కృపాకర్ మాదిగ పొనుగోటి
కంచికచర్ల, కారంచేడు, నీరుకొండ, చుండూరు, పిప్పర, దొంతలి, పోలేపల్లి, వాకపల్లి – దళితులపై జరిగిన అత్యాచార సంఘటనలన్నీ కోస్తా ప్రాంతానికి సంబంధించినవే. నాయకులంతా కోస్తా ప్రాంతానికి చెందినవారే. ఉద్యమాల కోస్తావే. ప్రచారమిచ్చిన మీడియ యజమాన్యాల కోస్తావే. దళితులపై అత్యాచారాలను వెలికితియ్యడంలోన, బాధితులకు కొద్దిమేరకైనా న్యాయం జరగడంలోన, ప్రారతం వివక్ష, నాయకుల వివక్ష, పోలీసుల వివక్ష, ప్రభుత్వాల వివక్ష జాగ్రత్తగా గమనిస్తే కొట్టొచ్చినట్టు తేడాలు స్పష్టమౌతాయి.
నిజానికి తెలంగాణాలో అంటరానితనం, అత్యాచారాలు, మాదిగలపై, ఆదివాసులపై, దళితులపై నిత్యం చాలానే జరుగుతున్నాయి. రావల్సినంతగా వెలుగులోకి రావడం లేదు. తెలంగాణ గ్రామాల్లోని హోటళ్ళలో కొన్ని చోట్ల రెండు గ్లాసుల పద్ధతి పోయినప్పటికీ, ఒకే రకమైన గ్లాసులకి అడుగున రంగు చుక్కలు పెట్టి గుర్తించటం ద్వారా రెండు గ్లాసుల పద్ధతి కొన్నిచోట్ల అమలవుతూనే ఉంది. అలాగే తెలంగాణలో జోగినీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలనం కాలేదు. తెలంగాణ మాదిగల్లో, దళితుల్లో, ఆదివాసుల్లో పేదరికం, నిరక్షరాస్యత, అశక్తత, అవకాశాల చట్రానికి దూరంగా ఉంచటం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇందుకు ముఖ్య కారణాలు 1. కమ్యూనిస్టు, నక్సలైటు, రాష్ట్ర సాధన ఉద్యొమాలు భూమి, అధికార సాధన కోసం ఇచ్చిన ప్రాధాన్యతలు తెలంగాణ దళితుల దైనందిన సాంఘిక, ఆర్థిక, విద్యా, రాజకీయ సమస్యలకు ఇవ్వలేదు. 2. కమ్యూనిస్టు, నక్సలైటు, రాష్ట్ర సాధన ఉద్యమాల అగ్రనాయకత్వాలు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ తదితర దళితేతర, ఆదివాసియేతర ఆధిపత్య కులాలకు చెందినవారు అయి వుండటం. 3. వివిధ ఉద్యమ పార్టీలలో, ఉద్యమ సంస్థల్లో మాదిగ, లంబాడి, దళిత, ఆదివాసీ నాయకత్వాలను పై స్థాయిలో అంగీకరించలేకపోవడం, ప్రోత్సహించక పోవడం, అణగారిన కులాల, జాతుల నాయకత్వాలను ఎదగనివ్వని భూస్వామ్య, కులస్వామ్య పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉండటం.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని పొట్టిలంక గ్రామంలో దళితుని (మాల కులస్తుని) హత్యోదంతం సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియ, ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలారు. కాగా, ఈ మధ్య మహబూబ్నగర్ జిల్లా మద్దరు మండలం, నందిగామ గ్రామంలో పెద్దింటి ఉసేనప్ప (32) అనే ొమాదిగ దళితుణ్ని 3-7-2008 నాడు అగ్రవర్ణాలవారు హత్య చేస్తే, అది జిల్లా దాటని వార్తగానే మిగిలింది. తన ప్రాణానికి ముప్పు వుందని హతుడు ముందే స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వుండి పట్టించుకోలేదు. మాదిగ మహిళా సర్పంచి హక్కులకు మద్దతుగా, గ్రామ అగ్రకుల పెత్తందార్లను ఎదిరించటమే ఉసేనప్ప హత్యకు కారణం. ఈ సంఘటన పట్ల మాదిగల ఆగ్రహాన్ని, మాదిగ ఉద్యమ చైతన్యాన్ని గమనించిన పోలీసులు ప్రస్తుతం ఉసేనప్ప గ్రామమున్న నారాయణపేట రెవెన్యూ డివిజన్ అంతటా సభల, సొమావేశాల నిషేధిస్తూ సెక్షన్స్ 30, 144లను గ్రాొమాల్లో విధించారు! జిల్లా యమ్మార్పీయస్ నాయకులు, జడ్చర్ల శాసనసభ్యుడూ జిల్లా యస్పీ కార్యాలయంపై జనంతో వెళ్ళి పోరాటానికి దిగిన ఫలితంగా నేరస్తుల్లో కొద్దిమందిని మాత్రమే ఇప్పటివరకూ అరెస్టు చేశారు.
గతంలో నామాల బాలస్వామి సజీవదహనం జరిగింది. ఈ సంఘటనలో కేసు వీగిపోయింది. నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. మాదిగ దండోరా ఉద్యమం ఆవిర్భవించాక తెలంగాణ దళితుల్లో చైతన్యం బాగా పెరిగింది. కుల అణచివేతలపై తెలంగాణ దళితుల్లో ప్రతిఘటనా చైతన్యం పెరుగుతున్నకొద్దీ, సహించలేని దళితేతర ఆధిపత్య కులాలు, వారి పోలీసుల నుంచి ప్రతీకారం, అణచివేత తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి.
అధికరణం 17 ద్వారా భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిర్మలించింది. కాని, ఆధిపత్య కుల వ్యవస్థతో నిండిన భారతీయ సాంఘిక వ్యవస్థ, పౌర సమాజం అంటరానితనాన్ని, అత్యాచారాలను, వివక్షను కొనసాగిస్తూనే ఉన్నాయి. 1955 పౌరహక్కుల రక్షణ చట్టం కింద అంటరానితనం, కులవివక్ష కేసులు విచారించడానికి ప్రత్యేక పోలీసు విభాగం ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత వల్ల, అధికారుల్లో సంకల్పబలం లేనందువల్ల కేసుల విచారణ నత్తనడకగా మారింది. కారంచేడు (1985), చుండూరు (1991) సంఘటనల నేపథ్యంలో పార్లమెంటు 1989లో యస్సీ, యస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం చేసింది. ఈ చట్టంలో అత్యాచారానికి సమగ్రమైన, స్పష్టమైన నిర్వచనమే లేదు. కొన్ని సందర్భాలను, చర్యలను పేర్కొని, అవి మాత్రమే శిక్షార్హమైన నేరాల కిందికి వస్తాయని మాత్రమే ఈ చట్టం చెబుతోంది. గృహహింస చట్టంలో మాదిరిగా యీ అత్యాచారాల నిరోధకచట్టం (1989)కి విస్తృతమైన నిర్వచనం చేయవల్సిన అవసరం చాలా ఉంది. యస్సీ, యస్టీలను కించపరిచే ఏ రకమైన ప్రవర్తన, చర్య, మాట, చపు, కదలికలైనా సరే – అత్యాచారంగా పరిగణించబడుతుందనే నిర్వచనాన్ని న్యాయవ్యవస్థ, చట్టసభలు చేయవలసి ఉంది.
రాష్ట్రంలో యస్సీ, యస్టీలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. కాగా, కోస్తా కంటె ఎక్కువ సంఖ్యలో తెలంగాణ, రాయలసీమల్లో అత్యాచారాల సంఘటనలు దళితులపై, ఆదివాసులపై జరుగుతున్నప్పటికీ వెలుగు చూడటం లేదు. న్యాయం జరగటం లేదు. నేరం తీవ్రత ననుసరించి సెక్షన్లు నమొదు చేయవలసి ఉండగా, నేరం తీవ్రత ఎక్కువగా ఉన్న చాలా సందర్భాల్లో అత్యాచారాల నిరోధక చట్టం (1989)లోని కనిష్టమైన సెక్షన్ 3(ఎక్స్) కింద మాత్రమే పోలీసులు కేసులు నమొదు చేస్తుండటం అలవాటుగా మారింది. కొద్ది సంవత్సరాల క్రితం ఈ చట్టం కింద కేసులు నమొదు చెయ్యవద్దని జిల్లా పోలీసులను ఆదేశిస్తూ నెల్లూరు జిల్లా యస్పీ సర్క్యులర్ తీసిన ఉదంతంపై పెద్ద ఉద్యమమే జరిగింది. ఇక పోలీసుల లెక్కల ప్రకారం 2007 జనవరి నుండి ఈ ఏడాది మార్చి వరకు 4826 అత్యాచారాల కేసులు నమొదయ్యయి. ఇందులో 43 శాతం తప్పుడు కేసులని తేల్చారు. 2872 కేసుల్లో పరిశోధన పూర్తిచేశారు. 1505 కేసుల్లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ చట్టం కింద 2000 సంవత్సరంలో మొత్తం 2470 కేసులుండగా కేవలం 0.2 శాతం నేరస్తులకు మాత్రమే శిక్ష పడింది. 2005 నాటికి పరిస్థితి కొంచెం మెరుగయ్యి 10.3 శాతం నేరస్తులకు శిక్షపడింది. జాతీయ స్థాయిలో శిక్షరేటు 12 శాతం ఉంది. ఈ చట్టం అమలు పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికారక పర్యవేక్షణ కమిటీలున్నాయి. ఐతే, ఈ కమిటీలు సరిగ్గా పనిచేయటం లేదు.
పై వాస్తవాలను గమనిస్తే యీ అత్యాచారాల నిరోధకచట్టం ఎంత బలహీనమైనదో తెలిసిపోతుంది. ఈ చట్టం అమలు పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థమౌతుంది. పేదరికం, నిరక్షరాస్యత, అశక్తత వల్ల బాధితులు ఈ చట్టాన్ని కనీసంగానైనా అమలు చేయించుకోలేకపోతున్నారు. బాధితులకు, సాక్షులకు రక్షణలేని పరిస్థితులు సర్వత్రా ఉన్నాయి. నేరస్తులు అన్ని విధాల ఆధిపత్యం కలిగినవారవటం, నేర పరిశోధనలో పోలీసుల వివక్ష, జాప్యాలు, లోపాలు, బెదిరింపులు, రాజీలు తదితర కారణాల వలన ఈ చట్టం తూతూ మంత్రంగా అమలవుతోంది. వాస్తవాలు ఇలా ఉండగా, కొంత మంది అగ్రవర్ణాల వారు, వారి మీడియ, వారి మేధావులు, వారి అధికారులు ఈ చట్టాన్ని సవరణ ద్వారా మరింత బలహీనపరచాలని వాదిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. బాధితుల్ని, బాధితులైన దళితులు, ఆదివాసులకు రక్షణ కల్పించవలసిన చట్టాలను మరింత నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థలో ఉండటం బాధాకరమైంది. చట్టాలను మొద్దుబార్చడం, సంఘటనలను వెలుగులోకి రాకుండా చెయ్యటం, బాధితులకు సరైన న్యాయం జరక్కపోవడం మాదిగలు, దళితులు, ఆదివాసుల విషయంలోనే మనం చూస్తున్నాం. కోస్తావారికంటే తెలంగాణ, రాయలసీమ ొమాదిగల దళితుల, ఆదివాసుల పరిస్థితులు మరీ దయనీయంగా ఉన్నాయి. అసాంఘికంగా ఉన్న కుల సామాజిక పరిస్థితులను బలహీనపరిస్తేనే తెలంగాణ మాదిగలకు, దళితులకు, ఆదివాసులకు సామాజిక న్యాయన్ని సాధించగలం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags