హృదయ వీణ (భూమిక నిర్వహించిన కథ, కవిత్వం పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – అంబల్ల జనార్దన్‌

డోర్‌ బెల్‌ కిచ కిచ మంది.

దయాకర్‌ నిద్రలేచి సెల్‌ఫోన్లో సమయం చూస్తే ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు! ఇంత ప్రొద్దున ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి కీ హోల్‌ నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచుని ఉంది. తను తలుపు తెరవగానే ”అన్నా! నాకిక నువ్వే దిక్కు” అని దయాకర్‌ కాళ్ళపై పడింది సారమ్మ. దయాకర్‌ అవాక్కయ్యాడు.

”లేమ్మా లే. ఏంటిది చిన్నపిల్లల్లాగ. రండి ఇంట్లోకి రండి.” అని ఆహుతులను తన ఇంట్లోకి ఆహ్వానించారాయన. ఓ గెస్ట్‌ రూం చూపించి, సర్వంట్‌ రూంలో ఉన్న గాలయ్యకు అతిథుల అవసరాలు చూడమని పురమాయించారు. ఎనిమిది గంటలకు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దామని సారమ్మకు చెప్పి, తన గదిలోకి వెళ్ళారు దయాకర్‌. పడకపై నడుం వాల్చారే కాని, ఆయన్ని నిద్రాదేవి కరుణించనంది.

సారమ్మ ఎందుకొచ్చిందబ్బా? అని ఆలోచించ సాగారాయన.

నిజానికి సారమ్మకు తనకు ఏ బంధుత్వం లేదు. దూరపు చుట్టరికం. చెల్లెలి వరుస. అరతే. అప్పుడప్పుడు తమ ఊరు వెళ్ళినప్పుడు తన భోజనాదులు చూస్తుంది సారమ్మ. ‘అన్నా’ అని ఆప్యాయంగా నోరారా పిలుస్తూ తనకు కొసరి, కొసరి వడ్డిస్తుంది. తన బాగోగులు కనుక్కుంటుంది. యాభై ఏళ్ళక్రితం తను ఊరు వదిలినప్పుడు ఆమె పుట్టలేదు కూడా. ఐనా ఏదో బంధం వారిద్దరిని దగ్గర జేసింది. అది అన్నాచెళ్ళెల్ల అనుబంధంగా దృఢపడింది. ముప్ఫైఏళ్ళ క్రితం తను దగ్గరుండి ఆమె పెళ్ళి చేశాడు. అప్పటినుండి తను ఏదో విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నాడు. కౌలు రైతుగా పనిచేసిన సారమ్మ భర్త రెండేళ్ళ క్రితం ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుండి వారి పిల్లల చదువు ఖర్చు తనే భరిస్తున్నాడు. సారమ్మ కూలీ పనులు చేస్తూ తమ బతుకుతెరువు కొనసాగిస్తోంది.

ఏడాదిక్రితం తను తమ ఊరెళ్ళినపుడు కొంత నలతగా కనిపించింది సారమ్మ. మాటిమాటికి జ్వరం వస్తోందనీ, అప్పుడప్పుడు విరోచనాలు కూడా వస్తున్నాయంది. మంచి మందులు వాడమని కొంత డబ్బిచ్చి, తను ముంబయి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడిదే చెప్పా పెట్టకుండా తన దగ్గరికి రావడం. ఓ గంట విశ్రాంతి తీసుకుని ప్రాతఃవిధులు తీర్చుకోవడానికి లేచాడు దయాకర్‌.

టిఫినైంతర్వాత సారమ్మ తన ముంబయి రాకకు దారితీసిన పరిస్థితులను ఏకరువు పెట్టింది. సారమ్మకు ఎయిడ్స్‌ వ్యాధి సోకిందని నిర్ధారణ కావడంతో ఆమె పుట్టింటివారు, ఇతర బంధువులేకాదు, ఊళ్ళోవాళ్ళంతా ఆమెను వెలివేశారు. ఊళ్ళో పని దొరకడం గగనం అయింది. భర్తలేని ఆమె ఏ చెడుతిరుగుళ్ళు తిరిగి ఆ వ్యాధి అంటించుకుందో అని అమ్మలక్కలు చెవులు కొరుక్కున్నారు. ఆ వ్యాధి తనకు సంక్రమించడంలో తన ప్రమేయమేమాత్రం లేదనీ, వడదెబ్బకు సొమ్మసిల్లి ప్రభుత్వాసుపత్రిపాలైన తనకు అక్కడ ఎక్కించిన రక్తం మూలంగా ఆ ప్రమాదకరమైన వ్యాధి సోకిందనే సారమ్మ సంజాయిషీ అరణ్యరోదనే ఐంది. ఆమెను ముట్టుకుంటే తమకు కూడా ఆ మారణాంతక వ్యాధి అంటుకుంటుందనే అపోహతో ఊళ్ళోవాళ్ళు సారమ్మతో సంబంధాలు తెంచుకున్నారు. సారమ్మకు అసలక్కడ మనుగడ సాగించడం దుర్భరమైంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో సారమ్మ దయాకర్‌ తలుపు తట్టింది. విషయం విన్న దయాకర్‌ చకితుడయ్యాడు. ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి బడుగుజీవులు ఎంత భారీమూల్యం చెల్లించాల్సి వస్తోందోనని బాధపడ్డాడు. సారమ్మ నిప్పులాంటిదనీ, అమాయకురాలనీ ఆయనకు పూర్తి నమ్మకం

ఉంది. సారమ్మను తన దగ్గర ఉంచుకోవడానికి అస్సలు సందేహించ లేదు దయాకర్‌ గారు. సారమ్మకూ, ఆమె ఇద్దరు కొడుకులకూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారాయన. వెంటనే తన సెక్రెటరీకి చెప్పి సారమ్మ వైద్యపరీక్షలకూ, ఆ తర్వాత చికిత్సకూ ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలను మంచి స్కూల్లో చేర్పించారు.

మర్నాడు తన గదిలో వీణ సాధన చేస్తున్నారు దయాకర్‌. భోపాల్‌ నుండి ఎవరో కలవడానికి వచ్చారని పనిమనిషి చెప్పడంతో తన ఆఫీస్‌ గదిలోకి వెళ్ళారాయన. భోపాల్‌లో జరిగే అఖిల భారత సంగీతోత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానించడానికి వచ్చారు వాళ్ళు. ఆ ఉత్సవ సంఘ పూర్వాపరాలు, ఆ ఉత్సవ ప్రాముఖ్యతను కనుక్కుని తన అంగీకారం తెలిపారు దయాకర్‌. ఆర్థిక, ప్రయాణ, వసతి విషయాలు తన సెక్రెటరీతో మాట్లాడమని చెప్పి తిరిగి తన వీణ సాధన గదిలోకి వచ్చారాయన. వీణ చేతిలోకి తీసుకున్నారు కాని, మనసు లగ్నం కాలేదు. ఆలోచనలు ఆయన గతం పుటల్లోకి తొంగి చూడసాగాయి. తూప్రాన్‌ తాలూకా దయగాడు, వీణా విద్వాంసుడు దయాకర్‌గా మారిన వైనం కళ్ళకు కట్టింది. అరవైఐదేళ్ళక్రితం, హైదరాబాద్‌ దగ్గరి తూప్రాన్‌ తాలూకాలోని ఓ కుగ్రామంలో పుట్టాడు దయాకర్‌. తెలంగాణ గ్రామాల్లో రెడ్ల ఆధిపత్యం సాగుతున్న కాలమది. ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదివిన దయాకర్‌ను పై ఊరికి పంపి చదివించే స్థోమత లేదని చేతులెత్తేశాడు దయాకర్‌ తండ్రి. స్థానిక రెడ్డిగారి గడిలో, తనతోపాటు పాలేరుగా ఉండమని బలవంతం చేశాడాయన. మాదిగ మాలోల్లకు చదువెందుకు? వాళ్ళేమైనా ఊళ్ళేలాలా? వారు చదివి చైతన్యవంతులైతే, తమఆగడాలు సాగవనీ, తమ ఉనికికే ముప్పొస్తుందని భయపడి, ఊళ్ళోని కామందులు, బడుగులకు చదువుపట్ల విముఖత కల్గించేవారు. ‘బాంచెన్‌ నీ కాల్మొక్త’ అనే మనస్తత్వంతో ఉన్న అప్పటి బీదప్రజలు, దొరల అభీష్టానికి విరుద్ధంగా ఏ పనీ చేసేవారు కాదు. తన దొర ప్రోద్బలంపై, దయాకర్‌ చదువుకు ఏడవ తరగతిలోనే స్వస్తి పలికి దొర దగ్గర, తనతోపాటు పాలేరుగా చేర్చాడు. మూన్నెళ్ళ దొరగారి కొలువులో నరకం కళ్ళజూశాడు దయాకర్‌. ఉదయం ఐదునుండి రాత్రి పదిగంటలదాకా ఊడిగం చేసినా, రెడ్డికి, రెడ్డిసానికి తృప్తి కలిగేదికాదు. ఏదో సాకుతో లెంపలు వాయించడమో చెర్నాకోలతో కొట్టడమో రెడ్డిగారి దినచర్యగా ఉండేది. ఆ వేధింపులు భరించలేక ఇంట్లోంచి పారిపోయి, బొంబాయి (అప్పటి బొంబాయి, ఇప్పుడు ముంబయిగా మారింది) రైలెక్కాడు దయాకర్‌. విక్టోరియా టర్మినస్‌ (ఇప్పటి ఛత్రపతి శివాజీ టర్మినస్‌)లో రైలు దిగిన దయాకర్‌ను టీ.సీ. అటకాయించాడు. టికెట్లేని, తెలుగు తప్ప ఇంకో భాష రాని దయాకర్‌కు ఏడ్వడంతప్ప ఇంకో మార్గం లేకపోయింది. అదే రైలు ఫస్ట్‌ క్లాస్‌ పెట్టెలోంచి దిగిన భాస్కర్‌ ఖాండేకర్‌ ప్లాట్‌ ఫాం నుంచి బయటకు వస్తూ, ఏడుస్తోన్న దయాకర్‌ను చూసి ఆగారు. దయాకర్‌ అమాయక మొహంలో ఆయనకేదో మెరుపు కనిపించింది. దండగతోసహా టికెట్‌ డబ్బులు కట్టి దయాకర్‌ను తమ ఇంటికి తీసుకుపోయారు. దయాకర్‌ తిరిగి తమ ఊరుకు వెళ్ళడానికి ససేమిరా అనడంతో అతన్ని తన దగ్గరే ఉంచుకున్నారు ఖాండేకర్‌ గారు. అలా యాభై ఏళ్లక్రితం బొంబాయిలో అడుగుపెట్టిన దయాకర్‌ అక్కడే పాతుకుపోయాడు. భాస్కర్‌ ఖాండేకర్‌ గొప్ప వీణా విద్వాంసులు. కొంకణస్త బ్రాహ్మణ కుటుంబానికి చెందినాయన. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం వారికి ”పద్మభూషణ్‌” కితాబిచ్చి తననుతాను గౌరవించుకుంది. దేశమంతా వారికి అభిమానులున్నారు. భారీ పారితోషికమిచ్చి వారి కచ్చేరీలు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఓ కచ్చేరికి హైద్రాబాద్‌లో హాజరై తిరిగి వస్తుండగా వారికి దయాకర్‌ తారసపడ్డాడు.

గిర్గాంవ్‌లోని ఫణస్‌వాడీలో వారికి సొంత బంగళా ఉంది. బొంబాయి స్థాయిని బట్టి, అది లంకంత కొంప అనే చెప్పవచ్చు. ఆ బంగళాయే ముంబాయిలో దయాకర్‌కు స్థావరమైంది. అదే వీధిలో ఉన్న బొంబాయి తిరుమల, ”శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరం”లోని స్వామివారి దర్శనం నిత్యకృత్యమైంది.

దయాకర్‌ ఖాండేకర్‌ గారింట్లో చేరడానికి మూడేళ్ళముందే ఆయన భార్య కాలం చేసింది. తన ఇద్దరు కొడుకులను, ఓ కూతురును పనిమనుషుల సాయంతో పెంచుతున్నారాయన. అచిరకాలంలోనే దయాకర్‌ ఆయన నాలుగో సంతానంగా పరిగణింపబడ్డాడు. నెలలోపలే మరాఠీ మాట్లాడడం నేర్చుకున్నాడు. ఖాండేకర్‌ కుటుంబసభ్యుల అవసరాలు తీరుస్తూ, వారి తలలో నాలుకలా మారాడు. తెలుగు మాధ్యమంలో చదివిన తన ఏడవ తరగతిని అటకమీద పెట్టి, అ, ఆ లతో మరాఠీ చదువుకు ‘శ్రీకారం’ చుట్టాడతను. ఆ తర్వాత మూడేళ్ళలో ప్రైవేటుగా, మరాఠీ మాధ్యమంలో యస్‌.యస్‌.సి. (స్కూల్‌ ఫైనల్‌) పాసయ్యాడు దయాకర్‌.

”భోజనానికి రండన్నయ్యా!” అన్న సారమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు దయాకర్‌.

….

సారమ్మ రాకతో దయాకర్‌ గారి ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అలంకరణపై శ్రద్ధ పెట్టి, ఇంటికి ఓ కొత్త శోభను కూర్చిందామె. ఇంటి ఖర్చులో చేతివాటం చూపుతున్న ఒకరిద్దరి బండారం బయటపెట్టి, వారి బాధ్యతలు తన నెత్తినేసుకుంది. దయాకర్‌ గారికి మంచి తెలుగు వంటలు చేసిపెట్టి, ఆయన ఆరోగ్యం మెరుగుపర్చింది. పేరుపొందిన డాక్టర్ల చికిత్సతో ఆమె వ్యాధి నిలకడగా ఉంది. ఒకింత బాగయింది కూడా. పుష్టికరమైన భోజనంతో మనిషి కాస్త ఒళ్ళు చేసింది. ఆమె ఇద్దరు కొడుకులు ఇంగ్లీష్‌ మాధ్యమంలో ముంబయి చదువులకు అలవాటుపడి, మంచిమార్కులు తెచ్చుకుంటున్నారు. సారమ్మకు తమ ఊరికంటే ముంబయి జీవితమే హాయిగా ఉంది. ఆ అదృష్టాన్ని తనకిచ్చిన

శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆమె మొక్కని రోజు లేదు.

”సాయంత్రం క్లబ్‌లో పార్టీ ఉంది. అక్కడే భోంచేస్తాను. నాకొరకు వంట చేయకమ్మా”

”అలాగే అన్నయ్యా! నువ్వేమనుకోనంటే నాదో చిన్న మనవి. మందు మోతాదును మించనీయకన్నయ్యా. నేను నీకు చెప్పగలదాన్ని కాదు కాని నీ ఆరోగ్యం జూసి కొంచెం అతిచనువు తీసుకుంటున్నా. నన్ను మన్నించన్నయ్యా” సారమ్మ వేడుకుంది. ”అలాగే” అని నిష్క్రమించాడు దయాకర్‌.

అభిజిత్‌, మయూర్‌, హస్ముఖ్‌ మరియు దయాకర్‌, వారి హౌసింగ్‌ కాంప్లెక్స్‌ క్లబ్‌ హౌస్‌లోని ఓ గదిలో కొలువుదీరారు. అభిజిత్‌ మరాఠీ రంగస్థల నటుడు. మయూర్‌ నాట్యాచార్యుడు. హస్ముఖ్‌ గుజరాతీ రచయిత. అందరూ అరవై సంవత్సరాల పై వయసుబడ్డవారే. ఒక్క దయాకర్‌ అవివాహితుడు కాని మిగతా ముగ్గురికి భార్యా, పిల్లలున్నారు. ముంబయి పశ్చిమ ఉపనగరం బోరీవలీలోని ఓ పెద్ద హౌసింగ్‌ కాంప్లెక్స్‌ క్లబ్‌ హౌస్‌లో వారప్పుడప్పుడు ఏదో మిషతో మందుపార్టీ చేసుకుంటారు. ఆ రోజు, తనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వారి ”కాళిదాస్‌ సమ్మాన్‌” పురస్కారం లభించిన సందర్భంగా దయాకర్‌ ఇచ్చే పార్టీ అది.

ఎవరికి కావలసిన బ్రాండ్‌ వారు చెప్పారు. నంజుకో వడానికి పకోడీలు, మసాలా జీడిపప్పు, ఉడకబెట్టిన వేరుసెనగ పలుకులు కూడా చెప్పారు. దయాకర్‌ పక్కా శాఖాహారైనా, అప్పుడప్పుడు మిత్రులతో మద్యం పుచ్చుకుంటాడు. అందుకని ఆయనిచ్చే పార్టీలో మాంసాహార పదార్థాలుండవు. లోకాభిరామాయణంలో పడ్డ మిత్రుల మాటల్లో, దయాకర్‌ పెళ్ళెందుకు చేసుకోలేదనే ప్రసక్తి వచ్చింది.

”నాకిష్టం లేదు, చేసుకోలేదంతే” దయాకర్‌ తేల్చేశాడు.

అప్పటికి రెండు రౌండ్లయ్యాయి. వారు మందు అదుపులోకెళ్ళిపోయారు. అభిజిత్‌ పట్టుబట్టాడు.

”లేదు దయాకర్‌! ఎప్పుడడిగినా, ఇవే మాటలు చెప్పి తప్పించుకుంటావ్‌. మేమంతా పిచ్చోల్లమై పెళ్ళి చేసుకున్నామా? మానవజన్మ ఎత్తినందుకు అన్ని కర్మలూ చేయాలి. ధర్మార్థకామ మోక్షాలు పాటించాలన్నారు పెద్దలు. కామకర్మ చేయందే నీకు మోక్షమెలా వస్తుంది?” మిగతా ఇద్దరూ వంత పాడారు.

”నాకు కర్మ సిద్ధాంతం మీద నమ్మకముంది కాని దాని ఫలమని మీరనే మోక్షంమీద లేదు. అయినా మీరు పదేపదే అడుగుతున్నారు కాబట్టి నా జీవితచరిత్ర మీముందు పరుస్తాను. దానికి చాలాసేపు పట్టవచ్చు. మీకు వినే ఓపికుందా?

”ఉంది”, ”ఉంది”, ”ఉంది” ముగ్గురూ కోరస్‌గా అన్నారు.

”సరే, మీ ప్రాప్తం. మధ్యలో అడ్డుకోవద్దు. బోర్‌ కొడుతోందని తిట్టుకోవద్దు” అని ఓ నిమిషం కళ్ళు మూసుకుని మననం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన వాక్ప్రవాహం ఇలా సాగింది.

”మాది హైద్రాబాద్‌ దగ్గరి ఓ పల్లెటూరు. చదువును మధ్యలో ఆపేసి, నన్ను ఓ రెడ్డి దగ్గర పాలేరుగా చేర్చాడు మా తండ్రి. ఆ దొర పెట్టిన హింస తట్టుకోలేక, నేను ఇంట్లోంచి పారిపోయి ముంబయి రైలెక్కాను. అది దాదాపు యాభైఏళ్ళ క్రిందటి మాట. నా అదృష్టం బావుండి, నా దేవుడు, నా గురుదేవుడు పరమపూజ్య

శ్రీ భాస్కర్‌ ఖాండేకర్‌ కళ్లల్లో పడ్డాను. ఆయన నన్ను చేరదీసి, నన్నో మనిషిగా నిలబెట్టారు. తెలుగు తప్ప వేరే భాష రాని నాకు, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు నేర్పించడమే గాకుండా, సంగీతంలో యం.ఏ. దాకా చదివించారు. బదులుగా నేను, విదురుడైన వారికీ, వారిద్దరి కొడుకులకు, ఓ కూతురుకు నాచేతనైన సేవలు చేశాను. కాలక్రమంలో, వారి కుటుంబసభ్యునిగా పరిగణింపబడ్డాను. మా గురువుగారి పిల్లలు పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తిరిగి మనదేశం వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పారు. ఒంటరిగా మిగిలిన మా గురువుగారు, తన పిల్లల సమ్మతితో నన్ను దత్తతకు తీసుకుని, ఆస్తితోపాటు, తన వీణా విద్యను నాకు ధారపోశారు. అలా నేను వీణా వాయిద్యం వైపుకు మళ్లాను. నా ధ్యాస, శ్వాస మా గురువుగారి శుశ్రూష. వీణ వాయించడం, అంతే! పెళ్ళి చేసుకోమని నా గురువుగారు ఎంతో పోరారు. కాని, ఆడవారిని చూస్తే నాలో ఏ భావనలూ కలిగేవి కావు. తమ బంధువుల్లోని ఒకరిద్దరి అమ్మాయిల సంబంధాలు చూశారు. వారితో బయటకు వెళ్ళి ఒకరినొకరు తెలుసుకోమని ప్రోద్బలపరిచారు. వారితో తిరుగుతూనే తగుదూరం పాటించేవాణ్ణి. నేనొక పప్పుసుద్దనని వారు చెప్పినట్టున్నారు. నన్ను ఓ మంచి డాక్టర్‌ దగ్గరకు పంపి పరీక్షలు చేయించారు మా గురువుగారు. నేను దాంపత్య జీవితానికి పనికిరానని ఆ డాక్టర్‌ తేల్చాడు. చిన్నప్పుడు నేను ఓ చెట్టుమీదినుంచి పడడంవల్ల కొన్ని నరాలు దెబ్బతిన్నాయట. అవి నన్ను సంసార సుఖానికి దూరం చేశాయని తేలింది. అప్పటినుండి నన్ను పెళ్ళి చేసుకోమని పోరడం మాని, తన విద్యని నాకు నేర్పే పనిలో పడ్డారు మా గురువుగారు. తనతోపాటు కచ్చేరీలకు తీసుకుపోయేవారు. ఒక్కోసారి నన్నొక్కణ్ణే పంపేవారు. నేను పూర్తిగా వీణకంకితమైపోయాను. పెళ్ళి చేసుకుని ఓ అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నించి అభాసుపాల వడం ఇష్టంలేక నేను పెళ్ళి మాట తలపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి నేను చేసింది కరెక్టా కాదా?” దయాకర్‌ మిత్రులకు సవాల్‌ విసిరాడు.

”కరెక్టేననుకో కానీ, ఈ మధ్యే మీ ఇంట్లోకి ఓ ఆడమనిషి వచ్చిందని విన్నాం” హస్ముఖ్‌ తన సందేహం వెలిబుచ్చాడు.

”ఓ! సారమ్మ గురించా మీరు అడిగేది? ఆమె నాకు దేవుడిచ్చిన చెల్లెమ్మ. నాలో క్రమశిక్షణ తెచ్చిన మాతృమూర్తి. ఆమె గురించి మీరు తప్పుగా అనుకోవడం చూస్తే బాధేస్తోంది.” దయాకర్‌ కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళల్లోంచి కొన్ని అశ్రుబిందువులు రాలాయి.

”క్షమించు దయాకర్‌. మన కాంప్లెక్స్‌లో నలుగురనుకునే మాట. నీ చెవినేశాం తప్ప, మేము వాటిని నమ్మి కాదు. ఇప్పుడు నువ్వు వివరించావు కాబట్టి, ఆ అపోహలు తొలగించే పనిలో పడతాం. ఇక భోజనానికి ఆర్డర్‌ చేద్దామా?” మయూర్‌, దయాకర్‌ చేతిని తన నుదురుకు తాకించుకుని అతని భుజం తట్టాడు.

….

ఓనాడు తన సాధన గదిలో తీరిగ్గా ఉన్న దయాకర్‌ దగ్గరికి సారమ్మ వచ్చి ”అన్నా! మొన్న నీకు జరమచ్చిండే, ఇప్పుడెట్లున్నది?”. ”నాకు బాగుందిగని నీకెట్లున్నది? మందులు మంచిగ వాడుతున్నవామ్మా?”, ”నువ్వున్నంక నాకేం ఫికర్‌? నాకిప్పుడు

ఉషారుగున్నది. నువ్వేమను కోకపోతే నువ్వు మనూరుకెల్లి అచ్చినంక యాడ ఉన్నవ్‌? గింత శ్రీమంతుడివెట్లయ్నవో జర సెప్పరాదె?” తను పెళ్ళెందుకు చేసుకోలేదనే విషయాన్ని తప్ప, క్లబ్‌ మిత్రులకు చెప్పిన తన ముంబయి ప్రస్థాన వివరాలు చెప్పి, ఆ తర్వాత సంఘటనలు క్లుప్తంగా చెప్పసాగాడు దయాకర్‌.

”మా గురువుగారు పరమపదించిన తర్వాత, నగరం నడిబొడ్డున ఉన్న ఇల్లునమ్మి, ముంబయి శివార్లలో ఈ ఐదువేల చదరపు అడుగుల డ్యూప్లెక్స్‌ ఫ్లాట్‌ తీసుకున్నాను. నువు చూస్తున్నట్టుగా కింద హాల్లో నా వీణ క్లాసులు, సాధన గదులు, వంట గది, ఆఫీస్‌ గది ఉన్నాయి. పైన నా పడక పోర్షన్‌ కాక కొన్ని అతిథుల కొరకు పోర్షన్లున్నాయి. బీదవారికి ఉచితంగా, మిగతావారినుండి వారి స్థోమతకు తగ్గట్టుగా ఫీజు తీసుకుంటాను. కచ్చేరీల సంభావన కూడా ఆయా సంఘాల స్థోమతానుసారం ఉంటుంది. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కొన్ని కచ్చేరీలు ఉచితంగా చేస్తాను. నా షష్ఠిపూర్తి తర్వాత కచ్చేరీలు చేయడం తగ్గించాను. ఏదో భగవంతుని దయవల్ల ఆదాయం బాగానే ఉంది. దానిలోని సింహభాగం మా ట్రస్ట్‌ కార్యకలాపాలకే కేటాయిస్తాను. మా గురువుగారి పేరుమీద నేనునెలకొల్పిన ”భాస్కర్‌ ఖాండేకర్‌ ప్రతిష్ఠాన్‌” ట్రస్ట్‌ ద్వారా ప్రస్తుతం పాతికమంది బీదపిల్లలకు స్కూల్‌, కాలేజ్‌ చదవులు చెప్పిస్తున్నాను. నీ పిల్లల చదువు ఖర్చు కూడా మా ట్రస్టే భరిస్తోంది. నాకా పెళ్ళాం, పిల్లలు లేరు. ఈ ఆదాయం, ఆస్తి, అంతా ఆ భగవంతుడిచ్చిందే. దాన్ని కొన్ని ధర్మకార్యాలకు వినియోగించడం నాకు ఆనందాన్నిస్తోంది. నాకెలా మా గురువుగారు ఆశ్రయమిచ్చారో, నేనూ ఆ గురువుగారు పెట్టిన భిక్షను నలుగురి సంక్షేమంకై ఖర్చు చేయాలనేది నా ఆశయం.

ఈ ఇల్లు మా ట్రస్ట్‌ పేరిట ఉంది. నా పార్థివ దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి దానం చేశాను. అలా నేను చనిపోయిన తర్వాత, నా అవయవాల రూపంలో పదిమందిలో బతకాలని నా ఆశ. ఈ ఇల్లు కూడా నా తర్వాత అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు ఆశ్రయం కావాలని నా కోరిక. అలా ట్రస్ట్‌ డీడ్‌లో స్పష్టంగా రాశాను. నేను నియమించిన ట్రస్టీలు ఆ విషయాలు చూస్తారు. సరే, బాగా పొద్దుపోయింది. ఇక విశ్రాంతి తీసుకుంటాను” అని తన గదివైపు నడిచారు దయాకర్‌.

……..ఙ……..

ఆరేళ్ళ తర్వాత, సారమ్మ పెద్ద కొడుకు బీ.టెక్‌., చిన్న కొడుకు బీ.కాం., పాసయ్యారు. వారిని పై చదువులకు అమెరికా పంపారు దయాకర్‌. కొడుకులు లేని ఆ ఇంట్లో సారమ్మకు

ఉండడానికి మనస్కరించలేదు. ఆమె మనసు తమ ఊరిపైకి మళ్ళింది. దయాకర్‌ అవసరాలను చూసేందుకు ఓ నమ్మకస్తురాలైన స్థానిక మహిళను నియమించి, తమ ఊరికి పయనమైంది సారమ్మ. అక్కడి ఆమె వసతి, భోజన, మందుల ఖర్చులు ”భాస్కర్‌ ఖాండేకర్‌ ప్రతిష్ఠాన్‌” భరించేలా ఏర్పాటు చేశారు దయాకర్‌.

తమ ఊరు చేరిన సారమ్మ అక్కడ సరిగా పథ్యం పాటించకపోవడంతో, ఎయిడ్స్‌ వ్యాధి తిరగబెట్టింది. దయాకర్‌ వెంటనే విమానంలో హైద్రాబాద్‌ వెళ్ళి, అక్కడినుండి కార్లో తమ ఊరు చేరారు. అక్కడ సారమ్మ మంచానికి అతుక్కుపోయి ఉంది. వెంటనే ఆమెను వరంగల్‌ దగ్గరి ”ఎయిడ్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌”కు తరలించారు. అక్కడ చేరిన ఆర్నెళ్ళలో సారమ్మకు ఈ నేలపై నూకలు చెల్లాయి. ఆమె పిల్లలు అమెరికా నుండి వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం ఆమె చిన్నబ్బాయి చేత అంతిమ సంస్కారం చేయించారు దయాకర్‌. పన్నెండు రోజుల విధి ముగియగానే, పిల్లలు అమెరికా వెళ్ళారు. దయాకర్‌ ముంబయి చేరారు.

….

ఓ రోజు తన ఈమెయిల్‌ చూసుకుంటుంటే, సారమ్మ పిల్లల ”పదవీస్వీకరణ” సంరంభానికి రమ్మని న్యూయార్క్‌ యూనివర్సిటీ నుండి ఆహ్వానం అందింది దయాకర్‌కు. ఆయన మహదానందంతో అమెరికా పయనమయ్యారు. తెలుగువారైన గొప్ప వీణా విద్వాంసులు తమ నగరానికి వస్తున్నట్టు తెలుసుకున్న అక్కడి తెలుగు సంఘం వారు దయాకర్‌ గారిని ఒప్పించి, అమెరికాలో ఆయన వీణ కచ్చేరీ ఏర్పాటు చేశారు.

పదవీ స్వీకరణ తర్వాత సారమ్మ ఇద్దరబ్బాయిలూ ”మామయ్యా” అని దయాకర్‌ కాళ్ళకు మొక్కారు. ఆయన వారిని లేవదీసి, తన గుండెలకు హత్తుకున్నారు.

మర్నాడు జరిగిన దయాకర్‌ గారి వీణ కచ్చేరీ బాగా రక్తి కట్టింది. కచ్చేరీ తర్వాత జరిగిన సన్మాన సభలో, సారమ్మ కొడుకులు, దయాకర్‌ గారు చేస్తున్న సంఘసేవనూ, ఆయన ఔన్నత్యాన్నీ, ముఖ్యంగా ఆయన తమ జీవితాల్లో వెలిగించిన దీపాలనూ కూలంకషంగా వివరించారు.

అప్పుడు సభికులకు దయాకర్‌ గారి హృదయవీణానాదం కూడా మంద్రస్థాయిలో, కాని స్పష్టంగా వినిపించింది.

(ఈ కథ, వాస్తవ సంఘటన ఆధారంగా రాయబడింది.)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.