రోహితా… రోహితా
– మిత్ర
రోహితా రోహితాని అమ్మ నిన్ను పిలిచెనా
నవమోహన రూపాన్ని దేశం పరిగాంచెనా
ఏ వెలివాడల రూపమూ
ఎవడార్పలేని దీపమూ
ఏ మనువాదుల శాపమూ
ఏ కులనీతి కూపమూ
రోహితా రోహితా నువు తిరుగరాయి ఈ చరితా ||రోహితా||
1. ఏ ద్రోణుడు తెంపిన
బొటన వేలవైతివో
ఏ ప్రతిభల కొమ్ములకు
మతులు బోగొడ్తివో
శంభూకుని తల తొడిగి
ఆంబారి నెక్కితివో
సుతిమెత్తని గుండె తోటి
ఇనుపతెరను చీల్చితివో
రోహితా రోహితా నువు
తిరుగరాయి ఈ చరితా || రోహితా ||
2. వెలివేసిన ఐదుగురిని
పాండవులని అంటరా
ప్రకృతి శోధకుని
కులగోత్రాల్ దీస్తరా
చెమట చుక్క చుక్కల్లో
విహరించనిస్తరా
పాలపుంత నువ్వేనని
కేరింతలు గొడ్తరా
రోహితా రోహితా నువు
తిరుగరాయి ఈ చరితా ||రోహితా||
3. గురుకులమై వెలివేసిన
గురుతు యాదికున్నది
గాట్స్ పడగవిప్పి గద్దె
బుసలు కొడుతున్నది
జార్జిరెడ్డి నతమార్చిన
కత్తులెందుకన్నది
పెట్టుబడికి పిలకజుట్టు
మొలకలెత్తుతున్నది
రోహితా రోహితా నువు
తిరుగరాయి ఈ చరితా || రోహితా ||
4. వందపూలు వికసించక
ఒక్క పువ్వె చీలునా
ఏకత్వపు దండయాత్ర
భిన్నత్వం కూల్చునా
ఎవరి అగ్రహారాలు
ఉగ్రరూపమెత్తినయ్
ఏ మడిని గట్టుకుని
బడిని గుడిగ జేసినయ్
రోహితా రోహితా నువు
తిరుగరాయి ఈ చరితా || రోహితా ||
5. విశ్వవిజ్ఞానంపై
అశ్వమేధ యాగమూ
రోహితులు శోషితులు
ఆహుతయ్యె పాపమా
ఆగమేఘాలమీద రారు
ఏ యోగులు బోగులు
ఆదమరిచి ఉండకుండ
ఎత్తుదాము పిడికిల్లు
రోహితా రోహితా నువు
అంబేద్కర్ రూపమా
నీలి నీలి మేఘాల్లో వెలిగె
ఎరుపు దీపమా
(వేముల రోహిత్ బలవన్మరణానికి విద్యాలయాల్లో
తిష్టవేసిన హిందుత్వమే కారణమని చాటుతూ….)
(జనవరి 25, 2016 చలో హెచ్‌సియూ లో పాడిన పాట)