స్వేచ్ఛ ఎంత చిన్నదయినా… – ఉదయ మిత్ర

బిత్తిరి బిత్తిరి జూసుకుంటూ బస్సెక్కిందామె. సరాసరి వొచ్చి మా శ్రీమతి పక్కన కూచుంది.

బస్సు ఇంకాసేపట్లో కదిలేటట్టుంది.

నిండైన రూపం… తెల్లని ఛాయ.. నడీడు మనిషి.. మనిషి అందంగానే ఉన్నా, జీవితంలోని సారాన్నంతా ఎవరో పీల్చేసినట్టు, ముఖంలో కళ తప్పింది. ఆమె దేనికో భయపడుతున్నట్టుగా ఉంది. అసలు ఆమె స్వభావమే అట్లాంటిదో, లేక ఏదయినా సమస్య వొచ్చిందో తెలీదు. మాటిమాటికీ కొంగుతో చెమట తుడుచుకుం టోంది. సీటుమీద కూచున్నదన్న మాటే కానీ, అసహనంగా అటూ ఇటూ కదులుతోంది. ”భీతహరిణేక్షణ” అందామా…

‘అక్కా… కొంచెం సెల్లిస్తవా… మా ఇంటికి ఫోన్‌జేస్త…’ అంది మొహమాటపడుతూనే. మా శ్రీమతి ఇచ్చేసింది.

తాను జడ్చర్లలో ఉన్నాననీ, బస్సు బయలుదేరబోతోందనీ, ఇంటికొచ్చేసరికి రాత్రి 9.30 గంటలు గావొచ్చనీ, అవతలి వ్యక్తికి వగరుస్తూ చెబుతోంది. మాటల మధ్యన అటూ ఇటూ చూస్తూ, చెమట తుడుచుకుంటోంది. అవతలి వ్యక్తి ఫోన్లో ఆమెను తిడ్తున్నట్టుగా మాకు అర్థం కాసాగింది.

” మీ ఆయనేనా?” అంది మా శ్రీమతి.

”అవునక్కా” ఆమె కళ్ళలో నీళ్ళు.

”కోపం జేస్తున్నట్టున్నాడు” నవ్వుతూ అడిగింది.

”అవునక్కా… గింత రాత్రి ఎందుకయ్యిందని తిడ్తున్నడు” అందామె ఉపోద్ఘాతంలా.

”ఆయనన్నదీ కరెక్టేగదా – కాలాలు బాగాలేవు… ఇంత రాత్రిపూట ప్రయాణమెందుకూ.”

”ఏం జెయ్యాలక్కా. పెండ్లిపని… పెండ్లి పిల్లగాడు దగ్గరి చుట్టమాయె. బట్టలు వెట్టాలని ఇంతసేపు ఆగిన”

”ఏం పగలు వెట్టలేకపోయినవా?”

”పగలు కుదరలేదక్కా. పోచమ్మ నాగుల కాడికి పోయి వొచ్చేసరికి ఎనిమిదయ్యింది. ఎవరి సెంటిమెంట్లు వాల్లకుంటయి గదా. అప్పటికీ అందరినీ బతిమిలాడి నేనే ముందు బట్టలు వెట్టి, గిట్ల ఉర్కొస్తున్న”.

”ఔను… ఇందుల నీ తప్పేంలేదుగద… మల్ల తిట్టు డెందుకూ?”

”గదంతే అక్కా… ప్రతిదానికీ ఆయన తిట్టుడూ, మేం పడుడూ అలవాటయిపోయింది.”

”అవునూ. పెండ్లన్నాక మన చేతిల ఉండదు గదా. పెండ్లల్ల కాడ, దవాఖాన్ల కాడ ఎక్వ-తక్వ అయితుంటది. ఓపిక వట్టాలె గదా…”

”ఆయనకిదంతా పట్టదు. మనిషన్నాక టైం ప్రకారం జరగాలంటడు. ఆలస్యమయితే ఇంట్ల వంట ఎవరు జేస్తరంటడు. పిల్లల్నెవరు జూసుకుంటరంటడు. ఒక మాట గాదు. ఒక కథగాదు. మీరు నమ్ముతరో లేదో కానీ, పెండ్లయిన మొదటిరోజే నేను ఎవరిని జూసో నవ్విననని గదమాయించిండు. వానికీ, నీకూ ఏం సంబంధమని ఆరాలు దీసిండు.”

”ఎప్పుడిగ ఇంతేనా?”

”అంతే. పెండ్లికి పోయిన తాన ప్రశాంతంగ ఉండనీయడు. ఫోన్లమీద ఫోన్లు. ఈయన భయానికే నేను సెల్లు గూడ దీస్కపోను.”

”గిట్లుంటే బతుకెట్ల?”

”గదంతే అక్కా… ఆయన్ను మనం అర్థం జేసుకోవాలె గానీ, ఆయన మనల్ని అర్థం జేసుకోడు…”

—-

కండక్టర్‌ టికెట్‌ కోసమొచ్చిండు. ఆయన చిల్లర లేవన్న వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకుంటున్నడు. ఈమె కొత్తూరుకు టిక్కెట్టు అడిగితే, హైద్రాబాద్‌కు టిక్కెట్టిచ్చి మాట మాత్రం చెప్పకుండా ముందుకెళ్ళిండు. అసలే రాత్రి గావడంతో, ఆమె మారుమాట్లాడకుండా ఎక్కువ డబ్బులిచ్చి టిక్కెట్టు తీసేసుకుంది.

బస్సులో తమాషా సంఘటనలు జర్గుతుంటాయి. కొందరు ఎంతసేపు మాట్లాడినా పొడిపొడిగా జవాబు చెప్పి దాటేస్తుంటారు. ఇంకొందరు అడుగకపోయినా (లోపల్నుంచి తోసుకొస్తుందో, ఏమో), తమ మొత్తం జీవితం మనకు చెప్పేస్తుంటారు. ఈమె రెండో టైపు మనిషిలాగుంది. ఎందుకోగానీ, రానురాను ఆమె మీద కుతూహలం పెరగసాగింది.

”పిల్లలెంతమందమ్మా” – అడిగాను నేను.

”ముగ్గురు పిల్లలన్నా” – అందామె.

”ఏం చదువుతున్నారు”.

”పెద్ద పిల్ల టీటీఈ జేస్తున్నది. చిన్నది పది చదువుతున్నది. మూడోవాడు ఎనిమిది చదువుతున్నాడు”

”మరి పిల్లలు పెద్దోల్లయిన్రు గదా. తండ్రినేమో కట్టడి జేయరా?”

”అమ్మో… నాలాగ వాల్లకు కూడా తండ్రంటే చచ్చేంత భయం. ఇంటి ముందర స్కూటరాగిందంటే, ఎక్కడోల్లక్కడ గప్‌చిప్‌..టీవీ బంద్‌ వెడ్తరు.. ఆటలు బంద్‌ వెడ్తరు.. నవ్వేది బంద్‌ వెడ్తరు.. అప్పటిదాంక సందడిసందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగ నిశ్శబ్దమయిపోతది.. సలికాలం గూడ గాలి ఉబ్బరించినట్టయితది.”

”కొడ్తడా”

”మస్తుగ. చిన్న తప్పు జేస్తే పిల్లల్ని, నన్ను గొట్టికట్టే ఈరమారగొడ్తడు”

ఆమె ఆ మాటలు చెబుతుంటే, ఇబ్బందిగా అటూ ఇటూ జూసిన… ఎవరి ధోరణిలో వాళ్ళున్నరు.

”అవునూ… ఎవరూ అడుగరా. మీ తల్లిగారు ఏమీ అడుగరా?”

”ఆల్లమీద మన్నుయెయ్య.. ఆల్లు సక్కగుంటె, నేను గిట్లెందుకుంటుంటినక్కా. ఉంటే డబ్బన్న ఉండాలె.. లేకుంటే తల్లిగారొల్లన్నా బలంగ ఉండాలక్కా”

”మీకు తమ్ముల్లు లేరా?”

”ముగ్గురున్నరు. ఎందుకూ దండుగ. ఎవని దారి వాడు జూసుకున్నడు. ముసిల్దాన్ని ఓ రూములవడేసిన్రు. తల్లినే సక్కగ జూడని భాడుకావులు. ఇగ అక్కనేం సక్కగ జూస్తరక్కా”

”ఇంతకూ మీ ఆయనేం జేస్తడు”

”కొత్తూరు ఫ్యాక్టరీల పనిజేస్తడు… ఫ్యాక్టరీకి సామాను గూడ సప్లయి జేస్తడు”

”దంద పెద్దదేనన్నమాట”

”ఏం లాభమన్నా… డబ్బున్నకాడ సుఖముండదు.”

—-

రాను రాను చీకటి చిక్కనవుతోంది. బస్సులో లైట్లు తీసేశారు. బస్సులో చీకటి గమ్మినా, ఆమె మనస్సు మాత్రం మాకు అద్దంలా కనబడుతోంది. చాలా చెప్పాలనుకుంటున్నట్లుగా, ఏమీ చెప్పలేకపోతున్నట్లుగా, గొంతుకేదో అడ్డం పడుతున్నట్లుగా సతమతమవుతున్నదామె.

ఊరు దగ్గరవుతున్నందుకో ఏమో… ఆమె ముఖంలో ఆందోళన పెరగసాగింది. జైలును సమీపిస్తున్న ఖైదీలా ఉందామె… ఆమెకు తన భర్త ఎదురుగ్గా ఉన్నట్టే భయపడసాగింది.

”అక్కా… నీ ఫోన్‌తోటి మాట్లాడినగద. మల్ల నీ ఫోన్‌కు ఆయన రింగ్‌ జేస్తడు… ఎత్తొద్దు” అందామె హడావిడిగా.

”ఎందుకూ” అంది మా శ్రీమతి.

జవాబిచ్చేలోపున సెల్‌ మోగింది. ఒకటిగాదు, రెండు గాదు నాల్గుసార్లు… విధిలేని పరిస్థితిలో ఆమె సెల్‌ను చేతిలోకి తీసుకుంది.

”ఇగో… బస్సు జర లేటయ్యేటట్లున్నది. నువ్వేమీ స్టేజికాడికి రాకు. నేనే వొస్త” అంటూ పాఠం చెప్పినట్టు చెప్పి సెల్‌ బంద్‌ జేసింది.

”అదేందమ్మా. ఆయనొచ్చి తీస్కపోతంటే వొద్దంటవేందమ్మా” కుతూహలంగా అడిగాన్నేను.

”వొస్తడన్నా. స్కూటరెక్కినకాడికెల్లి, ఇంటికి వోయిందాంక తిడ్తనే ఉంటడు. టైమంటడు… నా బొందంటడు… ఎవరెవరితో ఏమేం మాట్లాడినవంటడు… నానెత్తిదింటడు…”

”మరి ఒక్కదానివే వోతవా?”

”పోత…నాకేం భయంలేదు…”

”చీకటుంటదిగదా…”

”ఆయనకన్న గీ చీకటే నయం”

”ఓహో”

”చీకటయితే ఏందక్కా… చీకట్ల నడ్సుడు హాయిగుంటది. అంతా తెల్సినోల్లే గదా”

”ఓ అదా సంగతి.”

”ఆయనతోటి తిట్లు దినుకుంట, గీ ఎల్తుర్ల బోవుడు కంటే, ఈ చీకట్ల ఒక్కదాన్నయినా నడ్సుడు బావుంటది. గా కొద్దిసేపయినా స్వేచ్ఛ ఉంటది. మనసు తేలిక పడ్తది. బత్కుల ఆయన లేని చోటు దేవులాడుకుంటే, ఎక్కడ దొర్కుతలేదక్కా. అప్పుడప్పుడు గిట్ల టైమ్‌ మిగిలిచ్చుకుంట” అంది నవ్వుతూ.

మాటల్లోనే కొత్తూరు వొచ్చేసింది. మాతో సెలవు దీస్కొని బస్సు దిగిందామె. రాత్రి చిక్కనయ్యింది. బస్‌స్టాండ్‌లో మనుష్యులు అంతగా లేరు.

ఆమె హడావిడిగా భర్త వొచ్చాడేమోనని అటూ ఇటూ జూసింది. కనబడకపోవడంతో కొండంత బరువు దిగిపోయినట్టు హాయిగా ఊపిరి పీల్చుకుంది. అటూ ఇటూ జూస్తూ హోటల్‌ పక్కనున్న సందుగుండా చీకట్లో కలగల్సిపోయింది… వెల్తురుని వెతుక్కుంటూ…

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.