మహిళా దక్షతలో మనమెక్కడ…? – డా|| జి.లచ్చయ్య

ఆమె బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించబడింది. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపిల్ల ప్రోద్భలంతో తల్లి ఆ రొంపి నుండి బయటకు వస్తుంది. భర్త అనే ‘మగ’ దిక్కులేక, ఇద్దరు ఆడపిల్లలతో బాహ్య సమాజంలో బతకడం ఎంత దుర్భరమో అనుభవిస్తేగానీ తెలియదు. వరుసకు చిన్నాన్న తోడ్పాటుతో పెద్దమ్మాయి డ్యాన్సు నేర్చుకొని, ఓ పేరు మోసిన హోటల్‌లో డ్యాన్సరుగా, గాయకురాలిగా పనిచేస్తూ, చెల్లిని చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. చిన్నమ్మాయికి పేరు మోసిన స్కూల్లో సీటు లభిస్తుంది. 20 శాతం కట్టాల్సిన ఫీజే లక్ష రూపాయలుంటుంది. ఈ డబ్బుకై తల్లి స్వయంగా వేశ్యావాటిక నిర్వాహకురాలిని ఆశ్రయిస్తే, పెద్దమ్మాయిని తనకు అప్పజెప్పమంటుంది. ఈ విషయం తెలుసుకున్న పెద్దమ్మాయి, తానుండగా తిరిగి వేశ్యావాటికకు వెళ్ళవద్దని, ఆ డబ్బును తానే సంపాదించి చెల్లిని చదివిస్తానంటుంది. అలాంటి సమయంలోనే, ఒక ఎంఎల్‌ఏ కుమారుడి నామకరణోత్సవానికై గానాభజానా ఏర్పాటు చేయబడగా, ఈ అమ్మాయి డ్యాన్సు చేసే హోటల్‌ బృందంతో కలిసి వెళ్తుంది. అమ్మాయి గాత్రానికి, డ్యాన్సుకు మతి చెదిరిన సదరు ఎంఎల్‌ఏ తన అనుచరుడిచే మధ్యంతరంగా కార్యక్రమాన్ని ఆపించి, బృందాన్ని విడిదికి పంపించి, ఈ అమ్మాయిని లోపల బంధించి బలవంతం చేయగా, ఆమె నిరాకరించి ఎదురు తిరుగుతుంది. దీంతో ఎంఎల్‌ఏ ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేస్తాడు. హోటల్‌ యాజమాన్యానికి ఈ విషయం తెలిసినా, తల్లి అడిగితే తమతో ఆ అమ్మాయి రాలేదని, ఎవరితోనో ముంబై రెడ్‌లైట్‌ ఏరియాకు లేచిపోయిందని చెబుతారు. బిడ్డపై గల నమ్మకంతో ఆ విషయాన్ని నమ్మని తల్లి యాజమాన్యాన్ని నిలదీయడంతో హోటల్‌ నుంచి గెంటివేయబడుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ బృందంలోని మరో అమ్మాయి జరిగిన విషయాన్ని ఆ తల్లికి చెబుతుంది.

తల్లి సంబంధిత ఎంఎల్‌ఏ ఊరుకి వెళ్ళి నిలదీస్తుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంది. అన్ని పోలీస్‌ స్టేషన్లలాగే వారు కూడా వేశ్యా వృత్తిలో ఉన్న స్త్రీ పిల్లల్ని కనడం, ఆమె కూతురు డ్యాన్సర్‌గా మారడం, అలాంటి డ్యాన్సర్‌ను ఎంఎల్‌ఏ చెరపట్టాడంటే ఒక వింతగా భావించి ఈసడించుకుంటారు. అప్పుడే వచ్చిన డీఎస్పీ ఆ తల్లి ధైర్యానికి మెచ్చి, కేసు నమోదు చేసి ఎంఎల్‌ఏ ఇంటిని సోదా చేయగా అమ్మాయి కనబడదు. చేసేదిలేక తల్లి, సదరు పోలీసు అధికారి వెనుదిరిగి, ఒక ప్రణాళిక ప్రకారం ఎంఎల్‌ఏ అనుచరుడిని వలవేసి పట్టుకుని అమ్మాయి ఆచూకీ తెలుసుకుంటారు. అప్పటికే అమ్మాయి హత్య గావించబడుతుంది. కోల్‌కతాలో జరిగిన ఓ సంఘటన ఇది. సదరు ఎంఎల్‌ఏ దగ్గరలోని మిర్జాపూర్‌ నివాసి. ఈ సంఘటన గురించి లైఫ్‌ ఓకేలో ఛానల్‌లో కూడా చూపడం జరిగింది. ఈ దేశంలో మహిళలపై, యువతులపై, చిన్న పిల్లలపై అనునిత్యం జరుగుతున్న అత్యాచార పర్వానికి ఇది ఓ చిరు

ఉదాహరణ మాత్రమే!

ఆయనకు ఇద్దరు భార్యలు. రోజు కూలీనాలీ చేసుకునే కుటుంబం. మొదటి భార్యకు ఒక కూతురు. మూడో తరగతి చదువుతో ఆగిపోయిన ఆ అమ్మాయి ఇద్దరు తల్లులతో పాటు తండ్రి పక్కనే పడుకునే పరిస్థితి. చాలా సంఘటనల్లో జరిగినట్లే, స్వయాన తండ్రి వల్ల అత్యాచారానికి గురైంది. మొదటిసారి తెలియక, రక్తపు మరకల్ని తానే కడుక్కుంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఎలుకల మందు పెట్టి చంపుతానని తండ్రి బెదిరించాడు. ఈ అత్యాచార కొనసాగింపుతో అమ్మాయికి కడుపైంది. దీంతో ప్రసూతి కోసం బంధువుల ఇంటికి పంపిస్తే, ఆ బంధువు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా అప్పటికే ఆ అమ్మాయికి 34వ వారం అని, డిఎన్‌ఎ పరీక్షతో తండ్రే కారకుడని తేలింది. ఈ కేసు ముంబై హైకోర్టులో నడిచింది.

ముంబైలో పండ్లమ్ముకుని బతికే ఆయన వయస్సు 45 సంవత్సరాలు. గత ఆరు సంవత్సరాలుగా తన 13 సంవత్సరాల బిడ్డపై అత్యాచారం చేస్తున్నాడు. అంతకు ముందు తన 17 సంవత్సరాల కూతురుతో కూడా ఇదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 7వ తరగతి చదువుతున్న రెండో అమ్మాయి తన తరగతి టీచరుకు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెల్పింది. తల్లి కూడా నిస్సహాయురాలిగా ఉండడంతో ఈ కేసు మూసివేయబడింది.

ఇదే ముంబైలో కుట్టు పని చేసుకుని జీవించే వ్యక్తికి ఏడుగురు పిల్లలు. భార్య మంచం పట్టింది. అప్పటికే పెద్దమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. గర్భం పసిగట్టి ఓ వ్యక్తితో పెళ్ళి చేశాడు. ఇప్పుడు రెండో బిడ్డతో మొదలైంది. ఆ అమ్మాయి ఈ విషయం తన బాయ్‌ఫ్రెండ్‌తో చెప్పగా, అతను సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో తండ్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌. రాయబడింది. అమ్మాయిని వైద్య పరీక్షలకు జెజె హాస్పిటల్‌కు పంపించారు. కానీ, ఆమె వాంగ్మూలం రోజున కథ అడ్డం తిరిగింది. బంధువులు, కుల పెద్దల ఒత్తిడి మేరకు శిక్షాస్మృతి 164 ప్రకారం కేసు నమోదు చేయబడకపోవడంతో, తన తండ్రిని విడిపించడానికి కోర్టుకు వచ్చానని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తెలపాల్సి వచ్చింది. తండ్రిని వదిలిపెట్టారు.

అస్మిత మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేయబోతోంది. తండ్రికి తాగుడు, నీలి సినిమాలు చూడడం వంటి అన్ని దుర్గుణాలూ

ఉన్నాయి. తల్లి నిస్సహాయురాలు. తనకు ఆరేళ్ళ వయసప్పుడు తన అక్కపై తండ్రి చేసిన అత్యాచారాన్ని స్వయంగా చూసింది. 12 సంవత్సరాలు రాగానే తనపై ఒకరోజు అదే జరిగింది. అస్మిత ప్రతిఘటించింది. తల్లి సహాయంతో అక్క ఇంటికి చేరింది. తెల్లవారగానే తండ్రి వచ్చి తల్లిని తన్ని లాక్కెళ్ళి, అస్మితను ఇంటికి రావొద్దని హెచ్చరించాడు. అస్మిత ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి

తండ్రిపై ఫిర్యాదు చేసింది. వ్యాపారం చేసుకునే తండ్రిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. భర్త భయానికి తల్లి కూడా సహాయం చేయలేని స్థితి. ఇప్పుడు అస్మితకు ఇల్లు, కుటుంబం దూరమయ్యాయి.

పైన ఉదహరించిన కేసులను చూస్తే, మహిళలకు ఇంటా, బయటా, పాఠశాలల్లో, కళాశాలల్లో, కొత్తవారి చేతుల్లో, దుర్మార్గుల చేతుల్లోనే కాదు సొంత ఇంటిలోనే అభద్రత ఉందని తెలుస్తోంది.

ఇలాంటి కథనాలకు అంతూ, పొంతూ లేదు. మహిళా హక్కుల న్యాయవాది అయిన ఫ్లావియ ఆగ్నేస్‌ సేకరించిన వివరాల ప్రకారం 2014-15 సంవత్సరాల మధ్యన నమోదైన అత్యాచారాల కేసుల్లో 12% తండ్రులచే, మారు తండ్రులచే జరిగినవని తేలింది. ఇదే కాలంలో బయటివారిచే జరిగిన అత్యాచారాల కేసులు 3 శాతం మాత్రమే.

వీటికి భిన్నంగా చిన్నపిల్లలపై అత్యాచారాలు, యువతు లపై, కళాశాలల విద్యార్థినులపై యాసిడ్‌ దాడులు, ర్యాగింగ్‌ అకృత్యాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. 2006లో జరిగిన శ్రీలక్ష్మి యాసిడ్‌ దాడి కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించిన విషయం తెలిసిందే. ర్యాగింగ్‌ మహమ్మారి ఏ రూపంలో ఉందో రిషితేశ్వరి (జులై 14) కథనంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే మరో అమ్మాయి సునీత (ఆగస్టు 5) గుంటూరులో కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చివరికి విద్యనందించే గురువులే మహిళలకు ఉరితాళ్ళుగా మారుతున్నారు. దేశరక్షణ పేరున సిపాయిలు, సమాజ రక్షకులైన పోలీసులు మహిళలకు ఓ సింహస్వప్నంలా మారారు. ఇక రాజకీయ నాయకులు, వారి పిల్లల అకృత్యాలకు అడ్డే లేకుండా పోయింది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా, చివరికి మత సంస్థల్లో కూడా రక్షణ లేని పరిస్థితి మహిళలది. దీనికేమైనా అంతముందా అంటే, ప్రతి సంఘటనా ఓ ఆరంభంలానే ఉంటోంది. 2013లో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత వీటికి తెరపడిందని కొంతమంది భావించి ఉంటారు. కానీ ఇదంతా ఓ భ్రమ, భ్రాంతి మాత్రమే అని అనునిత్యం తేలుతూనే ఉంది. ఏదో ఒక ప్రాంతంలోనో, పట్టణంలోనో ఒక సంఘటన జరగడం, దానిపై దుమారం రేగడం, చర్చ జరుగుతూ ఉండగానే మరో సంఘటన చోటు చేసుకోవడం నిత్యకృత్యమైంది. పోతే, గతంలో ఫిర్యాదును స్వీకరించడానికి మీనమేషాలు లెక్కించే పోలీసుల్లో కొంత కదలిక వచ్చింది. కేసులు నమోదవుతున్నాయి. అందుకే ప్రతి ఏడాదికీ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది.

మనిషి అమానవీయంగా ప్రవర్తిస్తే, ఓ అనాగరికుడని, అడవి మనిషని, రాక్షసుడని నిందిస్తూ ఉంటాం. నిజానికి అడవి మనుషులు – అనగా మూలవాసులు, ఆదివాసులు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టరు. ఒకవేళ ఒడిగట్టినా సత్వరమే చర్యలు, శిక్షలు ఉంటాయి. బాధితుల్ని అక్కున చేర్చుకునే ఓ దొడ్డ గుణం ఈ వర్గాల్లో ఉంటుంది. మారుపెళ్ళిళ్ళుంటాయి. కాబట్టే, ఈ వర్గాల్లో ఓ ఆరోగ్యకరమైన వ్యవస్థ కనబడుతుంది. పురాణాల్లో గానీ, ఇతిహాసాల్లో గానీ, ఈ దుర్మార్గపు చర్యల్ని చేసిన వర్గమంతా దేవతలుగా చెలామణి అయ్యారు. నియమ, నిబద్ధతతో వున్న వారే దానవులుగా ముద్ర వేయబడ్డారు. దీనికి నిలువెత్తు సాక్ష్యం రావణుడే! దేశవ్యాప్తంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వర్గాలు అత్యధికులు ఉన్నత వర్గాలకు చెందినవారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడం గమనార్హం. వీరంతా చట్టం నుంచి తప్పించుకుంటూనే ఉంటారు. ఈ వర్గాలే శీలానికి వెలకడుతున్నారు. దీన్ని పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా సమర్థిస్తున్నాయి. నిజానికి హేతువాదులు, శాస్త్రీయ దృక్పథం ఉండి ప్రచారం చేసేవారు, నిజమైన కమ్యూనిస్టు భావాలు కలవారు, మానవతావాదులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడడం చాలా అరుదుగా రికార్డవుతున్నాయి. దీన్నిబట్టి ఓ భావజాలం – అది పెట్టుబడిదా, పితృస్వామ్యమా, విశృంఖలత్వమా… ఏదైనా కానీ ఇలాంటి బాపతుగాళ్ళే నిందితులుగా తేలుతున్నారు.

మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతికత పేరున ప్రచారం జరుగుతున్న మత బోధనలు వీటిని నిలువరింపలేక పోతున్నాయనేది కాదనలేని సత్యం. అంటే వీరికి దైవభీతి కూడా ఉండదన్నమాట! ఎన్ని పాపాలు, అకృత్యాలు చేసినా దైవసన్నిధిలో చెంపలు వేసుకుంటే, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటే, ఇంకా చెప్పాలంటే క్రతువుల పేరున దోచుకున్న సొమ్ముతో నిర్వహిస్తే సర్వపాపాలు పోతాయనే బ్రాహ్మణిక భావజాలం, ఈ దారుణాల్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి. మొన్నటికి మొన్న పుష్కరాల సందర్భంగా మత పెద్దలే కాదు, స్వయానా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని వీటిని ప్రచారం చేసి, ఇతర మీడియాలతో చేయించి, జనాన్ని గోదావరి పొడవునా ముంచి, సొమ్ము చేసుకుని, జనాల పాప పరిహారాన్ని తొలగింపచేశారు. మళ్ళీ పుష్కరాల దాకా, లేదా మలి పుష్కరాల దాకా తిరిగి పోగుపడిన పాపాన్ని కడిగేసుకోవచ్చు అనే భావజాలం రోజురోజుకు బలోపేతమవుతున్నది. చదువుకున్న యువతీ, యువకులే ఈ భావజాలానికి అధికంగా గురవుతున్నారు కూడా.

ఈ భావజాలమే నాడు సీతను, అహల్యను, అల్లీరాణిని, ద్రౌపదిని, తాటకిని, శూర్పణఖను అవమానాల పాల్జేసాయి. వాటినే ఇంకా రంగరించి పోసే మాంత్రిక, తాంత్రిక విద్యల్ని దూరదర్శన్లలో పెట్టి పోషిస్తూ, సమాజాన్ని, మహిళల్ని మరింతగా భ్రష్టు పట్టిస్తున్నాయి. పురుష పుంగవుల్ని వావి వరసలు మరిచేలా చేస్తున్నాయి. వీటిని విడమరచి చెప్పే యంత్రాంగం, భావజాలం వెతికినా కానరాని పరిస్థితి. ఒకప్పుడు స్త్రీ సమస్యలమీద పాఠశాల స్థాయిలో చర్చలు, ఉపన్యాస పోటీలు జరిగేవి. స్త్రీకి విద్య అవసరమా? అనవసరమా? అనే అంశాన్ని మొదలుకొని, బాల్య వివాహాలపై, వితంతు వివాహాలపై, కన్యాశుల్కంపై, సతీసహగమనాలపై ఘాటైన చర్చలు జరిగేవి. వీటిని నిలదీసిన వ్యక్తులపై ఓ ఆరాధనా భావం పెరిగేది. వీరిని ఆదర్శంగా తీసుకున్న యువతీ, యువకులు నిన్నటి దశాబ్దాలకే పరిమితమైపోయారు. ఇక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, సెమినార్లు జరిగేవి. వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలు, అధ్యాపక బృందం విద్యార్థులలో ఓ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్గించేవి. ఆదిమ కమ్యూనిజం మొదలుకొని భూస్వామ్య, పెట్టుబడి, వలసవాద రాజకీయాల్ని విశదీకరించేవి. వీటికి అనుగుణంగా ఉండే సంస్కృతి, సాంప్రదాయ విధానాల్ని విడమరచి చెప్పేవి. సాహిత్య సృజన జరిగేది. ఈ కోణం నుంచి పుట్టినదే ‘శాస్త్రీయ విద్య’ అనే నినాదం. ఈ సైద్ధాంతిక అవగాహన వంటపట్టిన విద్యార్థులు, యువతీ యువకులెందరో కులాంతర, మతాంతర వివాహాలను చేసుకొని సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఓ మార్గదర్శకులుగా మారేవారు. దశదిశల్ని నిర్దేశించేవారు. ఇలాంటి వారంతా వరకట్నాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఇప్పుడంతా తారుమారే! ఎవరికీ ఈ ఊసే లేదు.

ఉన్నదంతా – చదువు! చదువు! ప్రాథమిక స్థాయి నుంచే నిద్రలేపి భుజాలకు సంచిని తగిలించి, ఓ వాహనంలో ఎక్కించి పిల్లల్ని వదిలించుకునే ఓ తల్లిదండ్రుల విధానంగా మారింది. ఇలా ఇల్లు, గల్లీ, ఊరు, వాడతో సంబంధంలేని యువత, నాలుగ్గోడలనే బందిలి దొడ్డి చదువుతో, 24 గంటల పర్యవేక్షణలో, నిర్వీర్యమైన విద్యార్జనతో అమెరికాకో, ఆస్ట్రేలియాకో లేదా ఏ గల్ఫ్‌ దేశానికో ఎగిరిపోతే ఎంత హాయి అనే వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థను ప్రమోట్‌ చేసే మీడియా, సెల్‌ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌, టాబ్‌లెట్లు అందుబాటులోకి వచ్చి యువతను మానసికంగా ఎదగకుండా చేస్తున్నాయి. ఇదే ప్రపంచమని భ్రమించేలా చేస్తున్నాయి. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేని విధంగా తీర్చిదిద్దుతున్నాయి. వస్తువులాగా ప్రతిదీ కొనుక్కుంటే దొరుకుతుందనే భావన బాగా పెరిగిపోయింది. మానవ సంబంధాలు మంట గలిసి వ్యక్తుల మధ్యన ‘సుఖం’ అనే ఓ వేట ప్రారంభమయింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంజాయ్‌మెంట్‌ అనే రెండు ఎలక్ట్రోడులు యువతను ‘అనుభవించు’ అనే ముగింపునకు ఉసిగొల్పుతున్నాయి. ఈ ఆవేశంపాళ్ళు ఎక్కువై హింసకు దారితీస్తున్నాయి.

శాంతిని, ధర్మాన్ని ప్రచారం చేస్తున్నామంటున్న మత ప్రచారాలు గానీ, వీటినే ఊపిరిగా భావిస్తూ పాలిస్తున్నామంటున్న పాలక వర్గాలు గానీ సహేతుకమైన కారణాల్ని వెతకలేకపోతున్నాయి. తదనుగుణమైన విద్యారంగాన్ని రూపొందించలేక పోతున్నాయి. పోటీతత్వం అనే ఒక మిథ్యా విధానం యువతను పెడదారి పట్టిస్తున్నది. అందుకే అత్యాచార పర్వం నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఇది బాగు పడుతుందని, బాగు చేయబడుతుందనే ఆశ కూడా లేని స్థితికి చేరుకుంది. వీటి ఫలితాల్నే వయస్సుతో, వావితో సంబంధం లేకుండా ఆడపిల్లలు, అక్కాచెల్లెళ్ళు, అర్ధాంగులు, అమ్మలు, అమ్మమ్మలు అకృత్యాలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇందులో అచ్చుకెక్కినవే గగుర్పాటును కలిగిస్తున్నాయి. ఇక అచ్చుకెక్కనివి ఎన్నో!

ఈ కింది గణాంకాల్ని చూస్తే మనం ఏ సమాజంలో

ఉన్నామో, అసలు సభ్య సమాజమంటే మనకు తెలుసా అనే సంశయం కలుగక మానదు. చట్టాల్ని చేసి చేష్టల్ని చూసే ఓ దుష్ట వ్యవస్థను దేంతో పోల్చాలో తెలియని స్థితి. వాడుక భావజాలంలో దుర్మార్గాన్ని, దాష్టీకాన్ని దుశ్శాసునితో పోలుస్తాం. కానీ దుశ్శాసన పర్వం కూడా వ్యక్తుల సమక్షంలో జరిగిందే కానీ, అవకాశవాదం తోనో, అతివ ఒంటరిగా ఉన్నప్పుడో జరగలేదు. నేటి దుశ్శాసన పర్వాల్ని ఏ మృగానితో పోల్చినా సంబంధిత జంతువును అవమానప ర్చినట్టే అవుతుంది. ఏ రాక్షసునితో పోల్చుదామన్నా వారంతా కారణజన్ములని మన ఇతిహాసాలే ఘోషించే..!

మొన్నటి లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత ఏప్రిల్‌ నుంచి మహిళలపై జరిగిన అత్యాచారాల సంఖ్య 9,786 కాగా, అగ్రభాగాన ఉత్తరప్రదేశ్‌లో 6,110 కేసులు, ఢిల్లీలో 1,178 కేసులు నమోదయ్యాయంటే దేశ రాజధానిలో మహిళల దుస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గృహ హింస, గౌరవానికి భంగం వాటిల్లడం వంటి సమస్యలతో పాటు వరకట్న, ఆస్తి, అత్యాచారాలకు సంబంధించినవి కూడా ఇందులో ఉన్నాయి. 2012-13లో దేశవ్యాప్తంగా 16,584 కేసులు నమోదు కాగా, 2013-14లో 22,422 కేసులు, 2014-15లో అత్యధికంగా 32,118 కేసులు నమోదయ్యాయి. అంటే 2012-15 మధ్యకాలంలో వరుసగా 35 శాతం, 43 శాతం పెరిగాయన్నమాట. జాతీయ భావనతో, సనాతన ధర్మ పరాయణతో, స్త్రీల పట్ల అపారమైన గౌరవ మర్యాదల్ని ప్రదర్శించే ఎన్డీఏ హయాంలో మహిళలపై అత్యాచారాలు తగ్గాల్సింది పోయి, పెరిగిపోతూ ఉండడం ఆందోళనకరం.

అయితే జాతీయ నేర పరిశోధన సంస్థ (చీజ=దీ) సేకరించిన వివరాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. ఈ సంస్థ రికార్డుల ప్రకారం 2012లో 24,923 అత్యాచారాల కేసులు నమోదు కాగా, 2013లో వీటి సంఖ్య 33,707కు పెరిగింది. సగటున రోజుకు 92 మంది అత్యాచారాలకు బలైపోతూ ఉన్నారన్నమాట. దేశ రాజధానిలో ఈ సంఖ్య 2012 కన్నా రెట్టింపై 1,636కు చేరింది. అంటే ప్రతి రోజు నలుగురు మహిళలు ఈ కీచక పర్వానికి గురవుతున్నారు. ఈ బాధితుల్లో 15,556 మంది వయసు 18-30 సంవత్సరాలు కాగా, నిందితులు మాత్రం 14 నుంచి 80 సంవత్సరాల వయసు వారుండడం గమనార్హం. ఈ మధ్యన హైదరాబాద్‌ షీ (ూష్ట్రవ) టీంలకు దొరికినవారి వయసులను చూస్తే అత్యాచారం చేయడానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి వయసుతో, విలువలతో నిమిత్తం లేదని తేలింది. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమన్న మన ఆర్టీసీ నినాదాన్ని ఏ విధంగా కాపాడుతున్నామో ఈ కింది పట్టిక తెలుపుతుంది.

పట్టిక-1 : రాష్ట్రాల వారీగా మహిళలపై జరిగిన అత్యాచారాలు

రాష్ట్రం -2013 రాష్ట్రం – 2013

మధ్యప్రదేశ్‌ – 4,335 జార్ఖండ్‌ – 1,204

రాజస్థాన్‌ – 3,285 బీహార్‌ – 1,128

మహారాష్ట్ర – 3,063 కర్నాటక – 1,030

ఉత్తర్‌ప్రదేశ్‌ – 3,050 హర్యానా – 0,971

అస్సాం – 1,937 తమిళనాడు – 0,923

పశ్చిమ బెంగాల్‌ -1,685 పంజాబ్‌ – 0,888

ఢిల్లీ – 1,636 గుజరాత్‌ – 0,732

ఆంధ్రప్రదేశ్‌ – 1,635 జమ్ము, కాశ్మీర్‌ – 0,378

చత్తీస్‌గఢ్‌ – 1,380 హిమాచల్‌ప్రదేశ్‌ – 0,250

కేరళ – 1,221 ఉత్తరాఖండ్‌ – 0,228

2012లో కూడా మొదటి నాలుగు రాష్ట్రాలు వరుసగా 4,335/3,285/3,063/3,050 కేసులతో ముందు వరుసలోనే ఉ

ండడం గమనార్హం! దీన్ని బట్టి స్త్రీ భద్రతపట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో అర్థమవుతుంది. ఈ మధ్యన

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన బాలికల జంట హత్యలు, వారిని ఉరితీసిన తీరు కళ్ళముందు మెదులుతూనే ఉన్నాయి. 2013లో జరిగిన మొత్తం అత్యాచారాల్లో మూడో వంతు (13,304) కేసులు మైనర్స్‌కు సంబంధించినవే కాగా, 2012లో వీరి సంఖ్య 9,032గా ఉంది. ఎన్‌సిబిఆర్‌ లెక్కల ప్రకారం పిల్లలపై సమీప బంధువులు చేస్తున్న అత్యాచారాలు 2012లో 392 కాగా, 36.7 శాతం పెరుగుదలతో 2013లో 536కు చేరుకున్నాయి. ఈ అత్యాచారాలకు పాల్పడేవారిలో 94 శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే కాగా, 539 మంది స్వయాన తండ్రులని, 10,782 మంది ఇరుగుపొరుగు వారని, 4,315 మంది బంధువులని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే, నిర్భయ చట్టం రూపొందించిన తర్వాత మాత్రం కేసుల నమోదు పెరగడం, పరిష్కారంలో కొంత ఊపందుకోవడం కొసమెరుపు. 2012లో పరిష్కారం కాని కేసులు 35.9 శాతం కాగా, 2013లో ఇవి 31.5 శాతానికి తగ్గాయి. 2011లో ఇవి 36.6 శాతంగా ఉండేవి. ఈ క్రింది పట్టిక కేసులు పరిష్కారమవుతున్న తీరును తెలుపుతుంది.

పట్టిక – 2 : అత్యాచార కేసులు – పరిష్కారాలు

సంవత్సరం పరిశీలనలో కోర్టులో శిక్షలు

ఉన్న నడుస్తున్న పడిన

కేసులు కేసులు కేసులు

2011 36.6% 83.6% 26.4%

2012 35.9% 85.1% 24.2%

2013 31.5% 83.4% 27.1%

 

కేసుల సంఖ్య పెరిగినా, కోర్టు లావాదేవీలలో పెద్దగా మార్పు లేదని పై పట్టిక తెలుపుతోంది. ఇలా కేసులు సత్వర పరిష్కారం కాకపోవడంతో నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటోంది. దీంతో నిందితులకు భయం లేకుండా పోతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, అత్యాచారాల కేసుల్లో ఉమ్మడి రాష్ట్రం 11.5 శాతంతో 28,171 కేసులతో రెండవ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 12.7 శాతంతో 30,942 కేసులతో ప్రథమ స్థానంలో ఉంది. మహిళలపై జరిగే అత్యాచార, హింస కేసులు దాదాపు 20 శాతం ఫిర్యాదు చేయకుండానే

ఉంటాయని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ తెలుపుతూ, 2014లో తానే 136 కేసుల్ని పరిశీలించినట్లు చెప్పడం గమనార్హం. పోలీస్‌ స్టేషన్లలో 40 శాతం కేసులు కూడా నమోదు కావని, దాదాపు 60 శాతం కేసులలో ప్రాథమిక స్థాయిలోనే నష్టపరిహారం ఇప్పించి నోరు మూయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం ద్వారా మరింత ఖర్చవడమే కాకుండా సత్వర పరిష్కారం లభించదని, పైగా కుటుంబ పరువు పోయి, అమ్మాయిలకు పెళ్ళి కాని పరిస్థితి ఏర్పడితే, పెళ్ళైన మహిళలు అవమానం ఎదుర్కోవలసి వస్తుందనే భావన అన్ని సమాజాల్లో చోటు చేసుకుంది. ఈ పరిస్థితి ఉన్నత, మధ్యతరగతి వారిలో అధికంగా

ఉందని, కొంతలో కొంత ధైర్యంగా బాహ్య సమాజానికి చెప్పుకునే వ్యవస్థ కిందిస్థాయి కుటుంబాల్లోనే ఉంటుందని, వీరు కూడా ఏదో ఒక పరిష్కారానికి లొంగిపోతారని చైతన్య మహిళా సంఘం కార్యకర్త దేవేంద్ర ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక భర్తల ద్వారా జరిగేహింస, అత్యాచారాలు 90 శాతందాకా బయటకు రాని పరిస్థితి ఉంది.

వరకట్నపు హత్యలు

సత్వర న్యాయం, నిందితులకు శిక్ష ఈ దేశంలో ఒక భ్రమలాంటిదే! రాజకీయ, ఉన్నత వర్గాలకు కోర్టులు, చట్టాలు చుట్టాల్లా పనిచేస్తూనే ఉన్నాయి. పోలీసులు వీరికి అనుకూలంగా పనిచేయడమే పరమావధిగా వ్యవహరించే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2014లో నమోదైన మొత్తం కేసులు 28,51,563 కాగా, ఇందులో ఛార్జిషీటుకు నోచుకున్నవి 19,97,533 అయితే, శిక్షలు మాత్రం 6,50,144 (45.1%) కేసుల్లోనే విధించడం జరిగింది. మిగతా 54.9% కేసులు సరైన ఆధారాలు లేక కొట్టివేయబడ్డాయి. ఇందులో అత్యధికం మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. 2014లో తెలంగాణలో 38.6 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 28.9 కేసులు పరిష్కరించబడగా, కేరళలో అత్యధికంగా 77.8 శాతం, పశ్చిమ బెంగాల్‌లో అత్యల్పంగా 11.0 శాతం పరిష్కరించబడ్డాయి. కోర్టుల పనితీరుకు, పోలీసు దర్యాప్తునకు ఇవి అద్దం పడుతున్నాయి. అందుకే బాధితులు పోలీస్‌ స్టేషన్లకు, కోర్టులకు వెళ్ళడానికి విముఖత చూపుతూ ఉంటారు. 2014లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరకట్నపు హత్యలు తెలంగాణలో 63 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 36 మాత్రమే. తెలంగాణలో జరిగిన ప్రతి సంఘటనకు ఆంధ్ర రాజకీయాలను నిందించే అలవాటు గలవారికి ఈ లెక్కలు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. రైతు ఆత్మహత్యలు కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి, భూస్వామ్య భావజాలాన్ని ఏ మాత్రం మార్చలేదని ఈ సంఘటనలు తెలుపుతున్నాయి. చీజ=దీ లెక్క ప్రకారం ఈ కింది పట్టికలో రాష్ట్రాల వారీగా 2013లో జరిగిన వరకట్నపు హత్యల వివరాలు చూడవచ్చు.

పట్టిక – 3

రాష్ట్రం – జరిగిన హత్యలు

ఉత్తర్‌ప్రదేశ్‌ – 2,335

బీహార్‌ – 1,182

మధ్యప్రదేశ్‌ – 0,776

ఆంధ్రప్రదేశ్‌ – 0,492

పశ్చిమ బెంగాల్‌ – 0,481

రాజస్థాన్‌ – 0,453

జార్ఖండ్‌ – 0,307

కన్యాశుల్కం, బాల్య వివాహాలు తెరమరుగైనా వితంతు వివాహాలు ఊపందుకున్నా వరకట్నం ఒక ఆధునిక ఆచారంగా మారిపోవడం శోచనీయం.

గృహ హింస

ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లో ఘర్షణ జరగడం మామూలుగా మారింది. ఇదో సామాజిక రుగ్మతగా తయారైంది. ఇది తీవ్ర రూపం దాల్చి అనేక అనర్థాలకు దారి తీస్తోంది. 2013లో ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి.

పట్టిక – 4

రాష్ట్రం – నమోదైన గృహ హింస కేసులు

పశ్చిమ బెంగాల్‌ – 18,116

రాజస్థాన్‌ – 15,094

ఆంధ్రప్రదేశ్‌ – 15,084

ఉత్తర్‌ప్రదేశ్‌ – 08,781

అస్సాం – 08,636

మహారాష్ట్ర – 08,542 గుజరాత్‌ – 07,812

చాలా రాష్ట్రాల్లో నమోదైన కేసుల్ని, పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే చెట్లకింద పరిష్కారం చేయడం అనేది ఒక సాధారణ అంశం. మహిళలపై దాష్టీకానికి పేరొందిన ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన సంఖ్య ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే అనధికార లెక్కల ప్రకారం మహారాష్ట్రలోనే 26 వేల కేసులు నమోదైనట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి.

అపహరణ / మాయం చేయడం:

ఇదో సర్వసాధారణమైన అంశం! యువతులను అపహ రించి రెడ్‌లైట్‌ ఏరియాలకు అమ్మడం, దీని వెనుక పెద్ద మాఫియాలు పనిచేయడం, వీరికి రాజకీయ అండదండలు ఉండడం తెలిసిన విషయమే. ఏ ప్రభుత్వాలూ వీటిని అరికట్టలేని పరిస్థితి. అపహరణలు బయటకు పొక్కి బాధితులు వ్యక్తుల పేర్లు చెబుతారని భావించిన సందర్భాలలో వారిని చంపివేయడం, మాయం చేయడం జరుగుతూ ఉంది. స్త్రీలని గౌరవించే వ్యవస్థలో ఇలా మహిళల వ్యాపారం కొనసాగుతూనే ఉంది.

పట్టిక – 5 : 2013లో అపహరణలు – మాయమైన కేసులు

రాష్ట్రం నమోదైన రాష్ట్రం నమోదైన

కేసులు కేసులు

ఉత్తర్‌ప్రదేశ్‌ – 9,737 ఒడిస్సా – 2,067

బీహార్‌ – 4,419 హర్యానా – 1,957

అస్సాం – 4,222 చత్తీస్‌గఢ్‌ – 1,881

రాజస్థాన్‌ – 4,047 మహారాష్ట్ర – 1,874

పశ్చిమ బెంగాల్‌ – 3,830 ఆంధ్రప్రదేశ్‌ – 1,595

మధ్యప్రదేశ్‌ – 2,873 తమిళనాడు – 1,516

గుజరాత్‌ – 2,230

పై పట్టికలోని లెక్కల్ని చూస్తే, మహిళల శరీర వ్యాపారం (ఖీశ్రీవరష్ట్ర ుతీaసవ) ఏ విధంగా జరుగుతోందో తెలుస్తోంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని, జిడిపి వృద్ధి రేటుతో పాటు ప్రపంచంలో 7వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని ప్రకటనలను ఇస్తున్న పాలకులు, స్త్రీని పవిత్రంగా భావించే వ్యవస్థలో స్త్రీల వ్యాపారాన్ని అరికట్టలేని దుస్థితి కొనసాగుతోంది.

ఈ విధంగా చూస్తూ పోతుంటే, మహిళలపై, పసిపిల్లలపై జరిగిన అన్యాయాలకు అంతూ, పొంతూ లేకుండా పోతోంది. దేశమానవాభివృద్ధి సర్వే (Iనణూ) ప్రకారం హిందు, ముస్లింలలో ఇంకా 60 శాతం దాకా మహిళలు పరదాను పాటిస్తున్నారని, అత్యధికంగా రాజస్థాన్‌లో 61 శాతం, బీహార్‌లో 91 శాతం తలపై ముసుగు లేకుండా ఇంట్లోనే తిరగలేని స్థితి ఉందని గుర్తించింది. దీన్నిబట్టి, మహిళాభ్యుదయం ఎంతగా కునారిల్లుతోందో అర్థమవుతుంది. ఈ విధానం తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువగా ఉన్నట్లు తేలింది.

మగవారికి అనారోగ్యం చేకూరితే హైరాన పడినంతగా, ఆడపిల్లలకు, మహిళలకు సంభవిస్తే గాభరా పడని కుటుంబ వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. 80 శాతం మహిళలు భర్త అనుమతి లేకుండా వైద్యుల దగ్గరికి పోలేని పరిస్థితి ఉండగా, మూడో వంతు మహిళలు ఒంటరిగా పోలేని పరిస్థితి ఉంది.

అత్యధికంగా పెళ్ళిళ్ళు కుటుంబ పెద్దల నిర్ణయం మేరకే జరుగుతాయనేది తెలిసిందే. చదువుకున్న యువతీ, యువకులు వరకట్నపు దురాచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పైగా ఈ దురాచారం లేని గిరిజన కుటుంబాలకు కూడా ఈ ఆచారం అంటుకుంది. కట్నాల్ని తీసుకోవడం ఆచారంగా మారింది. దీంతో ఆడపిల్లను గౌరవంగా, అదృష్టంగా భావించే గిరిజనులు, ఇప్పుడు ఆడపిల్ల పుడితేనే భారంగా భావిస్తున్నారు. దేశంలో 20 శాతం మంది మహిళలకు కాబోయే భర్త యొక్క వ్యక్తిగత వివరాలు అసలు తెలియవు. 40 శాతం మంది తల్లిదండ్రుల మాటను కాదనకుండా పెళ్ళి చేసుకుంటున్నట్లు పై సర్వే తేల్చింది.

లింగ మార్పిడి

జూన్‌ 2011లో మధ్యప్రదేశ్‌లో ఒక సంచలన వార్త ప్రచురితమైంది. వందలాది మంది ఆడపిల్లల్ని సెక్స్‌ మార్పిడికి గురిచేసి మగపిల్లలుగా మార్చినట్లు కథనాలు వెలువడగా, 29 జూన్‌ 2011న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక ఎడిటోరియల్‌నే రాసింది. 1958లో ఇయాన్‌ డొనాల్డ్‌ అనే స్కాటిష్‌ వైద్యుడు శరీర అంతర్భాగాల్ని చూడడానికి అల్ట్రాసౌండ్‌ అనే విధానం కనుగొనడంతో వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. ప్రతి ఆవిష్కరణకు మంచితో పాటు చెడు కూడా ఉన్నట్లే, ఈ విధానంతో గర్బస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా చైనా, భారత్‌లకు ఇది ఒక శాపంగా మారింది. ఐక్యరాజ్య

సమితి జనాభా విభాగం లెక్కల ప్రకారం 2010-15లలో ప్రతి 100 మంది బాలికలకు చైనాలో 116, భారత్‌లో 111 మంది బాలురు ఉన్నట్లుగా తేలింది. ఇదే కాలంలో భారత్‌లో పెళ్ళీడుకున్న 6.5 కోట్ల మంది యువకుల్లో 4.12 కోట్ల మందికి పెళ్ళి కూతురే దొరకని పరిస్థితి ఉంది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో తిరిగి బహు భర్తృత్వం మొదలు కాగా, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల గిరిజన అమ్మాయిలను కొనుగోలు చేసి

పెళ్ళిళ్ళు చేసుకునే ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే, 2060 నాటికి ప్రతి వంద మంది యువతులకు 160 మంది యువకులు పోటీపడే పరిస్థితి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ ఆడపిల్లల కొరత యువకుల్లో నేర ప్రవృత్తికి, వింత చేష్టలకు, అకృత్యాలు చేయడానికి కారణభూత మవుతున్నదని వ్యాఖ్యానించింది.

ఆర్థిక స్వావలంబన

ఒకప్పుడు మాతృస్వామ్యంగా కొనసాగిన భారత సమాజం తర్వాత పితృస్వామ్యాన్ని పుణికి పుచ్చుకుంది. దీంతో శ్రమలో సగభాగమైనా, ఫలితాలను అనుభవించడంలో మహిళలు ఎప్పుడూ వివక్షతకు గురవుతూ ఉన్నారు! కూలీ నాలి చేసుకునే మహిళలలో ఉన్న ఆర్థిక స్వేచ్ఛ, పట్టణ ప్రాంత మహిళల్లో,

ఉద్యోగినుల్లో ఉండడం లేదు. బ్యాంకు అకౌంట్లన్నీ భర్తల పేరుమీదే కొనసాగుతూ ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళల బ్యాంకు అకౌంట్లకే జీతాలు వచ్చినా, ఏటీఎం కార్డుల నిర్వహణ అంతా భర్తల చేతులమీదే కొనసాగుతు న్నట్లు అనేక కథనాలు తెలుపుతున్నాయి. అలాగే ఆస్తులపై, భూములపై హక్కుల్లో మహిళలది కానరాని స్థానమే. పైన ఉదహరించిన Iనణూ సంస్థతో కలిసి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రిసెర్చ్‌ (చీజూజు=) సంస్థ సంయుక్తంగా చేపట్టిన పరిశీలనలో ఆస్తి హక్కులు గల మహిళలు 20 శాతంకన్నా తక్కువని తేలింది. హిందూ వారసత్వ హక్కుల చట్టం ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా, ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే తల్లి దండ్రుల ఆస్తుల్లో సమాన వాటా దక్కుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ల లో జరిపిన మహిళలు – భూ హక్కు అనే సర్వే తెలిపింది. ఈ విషయం లో స్వయాన తల్లిదండ్రులే విముఖత చూపడం గుర్తెరిగిందే!

విద్యాలయాల్లో తప్ప రాజకీయంగా ఎదగని స్థితిని అసెంబ్లీ నుంచి పార్లమెంటు దాకా చూస్తూనే ఉన్నాం. అందుకే మహిళా బిల్లు అటకెక్కి కూర్చుంది. ఇలా మహిళలు శ్రమలో సగమైనా, ఇంటి విషయంగా పూర్తి బాధ్యత వహించినా, పిల్లలను కని పెంచడంలో ప్రధాన భూమికనే పోషించినా, మహిళాభ్యు దయం ఎప్పుడూ కొరడుగట్టిన దీపమే. దీనికి గల కారణాలు అనేకం కావచ్చు, కానీ పరిష్కరించే వాటిని కూడా పరిష్కరించ లేకపోగా కొత్త కొత్త రూపాల్లో సమస్యలు పుట్టుకువస్తూ, మహిళల్ని అధమ స్థాయిలోనే ఉంచుతున్నాయి.

ఏం జరగాలి?

దేనికైనా ఒక అవగాహన, నిజాయితీగల ఆచరణ అవసరం. ఇది రాజకీయంగా జరిగినప్పుడే సమస్యల మూలాలు అర్థమవుతాయి. సరైన పరిష్కారాలు లభిస్తాయి. కానీ, సమస్యను ఉపరితలంగా గుర్తించి పరిష్కరిస్తే, ఆ సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలకు కారణభూతమవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే!

ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ నిర్మాణం జరగకుండా ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోదు. ఇది ఇంటినుంచే మొదలు కావాలి. విద్యాలయాల్లో చర్చకు రావాలి. అప్పుడే ఆచరణకు నోచుకుంటాయి. ఇటు తల్లిదండ్రులకు, అటు ఉపాధ్యాయులకు, యువతీ యువకుల సమస్యలు పట్టడం లేదు. ‘చదువు’ అనే బందిలి దొడ్డి ఆరోగ్యకరమైన ఆలోచనలకు తావివ్వడం లేదు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కులవృత్తులతో కూడిన ఉపాధి విధానాలు, మిశ్రమ ఉత్పత్తి పద్థతి, సాంఘిక సంబంధాలు యువతకు ఒక చక్కని సామాజిక విద్యను అందించేవి. రాగద్వేషాలు, ఆర్థిక లావాదేవీలు, కష్టసుఖాలు, మానవ సంబంధాలు పరిఢవిల్లేవి. వీటికి అనుబంధంగా విద్యాలయాలు సాంఘిక దురాచారాలపై చర్చలను లేవదీసేవి. బాల్యదశలోనే వీటిపైన ఒక చక్కని అవగాహన ఏర్పడేది. కొందరు ఆచరించి ఆదర్శప్రాయులయ్యేవారు. విశ్వవిద్యాలయాలు మరింత ముందుకు వెళ్ళి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై, వాటి ప్రభావాలపై, సంస్కృతి, సంప్రదాయాలపై, గాడితప్పుతున్న మీడియాపై సమావేశాలను, సదస్సులను నిర్వహించేవి. వక్తలచే, మేధావులచే మాట్లాడించేవి. వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలు, గతితార్కిక, చారిత్రక, భౌతిక వాదాలపై, రాజకీయ అర్థశాస్త్రంపై, మహిళల హక్కులపై జరిగిన పోరాటాలపై సిద్ధాంతపరమైన చర్చలు చేసేవి. హేతువాద, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేవి. ఇదంతా తెరుమరుగై, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ యువతను సెల్‌ఫోన్లకు, డాలర్ల వేటకు పురిగొల్పుతున్నాయి. అధునాతన సంప్రదాయాల పేరున విశృంఖలత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన విద్యార్థి సంఘాలు ఆర్థిక పోరాటాలకు, ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యతను ఇవ్వడంతో మౌలిక సమస్యలు మరుగున పడిపోతున్నాయి.

కాబట్టి, ఇప్పుడు కావాల్సింది ఇంటా బయటా సామాజిక విద్య. దీన్ని అందించడంలో తల్లిదండ్రులు ఎలాగూ విఫలమ య్యారు. అభివృద్ధి కాముక విద్యార్థి సంఘాలన్నా తిరిగి వీటిని చేపడితే, కొంతలో కొంత సామాజిక మార్పు, మహిళాభ్యుదయం జరగక మానదు. కనీసం ఇప్పుడైనా ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిద్దాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.