డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో కూడా తరగని ఉత్సాహం ఆమెది. అలుపెరగని ప్రయాణం ఆమెది. కౌమారం నుంచి నేటి దాకా చెదరని ఆత్మవిశ్వాసం ఆమెది. కులం గోడలను బద్దలు కొట్టడానికి ఆమె నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరణం తర్వాత కూడా మళ్ళీ జీవించవచ్చని అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు ఎల్లవేళలా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె ఎవరో కాదు, గుత్తా జ్యోత్స్న. భూమిక పాఠకులతో తన జీవిత విశేషాలను ఇలా పంచుకున్నారు.
ప్ర. నమస్తే అక్కా! బాగున్నారా?
జ. నమస్తే గిరిజా! బాగున్నాను. రండి, కూర్చోండి. ఏమిటీ ఇంత దూరం వచ్చారు?
ప్ర. భూమిక పత్రికకు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
జ. సంతోషం.. సత్యవతిగారు నాకు బాగా తెలుసు. భూమికకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా గర్వంగా ఉంటుంది. మీకేం కావాలి? అడగండి.
ప్ర. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
జ. నా కుటుంబ నేపథ్యం అంటే స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి చెప్పాలి. మా పెద్దనాన్నలు నలుగురూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. అందులో ఒక పెద్దనాన్న అండమాన్ జైలు జీవితాన్ని కూడా గడిపారు.
ప్ర. మీ కుటుంబంలోని స్త్రీలు కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారా?
జ. మా మేనత్త రాజరత్నమ్మ, సుందరమ్మ పెద్దమ్మ పాల్గొన్నారు. మా పెద్దమ్మ సుందరమ్మ రాయవెల్లూరు జైలులోనే మరణించింది. జైలులో ఉన్నప్పుడు ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. ఇంటికి వెళ్ళండని జైలు అధికారి పలుమార్లు సూచించారట. “స్వాతంత్య్రం రాకుండా నేను ఇంటికి వెళ్ళనని “ అక్కడే మరణించింది.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. మా నాన్న పేరు సుబ్రమణ్యం. ఆయన తన చిన్నతనం నుంచే మా తాతగారు గుత్తా చిన్న నర్సయ్యతో కలిసి వ్యవసాయం చేసారు. కమ్యూనిష్టు పార్టీ ఉద్యమాల్లో పనిచేసేవారు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి లాంటి వాళ్ళతో మంచి సంబంధాలు ఉండేవి. చల్లపల్లి జమీందార్ దగ్గరి బంధువును కమ్యూనిష్టులు చంపేసారని తెలిసి పోలీసులు నాన్నను అరెస్టు చేయడానికి వస్తున్నారని తెలిసి, కట్టుబట్టలతో కుటుంబ సభ్యులతో ఆ రోజు రాత్రి స్మశానంలో తలదాచుకొని, మరునాడు మహారాష్ట్రలోని గాంధీó ఆశ్రమమైన సేవాగ్రాంకు చేరుకున్నారు. అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రానికి మేనేజర్‌గా పనిచేశారు. గుంటూరు నుంచి పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే గాంధీ స్నేహితుడైన నాయకంజీ అడ్డుకున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన వారు. మాకు స్వేచ్ఛను ఇచ్చారు. అందుకే మేమందరం బాగా స్థిరపడగలిగాం. తాను స్వయంగా కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా తన అన్న కూతురికి, స్నేహితులకు, మా అందరికీ కులాంతర వివాహాలు జరిపించారు. మా యింట్లో దేశాంతర వివాహం కూడా జరిగింది. మా తమ్ముడు క్రాంతి చైనా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.
ప్ర. మీ అమ్మగారి గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు జవహర్బాయి. గుంటూరు జిల్లాలోని పెద్ద పులివేరు గ్రామం. వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. జగదీశ్ చంద్ర బోసును కలవడానికి తరచూ కలకత్తా వెళ్ళేవారు. ఆయన మీది అభిమానంతో మా అన్నయ్యకు ఆయన పేరు పెట్టుకున్నారు. నేను పుట్టిన తొమ్మిది రోజులకే పచ్చి బాలింత అయి ఉండి కూడా నెహ్రూ ప్రసంగం వినడానికి వెళ్లిందట. గృహిణి, కానీ బాగా చదువరి, తెలివైనది. ఇపుడు ఆమెకు నూటామూడు సంవత్సరాలు. మంచి ఆరోగ్య స్పృహ కలిగిన మనిషి. కష్టజీవి, ధైర్యస్థురాలు. కమ్యూనిష్టు సమావేశాలకు ఆమె కూడా వెళ్ళేది. అమ్మానాన్నలది ఆదర్శ, కులాంతర వివాహం. అందుకే ప్రత్యేకించి అమావాస్య రోజు వాళ్ళ పెళ్ళి జరిగింది.
ప్ర. మీరేమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ. నా చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. అందువల్ల నన్ను ఆలస్యంగా బడికి పంపారు. నాన్నగారి అన్నయ్యలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉండడం వల్ల కుటుంబం బాధ్యత ఆయన మీద పడింది. ఆ రోజుల్లో జైల్లో ఉన్న వాళ్ళను విడిపించాలంటే పన్ను కట్టాలి. అందుకొరకు వాళ్ళ అమ్మ (గుత్తా లలితమ్మ) నగలు, భూములు, మిగతా ఆస్తులు అన్నీ కరిగిపోయాయి.
ప్ర. మీ పుట్టుక, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. నేను మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ‘సేవాగ్రామ’ గాంధీ ఆశ్రమంలో తేది 1/7/1952న పుట్టాను. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. మేం మొత్తం ఆరుగురు తోబుట్టువులం. చిన్న తమ్ముడు క్రాంతి కూతురు గుత్తా జ్వాల జాతీయ బ్యాట్ మెంటన్ క్రీడాకారిణి.
ప్ర. మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను ఏకంగా ఐదో తరగతిలో బడిలో చేరాను. అప్పటి వరకూ అమ్మ ఇంట్లో చదువు చెప్పింది. అమ్మానాన్నలకు మమ్మల్ని బాగా చదివించాలని ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. నాన్న స్నేహితుడి ద్వారా నెల్లూరులోని వాకాడులో ఒక రెసిడెన్సియల్ స్కూల్లో మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం చేరాం. నేను చురుకుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. విద్యార్థి నాయకురాలిగా కూడా ఎన్నికయ్యాను. నాకు సైన్సు సబ్జెక్టు పట్ల ఆసక్తి ఎక్కువ. ఉన్నత చదువులు ఆ దిశగానే సాగాలనుకున్నాను. కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించనందువల్ల తెలుగు విద్వాన్ చేసాను. ఇది నాలుగు సంవత్సరాల కోర్సు. ఆ కాలమంతా బాధపడ్డాను. ఎందుకంటే.. నా నరనరాన హేతువాదం జీర్ణించుకొని ఉంది. కానీ తెలుగులో పుక్కిటి పురాణాలు చదవాల్సిన దౌర్భాగ్యస్థితి ఏర్పడింది. కానీ కాలేజీ గ్రౌండ్లో టెన్నికాయిట్, త్రోబాల్ బాగా ఆడేదాన్ని. తెలుగు పండిట్ శిక్షణ హైదరాబాదులోని ఆంధ్రసారస్వత పరిషత్తులో పూర్తి చేసాను. అపుడే నాకు పి.డి.ఎస్.యులో చేరాను.
ప్ర. మీ పాఠశాల స్థాయిలో జరిగిన ప్రత్యేక సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
జ. నాకు పాఠశాలలో గణితంలో మంచి మార్కులు రాకపోయేది. మా లెక్కల టీచరు సుశీలమ్మ నా కన్నా పొట్టిగా ఉండేది. నాకు మంచి మార్కులు తెప్పించడానికి నన్ను ఎగిరెగిరి కొట్టేది. నన్ను మొదటి బెంచిలో కూర్చోబెట్టి నాపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెప్పి, నేను పదో తరగతిలో స్కూల్ ఫస్టు వచ్చేలాగా నన్ను తీర్చి దిద్దింది. మరో సంఘటన.. నేను విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యాను. ఇక్కడ ఒక సంఘటన గురించి మీకు చెప్పాలి. మా స్కూల్ మొత్తంలో ఒక అమ్మాయి చాలా దురుసుగా ప్రవర్తించేది. అందరి మీద పెత్తనం చేసేది. అనవసరంగా అందరినీ విసిగించేది. ఒకసారి భోజనం చేసాక నేను చేయి కడుగుతుంటే ఆ అమ్మాయి చేయి అడ్డంగా పెట్టింది. ఎంగిలి చేయిపైన పెట్టిందని ఆ అమ్మాయిని ఎడాపెడా కొట్టాను. అప్పటికే ఆ అమ్మాయితో అందరూ విసిగిపోయి ఉన్నారు. కాబట్టి నేను కొట్టినందుకు నన్ను చాలా అభినందించారు. విద్యార్థి నాయకురాలిగా వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేదాన్ని.
ప్ర. మీ పెళ్ళి, ఉద్యోగ వివరాలు చెప్పండి.
జ. నా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి అయ్యాక హైదరాబాదులోని సుజాతా స్కూల్లో కొంతకాలం పనిచేసాను. అపుడే కులనిర్మూలన సంఘ పెద్దలు జె. వీరాస్వామి, టి. నారాయణ, డి.జి రామారావు, నా తల్లిదండ్రుల సమక్షంలో నాకు సాయిలుతో ఆదర్శ, కులాంతర వివాహం జరిగింది. ఆయన ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసేవారు. నిజామాబాదులో మా పెళ్లి ఒక సంచలనం. మా అత్తగారు నన్ను బాగా చూసుకునేవారు. మాకు పిల్లలు లేరు. ఆ తర్వాత నిజామాబాదులో ప్రభుత్వ పాఠశాల టీచరుగా తేది 27/11/1978లో చేరాను. ఓ వైపు ఉద్యమాలు, ఉద్యోగం, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. ఆ రోజుల్లో నిజామాబాదులో స్కూటర్ నడిపిన తొలి మహిళను నేనే. చాలా మంది అభిమానంతో ఆశ్చర్యంగా చూసేవారు.
ప్ర. నిజమాబాదులో మీరు చేసిన సామజిక సేవా కార్యక్రమాల గురించి వివరించండి.
జ. నిజామాబాదులో నేను కుల నిర్మూలన సంఘం, హేతువాద సంఘాలను స్థాపించి వాటికి అధ్యక్షురాలిగా పనిచేసాను. జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలను చైతన్యపరిచాను. ఎందరికో కులాంతర ప్రేమ వివాహాలు జరిపించాను. దానివల్ల వచ్చిన ఉత్సాహంతో అభ్యుదయ మహిళా సంఘాన్ని స్థాపించాను. అది స్థాపించడానికి నేను ఉపాధ్యాయ శిక్షణలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కూడా కారణం. మహిళలకు ఏ సమస్య వచ్చినా సంఘం నుంచి బాసటగా నిలిచాం. వరకట్న సమస్యలు, వివాహ సమస్యలు, గృహహింస, ఈవ్ టీజింగ్ మొదలైన సమస్యలు, ఆప్రాంతంలో అధికంగా వున్న జోగినీ వ్యవస్థ మీద పనిచేశాం.
ప్ర. అవునా! ఆ సంఘటన ఏమిటో చెప్పండి.
జ. హైదరాబాదులో నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్న రోజుల్లో .. నా చెల్లెలు నిర్మల, నేను ఒక సమావేశానికి వెళ్ళి తిరిగి వస్తుండగా బస్సులో ఒక ఆకతాయి నిర్మలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే! ఒక్కసారిగా నాలో కోపం ఉప్పొంగింది. వాడిని ఎడాపెడా వాయించాను. తర్వాత నాకు భయం వేసింది. వాడు తిరిగి నన్ను కొట్టి ఉంటే..? అప్పుడు నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే.. బస్సులో నేను వాడిని కొడుతుంటే అందరూ చూస్తున్నారేగాని, ఒక్కరు కూడా ఒక్క మాట అడగలేదు. అది నాకు బాధా, ఆశ్చర్యం రెండూ కలిగించింది. ఆ సంఘటన నా మనసులో ఉండిపోయింది. తర్వాత నా అనుభవంతో అలాంటి సంఘటనలను ఒంటరిగా కాకుండా ఒక సంఘంగా ఎదుర్కొంటే బాగుంటుందని అర్థమైంది.
ప్ర. మీరు నిజామాబాదులో ఒక పాఠశాలను స్థాపించారని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. అప్పుడు నేను నా వ్యక్తిగత పరిస్థితుల వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నాను. ఉద్యోగం మానేసి స్కూల్ స్థాపించి నా శేషజీవితం పిల్లల మధ్య ముగించాలని అనుకున్నాను. అందుకే ‘మంజీర కాన్వెంట’ ను స్థాపించాను. ప్రతి ఏడాది ఇద్దరు ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించేదాన్ని. వాళ్ళు సామాజిక కార్యకర్తల పిల్లలై ఉండాలని నియమం పెట్టుకున్నాను. దాదాపు పదేళ్ళు ఆ పాఠశాలను నడిపాను. అయితే నిజమాబాదు నుండి అనివార్య కారణాల వల్ల హైదరాబాదుకు రావలసి వచ్చింది. అప్పుడు మంజీర కాన్వెంట్ను ఇతరులకు ఇచ్చేశాను. అపుడు అందులో 500 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ సమయంలో తాత్కాలిక సెలవు పెట్టమని కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనవల్ల మళ్ళీ నేను ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది.
ప్ర. ప్రభుత్వంలోని వివిధ ప్రాజెక్టులలో పనిచేశారు కదా? ఆ వివరాలు తెలియజేయండి.
జ. అవును, నా కార్యకలాపాలను గమనించిన ప్రభుత్వం డి.ఆర్.డిఏ ప్రాజెక్టులోకి అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా నన్ను 1.8.1993లో నియమించింది. అందులో భాగంగా మహిళలకు, డ్వాక్రా సంఘాలకు ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాం. లంబాడి తండాలకు వెళ్ళి వారికి చెక్కులు అందజేసాను. ఈ ప్రాజెక్టులో నా శాఖకు కేటాయించిన బడ్జెట్ అంతా అనుకున్న దానికంటే ముందే అర్హులైన వారికి అందజేసి, తర్వాత ఎస్. సి కార్పొరేషన్ బడ్జెట్‌ను కేటాయింపజేసుకొని, జోగినీ మహిళలకు వారి పేరు మీదే భూములు కొని రిజిష్టర్ చేయించి ఇచ్చాం. అక్షరాస్యత కార్య క్రమంలో భాగంగా వెనకబడిన ప్రాంతాలలో రాత్రి పదకొండు గంటలదాకా పనిచేసేదాన్ని. అయితే నేను ఏ పని చేసినా నాపై అధికారులుగా ఉన్న అప్పటి కలెక్టర్ చక్రపాణి, ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.ఏ.ఎస్ నీలం సాహ్ని, పార్థసారథి గారలు నన్ను ప్రోత్సహించారు. నీలం సాహ్నితో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.
ప్ర. హైదరాబాదు బస్తీల్లో కూడా మీరు పనిచేసారు కదా? ఆ వివరాలు చెప్పండి.
జ. నా పనితనాన్ని చూసిన అప్పటి జి.హెచ్.ఎమ్.సి కమిషనర్ సోమేశ్ కుమార్ అడిషినల్ కమిషనర్ సుజతారావుకు సిఫారసు చేసి నన్ను ఇపిపి.8 (Iఅdఱaఅ Pశీజూuశ్రీatఱశీఅ Pతీశీస్త్రతీaఎఎవ) లోకి అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా హైదరాబాదులోని సుమారు ఆరు వందల డెబ్భై బస్తీల బాధ్యతను నాకు అప్పగించారు. అందులో ఐదేళ్ళు పనిచేసాను. అందులో భాగంగా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, వైద్యం, కుటుంబ నియంత్రణ, పల్స్ పోలియో మొదలైన అంశాల మీద పనిచేసాను. అప్పుడు డా. మమతా రఘువీర్, నర్జీస్ లాంటి అనేకమంది ప్రభుత్వ వైద్యాధికారుల మధ్య అనేక సమావేశాలు, శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. తమ మతాచారాన్ని కూడా తోసిరాజని చాలా మంది ముస్లిం మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించు కున్నారు. అది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.
ప్ర. ఇంకా ఏ ప్రాజెక్టులో పని చేసారు?
జ. ఎ.పి.యు.ఎస్.పి (ఆంధ్రప్రదేశ్ అర్బన్ సర్వీసెస్ ఫర్ పూర్) ప్రాజెక్టులో కూడా అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా దాదాపు ఐదేళ్ళు పనిచేసాను. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు అన్ని జిల్లాల్లోని పట్టణ ప్రాంతంలోని పేదల స్థితిగతులను పరిశీలించే అవకాశం కలిగింది. పట్టణ ప్రాంతాలలో ప్రజలు ఆర్థికంగా సామాజికంగా లోప భూయిష్టంగా ఉండడానికి కారణం విద్య, వైద్యం వారికి అందుబాటులో లేకపోవడమేనని గమనించాను. కాబట్టి స్త్రీల కొరకు విద్య,వృత్తి విద్య, వైద్యానికి సంబంధించి పలు కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశాం. పట్టణ స్త్రీలు కొంచం లౌక్యం తెలిసినవారు. కాబట్టి అవకాశం ఇస్తే తమను తాము మలచుకుంటారు. కాకపోతే వాళ్ళకు అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి.
ప్ర. మీరు ఎప్పుడు పదవీ విరమణ పొందారు?
జ. నేను బోధనపట్ల ఆసక్తితో ఆ రంగంలోకి ప్రవేశించాను. కానీ అనుకోకుండా సామాజిక రంగంలోనే ఎక్కువగా పని చేయవలసి వచ్చింది. నాలో పిల్లలను మిస్ అవుతున్నానన్న భావన మొదలైంది. అందుకే చివరి ఐదారు సంవత్సరాలు నేను పాఠశాల స్థాయిలోనే పనిచేయాలని నిర్ణయించు కున్నాను. అప్పుడు నాకు కామారెడ్డిలో పోస్టింగ్ ఇచ్చాను. అక్కడి నుంచే గజిటెడ్ ప్రధానోపాధ్యాయిని స్థాయిలో 2011 జూన్ నెలలో పదవీ విరమణ పొందాను.
ప్ర. పదవీ విరమణ తర్వాత రచనలు మొదలు పెట్టారా?
జ. కాదు, నేను నిజామాబాదులో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలోనే నా రచనా వ్యాసంగం మొదలైంది. 1979 ప్రాంతంలో దాదాపు ఆ నాటి ప్రముఖ పత్రికలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, పొద్దు, అగ్ని పూలు, కేకలు వంటి పత్రికలలో నా రచనలు ముమ్మరంగా ప్రచురించబడ్డాయి. పలుఅంశాల మీద రేడియో ప్రసంగాలు ఇచ్చాను. ఉద్యమాల చౌరస్తా పేరిట కవితా సంపుటి వచ్చింది. ఇప్పటికీ మనసు స్పందించి నపుడు కవిత్వం రాస్తుంటాను.
ప్ర. పదవీవిరమణ తర్వాత మీరు చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలు ఏమిటి?
జ. నేను రిటైర్డ్ అయిన తర్వాత గంధంగూడలో ఇల్లు నిర్మించుకొని “గురజాడ నిలయం” అని పేరు పెట్టుకున్నాను. అయితే సిటీలోని మొత్తం చెత్తను తీసుకువచ్చి గంధంగూడ ప్రాంతంలో వేసేవారు. ఆ చెత్తను బొగ్గులా పిల్లెట్స్ తయారు చేస్తామని ఒక రాజకీయనాయకుడు సబ్సిడీ తీసుకున్నాడు. ఆ పని సరిగా చేయకపోగా ఈ ప్రాంతమంతా దుర్వాసన, విషకీటకాలు, పందులు, ఎలుకలతో నిండిపోయింది. దానికి వ్యతిరేకంగా అప్పటి ఎం.ఎల్.ఏ సబితా ఇంద్రారెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తమ్ రెడ్డి, నా కుటుంబ సభ్యులు, కొందరు సామాజికవేత్తలతో కలిపి పెద్ద ఉద్యమమే చేసి, ఎట్టకేలకు డంపింగ్ యార్డును ఆ ప్రాంతం నుంచి ఎత్తి వేయించడమే కాకుండా ఆ ప్రాంతంలో చెత్త వేయరాదనే జివో కూడా వచ్చింది. ఒకసారి ఆటోలో వెళుతుంటే కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి, “మీరు చెత్త గురించి ఉద్యమం చేసిన మేడం కదా..” అంటూ నన్ను పలకరించినప్పుడు.. నేను చేసిన ఉద్యమం ఎంతలా ప్రజల్లోకి చొచ్చుకు పోయిందో తెలిసి సంతోషమైంది. ప్రజలు మనను గుర్తించడం కంటే ఆనందం ఈ జీవితానికి ఇంకేంముంటుది?
ప్ర. ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటీ?
జ. డంపింగ్ యార్డు ఉద్యమ క్రమంలోనే ప్లాస్టిక్ నిషేధం దిశగా పని చేయాలని అనిపించింది. అందువల్ల ‘సమిష్టి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి నా శక్తి మేరకు కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో భాగంగా .. “ఆడపిల్లలను రక్షిద్దాం” అనే నినాదంతో కూడిన బట్ట సంచులను కుట్టించి వాటిని సభలు, సమావేశాలలో ఉచితంగా పంచిపెట్టాను. ప్లాస్టిక్, పేపర్ కప్పులలో టీ, కాఫీలు తాగడం క్యాన్సర్ కారకమని చెపుతూ ఇప్పుడు స్టీలు గ్లాసులు పంచుతున్నాను. నడకవల్ల కలిగే లాభాలను చెపుతూ ఇళ్ళల్లో ఉండే మహిళలకు చిన్న స్లింగ్ బ్యాగులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాను. సభలు, సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. ఊపిరి ఉన్నంత వరకూ నా వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను.
ప్ర. ప్రస్తుతం ఏ సంస్థలలో పనిచేస్తున్నారు?
జ. కుల నిర్మూలన సంఘానికి, ‘అమ్మ’ ఆర్గాన్, బాడీ డొనేషన్ సంస్థకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను.
ప్ర. మీరు పొందిన సత్కారాల గురించి చెప్పండి.
జ. 2015లో విశ్వజన కళామండలి వారి “tతీuవ Iఅdఱaఅ” అవార్డు వచ్చింది. 2025లో డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్శిటీ వారు సోషల్ వర్క్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. మనం ఫౌండేషన్ వారి “ఔశీఎaఅ శీf tష్ట్రవ yవaతీ” అవార్డు పొందాను.
ప్ర. నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ. జంతర్ మంతర్ ఉద్యమం జరగడానికి ముందు వరకూ నేటియువతరం మీద నిర్లిప్తభావం ఉండేది. భవిష్యత్తు పట్ల బెంగగా ఉండేది. కానీ ఆ ఉద్యమం తర్వాత, నేటి పరిస్థితులను గమనిస్తుంటే చాలా ఆశగా ఉంది. నేటి యువతీ యువకులు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగి మంచిరోజులు రావాలి.
