కొన్ని పుస్తకాలు అంతే!! చదివాక వదలాలనిపించదు. మళ్ళీ మళ్ళీ చదువుతాం. అందులోనూ అవి రష్యన్ అనువాదాలయితే ఆ అనుభూతే వేరు. రష్యన్ పుస్తకాలు చదివేటప్పుడు మన మనసు పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ నెల పరిచయం చేయబోతున్న ”హంసలను వేటాడొద్దు” పుస్తకం కూడా అలాంటిదే. బోరిస్ వాసిల్యెవ్ 1973లో ఈ పుస్తకం రాసారు. 2014లో కె.సురేష్ అనువాదం చేసారు.
బోరిస్ వాసిల్యెవ్ రెండవ ప్రపంచ యుద్ధ దారుణ అనుభవాలను అక్షరీకరించిన క్రిందిస్థాయి సోవియట్ సైనిక అధికారుల బృందానికి ఆఖరి ప్రతినిధిగా పరిగణింపబడుతాడు. ఆయన రాసిన నవలల్లో ”డోంట్ షూట్ ద వైట్ స్వాన్స్” అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకం. రష్యన్ భాషలో పర్యావరణ సాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ పుస్తకం ఒక మైలు రాయి. వ్యక్తిగత లాభం కోసం అందమైన జీవులను విధ్వంసం చేయడాన్ని, ప్రకృతిని విచక్షణా రహితంగా దోచుకోవడాన్ని బోరిస్ వాసిలెయవ్ తీవ్రంగా విమర్శించాడు. ఈ నవల ప్రధాన ఇతివృత్తం కూడా ఇదే.
”హంసలను వేటాడొద్దు” నవల సోవియట్ యూనియన్ లోని సోషలిస్ట్ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ”సోషలిస్ట్ సమాజం కూడా ఇతర సమాజాలకు అతీతం కాదు. అందులోనూ స్వార్ధపరులు, దుర్మార్గులు, దుష్టులు ఉంటారు. కానీ కొంత తక్కువ శాతంలో… ఎక్కువ అయితే అది కేపిటలిస్టు సమాజం అయిపోతుంది” అంటాడు బోరిస్. నవల చదివాక మనకీ అలానే అనిపిస్తుంది.
కథలోకి వస్తే దీనిలోని నాయకుడు యోగార్ ఒక సాధారణ వ్యక్తి. అమాయకుడు. ఎవరికీ హాని చేయనివాడు. అందరి తిట్లూ భరించేవాడు. స్వార్ధచింతన లేని వాడు. ప్రకృతిని, జీవరాశినీ అభిమానిస్తాడు. ప్రతిమనిషినీ గౌరవిస్తాడు. అతని భార్య హరిలీనా గయ్యాళి. భర్త చేతకానితనాన్ని అనుక్షణం ఎత్తిపొడుస్తూ వేధిస్తుంది. యోగార్‌కి ఒక కొడుకు కోల్కా. తండ్రిలానే సున్నిత మనస్కుడు. పర్యావరణ ప్రేమికుడు కవి.
ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో అరకొర సంపాదనతో బ్రతుకు వెళ్ళదీస్తున్న అతని కుటుంబాన్ని మంచి భవిష్యత్తు ఉందంటూ ఆశ చూపి కొత్తగా ఏర్పడిన ఒక కాలనీకి తీసుకు వస్తాడు అతని తోడల్లుడు వ్యధార్. ఈ నేపధ్యంలోనే కథ ప్రారంభం అవుతుంది. అప్పటి రష్యాలో వస్తున్న మార్పులను ఈ నేపధ్యంలో అంతర్లీనంగా చిత్రీకరి స్తుంది. శ్రమకు తగిన ఫలితం లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో డబ్బు చెల్లించడం, పర్యటన ఆధారంగా ప్రభుత్వం డబ్బున్న పట్టణవాసుల నుండి ఆదాయం సమకూర్చు కోవాలనుకోవడం, ఇవన్నీ రష్యన్ సోషలిస్టు వ్యవస్థలో అప్పటి రోజుల్లో వస్తున్న మార్పులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.
సున్నితమయిన మన కధా నాయకుడు యోగార్‌కి పూర్తిగా వ్యతిరేకమయిన వాడు అతని తోడల్లుడు ”ప్యోదర్ ఇపతోవిచ్” అటవీ అధికారిగా అనుమతి లేకుండా చెట్లు నరుకుతాడు. పై అధికారులను లంచంతో కొని తన పనులను సాగించుకొంటాడు. రక్షిత అడవిలోకి పర్యాటకులను అనుమతించి డబ్బులు తీసుకుంటాడు. యోగార్‌ను కూడా అలా చేయమని శతవిధాలా పోరాడుతాడు. ఆత్మ వంచన చేసుకోలేని యోగార్‌ని చేతకాని వాడిగా ముద్రవేసి భార్యతో సహా అందరూ హేళన చేస్తుంటారు.
అయితే అవినీతిపరుడయిన ప్యోదర్‌ని తొలగించి అతడి స్థానంలో యోగార్‌ని అటవీ అధికారిగా చేస్తాడు ఆ జిల్లా అటవీ వార్డెన్ అయిన యారీ పెత్రోవిచ్. దానితో యోగార్ కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ పనిలో యోగార్ మనసా వాచా కర్మణా నిమగ్నమవుతాడు. ఇన్ని రోజులూ అతను ఊహించుకున్న జీవితం, అదీ ప్రకృతితో మమేకమవగలిగిన, అడవిలో ఉండే పని కావడంతో అతని ఆనందానికి అంతుండదు. పని గంటలకు ఎటువంటి పరిమితులూ లేకుండా సంతోషంగా స్వేచ్ఛగా పనిచేస్తాడు. తన పాతమిత్రులు అనధికారంగా చెట్లు నరికి వేస్తుంటే వాళ్ళని నిలేస్తాడు. ఎటువంటి బుజ్జగింపులకూ ప్రలోభాలకూ లొంగడు.
అతని ఈ ప్రవర్తన వల్ల భార్య దృష్టిలో, సమాజం దృష్టిలో అతను అధికారం ఉన్నా అసమర్ధుడిగానే గుర్తింపు పొందుతాడు. అయితే అడివిలోని నల్ల చెరువులోకి పట్నంలోని జూ నుండి రెండు తెల్ల హంసలను తెచ్చి పెంచడంతో కధ మరో మలుపు తిరుగుతుంది. ”జూ ఉండకూడదు. మ్యూజియంలు ఉండకూడదు. ఏదీ ప్రదర్శన కాకూడదు. జీవితం సహజంగా ఉండాలి” అనే ఆలోచన యోగార్‌ది. అందుకే జూలోని హంసలను నల్ల చెరువులోకి తేవడం అన్న అత్యంత సాహసోపేతమయిన అతడి కార్యం మనల్ని ముగ్ధులను చేస్తుంది. ఎక్కడయినా ఎప్పుడైనా మంచితనం మానవత్వం అంతిమ విజేతలు అని నమ్మే మనిషి యోగార్. అందుకే అందరి హేళనలను అత్యంత సహనంతో భరిస్తాడు.
అయితే చివరికి హంసలను వేటాడి వండుకుని తినే మనుష్యులు అడవిలో నల్ల చెరువుపై దాడి చేస్తారు. అప్పటిదాకా సున్నితంగా అమాయకంగా కనిపించిన యోగార్ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటాడు. వీరోచితంగా పోరాడి గెలుస్తాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఒక్క మాట చెప్తాడు. ”భయపడొద్దు. జీవించడానికి భయపడొద్దు” ఈ మాటలతోనే నవల ముగుస్తుంది. యోగార్ పాత్ర మాత్రం ముగియదు. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సామాన్యంగానే జీవితం మొదలు పెడతాడు. వాళ్ళు ఆచరించే విలువలూ సామాన్యం గానే ఉంటాయి. అయితే ఎప్పుడైతే తన ఊహలకి, కార్యాచరణకి సమాజపు ఆమోదం వాళ్ళకి దొరుకుతుందో ఇంక అంతే… అప్పటిదాకా సామాన్యంగా మన కళ్ళముందు కదిలిన వారి జీవితాలు, వాళ్ళు ఆచరించిన విలువలూ ఒక్కసారిగా అసామాన్యమవుతాయి. యోగార్ జీవితం కూడా అంతే. కనీసం భార్యా పిల్లలను పోషించుకోలేని అసమర్ధుడిగా ముద్రపడ్డ యోగార్ పర్యావరణ ప్రేమికుడిగా అందుకోసం ఎలాంటి త్యాగానికయినా వెరవని వ్యక్తిగా అతని జీవితం మలుపు తిరుగుతుంటే భలేగా ఉంటుంది.
”ప్రకృతి తల్లిలా మనం ఉండలేమా? ఎందుకని” అని మనల్ని ప్రశ్నిస్తాడు యోగార్. ఇంకా ఇలా అంటాడు ”ప్రకృతిలో ప్రతీదానికి తనదైన స్థాయి ఒకటి ఉంటుంది. తోకూపుడు పిట్ట నేలమీద మాత్రమే తిరుగుతూ ఉంటుంది. గద్ద ఆకాశంలో చాలా పైన విహరిస్తుంది. ప్రతీ ఒక్క దానికీ దాని ప్రత్యేకమయిన స్థాయి కేటాయించింది ప్రకృతి. అందుకే ఏ గొడవా లేదు. ఎక్కడా పరిమితికి మించిన సంఖ్య లేదు. ప్రతీ జీవికి తమ సొంత పని ఉంటుంది, ప్రతీ జీవికి ప్రత్యేకించిన బతుకు తెరువు ఉంది. కానీ మనిషి అలా కాదు. అందుకే మనిషి ప్రకృతిలా లేడు” అంటాడు. యోగార్. నవల చదివాక యోగార్ వ్యక్తిత్వం మనల్ని ఆవహిస్తుంది.
జీవ వైవిధ్యాన్ని కాపాడాలని ప్రకృతిని రక్షించుకోవాలనీ వాతావరణాన్ని కాపాడుకోవాలని ఇవన్నీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ఇలాంటి ధృక్పధాన్ని 50 యేళ్ళ క్రితమే రచయిత బోరిస్ వాసిల్యెవ్ కలిగి ఉన్నాడు. సురేష్ అనువాదం కూడా చాలా సహజంగా ఉంటుంది. తప్పక చదవండి.