తెలుగు ప్రాంతంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గానే కాకుండా, గణిత శాస్త్రంలో దిట్టగా పేరు గాంచిన వనజా అయ్యంగార్ 1987లో ‘పద్మశ్రీ’ అందుకున్నారు. అందం, ప్రతిభ, అత్యున్నత మానవీయ విలువలతోపాటు గణితం మీద ప్రేమ కలగలిసిన రూపమే వనజా అయ్యంగార్ అని ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. పి.ఎం. భార్గవ కొనియాడారు.
వనజ పసిబిడ్డగా ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు. తండ్రి కె.పద్మనాభ అయ్యంగార్ సొంత ఊరు నెల్లూరు. ఆయన మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రి చేసిన తర్వాత నిజాం ప్రభుత్వంలో అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఉద్యోగం కోసం వచ్చి ఎన్నో బదిలీలను చూసి తెలంగాణలో ఉండిపోయిన వ్యక్తి. తన ఏడేళ్ల వయసులో ఇంటికెదురుగా ఉండే మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో చేరారు. చిన్న వయసులోనే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలను అర్థం చేసుకుని, ఆనందించే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నారు. పెద్ద అక్క కనకవల్లి చిన్నతనంలోనే భర్తను కోల్పోయి పుట్టింటిలోనే ఉంటూ తన పిల్లలతో పాటు వనజను కూడా సాకింది. కనకవల్లి కాంగ్రెస్ కార్యకర్తగా కూడా పనిచేసేవారు. ఈ కారణంతోనే వనజకు చిన్నతనంలోనే మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, మేల్కోటే వంటి ఎందరో పెద్దలను దగ్గరగా చూడ్డం, వారితో మాట్లాడ్డం సాధ్యమైంది. కృష్ణదేవరాయ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమాలలో వనజ హాజరయ్యేవారు. అలా సమావేశాల కారణంగా మహాత్మా గాంధీజీని వినడం, పండిట్ నెహ్రుకు రైల్వే స్టేషన్ లో స్వాగతం చెప్పడం జరిగింది. తండ్రి ఉద్యోగం కారణంగా వచ్చిన బదిలీల వల్ల ఆమె చదువు చాలా పాఠశాలల్లో సాగింది.
ఉర్దూ బోధన భాషగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాలేజీ ప్రవేశం కోసం తండ్రి పద్మనాభ అయ్యంగార్ వద్దనే వనజ ఉర్దూ భాషను నేర్చుకున్నారు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెష్ హోల్డ్‌లో నడిచే ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చేరారు. కేంబ్రిడ్జ్ నుంచి తిరిగి వచ్చిన సరోజినీ నాయుడు కుమార్తె లీలామణినాయుడు ఇంగ్లీషు గొప్పగా బోధించేవారు. ఖాజా మొహినుద్దీన్ అనే మ్యాథమేటిక్స్ లెక్చరర్ కారణంగా గణితంలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంతో ఇంగ్లీషు, గణితశాస్త్రం పట్ల ఎనలేని అభిరుచి కలిగింది. సరోజినీ నాయుడు మేనకోడలు తనకు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్, మంచి స్నేహితురాలు. ఈ కారణంతో సరోజినీ నాయుడుతో సన్నిహితంగా మెలిగే అవకాశం కూడా వనజకు దొరికింది. బెర్నాడ్ షా రాసిన ‘ఇంటిలిజెంట్ ఉమెన్స్ గైడ్ టు సోషలిజం’ అనే పుస్తకం కారణంగా వనజలో సామ్యవాదపు ఆలోచనలు, మార్క్సిజం ధోరణుల మొలకలెత్తాయి. దీనికి 1947-49 మధ్య కాలంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదవడం మరింత పుష్టిని కలిగించింది. ఫిజిక్స్ చదివిన అన్న (ఆయనే ప్రొఫెసర్ కె.ఎస్. అయ్యంగార్) సలహా మేరకు ఇంగ్లీష్ లిటరేచర్‌లో కాకుండా మ్యాథమెటిక్స్ వైపు ఉన్నత విద్యను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ లిటరేచర్, మ్యాథమెటిక్స్‌లలో ప్రథమ స్థానంలో నిలవడం వల్ల కేంబ్రిడ్జ్‌లో మ్యాథమెటిక్స్ చదివే అవకాశం కలిగింది. అక్కడే ఎంతో మందితో పాటు మోహిత్‌సేన్ కూడా పరిచయమయ్యారు. వామపక్ష పార్టీ నాయకుడిగా, ప్రముఖ రచయితగా తర్వాతి కాలంలో పేరు గాంచిన మోహిత్ సేన్ తో కేంబ్రిడ్జిలోనే కలిగిన పరిచయం వివాహానికి దారితీసింది. కేంబ్రిడ్జ్ లో చదివే కాలంలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ సభ్యత్వం కారణంగా వనజా అయ్యంగార్ అంతర్జాతీయ విద్యార్థుల సమూహాలతో సఖ్యత పెరిగి యుగస్లోవాకియా, జకొస్లోవాకియా, హంగేరి వంటి దేశాలను సందర్శించడంతో విద్యార్థులు, మహిళలకు సంబంధించిన అవగాహనను పెరిగింది.
‘ఎ ట్రావెలర్ అండ్ ది రోడ్డు జర్నీ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్టు’ (A A Traveller and the Road: A Journey of an Indian Communist) పేరుతో మోహిత్ సేన్ తన స్వీయచరిత్రలో తమ తొలి పరిచయం, అది గాడమైన స్నేహంగా మారి తర్వాత వివాహంగా పరిణమించడం గురించి చెబుతూనే, ఈ రచనకు ప్రధాన కారణం తన భార్య వనజా అయ్యంగారని, ఆమె పాత్ర విశేషమైందని శ్లాఘిస్తారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి 1950లోనే చైనా వెళ్లారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శిగా పనిచేసినా, వనజా అయ్యంగార్ రాజకీయాలలో కాకుండా గణితశాస్త్రంలోనూ, విద్యారంగంలోనూ కీలకమైన కృషి సలిపారు.
1950లో హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సిలోకి మారిన ఉమెన్స్ కళాశాలలో మ్యాథమేటిక్స్ లెక్చరర్‌గా చేరారు. భర్త మోహిత్ సీన్ కమ్యూనిస్టు పార్టీ బాధ్యతల కారణంగా ఎక్కువకాలం ఢిల్లీలోనే ఉండేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రెండేళ్లు సెలవు తీసుకుని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆర్. ఎస్. మిశ్రా దగ్గర ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం సంబంధించి పి హెచ్ డి పరిశోధన ప్రారంభించారు. అక్కడ రెండో సంవత్సరంలో పరిశోధన చేస్తున్నప్పుడు ఇటలీ నగరమైన రోమ్‌లో ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఫెలోషిప్ లభించి ఒక సంవత్సరం పాటు ప్రొఫెసర్ సిగర్ (Pతీశీf. Sవస్త్రతీవ), ప్రొఫెసర్ బొంపైని (Pతీశీf. దీశీఎజూఱaఅఱ) వద్ద పరిశోధన కొనసాగించారు. అక్కడ ఇటలీ భాష కూడా నేర్చుకున్నారు. పరిశోధకపట్టా తీసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నిజాం కాలేజీకి, అటు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి బదిలీ అయ్యారు. మహిళలకు సరైన పరిశోధనావకాశాలు లేని కాలంలో మ్యాథమెటిక్స్ విభాగంలో అటువంటి వాతావరణం నెలకొనేట్టు ఆమె చేసిన కృషి విశేషమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరీక్ష విధాన ప్రక్షాళనా కార్యక్రమం జస్టిస్ పి. జగన్మోహన్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా మొదలైనప్పుడు వనజా అయ్యంగార్ చాలా చురుకుగా తోడ్పడ్డారు. తర్వాత 1973 నుంచి 1982 వరకు యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్, కోఠి ప్రిన్సిపల్‌గా సేవలందించారు.
ఓ తెల్లవారుజామున సమాచారం తెలిసింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనను కలవడానికి ఇంటికి వస్తున్నారని. పెద్ద ఆశ్చర్యం! స్త్రీలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పరిస్తే ఎలా ఉంటుందని ఆయన చర్చించినప్పుడు వనజా అయ్యంగార్ తన పద్ధతిలో స్త్రీలకు ప్రత్యేకంగా యూనివర్సిటీ అక్కర్లేదని చెప్పేశారు కూడా. అయితే రామారావు ఏమాత్రం నోచ్చుకోకుండా చాలా విషయాలు చర్చించి, విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు ఆమెనే తొలి వైస్ ఛాన్సలర్‌గా చేశారు. భక్తి తనకు పెద్దగా లేదని తొలుత ఆశ్చర్యపడిన వనజా అయ్యంగార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఆ హోదాలో ఎంతో సేవ చేశారు, ప్రతిష్టను కల్పించారు. తొలి దశలో పాఠ్యాంశాల రూపకల్పన, అధ్యాపక వర్గాల నియామకం, గ్రామీణ స్త్రీలకు సైతం ఎలా విద్యనందించాలి… వంటి విభాగాలలో చేసిన కృషి విశేషమైనది.
బోధన, పరిశోధనలలోనే కాదు; నిత్య వ్యవహారాలలో సైతం వనజా అయ్యంగార్ ఎంతో చాకచక్యంగా ఉండే వారని, అర్థవంతంగా నెగిటివ్ రిప్లే కూడా ఇచ్చి సమాధానపరిచే సామర్థ్యమామెకు సొంతమని మిత్రులు కొనియాడారు. ఆమె గణిత శాస్త్ర బోధన గురించి డా. పి.ఎం.భార్గవ ‘వనజ రీమెంబరెన్స’ సంచికలో, “తనకు యూనివర్సిటీలో చదివే కాలంలో సమాధానం దొరకని dఞ/dy అంటే ఏమిటి, పార్షియల్ డిఫరెన్సీయేషన్ అంటే ఏమిటి… వంటి ప్రశ్నలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన వనజా అయ్యంగార్ ప్రసంగంలో సమాధానాలు లభించి బయాలజీ పరిశోధనకి సంబంధించి తన అవగాహనను పూర్తిగా మార్చిందని ప్రస్తుతించారు. నవనీత్ రావు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా కూడా ఐదు ఆరు నెలలు సేవలందించారు. తాను తలుచుకుంటే, వైస్ ఛాన్స్లర్ కుర్చీ ఇట్టే తీసేయగలనని ఒక మంత్రి గారి పి.ఎ. వ్యాఖ్యనిచ్చినప్పుడు; దానికి తనువుకోకుండా, తగినట్టుగానే, ఘాటుగా జవాబు చెప్పిన ధీర కూడా ఆమె. అనారోగ్యంతో ఉన్న పని మనిషిని ఆసుపత్రికి తన కారులో తీసుకెళ్లిన సహృదయత వనజా అయ్యంగార్ది. కోఠి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆమె వెళ్లిపోయిన సందర్భంలో తనకు సేవలందించిన సిబ్బందికి కంచి పట్టుచీరలు బహుకరించారని అప్పట్లో ప్రచారం ఉండేది.
ఆంధ్రమహిళ సభ జీవితకాలపు ట్రస్టీగా, 1994 నుంచి ఆ సంస్థ అధ్యక్షులుగా మహిళల సాధికారతకు సంబంధించి మాత్రమే కాకుండా మహిళా లోకానికి కంప్యూటర్ విద్య కూడా చేరేట్టు ‘ఆంధ్రమహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స’ ను ప్రారంభించారు. వినోబా స్థాపించిన “ఆచార్య కుల” హైదరాబాద్ శాఖలో జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి అధ్యక్షులుగా ఉన్న కాలంలో; అలాగే ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెసు సభ్యులుగా వైద్యనాథన్ హయాంలో వనజా అయ్యంగార్ గణనీయమైన సేవలు అందించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వీరిని ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించమన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయ మహిళల ప్రవేశం ఎదుగుదల వంటి వాటిని పరిశీలించినప్పుడు, గణిత మహిళా విజ్ఞానవేత్తలకు మరింత అన్యాయం జరిగిందనిపిస్తుంది. 1999 డిసెంబర్ 23న గతించిన ప్రొ. వనజా అయ్యంగార్తో సహా ‘లీలావతీస్ డాటర్స’,
‘ఉమెన్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియా’ వంటి పుస్తకాల్లో ఒక్క మహిళాగణిత శాస్త్రవేత్త గురించి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
(ప్రముఖ పాపులర్ సైన్స్ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు)
