డా: మానేపల్లి
విద్య అంటే అక్షరాస్యత అని అర్థం చెప్పుకోవడం సరికాదు. విద్య అంటే అక్షరాస్యతతో పాటు, లోకజ్ఞానం, సమకాలీన స్థితిగతుల అవగాహన, ఇంకా ఏదయినా ఒక ఉద్యోగానికి కావలసిన శిక్షణ, తగిన పరిజ్ఞానం, అర్హత – అని వివరణ ఇవ్వాలి. ఈ అర్థంలో భారతీయ స్త్రీలు ప్రపంచంలోని అనేక వెనుకబడిన దేశాల్లో కంటేె వెనుకబడి వున్నారని గుర్తించాలి. ఐతే ఈ దిశగా ప్రయత్నాలు జరగడం లేదనుకోనవసరం లేదు. 1860-70 నాటికే – మహాత్మా జోతిరావ్ ఫులే భార్య సావిత్రీబాయి తొలి ఉపాధ్యాయురాలిగా పనిచేసిందని మనకు తెలుసు. ప్రాచీనకాలంలో కూడా విద్యావంతులయిన స్త్రీలు ఉన్నారని చరిత్ర చెబుతున్నది. ప్రాకృతభాషలో వున్న ”గాధాసప్తశతి” అనే సంకలనగ్రంథంలో – కనీసం పదిమందికిపైగా కవయిత్రులున్నారని – సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటి ప్రారంభంలో ఆరుద్ర వివరించారు. ”గాధాసప్తశతి” హాల చక్రవర్తి సంకలించిన (నిర్మింపించిన) గ్రంథం. ఈయన క్రీ.శ. ఒకటవ శతాబ్దికి చెందిన శాతవాహన పాలకుడు. అంటే ఆనాటికే కవయిత్రులున్నారు. మధ్య యుగాల్లో తాళ్లపాక తిమ్మక్క, తరిగొండ వెంకమా౦బ, ముద్దుపళని, రంగాజమ్మ, కృష్ణాధ్వరి, మధురవాణి, ఈ మొదలైన వారితోపాటు ఆతుకూరి మొల్ల వంటి కవయిత్రులున్నారు. ఇరవైయవ శతాబ్దంలో అచ్చమా౦బ, చావలి బంగారమ్మ, విశ్వసుందరమ్మ, కనుపర్తి వరలక్ష్మి, ఈశ్వరీబాయి, గోరా భార్య సరస్వతి, ఆచంట శారదాదేవి, సేనాపతి రుక్మిణి – మొదలైనవారు విదుషీమణులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ వరస ఇంకా విస్తరించి చెప్పుకోవచ్చు. ఐతే ”ఇది గతమెంతో ఘనకీర్తి” అని భుజాలు చరుచుకోవడానికి తప్ప – వాస్తవాల్లోకి వెళితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ వంటి మహానగరాల్లో సైతం కేవలం అక్షరాస్యులైన స్త్రీల సంఖ్య – పురుషులకంటేె బాగా దిగువన వుంది. పల్లె ప్రాంతాల్లో ఇది 10-25% మించలేదు, వారిలో మళ్లీ – అక్షరాస్యులు ఎక్కువ, విద్యావంతులు తక్కువ. కనీసం పదవతరగతి పూర్తిచేసిన ఆడపిల్లల శాతం – మించలేదు. మగపిల్లల్తో పోలిస్తే బాగా తక్కువ. మహానగరాల్లో సైతం మహిళా ఉద్యోగుల శాతం 15-20% దాటలేదు. బ్యాంకులు, ఆస్పత్రులు, స్కూళ్లు-కాలేజీలు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను, రెవెన్యూ పోలీసు మొదలైన వివిధ ప్రభుత్వోద్యోగాల్లో ఆడవారి సంఖ్య బాగా తక్కువ.
మొట్టమొదటి కారణం ఆడపిల్లల్లో – బాల్యవివాహాలు, లేదా తగినంత వయసు రాకుండానే పెళ్లిళ్లు. ఇనపచట్రం వంటి వివాహవ్యవస్థ, కుటుంబ జీవితం – ఇవి ప్రధానమైన అవరోధాలు. రెండవది – ఆడపిల్లకి ఎంతోకొంత చదువు చాలు, ఉద్యోగాలు చేసి ఊళ్లేలనక్కర్లేదు అనే సంప్రదాయిక దృక్పథం. అందువల్ల పది దాటడం సంగతలా ఉంచి పదవతరగతిలోపునే – చదువు ఆపుజేయించే పరిస్థితే ఎక్కువ. ఏడెనిమిది తరగతుల ప్రాయంలో ఆడపిల్ల రజస్వల కాగానే చదువు మాన్పించడం – ఈ కంప్యూటర్ యుగంలో బాగా ఎక్కువ. పైకి కనిపించేదంతా నమ్మడం కాక – వాస్తవాల్లోకి దిగి గణాంక వివరాల్లోకి వెళ్లి, కారణాలు విశ్లేషించుకుంటే – పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవుతుంది.
వివాహవ్యవస్థ ఈనాటికీ స్త్రీలకు ఒక గుదిబండలానే వుంది. వరకట్న మరణాలు, భర్త తాగుడు జూదం వ్యభిచారం, అనుమానంతో నిరంతరం చావబాదటం, ఆడపిల్లల్ని కంటే మహానేరం, ఉమ్మడి కుటుంబాలున్నచోట అరవ చాకిరీ – ఇదంతా కంప్యూటర్ యుగంలో కూడా సాగుతూనే ఉన్నాయి. హింసించే పరిస్థితుల్లో మార్పు వచ్చింది తప్ప, హింస పూర్తిగా తొలగిపోలేదు. ఇదంతా విద్యావంతులైన స్త్రీలకు ఏమీ తప్పలేదు. ఇక ఉద్యోగానికి బయటికి పంపే పరిస్థితి ఏది? చదువుకున్న ఆడదాని చదువు – నాలుగుగోడలకే పరిమితం. మహా అయితే పిల్లలకి హోంవర్కు. అతికొన్ని సందర్భాల్లో భర్తకు సాయం – ఉద్యోగం, వ్యాపారం అదీ ఇంటిగడప దాటకుండా. కార్యేషుదాసీ, శయనేషు రంభ – అనడంలో మగబుద్ధి ఎంత పచ్చి దుర్మార్గమైనదో తెలుస్తూనే వుంది. భార్య ఎంతయినా భర్తచాటు మనిషి – ఆకుచాటు పిందె. పని ముద్దా భాగ్యం ముద్దా? – అనేది మరో సామెత. ఆడది – మాతృస్థానంలో సురక్షితం, పరమపవిత్రం, భద్రం. ఆ ఎల్లలు దాటడం కష్టాలు కొనితెచ్చుకోవడమే. కష్టాలు బయటినుంచి, ఇంటినుంచే ప్రారంభం. పెళ్లికి ముందు తండ్రి, అన్నదమ్ములు, పెళ్లి అయ్యాక భర్త అత్తింటివారు. అత్తగారు రూపం చేత స్త్రీ కాని, కోడల్ని హింసించడంలో పురుష భావజాలానికి ప్రతినిధి. అలా అత్తల్ని, ఆడపడుచుల్ని తయరుచేసిందీ సమాజం. పైగా ఆడదే ఆడదానికి శత్రువని – విషప్రచారం. దీన్ని ఫెమినిస్టులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. పెళ్లికాని లేక భర్తలేని – స్త్రీలసంఖ్య ఎంత కొంచెం కొంచెంగానైనా పెరుగుతుంది. స్త్రీలు తమ కాళ్ల మీద తాను నిలబడటానికి, స్వతంత్రంగా జీవించడానికి సాహసిస్తున్నారు. గెలుపొందుతున్నారు.
విద్యావంతులైన స్త్రీలలో కనీసం మూడువంతులమంది ఇంటి చాకిరీకి పరిమితమై పోతున్నారు. ఆమె చదువు బూడిదలో పోసిన పన్నీరు. దీన్ని స్త్రీలు ధిక్కరిస్తున్నారు, అగచాట్లు పడి అయినా సాధించే ప్రయత్నం ప్రారంభించారు. వారికి మనం నైతికంగా, భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా చేయూతనివ్వాలి. అండగా నిలబడాలి. ఆచరణలేని ఫెమినిజానికి అర్థం లేదు.
ఇక ఉద్యోగం చేస్తున్న స్త్రీల సంగతి చూద్దాం.
మొట్టమొదటి సమస్య – భర్త, అత్తమామలు. ఉద్యోగం చేస్తూ నెలనెలా సంపాదించి పోస్తున్న స్త్రీలకు కూడా అడుగడుగునా సమస్యలే. మొదటి సమస్య – తన ఆర్జనపై తనకు అధికారం లేకపోవడం. అంటే ఆమె తెచ్చిన జీతం – భర్త చేతిలో పొయ్యాలి. కటింగ్సు ఉంటే వివరించాలి. తన ఖర్చులుంటే – భర్త అనుమతితో మాత్రమే ఖర్చు పెట్టాలి. ఈ ఆంక్షలు అమలుజరపడంలో భర్తకు అత్తమామలు అండ, మార్గదర్శకం. భర్త కూడా – తల్లిదండ్రుల మాటకు జవదాటకుండా వారి ఆలోచనల ప్రకారం – భార్యను తగు ”కంట్రోలు”లో పెట్టుకోవాలి. ఎంత చదివి, ఎంత ఉద్యోగం చేసినా – భార్య, భార్యే. ఆర్థిక స్వాతంత్య్రం భ్రమ. నూటికి తొంభయి సందర్భాల్లో ఇళ్లల్లో ఇదే జరుగుతున్నది. ఉదయం ఇంటెడు చాకిరీ చేసి – ఆఫీసుకు అక్కడా చాకిరీ చేసి, మళ్లీ సాయంత్రం కొంపకు చేరి ఇంటిల్లిపాదికీ అన్నీ అమర్చి పెట్టడంతోనే ఆడదాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అందుకని, ఒకావిడ ”నేను ఉద్యోగం చెయ్యను – మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు నేను చాకిరీ చేస్తున్నాను గనుక – ఆయన మమ్మల్ని పోషించవలసిందే. నేను సంపాదించను, గడప దాటను. మగమహారాజు. అన్నీ ఆయన అమర్చిపెడతాడు” అని కరాఖండితంగా చెప్పేసిందట. ఇది అర్థం లేనిపని అని మనం నిందించవచ్చు. ఒకోసారి అవతలివాళ్లని బట్టి – తప్పుడుపనికి, తప్పుడుతీర్పే ఇవ్వాలి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ. దీన్ని అర్థం చేసుకోవడం రావాలి. సమస్యని అన్ని కోణాల్లోంచీ పరిశీలించాలి. స్వంత సంపాదన వుండి కూడా పువ్వులకి రూపాయి డబ్బులు ఖర్చుపెట్టుకోలేని పరిస్థితుల్లో – ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యనవసరం లేదని ఏ ఇల్లాలయినా ఎదురు తిరిగితే, మనం ఆమెను బలపరచాలి.
రెండో సమస్య – భద్రత. ఇది ఇంట్లోనే ప్రారంభం కావచ్చు. భర్త భార్యని జాగ్రత్తగా ఆఫీసులో దింపి, మళ్లీ సాయంత్రం ఆమెని జాగ్రత్తగా ఇల్లు చేరుస్తాడు. ఆమెకు స్వతంత్ర కదలికలు వుండవు. స్నేహితుల సంగతి ఏమొగాని – స్నేహితురాళ్లు కూడా వుండకూడదు. ఇల్లు, ఆఫీసు తప్ప మరో ప్రపంచం – అసంభవం. అయితే ఆఫీసుల్లోనే వేధించేవాళ్లు ఉంటుంటారు. వేధింపు అనేదానికి ఏ అర్థాలు వుండవు. సెక్స్ పరంగా వేధింపు అని అర్థం. ఇది తరచుగా పై ఆఫీసరు నుంచి ఎదురవుతుంది లేదా – ఇతర ఉద్యోగస్తుల్నించి ఎదురయితే – ఆమె ఆ కష్టం పై ఆఫీసరుకు చెప్పుకుంటే – ”చూడమ్మా, ఉద్యోగం చేసే ఆడవాళ్లకి ఇవన్నీ మామూలే. నువ్వే ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలి” అని సర్దిచెబుతారు తప్ప, సమస్యను పరిష్కరించరు. కారణం పరిష్కారం తమ పరిధిలో పనికాదని దాటవేస్తారు. ఎటుచూసినా పురుషస్వామ్య ప్రపంచం ఒకవేళ – ఈ సంగతికాని భర్తకి తెలిస్తే – ఐతే ఉద్యోగం మానెయ్యడం, లేదా నిత్యహింస, విడాకులు, వేర్పాటు, ఒంటరిబ్రతుకు. ఇదీ సంగతి. వర్కింగు ఉమెన్స్ హాస్టలులో ఉంటూ – చదువుకునేవాళ్లూ, ఉద్యోగాలు చేసేవాళ్ల సమస్యల చెప్పాలంటే – అది నిరంతర కాష్టం. అంతులేని కష్టం. తుఫానులో చుక్కాని లేని నావ! ఎన్ని పేజీలు రాసినా – ఇంకా చాలాకథలు మిగిలిపోతాయి.
ఇన్ని సమస్యల మధ్య – ఆడపిల్లల చదువూ, ఉద్యోగం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు కాదు – క్షణక్షణ గండం.
దీన్ని స్త్రీలు సమర్థవంతంగా ఇవ్వాళ ఎదిరిస్తున్నారు. ఇందుకు చదువుకోవడం ఒక్కటే కారణం కాదు. చదువు భద్రత ఇవ్వడం లేదు. సమైక్య ప్రజాఉద్యమాలు ఒక్కటే తగిన పరిష్కారం. ధైర్యం, స్త్రీల మధ్య ఐక్యత ఎంతో అవసరం. 2007లో విశాఖ జిల్లా – గంగరాజు మాడుగుల ఏజన్సీలోని వాకపల్లి అనే చిన్న ఊళ్లో – పోలీసుల చేతిలో అత్యాచారానికి గురయిన గిరిజన మహిళల పట్ల, ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి చట్టమే రక్షణ కల్పిస్తున్నదంటే – అర్థం ఏమిటి? ప్రభుత్వం, పోలీసులు, చట్టం – అంతా మగప్రపంచం. స్త్రీలను ఆదుకునేది పోరాటం ఒక్కటే. పోరాడితే పోయేదేం లేదు – సంకెళ్లు తప్ప. పిడికిలి బిగిస్తే, ఆ బిగువుకు గాజులు పగలొచ్చు – కాని అక్రమార్కుల మాడు పగలగొట్టి న్యాయం సాధించే అవకాశం మాత్రం వుండి తీరుతుంది.
ఎక్కడ స్త్రీ పిడికిలి బిగిస్తుందో, ఎక్కడ స్త్రీ తల ఆకాశానికి ఎత్తుకుని నిల్చుంటుందో అక్కడ స్వేచ్ఛా గాన వధురులు వినిపిస్తాయి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags