(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)
”ఛీ ఛీ!” శ్రావణి పదే పదే అనుకుంటోన్న మాటే అది.
ఉదయం టిఫిన్ కూడా తినడానికి మనస్కరించలేదు. ఆకలి దంచేస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నాలుగైదు ముద్దలు గబగబా లాగించేసింది. ఆ కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టయిపోయి, అంతలోనే ప్రభాత్‌తో పొద్దున్నే జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి తిండి మీద మరింత విరక్తి పెరిగిపోయింది శ్రావణికి.
చెయ్యి కడుక్కుని సింక్‌లో ప్లేటు పడేసి హాల్లోకొచ్చి సోఫాలో వెనక్కి వాలి ఉదయం జరిగిన విషయాన్ని మననం చేసుకుంటోంది శ్రావణి.
”శ్రావణీ… మరీ పాతకాలం బామ్మలా ఆలోచిస్తే ఎలా నువ్వు? ఇప్పటి సొసైటీకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడమే ఆధునిక జీవితమంటే! నేను చెప్పింది మన ఇద్దరికీ కూడా సంతోషాన్ని కలిగించే విషయం కూడా! ఇందులో నువ్వు నష్టపోయేది కూడా ఏమీ ఉండదు. పైపెచ్చు ఎప్పుడూ లేని సంతోషాన్ని కూడా పొందే అవకాశమిది.” డైనింగ్ టేబుల్ దగ్గర పక్కనే కుర్చీలో కూర్చుని తన ముంగురులను సవరిస్తూ మృదువుగా ప్రభాత్ చెప్పిన మాటలవి. కానీ ఆ మృదుత్వం వెనుక దాగిన కటువుదనం కూడా అర్థం కాని అమాయకురాలేం కాదు తను.
”ప్రభా… ఇదివరకు కూడా ఎన్నో విషయాల్లో నీకు సహకరిస్తూనే ఉన్నాను. కానీ ఇది మరీ దారుణమైన విషయం. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా అసహ్యం కూడా వేస్తోంది.” అంది తను వికారంగా ముఖం పెట్టి.
”నీకు ప్రతీ విషయమూ అసహ్యంగానే ఉంటుంది శ్రావణీ! ఇదివరకు కూడా ఎన్నో విషయాల్లో నేనెంతో బ్రతిమాలితే కానీ నా మాట వినేదానివి కాదు. మంచి సంబంధం అని అమ్మానాన్నా ఎంతో నచ్చచెబితే నిన్ను పెళ్ళి చేసుకోవడం నా పొరపాటైపోయింది” ప్రభాత్ మాటలు క్రమంగా కోపాన్ని పులుముకుంటున్నాయి.
”అవును ప్రభాత్. నీకు ఇష్టం లేకపోయినా మీ అమ్మానాన్న గార్లు చెప్పారని మాత్రమే నన్ను చేసుకున్నట్టున్నావ్. కానీ ఏదో పెళ్ళిలో నన్ను చూసి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయినే చేసుకుంటాను. లేకపోతే పెళ్ళే వద్దు అని చెప్పి మరీ నన్ను పెళ్ళి చేసుకున్నట్టుగా మొదటి రాత్రే నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా?!” శ్రావణి సూటిగా అడిగింది.
”ప్రతీసారీ ఇదే విషయాన్ని చెప్పి చెప్పి నన్ను దెప్పి పొడవాల్సిన అవసరం లేదు శ్రావణీ! నేను పని చేసేది వరల్డ్ బెస్ట్ కార్పొరేట్ ఆఫీసులో! చదువుకున్నదానివి కాబట్టి ఆ విషయాన్ని నీకంతగా విడమరచి చెప్పవలసిన పని లేదు. ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో జాబ్ కల్చర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా ఎన్నో రిక్రియేటివ్ ఐడియాస్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆకర్షణీయమైన జీతాలు, సదుపాయాలతో పాటు ఇలాంటి సరదాలను కూడా అందించే కంపెనీలో పని చేసే అదృష్టం ఎందరికో కానీ రాదు. దానికి నాతో పాటుగా నా పార్ట్నర్‌గా నువ్వెంతో సంతోషించాలి. అంతే కానీ ఇలా మొండికేసి పేచీలు పెడితే అది మనిద్దరికీ మంచిది కాదు.” సీరియస్‌గా చెప్పాడు ప్రభాత్.
”అంటే మనిద్దరికే తప్ప ఇంకెవరికీ తెలియని, తెలియకూడని మన వ్యక్తిగత విషయాలలోనూ కూడా వాళ్ళు తల దూర్చేస్తారా?! అసలు అవన్నీ వాళ్ళకు తెలియాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన అగత్యం కానీ ఉందంటావా?!” అంతే సీరియస్‌గా నిలదీసింది శ్రావణి.
”వాళ్ళేమీ మనల్ని ప్రతీదీ షేర్ చేసుకోమని చెప్పలేదు. మన వ్యక్తిగత విషయాలలో, అనుభూతులలో కొత్తదనాన్ని పొందేందుకు చక్కని ప్లాట్‌ఫాం అందిస్తున్నారంతే! ఈ మాత్రం దానికే నువ్వు ముడుచుకుపోతే ఎలా?!”
”ఇంతవరకూ చాలా విషయాల్లో నాకిష్టం లేకపోయినా నువ్వడిగావని ఒప్పుకున్నా ప్రభాత్! నీ వింత వింత కోరికలన్నీ తీర్చుకోవాలన్న ఆరాటమే తప్ప నీ జీవితభాగస్వామికి అది ఇష్టమా అయిష్టమా అన్న ఆలోచన కూడా ఎప్పుడూ నీకు లేదు. నీ సుఖం కోసం, సంతృప్తి కోసం మనసు చంపుకుని నీకు సహకరించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా అది మన ఏకాంతంలో నాలుగు గోడల మధ్యకే పరిమితం కాబట్టి ఎలానో నీకు సహకరిస్తూ వచ్చాను. ఎందుకంటే మన పెళ్ళైన మరుక్షణం నుండి నిన్ను నా జీవిత భాగస్వామిగా మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నాను కాబట్టి. కానీ నీ విశృంఖలత రోజురోజుకీ మితిమీరిపోతుంటే ఎలా సహించగలను?”
”డింగ్ డాంగ్…” అంటూ కాలింగ్ బెల్ మ్రోగడంతో ఆలోచనలనుండి ఇవతలకొచ్చింది శ్రావణి. ధారాపాతంగా వర్షిస్తోన్న కనులను తుడుచుకుని లేచి వెళ్ళి తలుపు తీసింది. పని మనిషి లోపలికి వచ్చి ఇంట్లో పని చేసుకోవడం మొదలు పెట్టింది. తిరిగి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి చూడసాగింది. కళ్ళు టీవీ మీద
ఉన్నా ఆమె ఆలోచనలన్నీ ప్రభాత్‌తో ఏర్పడిన అగాథంలోనే సుడులు తిరుగుతున్నాయి.
”అయితే నీ ఇష్టమొచ్చినట్టు చేసి చావు. ఇంక నాతో మాట్లాడొద్దు” అని తింటున్న టిఫిన్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు ప్రభాత్. ఎంత తుడిచేద్దామనుకున్నా మనసులో అదే సంఘటన పదే పదే గుర్తుకొస్తూనే ఉంది. గుండెను నిలువుగా కోస్తూనే ఉంది.
అంతలో పక్కనే ఉన్న ఆమె మొబైల్ ఫోన్ మ్రోగింది. ప్రభాత్ నుండి ఫోన్! ”హాయ్ శ్రావ్స్!” తను మరీ ముద్దొచ్చినా, తనతో ఏదైనా పనున్నా ప్రభాత్ వాడే పిలుపది. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత, మాధుర్యం దాగి ఉన్నాయని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది శ్రావణి. కానీ అది అతని అవసరార్థం వాడుకునే ఓ యాంత్రికమైన, నాటకీయమైన పిలుపు మాత్రమే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది!
”ఏంటి శ్రావ్స్… సారీరా, కోపమొచ్చిందా, నేను టిఫిన్ తినకుండా వెళ్ళిపోయానని?”
అస్తమానూ అతని గురించే వర్రి అయిపోయే తను నిజంగానే అలా బాధపడేది. నిజానికి ప్రభాత్ చాలా తెలివిగా తనను అలా ట్యూన్ చేసేసాడు. అతను టిఫిన్ చేయలేదనే విషయాన్ని హైలైట్ చేసాడే కానీ తను తిన్నదో లేదో కూడా కనుక్కోడు! ఎమోషనల్ బ్లాక్ మెయిల్!! ఆలోచిస్తుంటే ఇప్పుడిప్పుడే ప్రతి విషయంలోనూ అతనెంత స్వార్థంగా ప్రవర్తిస్తాడో అర్థమవుతోంది.
మొదట్లో వీకెండ్ పార్టీస్‌కి తనతో పాటు రమ్మనే వాడు. తనకిష్టం లేదంటే ఒప్పుకునేవాడు కాదు. వీకెండ్ పార్టీ అంటే చక్కగా సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళేది కాదు! అధునాతనంగా తయారవ్వాలి. దుస్తులు కురుచగా వేసుకునేందుకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలా ఇష్టం లేదన్నందుకు మూడు రోజులు అన్నం తినడం మానేసి తను అనుకున్నది సాధించుకున్నాడు ప్రభాత్.
కానీ పార్టీ హాల్లోకి అడుగు పెడుతూనే అంతా తన వైపే తినేసేలా చూస్తోంటే సిగ్గుతో చితికిపోయింది తను. ఆ రాత్రి ఏడుస్తుంటే నెమ్మదిగా అలవాటైపోతుందని బుజ్జగించాడే తప్ప ఇక రావొద్దని మాత్రం చెప్పలేదు!
ఇంట్లో ఉన్నా ప్రభాత్‌కి తనతో గడపటం ఇష్టం ఉండేది కాదు. ఆ సమయంలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చునే గడుపుతాడు. ”హే శ్రావ్స్ సూపర్ హాట్ యార్ ఇట్రా… ఇది చూడు!” అంటూ చూసేందుకు జుగుప్స కలిగించే వికృత విడియోలన్నీ చూపిస్తాడు. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుని వెంటనే లేచిపోతుంటే, ”హే ఇట్స్ కామన్ శ్రావ్స్! ఇదంతా మోడర్న్ కల్చర్! అదిగో… అలా చూడు. వావ్… యుమ్మీ యార్! నైట్ కి ఆ గాళ్ పాత్ర నీదే మరి, ఎలా చేస్తావో, ఏం చేస్తావో… హుమ్మ్!!” అని ఒళ్ళు విరుచుకుంటూ తన కన్ను గీటుతాడు!
అసహ్యంతో, సిగ్గుతో తను తల దించుకున్నా పట్టించుకోడు. ఆ రాత్రి తనకు పనిష్మెంటే! అతనికి కావలసిన విధంగా ఎప్పుడూ చేయని జుగుప్సాకరమైన చర్యలన్నీ చేసి పెట్టాలి. అతన్ని అన్ని విధాలా సుఖపెట్టాలి. బొత్తిగా ఇష్టం లేని తను బలవంతంగా ఆ పనులన్నీ చేస్తుంటే అతనిలో మరింత ఆనందం కలుగుతుంది. బైటకు చెప్పలేని బూతుమాటలతో ఇంగ్లీషులో తనను సంబోధిస్తూ అతను పొందే పైశాచికానందానికి తను సమిధ అయిపోతూ ఉంటుంది. అతనికి కావలసినప్పుడల్లా తను వినోదాన్ని పంచినపుడే ప్రభాత్ మామూలుగా ఉంటాడు. బైట అందరికీ తమది అన్యోన్యమైన కాపురంలా కనిపిస్తుంది.
ఎన్నో ఆశలతో తన పెళ్ళిని ఘనంగా చేసిన తల్లిదండ్రు లను నొప్పించాలంటే తన వల్ల కాకే ప్రభాత్‌ను భరిస్తోంది తను. మామూలు మధ్యతరగతికి చెందిన తన కుటుంబం తను పుట్టింటికి వెళ్ళిపోతే భరించలేదని తనకు బాగా తెలుసు!
ఆలోచనల మధ్యలో ఎప్పుడో నిద్రలోకి జారుకుంది శ్రావణి. సాయంత్రం నాలుగవుతోండగా మళ్ళీ ప్రభాత్ నుండి ఫోన్ రావడంతో ఉలిక్కి పడి లేచింది.
”హాయ్ శ్రావ్స్!” మళ్ళీ అదే మార్దవమైన పిలుపు.
”చెప్పు ప్రభాత్!” పొడిగా అంది శ్రావణి.
”మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదురా!” గొంతు నిండా దిగులు నింపుకున్న అతని గొంతు!
”నేనూ తినలేదు!” కటువుగా అనడానికి ప్రయత్నించింది శ్రావణి. మొట్టమొదటి సారి తన గురించి తను చెప్పుకోగలిగే ప్రయత్నంలో విజయం సాధిండంతో సంతోషంగా అనిపించింది శ్రావణికి.
”అవునా. నేను తినలేదనే?! ఎంత ప్రేమరా నేనంటే?!” ప్లేటు ఫిరాయింపు!!
”అలా ఏమీ లేదు ప్రభాత్. నీ వింత కోరికలకు అసహ్యం వేసి అన్నం తినబుద్ధి కాలేదంతే. నీ గురించి బెంగ కాదు.” కత్తిపీటతో కోసినట్టుగా చెప్పింది శ్రావణి.
”అయితే రాన్రాను నా మీద నీకు ప్రేమ తగ్గిపోతోంది శ్రావణీ!” దీనంగా అన్నాడు ప్రభాత్.
”కావచ్చేమో ప్రభాత్! ఇంత కాలమూ మన బంధాన్ని నిలుపుకోవాలనే తాపత్రయంతో నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నీవు చెప్పిందల్లా వింటూనే ఉన్నాను. కానీ ఇంక నా వల్లకాదు!” చెప్పింది శ్రావణి.
”వల్లకాదూ లేదూ, వల్లకాడూ లేదూ… నిన్ను పెళ్ళాడిందే నేను చెప్పింది వినడానికి! ఇందులో రెండో మాట లేదు!” రంకెలేస్తూ ఫోన్ ఠకీమని పెట్టేసాడు ప్రభాత్.
ప్రభాత్ మాటలకు ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి రాగా వెక్కి వెక్కి ఏడ్చింది శ్రావణి. ఓ పావుగంట గడిచిన తరవాత ఆమె కాస్త తేరుకుంది. వర్షం పడ్డాక నిర్మలమైన ఆకాశంలా ఆమె మనసు తేలికయింది. నిదానంగా ఆలోచించడం ప్రారంభించింది.
పెళ్ళి అనే పవిత్రబంధాన్ని చక్కగా కాపాడుకోవాలని ఇంతకాలమూ తను ప్రయత్నించింది. కానీ ప్రభాత్‌కి అలాంటి ఉద్దేశ్యమే లేదు. అతని దృష్టిలో తనో విలాస వస్తువు! ఇంటిపనులు, వంటపనులు పని మనిషిలా చేసి పెడుతూ అతనికి కావలసినప్పుడల్లా సుఖాన్నిచ్చే కల్పతరువు! అంతకు మించి తనకు ఏనాడూ జీవిత భాగస్వామిగా విలువిచ్చిందే లేదు! అవును తనకు కానీ, తన మాటకు కానీ విలువే లేదు!!
వరదగోదారిలా మెదడంతా నిండిపోతున్న ఆలోచనలను పక్కన పెట్టి లేచింది శ్రావణి. కాగితం, కలం తీసుకుని తన ఆవేదనకు అక్షరరూపం ఇవ్వడం ప్రారంభించింది.
”ప్రభాత్!
డియర్ అని పలకరించడానికి ఇప్పుడు నువ్వు అర్హుడవు కావనిపిస్తోంది. ఎన్నోసార్లు నిన్ను నా ప్రేమతో గెలుచుకోగలనననమ్మకంతో ఎప్పటికప్పుడు నీపై ఏర్పడిన ద్వేషాన్ని మనసులోంచి తుడిచేస్తూ తాజాగా ప్రేమిస్తూనే ఉండేదాన్ని. కానీ నా నమ్మకం క్రమేపీ వమ్ముగా మారిపోయింది.
నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితులో లేక ఉద్యోగం చేసే సంస్థ వాతావరణమో లేక నువ్వు అలవరుచుకున్న పాశ్చాత్య సంస్కృతో కానీ నీ మనసు ఓ కామపిశాచిలా తయారయింది. అన్యోన్యమైన ఆలూమగల దాంపత్యానికీ, విచ్చలవిడిగా జరిపే కామక్రియకూ చాలా తేడా ఉంది. దురదృష్టవశాత్తూ నీ ప్రవర్తన ఎపుడూ రెండవ దానికే మొగ్గు చూపడం చాలాసార్లు నేను గమనించాను. ఎన్నోసార్లు నీకు నచ్చచెప్పే ప్రయత్నమూ చేసాను. అయినా నువ్వు వినలేదు. నేనే ఎలాగో రాజీ పడే ప్రయత్నాన్ని కూడా చేసాను.
కానీ పరిస్థితి పూర్తిగా నా చెయ్యి దాటిపోయిందని ఇవాళ ఉదయమే నాకు అర్థం అయింది. ఏమన్నావ్, నీ కొలీగ్ అనూప్ భార్య రమ్య నీకు బాగా నచ్చిందా? అతనికి నేను బాగా నచ్చానా? అందుకని మీ ఇద్దరూ పరస్పరం మమ్మల్ని బెడ్ పార్ట్‌నర్స్‌గా ఎంజాయ్ చేస్తారా?! ఇది నచ్చితే ఆ తర్వాత చాలా మంది కొలీగ్స్‌తో ఇలాంటి బార్టర్ సిస్టంనే కొనసాగించాలని ఉందా?! వెర్రితలలు వేసిన నీ కామోన్మాదానికి ఇదంతా పరాకాష్ట కాదా? అసలు ఇలాంటి పాపానికి ఓ భారతీయ స్త్రీగా నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇంకో మగవాడికి నా శరీరాన్ని ఎందుకు అర్పిస్తాననుకున్నావు? నీకు ఎవర్తో నచ్చిందని దాని మొగుడితో నువ్వు ‘డీల్’ పెట్టుకుంటే దానికి నేను సై అంటూ సహకరించాలా?!
ఓ విషయం అడుగుతాను ప్రభాత్. నాకు నచ్చిన మగవాడితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుంటే దానికి నువ్వు ఒప్పుకుంటావా? ‘నీ సొమ్మేం పోతుంది?’ అని నన్ను నిలదీసినట్టుగానే దీన్ని కూడా నువ్వు తేలికగా తీసుకుంటావా? నీతో డైరెక్టుగానే ఇవన్నీ మాట్లాడదామంటే నీ గొంతు పెంచి నా నోరు నొక్కేస్తావు. నన్ను డామినేట్ చేసేసి ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెడతావు. కానీ నా మనసులో రేగే అలజడి, నా దగ్గరున్న ప్రశ్నలు నీకు తెలియాలని ఈ లేఖ రాస్తున్నా. బహుశా నీతో ఇదే నా ఆఖరి సంభాషణ.
నా విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం తెచ్చుకుని స్వతంత్రంగా నేనే నా ఇష్టమొచ్చినట్టు బ్రతకాలనే నిర్ణయాన్ని తీసుకునేలా నన్ను చేసినందుకు చాలా థ్యాంక్స్. నా గురించి నువ్వు వెదికే ప్రయత్నం చేయకు ప్రభాత్. వచ్చే పదవ తేదీకి మన పెళ్ళై ఏడాది గడుస్తుంది. నీతో ఫస్ట్ ఏనివర్సరీ సెలబ్రేట్ చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం కన్నా మద పిచ్చివాడినుండి విముక్తి పొందబోతున్నాననే ఆనందమే నాకిప్పుడు కలుగుతోంది!
ఇంకెప్పుడూ నన్ను కలవాలని ప్రయత్నించకు. నా బ్రతుక్కెడో నేను హాయిగా బ్రతుకుతాను.
– శ్రావణి”
పూర్తి చేసిన ఉత్తరాన్ని టీపాయ్ మీద ఉంచి ఆ ఇంటిలోంచి బైటకు వచ్చింది శ్రావణి. అనుకోకుండా ఎందుకో పైకి చూసిన ఆమె మనసుకు నీలాకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగురుతోన్న గువ్వ మరింత ఉల్లాసాన్నిచ్చింది!!
బాగుంది.
ధన్యవాదములు
రాజేష్ యాళ్ళ గారు చాలా బాగుంది. ఈ మధ్య కాలం లో రెండు కథలు బాగా నచ్చినవి.” ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది” ఒకటి కాగా , రెండవది “ఆర్త్ద్రత”.
తెలియని “ఆర్త్ద్రత” రచయిత గారికి మీకు ధన్యవాదాలు , తెలిస్తే వారి వెబ్ లింక్ పంపగలరు.
ధన్యవాదాలు.
రాజేష్ గారు కథ బావుంది . ఇలాంటి నాగరికత మన మధ్యప్రవేశించి చాలా కాలమైంది. దానికి మీరు అక్షరరూపమిచ్చిన తీరు చాలా నచ్చింది. వివాహపు ముసుగులో స్త్రీలపై జరిగే ఇలాంటి లైంగిక ఒత్తిడుల నుండి బయటపడి ఎగరడం నేర్చుకునే గువ్వలు కావాలి. అక్షరాలలో గువ్వనెగరేసిన మీకు అభినందనలు .
వనజ గారూ ధన్యవాదాలండీ! విశ్లేషణాత్మకంగా మీ స్పందన, సూచన చాలా బావున్నాయి.
సూపర్బ్ రాజేష్ జీ