స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణలో భాగంగానూ, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని – అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ ‘ప్రజాస్వామ్య సంస్కృతి దిశగా’ అనే అంశంపై ఒక రోజు సమావేశాన్ని డిసెంబర్ 10, 2015న వెస్ట్ మారేడ్‌పల్లి, పద్మశాలీ కళ్యాణ మండపంలో నిర్వహించింది. అస్మిత 25వ సం||లో అడుగుపెట్టిన సందర్భం కూడా ఈ సమయానికి కలిసి వచ్చింది. ఎ.పి, తెలంగాణా రాష్ట్రాలలోని సుమారు 600 మంది వివిధ ఎన్‌జీవోలలో పనిచేసే మహిళా లీడర్లు. కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనారు.
డిసెంబర్ 10, ఉదయం 9 గంటలు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు సభాస్థలికి చేరుకోవటం ప్రారంభించారు. కొద్దిసేపటికి ఆ ప్రాంగణమంతా వందలమంది మహిళలతో సందడిగా పండుగ వాతావరణంలా మారిపోయింది. అందమైన విశాలమైన సభాస్థలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకరి నొకరు ఆనందంతో పలుకరించుకున్నారు. అందరి మనస్సుల్లో ఆత్మీయత వెల్లి విరిసింది.
అనంతరం ఆహుతులకు స్వాగత వచనాలతో సమావేశం ప్రారంభమైంది. సభకు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, అస్మిత వ్యవస్థాపక సభ్యులు ఓల్గా గారు అధ్యక్షత వహించగా – భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ఆర్‌ఏడిఎస్ సంస్థ వ్యవస్థాపకులు జి. సత్యవతి, ఎస్‌టిఈపి సంస్థ వ్యవస్థాపకులు అమల్ చార్లెస్, ఎన్‌డిడబ్ల్యుఎఫ్ స్టేట్ కో ఆర్డినేటర్ సిస్టర్ లిజి ఆత్మీయ అతిథులుగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు.
సభకు అధ్యక్షత వహించిన ఓల్గాగారు – కార్యక్రమ
ఉద్దేశ్యం తెల్పుతూ- ఇటీవల మనదేశంలో తలెత్తిన ‘అసహనం’ మీద మన గొంతులు విప్పి అసమ్మతి తెలియజేయాలి. ఒక పక్క స్త్రీలమీద హింస విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని ఎట్లా ఆపడం? మన రాజకీయ నాయకులు ఇందుకు ఏ కారణాలనైనా చెప్పవచ్చు. ఆడపిల్లలు సాంప్రదాయక బట్టలు వేసుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి, అప్పుడే హింసను ఆపగల్గుతామంటూ ఎన్నైనా చెప్పవచ్చు. కాని స్త్రీల మీద హింసకు అసలు కారణాలు – పేదరికం, నిరుద్యోగం, స్త్రీల మీద విలువ, గౌరవం లేక పోవడం, వివక్ష, అసమానత్వం కోపం, అసహనం, స్త్రీలు అభివృద్ధి చెందితే ఓర్వలేని తనం, వీటిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ విధానాలు ఇవి కారణాలు.
25 ఏళ్లుగా కారణాలు నేర్చుకుంటూ గుర్తిస్తూ వస్తున్నాం. 25 ఏళ్లు చాలలేదు. ఎందుకంటే ఇవి చాలా పెద్ద విషయాలు. విద్య, ఆరోగ్యం, పేదరికం పోగొట్టటం సామాన్య విషయం కాదు. నిరంతరం కొత్త కొత్త అసమ్మతి స్వరాలు కనిపెట్టాలి. ఎందుకంటే ఈ విషయం నచ్చలేదు, సరైనది కాదని తీవ్రమైన స్వరంతో వ్యతిరేకతను తెలిపే ప్రజల గొంతును నొక్కివేస్తారు రాజకీయ నాయకులు. ఆ రాజకీయాలు వేరు, మన పని వేరు. ఎన్‌జీవోలుగా మనం 25 ఏళ్ళుగా చేసిన పని రాజకీయ స్పృహతో, కృషితో నిండి వుంది. ఇన్నేళ్లల్లో – జండర్ విషయాలు మాట్లాడుకున్నాం – సమానత్వం, అభివృద్ధి శాంతి గురించి మాట్లాడుకున్నాం. వ్యక్తిగతం ఏదీలేదని అంతా రాజకీయమని తెలుసుకున్నాం. అస్మిత – మారుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రపంచీకరణ ఫలితాలు, కన్స్యూమరిజం (వినిమయ సంస్కృతి) మన జీవితాలను ఎలా ఆక్రమిస్తున్నాయి? అన్న విషయాన్ని బొమ్మలు, పాటలు, సినిమాల ద్వారా తెలియజేసింది. తద్వారా మీ రాజకీయ దృక్పథాన్ని పెంచడానికి ప్రయత్నించింది. స్త్రీవాద రాజకీయాల్లో గణనీయమైన పాత్ర వహించడానికి ప్రయత్నం చేసింది. రెండు రాష్ట్రాలలోని ప్రజలకు మన సమస్యలకు ఎవరో కారణం కాదు. పితృస్వామ్య వ్యవస్థ దాని విధానాలు, అని రకరకాలుగా విషయాలు అందించింది. మహిళావరణం ఎగ్జిబిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రను నిర్మించిన స్త్రీల పోరాటాలు, విజయాలు తెలుసుకున్నారు. 25 ఏళ్ళ మన ప్రయాణం విలువైంది. అందరూ వెనక్కి తిరిగి చూసుకోవాలి. మంచి ఘట్టాలున్నాయి. ఓటములున్నాయి. హింసను తగ్గిస్తాం అనుకున్నాం. తగ్గించలేక పోయాం. ఎందుకంటే అది సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్తో కూడికొని వుంది. అలాగే మతతత్వం గురించి మాట్లాడాం. అమెరికా అధ్యక్షుడు – ఇటీవల న్యూస్ పేపర్‌లో మాట్లాడిన విషయాలు – ‘తీవ్రవాదాన్ని తుదముట్టించడం కోసం ఏ దేశం మీదనైనా వైమానిక దాడులు చేస్తాం’ అన్నాడు. ఆ మాటలకు, మన జీవితాలలోని రోజువారీ విషయాలకు మధ్యగల సంబంధాన్ని అర్థం చేసుకోవడం సామాన్యంకాదు. అగ్రరాజ్యాలు అన్ని రకాలుగా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సహజవనరులను దోచుకోవడం అంటే – స్త్రీల మీద హింస మరింత పెరిగిపోతుంది. కాబట్టి మనదేశ సార్వభౌమత్వం, సహజ వనరులను రక్షించుకోవలసిన బాధ్యత మనమీద ఉంది. ఎన్నని చూస్తాం? ఇంటి బాధ్యతలు, సమాజ బాధ్యతలు, ఇంకా పెరుగుతున్న బాధ్యతలు మోయాల్సింది మనమే. మన వెన్నెముకలు, చాలా గట్టివి. ఆ వెన్నెముక బలంతో, రాజకీయ చైతన్యంతో నిండిన మెదళ్ళతో, ఆలోచిస్తూ దేశాన్ని బాగుచేసుకోవటం, అంటే – ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని’ గురజాడ అన్నట్టూ, మనుష్యులను అభివృద్ధి చేయాలి. జీవిత క్రమాన్ని బైటికి తెచ్చి, మంచి జీవితం గడిపేలా చెయ్యటం మన గమ్యం. ఈ ప్రయాణం చాలా దూరం సాగుతూనే వుంటుంది. నడక ఆగకూడదు.
అలాగే మనదేశంలో తగ్గిపోతున్న ప్రజాస్వామ్య సంస్కృతిని తిరిగి నిర్మించాలి. ఎవరైనా ఏ విషయమైనా మాట్లాడితే తప్పు పడ్తున్నారు. హేతువాదం గురించి మాట్లాడినా దబోతోల్కర్, కల్బుర్గీలను చంపేశారు. సంస్కరణ కోసం ప్రయత్నిస్తున్న వారిని, హిందూ ఛాందస వాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని, అన్యమతాల వారిని, చంపటం ఒక పద్ధతి ప్రకారం జరగుతోంది. మనదేశంలో బహుళ మతాలు, జాతులు సంస్కృతులు వున్నాయి. వాటన్నిటిని నాశనం చేయడానికి చూస్తున్నారు. అలాగే ఇది తినకూడదు, అది తినకూడదంటూ ప్రజల ఆహారపుటలవాట్లల్లో తలదూరుస్తూ వారిని మూసమనుష్యులుగా మర మనుష్యులుగా తయారు చేయడాన్ని సాగనివ్వకుండా ఎదుర్కోవాలి. ప్రశాంతంగా బ్రతికే మన హక్కును, మన అలవాట్లను సంస్కృతిని కాపాడుకోవాలని – ఉత్తేజకరంగా ఉపన్యసించారు.
తర్వాత కొండవీటి సత్యవతి గారు మాట్లాడారు. ఆమె తన ప్రసంగంలో – అస్మితతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అస్మిత 25 ఏళ్ళ వేడుకలను అభినందించారు. తన ఎదుగుదలకు దారితీసిన సంఘటనలను ‘పార్టిసిపెంట్స్’ తో పంచుకున్నారు. అలాగే మనదేశంలో పెరిగిపోతున్న అసహనం గురించి మాట్లాడుతూ – మేధావులు, రచయితలు, హేతువాదుల పట్ల, హిందుత్వ శక్తులకు గౌరవం లేదని, ప్రజాస్వామ్య సంస్కృతిని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారని – ఇందుకు వ్యతిరేకంగా రచయితలు తమ అవార్డులను ‘పూచిక పుల్లగా’ భావించి వెనక్కు ఇచ్చేశారని తెలిపారు. అలాగే మత అసహనం వల్ల స్త్రీల అంశాలు పక్కకి వెళ్ళి పోయాయి. మతం గురించే మాట్లాడుతున్నారు కాని స్త్రీల అంశాలు ఎవరూ మాట్లాడటం లేదు. హిందూత్వ ఎజెండాలో స్త్రీల అంశాలు లేవు. తెలంగాణా గవర్నమెంట్‌లో ఒక్క మహిళా మంత్రి లేరు. జనాభాలో స్త్రీలు సగభాగం వున్నారు. కాని మంత్రుల్లో స్త్రీలు ఒక్కరు కూడా లేరు. కాబట్టి మన కార్యక్రమాల్లో ఈ విషయాలు పొందుపరుచుకొని సామూహికంగా గొంతెత్తి అడగాలి. సంఘటితంగా పనిచెయ్యాలి అంటూ ప్రసంగాన్ని ముగించారు. తర్వాత ఆర్‌ఏడిఎస్ సంస్థ వ్యవస్థాపకులు జి. సత్యవతి మాట్లాడుతూ – అస్మిత 25 ఏళ్ళ వేడుకలను అభినందించారు. అస్మిత ఏర్పడిన 1991సం||లోనే ఆర్‌ఏడీఎస్ సంస్థను నెలకొల్పామని, చెప్తూ అస్మిత ద్వారా నిరంతర జ్ఞానాన్ని పొందుతూ – ఎదిగానని తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్‌టిఇపి సంస్థ వ్యవస్థాపకులు అమల్ చార్లెస్ అస్మిత కార్యక్రమాల గురించి కవితారూపంలో వివరించారు.
చివరగా సిస్టర్ లిజి – అస్మిత తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా హాజరైన మహిళలను అభినందించారు. అలాగే స్త్రీల రాజకీయ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ – కేరళ పంచాయితీ ఎన్నికల్లో 54 శాతం మహిళలు గెలిచారు. కేరళ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండగా – మన రాష్ట్రంలో ప్రభుత్వాలకు మహిళల రాజకీయ భాగస్వామ్యం పట్ల శ్రద్ధ లేదని – కనుక మళ్ళీ మనందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం వుంది. అలానే గృహ కార్మికులైన స్త్రీలు, బాలికలు హక్కులు, గౌరవం లేక హింసలకు గురవుతున్నారు. విదేశాలకు వెళ్ళి ఇళ్ళల్లో పనిచేస్తూ, అసమానత్వానికి గురవుతూ, తక్కువ జీతాలు పొందుతూ జీవితాలను వెళ్ళదీస్తున్నారు. అస్మిత వీరి హక్కుల గురించి ‘స్పెషల్ మెజర్స్’ తీసుకోవాలని కోరి తమ ప్రసంగాన్ని ముగించారు. ఓల్గా గారి స్ఫూర్తినిచ్చిన ప్రసంగం, వక్తల సందేశాలతో సభికులు ఉత్తేజితులైనారు. ఇంతటితో మొదటి సెషన్ ముగిసింది. తర్వాత అందరూ కబుర్లు చెప్పుకుంటూ కమ్మటి విందు భోజనాన్ని ఆస్వాదించారు.
మధ్యాహ్నం సెషన్‌లో పార్టిసిపెంట్స్ – తమ తమ ప్రాంతాల వారీగా గ్రూపులుగా విడిపడి – ఆయా ప్రాంతాలలోని సామాజిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల గురించి మాట్లాడుకొని వాటి పరిష్కారానికై ప్రభుత్వాలకు డిమాండ్స్ పెట్టటంతో – రెండో సెషన్ ముగిసింది. ఆ తర్వాత – అస్మిత రూపొందించిన లక్ష్మణరేఖ నృత్యరూపకం ప్రదర్శన జరిగింది. చివరగా అస్మిత అందించిన బ్యాగ్స్, విలువైన మెటీరియల్ తీసుకొని, సంతోషంతో, చక్కటి జ్ఞాపకాలతో ముందు, ముందు కూడా సంఘటితంగా పనిచేయాలనే తలంపులతో పార్టిసిపెంట్స్ తమ తమ జిల్లాలకు తరలి వెళ్ళారు.
ప్రభుత్వాల ముందుంచిన ముఖ్యమైన డిమాండ్స్:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ఎన్‌జీవోలలో పనిచేస్తున్న మహిళా లీడర్లు, సామాజిక కార్యకర్తలమైన మేము మా సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఈ క్రింది విధంగా డిమాండ్ చేస్తున్నాం. లింగ వివక్ష లేని న్యాయమైన సమాజ నిర్మాణం దిశగా-
ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, ఆహారం, నీరు గృహవసతి వంటివి అందరికి అందుబాటులో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నార.
అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని వెంటనే ఆపాలి. విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక సేవల రంగాలలో ప్రైవేటీకరణను ఆపాలి. ఈ రంగాలు ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడవాలి.
గ్రామీణ అభివృద్ధికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలను ఆపాలి. ఇందుకోసం భూమిని సాగుచేసే రైతులు మాత్రమే రుణ మాఫీ ప్రయోజనాలు పొందేలా చేయాలి. ప్రభుత్వం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించాలి. సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి, ఉచిత పంపిణీ చేయాలి. పంట పొలాలకు పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరం ఇవ్వాలి.
అతివృష్టి, అనావృష్టి వల్ల ఏర్పడే కరువు నివారణపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం పనిహక్కుకు గ్యారంటీ ఇస్తూ – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయకుండా బలోపేతం చెయ్యాలి. ఈ పథకం క్రింద 250 రోజుల పనిదినాలు ఇచ్చి, వలసలు, కరువు నివారించాలి.
రెండు రాష్ట్రాలలో తక్షణమే మద్యపాన నిషేధం అమలు చెయ్యాలి.
కరువు, బీదరికం – అంతిమంగా స్త్రీలపై హింసను పెంచుతుంది. దీంతో పాటు టెక్నాలజీ బాలికలపై మరింత హింసను పెంచుతుంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు లేదా టెక్నాలజీ దుర్వినియోగం, సైబర్ క్రైం నేరాలకు దారితీస్తున్నాయి. వీటి నివారణకు సైబర్ పోలీసుల అధికార పరిధిని పెంచటం, వారికి తగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించటం, తగిన పర్యవేక్షణా విధాలు కేటాయించటం ద్వారా టెక్నాలజీ ఆధారిత హింసను అరికట్టాలి. వికలాంగులైన మహిళల హక్కుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
నిరుద్యోగ నివారణకు – 85 శాతం విస్తరించిన ప్రైవేట్ రంగంలో యస్.సి, యస్.టి, బి.సి, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలను కల్పించాలి.
విద్య మన ప్రాథమిక హక్కు. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను ఏర్పరిచి వాటిని ప్రజల అందుబాటులో వుంచాలి. పాఠ్యాంశాలు జండర్ స్పృహను పెంచేవిగా వుండాలి. ప్రతి పాఠశాలకు వసతులతో కూడిన మరుగుదొడ్ల ఏర్పాటు చేసి నిర్వహించాలి. యుక్త వయస్సు బాలికలకు ఉచితంగా సానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చి వారు బడి మానేయకుండా చూడాలి. విభిన్న ప్రతిభావంతులైన బాలలను కూడా యిముడ్చుకునే విధానం పాఠశాలల్లో వుండాలి.
ప్రజలందరి ఆరోగ్య అవసరాలు తీర్చాలి. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
గృహ కార్మికులైన మహిళలు నివసించే బస్తీలలో పరిశుభ్రమైన నీరు, పక్కా రోడ్లు వుండేలా చర్యలు తీసుకోవాలి.
రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి. ఇతరుల ఆహారపుటలవాట్ల మీద నియంత్రణ పెట్టేవారిని, అసహనంతో దాడులు చేసే వారిని శిక్షించాలి. ప్రజాస్వామ్య సంస్కృతి విలువలను ప్రజలు పాటించేలా నిరంతరం అవగాహన కల్పించాలి.