తెలంగాణొస్తె సాలు అన్ని కష్టాలు బోతయి, తెలంగాణ కోసం కొట్లాడాలె, సేతులు ముంగటేస్కుంటె తెలంగాణ రాదు త్యాగాలు జెయ్యాలె గప్పుడే తెలంగాణొస్తది. తెలంగాణొస్తె బిచ్చగాల్లుండరు, కూలోల్లుం డరు, సదువులేనోల్లుండరు, భూముల్లేనోల్లుండరు, కట్నాలుండయి, నిరుద్యోగముం డది, రైతుల సావులుండయి, ఆత్మహత్యలుం డయి, టెంపరరీ పోస్టులుండయి, ఔట్ సోర్సింగులుండయి, కూలిగులాపోల్లుండరు, అందరు సమానంగ మంచిగ బతికే బంగారు తెలంగాణ కోసం అందరం రాల్లెత్తి రంగ మెక్కుదాము, అంటరాని దళితుల్నే అందల మెక్కిద్దామంటే నిజమేననుకున్నయి ప్రజాశక్తులు, ఉద్యమ శక్తులు, విప్లవ శక్తులు. ఆశ్చర్యమేమిటంటే మామూలు జనాన్ని మాటల మంత్రాలతోని మాయ జెయ్యొచ్చు అంటే అర్థముంది. కాని నూతన రాజ్యాల కోసం, నూతనమైన ప్రజాస్వామిక విప్లవ సమాజాల కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తున్న విప్లవ శక్తులు కూడా తెలంగాణ అధికార రాజకీయాలకు, దోపిడి రాజకీయా లకు ఏ ప్రాతిపదిక మీద తెలంగాణ ఉద్యమా నికి మద్దతే కాకుండా భుజాల మీదేసుకొని మోసినట్టు తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్నప్పుడే సామాజిక కోణంగా ఎందుకు చర్చ జరగలే?
తెలంగాణ సాధించుకోడం, పోరాడ్డం సరే! దీంట్ల మహిళల సమానావకా శాల సంగతేంటి? కులాల సంగతి, సమానత్వాల సంగతి, ఆధిపత్య రాజకీయాల సంగతులు, వనరుల పంపకాల గూర్చి ఎక్కడ చర్చ కాలే. కానీ జేఏసీ సంగాల్లో మహిళలున్నా వారిని అనామకంగాచేయడం, వారిని మాట్లాడనివ్వకపోవడం, నాయకత్వ ప్రాతినిధ్యాలు, భాగస్వామ్యాలు కల్పించని అసహనాలు ప్రదర్శించడం, నిలదీస్తే : ముందు తెలంగాణ రానీయండి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ప్రగతిశీల నాయకులు మాట్లాడిండ్రు.
ఉద్యమశక్తులు, విప్లవశక్తులు, దోపిడి శక్తులు, అధికార రాజకీయాలు అన్ని కలిసి తెలంగాణ బహుజన కులాల్ని నడింట్ల బొంగిగ్గోసినయి. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసింది ఆ కులాల బిడ్డలు.
ఉస్మానియాని యుద్ధభూమి చేసి వాల్ల కెరియర్స్‌ని పనంగాపెట్టి కేసుల పాలైండ్రు, జైల్ల పాలయిండ్రు ఆ కులాల యువతనే. వీల్లందరి ఉద్యమ త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది. కోటి కలల్ని ఒడి నింపుకున్నట్లు 2015తో తెలంగాణ అడుగేసింది. అసలు సంగతులన్ని అడియాసలన్ని, క్రూరత్వాల సంపుడు పందేలని ఎన్‌కౌంటర్లుగా చూయించి గీత గీసి సూయించింది అధికార తెలంగాణ.
ఇది అందరి తెలంగాణ, ఆయి బాయి గుందాము. లొల్లులు కొట్లాటలు మనకెందుకు మనమేమన్న సీమాంధ్రలు న్నమా! దర్నాలు దంపులాటలు మనకెందు కు? తెలంగాణ బీదది గాదు మంచిగ నదులున్నయి సెర్వులున్నయి. మంచిగ ‘మిషన్ కాకతీయతోని పూడికల్దీసుకుం దాము. సీయెమ్ నుంచి స్వీపరుదాక, ఆఫీసరునుంచి అటెండరు దాకా అందరం సమానమే. ఎవ్వరు ఎక్కువ లేదు తక్కువ లేదు అందరం తెలంగాణ బిడ్డలమే, కల్సి తిందాము కల్సి పంచుకుందాము. సన్నాసులు జేసే సమ్మె లొద్దు. మన పిల్లల్ని కేజీ నుంచి పీజీ దాకా సదివిద్దాం ఏ పిల్లలు బడి బైట కనబడొద్దు. ఎవ్వరు దుబాయి, మస్కట్ బోవద్దు, నిరుద్యోగమనే మాట యినబడొద్దు. బూముల్లేనోల్లకు బూములు పంచుకుందామి, ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌లు యిచ్చి పెండ్లి జేసి (సదువులకు దూరం జేద్దాం) సంసారాలకు బంపుదాము. రైతుల సావులు, కూలీ వ్యవస్థలొద్దు. అందరు మంచిగుండాలని కడుపుల తల్కాయ బెట్టినట్లు మాట్లాడిన సల్లటి మాటలు డొల్లలని కలలని తేల్చింది 2015. కలలు గల్లంతయిన గాయం 2015 తెలంగాణకు.
తెలంగాణ జనాన్ని పల్లె నుంచి పట్నం దాకా విప్లవ శక్తులు, ఉద్యమ శక్తులు దోపిడి ఎజెండాలతో మమేకమై వురికించినయి. అందుకు ప్రతిఫలంగా స్వాతి మీద చేసిన క్రూర పోలీసు పాశవిక హత్య 2015 మరవలేదు. ఉద్యమ శక్తులు, అధికార రాజకీయాలు వేరు వేరనే విషయం అర్థము చేయించేందుకు ఒక క్రూరమైన గీత గీసి చెప్పేందుకు శృతి మీద బీభత్స పాశవిక హత్యతో చూపించడం జరిగింది.
కాంట్రాక్ట్ వర్కర్స్‌ని, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని పర్మనెంటు చేస్తామని నమ్మబలికి ఆ మాటెత్తకుండా జేసింది. సఫాయి పనోల్లు కనిపించే దేవుల్లు. వాల్లు జేసే పనికి ఎంతిచ్చినా తక్కువే అని మాట్లాడి వాల్లను పర్మనెంటు జెయ్యకపోగా వాల్లు కనీస వేతనాల కోసం సమ్మెజేస్తే… ఉద్యోగాలు పీకేస్తా అనే బెదిరింపులతో వాల్లడిగిన వేతనంతో కాకుండా బిక్షం వేసినట్లు విదిల్చింది కొత్త తెలంగాణ ప్రభుత్వము. ఆశ వర్కర్లు యింకా సమ్మె జేస్తనే వున్నా చెవుమీన పేనుబారని నిర్లక్ష్యము, యిప్పటిదాకా మహిళల్ని మంత్రి వర్గంలోకి తీసుకోలే. ఎమ్మెల్సీల్లో మహిళా ప్రాతినిధ్యాల్ని దూరం బెట్టింది. మహిళా కమిషన్ సోదిలో కూడా లేదు. యాడాదికోసారి బోనాలు, బత్క మ్మలకు మహిళలు రోడ్లన్ని నిండేట్లు కనబ డాలె. యిప్పుడు అవి కూడ మొగోల్లే చేస్తున్నరు.
వాగ్దానాలన్ని వట్టిమాటలేనని తేలింది. ఎప్పటిసిప్ప ఎనుగుల్నే వుంది. మాటలు కోటలు దాటినా చేతలు గడపగూడ దాటలే. గుల్లు గోపురాల్ని వెలిగించుకుంట పుష్కరాల పాటల్లో మునిగి తేలుకుంటా యిప్పుడు యాగాలే తెలంగాణ సంక్షేమాన్ని తేలుస్తాయట. యాగాలే అన్ని జేస్తే మరి గీ యాగాలే జేస్కుంట కూసుంటె సరిపోయేది గదా! తెలంగాణ కోసం మా బిడ్డలు సచ్చిపోక పోదురు గదా!