అదో చిన్న ఆదివాసీ గ్రామం. కోయదొర జాతి కుటుంబాలు అరవై దాకా ఉన్నాయి. మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడానికి వచ్చింది దేవి. అక్కడేమో మహిళలు ఒక్కొక్కరూ, ఇద్దరేసి హడావిడిగా ఒక సందులోకి వెళ్తున్నారు. దేవిని చూసి ‘వచ్చావా మేడమ’ అని ఒకపక్క పలకరిస్తూనే ఆగకుండా వెళ్ళిపోతున్నారు. ఒకామెని ఆపి ఏమైందని అడిగింది.
‘భవాని కూతురు పెద్దమనిషి అయ్యింది, ఆకులేసి వచ్చేస్తాం, కూర్చో మేడమ’ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆపనైపోతే కానీ ఎవ్వరూ రారని తెలుసు కనుక ఈలోపు పెరటితోటలు వేసుకోడానికి విత్తనాలు తీసుకున్న సభ్యుల తోటలు చూసి రావచ్చని వెళ్ళింది.
అరగంట తర్వాత ఒక్కొక్కరూ సమావేశ స్థలానికి చేరుకోవడం మొదలయ్యింది. అందరూ వచ్చేలోపు పిచ్చాపాటీ మాట్లాడు కుంటున్నారు. మెచ్యూర్ అయిన పాప ఏడో తరగతి చదువుతోందని, హాస్టల్లో ఉంటుందని, పొద్దున్న వార్డెన్ ఫోన్ చేసి విషయం చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళమంటే భవాని ఆటోలో వెళ్ళి తీసుకొచ్చిందని, వారంలో మళ్ళీ హాస్టల్‌కి పంపించాల్సి ఉంటుందని, తల్లికేమో కనీసం తొమ్మిదాకులు వేయించి కూర్చోపెట్టాలని ఉందని, లేకపోతే అనుకున్నట్టు ఫంక్షన్ చేయడానికి సమయం సరిపోదని, డబ్బు సర్దుబాటు అవ్వడానికి, అన్నీ పురమాయించుకుని అందర్నీ పిలవడానికి టైమ్ కావాలికదా అని.. ఇలా అందరూ మూకుమ్మడిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో దేవి ఏవో అడుగుతుంటే చెప్తున్నారు కానీ అందరూ పరంజ్యోతి కోసం ఎదురు చూస్తున్నారు.
సుమారు నలభై ఏళ్ళుండే పరంజ్యోతి అంటే అక్కడ అందరికీ గురి. మంచి నాయకత్వ లక్షణాలున్న జ్యోతి ఎప్పుడూ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంటర్ వరకే చదువుకున్నా లోకజ్ఞానం ఉన్న తెలివైన, చురుకైన జ్యోతి అంటే అందరికీ ఇష్టం. ఆమె చెప్పిన దానికి అందరూ అంగీకరిస్తారు. అందుకే ఆ గ్రామం గురించి తెలిసున్న అధికారులందరూ కూడా ఆమెని ఆ ఊరి మహిళలందరి ప్రతినిధిగా చూస్తారు, గౌరవిస్తారు. అటువంటి పరంజ్యోతి కాసేపటికి వస్తూనే ‘ఈసారి మన భవాని దుమ్ములేపేలా ఉంది, ఫంక్షన్‌కి లక్షకి తక్కువ కాకుండా లెక్కలేస్తోంది. గ్రూప్ నించి లోను తీసుకోవాలని అనుకుంటోంది. తన గ్రూప్ సభ్యులందరూ సహకరించాలి’ అంది. ‘ఐదుగురం ఇక్కడే ఉన్నాం, భవాని కాక ఇంకా నలుగురు.. వాళ్ళకి మేము చెప్తాములే వదినా’ అంది లక్ష్మి.
ఇంతలో దేవి అందుకుని ‘భవాని కూతురు మెచ్యూర్ అయ్యిందని, ఫంక్షన్ చేయాలనుకుంటున్నారని అర్ధమయ్యింది. కానీ ఈ ఆకుల లెక్కేంటి? అది నాకు అర్ధంకాలేదు’ అంది. అమ్మాయి మెచ్యూరయితే మేనమామ తాటిచెట్టునించి పచ్చటి తాటాకులు కొట్టి తెస్తాడని, అమ్మాయిని కూర్చోబెట్టడానికి ఆడవాళ్ళు వాటిని ఇంట్లో ఒకమూలగా దొంతరగా పేరుస్తారని, ఎన్ని రోజులు కూర్చోబెట్టాలని అనుకుంటే అన్ని ఆకులు వేస్తారని, వాటిపైన తెల్లటి బట్ట మెత్తగా ఉండేలా పరుస్తారని, స్నానం చేయించే వరకూ అమ్మాయి అక్కడే కూర్చుంటుందని చెప్పింది రమ. ఇప్పుడు అందరం బియ్యం, పసుపు వేసొచ్చాం కదా, ఇవ్వాళ వాళ్ళమ్మ పులగం వండి బెల్లంతో పాటు పెడుతుంది, రేపటినించి మేమందరం పిల్లకి ఇష్టమైనదేంటో తెలుసుకుని కూర్చోపెట్టినన్ని రోజులు స్వీట్లు చేసిపెడతాం. తినడానికి ఏదైనా సరే కారం, నూనె లేకుండా చేసిపెట్టాలి.. ఇలా ఒక్కొక్కరూ చెప్పుకుంటూ పోతున్నారు. ‘కూర్చున్నన్ని రోజులు ఆ పిల్ల మగాళ్ళని చూడకూడదు, మగాళ్ళ కంట పడకూడదు’ అంది చిట్టెమ్మ. ‘చివార్న స్నానం చేయించినప్పుడు ఆ ఆకులు, దానిపైన వేసిన బట్ట, ఆమె వాడినవి అన్నీ కాల్చేస్తాం’ అన్న లక్ష్మి మాటకి కొనసాగింపుగా అన్నట్టు, ‘ఇప్పుడు మారిపోయింది, అన్నీ అరువు తెచ్చుకున్న పనులు, గొప్పలు.. అవన్నీ మేమే చేస్తున్నాం కానీ, ముందైతే ఐదు రోజులకి ఆ అమ్మాయే అవన్నీ కాల్చేశాక, ఆమెని గోతిలో కూర్చోబెట్టి, వొళ్లంతా పసుపురాసి, వేడినీళ్ళతో గట్టిగా స్నానం చేయించి, కొత్తబట్టలు కట్టించి అమ్మతల్లి దగ్గరకి తీసుకెళ్ళి దండం పెట్టించి తెచ్చేవాళ్ళం. ఆ తర్వాత పెద్దోళ్ళందరూ ఆ పిల్ల నెత్తిమీద పచ్చబియ్యం వేశాక కోళ్ళు కోసి అందరికీ అన్నం పెట్టేవాళ్ళు. ఆ రోజు వేరే ఊళ్ళల్లో ఉన్న దగ్గరి చుట్టాలని పిలిచేవారు. అందరం సరదాగా పాటలు కూడా పాడేవాళ్ళం, వరసైన వాళ్ళ సరసాలకి ఇక అంతుండేదనుకుంటున్నావా…’ మొఖం మీద ఒకరకమైన వెలుగు, గొంతులో మైమరపుతో చెప్పింది వయసుమళ్ళిన బుల్లియమ్మ. ‘నువ్వు పెద్దమనిషయ్యాక మా మామ ఆడిన సరసం గుర్తొచ్చింది కదా అత్తా’ అని జ్యోతి అనగానే అందరూ నవ్వి ఆటపట్టిస్తూ తలా ఒకమాటా జోడించారు సరదాగా.
‘అంతా బానే ఉంది కానీ భవానీ లక్ష వరకు ఖర్చు పెట్టాలని అనుకుంటోదని అన్నారు కదా, తనకు అంత ఆర్ధిక పరిస్థితి ఉందా? ఈ ఫంక్షన్‌కి అంత ఖర్చు పెట్టే బదులు దగ్గరి వాళ్ళ వరకు తక్కువలో చేసుకుని, ఆ డబ్బుని పాప పేరుమీద ఫిక్సెడ్ చేస్తే మంచిది కదా!’ అంది దేవి. ‘అందరూ చేస్తున్నారు కదా మేడమ్, అప్పో సొప్పో చేసి మేము కూడా చేయాల్సిందే, లేకపోతే మాకు చిన్నతనం కాదా?’ అని ఒకరు, ‘ఆడపిల్లల తల్లులం, ముందునించే ఆలోచనుంటుంది, పొదుపు డబ్బు ఇలాంటి ఫంక్షన్ కోసం, పెళ్ళి కోసం ప్లాన్ చేసుకుంటాము’ అని ఇంకొకరు, ‘ఏజన్సీలో ఉన్నాం కాబట్టి మేము వెనుకబడి ఉన్నాం కానీ, మీటింగులకి, ట్రైనింగులకి వెళ్ళినప్పుడు వింటున్నాం, మేమూ తెలుసుకుంటున్నాం’ అని మరొకరు, ఈ మధ్యే మావాళ్ళ ఇంట్లో పాప పుడితే పేరు పెట్టేటప్పుడు యాభైవేలు ఖర్చు పెట్టారు. ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో ఊర్లో అమ్మాయికి ఓణీ ఫంక్షన్‌కి ఎనభై వేలకిపైనే ఖర్చుపెట్టారు. మెచ్యూర్ ఫంక్షన్‌కి లక్ష ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదులే. మనం కూడా ఎదగాలిగా, అలవాట్లూ మార్చుకోవాలి, డబ్బుతోనే విలువ, ఖర్చు పెడితేనేగా ఉందని తెలిసేది.. ఇలా ఒకరిని మించి ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. వారి దృష్టిలో అభివృద్ధి అంటే ఇదేనా అని లోలోపల మధన పడుతూ మౌనంగా వింటోంది దేవి.
ఆడవాళ్ళంతా నవ్వుకుంటూ గోలగోలగా మాట్లాడుకుంటుంటే అక్కడే వాలీబాల్ ఆడుకుంటున్న యువకులు నలుగురైదుగురు ఆసక్తిగా వచ్చి నిలబడి వింటున్నారు. వాళ్ళల్లో ఒకతను ‘ఈ మధ్యనే మా చెల్లి మెచ్యూర్ అయితే ఫంక్షన్ చేశాము. ఏజన్సీలోనే కాదు, దూరం ఊళ్ళల్లో ఉన్న మావాళ్ళందరినీ పిలిచి డిన్నర్ ఇచ్చాము. అందరూ సంతోషంగా తిని వెళ్ళారు. లక్షపైనే ఖర్చు అయింది. నాన్న లేడన్న లోపం తప్పించి చాలా బాగా జరిగింది’ ఉత్సాహంగా చెప్పాడు. ‘అవును మేడమ్, చాలా బాగా అయ్యింది. యూట్యూబ్‌లో చూసి చీర, దానికి మ్యాచింగ్ నగలు, మేకప్ సామాను సిటీ నుంచి తెప్పించి పాపని అందంగా తయారు చేసింది అరుణ. ఫోటోలు ఎంత బాగా వచ్చాయో! ఆ స్టూడియో వాళ్ళు పాప ఫోటో పెద్దది చేసి పెట్టారంట. చూసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు’ జోడించింది శ్యామల.
చిన్నగా నవ్వి ‘నాన్నకేమయ్యింది?’ ఆ అబ్బాయిని అడిగింది దేవి. ‘బండి మీద వస్తుంటే ఆక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. నాన్న లేని లోటు కనబడకుండా అన్నీ నేనే చూసుకున్నాను’ అన్నాడు. ‘అంత డబ్బు ఎక్కడిది? ఇన్షూరెన్స్ వచ్చిందా?’ అడిగింది దేవి. ‘ఇన్షూరెన్స్ లేదు, ఏమీ లేదు. అమ్మ పొదుపు సంఘంలో ఉంది, సంఘంలో లోను తీసుకుంది. దాంతో ఫంక్షన్ చేశాము, అందరూ మెచ్చుకునేలా గ్రాండ్‌గా చేశాము. అలా సిటీలో జరుగుతుందట, అక్కడనుంచి వచ్చిన మావాళ్ళు అన్నారు’ గొప్ప పని చేసినంత సంతోషంతో, గర్వంగా చెప్పుకొచ్చాడు. ‘నువ్వేం చేస్తున్నావ్?’ దేవి ప్రశ్న. ‘ఇంటర్లో చదువాపేశాను, ఉపాధి పనికి వెళ్తున్నాను, కొంచెం జీడిమామిడి తోట ఉంది, అవసరమైనప్పుడు అమ్మతో పాటు అందులోనూ పనిచేస్తాను, అప్పుడప్పుడూ కూలిపనికి కూడా వెళ్తాను. హ్యాపీ’ అన్నాడు. లోనుకి కడుతున్నావా అన్న ప్రశ్నకి ‘వాడి సంపాదన వాడి గర్ల్ ఫ్రెండ్‌కి, వాడి సరదాలకే సరిపోదు’ అంటూ నవ్వింది శ్యామల. ‘అక్కా నువ్వాగు’ అంటూ, ‘అయినా అది అమ్మ గ్రూప్‌లోను, దాన్ని నేనెలా కడతాను, అది నెల నెలా పొదుపుతో పాటు అమ్మే కడుతుందిగా!’ ఇది కూడా తెలవదా అన్నట్టుంది ఆ గొంతు. ‘నువ్వేమన్నా సంపాదించి మీ అమ్మకిస్తే దాన్ని కూడా కలిపి కట్టేస్తుందిగా, బరువు తగ్గుతుంది. ఇప్పుడేమో ఇల్లు గడపాలి, నీ చెల్లిని చదివించాలి, పొదుపు కట్టాలి, లోను కూడా తీర్చాలి. ఎక్కడ తెస్తాదిరా మీ అమ్మ’ కసిరింది పరంజ్యోతి. ఆశ్చర్యంగా వింటూ, అయోమయంగా చూసి తల దించుకున్నాడు. ‘ఇలాగే ఉన్నారు ఈ మగపిల్లలంతా, తాగడం, బైకులేసుకుని ఆక్సిడెంట్లు చేయడం, గంజాయి కేసుల్లో ఇరుక్కోవడం, లేనిపోని తలనొప్పులు తెప్పించడమే కానీ ఉపయోగపడేది ఒక్కపనీ చెయ్యరు..’ దాదాపు అక్కడున్న మహిళలంతా అదే మాట. దాంతో అక్కడ చేరిన నాలుగురైదుగురు కుర్రాళ్ళు మెల్లగా జారుకున్నారు.
‘అందరిదీ ఇలాంటి పరిస్థితే అయినప్పుడు మరి అంతంత అప్పులు తీసుకుని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టే కంటే దాన్ని ఏదైనా వ్యాపారానికో, ఆర్ధిక కార్యక్రమం చేసుకోడానికో ఉపయోగిస్తే మెరుగైన జీవనోపాధి దొరకడంతోపాటు ఆర్ధిక పరిస్థితి మెరుగౌతుంది కదా! అది కూడా ఐదారుగురు కలిసి సంఘటితంగా చేసుకుంటే ఒకరి మీదే భారం పడకపోగా దళారీల సమస్య ఉండదు, మార్కెట్ రేటుకి అమ్మగలుగుతారు, అది అందరికీ లాభదాయకంగా ఉంటుంది కదా! ఆలోచించండి’ అంది దేవి. ‘అవన్నీ మాకెక్కడొస్తాయి. దళారీలు మా తోటల దగ్గరికి వచ్చి పెట్టుబడి ఇస్తేనే మేము పండించగలుగుతున్నాము, పంట చేతికొచ్చినప్పుడు వాళ్ళే వచ్చి కొనుక్కుపోతారు కనక మేము మార్కెట్లు పట్టుకుని తిరగక్కరలేదు. అక్కడికి పోతే కొండోళ్ళని మమ్మల్ని మోసం చేయడానికే చూస్తారు, సరైన రేటు కట్టరు. చిన్నప్పటినించి చూస్తున్నాం. మాకు కష్టాలు కొత్త కాదు కానీ ఇలాంటి ఫంక్షన్ల వల్ల మేమేమీ తక్కువ కాదు, మేము కూడా గ్రాండ్‌గా చేయగలం, ఎవ్వరికీ తీసిపోమన్న నమ్మకం వస్తుంది, సంతోషం మిగులుతుంది. అది చాలు మాకు’ పదిమందిదాకా మూకుమ్మడిగా అన్నారు. కానీ పరంజ్యోతితోపాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఆలోచనల్లో పడడం దేవి గమనించకపోలేదు. అది చాలు దేవికి వాళ్ళని మెరుగైన దిశగా ఆలోచింపచేయడానికి, సంఘటితంగా జీవనోపాధి కార్యక్రమాలు చేసుకునేలా ప్రభావితం చేయడానికి. దానికోసం అప్పుడే ఒక ప్రణాళిక ఆమె మనసులో రూపుదిద్దుకుంది. కానీ ఇప్పుడు ఎదురుగా, నిఠారుగా నిలబడ్డ ప్రశ్న ఇంకా లోతైనది, బలమైనది.
ప్రస్తుత ఆదివాసీ అభివృద్ధి నమూనాకి ఏది మూలాధారం? ఆ అభివృద్ధిని అంచనా వెయ్యడానికి ఏది కొలబద్ద?
అసలు ఆదివాసీ ఐడెంటిటీని నిలబెట్టుకోడానికి పూర్వంనించి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలని కొనసాగించాలా లేక జనజీవన ముఖ్యధార పేరుతో మైదాన ప్రాంతాలలో, పట్టణాల్లో పాటించే మనది కాని వాటిని అలవాటు చేసుకుని మారిపోవాలా? అలా మారిపోయినప్పుడు మరి ఆదివాసీ సంస్కృతి, గుర్తింపు వదిలేసుకోవడం తప్పదా? ఒకపక్క జానపదుల, ఆదివాసీల జీవన విధానం చూపించి పర్యాటకుల్ని ఆకర్షించడం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికే అంటున్నా, ఇంకోపక్క వారివి అనాగరికమైన వెనకబాటు ఆచారాలు అంటూ వారి జీవనశైలినే మార్చేయాలంటున్న వారిది ద్వంద్వ వైఖరి కాదా? డిగ్రీలు చదువుకుని, ఉద్యోగాల వేటలోనో, ఉపాధి పేరుతోనో బయటికెళ్ళి వేషభాషలు, ఆహార అలవాట్ల తేడాతో అక్కడ ఇమడలేక, హేళనకి గురయ్యి, అమాయకత్వంతో మోసపోయి వెనక్కి వచ్చేస్తున్న యువత పరిస్థితి ఏంటి? ఆర్ధికాభివృద్ధి పేరుతో లోన్లు ఇప్పించినా వాటిని సుస్థిర జీవనోపాదులకో, వ్యాపారవేత్తలుగా ఎదగడానికో ఉపయోగించుకోడంపై దృష్టి పెట్టకపోవడంతో ఆ డబ్బుని ఇంటి అవసరాలకో, వస్తువులు కొనడానికో, ఫంక్షన్లు చేయడానికో ఖర్చు పెట్టేసి, అప్పు తీర్చే భారం మహిళలపైనే పడి, కడుపు కట్టుకుని, కాలు చెయ్యి కూడగట్టుకునే విరామం కూడా లేకుండా రోజుకి రెండేసి, మూడేసి కూలీలు చేయాల్సి రావడంతో అది పెద్ద గుడిబండగా మారుతున్న పరిస్థితిని ఎలా అర్ధం చేసుకోవాలి?
