ఏది నేరం? ఏది నివారణ? పి ఎ దేవి

ఏది నేరం? నేరమంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగితే వారిని అమాయకుల్లా పరిగణించి అందరూ జాలిపడతారు. కానీ ఏది నేరం? నేరమంటే ఏమిటి? అని అడిగితే తడబడతారు. ప్రపంచంలోని అన్నింటితోపాటు ”నేరం” నిర్వచనం మారుతూ వచ్చిందంటే తెల్లబోతారు.

ఉదాహరణకు పునరుత్పత్తి మానవ సమాజం బతకడానికి కీలకం అయినప్పుడు స్త్రీ హత్య అన్నింటికంటే తీవ్రంగా శిక్షించాల్సిన నేరం. గుంపు లేకుండా మనిషి మనుగడ లేనపుడు గుంపులో ఎవర్నయినా వేరేవారు చంపితే గుంపు మొత్తం ప్రతీకారం తీర్చుకుంటుంది. అది నేరం కాదు. వ్యవసాయానికి పశువులు కీలకం అయినప్పుడు పశువుల్ని చంపడం నేరం. పాశ్చాత్యదేశాలలో గుర్రాలు అన్నింటికీ అవసరం కనుక గుర్రాలను దొంగిలిస్తే ఉరి వేసేవారు.

ప్రకృతిలో దొరికే పంటలూ, కాయలూ, జంతువులూ అందరివీ.. అని నమ్మిన కాలంలోనే మిగిలిపోయిన తెగలు దొంగ / నేరస్థ తెగలుగా బ్రిటిష్‌ రాజ్యంలో ముద్రపడి నేటికీ ఆ ముద్రను తుడుచుకోలేకపోతున్నాయి. కాబట్టి నేరం అంటే ఏమిటి? దానికి ఎటువంటి శిక్ష పడాలి అనేది కాలాన్ని బట్టి మారుతుంటుంది.

ఈనాటి కాలంలో నేరాల స్థాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మారుతున్న తీరును బట్టి వుంటుంది. ఏ నేరానికి ఎంత తీవ్రంగా స్పందించాలనేది ఆయా సర్వసత్తాక సార్వభౌమత్వం గల ప్రభుత్వాల చేతిలో లేదు, అది ఆర్థిక వ్యవస్థను శాసించేవారిని బట్టి

ఉంటుంది. అమెరికా అగ్రరాజ్యంగా ఇరాక్‌ చమురు నిక్షేపాల కోసం ‘తీవ్రవాదంపై పోరు’ పేరిట యుద్ధం ప్రారంభిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనగా ఎవరూ నోరెత్తలేదు. ఈ అగ్రరాజ్యపు చల్లని పడగ నీడలో ఇజ్రాయిల్‌, పాలస్తీనా ప్రజలను 70 ఏళ్ళుగా రక్తపాతంలో ముంచెత్తినా ఏ దేశానికీ కళ్ళు కనబడ్డంలేదు, చెవులు వినబడ్డం లేదు. దాని యుద్ధ నేరాలకు ఎవరూ దోషిగా విచారించడం లేదు. లాటిన్‌ అమెరికా నుండి అరబ్‌ రాజ్యాలదాకా ప్రజాస్వామ్యం కోసం అమెరికా చేసిన ఊచకోతలు, నేరాలు అస్సలు గుర్తింపబడలేదు.

ఆఫ్రికాలో చమురు గురించి ఉరికంబం ఎక్కిన కవికెన్‌ సారో వీవా దగ్గర్నుండి స్ల్లిిమ్‌ ఫోన్‌ల తయారీలో అవసరమైన మినరల్స్‌ కోసం ఆఫ్రికాలోని తెగలకు ఆయుధాన్నిచ్చి మారణకాండ జరిపిస్తున్న బహుళ జాతి సంస్థలు ఏ బోనులోనూ నిలబడ్డంలేదు.

నేరమూ, అంతర్జాతీయ వ్యాపారమూ కవల పిల్లలు. ఆర్థిక ప్రపంచీకరణ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నేరాలకు అవకాశం కలిగిస్తోంది. ఆర్థిక నేరాలు అంతర్జాతీయ కంపెనీలు చేస్తున్న కుంభకోణాలు. ఎన్రాన్‌, సత్యం, వలర్డ్‌కాం, మాన్‌సాంటో ఒకటేమిటి… అత్యున్నత స్థానాల్లో వారు లాభపడ్డారు. ఆర్థిక వ్యవస్థను నియంత్రించమంటే సాధారణ కార్మికుల పెన్షన్లు ప్రమాదంలో పడ్డాయి. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం సరిహద్దులు చెరిపివేయడంతోటే ఆయుధ వ్యాపారం, మాదక ద్రవ్యాలు మనుషుల అక్రమ రవాణాకు దారులు తెరిచినట్లయింది. ఆర్థిక నేరం ఒక స్టేటస్‌ సింబల్‌. దానిపట్ల సామాన్యులకు ఆరాధనా భావం.. నేరస్థ ముఠాలు వారి కార్యకలాపాలకు ఇంటర్‌నెట్‌ను అడ్డాగా చేసుకున్నాయి.

పెద్ద ఆర్థిక కుంభకోణాలు లేదా జాతుల ఊచకోతలు, సహజ వనరుల విచక్షణా రహిత దోపిడీ నేటికాలంలో మానవజాతికి ప్రమాదం తెచ్చిపెట్టే అతిపెద్ద నేరాలు. వీటిని ఒక దేశం తానంతట తాను నివారించే దశ దాటిపోయింది. అయితే రోజువారీ జరిగే సాధారణ నేరాలకూ, వాటికి ప్రతిస్పందిస్తున్న తీరూ కూడా ప్రపంచానికంతటికీ సంబంధించిన సమస్యా? దేశానికి సంబంధించిందా?

ప్రపంచీకరణ తర్వాత పెరుగుతున్న అగాధాలు, మారు తున్న పరిస్థితులు ఎంత నేరం జరగాలో నిర్దేశిస్తున్నాయి అంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఎలాంటి నేరం జరగాలో మాత్రమే కాదు నేరాన్ని ఎలా నిర్వచించాలి, ఎంత శిక్ష విధించాలి అనేదాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఏ నేరం పట్ల సమాజం ఎలా స్పందించాలో కూడా లక్ష్మణ రేఖలు గీస్తున్నాయి.

మానవ సమాజం నేరుగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం పరస్పరం ఆధారపడి ఉండే కాలంలో నేరం చాలా తీవ్రస్థాయిలో ఉంది. మనిషి వ్యక్తిగత ప్రవర్తననీ, విలువల్ని, సొంతలాభాన్ని సామూహిక ప్రయోజనం నియంత్రించింది. మంచి చెడు ఏమిటి? పిల్లలు ఎలా ఉండాలి? వారికి ఏమి నేర్పించాలి వంటివి అందరికీ ఆమోదయోగ్యమయిన సూత్రాలుగా ఉండేవి. కానీ వ్యక్తి ప్రయోజనం కేంద్ర స్థానం ఆక్రమించాక ఒక చిన్న కుటుంబం కూడా ఒకే విలువను ఆమోదించడం లేదు. పగిలిన స్థానంలో ప్రతిబింబంలా ముక్కలయిన విలువలే వ్యక్తి కేంద్రంగా

ఉంటున్నాయి. దానికి తోడు స్థిరమైన జీవనోపాధి లేకపోవడం నేరాలను పెంచుతోంది.

అంటే అందరూ పనిచేయాల్సి వచ్చినపుడు పిల్లలు వారి జీవన దృక్పథాన్ని వేరేచోట ఎక్కడినుండో ఏర్పాటు చేసుకుంటారు. వేతనాలు అతి తక్కువ ఉండే ప్రాంతానికి ఉపాధి తరలివెళ్ళడంతో, మనుషులకు ఉపాధి గగన కుసుమం కాగానే ఈ ప్రాంతాల్లో అభద్రత, దాంతోపాటు నేరం పెరుగుతూ పోతాయి.

సామాజిక చరిత్ర లేకపోవడం, విద్యావకాశం తగ్గిపోవడం, పేదలంటే సోమరిపోతులన్న తూష్ణ్ణీిభావం నేరాలకు మరింత ఆస్కారమవుతోంది.

అందర్నీ నిలబెట్టి కలుపుకుని పోయే సామాజిక సంక్షేమం విధానాల నుండి ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్నప్పుడు, సమాజ క్షేమం కోసం చట్టాలు, శిక్షలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించవలస

వస్తుంది. అంటే అందరికీ సంక్షేమంపై నిధులు వెచ్చించడాన్ని పెంచితే పోలీసు శాఖ జైళ్ళపై వెచ్చించాల్సిన అవసరం తగ్గుతుంది. విద్య, వైద్యం, ఉపాధిపై దృష్టి కేంద్రీకరిస్తే నేర నివారణకై కృషి పెరుగుతున్నట్లే.

పేద, ధనిక అంతరాలు ఎంతగా పెరుగుతూ పోతే సమాజంలో హింస, తీవ్రమయిన నేరాలు అంతగా పెరుగుతాయన్న మాట. ఆర్థిక నేరాలకు లభించినంత ప్రాధాన్యత పేదలపై జరిగే నేరాలకు లేదా దేశ భద్రతకు కూడా లభించదు.

రాజకీయ నాయకులకు ఈనాటి దేశ ఆర్థిక విధానాలపై నియంత్రణ లేదు. అవి వారి చేయి దాటిపోయి రెండున్నర దశాబ్దాలు దాటింది. కాబట్టి మాకూ నియంత్రించే శక్తి ఉంది అని చెప్పడానికి నేరాలను ఎంచుకున్నారు. 70 ఏళ్ళుగా తమ జీవితాలపై నియంత్రణ కోల్పోయి ఏ నిమిషంలోనైనా మరణించవచ్చన్నట్లు బతుకుతున్న పాలస్తీనా మగవారు వారి భార్యలను తీవ్రంగా అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో అలా లేదని వృద్ధ మహిళలు వాపోతున్నారు.

మొదట మొత్తం వ్యవస్థ అంతా… ముఖ్యంగా మీడియా దారుణమైన, క్రూరమైన నేరాల (అవి అతి తక్కువ శాతం) గురించి వైనాలు వైనాలుగా వర్ణించి చూపిస్తూ భయం పుట్టిస్తుంది. చూసేవారికి మనుషులపైనే నమ్మకం సడలిపోతుంది. దాంతో తన చుట్టూ ఉన్నవారితో కలిసి నేర నివారణ గురించి ఆలోచించ కుండా ప్రభుత్వాలపై ఆధారపడతారు. నేరాలను అదుపుచేసే కఠిన చర్యలు డిమాండ్‌ చేస్తారు. ఈ బెదిరిపోయిన జన సమూహాలకు రాజకీయ నాయకులు కఠినాతి కఠిన శిక్షలను కాగితాలపై చూపించి హామీ ఇస్తారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమనే సామెత నమ్మి చిన్న నేరాలు చేసే బాలలు, పేదలు తీవ్ర శిక్షలు పొందుతారు. ఎలుకలు దూరగలిగే కంతలు మూసేస్తారు, ఏనుగులు దూరే కంతలు అలాగే ఉంటాయి. ఆకలితో అల్లాడే జనానికి గోడౌన్లలో నిల్వ ఉన్న ధాన్యం పంచమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా పంచని ప్రభుత్వాలు మానవ శ్రమ రవాణాకు బాధ్యులుగా శిక్షను అనుభవించనక్కరలేదా? విత్తనాలపై గుత్తాధిపత్యంతో రైతుల మరణాలు తాళ్ళు పేనుతున్న మాన్‌సాంటో బోనులో నిలబడనక్కరలేదా? పైశాచిక ముఠాలు చట్ట పరిధిలో చేసే నేరాలకు శిక్ష లేనప్పుడు నేరం ఎలా తగ్గుతుంది?

మందుల కంపెనీల మందుల ప్రయోగాలు ప్రాణాలు తీసినా శిక్ష లేదు. కానీ చిన్న చిన్న నేరస్థులు మాత్రం విచారణకు నోచకుండా ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతుంటారు.

చిల్లర నేరాలు, జీవనశైలి నేరాలు, నిరాశ నిస్పృహతో చేసే నేరాలు, ఉన్మాద నేరాలు, విపరీత మానసిక పరిస్థితివల్ల నేరాలు పెరుగుతుంటాయి. అభద్రత, అస్థిరత.. నేరాలకు పుట్టిళ్ళు. కాబట్టి ఎన్ని చట్టాలు చేసినా శిక్షలు వేసినా అదుపులోకి రావు. దాంతో రాజకీయ నాయకులు మరింత కఠిన శిక్షలకు వాగ్దానం చేస్తారు. కొత్త పరిస్థితుల్లో కొత్త నేరాలకు తాజా శిక్షలు ఉంటాయి. కనుక ఇప్పుడు కొత్త నేరాల్ని సృష్టించే ఒక సామాజిక పరిస్థితి ఏర్పడింది. ఒక వలయం ఏర్పడి విస్తరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా శిక్షలు తీవ్రతరం అవుతున్నాయి. అలాగే నేరస్థులు గత పదేళ్ళలో 50 శాతం పెరిగారు. అనేక కొత్త నేరాలు గుర్తించబడ్డాయి. అభద్రతా భావం బాగా వ్యాప్తి చెందింది.

ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమం నుండి వైదొలిగి శిక్షించే విధానాలు రూపొందిస్తున్నాయి. సహజంగానే అవి విఫలం చెందుతాయి కనుక నేర నివారణలో, భద్రత కల్పించడంలో ప్రైవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా లాభార్జనకు దిగాయి. ప్రతి ప్రైవేటు సంస్థ ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆశ్చర్యం కలిగించని అంశం ప్రభుత్వ సంస్థల భద్రత కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం. విఫలమైన ప్రభుత్వ కార్యక్రమం కంటే లాభం ఇచ్చే పథకం ఇంకేదైనా ఉంటుందా?

నేరాల పెరుగుదల, అభద్రత, శిక్షల స్థాయి, పోలీసు వైఫల్యం ఫలితం సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలు, స్క్రీనింగ్‌ యంత్రాలు… ప్రైవేటు రక్షణా వ్యాపారం తామర తంపరగా పెరుగుతోంది.

అందరికంటే అట్టడుగున ఉన్నవారు నేరాల పెరుగుదలకు బలయ్యే వారిలో ముందుంటారు. వారి పిల్లలు కనబడకుండా పోతారు. వారిపై అత్యాచారాలు సర్వసాధారణం. హింస నిత్యకృత్యం. వారిని కాపాడడానికి గేట్లు, స్క్రీనింగ్‌లు, గార్డులు, సీసీటీవీలు వుండవు. వారే ప్రతి సందర్భంలో నేరస్థులుగా కటకటాల వెనక్కి చేరుతారు. వారు చేయని నేరాల్లో కూడా వారే దోషులు..

ధనవంతులు చేసే నేరాలు ఎంత తీవ్రమైనవైనా (సల్మాన్‌ ఖాన్‌, షీనాబోరా కేసుల్లోలాగా) శిక్ష లేదు. అవి పేదలకు ఎంత ప్రమాద కరమైనవి అయినా (యూనియన్‌ కార్బైడ్‌, ఇతర ఫ్యాక్టరీలు) వాటికంటే పేదలు వారిలో వారు చేసుకునే దాడులు, హింస, నేరాలు సమాజానికి అత్యంత హానికరంగా పరిగణించే ధోరణి బలంగా ఉంది.

గత రెండున్నర దశాబ్దాల అసమానతల పెరుగుదల పర్యవసానం కేసుల్లో ఆ నేరాలకు శిక్షలు విధించే తీరులో స్పష్టంగా కనబడుతోంది. న్యాయ దేవత త్రాసు ”లాభం” వైపు శాశ్వతంగా మొగ్గి పోయిందేమో అనే అనుమానం కలుగుతోంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.