మధ్యతరగతి జనజీవన కథాగుచ్ఛం – జానకీబాల కథలు- శీలా సుభద్రాదేవి

ఇంద్రగంటి జానకీబాల సప్తతిలోకి అడుగుపెట్టిన సందర్భంగానే కావచ్చు, లోగడ అచ్చయిన తన ఆరు కథానికా సంపుటాలలోని నూట ముప్ఫై కథల్నీ గుదిగుచ్చి ఎనిమిది వందల ముప్ఫై పేజీల బృహత్‌ గ్రంథంగా ‘ఇంద్రగంటి జానకీబాల కథలు’ పేరున ఇటీవల వెలుగులోకి తీసుకువచ్చారు.

ఆ కథలన్నింటినీ వరుస క్రమంలో చదువుతుంటే సమాజ జీవన విధానంలోని మార్పులు, ప్రజల ఆర్థికావసరాలు, ఆర్థిక సామాజిక జీవన పరిణామ క్రమం పాఠకుడికి అవగతమౌతుంది. దాంపత్య జీవనం, స్త్రీ ఆలోచనాలోనికి క్రమంగా చోటుచేసుకున్న ఆధునిక దృక్పథం అర్థమౌతుంది.

ఈ నలభై అయిదేళ్ళ కాలంలో సమాజంలోనూ, సాహిత్య రంగంలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి. అనేక ఉద్యమాల కారణంగా రచయితలు ప్రతిస్పందించి రచనలు చేసారు. చాలావరకూ రచయిత్రులు వీటితో ప్రమేయం లేకుండా తమ ధోరణిలో తాము మూస పద్ధతిలో రాసుకు పోయినవారే. అయితే కాలానుగుణ మార్పులకు, ఉద్యమాలకు సాహిత్యపరమైన పరిణామాలకూ ప్రతిస్పందించి రచనలు చేసిన వాళ్ళలో ఇంద్రగంటి జానకీబాల కూడా వున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు.

జానకీబాల కథలను 1970 నుండి 90 వరకూ వచ్చిన కథలనన్నింటినీ ఒక కేటగిరిగానూ, 190 నుండి నేటివరకూ వచ్చినవి మరో కేటగిరిగానూ చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ మొదటి కేటగిరిని ఆమె రచనకు తీసుకున్న అంశాన్ని బట్టి కథన శైలిని బట్టి నాలుగు విభాగాలుగా చేయవచ్చును.

మొదటివి అట్టడుగు వర్గాలకు చెందిన కథలు, ఆ కాలంలో సమాజంలోని ప్రజలలో సగానికిపైగా ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు వర్గాల వారే. బస్సు ప్రయాణాలలోగాని, ఉద్యోగరీత్యాగానీ, కార్యాలయావరణంలో పనిచేసే బడుగు బలహీన వర్గాల జీవన విధానంలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లు నిశితంగా గమనించి పరిశీలనాత్మకంగా చాలా కథలలో అక్షర బద్ధం చేసారు రచయిత్రి. ఆ సందర్భాలలో చెప్పిన కథలలో బలి, గుండె చెరువయ్యింది, నాన్నా ఎప్పుడొస్తావు, స్మృతి, దేవమ్మ, వెలుగును మింగిన చీకటి, పెట్టుబడి, పూలబాసలు మొదలైనవి.

బీదా బిక్కీ జనాన్ని తిండిపెట్టి డబ్బు కూడా ఇస్తామని ఆశపెట్టి జనసమీకరణ చేసి మీటింగులకు తరలించటం తెలిసిన విషయమే. అయితే దీనివెనక ఆ బడుగు జనాల వ్యథాపూరిత గాథల్ని తెలిపే కథ ‘బలి’. చంటిబిడ్డ తల్లి పిల్లాడిని ఇంట్లో వదిలి మీటింగుకి వెళ్ళి, పాలతో రొమ్ములు గడ్డ కట్టి జ్వరం వచ్చినట్లవుతుంది నాగమ్మకి. చివరికి సభ పూర్తయి వాళ్ళు యిళ్ళకి చేరేసరికి పాల కోసం ఏడ్చి గుక్క పట్టి ప్రాణం విడచిన బిడ్డడ్ని చూసిన తల్లికి గుండె పగులుతుంది. కథ ఆసాంతం కరుణరసాత్మకంగా నడిపిన తీరు చాలా బాగుంది.

తండ్రి తాగి తల్లిని కొడ్తుంటే తల్లడిల్లిన పదేళ్ళ నారాయణ సారా సీసా దాచేస్తాడు. తల్లి దాచిందని మరింతగా ఆమెని తంతాడు తండ్రి. అది తట్టుకోలేని నారాయణ పారిపోయి కృష్ణా బ్యారేజి పక్క స్తంభంచాటున కూర్చుంటాడు. ”నీరంతా బారేజిలో బంధించటంవల్ల ఇటువైపు నీళ్ళులేక గుండెలు ఎండిపోయిన తల్లి రొమ్ముల్లా ఉన్నచోట పాలకోసం తడుముకొంటున్న పసిపాపలా  ఓదార్పు కోసం వచ్చాడు నారాయణ”- అని పరిసరాల్నీ, పసివాడి మనోభావాన్ని సరిపోలుస్తూ రచయిత్రి భావోద్వేగంతో వర్ణించిన విధానం రచయిత్రి భావనా పటిమని పట్టిచూపుతుంది. సీసాది తాగితే బలం వచ్చి తండ్రి తల్లిని తంతున్నాడని, అది తాగి తాను తండ్రిని తరిమేయవచ్చునని భావించి తాగి సొమ్మసిల్లి పోతాడు నారాయణ. బారేజిగేట్లు తెరచి నీళ్ళు వదిలారని మృత్యుదేవత గృహకవాటాలు తెరుచుకున్నాయని చెప్తూ తల్లి బిడ్డ కోసం వెతుక్కోవటంతో ‘గుండె చెరువైంది’ కథ ముగుస్తుంది. మాదక ద్రవ్యాలకు బానిసైన వారి వలన కుటుంబం లోని పిల్లలపై పడే ప్రభావాన్ని చాలా అర్థవంతంగా ఎక్కడా కథనం కుంటుపడకుండా సమర్థవంతంగా నడపడమే కాక పాఠకుడికి ‘గుండె చెరువ’య్యేలా ముగించారు జానకీబాల.

చదివించాలన్నా చదువుకోవాలని ఆశ వున్నా అందుకు పేదలకు అవకాశం దక్కనివ్వని గాదె కింద పంది కొక్కుల ఉదంతాన్ని వెలికితీసిన కథ ‘వెలుగును మించిన చీకటి’. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన బతుకులకు అందని ద్ష్రాలుగా మారిన ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించిన కథలు ఉన్నాయి.

ఆ తర్వాత మొదటి కేటగిరిలో ఎక్కువగా ఉన్న కథలు దిగువ మధ్య తరగతి జీవితాలకు చెందినవి. చిన్న చిన్న వాటాలతో కూడిన అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు పట్నాలలో తక్కువ కిరాయితో అందుబాటులో ఉండేవి. వాటిలో చిరుద్యోగులు, ఒంటరి

ఆడవాళ్ళు చిన్నా చితకా పనులు వెతుక్కునే నిరుద్యోగులూ జీవనం సాగించేవారు. అటువంటి కాంపౌండులు ఒక మనదేశంలో భిన్న భిన్న మనస్థత్వాలూ విభిన్న జీవన విధానాలూ కలిగి ఉన్న బతుకులు వారివి. వారిని అందర్నీ కట్టిపడేసే ఆర్థిక విధానం ఒకటే. అటువంటి కాంపౌండులో జీవితం వెళ్ళ బుచ్చే వారి మధ్య జరిగిన కథలు ఇందులో కొన్ని చోటు చేసుకున్నాయి. అటువంటి కథల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి పక్షి ఎగిరిపోయింది, లోకులు కాకులు, అడుగడుగున గుడి వుంది వంటి కథలు.

‘పక్షి ఎగిరి పోయింది’ అనేది మంచి కథల్లో ఒకటి. యింటి ఓనరు యిల్లు అమ్మేసానని అందర్నీ ఖాళీ చేయమంటాడు. ఆ కాంపౌండులో ఒక్కో సమస్యతో కొట్టు మిట్లాడుతోన్న ఆ కుటుంబాలన్నీ తక్కువ అద్దెతో మళ్ళీ యిల్లు దొరకదేమోనని బెంగటిల్లిపోతూ తప్పనిసరిగా ఒక్కొక్కరే ఖాళీ చేస్తారు. ఒంటరిగా పసి వాడ్ని పెంచిన తల్లి శేషమ్మ. కొడుకు ముసలి, రోగిష్టి తల్లిని వదిలి తనదారి చూసుకుంటాడు. చివరికి యిల్లు పగలగొట్టేందుకు వచ్చిన పని వారికి విగత జీవిగా శేషమ్మ కన్పిస్తుంది. గూడులేని పక్షి ఎగిరిపోయింది అంటూ చెప్పిన రచయిత్రి ఒక్కో కుటుంబం గురించి చెప్పిన తీరు, ఆ యిళ్ళ సమాహారం ఒక సమాన వ్యవస్థని రూపుకట్టేలా ఉంది.

అదే విధంగా ‘లోకులు కాకులు’ కథలో కూడా పక్కింట్లో జరిగిన గృహహింసని ‘మనకెందుకులే’ అని పట్టించుకోకపోవటం, పిల్లాడు బొమ్మ తుపాకీలో కుంకుడుగింజ పెట్టి కొడితే కాకి చచ్చిపడిపోవటం, ఆ కాకి చుట్టూ చేరిన కాకుల మంద ఆ యిళ్ళల్లోంచి ఎవరినీ బయటకు రానీకుండా చేయడం జరుగుతుంది. కాకులు కూడా ‘మనకెందుకులే’ అని అనుకోలేదని పిల్లవాడు తలంచటమే కాక ఒక యింట్లో మరణం సంభవిస్తే అదే కాంపౌండులో దీపావళి జరుపుకోకుండా కాకులు చేస్తాయని పిల్లాడు తృప్తిపడతాడు. ఒక సందర్భాన్ని మరొక సందర్భంతో పోల్చి చెప్పే విధానం పాటించారు రచయిత్రి. ఈ రకమైన కథల్లో ఇంట్లో వెలసిన దేవుడి కోసం రెండు పూటలా కాపీ పాటలతో వచ్చిన శబ్ద కాలుష్యం గూర్చి రాసిన కథ ‘అడుగడుగున గుడి ఉంది’.

80 దశకానికి ముందు రచయిత్రులలో చాలా తక్కువ మంది ఉద్యోగినులు కావటం వలన కావచ్చు, ఆఫీసు నేపధ్యంలో వచ్చిన కథలు తక్కువగానే ఉండేవి. వచ్చినవి కూడా అధికారుల వల్లా, సహోద్యోగుల వల్లా ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అంశాలతోనే రాయటం కూడా గమనించవచ్చు. కానీ జానకీబాల కొంతకాలం రోడ్డు రవాణా సంస్థలో పనిచేయటం వలన, వీరి అనేక కథలలో బస్సు ప్రయాణంలో జరిగిన సంఘటనలు కథలుగా రూపొందాయి. అంతేగాక ఉద్యోగంలో ఎదురైన, తాను గమనించిన అనేక లొసుగులు కథల రూపంలోకి వచ్చాయి. అవి చాలా వరకూ సాధారణ ప్రజలకు తెలియనివీ, తెలుసుకోవలసినవీ కూడా.

‘స్క్రాప్‌’ అమ్మకంతో రెండు చేతులా సంపాదించడమైనా, డీజిల్‌ గోలుమాలైనా, ఉద్యోగుల ఉచిత పాస్‌ల బాగోతమైనా, అవసరమైన ముఖ్యమైన ఫైల్‌ బయటపడని అట్టహాసమైనా ఇలా అనేకానేక కథలు ఉద్యోగ లొసుగులు వెలికితీసేవే.

చిన్న చేపని పెద్ద చేప మింగినట్లు చూని కథ పెట్టుబడి వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా పనిచేద్దామనుకున్నా గున్నమ్మని తన సంపాదనలో నాల్గో వంతు ఇమ్మని షరతుతో పని యిప్పించింది పాపాయమ్మ. తీరా కొన్నాళ్ళు పోయాక ఇవ్వనని గున్నమ్మ ధిక్కరించినందుకు గున్నమ్మ భర్తకు ఆమెపై అభాండాలు చెప్తుంది పాపాయమ్మ. దాంతో గున్నమ్మని పని మాన్పిస్తాడు భర్త. తన కష్టం తనని తిననీయనీకుండా, కష్ట జీవుల జీవితాల్ని శాసించే పరిస్థితులకి ప్రతిబింబంగా ఈ కథని ప్రతిభావంతంగా మలిచారు జానకీబాల.

ఈ విభాగంలో కూడా – అంటే 90కి ముందు కూడా కుటుంబ జీవన నేపథ్యంలోని కథలు రాసినా, స్త్రీపరంగానే కథల్ని చెప్పినా తీవ్రమైన భావావేశంతో చెప్పలేదు. మధ్యతరగతి జీవితంలో అప్పులు, కట్నాల కోసం తల తాకట్టు పెట్టాల్సి రావటం, చదువు, ఉద్యోగాలు వీటన్నిటి చుట్టూ తిరిగే ఆర్థికపరమైన ఒడుదుడుకులు మొదలైన అంశాలతో కథల్ని రాసినా వాటి ముగింపులో ఆనాటి సాధారణ కథల్లా కాకుండా మేల్కొపే విధంగా పాఠకులను జాగృత పరిచే విధానం ఉంటుంది. స్త్రీపాత్ర అయినా, పురుష పాత్ర అయినా ఆలోచనా, వివేకం ప్రదర్శించటం కన్పిస్తుంది. ఈ రకంగా 1970 నుండి 90ల వరకూ ఆర్థిక సామాజిక పరమైన విభిన్న కథాంశాలతో అప్పట్లో చాలామంది రచయిత్రులు తీసుకోని విధంగా వైవిధ్య భరితమైన కథలు రాసారు ఇంద్రగంటి జానకీబాల. ఈ కథలు చదువుతుంటే వీరి కథలు ఆరోజుల్లో ఏ సాహిత్యవ్యాసంలోనూ ఒక్కదానినైనా పేర్కొనకపోవటం, ఏ కథా సంకలనంలోనూ చోటు చేసుకోకపోవటం ఒక లోటే.

1990ల తర్వాత ఒక స్త్రీవాద సంస్థలో కొంతకాలం

ఉద్యోగం చేయడంతో జానకీబాలపై కొంత ప్రభావం కలగటం వలన ఆమె దృక్పథంలో మార్పు వచ్చింది. ఆ మార్పు జానకీబాల రచనలపై కూడా ప్రభావం చూపింది. అందువలన 90ల తర్వాత నుండి 2013 వరకూ వచ్చిన కథలలో స్త్రీపరమైన సమస్యలతోనే ఎక్కువగా రాసారు. కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొన్న వివక్షలకు స్త్రీ పడే సంఘర్షణను ఎత్తిచూపే విధానమే ప్రధానంగా ఉంటుంది తప్పితే పేజీలకు పేజీలు తన వాదనను సమర్థించుకొనే ప్రయాసలు కన్పించవు. అందుకని ఆ సంఘర్షణలో, ఆ సందిగ్ధావస్థలో పాఠకులు కూడా కొంత వరకూ మమేకం చెంది ఆలోచించగలుగుతారు.

పెళ్లి కావటంతోనే అనుకోకుండానే భార్య తన యిష్టాలను, అలవాట్లను క్రమంగా మార్చుకుంటూ భర్త యిష్టాలతో ఒదిగిపోవటం ఒక కథలో చెప్తారు. ముఖం ఎదుట ఒకలా వెనక ఒకలా మట్లాడే రెండు నాలుకల వారి గురించి వెలసిన రంగులకల రూపంగా ‘పార్టీ’ని రాసారు. మేకవన్నె పులుల పట్ల ఉండాల్సిన జాగరూకతను ప్రతీకలతోనే అక్షరీకరించారు. వృద్ధాప్య సమస్య మీద ఒక కొత్త కోణాన్ని చూపుతూ రాసిన కథ ‘అశక్తత’, భార్యాభర్తలలో వృద్ధాప్య సమస్యల వలన ఒకరు అనారోగ్యం పాలుపడితే ఆలోచనా విధానంలో ఉండే వివక్షతల్ని ఒక కథలో చెప్పారు.

స్త్రీవాద ప్రభావంతో స్త్రీపరంగానే ఎక్కువ కథలు రాసారన్నంత మాత్రాన సామాజిక స్పృహలేదని, ఒక వర్గంకి చెందిన కథలే రాసారనటానికి వీలులేదు. పవర్‌ కట్‌ వల్ల సన్నకారు జీవితాలైన కూరలు అమ్మేవాళ్ళు సంతలో చీకటి మాటున ఎంత నష్టపోతారో ‘గుడ్డివెలుతురు’లో చెప్పారు. ‘నిచ్చెన పైకి మెట్లు కిందకీ’ కథలో చీపురుతో తుడిచేయాల్సిన అవినీతి కథని అక్షరబద్ధం చేసారు. చిన్నప్పుడే తండ్రిపోతే ఇంటి భారం మోసిన రేవతి నలభైయ్యవ ఏట అందరి ఒత్తిడితో ఆసరా కోసం రిటైర్‌ అయిన వాడిని పెళ్ళి చేసుకొని జీవితంలో మరో యుద్ధానికి సన్నద్ధం కావల్సి రావటం అద్భుతంగా చెప్పారు. ఈ విధంగా స్త్రీజీవితంలో ఆమె మనసుని ఆలోచనల్నే కాక ప్రతీ అడుగులోనూ నియంత్రించే అనేకానేక సందర్భాలు ఇందులో కథలుగా చిత్రించారు రచయిత్రి.

భయంకర వికృతరూపం లోపల ఉన్న వికలాంగుడి చేతిలో సావిత్రి అనుభవించిన చిత్రహింసని మరోకోణంలో తెలియజేసారు. జనజీవితంలో పట్టణీకరణ ప్రభావాన్ని ఎత్తి చూపిన కథ ‘నాగరికత’. ఇది చాలా ఏళ్ళ కిందటే రాసి ఉంటారు. ప్రచురణ తేదీ లేకపోవటం వలన ప్రపంచీకరణ నేపధ్యంగా వచ్చిన కథల్లో ఒకటిగా గుర్తింపుకి నమోదు కాలేదు.

1990కి ముందు కథలలో మూడొంతులకుపైగా కథల పరిసరాలు విజయవాడ నేపథ్యంగానే ఉంటాయి. అప్పట్లో రచయిత్రి నివాస. అదే కావటం వలన కావచ్చు. ఈ సంపుటిలో మరో చెప్పుకోదగిన కథ దివిసీమ ఉప్పెన నేపథ్యంగా వచ్చిన ‘స్మృతి’ కథ. ఉప్పెన సమయంలో అనాథ అయిన పాపని సంఘసేవకురాలు చదివిస్తానని తీసుకెళ్ళి పనిచేయించుకుంటుంది. అది తెలిసిన టీచరు ఆఫీసరు ద్వారా ఆ పిల్లని శరణాలయం చేర్చుతుంది. గ్రామసేవిక శిక్షణ పొందేసమయంలో టీవీలో బంగ్లాదేశ్‌ ఉప్పెన దృశ్యాలు చూస్తూ మానసికంగా ఉద్విగ్నురాలు కావటంతో బాల్య స్మృతులు చుట్టు ముట్టి అప్పుడు తనివితీరా ఏడుస్తుంది. ఉప్పెనని దృశ్యమానం చేయటంలో గానీ, ఆ నేపథ్యంలో జరిగే రాజకీయాల్నీ చక్కటి కథనంతో పాఠకుడికి అందేలా రచించారు రచయిత్రి. దివిసీమ ఉప్పెన నేపథ్యంలో ఎక్కువగా కథలు వచ్చిన గుర్తులేదు. అందులో ఇదొక మంచి కథగా చెప్పుకోవలసిందే.

జానకీబాల కథనంలో ఒక ప్రత్యేకత ఏదైనా ఒక విషయాన్ని సూటిగా చెప్పకుండా సింబాలిక్‌గా చెప్పేవిధానం. అలా చెప్పిన వాటిల్లో మూడు నెలలకొకసారి మూల క్షేధం చేసినా మర్నాటినుండే మొదలుపెట్టి తేనెపట్టు పెడుతున్న రాణి ఈగ గురించి చెప్తూ చెప్తూనే మూణ్ణెల్లకోసారి ఏ గొంతెమ్మ కోర్కెనో చేతిలో పట్టుకొని పుట్టింటికి వచ్చే ఆ యింటి బిడ్డ శ్రీవల్లితో పోల్చటం. చివరికి శ్రీవల్లి తన స్థితి తెలుసుకోవటంతో కథని ముగిస్తారు రచయిత్రి.

జానకీబాల రచనల్లో ఉపయోగించే మరొక విధానం – సామాన్య విషయంగా ముగింపులోగానీ, కథ మధ్యలో గాని, సంభాషణా వాక్యాలుగా గానీ, స్వగతంగా గానీ చెప్పిస్తారు – కథ అంతరార్థం. అది అర్థమైన పాఠకుడికి మాత్రమే వ్యక్తమయ్యేలా చెప్పే విధానం ఈ రచయిత్రి మరో పద్ధతి. ఇటువంటి టెక్నిక్‌ని కొన్ని కథల్లో గమనించగలం. అందులో ఒకటి – మరో వూర్లో హాస్టల్‌లో ఉండి ఉద్యోగస్థురాలైన కూతురి పెళ్ళి కోసం ఆరాటపడ్తుంది తల్లి. తీరా ఆ అమ్మాయి ‘లెస్పియన్‌’గా మారిందనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎవరికీ చెప్పలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఎలాగో బయటపడుంది. తల్లికి ఎన్నోవిధాల కౌన్సిలింగ్‌ చేస్తూ ‘ఎప్పుడైనా మీ అమ్మాయి ఆ జీవితంపై విరక్తి చెంది వస్తే ఆదరించమని’ చెప్తారు. ఆ విషయం గూర్చి ఆలోచిస్తున్న తల్లికి నిద్రమాత్రలు మింగటం వల్ల కడుపులోని అల్సర్‌ ఉండుండి మండుతోందని ముగిస్తారు రచయిత్రి. నిజానికి ఆ మంట, ఆ బాధ ఆమె హృదయానిదని చెప్పకనేచెప్తారు.

ఈ అంశాన్ని తీసుకొని కథ రాయటం సాహసమే. కానీ చాలా సున్నితంగా ఎక్కడా అశ్లీలం లేకుండా పాఠకుడికి అందేలా రాసారు జానకీబాల. ఈరోజుల్లో పాఠశాల విద్యలకి కూడా హాస్టల్స్‌లో వేసేస్తున్నారు తల్లిదండ్రులు. ప్రకృతి సహజమైన కుతూహలాలు పోటమరించే కౌమారవయస్సులో హాస్టల్స్‌లో వున్న పిల్లల మనో భావాలూ గురించి పెద్దలు ఎంతైనా ఆలోచించాలి.

రచయిత్రి పాత్రతో ఇందులో చాలా కథలు ఉన్నాయి. కొన్ని అనుభవాల నుండి వచ్చినవి, మరికొన్ని పరిశీలించి రాసినవి. మధ్య తరగతి గృహిణి అయిన రచయిత్రికి రచన చేసేందుకు కావలసిన సావకాశాన్నీ, సమయాన్ని సమకూర్చుకోవటం ఎంత కష్టసాధ్యమో తెలియజేసే కథలు, భర్త కూడా సాహితీవేత్త అయినప్పుడు రచయిత్రిగా ఆ భార్య ఎదుర్కొనే ఇబ్బందులూ, గ్రూపులుగా విడిపోతున్న సాహిత్యలోకంలో నిలదొక్కుకోవటంలోని సాధ్యాసాధ్యాలు వివరించేలా అనేకానేక కథలలో పొందు పరిచారు రచయిత్రి జానకీబాల.

స్పందింపచేసే చిన్న దృశ్యం, రెప్పపాటు సంఘటన, హృదయాన్ని బాధించే చిన్న సంభాషణ, మనసుని అతలాకుతలం చేసినప్పుడు అది కవితగా మారటం సహజం. అటువంటి చిన్న సందర్భాన్ని సైతం తీసుకొని దాని చుట్టూ అవసరమైనంత మేరకు సంఘటనలూ, సంభాషణలూ అల్లి కథానికగా చెక్కటం మాత్రం గొప్ప ప్రయత్నమే. అటువంటి ప్రయత్నాల్ని జానకీబాల చేసి, సమర్థవంతంగా అక్షరాకృతి పొందిన కథలు కొన్ని ఈ సంపుటిలో ఉన్నాయి. కథనంగాని, సంభాషణలు గాని సూటిగా స్పష్టంగా ఉంటాయి. కథ చదువుతుంటే వాటితో మమేకం కాగలుగుతాడు పాఠకుడు.

నలభై ఏళ్ళ క్రిందటి కథలు కూడా నేటికీ మన చుట్టూ జరుగుతున్నవే. కథాకాలం ఏనాటిదైనా నిత్యనూతనమే. అందుకే ఈ కథలన్నీ కాలాతీత కథలుగానే చెప్పుకోవచ్చును.

ఇలా వివరించుకుంటూ పోతే అనేక కథల్ని ఉదహరించ వచ్చు. కానీ పాఠకులకు చదివే అవకాశం, చదవాలనే కుతూహలం కలిగేందుకు మాత్రమే కొన్ని కథలు వివరించాను.

ఈ కథలన్నీ వరుస క్రమంలో చదువుతుంటే ఈ 45 ఏళ్ళుగా సమాజంలో, కుటుంబ జీవనంలో, మానవ సంబంధాలలో, ఆలోచించగలిగే స్త్రీల మనోభావనల్లో మార్పులు, చేర్పులు తెలియటమే కాక అవే సందర్భాలు రూపాంతరం చెందిన విధానం కూడా ఆలోచింపజేస్తాయి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.