మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు రెండవ ప్రపంచ మహిళల సదస్సు – ఖాట్మండు తీర్మానం – మార్చి 17, 2016 – వి. సంధ్య, POW

అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు హక్కుల ప్రకటన – ఖాట్మండు డిక్లరేషన్‌. హిమాలయ పర్వతాల్లో, లోయల్లో మారుమోగిన ఆ ప్రకటన దోపడి వర్గాలకు వణుకు పుట్టించే ప్రకటన. పునాది వర్గాల మహిళల ఆక్రోశం, ఆవేదన, ఆత్మగౌరవం విముక్తిగానమై మంచుకొండల్లో అగ్గి పుట్టించింది.

మహిళా విముక్తి విడిగా లేదని పీడిత ప్రజల విముక్తితోనే ముడిపడి వుందని, శ్రమ విముక్తితోనే స్త్రీ విముక్తి సాధ్యమని సదస్సు ఘోషించింది. సామ్రాజ్యవాద దోపిడి, అణిచివేతలకు వ్యతిరేకంగా భూస్వామ్య విలువలు, వివక్షను ధిక్కరిస్తూ సాగిన పోరాటాలను, సమాన హక్కుల కోసం, విముక్తికోసం సాగుతున్న పోరాటాలను మహిళలు ఉద్వేగంగా పంచుకున్నారు. తమ హక్కుల సాధనకై దోపిడి, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడాలన్న కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని అనుభవపూర్వకంగా అందించారు. సంఘటిత పోరాటాలద్వారానే మహిళలు హుందాగా, ఆత్మగౌరవంతో జీవించగలరనే చైతన్యాన్ని, హక్కులని సాధించగలమనే ధృడమైన నమ్మకాన్ని, కలలు సాకారం చేసుకోగలమనే విశ్వాసాన్ని కలిగించారు.

ఖాట్మండులో 2016 మార్చి 13 నుండి 18 వరకు సాగిన రెండవ ప్రపంచ మహిళా సదస్సులో పునాది వర్గాల మహిళలు, పోరాట యోధులు, మేధావులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. మహిళలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా అంశాలవారీగా వర్క్‌షాప్‌లు జరిపి, చర్చించి తీర్మానాలు చేశారు. ప్రారంభ సమావేశంతో మొదలై ఉత్తేజకరంగా జరిగిన ర్యాలీ, ప్రజాస్వామికంగా చర్చించి నిర్వహించిన జనరల్‌ అసెంబ్లీ, ముగింపు సమావేశం వరకు ఆద్యంతం ప్రతినిధులు అత్యంత ఉత్సాహంగా చిత్తశుద్దితో పాల్గొన్నారు. సదస్సు లక్ష్యాలను, మార్గదర్శక సూత్రాలను, అజెండాలను రూపొందించుకున్నారు. దానికి తగిన కార్యాచరణను రూపొందించి పిలుపులను, తీర్మానాలు ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న మహిళలు ఎక్కువగా పాల్గొన్న ఈ సదస్సులో భారతదేశం నుండి 11 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో ప్రగతిశీల మహిళా సంఘం (ూూఔ)తో పాటు ఎ.ఐ.ఆర్‌.డబ్ల్యు.ఓ. (ూ.I.=.ఔ.ూ.), డబ్ల్యు.యస్‌.యస్‌. (ఔ.ూ.ూ.), ప్రగతిశీల మహిళా సంఘం నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా అందజేస్తున్నాం.

మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు అనే దృక్కోణంతో పునాది వర్గాల మహిళల రెండవ ప్రపంచ మహిళా సదస్సు ఖాట్మండులో ఈ ఏడాది మార్చి 13 నుండి 18వ తేదీ వరకు జరిగింది. కొద్ది మంది పురుషులతో సహా దాదాపు రెండు వేల మంది అట్టడుగు వర్గాల మహిళలు మార్చి 13వ తేదీన జరిగిన ప్రారంభ ర్యాలీలో కదనోత్సాహంతో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల నుంచి వచ్చిన 1300 మంది అంతర్జాతీయ కార్యకర్తలు ఈ సదస్సులో పాలు పంచుకున్నారు. వీరిలో నేపాల్‌కు చెందిన 200 మంది కార్యకర్తలున్నారు. సదస్సుకు ప్రత్యక్షంగా హాజరు కాకపోయినా 61 దేశాలకు చెందిన మహిళలు పరోక్షంగా సదస్సు సన్నాహాక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేపాల్‌ పార్లమెంటు స్పీకర్‌ ఒన్సారి ఘర్తి మగర్‌ సదస్సును ప్రారంభించారు. మార్చి 14, 15వ తేదీల్లో జరిగిన వర్కుషాపుల్లో మహిళలకు సంబంధించిన పది ప్రధానమైన అంశాల మీద 560 మంది ప్రతినిధులు పాల్గొని చర్చలు జరిపారు.

మార్చి 16, 17వ తేదీలలో జరిగిన సాధారణ సభకు (జనరల్‌ అసెంబ్లీ) నలబై దేశాల నుంచి 74 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆఫ్రికా నుంచి పదమూడు, ఆసియా నుంచి ఎనిమిది, యూరపు నుంచి పన్నెండు, మధ్య ప్రాచ్యం నుంచి నాలుగు, లాటిన్‌ అమెరికా, దక్షిణ అమెరికా నుంచి రెండు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతిదేశం నుండి 5 మంది ప్రతినిధులు సభలకి సంబంధించిన ప్రాసెస్‌లో భాగంగా ఎన్నికయి పాల్గొన్నారు. ఎంతో మంది యువతులతో పాటు కొంత మంది యువకులు కూడా కార్యకర్తలుగా, ఉద్యమ సారధులుగా చైతన్యంతో నూతన భూమికను పోషించారు. భవిష్యత్తు పరిణామాల కోసం నిర్వహించిన రెండవ ప్రపంచ మహిళా సదస్సు కార్యకర్తలుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయి మహిళల కోసం పనిచేస్తున్న సంస్థలను, సమర శీల మహిళలను, సంఘాలను కలుపుకోవాలన్నదే సదస్సు మూల సూత్రాలు, లక్ష్యాలు. సాధ్యమైనంత ప్రజాస్వామ్య, విశాల ప్రాతిపదిక సూత్రాల ఆధారంగా పనిచేయాలన్న సిద్ధాంతాల కారణంగా, అనేక మంది అట్టడుగు స్థాయి మహిళలు, పురుషాధిక్య వ్యవస్థలపై, సామ్రాజ్యవాదంపై పోరాడుతున్న, తమ విముక్తికోసం ఉద్యమిస్తున్న పునాది వర్గాల, సంఘాల, సంస్థల చూపును సదస్సు ఆకర్షించింది.

సామ్రాజ్యవాదం సృష్టిస్తున్న సంక్షోభాలు, దాని తాలూకు భారం ప్రపంచ ప్రజల మీద ముఖ్యంగా మహిళల మీద పడటం వల్ల మహిళా ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపధ్యంలో అటువంటి సూత్రాల అనుసరణ ఎంతో కీలకం అవుతుంది. ఈ సంక్షోభాల కారణంగా నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్నాయి. పరిస్థితులు మరింతగా దిగజారి పోతున్నాయి. వేతన కుదింపు, ఉద్యోగాలు పోగొట్టుకోవడం వంటి ముప్పును మొదట మహిళలే ఎదుర్కోవలసి వస్తోంది. ఉపాధి భద్రతను కోల్పోయి దాడులకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఒకే పనికి మహిళలు, పురుషుల కన్నా తక్కువ జీతం పొందుతున్నారు.

సామ్రాజ్యవాదం తన ఉచ్చును బిగిస్తున్న ఆసియా ఖండంలో ఈ సంక్షోభం తీవ్రంగా ముదురుతోంది. దాంతో తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, నిర్వాసిత సమస్య అట్టడుగు వర్గాల ప్రజలపై పీడన మరింతగా పెరుగుతోంది. దేశాలను పాలిస్తున్న పాలక వర్గాలు సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు కార్పోరేట్లకు అప్పజెబు తున్నాయి. సామ్రాజ్యవాద విలయ ఉన్మాదం పెరిగిపోతోంది. వారి మిలటరీ బలగాలను సైతం దేశాలపైకి పంపుతున్నారు. ప్రజలపై యుద్ధమే జరుగుతోంది. మహిళలను మరిన్ని సంక్షోభాలు కమ్మేస్తున్నాయి. వీటితో పాటు ఆసియా ఖండంలో ఇప్పటికీ భూస్వామ్య భావజాలం వల్ల మహిళలకు మరిన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. వారు అనేక సంప్రదాయాలు, ఆచారాలు, కట్టడులు, నియంత్రణల మధ్య సామాజికంగా అణచివేతకు గురౌతున్నారు. పేద దేశాల నుంచి వేలాది మంది మహిళలు గల్ఫ్‌ దేశాలకు పొట్టచేత పట్టుకుని వలస పోతున్నారు. వారు ఇంటికి దూరమై ఎన్నో వెతలు అనుభవిస్తున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఘోరంగా జరుగుతోంది. వలస వచ్చిన కార్మికులు ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో బానిసల్లా పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. వారి శవపేటికలు ప్రతి రోజు స్వదేశాలకు తరలిపోతున్నాయి.

మధ్య ప్రాచ్యాన్ని ఇప్పటికీ సామ్రాజ్యవాద శక్తులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటున్నాయి. ఒక శతాబ్దానికి పైబడి పురుషులు, మహిళలు యుద్ధం తాలూకు దుష్ప్రభావాన్ని చవిచూస్తున్నారు. డాయిష్‌ (ఇస్లామిక్‌ రాజ్యం) కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా మహిళలపై యుద్ధం చేస్తోంది. డాయిష్‌ అందుకే విప్లవాన్ని అణిచివేయాలని, ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలను బానిసలుగా చేయడమే కాదు, హతం కూడా చేస్తోంది. వర్తమానంలో డాయిష్‌ ప్రధాన ముప్పుగా మారుతుంది. కానీ ఆ ప్రాంతంలో మతంలోని అంతర్గత వైరుధ్యాలు, ముదురుతున్న ఘర్షణలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

2011లో రాజకీయ స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నియంతల పాలనకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు అరబ్‌ వసంతానికి దారులు చేసిన ఉత్తర ఆఫ్రికా ఇప్పుడు ఛాందసవాదం నడుమ సామ్రాజ్య వాద యుద్ధం తాకిడికి విలవిలలాడుతోంది. గత శతాబ్ధంలో వలస వాదం నుంచి తమను తాము విముక్తం చేసుకున్న ఆఫ్రికా ప్రజలు ఇపుడు మళ్ళీ వలస వాద శక్తులకు, సంపన్న వర్గాల తొత్తులుగా వ్యవహరించే పాలక వర్గాల కోరలకు చిక్కారు. ఆ పాలక వర్గాలు ప్రజల ప్రయోజనాలను సంక్షేమాన్ని పణంగా పెట్టి అక్కడి సహజవనరులు సామ్రాజ్యవాద శక్తులు కబళించడానికి సహకరిస్తున్నాయి.

అమెరికా సామ్రాజ్య వాద శక్తికి వ్యతిరేకంగా పోరాడి మెరుగైన వ్యవస్థలు సాధ్యమేనని ప్రపంచానికి చూపిన లాటిన్‌ అమెరికా ప్రస్తుతం మితవాద శక్తుల, అభివృద్ధి నిరోధక శక్తుల దాడిని చవిచూస్తోంది. వెనిజులా, బ్రెజిల్‌ వంటి దేశాలలో అది ఎన్నికలో స్పష్టంగా కన్పిస్తున్నది. మితవాద అభివృద్ధి మరింతగా పెరుగుతుంది.

యూరప్‌ మహిళల పోరాటాల ద్వారానే జీవితంలో మెరుగుదల, చట్ట పరంగా సమానత్వం సాధ్యమైంది. అక్కడ కూడా మహిళలపై రెండు రకాల దోపిడి, అణిచివేత మరింత పెరిగినప్పటికీ ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడైనా సరే మహిళలు తమ హక్కుల కోసం నడుం బిగించినపుడు వారు ఇతర సమర శీల ఉ ద్యమాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్నారు. వివక్షకు వ్యతిరేకంగా, సంఘటితంగా, నిర్మాణయుతంగా పనిచేసే మహిళలపై కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు దాడిచేస్తాయి. ఆ దాడులపై జరిపిన పోరాటాలతో యూరపు మహిళలు మరింతగా బలపడ్డారు.

పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల సామ్రాజ్యవాదంతో వచ్చిన ప్రతికూల పరిస్థితులతో కాందీశీకుల సమస్య పెరిగింది. వలస వాద యుద్ధాలతో తమ కూడు, గూడు, భుక్తి పోగొట్టుకున్న వేలాది మంది ఆకలి బాధతో ఆశ్రయం పొందడానికి తరలి వస్తున్నారు. యూరప్‌లో అయితే వారిని స్థానిక ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. మహిళలపై హింస పెరగడంతోపాటు అత్యంత దయనీయ స్థితిలో వారు బతుకు వెళ్ళదీస్తున్నారు. వేలాది మంది శరణార్దులుగా వచ్చి, యూరపు దేశాలలోకి ప్రవేశించలేక, తిరస్కరణకు గురై మధ్యదరా సముద్రంలో మునిగిపోతున్నారు. కొందరు శవాలుగా తేలుతున్నారు. వలస వచ్చే వారి వలన యూరప్‌లో సమస్యలు ఎక్కువవుతున్నాయనే దాడిని కూడా భరించవలసి వస్తోంది. దాని వలన యూరపులో మరింత సంక్షోభం పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు, మతోన్మాద చాందసవాద శక్తుల ప్రాబల్యం పెరుగుతోంది. అమెరికా, ఆసియా, యూరప్‌ మితవాద (రైట్‌వింగ్‌) అభివృద్ధి నిరోధక శక్తులు పెరుగుతున్నాయి. అవి పీడితుల మీద ముఖ్యంగా మహిళల మీద దాడిని మరింత ఉధృతం చేస్తున్నాయి. మరో వైపు అనేక మంది మహిళలు, రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. లైంగికత్వం, జాత్యహంకారం, మత అసహనం వంటి సమస్యలను సవాళ్ళుగా స్వీకరించి ఎదురొడ్డి పోరాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక సంఘీభావ వైఖరికి సంకేతంగా నిలిచారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ మహిళల విముక్తి ఓ సవాలుగానే ఉంది. పురుషాధిపత్య వ్యవస్థలను సామ్రాజ్య వాద శక్తులు ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలలో చీలిక తెచ్చి మహిళలను తమ ఆధీనంలోనే ఉండేలా చూసుకుంటున్నాయి. ప్రయివేటు ఆస్తి వల్ల గుప్పెడు పాలక వర్గాలు, పెట్టుబడిదారులు ప్రపంచంపై గుత్తాధిపత్యం చేస్తున్నాయి. మహిళలను ప్రయివేటు ఆస్తిగా పరిగణించడం పెట్టుబడి దారీ విధానంలో భాగం, ప్రాతిప్రత్యాన్ని పాటించే వివాహంలో పిల్లలను కనిపెంచడమే వారి బాధ్యత. ఇంటిపని, గృహ నిర్వహణ, మహిళలదే బాధ్యత. పెట్టుబడిదారి శక్తుల ప్రయోజనం కోసం సామాజిక ఉత్పత్తిలో పాలు పంచుకోవడం పురుషుల ప్రధాన పాత్ర. దీనికి పెట్టుబడిదారి విధానం వత్తాసుపలుకుతుంది. రష్యా విప్లవం వందవ వార్షికోత్సవానికి ఒక ఏడాది ముందు కూడా మహిళలకు ఒకే పనికి సమాన వేతనాలు లేవు. సమాన హక్కులు లేవు. రెగ్యులర్‌ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. సామాజిక ఉత్పత్తిలో గణనీయ పాత్రను పోషించలేక పోతున్నారు. మహిళలు ఉద్యమాల ద్వారా వీటి కోసం ఎంతో కృషి చేశారు. మహిళలను ఇప్పటికీ వ్యాపార వస్తువులుగానే చూస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ రవాణాకు గురైన మహిళలు పిల్లల సంఖ్య బాగా పెరిగిపోతున్నది. అనేక యూరప్‌ దేశాలలో వ్యభిచారాన్ని చట్టబద్దం చేయడం, మహిళ హక్కులను దుర్వినియోగం చేయడం అనేక సంవత్సరాలుగా మాఫియాకు ఊతమిచ్చింది. మహిళలపై దోపిడికి వ్యభిచారాన్ని ఒక కవచంగా మాఫియా ఉపయోగించుకుంటున్నది. ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపక దళాల అలవాట్లతో ఇదే విషయం గోచరమౌతోంది. దాదాపు అన్ని యుద్ధ ప్రాంతాల్లో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. లేదా అలా జరగడం స్వచ్ఛందమే అన్న అపోహా కలగచేస్తున్నారు. ఫ్యూడలిజం – నయా వలసవాదం, ఫ్యూడలిజం – పెట్టుబడిదారి విధానం ఇలా ఏ రూపంలోనైనా ప్రైవేటు ఆస్తి తన పట్టును కట్టుదిట్టం చేస్తున్నప్పటికీ పురుషాధిక్య వ్యవస్థలు వాటి ఆలోచన విధానం వలసవాద నగ్న స్వరూపం మీద మహిళలు తమ పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో తమ విముక్తి కోసం తిరుగుబాటు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలను, సమరశీల మహిళా సంఘాలకు, సంస్థలను సమీకరించడంలో ప్రపంచ మహిళల సదస్సు కీలకపాత్ర పోషించగలదు. అన్ని దేశాలతో మహిళల ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులకు, పితృస్వామిక వ్యవస్థలకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా సవాలు విసిరే ఒక అంతర్జాతీయ వేదికను రూపొందించగలదు. కొద్ది సంవత్సరాలుగా ఇదే కృషి జరుగుతోంది.

ఆరు రోజుల రెండవ ప్రపంచ మహిళా సదస్సు నిర్వహణ ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయితే, విజయం సాధించాం. 2011 వెనిజులాలోని కారకాస్‌లో జరిగిన మొదటి సదస్సు నుంచి ఎన్నో విజయాలు సాధిస్తూనే ఉన్నాం. మార్చి ఎనిమిదో తేది, మే 1వ తేదీ నవంబరు 25వ తేదీలలో జరిగిన సంయుక్త కార్యాచరణలో ఎంతో మంది మహిళలు పాలు పంచుకున్నారు. వీరందరూ ఇపుడు అనుసంధానమయ్యారు. కీలకమైన పోరాటాల గురించి మహిళలు సమాచారం ఇచ్చి పుచ్చుకున్నారు. చర్చలు, కొత్త పరిణామాల గురించి ఒకరికొకరు పంచుకున్నారు. మహిళ లపై పెరుగుతున్న హింస దాడులు, యుద్ధాలు, పర్యావరణ ముప్పులు, కర్మాగారాల మూసివేత, కార్యాలయాల ఎత్తివేత, భూములను లాక్కోవ డానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటా లలోనూ పరస్పర మద్ధతు అందించు కున్నారు. సిరియాలోని రొజావాలో జరిగిన పోరాటానికి లభించిన మద్దతు పేర్కొనదగినది. ఇది కేవలం మహిళలపై పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే కాదు. ప్రపంచ వ్యాప్తం గా స్వేచ్ఛ, స్త్రీ ముక్తి కోసం జరిగిన పోరాటా లకు కేంద్ర బిందువైంది. డాయిష్‌ లాంటి బలమైన శత్రువును కూడా జయించవచ్చని కొత్త సమాజాన్ని నిర్మించు కోవచ్చని నేర్చుకున్నాం. రొజావా, కుర్దిస్థాన్‌లు సమర శీల మహిళా ఉద్యమాలు సాధించగల విజయాలకు ప్రతీకలు, పితృస్వామ్య వ్యవస్థలపై పోరుకు సరైన నమూనాలు కూడా. ప్రపంచ మహిళా సదస్సు తన స్వరూపాన్ని సమన్వయాన్ని, పరస్పర సహకార ప్రక్రియను తీర్చిదిద్దుకున్నది. రాజకీయ కలాపాలు స్వతంత్రంగా నిర్వర్తించడానికి అనేక మార్గాలు కూడా నేర్చుకుంది. నిధుల సమీకరణ కార్యక్రమాల ద్వారా స్వయంప్రతిపత్తిని సాధించింది. పరస్పర మద్ధతును అందించి, తన అన్ని కార్యక్రమాలకు విజయవంతంగా నిధులను సమకూర్చుకో గలిగింది.

ప్రపంచ మహిళా సదస్సుకు సమస్యలు కూడా చాలానే ఎదురయ్యాయి. అనేక సార్లు మన అంతర్జాతీయ సహకార ప్రక్రియకు తూట్లు పొడిచే విధంగా ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో ఎన్నో ఆటంకాలు ముందుకు వచ్చాయి. కొన్ని సార్లు ప్రాంతీయ, దేశీయ, ఖండాల సమన్వయకర్తలు తమ పనిని నిర్విరామంగా చేయలేకపోయారు. లేదా ఒంటరిగా పని చేసుకోవలసి వచ్చింది. రెండవ ప్రపంచ మహిళా సదస్సుకు తామే స్వయంగా నిధులు సమకూర్చుకోవలసి రావడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం అతి పెద్ద సవాలైంది.

రెండవ ప్రపంచ మహిళల సదస్సు సన్నాహక ప్రక్రియ ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. సదస్సు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసింది. మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు అనే నినాదం నిజమైంది. ముందు విధ్వంసకర భూకంపం వచ్చింది. తరువాత ఎన్నో అడ్డంకులు, నేపాల్‌ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే రీతిలో భారత ప్రభుత్వం చేసిన విస్తరణ వాద రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. అయితే నేపాలీ మహిళలు తమతో కలసి వచ్చే కొన్ని ఇతర వర్గాల సహకారంతో తమ దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసి ఉంది. రెండవ ప్రపంచ మహిళా సదస్సు నిర్వహణ పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. తీవ్ర సంకట పరిస్థితి ఏర్పడింది. నిధులు కూడా పెద్ద సమస్యగా మారాయి. అయితే నేపాల్‌ యునైటెడ్‌ ఉమన్స్‌ అసోసియేషన్‌ ఎంతో శ్రమకోర్చి ఆ సవాళ్లను అధిగమించింది. అందుకు అంతర్జాతీయ సహకారం కూడా లభించింది. అందుకే, రెండవ ప్రపంచ మహిళల సదస్సు అనుభవాల నుంచి నేర్చుకుందాం. మన విజయాన్ని పటిష్ట పరుచుకుని సవాళ్ళను అధిగమిద్దాం.

పెరుగుతున్న సామ్రాజ్య వాద సంక్షోభం, పర్యావరణ ముప్పు, ఆర్ధిక సంక్షోభం, యుద్ధాలు మనకు సవాళ్ళుగా ఉంటాయి. అయితే అవి సాధారణ ప్రజలను ముఖ్యంగా మహిళలను కూడా భవిష్యత్తు కోసం పోరాటాలకు నడుం బిగించే విధంగా సవాళ్ళు విసురుతాయి. ప్రత్యామ్నాయాల కోసం చర్చించి, మార్గాల కోసం విస్తృతంగా ప్రయత్నించవలసి ఉంటుంది. మన వ్యూహాలను, అభిప్రాయాలను, దృక్పధాలను పదును పెట్టుకోవడానికి చర్చలు సెమినార్లు, సదస్సులను నిర్వహించాలని భావించాం. అటువంటి చర్చలు మహిళా విముక్తి లక్ష్యంగా జరగాలి. రెండవ, మూడవ ప్రపంచ మహిళా సదస్సుల మధ్య అంతర్జాతీయ మహిళ సైద్ధాంతిక సదస్సును నిర్వహించమని కొత్త సమన్వయకర్తలను కోరుతున్నాం. భిన్న దేశాలకు చెందిన మహిళలు ఇందుకు బాధ్యత వహించాలి.

మన నియమావళికి అనుగుణంగా ప్రపంచ మహిళలందరితో కూడిన అంతర్జాతీయ ఉద్యమం నిర్మించబోతున్నాం. పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా పనిచేయడం ఇందులో మొదటి సూత్రం. ప్రజాస్వామిక పద్దతిలోనే ఆలోచించడం, పనిచేయడం రెండో సూత్రం. మూడోది, మనం స్వతంత్రులం కానీ ఒకరి నుంచి ఒకరం విడిపోము. మన ఆర్థిక మూలాలను బలపరుచుకుంటాం. అంతర్జాతీయ వాదుల వలె పనిచేయడం, ఆలోచించడం నాలుగో సూత్రం. చర్చల్లో ప్రజాస్వామిక సూత్రాలు పాటించడం మనం రూపొందించుకున్న ఐదో సూత్రం. అన్నింటికన్నా మించి మహిళల ఉద్యమం బలపడేలా, ధృడంగా తీసుకు వెళ్ళడానికి నిలకడైన మార్గంలో పని చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలి.

ప్రపంచ వ్యాప్తంగా ధృడమైన నిర్మాణాలను రూపొందించు కుందాం. ఆయా ఖండాలు, ప్రాంతాల మధ్య సమన్వయం జరగాలి. దానిని ఉన్నత స్థాయికి తీసుకురావాలి. అందుకోసం సంస్థాగతమైన కార్యాచరణను కూడా మెరుగు పరుచుకుందాం.

మన భద్రతపై నిర్లక్ష్యం వహించకుండానే అన్ని రకాల సాంకేతిక మార్గాలను ఉపయోగించుకుంటూ మనం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ సమాచార వ్యవస్థను పటిష్టపరుచుకుందాం.

మన పోరాటాలను సమన్వయపరుచుకుందాం. కష్టతరమైన ప్రతి పోరాటంలో మహిళలకు తమకు మద్ధతు వస్తోందనే భావన కలగాలి. వారి సమస్యలు, పోరాటాలు ప్రపంచం చూస్తున్నదనే స్పృహ కలగాలి.

మనదైన అస్తిత్వం, సంస్కృతిని రూపొందించుకుందాం. పురుషాధిక్య భావాజాలానికి, పితృస్వామిక చట్రాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగేలా, ఆలోచన ధోరణి మారే విధంగా చూడాలి.

మహిళలపై జరిగే హింసపై న్యాయబద్దమైన ప్రతిభావంతమైన పరిష్కారాలు వెతకాలి. అందుకోసం ప్రత్యేకమైన ఆత్మరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి.

ఇతర సామాజిక ఉద్యమాలకు సహకరిద్దాం. కార్మికులు, రైతు కూలీలు, రైతులు, పర్యావరణ వేత్తలు, శాంతి కార్యకర్తలు, లైంగిక, కుల, వర్ణ, జాతి, మత పరమైన అణిచివేత, పీడనకు వ్యతిరేకంగా పోరాడుతూ విముక్తి కోసం నడుంబిగించిన కార్యకర్తలకు చేదోడుగా ఉందాం. వ్వవస్థ మార్పుకై పోరాడుతున్న విప్లవకారులకు, విమోచన కొరకు పోరాడుతన్న వారందరికి సహకరిద్దాం.

పెట్టుబడి దారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను కోరేందుకు, కనుగొనేందుకు, చర్చించేందుకు కలిసి కృషి చేద్దాం. రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో తీవ్రమైన మార్పులు వస్తే గానీ మహిళల జీవితంలో పెనుమార్పులు సాధ్యంకావు. ఆలాంటి లక్ష్యం సాధించాలంటే వ్యవస్థను మార్చేందుకు చేస్తున్న ఇతర పోరాటాలతో జోడించి మహిళల విముక్తి పోరాటం కలిసి నడవాలి.

ఒక దృక్పధం ప్రకారం, నిరంతరం చురుకుగా, దీర్ఘ దృష్టితో పరస్పర సహకారమందించుకునే సమరశీల ప్రపంచ మహిళల

ఉద్యమాన్ని నిర్మిద్దాం.

మహిళల ఉద్యమ భవిష్యత్తు కోసం యువ ప్రపంచ మహిళలుగా బాధ్యత తీసుకోవాలన్న యువతుల నిశ్చయాన్ని బలపరుద్దాం.

మూడు రోజుల సంయుక్త కార్యాచరణ పోరాట ప్రణాళిక రూపకల్పన విజయంతో మనకు మార్గదర్శనం లభించింది. ఐదేళ్ళ తరువాత 2021లో మరో ఖండంలో జరగబోయే తదుపరి మహిళల సదస్సు కోసం ఎదురుచూద్దాం. 2021లో మరో ఖండంలో కలుద్దాం.

ప్రపంచ మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సామ్రాజ్యవాదాన్ని ఓడిస్తారు. మహిళలపై వివక్ష, దోపిడి, పీడన లేని సమాజాన్ని నిర్మిద్దాం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.