ఇష్టమైన తిండి, ఇష్ట దైవదర్శనం – హత్యలకు తగిన కారణాలా!- నంబూరి పరిపూర్ణ

ప్రకృతిలోని అన్ని జంతువుల్లాగే, ఆది మానవుడూ-తనకు ప్రకృతి ఏది అందిస్తే ఆ దానిని తింటూ బ్రతుకు సాగించాడు. ఆకులు, దుంపలు, కాయ కసర్లతోనే ఆగక, రాతి పనిముట్లతో, విల్లంబులతో – జంతువుల్నీ పక్షుల్నీ వేటాడి – పచ్చి మాంసాన్నే తింటూ పొట్ట నింపుకున్నాడు.

మానవ సమూహాలు – క్రమంగా నదులు, సముద్ర తీరాలకు చేరువవుతూ – రకరకాల మత్స్యసందను ఆహారంగా చేసుకున్నాయి. మొట్టమొదటగా మానవ జీవన స్థిరత్వానికీ, బ్రతుకు మార్గానికీ, నాగరికతకూ, నదులూ అవి అందించే ఆహారమూ – ప్రధానంగా తోడ్పడినట్టు మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. భారతదేశానికి సంబంధించినంతవరకు, ఈ అంశాన్ని పరిశీలించగా – సింధు, హరప్పా, మొహంజుదారో నాగరికతలు పరిఢవిల్లడానికి – సింధు నదుల జలాలు, అందలి మత్స్యసంపద కారణమని చరిత్ర తెలియజెపుతోంది.

అదేరీతిలో – పశ్చిమాసియా ఎడారి, కొండప్రాంతాల్లోని సంచార ఆర్యులు – భారతదేశ ప్రవేశం చేసినప్పుడు- మున్ముందుగా – గంగా సింధు మైదానాల్లో స్థిరపడి, ఆ నదుల నీటినీ, మత్స్యసంపదనూ, ఆహారంగా చేసుకోవడం వల్లనే – వారిక్కడ బ్రతుకు సాగించడానికి వీలయిందనీ, ప్రధాన కారణమైందని కూడా తెలుస్తోంది.

ఈ రీతిలో – మానవజాతులు, తామున్న ప్రదేశాల్లో ఏది దొరికితే దాన్ని తిని, ఆకలి తీర్చుకుంటూ మనుగడ సాగించారు. క్రమంగా, గణవ్యవస్థలు ఏర్పడ్డ తరువాత – ఏ ఆహారం తినదగినది, ఏది కాదు అన్న విచక్షణ కలిగింది – అదీ ఎన్నో శతాబ్దాల తరవాత.

గుర్రాలు, ఖడ్గాలతో వచ్చి ఉత్తర భారతమంతా ఆక్రమించిన ఆర్యసంతతులు – తమ దేవతల కోసమని యజ్ఞాలు చేస్తూ, అర్పణలు హవిస్సులుగా పశువుల్నీ, గుర్రాల్నీ బలి యిస్తుండేవారు. ఆ పశుమాంసాన్ని పవిత్రమైందిగా భావించి, ఆరగించేవారని తెలుసుకున్నాం. యజ్ఞ సమయాల్లో – వందల ఆవులు, ఎద్దులు, గుర్రాలు బలవుతుండేవి. వాటి మాంసాన్ని సోమరస పానంతో భుజించడాన్ని, గొప్ప పవిత్రకార్యంగా ఎంచబడేది.

క్రీ.పూ. మూడువేల సంవత్సరాల నించీ, బుద్ధుడు జీవించిన – బి.సి. 500 ఏళ్లవరకూ, ఈ యజ్ఞయాగాదులు, జంతు బలులు – బహు ముమ్మరంగా జరుగుతుండేవి.

నిరంతర జంతు బలులతో, కౄరహింసతో నిండిన ఆ నాటి సమాజ దుస్థితిని గమనించి, ఆ దుష్ట ఆచారాలకు ప్రతిగా మానవత్వాన్నీ, భూత దయ, అహింసా ప్రవృత్తిని ప్రజల్లో ప్రోది చెయ్యడానికై – బుద్ధుడు అష్టాంగ సూత్ర బౌద్ధాన్ని ప్రజలకందించ బూనాడు. బౌద్ధ ధర్మాల్లోని సమత, శాంతి సామరస్యభావనలు – సామ్రాజ్యాధిపతులు మొదలు సామాన్య జనుల వరకూ – అతి శక్తివంతమైన ప్రభావాన్ని చూపాయి.

పూర్వ జన్మ కర్మలు, స్వర్గ నరక ఊహలు, వందల వేల దైవాలతో మూఢ విశ్వాసాలతో నిండిన ఆర్యమత తంతులకు – మానవీయత, హేతు బద్ధత కలిగివున్న బౌద్ధము పెద్ద అడ్డంకిగా నిలిచి, పురోహిత వర్గాలను విపరీతంగా కలవరపరిచింది; సహింపరానిదయ్యింది. కట్టుకథలతో, దైవం పేరుతో ప్రజల్ని నమ్మించి, దోచుకొనడం మరిక సాగబోదని – ఆ వర్గం భయపడింది. ‘రాజు’ ప్రత్యక్షదైవం అని ప్రజల్ని నమ్మించి, భక్తితో లొంగివుండేలా చేస్తుండే మఠాధిపతులు, వారికి బాసటగా నిలిచిన రాజవంశాలూ ఏకమై, బౌద్ధ ధర్మాన్ని దేశం నుంచి తరిమేయగలిగారు. అయితే – సరిహద్దులు దాటిన ధర్మం – చైనా, జపాన్లతో సహా ఆసియా ఖండమంతటా – వ్యాపించింది. అపూర్వ ప్రాచుర్యాన్ని పొందింది. ఆదరణీయ, ఆదర్శవంత మతంగా ప్రజలచే గౌరవింపబడింది.

తమ పథకం విఫలమవ్వడాన్ని గుర్తించిన ఈ దేశ పురోహిత, మతాచార్య వర్గాలు, బౌద్ధ ధర్మాన్ని ‘హైజాక్‌’ చెయ్యబూనాయి. అష్టాంగాల్లో ప్రధానమైన అహింసాధర్మాన్ని తమ జీవన విధానంలో అమలు చెయ్యక తప్పలేదు. బుద్ధుడు మరెవరో గాదు – విష్ణుదేవుని అవతారాల్లో పదవ అవతారమన్న కల్పనాకథను ప్రజలకందించారు.

తరువాతి కాలంలో, తిరిగి మతకర్మకాండలు, తంతులు జరుపుతూ ప్రజలను దోచడం సాగుతూనే వుంది.. బ్రాహ్మలం – బ్రహ్మ ముఖాన్నించి పుట్టాం, భూదేవతలం అంటూ తమకు తాము ఒక విశిష్టతను, ఆధిక్యతను పులుముకొని, మిగిలిన కులాల మీద పెత్తనం చెలాయిస్తూ – దేవుడి దళార్లుగా చక్రం తిప్పుతున్న పూజారి వర్గం గురించి, చరిత్ర జ్ఞానమున్న వారికి తెలియందేం లేదు. వేద పఠనమే గాదు, కనీస విద్యకు తాము తప్ప – మిగిలిన కులాలు అర్హం గావని శాసించి, ప్రజల్ని మూఢంగా మిగల్చడం అవసరమయ్యింది. ఆ మూఢత్వం వల్లనే – వాళ్ల కల్లబొల్లి కథలను నిజాలని నమ్ముతూ వచ్చారు జనం, నేటికీ నమ్ముతున్నారు.

అప్పటి వరకూ పశుమాంసాన్ని బావుకు తింటుండిన బాపన వర్గాలు – అదే మాంసాన్ని తింటున్న పేద బహుజనుల్ని నీచంగా చూడసాగాయి. ఛండాలురనీ, అస్పృశ్యులనీ ముద్రవేసి – సమాజంనించి దూరంగా వుంచింది. బ్రాహ్మలను భూదేవతలని కొలిచే – యితర కులాలు కూడా – బహుజనుల ‘వెలివేత’ ప్రక్రియకు పూనుకోడంలో ఆర్థిక రాజకీయ కోణాలు కొన్ని దాగి వున్నాయి. అత్యంత నీచకులంలో పుట్టడం, నిత్య దరిద్రులుగానే బ్రతకడం మీ పూర్వజన్మల కర్మం అని నమ్మించి, అదే దుస్థితిలో బ్రతికేందుకు మానసికంగా సంసిద్ధుల్ని చేశారు. బడుగుల శ్రమదోపిడీకి, వెట్టిచాకిరీకి – వాళ్లను నికృష్టులుగా చూడడం – ఓ మంచి సాధనం’. అంటరాని వాళ్లు, చూడరాని వాళ్లంటూ వెలివేసి అవమానిస్తుండాలి.

ప్రస్తుత భారతీయ జనతాపార్టీ, దాని అనుబంధ సంస్థలన్నీ బ్రాహ్మణ నాయకత్వంలోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా – పవిత్రమంటున్న ఆవు, ఎద్దు మాంసాన్ని – ప్రపంచ ప్రజల్లో అత్యధికులు ఆహారంగా తింటున్నారు. మనదేశంలో గాని, మరెక్కడ గానీ – ముస్లింలకు యిది ప్రీతికర ఆహారం. మన దృష్టిని కొంచెం వెనక్కు మళ్లిస్తే – రెండొందలేళ్లు మనపాలకులయిన తెల్లదొరల ప్రధాన ఆహారం – ఎద్దు, పంది మాంసాలు! ఈ ఉన్నత కులాలు – వారిని ఏనాడైనా తప్పు బట్టాయా? అసహ్యించుకున్నాయా? పై పెచ్చు – పొగడ్తలతో మంచి చేసుకున్నారు గదా! వారి ఇంగ్లీషును, వారి విద్యను ఆసక్తితో నేర్చుకుని, చొరవతో వారి చంకలకెక్కి, కీలక పదవుల్నీ, ఉన్నత ఉద్యోగాల్నీ స్వంతం చేసుకుంటూ, బ్రాహ్మణేతరుల్ని ప్రక్కకు నెట్టారు. వీరి యిట్టి స్వార్థవైఖరి వల్లనే, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడుల్లో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు నెలకొని, ఉధృతంగా సాగినవన్న విషయం మనకు తెలియనిదా!

మత స్వీకరణగానీ, ఆహార స్వీకరణగానీ వైయక్తికరమైన ప్రాథమిక హక్కులు. వాటిని కాదనడానికీ, కించపరచడానికీ మరొకరికి హక్కులేదు. ధనవంతులు మృష్టాన్నం తినడానికి ఏ హక్కు కలిగివున్నారో, పేదలు తమకు చౌకగా లభించే తిండిని, మాంసాన్నీ తినేందు ఆ హక్కునే కలిగి వున్నారు, వుంటారు.

ప్రతి పౌరుడు తనది ఫలాన మతం, ఫలాన కులం అని చెప్పుకుందుకు – రాజ్యాంగబద్ధ హక్కును ఎలా కలిగివున్నాడో – తనకిష్టమైన ఆహారాన్ని తినే హక్కును కూడా అలాగే కలిగి వున్నాడు. ఆహార భద్రత మాట అలా వుంచితే ఆహార స్వేచ్ఛనయినా కలిగుండాలి గదా!

నేను ‘అవధానిని’, ‘శర్మను’ శాస్త్రినీ, రెడ్డినీ, చౌదరినీ, నాయుడినీ, యాదవ్‌నీ అని – తమ పేర్లకు జత జేసుకుంటూ, తమ కులాల ఘనతను చాటుకుంటున్న రీతిలోనే – నిమ్నకులాలని అనబడుతున్న మాల మాదిగలిప్పుడు – తమ పేర్లకు మాల, మాదిగ – అని జతపరుచుకుంటున్నారు. ఇతరులకు తమ తమ కులాలు ఎంత ఘనమైనవో, మాకూ – మా మా కులాలు అంతే విలువైనవి, గౌరవనీయమైనవని చాటిచెప్పడమే యిందులోని ఆంతర్యం.

ఏప్రిలు పదిహేనున – ఉస్మానియా విశ్వవిద్యాలయంలో – దళిత విద్యార్థులు ఎద్దుమాంస ఆహార స్వీకరణను ఒక పండుగలా జరుపుకొనడంలోనూ పైన పేర్కొన్న రీతి స్వేచ్ఛను, నిస్సంకోచతను నిర్భయంగా ప్రకటించుకోవడమే – అన్నది యిమిడి వుంది. అంతే తప్ప – సమస్త ప్రజలూ ఎద్దు మాంసం తిని, తరించమని ప్రచారం చెయ్యడం గాదు. దళిత విద్యార్థులు కుల నిచ్చెనలో – అట్టడుగు మెట్టు వాళ్లు, ఆర్థికంగా బలహీనులు అన్న లోకువ వల్లనే గదా, వారి మీద మన హిందూత్వ పరిరక్షకులు దాడిచేసి, భీభత్సం సృష్టించడం జరిగింది?

దేశంలో – తదితర ప్రాంతాల బ్రాహ్మలకు భిన్నంగా – ఒరిస్సా, బెంగాలు బ్రాహ్మలు ప్రతిదినం చేపలు లేకుండా భోజనం చెయ్యరు. కాశ్మీరీ పండితులు – మేక, గొర్రె మాంసం లేకుండా ముద్దెత్తరు. మరి వారిని ఎందుకని నిరసించరు? దాడులు చెయ్యరు?

సకల జంతుజాలంలో ఆవు ఒక్కటే పవిత్రమైనదీ, ప్రశస్తమైనదీ అని, హైందవ పరిరక్షకులు – ఏ ఆధారంతో, ఏ శాస్త్రీయ విశ్లేషణ, పరిశోధనలతో సిద్ధాంతీకరిస్తున్నారు? ‘గోమాత’, ‘గోసంరక్షణ’ – అన్న నినాదాలతో తమ అస్థిత్వాన్ని స్థిరపరచుకుంటూ – చౌకగా లభించే పశుమాంసాన్ని తినే నిమ్న కుల నిరుపేదల్నీ, భిన్న మత బడుగు జనాల్నీ – అధికార దురహంకారంతో – హింసించి, హత్య చెయ్యడానికి తప్ప!!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.