ఫ్యూయల్‌ యువర్‌ లైఫ్‌ – వి.ప్రతిమ

మేమంతా మూడు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22, 2016 సాయంత్రం నాలుగింటికి నెల్లూరులో బయల్దేరినట్లుగా విజయ ఫోన్‌ చేసి చెప్పింది. సరిగ్గా 5.30కి బైపాస్‌ వద్దకు వెళ్ళి నేను వాళ్ళని కలుసుకున్నాను. శాంతి వాళ్ళ కారులో నేను, విజయ, సుధీర, శాంతి వున్నాం. మాకు ముందు వెళ్తోన్న కారులో పద్మ, లక్ష్మి, నిర్మలమ్మ, శారద అంతా వున్నారు. ఈ కారులో నుండి ఆ కారులోకి, ఆ కారులో నుండి ఈ కారులోకి ధ్వని తరంగాలు ప్రసరిస్తూనే ఉన్నాయి. ఎప్పట్లాగే గ్రెహంబెల్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటుండగానే కార్లు రెండూ సూళ్ళూరుపేట చెంగాళమ్మ గుడి వద్ద జంటగా ఆగాయి. కొత్తవాళ్ళతో పరస్పర పరిచయాలు చేసుకుంటూ దేవాలయంలోకి ప్రవేశించాము. గతంలో కంటే గుడి చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో మార్పులు, ఎంతో క్యూ… అయినా అందరూ చకచకా లోపలి కెళ్ళిపోయి అమ్మణ్ణి దర్శనం చేసుకుని, ఆశీర్వచనాలందుకుని, హారతి కళ్ళకద్దుకుని ఇరవై నిమిషాలలోపే మళ్ళీ కార్లెక్కి ముందుకు సాగాం.

కార్లో శాంతి, సుధీర, విజయల కబుర్లు, మధ్యమధ్యలో ఫోన్లతో కాలమే తెలీలేదు. తొమ్మిదింటికి మద్రాసు టి.నగర్‌లోని ల్యాంకో వారి గెస్ట్‌హౌస్‌కి చేరుకున్నాం. అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీలక్ష్మి మాకు స్వాగతం పలికింది. అందరం కలిసి టిఫిన్లు చేసి పరిచయాలు ధృఢం చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళి పడుకున్నాం.

రెండింటికే వేకప్‌ కాలిచ్చింది పద్మ ”అక్కా లేవండి” అంటూ.

మా గదిలో విజయ, శ్రీలక్ష్మి ఇద్దరూ లేచి మొహాలు కడుక్కుంటుండగానే అక్కడి వంటతను కాఫీలు తెచ్చాడు. కాఫీ తాగి స్నానాలు చేసి సరిగ్గా మూడింటికి బయటపడి ఎయిర్‌పోర్టు వైపుగా సాగిపోయాం. అక్కడ మరికొంతమంది మా గ్రూప్‌ వాళ్ళు కలిశారు. చెకిన్‌ అయి ఫ్లైట్‌ కోసం ఎదురు చూస్తున్నపుడు కమలక్క వచ్చి మా అందరినీ ఒకరొకరుగా పరిచయం చేసుకున్నారు. కమలక్కతో పాటు ఇందిర, శైలజ, ఉషాకిరణ్‌, శోభ అంతా జాయినయ్యారు.

ఆరింటికి అనౌన్స్‌మెంట్‌ విన్పించి అందరం లేచి ఒకరొకరుగా విమానం లోపలికి వెళ్ళాం. నేను, విజయ, సౌజన్యక్క ఒక వరుసలో కూర్చున్నాం. రెండు మాటలు మాట్లాడి విమాన సిబ్బంది యిచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ తిని, సముద్రంలో గుమికూడినట్లుగా ఉన్న తెల్లమబ్బుల్ని ఆహ్లాదంగా చూస్తుండగానే విమానం ఒక్కసారిగా పైకి లేచి క్రమంగా కిందకు దిగడం మొదలుపెట్టింది. 6.40కి చెన్నైలో బయల్దేరి 7.50కి శ్రీలంక (కొలంబో) లో ల్యాండయింది విమానం .

మేము కొలంబోలో దిగి చెకవుటయ్యి బయటకొచ్చేటప్పటికి మా కోసం ప్లకార్డు పట్టుకుని ట్రావెల్స్‌ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ గైడ్‌ తన పేరు ‘తుషార్‌’గా పరిచయం చేసుకుని, మమ్మల్ని ఆహ్వానించి, మా కోసం ఏర్పాటు చేసిన మినీ బస్సు వద్దకు తీసుకెళ్ళాడు. అప్పటికే డ్రైవర్‌ గణేష్‌, క్లీనర్‌ సుశాంత్‌ మా కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలో సమయానికి, భారతదేశపు సమయానికి తేడాలున్నాయేమో చూసుకోమన్నాడు తుషార్‌. ఏమీ తేడా లేదు. రెండూ ఒకటిగానే వున్నాయి.

సరిగ్గా 9 గంటలకి కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో మా బస్సు బయల్దేరింది. డ్రైవర్‌ ఏకాగ్రతతో రథాన్ని నడిపే పనిలో పడ్డాడు. తుషార్‌ మా వైపుకి తిరిగి మైక్‌ పట్టుకుని యిప్పటినుంచీ తిరిగి 27వ తేదీ సాయంత్రం ఎయిర్‌ పోర్ట్‌ చేరుకునేదాకా మా విజిటింగ్‌ ప్రోగ్రామ్‌ని చక్కటి ఇంగ్లీష్‌లో మాకు అర్థమయ్యేలా వివరించాడు. ఆ తర్వాత శ్రీలంక గురించిన విశేషాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు.

2,600 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలతో శ్రీలంక ఏర్పడింది. చాలా కాలం డచ్‌ ఆంగ్లేయుల ప్రాపకంలో వుంది. 1978 ఫిబ్రవరి నాలుగున స్వతంత్ర దేశమయింది. శ్రీలంక సెక్యులర్‌ స్టేటయినప్పటికీ బౌద్ధ మతాన్ని అనుసరించేవాళ్ళు 69 శాతం వుంటారు. బుద్ధుడు భారతదేశంలో జన్మించినప్పటికీ బౌద్ధ మతం మన దేశంలోకన్నా ఎక్కువ దేశ విదేశాల్లో ప్రశస్తి చెందడం మనందరికీ తెలిసిందే. అందులో శ్రీలంక ఒకటి. 69 శాతం బౌద్ధులయితే, 12 శాతం హిందువులు, 7 శాతం ముస్లింలు, 7 శాతం క్రిస్టియన్‌లు. సింహళీయులు ఎక్కువమంది, తమిళులు కొద్దిమంది మాత్రమే వుంటారు. అయితే చాలామంది తమిళం మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. చాలా చోట్ల నేమ్‌ బోర్డులన్నీ తమిళంలో వుండడం విశేషం. దేవాలయాల్లో దేవుళ్ళ పేర్లు కూడా తమిళంలోనే వుండడం గమనించదగినది. వలస వచ్చిన తెలుగు కుటుంబాలు కూడా శ్రీలంకలో చాలానే ఉన్నాయి.

మొత్తంగా శ్రీలంక జనాభా 20.2 మిలియన్లు. ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయం. వడ్లు, తేయాకు, కొబ్బరి పంటలు ఎక్కువగా పండిస్తారు. 32 శాతం పరిశ్రమలవైపు వెళ్తే, మరికొందరు గనుల్లో పనిచేస్తారు. టెక్స్‌టైల్స్‌ వ్యాపారం ఎక్కువ. టూరిజం కూడా బాగా డెవలప్‌ చేశారు.

శ్రీలంక యూనియన్‌ టెరిటరీ సెంట్రల్‌ గవర్నమెంట్‌. 9 రాష్ట్రాలు ఉంటాయి. ఆరేళ్ళకొకసారి అధ్యక్షుని ఎన్నికలు జరుగుతాయి. శ్రీలంకలో అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. 90 శాతం మంది అక్షరాస్యులే. శ్రీలంక అంతటికీ 20 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉంటాయి. ఉచిత విద్య, ఉచిత వైద్య చికిత్స సదుపాయం ఉంటుంది. కొంతమంది మాత్రం ప్రైవేట్‌ వైద్య చికిత్స తీసుకుంటారు. విద్యలో మైనారిటీలకు ప్రత్యేకమైన రిజర్వేన్లంటూ ఉండవు. 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. పుస్తకాలు ఉచితంగా యిస్తారు. కాలేజీల్లో మాత్రం విద్యార్థులకు వారి వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి ఫీజులు నిర్ణయిస్తారు.

ఇక్కడ స్త్రీ, పురుషులిద్దరికీ సమాన వేతనాలుంటాయి. నిరుద్యోగులు వున్నప్పటికీ ఏదో ఒక పనిలో, తక్కువ ఆదాయంతో నైనా పనిచేస్తుంటారు.

శ్రీలంకలో సంవత్సరానికి 24 పండుగలుంటాయి. ప్రతి పౌర్ణమి వాళ్ళకు ఒక విశేషమైన పండుగ. ఏటా జులై, ఆగస్టు నెలల నడుమ వచ్చే బుద్ధ పౌర్ణమిని పెద్ద ఉత్సవంలాగా తొమ్మిది రోజులపాటు ఊరేగింపులు చేసి జరుపుకుంటారు. ప్రతి పండుగని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా ఒక వేడుకలా జరుపుకుంటారు.

ఎంత ఉన్నవాళ్ళయినా సరే ఆడంబరంగా కాకుండా మనుషులంతా ఎంతో సింపుల్‌గా, నిరాడంబరంగా ఉండడం శ్రీలంక ప్రత్యేకత. ఇళ్ళు కూడా పెద్ద ఎత్తున కాకుండా, చెట్లనీ, సహజ ప్రకృతినీ ఏ మాత్రం ధ్వంసం చేయకుండా వాటి మధ్యలోనే కేవలం నివాసయోగ్యంగా ఇళ్ళను నిర్మించుకుంటారు. అభివృద్ధి పేరుతో సహజ వనరుల్ని ధ్వంసం చేసుకోకపోవడం వల్లే వాళ్ళకి నీటి కొరత గానీ, కరెంటు కొరత గానీ మనంతగా లేవు. కొన్ని విషయాలను తుషార్‌ మాకు అర్థమయ్యేలా చెప్తే, మరికొన్నింటిని మా సుదూర రోడ్డు ప్రయాణంలో మేమే అర్థం చేసుకున్నాం.

కొలంబోలో ఉదయం 9 గంటలకి ప్రయాణం ప్రారంభిం చిన మేము దారిపొడవునా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, అనేక రకాల సుగంధ ద్రవ్యాల చెట్లను చూసి ఆశ్చర్యచకితులమవుతూ ఆ మధ్యాహ్నం ఒంటిగంటకు ‘మిహిరిని’ అనే చోట భోజనానికి ఆగాం. అక్కడ మేము తొలిసారిగా తిన్న శ్రీలంక భోజనం మాలో కొందరిని యిబ్బంది పెట్టింది. ఉప్పు, కారం తక్కువగా ఉడికీ, ఉడకని ఆరోగ్యకరమైన కూరలు, పాలిష్‌ లేని బియ్యంతో అన్నం, అయితే ఎక్కువగా పండ్ల ముక్కలు, కాయగూరల ముక్కలు వడ్డించారు. అందరం ఎక్కువగా పండ్లు తిని ఆ పూటకి సరిపెట్టుకున్నాం. మళ్ళీ బస్సెక్కగానే మాటలు, పాటలు, అంత్యాక్షరి, కాసేపు ఊయలూగే నిద్ర.. మళ్ళీ అంత్యాక్షరి, మధ్య మధ్యలో తినుబండారాలు, తుషార్‌ చూపిస్తోన్న ప్రకృతి సోయగాల పాయింట్లు, జలపాతాలు… ఆనందపు హోరులో ఆ సాయంత్రానికి ట్రింకోమలి Trinchomalee) చేరుకున్నాం.

ట్రింకోమలి నిజంగా అద్భుతమైన తీరప్రాంతం. కొలంబోకి 257 కి.మీ. దూరంలో వాయువ్య దిశగా నిర్మించబడిన ఈ అందమైన హార్బర్‌ని ‘కమర్షియల్‌ హబ్‌ ఆఫ్‌ శ్రీలంక’గా పరిగణిస్తారు. నీలవేలి, ఉప్పువేలి వంటి అందమైన బీచ్‌లు కలిగి ఉన్న ట్రింకోమలి యిటీవల ”వేల్‌ డెస్టినేషన్‌”గా ప్రాచుర్యం పొందింది. పురాతన కాలంలో గోకర్ణగా పేరొందిన ట్రింకోమలి శ్రీలంకలో ఎక్కువగా బౌద్ధ సంస్కృతి నిండిన పురాతన ప్రదేశం.

మేము ట్రింకోమలి చేరుకుని ముందుగా ‘కోనేశ్వరం’ అన్న గుడికి వెళ్ళాం. ఇది ట్రింకోమలిలో పేరొందిన శివాలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శాంకరీదేవి శక్తి పీఠం ఈ గుడిలోనే వుంది. శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహంగా ఉండి పూజలందుకుంటున్నాడు. స్వామికి కుడిచేతి వైపుగా వెళ్తే శాంకరీ దేవి దర్శనమిస్తుంది. హారతి అందుకుని చీరలు సమర్పించిన తర్వాత అమ్మణ్ణి ముందు అంతా కూర్చుని లలితా సహస్ర నామం చదివారు. నేనీలోపు గుడి అంతా తిరిగి చూసి వచ్చాను. గుడి బయట ప్రతిష్టించబడిన ఆకాశమంత ఎత్తు శివుడు తలమీది నుండి గంగను వదులుతూ దూరం నుంచే మన హృదయాలను తడి చేస్తూ ఉంటాడు. కోనేశ్వరం గుడి చూసుకుని హోటల్‌కి వెళ్ళి చెకిన్‌ అయ్యాం.

”ఛాయాబ్లూ” చాలా పెద్ద స్టార్‌ హోటల్‌. సీ షోర్‌ రిసార్ట్‌. మేము వెళ్ళిన వెంటనే రిసెప్షన్‌లో బాయ్‌లు వచ్చి ఆహ్వానిస్తూ వేడినీళ్ళతో తడిపి వుంచిన న్యాప్‌కిన్స్‌ యిచ్చి మొహాలు తుడుచుకోమన్నారు. వెంటనే జ్యూస్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి గదులు వాళ్ళకి అలాట్‌ అయ్యాయి. గదుల్లోకెళ్ళి లగేజి పెట్టి, గది పక్కనే వున్న సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుని తిరిగి నేను, విజయ అందరినీ డైనింగ్‌ హాల్లో కలుసుకున్నాం. అంతా చాలా ఉత్సాహంగా వున్నారు. ఏ మాత్రం అలసిపోయినట్లుగా లేరు. ఇక్కడ భోజనం తినడానికి వీలుగా బాగుంది. అందరం భోజనాలు, ఆ తర్వాత పండ్ల ముక్కలు తింటూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. అక్కడ మా ఫోన్లు పనిచేయలేదు. పనిచేస్తోన్న వారి ఫోన్లు తీసుకుని ఒకసారి యింట్లో వాళ్ళకి మా క్షేమ సమాచారాలందించి, ఆ తర్వాత కబుర్లాడుతూనే ఎవరి గదులకు వాళ్ళం చేరుకున్నాం. నేను, విజయ వరండాలో కూర్చుని వెన్నెల రాత్రిలో హోరుమని ఉప్పొంగుతోన్న సముద్రాన్ని గుండెల్లో నింపుకుంటూ ఎప్పటికో నిద్రకుపక్రమించాం. కలల్లోనూ సముద్రమే…

24-01-2016

ఉదయాన్నే ప్రశాంత సాగరాన్ని చూద్దామని బయటికొస్తే అప్పటికే మసక చీకట్లో శాంతి, సుధీర, లక్ష్మి తదితరులు సముద్రంలో ఆటలాడుతూ కెమెరాల్లో బంధిస్తున్నారు. సముద్రాన్ని ట్యాబ్‌లో బంధించడం సాధ్యమా? అరచేయి పెట్టి సూర్యుడ్ని అడ్డుకోవడం వశమా? ప్రకృతి ముందు మనిషి మరుగుజ్జు కదా…. పద్మ హడావిడి పెట్టింది అందరినీ.

త్వరత్వరగా తయారయి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుని అందరం హోటల్‌, గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గుంపులు, గుంపులుగా కలిసి ఫోటోలు తీసుకుని హోటల్‌ నుంచి బయటపడ్డాం. అక్కడ్నుంచి మళ్ళీ ఒకసారి శాంకరీదేవి శక్తి పీఠం వెళ్ళి మరోసారి దేవిని దర్శించుకుని ‘క్యాండీ’ (Kandy) వైపుగా సాగిపోయాం.

ఎక్కిన వెంటనే మాకు “Hot springs” చూపించమని లక్ష్మి తుషార్‌ని కోరింది. తుషార్‌ ఉత్సాహంగా ”ఇక్కడికి ఎనిమిది

ిలోమీటర్ల దూరంలో వుంది. రావణాసురుడి తల్లి ఈ ప్రాంతంలో కొన్ని ఆచార వ్యవహారాల నిర్వహణ కోసం నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే రావణాసురుడు తన శూలంతో భూమిమీద ఏడు చోట్ల గుచ్చాడని, వెంటనే నీళ్ళూరడమే కాక అన్నీ కూడా వివిధ రకాల

ఉష్ణాగ్రతల్లో ఉండడం విశేషం. ఏడు బావుల్లోని నీళ్ళు కూడా చేతికి అందే విధంగానే ఉంటాయి కానీ, కొన్ని చాలా వేడిగా ఉంటాయి. గబుక్కున వంగి చేయి పెట్టొద్దు” అంటూ తుషార్‌ చెప్తుండగానే మా బస్సు హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద ఆగింది. ఆ ఏడు బావుల నీళ్ళతోనూ కాళ్ళు తడుపుకోవడం.. అలా వేడి నీళ్ళు బావుల్లో నుంచి ఊరి రావడాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి…

అయిష్టంగానే అక్కడ్నుంచి బయటపడి మళ్ళీ బస్సెక్కాం. దారంతా చెప్పలేనంత అడవి. ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తుంటే అందరం ఈ సారి సీట్లు మారి కూర్చున్నాం. పరిచయాలు లోతు చేసుకుని స్నేహంగా మార్చుకుంటూ, అంత్యాక్షరి కొనసాగిస్తూనే దారిలో ఒక బొటానికల్‌ గార్డెన్‌ చూసి ఒంటిగంట కాకముందే ఒక రెస్టారెంట్‌లో భోజనానికి ఆగాం. ఇక్కడ కూడా భోజనం బావుంది. భోజనంలో ఎక్కువగా స్వీట్లు, పండ్లు వాడతారు. శ్రీలంక సంస్కృతి, ఆహారం, ఆహార్యం అంతా కూడా దక్షిణ భారతదేశానికి దగ్గరగా వుంటుంది.

భోజనమయ్యాక దారిలోThe Golden Temple చాలా పెద్ద బుద్ధుడి గుడి చూశాం. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో గుడి మూసి వున్పప్పటికీ, బుద్ధుడి బోధనలు అంతర్లీనంగా నిండి వున్న ఆ ప్రాంగణమంతా తిరిగి చూడడం ఒక గొప్ప అనుభూతి. గుడిమీద అత్యంత ఎత్తులో చాలా పెద్దదైన బుద్ధుడి శాంత విగ్రహం, ఆయన వద్దకు కొండలమీద బారులు తీరిన బౌద్ధ సన్యాసుల విగ్రహాలు, వారికి ఎదురు పడి మాట్లాడుతోన్న గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యుల విగ్రహాలు… అంతా నిజంగానే బుద్ధుడు అక్కడ ధ్యానముద్రలో వున్నట్లుగా, ఈ శిష్యులంతా చాలా శ్రద్ధగా బుద్ధుడి బోధనలను వినడానికి వెళ్తున్నట్లుగా అత్యంత సహజంగా వుండడం విశేషం. తప్పక చూడవలసిన ప్రదేశమది.

ఆ ఎత్తయిన మెట్లమీద కూర్చుని మేమంతా ఒక గ్రూప్‌ ఫోటో తీసుకున్నాం. అక్కడ్నుంచి తప్పనిసరిగా బయల్దేరి మళ్ళీ బస్సెక్కాం. తుషార్‌ బౌద్ధాన్ని గురించి వివరిస్తుంటే మనసు సిద్ధార్థుని వద్దకు వెళ్ళిపోయి ఎంతకూ మరలి రానంది..

సాయంత్రం ఐదింటికి Kandy చేరుకున్నాం. ముందుగా “Temple of Tooth” కి వెళ్ళాం. పన్నుకి గుడి కట్టడమేంటి? అవును గౌతమ బుద్ధుడి నిర్యాణ సమయంలో క్రీ.శ. 313లో ఆయన పన్ను ఒకటి శ్రీలంకకి తరలించబడింది. అది చాలామంది రాజుల చేతులు మారి చివరికి Kandy లో “Temple of Tooth”కు వెలిసింది. ఇది శ్రీలంకలో ఒకానొక ప్రముఖమైన ఆలయం. చుట్టూ చాలా లోతయిన కందకం తవ్వబడి వుంది. లోపల కుడిచేతివైపు గదిలో బుద్ధుడి కంచు విగ్రహం చాలా పెద్దది పడుకున్న పోశ్చర్‌లో వుంది. ఆ గదిలో చాలామంది సింహళీయులు శ్వేత వస్త్రాలలో మౌనంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. చప్పుడు చేయకుండా వారిని దాటుకుంటూ, బుద్ధుడికి అభివందనం చేస్తూ లోపలికెళ్తే అక్కడ రత్నఖచిత పంచలోహ స్థూపంలో, లోలోపల ఏడు స్థూపాల లోపల పన్ను దాచి పెట్టబడి వుంది. సింహళీయులు చుట్టూ వున్న అరుగుమీద ఎంతో పవిత్రంగా పువ్వులుంచి ప్రార్థిస్తున్నారు.

అక్కడినుంచి పైకి వెళ్తే, అక్కడ కూడా ధ్యానముద్రలో వున్న బుద్ధుడి శాంత స్వరూప పాలరాతి ప్రతిమలు అనేకం అమర్చబడి వున్నాయి. ఈ గుడి భక్తులతో కిక్కిరిసి వుంది. మామూలుగా శ్రీలంకలో ఎక్కడా కూడా మనకున్నంత రద్దీ లేదు. అసలు వాళ్ళ జీవితాల్లోనే రద్దీ అనేది లేదేమో అనిపిస్తుంది. భక్తుల్ని దాటుకుంటూ, గుడి చరిత్ర రాసి వున్న ఫోటోలను చూస్తూ, చరిత్ర తెలుసుకుంటూ ఒకరొకరంగా బయటపడి గుడి ఎడమవైపు వున్న బొంత రాళ్ళ మెట్లమీది నుండి కిందకు దిగుతున్నపుడు ఆ మసక చీకటిలో నా పక్కనే నడుస్తోన్న శాంతి కింద మెట్టు వుందనుకుని అడుగు వేయడంతో హఠాత్తుగా పడిపోవడం బాధాకరం. అయితే మాలో వున్న పద్మ, ఉషాకిరణ్‌ వంటి డాక్టర్లు వెంటనే శాంతిని అటెండ్‌ చేశారు. ముందు బాగా టెన్షన్‌ పడినా శాంతి మెల్లిగా లేచి కాసేపు మెట్లమీద కూర్చుని నెమ్మదిగా నడిచి బస్సు వద్దకు చేరుకుంది.

అందరం భారమైన హృదయాలతో హోటల్‌ చేరుకుని చెకిన్‌ అయ్యాం. ”ది క్యాండీ సిటీ హోటల్‌” మూడో అంతస్తులో నేనూ, విజయ మా పక్కనే నిర్మలక్క, సౌజన్యక్కల గది. ఈ సారి మా గది పక్కన సముద్రం లేదు కానీ, ఎత్తయిన కొండమీద వెలసిన బుద్ధుడి విగ్రహం మా విశాలమైన కిటికీలో నుంచి కనువిందు చేస్తోంది. శాంతి, సుధీర లిఫ్ట్‌ వున్న రెండో అంతస్థులో వుండిపో యారు. పద్మ, శారద కూడా వారి పక్క గదిలో వున్నారు. రాత్రంతా శాంతిని జాగ్రత్తగా చూసుకున్నారు.

25-01-2016

మర్నాడు ఉదయానికి శాంతి కొంత కోలుకోవడం అందరినీ తేలికపరిచింది. క్యాండీ సిటీ హోటల్లో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుని ఆ ఉదయం 8.30కి చెకవుటయ్యాం. క్యాండీ విశ్వవిద్యాలయమంతా తిరిగి చూసి అక్కడ్నుంచి ఎన్నో వనాలు, జలపాతాలు దాటుకుంటూ హనుమంతుడి గుడికి చేరుకున్నాం. చాలా ఎత్తయిన విగ్రహం. ఇది నిజానికి చిన్మయా మిషన్‌ వాళ్ళు కట్టించిన గుడి.

హనుమంతుడు లంకలో మొట్టమొదటిగా అడుగు పెట్టింది ఇక్కడేననీ, ఈ కొండమీద దిగి లంకంతా కలియచూసి సీతమ్మని కనుగొన్నాడనీ అంటారు. ఇక్కడి కొండలమీద ఇంకా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడని వారి నమ్మకం. అందుకే యిక్కడ ఆంజనేయుడికి గుడి కట్టించారు. ఆ కొండ అచ్చంగా ఆంజనేయ స్వామి పడుకుని చేతులు రెండూ పొట్టమీద వుంచుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా స్పష్టంగా ఉంది. ఈ విశేషాన్ని పద్మ అందరికీ చూపించింది. ఈ విషయం తాను కొత్తగా చూస్తున్నానని తుషార్‌ ఉత్సాహ పడిపోయాడు. అలా గైడ్‌కే విశేషాలు చూపించడం మా బ్యాచ్‌లో ఒక విశేషం…

అక్కడ్నుంచి కొండవాలు విస్తారంగా పరుచుకున్న టీ తోటలను చూసుకుంటూ, అనేకమంది స్త్రీలు టీ ఆకు కోయడాన్ని చూసి ఆనందిస్తూ టీ ఫ్యాక్టరీ వద్ద ఆగాం. మా వంటి ఎందరో యాత్రికులు అప్పటికే అక్కడ గుమిగూడి వున్నారు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఆకు గ్రేడింగ్‌ చేయడం నుండి టీ పొడి తయారు చేయడం వరకూ, అక్కడ పనిచేస్తోన్న స్త్రీలను గమనిస్తూ అన్నీ చూసుకుని శ్రీలంక టీ పొడి కొనుక్కుని బయటపడ్డాం. లోపల ఆ వేడికి మేం పదినిమిషాల పాటు కూడా వుండలేకపోయాం కానీ అక్కడ పనిచేసే స్త్రీలు ఎలా భరిస్తున్నారా అనుకుంటూ మళ్ళీ ప్రయాణం ప్రారంభించాం.

ఘాట్‌ రోడ్డు ప్రయాణాన్ని అనుభూతిస్తూ దారిలో ‘రగోడా’ అనే చోట భోజనానికి ఆగాం. భోజనం చాలా రుచికరంగా మన ఆంధ్రుల భోజనానికి దగ్గరగా వుంది. ఇక ఆపై అన్నీ ఘాట్‌ రోడ్లే. ఎందుకంటే మేము వెళ్తోన్న ”న్యూవారా ఏలియా” చాలా ఎత్తయిన ప్రదేశంలో వుంది. ఘాట్‌ రోడ్లు ఎక్కి ఎక్కి మధ్యాహ్నం మూడున్నరకి సీతమ్మ గుడి వద్ద ఆగాం. లంకలో సీతమ్మ గుడి నిజానికి చాలా చిన్నదే అయినప్పటికీ అత్యంత ప్రశస్త్త్యమైనది. ఆంజనేయుడు లంకలో మొట్టమొదటిసారిగా సీతమ్మను ఇక్కడే చూశాడని, అక్కడ దిగిన ఆంజనేయుడి పాదముద్రలే రుజువనీ అక్కడి జలపాతపు గట్టున వున్న హనుమంతుడి పాదముద్రలను మాకు చూపించారు. సీతమ్మ గుడితో పాటు ఈ ప్రాంగణంలో ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. సింహళీయులు ఆంజనేయుడిని చాలా భక్తితో పూజిస్తారు.

ఇక్కడికి దగ్గరలోనే అశోక వాటిక అంటే ఎక్కడైతే లంకలో సీతమ్మ బంధించబడిందో ఆ ప్రదేశం కూడా వుందనీ, ప్రతి నిత్యం సీతమ్మ అశోక వనం నుండి ఈ ప్రాంతానికి స్నానానికి వచ్చేదనీ ప్రతీతి. వేల సంవత్సరాల ముందు ఈ విగ్రహాలు జలపాతంలోనే దొరికాయనీ, వాటికే గుడి కట్టబడిందనీ వారి నమ్మకం. ఈ ప్రాంతాన్ని రెయిన్‌ ల్యాండ్‌ ప్లేస్‌ అని అంటారట.

ఈ గుడిని చూశాక అయిదింటికి ‘న్యూవారా ఏలియా’ చేరుకుని హోటల్లో చెకిన్‌ అయ్యాం. ‘క్వీన్స్‌బరీ’ హోటల్లో దిగిన వెంటనే అంతా షాపింగ్‌కి బయల్దేరారు. రెండు, మూడు వీథులు దాటించి తుషార్‌ మమ్మల్ని షాపింగ్‌కు వదిలిపెట్టి తను తిరిగి హోటల్‌కి వెళ్ళిపోయాడు. లక్ష్మి, శ్రీలక్ష్మి, సౌజన్యక్క, సుధీర అంతా బొంతలు బేరం చేస్తుంటే నేను, విజయ, నిర్మలక్క ఊరికే షాపులన్నీ చివరిదాకా నడిచి చూసి వచ్చాం. పద్మ మాత్రం అందరినీ కనిపెట్టుకుంటూ బయట పచార్లు చేయసాగింది. నెల్లూరులో, చెన్నైలో దొరకని ప్రత్యేకమైన వస్తువులేమీ మాకక్కడ కనిపించలేదు. పైపెచ్చు ధరలు ఎక్కువగా వుండడం, మోసుకెళ్ళడం భారమన్పించి మేమేమీ పెద్దగా కొనలేదు. కమలక్క, శైల, ఇందిర, శాంతి ఇంకా మరికొందరు హోటల్లోనే వుండిపోయారు.

నిర్మలమ్మ, నేను, విజయ కూడా పద్మతో చెప్పి హోటల్‌కి తిరిగి వెళ్ళిపోయాం. దారిలో ఒక వీథి అర్థం కానప్పుడు ఇద్దరు వ్యక్తులు (రవీంద్ర, ప్రసన్న) మాకు తోడుగా వచ్చి మమ్మల్ని జాగ్రత్తగా హోటల్‌ వద్ద దింపారు. శ్రీలంక మనుషుల సంస్కారమది.

26-01-2016

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేసి క్వీన్స్‌బరీ హోటల్‌ను వదిలి బయల్దేరాం. దారిలో పారదీనియాలో ఆగాం. పేర అంటే సింహళ భాషలో జామకాయ అని అర్థం. పారదీనియా రోడ్డే శ్రీలంకలో వేసిన మొట్టమొదటి రోడ్డనీ, బ్రిటిష్‌ వాళ్ళ కాలంలో ”డేజిన్‌” అనే కెప్టెన్‌ ఈ రోడ్డు వేయించాడనీ, ప్రజలకు ఎక్కువ రక్షణ కల్పించే ఆ కెప్టెన్‌ చివరికి మలేరియా వచ్చి మరణించాడనీ తుషార్‌ మాకు తెలియచెప్పాడు. జామ పంట విస్తారంగా పండుతుంది కాబట్టే ఈ ప్రాంతానికి పారదీనియా అని పేరొచ్చిందని, ఇక్కడి జామకాయలు చాలా రుచికరంగా వుంటాయని తుషార్‌ చెప్పడంతో రోడ్డు పక్కన బస్సాపి అందరం జామకాయలు కొనుక్కుని తిన్నాం. పారదీనియా క్యాండీకి లోతట్టు ప్రాంతం.

అలా మొదలయిన మా ప్రయాణం ఒక పెద్ద మెడిసినల్‌ ఫారెస్ట్‌ వద్ద ఆగింది. ఆంజనేయుడు లక్ష్మణుని కోసం సంజీవనీ పర్వతాన్ని పెళ్ళగించి తీసుకు వెళ్తున్నపుడు కొంత భాగం ఇక్కడ రాలిపడిందని, అందుకే ఇక్కడి చెట్లన్నీ ఆరోగ్యాన్నిస్తాయనీ చెప్తూ అక్కడి చెట్ల ప్రాముఖ్యాన్నీ, మందుల తయారీ గురించి వివరించాడు డా.కృష్ణమూర్తి. ఆయన భారత సంతతికి చెందినవాడు కావడంతో మమ్మల్ని చూడగానే తెగ ఉత్సాహపడిపోయాడు. శ్రీలంక రెడ్‌ ఆయిల్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందినది కదా. మాలో చాలామందిమి రెడ్‌ ఆయిల్‌, డయాబెటిక్‌ మాత్రలు వంటివి కొనుక్కుని తిరిగి బస్సెక్కాం.

ఆ తర్వాత ”రాక్‌ వ్యూ రెస్టారెంట్‌” లో లంచ్‌ ముగించు కుని, మరికొంత దూరం ప్రయాణించి ”కెలనియా రాజ్‌విహార్‌” అన్న బౌద్ధారామానికి వెళ్ళాం. ఒక సింహాసనం కోసం ఇద్దరు అన్నదమ్ములు గొడవపడి గౌతమ బుద్ధుడిని తీర్పు చెప్పమని ఆహ్వానిస్తారు. ఈ విషయంగా బుద్ధుడు ఈ ప్రాంతానికి రెండు, మూడు సార్లు వచ్చాడని, చివరికి ఆ రత్నఖచిత సింహాసనాన్ని, వజ్ర వైఢూర్యాలతో కలిపి లోపల ఉంచి ఈ విశాలమైన బౌద్ధ స్థూపాన్ని కట్టించారని అంటారు. అంతేకాకుండా విభీషణుడికి రాముడు పట్టాభిషేకం చేస్తున్నప్పటి విగ్రహం కూడా ఈ బౌద్ధారామంలో వుండడం విశేషం. ఈ ప్రపంచంలో మరెక్కడా విభీషణుడికి గుడి లేదనీ, అందుకే ఈ ప్రాంగణం కెలనియారాజ్‌ విహార్‌ కంటే కూడా విభీషణుడి గుడిగా ప్రసిద్ధి చెందిందనీ తుషార్‌ మాకు వివరించాడు.

ఆ తర్వాత కొలంబో చేరుకుని పంచముఖ ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకున్నాం. ఇది శ్రీలంకలోనే మొట్టమొదటి ఆంజనేయుడి గుడి అనీ, బహుశా ఆంజనేయుడికి రథం ఉన్న సందర్భం ఈ ప్రపంచంలోనే మరెక్కడా లేదనీ అక్కడివాళ్ళు చెప్పారు. ఏటా డిసెంబరు నెల ఆఖరి వారంలోనూ, జనవరి మొదటి వారంలోనూ రథోత్సవం జరుగుతుందని కూడా వారు చెప్పారు. హనుమంతుడికి ఎదురుగా శనీశ్వరుడి గుడి ఉంది. ఇక్కడ నవగ్రహాలేమీ లేవు. ఒక్క శనీశ్వరుడు మాత్రం సతీసమేతంగా కొలువన్నాడు. ఈ రెండు దేవాలయాలూ చూసుకుని మేము కొలంబోలో హోటల్‌ సఫైర్‌కి చేరుకున్నాం. మాలో కొంతమంది హడావిడిగా షాపింగ్‌కి వెళ్ళిపోయారు. నేను, విజయ, మాల గదుల్లో ఉండిపో యిన మరికొందరం కలిసి కబుర్లు కలబోసుకుంటూ చాలాసేపటి తర్వాత మూడో అంతస్థులోని రెస్టారెంట్‌కి వెళ్ళి భోజనం చేస్తుండగా మిగిలిన వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ భోజనం దక్షిణ భారతదేశాన్ని తలపిస్తూ చాలా రుచికరంగా అందరికీ నచ్చేలా వుంది.

27-01-2016

ఉదయాన్నే లేచి చకచకా సర్దేసుకుని చెకవుటయ్యి కొలంబో సిటీ టూర్‌కి బయల్దేరాం. ఇది శ్రీలంకలో మా చివరి రోజు కావడంతో అంతా షాపింగ్‌ పట్ల ఉత్సాహంతో ఉన్నారు.

కొలంబో బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం. అమెరికాలో లాగా ఆకాశాన్నంటే భవంతులు చాలా వున్నాయి. అమెరికాలో లాగే ఇక్కడ వైట్‌ హౌస్‌, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వున్నాయి. వైట్‌హౌస్‌కి ఎదురుగా మహావీరదేవి పార్క్‌, అక్కడ మళ్ళీ బుద్ధ విగ్రహం, మహావీరుడు. ఇలా చోట్ల మనకి శ్రీలంకలో బుద్ధ విగ్రహాలు దర్శనమిస్తూనే ఉంటాయి. కొండలమీదా, దారిలోనూ ఎన్నో బుద్ధ విగ్రహాలనూ, బౌద్ధారామాలనూ చూడడం జరిగింది. ఆ క్రమంలో ఒక పెద్ద పడవలాంటి ఆలయం అందులో బుద్ధుడు, బౌద్ధ సన్యాసులూ… అదొక అందమైన అనుభూతి.

కొలంబోలో కొత్తగా కట్టబడిన లోటస్‌ పాండ్‌ థియేటర్‌ ఆ నగరానికే అందాన్నిస్తోంది. ఆ చుట్టుపక్కల చాలా స్టేడియంలు వున్నాయి. నిజానికి కొలంబో హోమ్‌ గ్రౌండ్‌ ఆఫ్‌ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌. నేషనల్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం కూడా యిక్కడే వుంది. కొలంబోలోని ఈ ప్రాంతాన్ని ”సింగళీస్‌ స్పోర్ట్‌ టౌన్‌” అని అంటారట. ఆ తర్వాత శ్రీలంకలోని పెద్ద హార్బర్‌ని చూశాం. నిజానికది దక్షిణాసియాలోనే అతి పెద్దదైన, బిజీ అయిన హార్బర్‌. ఇది 1919లో నిర్మించబడింది.

ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుని నివాస ప్రాంతాన్ని చూపించాడు తుషార్‌. తుషార్‌ వంటి గైడ్‌ దొరకడం నిజంగా మా అదృష్టం. మా వంటి అన్నీ సులువుగా అర్థం చేసుకునే బ్యాచ్‌ దొరకడం అతనికీ ఆనందంగానే వుంది. మమ్మల్ని ‘బుద్ధ లోక’ స్ట్రీట్‌ గుండా తీసుకెళ్ళాడు. ఆ వీథంతా చాలా అధునాతనంగా వుంది. ఆ వీథిలో చాలామంది వి.వి.ఐ.పి.లు నివసిస్తారు. ఆ తర్వాత చైనీస్‌ ఎంబసీ, ఇండియన్‌ ఎంబసీ, అమెరికన్‌ ఎంబసీ వంటివి బయటినుంచే చూపించి ఆర్ట్‌ గ్యాలరీ కూడా చూశాక మా వాళ్ళ కోరికపై తుషార్‌ మమ్మల్ని నారిటక (Noritaka) అనే పెద్ద క్రోకరీ కలెక్షన్‌కి తీసుకెళ్ళాడు. శ్రీలంకలో MARITHALE అన్నచోట క్వార్ట్జ్‌, డోలమైట్‌, ఫ్లట్జ్‌స్పాం వంటి భూగర్భ నిధులు చాలా ఎక్కువగా లభించడంతో శ్రీలంకలో క్రోకరీ కలెక్షన్‌ చాలా ఎక్కువ. Noritaka చాలా పెద్ద ప్రాచుర్యమున్న కంపెనీ. దీని పేరెంట్‌ కంపెనీ జపాన్‌లో ఉందని అక్కడివాళ్ళు చెప్పారు. అయితే ధరలు మాత్రం చుక్కలు చూస్తున్నాయి. అయినప్పటికీ అందరూ వాళ్ళకి నచ్చిన కప్పులు, ఫ్లవర్‌ వాజ్‌లు వంటివి కొనుక్కున్నారు.

అక్కడ్నుంచి కొన్ని వీథులు దాటుకుంటూ మమ్మల్ని మరో షాప్‌కి తీసుకెళ్ళాడు తుషార్‌. ఇక్కడి వీథుల పేర్లు చాలా అందంగా, చిత్రంగా వుంటాయి. మాల్‌ వాటర్‌ రోడ్‌, ఫోర్క్‌ స్ట్రీట్‌, యోక్‌ స్ట్రీట్‌, జపాన్‌-శ్రీలంక ఫ్రెండ్‌షిప్‌ రోడ్‌… ఇలా అన్నమాట. అలా రెండున్నర వరకూ షాపింగ్‌ చేస్తూనే వున్నాం అందరం. ఈ అయిదు రోజుల్లో మొదటిసారిగా తుషార్‌లో అసహనాన్ని చూశాను నేను. ఎందుకంటే అవతల ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళడానికి సమయం మించిపోతోంది. ఇంకా భోజనాలు చేయాలి. అందునా కొలంబో సిటీ సెంటర్‌ నుండి ఎయిర్‌ పోర్ట్‌ చాలాదూరం. షాపింగ్‌ నుండి ఊడిపడని మమ్మల్ని ఏమీ అనలేక మాటిమాటికీ టైం చూసుకుంటూ తుషార్‌ మాల్‌ బయట అసహనంగా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు. అందరూ షాపింగ్‌ ముగించుకుని బస్సెక్కి హఠాత్తుగా సమయం గుర్తొచ్చిన వాళ్ళల్లా ”మాకు భోజనమొద్దు.. ఎయిర్‌ పోర్టుకు వెళ్ళిపోదాం” అంటూ చాలా గొడవ చేశారు. కానీ తుషార్‌ మమ్మల్ని నేరుగా నవయుగ హోటల్‌కి తీసుకెళ్ళి చక్కటి ఆంధ్రా భోజనం పెట్టించి మరీ నాలుగింటికల్లా ఎయిర్‌పోర్టుకి చేర్చాడు. మా ఫ్లైట్‌ ఆరుంబావుకే.

ఎయిర్‌పోర్ట్‌ కెళ్ళే దారిలో తుషార్‌ ”ఈ ట్రిప్‌ ఎలా వుంది మీకు” అంటూ మమ్మల్నలందర్నీ ప్రశ్నించాడు. చాలా ఫ్రెండ్లీగా తన కుటుంబం గురించి కూడా ఎన్నో కబుర్లు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు, తుషార్‌ తల్లి, తండ్రి అంతా కలిసి వుంటారట. మేము తుషార్‌కు రెండువేలు, గణేష్‌కి రెండు వేలు, సుశాంత్‌కి వెయ్యి రూపాయలను టిప్‌గా యిచ్చాం. చాలా సంతోషపడిపోయారు. అయితే ఆ డబ్బులు తుషార్‌ మాకందించిన ఫ్రెండ్లీ సేవ ముందు చాలా తక్కువే. ఎయిర్‌పోర్ట్‌లో ఎవరి లగేజీలు వాళ్ళం తీసుకుని చకచకా చెకిన్‌ అయ్యాం. మా వాళ్ళు మళ్ళీ అక్కడ చాక్లెట్లు కొనాలంటూ షాపులకెళ్ళిపోయారు. ఫ్లైట్‌ అనౌన్స్‌మెంట్‌ తర్వాత తిరిగి వచ్చారు. అందరం విమానమెక్కి సర్దుకున్నాం. సరిగ్గా 55 నిమిషాల తర్వాత చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వున్నాం.

ఐదు రోజుల ముందువరకూ అపరిచితులమే. కానీ ఈ రోజు ఒకరినొకరం విడిపోవడానికి కలత చెందుతూ, స్నేహ సౌరభాలని గుండెల్నిండా నింపుకుని తప్పనిసరిగా వీడ్కోలు తీసుకున్నాం. ఈ మొత్తం ట్రిప్‌ని ఎంతో శ్రమదమాదులకోర్చి విజయవంతంగా నడిపించిన లక్ష్మి (వి.విజయలక్ష్మీరెడ్డి), పద్మ (డెంటిస్ట్‌ పద్మావతి)లకు మా అందరి తరఫునా హృదయపూర్వక అభినందనలు. మాలో రిలాక్సేషన్‌ అనే ఫ్యూయల్‌ని నింపినందుకు వాళ్ళకి మేమెప్పటికీ కృతజ్ఞులమే.

(పున: యాత్రా ప్రాప్తిరస్తు)

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో