గత ఇరవైకి పైగా సంవత్సరాలుగా హెచఐవీ నివారణ కార్యక్రమాల నేపథ్యంలోనూ, మన చరిత్రలోనూ స్వలింగ సంపర్కులు, హిజ్రాలు, ట్రాన్స్ వ్యక్తుల గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, వారి జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. సమాజంలో వారి ఉనికి గురించి చర్చలు జరిగినా, వారి జీవనోపాధి, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక గౌరవం, మానవ హక్కులు వంటి అంశాలు ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం వంటి ప్రాథమిక విలువలకు ప్రాధాన్యతనిస్తుంది. కులం, మతం, లింగం, ప్రాంతం వంటి భేదాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు లభించాలనే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నప్పటికీ, ట్రాన్స్ వ్యక్తులకు ఆ హక్కులు ఆచరణలో అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టింది. ప్రత్యేక హక్కుల సంగతి పక్కన పెడితే, వారికి కనీస ప్రాథమిక హక్కులు, సామాజిక గుర్తింపు, గౌరవప్రదమైన జీవితం లభించడానికి కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులను పరిశీలించినప్పుడు, ట్రాన్స్ సముదాయం మానవ హక్కులను పరిరక్షించడంలో మన సమాజం, ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడ విఫలమయ్యాయనే ప్రశ్న ఎదురవుతుంది. అసలు ఎక్కడ విఫలమయ్యాము? ఎందుకు విఫలమయ్యాము? ఎలా విఫలమయ్యాము? ఈ పరిస్థితులకు కారణం ఎవరు? ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించాలంటే, ట్రాన్స్ వ్యక్తుల జీవితాల్లో వివక్ష ఎక్కడ ప్రారంభమవుతుందో అర్థం చేసుకోవాలి.
కుటుంబం నుంచే ప్రారంభమయ్యే వివక్ష: సాధారణంగా వివక్ష అనేది ఒక వ్యక్తిని స్వీకరించకపోవడం నుంచి ప్రారంభమవుతుంది. ట్రాన్స్ వ్యక్తుల విషయంలో ఈ ప్రక్రియ చాలాసార్లు కుటుంబం నుంచే మొదలవుతుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, పాఠశాలలో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత సమాజం, బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రదేశాలు… ఇలా ప్రతి దశలోనూ వారు తిరస్కరణను, వివక్షను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒక వ్యక్తి అట్టడుగు స్థితికి నెట్టివేయబడటం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. బాల్యం నుంచో, యవ్వనం నుంచో ప్రారంభమయ్యే అవమానాలు, తిరస్కరణలు, వేధింపులు క్రమంగా వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కుటుంబంలోనే వారిని చులకనగా చూడటం, తక్కువ చేసి మాట్లాడటం, వారి ప్రవర్తనను తప్పుగా పరిగణించడం వంటి చర్యలు మొదలవుతాయి. కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ వివక్ష ఆ తర్వాత ఇతర సామాజిక ప్రదేశాలకు విస్తరిస్తుంది.
కుటుంబ సభ్యులు చాలాసార్లు తమ పిల్లలను మార్చాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కరెక్షనల్ ట్రీట్మెంట్ పేరుతో చికిత్సలు చేయించడం, బలవంతంగా మంత్రాలు వేయించడం, చేతబళ్లు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. వారి లైంగికతను, ప్రవర్తనను, హావభావాలను సరిచేయాలని ప్రయత్నిస్తారు. ఇలా ఒక వ్యక్తి తన సహజమైన గుర్తింపుతో జీవించే హక్కును కుటుంబంలోనే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది.
కుటుంబంలో ప్రారంభమైన వివక్ష అక్కడితో ఆగిపోదు. సమాజంలోనూ వారిని స్వీకరించకపోవడం, నిందించడం, అవమానించడం, వేధించడం, లైంగికంగా వేధించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. వారిని సమాజానికి చెందినవారు కానట్లుగా చూడటం, ఏలియన్లుగా, గ్రహాంతరవాసులుగా పరిగణించడం కూడా ఈ వెలివేతలో భాగమే. ఒక వ్యక్తిని సమాజం నుంచి దూరం చేయడం, అట్టడుగుకు నెట్టడం, వారి ఉనికినే ప్రశ్నించడం వంటి ప్రక్రియలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ట్రాన్స్ వ్యక్తులపై జరిగే అవమానాలు, అణచివేత, హింస, వేధింపులను సమాజం క్రమంగా సాధారణీకరించుకుంది. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ సముదాయానికి, సమాజంలోని ఇతర వర్గాలకు మధ్య పరస్పర చర్చ జరగడానికి, అవగాహన పెంపొందడానికి, పరస్పర అంగీకారం ఏర్పడడానికి అవసరమైన అవకాశాలు లేకుండా పోయాయి.
సముదాయ సభ్యులు తమ ఆత్మరక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే పరిస్థితులు కూడా అనేక సందర్భాల్లో వారికి అందుబాటులో లేకుండా పోయాయి. నిరంతరం భయంతో, సామాజిక కళంక భావనతో జీవించాల్సి వచ్చింది. సముదాయం వెలుపల ఉన్న సాధారణ జనాభా నుంచి తగిన సహకారం లభించకపోవడంతో, తమ హక్కుల కోసం పోరాడాలనే ఆలోచనను కూడా బలంగా ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు చేసే పనులు తప్పు అని సమాజం నిందించడం, వారి జీవన విధానాన్ని అంగీకరించక పోవడం వంటివి క్రమంగా సాధారణీకరించబడ్డాయి. చివరకు, సమాజం తమను ఎలా చూస్తుందో, ఎలా నిందిస్తుందో దానిని అంగీకరించాల్సిన పరిస్థితిలోకి వారు నెట్టివేయబడ్డారు. తమలాంటి ఇతర సముదాయ సభ్యులతో కలిసి జీవించడం, తమ సముదాయాన్నే ఒక ప్రత్యేక ప్రపంచంగా భావించి, ఆ పరిధిలోనే జీవితాన్ని కొనసాగించడం చాలామందికి అలవాటుగా మారింది.
ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది. ట్రాన్స్ సముదాయాన్ని స్వీకరించడంలో సాధారణ జనాభా ఎందుకు విఫలమైంది? వారికి అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ వ్యక్తుల పట్ల వారు చూపే ప్రతిస్పందనలకు మన సంప్రదాయ సామాజిక వ్యవస్థ, తెలియనితనం కూడా కారణాలుగా ఉన్నాయి.
సమాజంలో స్త్రీలు, పురుషులు అనే రెండు లింగాలనే ప్రధానంగా పరిగణించే బైనరీ దృక్పథం బలంగా ఉంది. ఈ రెండు విభాగాలకు భిన్నమైన లింగ గుర్తింపులు, లింగ వ్యక్తీకరణలు ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన చాలామందికి లేదు. వారిని నపుంసకులు లేదా న్యూట్రల్ అని పిలుస్తూ, అదేదో ఒక లోపం అన్నట్లుగా భావించే దృక్పథం కనిపిస్తుంది. వారు కూడా సమాజంలో సహజమైన భాగమేననే అవగాహన మాత్రం విస్తృతంగా ఏర్పడలేదు. అయితే, సాధారణ జనాభాకు అవగాహన లేకపోవడాన్ని మాత్రమే కారణంగా చూపించి బాధ్యత నుంచి తప్పించుకోలేము. కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, మీడియా, పౌర సమాజం.. అందరికీ ఈ అవగాహనను పెంపొందించే బాధ్యత ఉంది.
మీడియా చిత్రీకరణ: ఇతర అట్టడుగు వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించబడినప్పటికీ, ట్రాన్స్ సముదాయం చాలాకాలం పాటు నిర్లక్ష్యానికి గురైన సముదాయంగా మిగిలిపోయింది. సినిమాలు, వార్తలు, టెలివిజన్ కార్యక్రమాలు, ఇతర మాధ్యమాల్లో ట్రాన్స్ వ్యక్తులను చూపించినప్పుడు కూడా, చాలాసార్లు వారిని హాస్యాస్పదమైన పాత్రలుగా, గొడవలు సృష్టించే వ్యక్తులుగా లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే సమూహంగా చిత్రీకరించారు. ఇటువంటి చిత్రీకరణలు కూడా సమాజంలో వారి పట్ల ఉన్న ప్రతికూల దృక్పథాన్ని బలపరిచాయి. ట్రాన్స్ వ్యక్తులను హేళన చేయడం, వ్యంగ్యంగా మాట్లాడటం, అవమానపరచడం, తక్కువ చేసి చూడటం సాధారణమైన ప్రవర్తనగా మారిపోయింది. ఈ అవమానాలు జరగని ప్రదేశం అంటూ లేకుండా పోయింది. ఇంట్లో మొదలైన వివక్ష వీధుల్లోకి, వారు నివసించే వాడల్లోకి, రోడ్లపైకి, బహిరంగ ప్రదేశాల్లోకి విస్తరించింది. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా సమాజంలోని అనేక మంది వారిని హేళన చేసేవారు. ఇలా ట్రాన్స్ వ్యక్తులను అవమానించడం సామాజికంగా ఆమోదయోగ్యమైన ప్రవర్తనగా మారిపోయింది. సాధారణ జనాభాకు ట్రాన్స్ సముదాయం గురించి అవగాహన కల్పించడానికి, అలాగే ట్రాన్స్ వ్యక్తులకు సమాజంలోని హక్కులు, అవకాశాలు, వ్యవస్థల గురించి తెలియజేయడానికి తగిన ప్రయత్నాలు జరగలేదు. పాఠశాలల్లో, సమాజంలో, కార్యాలయాల్లో ట్రాన్స్ వ్యక్తుల పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా సమగ్రమైన, నిరంతరమైన కృషి జరగలేదు. ఇది కూడా ఈ సముదాయం ఎదుర్కొంటున్న మరో ప్రధాన లోటు.
హిజ్రా వ్యవస్థ: సమాజంలో తమకు స్థానం లేదని భావించే పరిస్థితుల్లో, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, వేరే గత్యంతరం లేక, తమలాంటి వ్యక్తులతో కలిసి జీవించడం ట్రాన్స్ వ్యక్తులకు ఒక మార్గంగా మారింది. కొందరు హిజ్రా వ్యవస్థలో చేరుతారు. మరికొందరు ఇతర ట్రాన్స్ వ్యక్తులతో కలిసి జీవిస్తారు. హిజ్రా వ్యవస్థలో కూడా సభ్యులు తమ హవేలీలోని హిజ్రా నాయకులు విధించే నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. గురువు ఎలా చెబితే అలా నడుచుకోవడం, హవేలీలోని నియమాలను పాటించడం, గురువుకు సేవ చేయడం వంటి అంశాలు వారి జీవన విధానంలో భాగమవుతాయి. ఈ వ్యవస్థలోని నియమాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు భద్రత, రక్షణ లభిస్తాయని కొందరు భావిస్తారు. ఇది సముదాయ సభ్యులు తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకున్న ఒక సామాజిక వ్యవస్థ. బయటి సమాజం నుంచి తిరస్కరణ ఎదురైనప్పుడు, తమలాంటి వ్యక్తులతో కలిసి ఉండటం వారికి సామాజిక సంబంధాలను, కొంత భద్రతను అందిస్తుంది. అయితే, ఈ వ్యవస్థలోని అధికార సంబంధాలు, నియమాలు, పరిమితులు కూడా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయగలవు. ఈ వ్యవస్థకు బయట ఉన్న సమాజానికి, హిజ్రా వ్యవస్థకు, ప్రభుత్వానికి, రాజ్యానికి మధ్య సంబంధాలు అనేక సందర్భాల్లో పరిమితంగానే కనిపిస్తాయి. జీవనోపాధి, ఆదాయం, సముదాయంలోని కుటుంబ వ్యవస్థ, ఘరానా కొనసాగింపు వంటి అంశాలు ప్రధాన ప్రాధాన్యతను పొందుతాయి.
భిక్షాటన ఎలా చేయాలి? ఎలా సంపాదించాలి? వచ్చిన ఆదాయాన్ని శిష్యుల మధ్య ఎలా పంచుకోవాలి? అనే అంశాలపై దృష్టి కేంద్రీకృతమవుతుంది. ధనికుల ఇళ్లకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో, వ్యాపారవేత్తల వద్ద డబ్బులు అడగడం వంటి పద్ధతులు జీవనోపాధిలో భాగమవుతాయి. ఈ ఆదాయం వారి ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు, హిజ్రా వ్యవస్థలోని కుటుంబ సంబంధాలు, ఘరానా కొనసాగింపునకు కూడా ఆధారంగా మారుతుంది. అయితే, హిజ్రా వ్యవస్థలోని సభ్యులందరి అనుభవాలు ఒకే విధంగా ఉంటాయని చెప్పలేం. వారి జీవన పరిస్థితులు, ఆర్థిక అవకాశాలు, నాయకత్వ సంబంధాలు, వ్యక్తిగత ఎంపికలు భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ, బయటి సమాజంలో అవకాశాలు పరిమితం కావడం వల్ల ఈ వ్యవస్థపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఒక ముఖ్యమైన సామాజిక అంశం. ట్రాన్స్ సముదాయాన్ని, హిజ్రా సముదాయాన్ని పెద్ద సంఖ్యలో చేరుకుని పనిచేసిన ప్రారంభ కార్యక్రమాల్లో లైంగిక ఆరోగ్యం, హెచఐవీ నివారణ కార్యక్రమాలు ముఖ్యమైనవి.
ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం హెచఐవీ వ్యాప్తిని నియంత్రించడం, లైంగిక ఆరోగ్య సేవలను అందించడం. అప్పట్లో ఈ సముదాయంలోని కొంతమంది సభ్యులను హెచఐవీకి సంబంధించిన కీలక జనాభాగా గుర్తించి, వారితో పనిచేయడం ప్రజారోగ్య పరంగా అవసరమని ప్రభుత్వం, సంబంధిత సంస్థలు భావించాయి. ఈ కార్యక్రమాల ద్వారా సముదాయ సభ్యులను చేరుకోవడం, ఆరోగ్య సేవలను అందించడం, అవగాహన కల్పించడం వంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే, వారి సమగ్ర సంక్షేమం, జీవనోపాధి, విద్య, ఉపాధి, సామాజిక గౌరవం, రాజ్యాంగ హక్కులు వంటి అంశాలకు అదే స్థాయిలో ప్రాధాన్యం లభించిందా అనే ప్రశ్న మిగిలిపోయింది. ఆరోగ్య కార్యక్రమాల ద్వారా సముదాయాన్ని చేరుకోవడం ఒక ముఖ్యమైన ముందడుగు అయినప్పటికీ, వారి జీవితాల్లోని అన్ని సమస్యలకు అది పరిష్కారం కాలేదు. ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా క్రమంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ బోర్డులు, సంస్థలు, కమిటీలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, వాటిలో నిరంతరత్వం, స్థిరత్వం కొరవడిన సందర్భాలు ఉన్నాయి. సమర్థవంతమైన నిర్వహణ, బాధ్యతాయుతమైన యాజమాన్యం, తగిన వనరులు, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణాలుగా ఉండవచ్చు. ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమ కార్యక్రమాల మాదిరిగానే ట్రాన్స్ సముదాయం కోసం కూడా ప్రత్యేకంగా పనిచేయాలి. వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు అందేలా చూడాలి. విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహవసతి, సామాజిక భద్రత వంటి అవకాశాలు అందుబాటులోకి రావాలి. వారిని సమాజం సహజంగా స్వీకరించే పరిస్థితులను కల్పించాలి. ఈ దిశగా నిరంతర కృషి జరగాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రయత్నాల్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైన సంస్థాగత వైఫల్యం.
సముదాయంలో నాయకత్వ వైవిధ్యం ఉండటం తప్పనిసరిగా లోపం కాదు. సమస్య ఏమిటంటే, వివిధ నాయకత్వాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, ఉమ్మడి కార్యాచరణకు అవసరమైన వ్యవస్థలు బలంగా లేకపోవడం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సముదాయ నాయకులు కలిసి పనిచేసే విధానాలు స్పష్టంగా లేకపోతే సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అందరికీ చేరడం కష్టమవుతుంది. ఈ సముదాయంతో ఎలా పనిచేయాలి? వారిని ఎలా చేరుకోవాలి? వారి అవసరాలను ఎలా గుర్తించాలి? వారికి సేవలు ఎలా అందించాలి? వారి అభిప్రాయాలను విధాన రూపకల్పనలో ఎలా భాగం చేయాలి? అనే అంశాలకు సంబంధించి స్పష్టమైన, ప్రామాణికమైన విధానాలు అవసరం. అటువంటి విధానాలు లేకపోవడం కూడా ఒక పెద్ద లోటు.
ట్రాన్స్ వ్యక్తుల సంక్షేమం కోసం రూపొందించే కార్యక్రమాలు వారి భాగస్వామ్యంతోనే అమలవ్వాలి. వారి అవసరాలను వారి తరఫున ఇతరులు నిర్ణయించడం కాకుండా, వారి అనుభవాలు, అభిప్రాయాలు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. సముదాయంలోని వైవిధ్యాన్ని గుర్తిస్తూ, వివిధ వర్గాలకు అందుబాటులో ఉండే విధానాలను రూపొందించాలి. సమాజంలో తిరస్కరణ, వివక్ష, ఉపాధి అవకాశాల కొరత వంటి పరిస్థితుల కారణంగా కొంతమంది ట్రాన్స్ వ్యక్తులకు భిక్షాటన, సెక్స్ వర్క్ ప్రధాన జీవనోపాధి మార్గాలుగా మిగిలిపోయాయి. భిక్షాటన చేస్తే ఎంత ఆదాయం వస్తుంది? నిర్దిష్ట సమయం సెక్స్ వర్క్ చేస్తే ఎంత సంపాదించవచ్చు? అనే లెక్కలకే వారి ఆర్థిక జీవితం పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఇతర ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించడం వంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే అవకాశం కూడా చాలామందికి లేకుండా పోయింది. దీనికి వారి వ్యక్తిగత పరిస్థితులు మాత్రమే కారణం కాదు. విద్యాసంస్థల్లో వివక్ష, ఉద్యోగ ప్రదేశాల్లో తిరస్కరణ, కుటుంబ మద్దతు లేకపోవడం, సామాజిక అవమానం, ఆర్థిక వనరుల కొరత వంటి నిర్మాణాత్మక సమస్యలు కూడా కారణమవుతాయి. అందువల్ల, ట్రాన్స్ వ్యక్తుల జీవనోపాధిని కేవలం వ్యక్తిగత ఎంపికగా చూడలేం. అందుబాటులో ఉన్న అవకాశాలు, సమాజం చూపే వైఖరి, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులు కూడా వారి ఎంపికలను ప్రభావితం చేస్తాయి.
ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నప్పటికీ, ట్రాన్స్ వ్యక్తులకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్య శిక్షణ అందించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ కార్యక్రమాల ప్రయోజనాలను వారు వాస్తవంగా పొందగలుగుతున్నారా అనే ప్రశ్న ఎదురవుతోంది. పథకం ఉండటం ఒక అంశమైతే, దాన్ని పొందడానికి అవసరమైన అర్హతలు, పత్రాలు, ప్రక్రియలు అందుబాటులో ఉండటం మరో అంశం. గుర్తింపు పత్రాలు: సంక్షేమానికి అడ్డంకి: ట్రాన్స్ వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందడంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమస్య ఒకటి. పుట్టినప్పుడు నమోదు చేసిన పేరు, తర్వాత తమ లింగ గుర్తింపుకు అనుగుణంగా స్వీకరించిన పేరు వేర్వేరుగా ఉండవచ్చు. కొందరి వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు లేకపోవచ్చు. మరికొందరి పత్రాల్లో పాత పేరు లేదా గతంలో నమోదు చేసిన లింగ వివరాలు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ ప్రస్తుత గుర్తింపుకు అనుగుణంగా పత్రాలను సవరించుకోవడం, వివిధ ప్రభుత్వ రికార్డుల్లో వివరాలను అనుసంధానించడం వారికి సవాలుగా మారుతుంది. ఈ సమస్య కేవలం పేరు లేదా పత్రాలకు సంబంధించినది మాత్రమే కాదు. గుర్తింపు పత్రాలు లేకపోవడం లేదా వాటిలో వివరాలు సరిపోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు, రేషన్, ఆరోగ్య సేవలు, ఉపాధి కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో అడ్డంకులు ఎదురుకావచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు ఎలా అర్హత పొందాలి? ఆ పథకాల ప్రయోజనాలను ఎలా పొందగలరు? అవసరమైన పత్రాలు లేని వారికి ఎవరు సహాయం చేస్తారు? గుర్తింపు పత్రాల సవరణకు సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? లక్షలాది మంది ఉన్న ఈ సముదాయంలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు, హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ఎవరు చర్యలు తీసుకుంటారు? వారి తరఫున ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి, అవసరమైన పత్రాలు పొందడానికి సహాయం చేసే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి? గుర్తింపు పత్రాలు లేవనే కారణంతో ఒక వ్యక్తి సంక్షేమానికి దూరమైతే, ఆ వ్యవస్థలోని లోపాన్ని ఎవరు సరిచేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం అత్యవసరం.
వైఫల్యం ఎక్కడ ఉంది?: ట్రాన్స్ సముదాయం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించినప్పుడు, వాటికి ఒకే కారణాన్ని చూపించడం సాధ్యం కాదు. కుటుంబం నుంచి ప్రారంభమయ్యే వివక్ష, విద్యాసంస్థల్లో స్వీకారం లేకపోవడం, మీడియా ప్రతికూల చిత్రీకరణ, ఉపాధి అవకాశాల కొరత, ఆరోగ్య సేవల్లోని అడ్డంకులు, సామాజిక కళంకం, గుర్తింపు పత్రాల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు-ఇవన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి. సమాజం వారిని స్వీకరించకపోవడం వల్ల వారు అవకాశాలకు దూరమవుతున్నారు. అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, వాటిని పొందే ప్రక్రియలు క్లిష్టంగా ఉంటే ప్రయోజనాలు అందరికీ చేరవు. ఈ విధంగా ఒక సమస్య మరొక సమస్యను బలపరుస్తుంది.
ఇక్కడ బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు కూడా సమగ్రంగా సమాధానం చెప్పాలి. కుటుంబాలు తమ పిల్లలను స్వీకరించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాయి. విద్యాసంస్థలు వివక్షలేని వాతావరణాన్ని కల్పించాలి. మీడియా గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన చిత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగ సంస్థలు సమాన అవకాశాలను కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు సముదాయ భాగస్వామ్యంతో పనిచేయాలి. ప్రభుత్వాలు హక్కులను పరిరక్షించే చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా, అర్హులైన వ్యక్తులకు వాస్తవంగా అందేలా చూడాలి.
అదే సమయంలో, ట్రాన్స్ సముదాయ సభ్యుల గొంతుకకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి. వారి జీవితాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా, హక్కులు కలిగిన పౌరులుగా, నిర్ణయాల్లో భాగస్వాములుగా పరిగణించాలి. ట్రాన్స్ సముదాయం ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం భిక్షాటన, సెక్స్ వర్క్, ఆరోగ్యం లేదా గుర్తింపు పత్రాల సమస్యలుగా మాత్రమే చూడలేం. ఇవి సమాజంలోని వివక్ష, వెలివేత, అసమాన అవకాశాలు, సంస్థాగత నిర్లక్ష్యం వంటి లోతైన సమస్యలతో ముడిపడి ఉన్నాయి. ట్రాన్స్ వ్యక్తులను సమాజంలో ఒక భాగంగా గుర్తించడం, వారి ఉనికిని గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం, విద్యా-ఉపాధి అవకాశాలను కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం.. ఇవన్నీ ఒక సమగ్ర దృక్పథంతో జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, వాటి ప్రయోజనాలు ట్రాన్స్ వ్యక్తులందరికీ చేరుతున్నాయా? వారికి అవసరమైన గుర్తింపు పత్రాలు అందుతున్నాయా? విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అవకాశాలు వాస్తవంగా అందుబాటులో ఉన్నాయా? సమాజంలో వారు గౌరవంగా జీవించగలుగుతున్నారా? అనే ప్రశ్నలను నిరంతరం పరిశీలించాలి.
అంతిమంగా, ఈ సవాళ్లు వ్యవస్థలో ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు ఏర్పడ్డాయి? ఎవరి చర్యలు లేదా నిర్లక్ష్యం వీటికి కారణమయ్యాయి? అసలు లోపం ఎక్కడ ఉంది? ఈ లోటును ఎవరు పూడ్చగలరు? ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఎవరు ముందుకు రావాలి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కేవలం ట్రాన్స్ సముదాయం బాధ్యత కాదు. ఇది కుటుంబం, సమాజం, మీడియా, పౌర సమాజం, ప్రభుత్వాలు, రాజ్యాంగ సంస్థలు… అందరి ఉమ్మడి బాధ్యత. ట్రాన్స్ వ్యక్తులు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి కాకుండా, ఆ హక్కులు సహజంగా అందుబాటులో ఉండే సమాజాన్ని నిర్మించడమే మన ముందున్న అసలు సవాలు.
