శారద
అబ్బ! ఎంత పెద్ద పామొ! అది వమూలు పామే, అయినా కొండచిలువంత లావుంది. మెలికలు తిరుగుతూ, గబుక్కున నా చిన్నారి శ్రీలతని చుట్టేసింది. గబగబా దాన్ని చుట్టేసి, ఉక్కిరిబిక్కిరయేలా ఒడిసిపట్టుకుంది. మింగటానికని నోరు తెరిచింది. బిడ్డ ఆశ్చర్యంతో, భయంతో కేకలు వేయటం కూడా లేదు. అరె, ఇదేమిటి! మింగటానికని నోరు తెరిచిన కొండచిలువకి ఇన్ని తలలున్నాయేమిటి? ఎన్ని పడగలు! ఆ పడగల కళ్ళల్లో క్రౌర్యం! నాల్కల్లో విషం. దాని కౌగిట్లో చిక్కినవారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేరు. నా బిడ్డను మింగేస్తు౦ది…
కెవ్వున అరుస్తూ లేచి కూర్చున్నాను. ఎంత ఒళ్ళు జలదరించే కల! ఎంత పచ్చి నిజం! ఈ కల రోజూ వస్తుంది నాకు. బహుశా బ్రతుకంతా ఇంతేనేమొ. శ్రీలతని తలచుకొని ఏడ్పు కూడా ్మానేసాను నేను. నా మనసు మొద్దుబారిందా లేక నేను చచ్చిపోయనా? ఏమొ! పోనీ ఎవర్నయినా చంపేస్తే మళ్ళీ బ్రతుకుతానేమొ! ఆ పడగలన్నీ నరికే్యాలి! ఎవరిని చంపను? ఏ పడగని నరికేయను?
చిన్నప్పటినించీ నేను పిల్లలకి కొత్తవాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పి తప్పుచేసాను. అసలెవరితోటీ మాట్లాడొద్దు అని చెప్పాల్సింది. కానీ ఆ చిన్న మనసుల్లో మనుషుల మీదా, సంఘం మీదా అపనమ్మకం నాటొద్దని అనుకున్నాను. కానీ నమ్మదగ్గ మనుషులెవరూ లేనప్పుడు ఆ నమ్మకమెందుకు? మన చుట్టూ వున్నది మనుషులు కాదు, పాములు! వేల వేల పడగలున్న పాములు. ఆ పడగల నీడల్లో ఎలా పెంచుతాం చిన్నారి పాపలని.
అడ్డమైన సినిొమాలు ఆడతనం, ఆడదన్నమాటకి వికృతమైన అర్థాలిస్తుంటే, డబ్బు కోసం ఆడతనాన్ని అంగట్లో అమ్ముతున్న సంఘంలో, దిక్కూమొక్కూలేని వెధవలు మగవాడవటం ప్రేమించటానికి కావలసిన అర్హత అని నమ్మే వాతావరణంలో ఈ లేగదూడలకి రక్షణ ఎక్కడ?
కనకాంబరం – సినీనటి
అబ్బ! ఆ దీపావళి కార్యక్రమం ముగించి ఇంటికొచ్చేసరికి తెల్లారిపోయింది. ఈసారి ఎప్పటిలా జరగలేదు. ఎప్పటిలాగే అయి వుండేది, ఆ ఆడవాళ్ల గుంపు రాకపోయుంటే. అసలు ఇలాంటి ప్రోగ్రాంకి ఆడవాళ్ళని రానిస్తారా ఎవరైనా? ఇవన్నీ మగవాళ్ళకోసం. తగుదునమ్మా అంటూ ఈ ఆడవాళ్లంతా రావటం, ప్రోగ్రాం పాడుచేయటం.
అక్కడికీ కాస్ట్యూ౦ డిజైనర్‌తో ముందే అన్నాను, ”మరీ ఇంత తక్కువ బట్టలతో డాన్సు చేస్తే జనం నేను స్నానం చేస్తున్నాననుకుంటారేమొనయ్యా” అని. కానీ అతగాడు ”ఏం చెయ్యమంటారు మేడం, ప్రొడ్యూసరు ఇలాగే వుండాలంటున్నారు. మీకిష్టం లేకపోతే చెప్పండి, గులాబీగారు, సంపంగిగారు, చాలామందే రెడీగా వున్నారు, ఈ ప్రోగ్రాంలో ఆడటానికి,” అన్నాడు. ఆ దెబ్బతో మరి మాట్లాడకుండా వెళ్లాను. నిజమే, కొంచెం డ్రెస్సింగు ”కళాత్మకంగానే” వుంది. దాన్ని అసభ్యం అంటుంది ఆ ఆడగుంపు లీడరు.
”అది అసభ్యం కాదు మేడం, ఆర్టు. అది చూసేవారి మనసుని బట్టి వుంటుంది,” అని కొత్తలోనే నేర్చుకున్న మాటలు చెప్పాను. దానికావిడ, ”మేడం, మేం మీ అంత తెలివయినవాళ్ళం కాదు. అశ్లీలానికీ, మీ ప్రదర్శనలో వున్న కళకూ తేడా ఏమిటో, మాకు అర్థమయ్యేలా చెప్తారా?” అంటూ కూర్చుంది. నా బొంద, నేనేం చెప్తాను! నేను వచ్చీరాని తెలుగు, ముద్దుముద్దుగా మాట్లాడి ఆమెని మురిపిద్దామనుకున్నాను కానీ, ఆమె ఇంకొంచెం సేపుంటే నన్ను జుట్టు పట్టుకుని వంగపెట్టి వీపు మీద దెబ్బలు వేస్తుందేమొనని భయం వేసింది. సెక్యూరిటీని పిలిచి మెల్లిగా బయటపడ్డాను.
”కనకాంబరం! మీరు వేసుకుంటున్న దుస్తులు, చేస్తున్న నృత్యాలు చూసి మామూలు మగవాళ్ళు మమ్మల్ని బస్సుల్లో, మార్కెట్లలో ఎంత హింసిస్తున్నారో తెలుసా?” అంది ఇంకొకావిడ.
అవునా? మగవాళ్లు నాతో బాగానే వుంటారే మరి! అంటే, మరీ నా దగ్గరికి వస్తే సెక్యూరిటీ గార్డు వుంటాడు, మెడపట్టి గెంటెయ్యటానికి. అందుకే కాబోలు, దూరంనించి ఆశగా ొచూస్తూ వుంటారు. ఆవిడెవరో కానీ, పాపం ఆవిడ కూతుర్ని ఎవరో లిఫ్ట్ ఆపరేటర్ ొమానభంగం చేసి చంపేసాడట. దానికి ఆవిడ నన్నెందుకు తిడుతుందో మాత్రం నాకర్థం కావటం లేదు. ఆడవాళ్లందరూ, ఏ వయసైనా సరే, సెక్యూరిటీగార్డులని పెట్టుకోవాలి మరి, అందుకే.
సుకుమార్
”ప్రేమించడం జన్మహక్కు” అనే సినిమా మళ్లీ మళ్లీ చూస్తున్నానని నాన్న తిడుతున్నాడు. అమ్మ వెనకేసుకొచ్చినా సరే. ఇప్పటికే ఆ సినిమా పదహారుసార్లు చూసాను. సరిగ్గా నా వయసు పదహారు. పదహారేళ్ళకే నా జీవితంలో భగ్నప్రేమ రాసాడా దేవుడు!
అసలు ఆ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యే నేను శ్రీలతని ప్రేమించాను, ఆమెకి పన్నెండేళ్లే అయినా! మా ఫ్రెండ్స్ అంతా వెక్కిరించారు, ఇంకొక్క రెండేళ్లన్నా వుండాలిరా అని. కాని ్మా అపార్ట్‌మెంట్స్‌లో ఆ వయసువాళ్లు ఎవరూ లేరు. ఎ౦చక్కా ఆ సినిమాలోలా ప్రేమించుకుందామంటే శ్రీలతకి ఒకటే భయం.
నేనూ ఈ సినిమాలోలా శ్రీలతకి మనసులో నా మీద బోల్డు ప్రేమ వున్నా పైకి అసహ్యం నటిస్తుందనుకున్నాను. నన్ను ప్రేమించకపోతే ఉరి పోసుకు చచ్చిపోతానని బెదిరించాను కూడా. నేను చచ్చిపోవటమా లేక తనని చంపెయ్యటమా అని ఆలోచిస్తూ వున్నాను. నన్ను చూసి భయపడి తను ఆ లిఫ్ట్ ఆపరేటర్ లింగయ్యను తోడు తీసుకుని స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ విషయం తలచుకుంటే కొంచెం బాధగా వుంటుంది. నేను భయపెట్టకుంటే తను ఆ లింగయ్యని తోడు అడిగేది కాద, చచ్చిపోయేదీ కాదేమొ.
నిజానికి ముందు శ్రీలత నన్ను ప్రేమించటం లేదని తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది. నేనడిగింది ఒకళ్లు కాదనటం నాకింతవరకూ అలవాటు లేదు. ఇంట్లో అమ్మా, నానమ్మా అయితే నా నోట్లో మాట నోట్లో వుండగానే అడిగినవి ఇస్తారు. ఎప్పుడయినా నాన్న డబ్బు కోసం సణిగితే అమ్మ వెంటనే, ”ఒక్కగానొక్క కొడుకు, వాడి సరదాలు మనం కాకపోతే ఎవరు తీరుస్తారు” అంటుంది. బైక్ కానీ, బట్టలు కానీ, సినిమాలు కానీ, దేనికోసమూ నేను ఎక్కువగా బాధపడింది లేదు. అలాంటి నన్ను ఒక ఆడపిల్ల నిరాకరించటమా అని చాలా బాధపడ్డాను. కానీ, తరువాత పోనీలే పాపం చిన్నపిల్ల అని సర్దిచెప్పుకున్నాను. ఆడపిల్లలు ఇలా పవిత్రప్రేమను నిరాకరించినప్పుడే మనోహర్‌లాటి వాళ్ళకు చంపెయ్యలనిపిస్తుంది.
ఆ లింగయ్య, ఎంత దరిద్రుడు! అయినా వాణ్ణని ఏం లాభం. వాణ్ణి నమ్మి తోడు తీసుకెళ్ళిందేమిటీ శ్రీలత, బుద్ధిలేకుండా! ఈ గొడవ చేయబట్టి అపార్ట్‌మెంట్స్ అంతా ఒకటే పోలీసులు. ఆడవాళ్ళు ఎంత చిన్న వయసైనా సరే కొంచెం మగవాళ్ళకి దూరంగానే వుండాలేమొ!
లింగయ్య :
నీ యవ్వ! ఈ పెద్దోళ్ళంతా ఇంతే. ఆ పిల్ల చచ్చిపోద్దని నేను మాత్రం అనుకున్నానా! ఏదో, ఎలా వుంటుందో చూద్దామని ప్రయత్నం చేసానంతే! అర్ధాయుషు పిల్ల, అంతలోపే హరీమంది. మొన్న సినిొమాలో ముసలి అమితాబ్‌బచ్చన్ చిన్నపిల్లని ప్రేమిస్తే అందరూ బాగానే చూసారు. ఇవాళ నేను అదే పనిచేస్తే తీసుకొచ్చి జెయిల్లో పెట్టారు.
పిల్ల కొబ్బరిముక్కలా ముద్దొస్తూ వుండేది. మా ఆడదేమొ ముప్ఫైఏళ్ళకే ముసలిదైపోయింది. మరెట్టా చచ్చేది. దీపావళి రోజు కనకాంబరం డాన్సు టీవీలో చూసింతరువాత నాకు నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా అదేదో రంగుపూసుకుని అసలు ఒంటిమీద బట్టలు లేనేలేనట్టు, ఎంత బాగుంది. నీయవ్వ, ఆడదంటే అట్టా వుండాలి. ఎలాగైనా అట్టాటి ఆడదాన్ని పట్టాలని బయల్దేరాను. సరిగ్గా అపార్ట్‌మెంట్స్ దగ్గరకొచ్చేసరికి మల్లెపువ్వులా యూనిఫాం వేసుకుని శ్రీలత ఎదురొచ్చింది.
నిజమే! పిల్ల మరీ చిన్నది. పెద్దపిల్లలు ”మీ అమ్మ రమ్మంటుంది” అని పిలిస్తే నమ్మి వస్తారా? అందుకే చిన్నపిల్లైనా సర్దుకోవాలనుకున్నాను. ఎవరూ అర్ధం చేసుకోరే!
”లింగయ్య, టాటా” అంటూ బస్సెక్కి వెళ్ళిపోయింది. చట్టానికి చిన్నపిల్లలాగే వున్నా, అమ్మొ, ఈ కాలం పిల్లలకి నోట్లో పళ్ళన్నీ రాకముందే అన్ని సంగతులు తెలుస్తాయి. దానికేమీ తెలీదనుకోవటం నా బుద్ధితక్కువ. ఎలాగైనా ఒక పట్టు పట్టాల్సిందే అనుకున్నాను. సాయంత్రం బస్‌స్టాపు దగ్గర కాపేసాను. అరగంటలోగా పిల్ల చచ్చిపోతుందని నేననుకున్నానా? చప్పుడు చేయకుండా ఇంటికొచ్చి పడ్డాను. కానీ పిల్లని పార్కులోకి తీసుకెళ్ళటం ఎవరో చూడనే చూసారు. పోలీసులు తీసికెళ్ళి కుళ్ళబొడిచారు. ఇక్కడికీ నేను కోర్టులో నిజాయితీగా చెప్పాను, ”అయ్యా! నేను పిల్లని మానభంగం చేద్దామనుకున్నా గానీ, చంపాలనుకోలేదు” అని.
జడ్జీగారు పాపం అర్ధం చేసుకున్నారు. ”చంపాలని ఉద్దేశ్యం లేదు కాబట్టి దీన్ని హత్యానేరంగా కాకుండా, మానభంగం కేసుగా త్రమే అర్ధం చేసుకోవాలి” అని చెప్పారు.
బయటికొస్తుంటే ఒక పేపరామె జడ్జీని ఆపి, ”సార్! మేమంతా లింగయ్యని కొట్టటానికి కట్టెలతో వచ్చి కొట్టామనుకొండి! ఆ దెబ్బల్లో ఎక్కడైనా తగలరాని చోట తగిలి లింగయ్య చచ్చిపోతే దాన్ని హత్యానేరంగా పరిగణిస్తారా లేక కేవలం దెబ్బలాట కేసుగా చూస్తారా?” అని అడిగింది. జడ్జీగారు ఆమెవైపు కోపంగా చూసి వెళ్ళిపో్యారు. ఆమె అడిగింది నాకు అర్ధం కాలేదు కానీ నిజంగా నన్ను కొట్టటానికి వాళ్ళందరూ కట్టెలతో వస్తారేమొనని భయం వేసింది.
ఇన్‌స్పెక్టర్ విక్రం :
ఈ ఆడవాళ్ళు హాయిగా ఇంటిపట్టున వుండి వంటచేసుకోక వీధికెందుకెక్కుతారో, మా ప్రాణాలు తోడటానికి కాకపోతే. ఇంట్లో పని వదిలిపెట్టి బయటికి రావటం, ”వీడు నన్ను ముట్టుకున్నాడు, వాడు నాకు కన్నుకొట్టాడు” అంటూ లబలబలాడటం. ఇంట్లో వుంటే డొమెస్టిక్ వయలెన్సంటారు, బయటికొస్తే ఈవ్‌టీజింగంటారు. ఎలా చచ్చేది వీళ్ళతో!
ఈ మగవాళ్ళందరికీ ఏం రోగమొచ్చిందో, ఒకటేసారి ఆడపిచ్చి ముదిరిపోయింది. దీనికి తగ్గట్టే ఆ ఆడపిల్లల డ్రస్సులు ఒళ్ళంతా కనిపిస్తూ, ఆడవాళ్ళ విపరీతమైన వస్త్రధారణ వల్లే సంఘంలో నేరాలు పెరుగుతున్నాయని నేనన్నందుకు ఒక పత్రికా విలేఖరి ఎంత మండిపడింది నా మీద!
”ఆరేళ్ళ పసిపాపలా, అరవైఏళ్ళ ముసలమ్మలా ఏం విపరీతమైన వస్త్రధారణ చేస్తున్నారని వాళ్ళమీద కూడా నేరాలు జరుగుతున్నాయి?” అని అడిగింది. నిజమే, నాకేం చెప్పాలో తోచలేదు.
నేరం జరగగానే స్త్రీహక్కుల సంఘం వాళ్ళు మీద పడతారు, ”ఇన్నిన్ని నేరాలు జరుగుతుంటే పోలీసులు నిద్రపోతున్నారా” అంటూ. ఆ నేరస్థులని పట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేముంది? వాళ్ళకి ఉరిశిక్ష వేసినా, వాళ్ళకి ప్రాణభిక్ష కోసం పిటీషన్లు పెట్టటానికి మానవహక్కుల సంఘం వాళ్ళు ఉండనే ఉన్నారు. ఏం లాభం?
ప్చ్! పాపం మల్లెమొగ్గలాటి పిల్ల, అన్యాయంగా చచ్చిపోవటమే కాక నా ప్రాణం మీదకి తెచ్చింది. ఫోన్ మొగుతుంది, మళ్ళీ ఏ తలమాసిన వెధవో ప్రేమించటం లేదని క్లాస్‌మేట్ మీద ఆసిడ్ పోయటమొ, నరికేయటమొ చేసినట్టున్నాడు.
శ్రీలత :
నాకు చచ్చిపోవాలని లేదు, అయినా చచ్చిపోయాను. నేను స్కూలు నించి ఇంటికి రాలేదని అమ్మ యెంత వెదికిందో! నేను చచ్చిపోయానని ఎవరయినా చెప్పారో లేదో.
క్రితం సంవత్సరం వరకూ అమ్మే స్కూలులో దింపి తీసుకొచ్చేది. ఇప్పుడు ఏడో తరగతిలో కొచ్చేసాను, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాస్తాను, కాబట్టి ఒక్కదాన్నే వచ్చి తలుపు తీసుకుంటానని చెప్పాను. అమ్మ రోజూ చెప్పేది, కొత్తవాళ్లెవరితో ొమాట్లాడొ్ద్దు అని. లింగయ్య కొత్తవాడు కాదు కదా, మా అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్‌లో పనిచేస్తాడు. అప్పుడప్పుడు అమ్మ ఏదయినా పనిచెప్తే చేస్తాడు కూడా. అందుకే ఒక్కదాన్నీ ఎటయినా వెళ్ళాలంటే భయం వేసి లింగయ్యని తోడు రమ్మంటాను.
అసలు నాకెప్పుడూ భయం వేసేది కాదు. కానీ పక్కింటి సుకుమార్‌ని చూస్తే ఈ మధ్య భయం మొదలయింది. అందుకే లింగయ్యని తోడు తీసుకెళ్తున్నాను.
నిన్న స్కూలునించి వస్తూ౦టే లింగయ్య బస్‌స్టాపులో నిలబడి వున్నాడు. అమ్మ నా కొరకు పార్కులో ఎదురుచూస్తుందనీ, తను తీసికెళ్ళటానికి వచ్చాననీ చెప్పాడు. అమ్మ ఎప్పుడూ అలా చేయలేదు. అయినా వెళ్ళాను. ఇప్పుడనిపిస్తుంది, వెళ్ళకుండా ఉండాల్సిందని. కొంచెం దూరం నడిచాక పార్కొచ్చింది. పార్కు ఎందుకో నాకంతగా బాగా లేదు. ఎప్పుొడూ మేము వెళ్ళే పార్కులో చాలామంది పిల్లలు వుంటారు. ఇక్కడెవరూ లేరు.
”ఈ పార్కేం బాగాలేదు లింగయ్య! ఇక్కడెవరూ ఆడుకోవటం లేదు” అన్నాను. ”అవునమ్మా! మరి అమ్మ ఇక్కడెందుకుందో, చూద్దాం పద” అన్నాడు. ఇద్దరం పార్కు లోపలికెళ్ళాము. అంతా మొండిగోడలు, నాకెందుకో భయం వేసింది. కానీ అమ్మ అక్కడే వుంది కదా అని ధైర్యంగా ”అమ్మా” అని పిలిచాను. ఎవరూ బదులు పలకలేదు. ”అమ్మేది లింగయ్య?” అని అడగటానికి పక్కకి తిరిగాను. లింగయ్య నవ్వుతూ నిలబడ్డాడు. ”ఒక కొత్త ఆట ఆడుకుందామా?” అని అడిగాడు. అప్పుడప్పుడ లింగయ్య అపార్ట్‌మెంట్స్‌లో పిల్లలందరితోటీ కొత్తకొత్త ఆటలు ఆడిస్తూ ఉంటాడు.
”కొత్త ఆటా? వద్దు. అమ్మేది?” బయట చీకటి పడుతూ౦ది. నాకు కొంచెం భయం వేసింది. వెళ్ళటానికి వెనక్కి తిరిగాను. లింగయ్య నవ్వుతూ నన్నెత్తుకున్నాడు. అది నాన్న ఎత్తుకున్నట్టు లేదు. అసహ్యంగా వుంది, అసలు బాగాలేదు. చేతుల్లోంచి జారాలని చూసాను. గట్టిగా పట్టుకున్నాడు. భయంతో ఏడుపొచ్చింది. ఆ తరువాత చాలా అసహ్యం వేసింది. రక్తం చూసి భయపడ్డాను. లేవలేకపోయాను. మళ్ళీ మెలకువ వచ్చేసరికి చచ్చిపోయాను. అంతే!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags