమెప్పుడు సాపేక్షికమని అంటుంది అహల్య. నాతో శారీరక సుఖం పంచుకున్న మారు వేషగాడు ఇంద్రుడని నాకు తెలుసో తెలియదో ఎవరికి తెలుసు? అంటుంది. ”మీకు తెలుసా?” అనే సీత ప్రశ్నకు అర్థం లేదంటుంది. సత్యం అంటూ ఒకటుంటే దానికి అర్థం ఉండదా అని సీత అంటే ”ఎవరి సత్యం వారిది. సత్యాలు నిర్ణయించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు” అంటుంది అహల్య. తను శాపగ్రస్తగా గడిపిన సుదీర్ఘ కాలంలో ప్రపంచమంతా ఏ నీతుల మీద నడుస్తోందో అవగాహన చేసుకున్నానని, చాలా జ్ఞానం సంపాదించానని చెబుతుంది. సత్యం స్థిరంగా ఉండదనీ ఎప్పటికప్పుడు మారుతూ వుంటుందని తెలుసుకున్నానంటుంది. కాని సీత శాశ్వత సత్యాలుంటాయని రామునికి తనపట్ల గల ప్రేమ అటువంటి సత్యమనీ అంటుంది. అపుడు అహల్య ”విచారణకు ఎప్పుడు అంగీకరించకు, అధికారానికి లోబడకు” అంటుంది. ఆ మాటలు అప్పుడు సీతకు రుచించవు. రావణ సంహరణానంతరం తనను రాముడు సంతోషంగా అయోధ్యకు వెంటపెట్టుకు వెడతాడని ఆశిస్తున్నప్పుడు రాముడు ఆమె శీలపరీక్ష కోరాడు. అప్పుడు ఆమెకు అహల్య మాటలు గుర్తొచ్చాయి. తనమీద రాముడికి అపనమ్మకమా? ఇంతకన్నా తనను పరిత్యజించడం నయం కదా! అనుకుంది. కానీ లక్ష్మణుడి మాటలకు ఆమె కరిగిపోయింది. లోకం చెప్పే ధర్మాల ముందు రాముడు ఓడిపోయాడు. రాముడికి తనమీద అపనమ్మకం లేదనుకుని పరీక్షకు సిద్ధమైపోయింది. శత్రుసంహారం చేసి శీలవతి అయిన భార్యను వెంట తెచ్చిన కీర్తి, గౌరవం అతనికి దొరికేలా చేసింది. అసలు సీతకు యుద్ధవిద్యలు రావనా? రావణాసురుడిని ఎదుర్కోలేదనా, ఎందువలన ఆమె అశోకవనంలో ఇంతకాలం బందీగా వుండిపోయింది? రాముడు తనకెప్పుడూ రక్షకుడిగా వుండాలనుకుంటాడు. ఆమెను ఆమె కాపాడుకునే సందర్భం రానివ్వనని అతడే ఒక సందర్భంలో ఆమెతో అంటాడు. కనుక ఆ కీర్తి అతనికే దక్కనివ్వాలనుకున్నది. రామునిపట్ల తనప్రేమను నమ్మకాన్నీ స్థిరంగా వుంచుకున్నది. మరొకమారు వాల్మీకి ఆశ్రమంలో అహల్యను కలుసుకున్నప్పుడు ఆమె మరింత స్పష్టంగా ”నువ్వెవరో నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించు. అది అంత తేలిక కాదనుకో, కానీ ప్రయత్నం మాత్రం ఆపకు, చివరకు తెలుసుకుంటావు. రామచంద్రుడిని కాపాడిన దానివి. నిన్ను నువ్వు కాపాడుకోలేవా.. ఇదంతా నీ మంచి కోసమే జరిగింది” అని చెబుతుంది. ఏ సత్యమైనా అనుభవంలో నుంచీ వచ్చేదే కదా!
జమదగ్ని భార్య రేణుక పాతివ్రత్య మహిమతో ఏరోజుకారోజు ఇసుకతో కుండ తయారుచేసి నది నుంచి నీళ్ళు తెస్తుంది. ఆ సైకత కుంభం తయారీలో ఆమెకున్న నేర్పును కాక అదొక పాతివ్రత్య మహిమగా గుర్తించింది లోకం. ఒకనాడు ఆమె ఆకాశంలో ప్రయాణిస్తున్న గంధర్వులను చూస్తూ కుండను నదిలో జారవిడవగా అది నీళ్ళలో కరిగిపోతుంది. ఇంటికి రావడానికి భయపడి నది ఒడ్డునే వుండిపోయిన రేణుక ఎందుకు రాలేదో జమదగ్ని దివ్యదృష్టికి తెలిసి ఆయన తన కుమారులను పిలిచి తల్లి తల నరకమంటాడు. ఒక్క పరశురాముడు మాత్రమే ఆ పనికి ఒడిగట్ట గలుగుతాడు. తరువాత పితృ ఆజ్ఞాపాలనకు మెచ్చి ఆయన ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికిస్తాడు. అది పురాణం. ఆమెను అరణ్యవాస సందర్భంగా సీత కలిసింది. ఎంతో ఏకాగ్రతతో నైపుణ్యంతో తను ఇసుకతో కుండచేస్తే అది పాతివ్రత్య మహిమ అనుకున్నారని, ఒకసారి ఒక పురుషుని చూసిన కారణంగా తన ఏకాగ్రత భంగమై కుండ విచ్చిపోయిందని అంత మాత్రం చేతే తన పాతివ్రత్యానికి భంగం కలిగిందని భర్త ఆగ్రహించి తన తల తీసెయ్యమన్నాడని చెప్పింది. స్త్రీల పాతివ్రత్యాలు కూడా ఆ సైకత కుంభాల వంటివేననీ ఏమాత్రం ఏకాగ్రత భంగం అయినా అవి భగ్నమౌతాయనీ అంటుంది. పాతివ్రత్య భావనలోని బోలుతనం గురించి భార్యాభర్తల సంబంధాలలోని అభద్రత గురించి తల్లీబిడ్డల సంబంధాల గురించి తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా చెప్పింది. అప్పటికవి సీతకు సమ్మతంగా అనిపించకపోయినా తన బిడ్డలను రాముడు వారసులుగా గుర్తించి అయోధ్యకు ఆహ్వానించినప్పుడు ఆమె మాటలలోని సత్యాన్ని గ్రహిస్తుంది.
ఊర్మిళను లక్ష్మణుడు తనతో రమ్మని అడవికి పిలవలేదు. తను అన్నగారితో వెళ్ళిపోయాడు నేను వెళ్ళడం నీకు సమ్మతమా అని అడగలేదు. ఊర్మిళ ఆవేదన చెందింది. ఆగ్రహపడింది. ఆక్రోశించింది. అంతఃపురంలో అందరికి ఎడంగా తలుపులు వేసుకుని ఒంటరిగా వుండిపోయింది. ఆ పద్నాలుగేళ్ళు నిద్రపోయిందని లోకమంతా అనుకుంది. అది నిద్రకాదు. తనలో తను సంఘర్షణ పడింది. మానవ సంబంధాల గురించి, అధికార సంబంధాల గురించి, భావోద్వేగాల గురించి వాటిమధ్య తేడాల గురించి ఆలోచించింది. వాటితో పెద్ద యుద్ధమే చేసింది. అందులో నుంచి గొప్ప శాంతిని ఆనందాన్ని పొందింది. చాలా మారింది. ద్వేషంతో కాక న్యాయాన్ని గురించి ప్రశ్నించగల విజ్ఞత నేర్చుకుంది. ఆ విజ్ఞతను లక్ష్మణుడు ఎట్లా అర్థం చేసుకుంటాడో దాన్ని బట్టి వాళ్ళ సంబంధాలుంటాయి. సర్వ దుఃఖాలకు మూలం అధికారమే, ఆ అధికారాన్ని మనం పొందాలి, ఒదులుకోవాలీ కూడా. ”నేను ఎవరి అధికారానికీ లొంగను, ఎవరినీ నా అధికారంతో బంధించను” అంటుంది. ఆ ముగ్గురు తమకు తటస్థ పడిన ప్రతికూల సమయాలలో తమలో తాము సంఘర్షణ పడి ఒక చైతన్యస్థాయిని అందుకుని తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసుకున్నారు.
శూర్పణఖ, అహల్య, రేణుకల జీవన తాత్వికత, జీవన విధానం సీత అవగాహన చేసుకున్నది. తన మార్గాన్ని తానూ ఎంచుకు న్నది. అందరి వ్యధలు సమానమేనని తెలిశాక వారితో సామరస్యం స్నేహం. స్త్రీల సమూహంలో తను ఒంటరి కాననే స్పృహ ఆమెకు ధైర్యమిచ్చింది. ఆ ధైర్యంతోనే కవల గర్భాన్ని మోయగలిగింది. వారిని ఆనందంగా పెంచగలిగింది. వారికి క్షత్రియ విద్యలన్నీ నేర్పగలిగింది. రామునికి వారసులను అందించడంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చి నిర్మోహంగా భూమాత దగ్గరకు వెళ్ళిపోయింది. సీతకు రాముని మీద ఎనలేని ప్రేమ. దానినుంచీ విముక్తి కోసం ఆమె యుద్ధం ప్రారంభిం చింది. శాంతి సాధించింది. ఎప్పటికప్పుడు ఆమె శ్రీరామచంద్రుడిని కాపాడుతూనే వుంది. అతనైనా స్వతంత్రుడేమీ కాదు. రాజ్య బంధితుడు, కర్తవ్య బంధితుడు, పితృవాక్య బంధితుడు, ఆర్య ధర్మ బంధితుడు. అతడు రాజ్యానికి రక్షకుడు అయితే అతనికి రక్ష సీత.
నాలుగు పౌరాణిక పాత్రలను తన కల్పనతో చక్కని కథా సంవిధానంతో పాఠకుల ముందుంచిన ఓల్గా ”అధికార సంబంధ చట్రాల నుంచీ విముక్తే సకల మానసిక బంధాలకు విముక్తి, శాంతికి నాంది” అనే దిశగా ఆలోచిస్తేనే, వందేళ్ళ క్రితం చరిత్రని తిరగ వ్రాస్తుందని గురజాడ కలగన్న ఆధునిక స్త్రీ రూపొందుతుంది. అనే ఆశను మొలకెత్తిస్తుంది.
”స్త్రీల మధ్య సహకారం నాకు చాలా ప్రియమైన భావన, ఈ భావనలో పూర్తిగా లీనమై వ్రాసిన కథలివి” అని ఓల్గా తనంత తాను నేరుగా చెప్పి వుండకపోయినా ఆ విషయం చదువరులకు చక్కగా అర్థం చేయించే కథలివి.
రామాయణం మన రోజువారీ జీవితం లో తారసపడే వ్యక్తులని, వారి స్వభావాలని అద్దం పడ్తూ జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో చెప్తుంటే , విముక్త కథల తో ఆ రామాయణం ని విమర్శించి తిరగ వ్రాయడం వలన సమాజానికి ఏంటి ఉపయోగం ? సీత రాముని వలెనే కష్టాలు పడ్డట్టు చెప్పి, ఆవిడ ని ఒక సామాన్య స్త్రీ గా చూపించాయి విముక్త కథలు. వాల్మీకి రామాయణం లో సీత తనని తాను హనుమంతునికి పరిచయం చేసుకుంటూ ‘పరిణయమయిన పన్నెండు ఏళ్ళు అనుభవించితిని భోగ భాగ్యములు’ అంటుంది. ఆ ఒక్క మాట చాలు ఆవిడ స్వభావం ఏంటో అర్ధం అవ్వడానికి. రావణుడు వస్తే ఒక గడ్డి పోచని పెట్టి మాట్లాడుతుంది. అటువంటి సీత పాత్ర ‘సమాగమం’ కథ లో ‘ముక్కు చెవులు లేని ఆ కురూపిని ఎవరు ప్రేమిస్తారు’ అనుకుంటుంది శూర్పణఖ గురించి. అంటే స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరితో ప్రేమించబడాలా? అది కూడా తన రూపం తో ? వాల్మీకి రామాయణం లోని సీత లాంటి high level thinking పాత్ర ని విముక్త కథల లో low level thinking పాత్ర గా మలచిన తీరు చూస్తే చాలా బాధ వేస్తుంది. లంక లో ఆ చెట్టు క్రింద అన్ని నెలల పాటు అదే చిరిగిన చీర తో, తిండి లేకుండా ,రోజు రాముడిని తిట్టి పోసే రావణుడు, రాక్షస స్త్రీ ల మధ్య ఒంటరి పోరాటం చేసిన సీత కి, ఈ రోజున బ్రోతల్ లో చిక్కుకున్న అమ్మాయిలకీ తేడా ఏమన్నా ఉందా ? ఆ రోజున హనుమంతుడు ఎంత కష్టపడ్డాడో సీత నమ్మించేందుకు, ఈ రోజు rescue operations చేసే వారు అంతే కష్టపడ్తున్నారు అక్కడ చిక్కుకున్న అమ్మాయిలను నమ్మించడానికి. ఈ అమ్మాయిలు కూడా ఏదో మాయలేడి ని చూసి మోసపోయే వారే కదా!!అమ్మాయిలని అటువంటి చోట్లకి చేర్చి ఆనందించే బ్రోకర్ లకి శూర్పణఖ పాత్ర కి తేడా ఏమన్నా ఉందా? ‘శత్రువు ని యుద్ధానికి కవ్వించటం ఆర్యధర్మం’. అందుకనే రాముడు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు అంటారు రచయిత్రి. ఈ ‘ఆర్యధర్మం’ అనే కల్పన ఏంటో అర్ధం కాలేదు. రాముడి పాత్రని ఏ విధం గా negative గా చూపించాలో అర్ధం కాక ఇలా ఉపయోగించారేమో అన్పిస్తుంది. రాముడు ఇంకొక ఆడదాన్ని వంక కూడా చూడకుండా భార్య కోసం ఏడుస్తూ ఆవిడని ఎక్కడ ఉన్నా రక్షించాలి అనుకుంటాడు. పైగా వద్దంటే వెంట అడవులకి వచ్చినందుకు, మాయలేడి ని అడిగినందుకు అంతా నీ వల్లే అని ఒక్కసారి కూడా సీతని మాటల తో హింసించలేదు. ఒక్క మాట లో చెప్పాలంటే he is a perfect man. రాముడిలాంటి భర్త ఏ ఆడపిల్లకి దొరకడు ఈ ప్రపంచం లో. అలాంటి రాముడి పాత్రని కూడా దిగజార్జేసారు రచయిత్రి. కల్పిత కథల లో ఎంతో కొంత కల్పన ఉంటుంది. మోతాదు కి మించిన కల్పన తో, ప్రతి విషయం లో భర్తలని negative దృష్టి కోణం లో చూపిస్తూ – ఏ విధంగా ఈ కథలు ఒక స్త్రీ కి మనో ధైర్యాన్ని ఇస్తాయో అర్ధం కాలేదు. ఇలాంటి కథలు చదివితే చక్కగా ఉన్న కాపురాలు కూడా కూల్తాయేమో కూడా !!