పెద్ద మనిషి – రుక్మిణి గోపాల

రామాయమ్మకు భర్త ఉన్నంత కాలం డబ్బు వ్యవహారాలు ఏమీ తెలియవు. అన్నీ ఆయనే చూసుకునేవారు. కాని అకస్మాత్తుగా గుండెపోటుతో భర్త మరణించేసరికి ఆ వ్యవహారాలలో ఆమెకు తల దూర్చవలసి వచ్చింది. ఎదిగిన కొడుకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు అత్తారింట్లో కాపురం చేసుకుంటోంది. ఆమె ఒక్కతే మిలిగింది. అదృష్టవశాత్తు ఆ ఊరిలోనే ఉన్న అక్క కొడుకు, భాస్కరం ఆమెకన్నివిధాలా సాయపడ్డాడు. రెండు మూడేళ్లు గడిచేసరికి వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చాయి. కాని అన్నిటికంటె పెద్దదైన భూమి అమ్మకం పని మిగిలిపోయింది. భూమి అంటే పంట భూమి కాదు, నివేశ స్థలం. ఆ ఊరిలో భర్త ఉద్యోగం చేస్తున్న రోజులలో చాలా చవకగా వస్తోందని పట్టణపు పొలిమేరలోనే మూడు వేల చదరపు గజాల భూమిని కొన్నాడు. అతనితో పాటు అతని సహోద్యోగులు కూడా చాలామంది అక్కడ కొన్నారు. కాని అది కొన్న కొద్ది రోజులకే అతను ఉద్యోగరీత్యా ఇంకొక ఊరికి వెళ్ళిపోవలసి వచ్చింది. ‘తొందరేముందిలే, రిటైర్‌ అయిన తరవాత వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు’ అని భార్యాభర్తలిద్దరు అనుకున్నారు. కాని ఆ అవకాశం రాకుండానే భర్త పోయాడు. ఒంటరిగా ఉన్న రామాయమ్మకు ఇల్లు కట్టుకోటం అసాధ్యమనిపించింది. అందుచేత భర్త పోయిన తరవాత వచ్చిన డబ్బుతో ఓ చిన్న ఫ్లాట్‌ కొనుక్కుంది. ఈ భూమిని అమ్మకానికి పెట్టింది. కొన్నప్పుడైతే కారుచవకగా వచ్చింది. కాని ఇప్పుడు, సుమారు పాతిక సంవత్సరాల అనంతరం ఆ ప్రదేశం బాగా అభివృద్ధి చెందినందువల్ల అక్కడ భూమి ధర విపరీతంగా పెరిగిపోయింది. అంత పెద్ద భూమిని అంత ఎక్కువ ధరలో కొనటం మాటలు కాదు. సామాన్య సంసారులెవ్వరు కొనలేరు. కొందరు మాకు ఐదు వందల గజాలు కావాలన్నారు. కొందరు మాకు మూడు వందలే చాలన్నారు. కాని అలా కొంత అమ్మితే మిగతా భూమి మాట ఏమిటి? అంచేత రామాయమ్మ ఒప్పుకోలేదు. చివరకు భాస్కరం తనకు తెలిసిన, నమ్మకమైన ‘రియల్‌ ఎస్టేట్‌’ వ్యవహారాలలో పనిచేసే ఒకతనిని తీసుకు వచ్చాడు. అతను మొత్తం మీద ఇంత అని మాట్లాడుకుని రామాయమ్మకు డబ్బు ఇచ్చేసేటట్లు ఒప్పందం కుదిరింది. తరవాత అతను దానిని ప్లాట్లు చేసి అమ్ముకుంటాడట. వాటి మీద లాభం వచ్చినా, నష్టం వచ్చినా అతనిదేట. రామాయమ్మకు ఈ పద్ధతి నచ్చి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. బేరం నలభై లక్షలకు కుదిరింది. భర్త పోయిన తర్వాత రామాయమ్మకు ‘ఇన్‌కమ్‌టాక్స్‌’ వాళ్లతో పని పడింది. భాస్కరం తనకు తెలిసిన సి.ఏ. ను అప్పజెప్పాడు. భర్తపోయిన తరవాత వచ్చిన, బ్యాంక్‌లో ఉన్న మొత్తాలు యల్‌.ఐ.సి. మొదలగు వాటినుంచి వచ్చిన మొత్తాలు, అన్నీ తనకు దగ్గరలో ఉన్న యస్‌.బి.ఐ. శాఖలో టెర్మ్‌ డిపాజిట్లుగా వేసింది. కొంత వయసవటంవల్ల దూరాలు వెళ్లలేదు. ఇప్పుడు రాబోయే నలభై లక్షలను కూడా అక్కడే వెయ్యాలనుకుంది. ఈ విషయం సి.ఏ. రంగనాధానికి చెప్పింది. అతను కొంచెం ఆలోచించి ”ఈ ఊర్లో మా బంధువులు ఒకాయన యస్‌.బి.హెచ్‌. బాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన చాలా మంచివాడు. ఇంత పెద్ద మొత్తాన్ని మనకు తెలిసున్న మేనేజర్‌ ఉన్న బాంక్‌లో వేసుకుంటే మంచిది. మీరు ఆడవారు, అందులో వయసుకు కొంచెం పెద్దవారు. ఎవరైనా మిమ్మల్ని సులువుగా మోసం చెయ్యవచ్చు” అన్నాడు. ”ఆ బాంక్‌ ఇక్కడికి చాలా దూరం. నేను దూరంగా ఉన్నవాటికి వెళ్ళలేను. ఈ బాంక్‌ బాగా దగ్గరలో ఉంది. నడిచి వెళ్లి నడిచి వస్తున్నాను. నాకదే సులువుగా ఉంటుంది” అంది రామాయమ్మ. ”ఆ బాంక్‌ మరీ ఎక్కువ దూరంలో లేదు. అయినా మీరు వెళ్లక్కర లేకుండా ఆయనే మీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసి పెడతాడు. పాపం ఆయన ఈ ఊరు కొత్తగా వచ్చారు. ఆయన హయాంలో బాంక్‌లో పెద్ద మొత్తాలు డిపాజిట్‌ అయితే ఆయనకు లాభిస్తుంది. ఆయన్ని ఈ ఆదివారం మీ ఇంటికి తీసుకు వస్తాను. మీకు ఆయన అన్నీ విశదీకరిస్తారు” అన్నాడు రంగనాథం.

అన్న ప్రకారం ఆదివారం ఆయన్ని రంగనాథం తీసుకు వచ్చాడు. ”ఈయన నేను చెప్పిన బాంక్‌ మేనేజరు గారు, శ్రీరామ్మూర్తి గారు” అని పరిచయం చేశాడు. రామాయమ్మ మర్యాద చేసి కూర్చోమంది. ఆయనే సంభాషణ మొదలు పెట్టారు. ”మా రంగనాథం నాకంతా చెప్పాడు. అంత పెద్ద మొత్తాన్ని మీకు తెలిసున్న బాంక్‌ మేనేజర్‌ ఉన్నచోట వేసుకుంటేనే మంచిది. అనుభవం మీద చెపుతున్నాను. మీ డబ్బును నా స్వంత డబ్బులాగ చూసుకుంటాను” అన్నాడు. చూపులకు శ్రీరామ్మూర్తి గారు పెద్దమనిషి లాగే కనపడుతున్నారు. మొహం చూస్తే శాంతస్వభావం కల వ్యక్తి లాగానే కనపడుతున్నాడు. మాట కూడా చాలా నెమ్మదిగా ఉంది. రామాయమ్మ తనకున్న ఇబ్బందిని చెప్పుకుంది. ”ఏ బాంక్‌ అయినా నాకిబ్బంది లేదు. కాని పెద్ద దాన్ని అయినందువల్ల దూరాలు వెళ్లలేను. అంచేత దగ్గరగా ఉన్న బాంక్‌లో వేసుకుంటే నాకు సులువుగా ఉంటుంది” అంది. ఆయన వెంటనే అన్నాడు ”మీకా శ్రమ అఖ్కరలేదు. మీరు బాంక్‌కు రానక్కరలేకుండా కావలసిన ఫారాలు అవీ మీ ఇంటికి తీసుకొచ్చి అన్ని పనులు చేసి పెడతాను. ఇంక మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను” అన్నాడు. ”మీకు బోలెడన్ని పనులుంటాయి. నా ఒక్క పనే కాదుగా! అందులో మీరు బాంక్‌ మేనేజరు. మీకు ఖాళీ ఉంటుందా? నాకు అవసరం పడినప్పుడల్లా మీరు రాలేరు కదా” అంది రామాయమ్మ. ”మేము, బాంక్‌ మేనేజర్లయి అలా అనుకుంటే ఎలా? పని పడినప్పుడు వెళ్లి తీరాలి. అందులో మీ ఇల్లు నేను మా ఇంటి నుంచి బాంక్‌కు వెళ్లే తోవలోనే ఉంది. రోజూ నేను బాంక్‌కు రావటం, మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లటం ఇంచు మించు మీ ఇంటిముందునుంచే. ఎటొచ్చీ కొద్దిగా సందులోకి తిరగాలి, అంతే. అందుచేత మీ ఇంటికి వచ్చేందుకు నేను వేరే శ్రమ పడఖ్కర లేదు. మీరు ఫోన్‌ చేస్తే వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో వచ్చి మీ పనిచేసి పెడతాను” అన్నాడు కొంచెం ప్రాధేయపడుతున్నట్లు. రామాయమ్మ ఆలోచించింది ‘ఇంటికొచ్చి పనిచేసి పెడతానంటున్నాడు. ఇంక తనకి కష్టమేముంది. ఏ బాంక్‌ అయితే ఏమిటి?’ అనుకుంది. ”మీరంతలా అంటున్నారు కాబట్టి మీ బాంక్‌లోనే వేస్తాను. కాని మీ బాంక్‌ ఉన్న చోటు ఇక్కడికి చాలా దూరంగా ఉంది. నేనంత దూరం రాలేను. మీరన్న మాట ప్రకారం ఇంటికొచ్చి పనిచేసి పెడితే నాకభ్యంతరం లేదు” అంది. ఆయన మొహంలో సంతోషం స్పష్టంగా కనపడింది. ”చాలా థాంక్స్‌ అండీ, నేనన్నమాట ఎప్పుడూ తప్పను. డబ్బు రాగానే నాకు తెలియజెయ్యండి ఇంక నేను సెలవు తీసుకుంటాను. ఇది నా విజిటింగ్‌ కార్డు. ఇందులో ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి” అంటూ కార్డిచ్చి నమస్కరించి రంగనాథంతో కలిసి వెళ్లిపోయాడు. ఎందుకైనా మంచిదని రామాయమ్మ వెంటనే భాస్కరానికి ఫోన్‌ చేసి విషయమంతా చెప్పింది. ”రంగనాథం తీసుకు వచ్చాడంటున్నావు కదా, అయితే ఫరవాలేదు. అయినా ఈ వ్యవహారాలు నీకూ కొంచెం అలవాటయ్యాయి కదా, జాగ్రత్తగా చూసుకో. నేను కూడా ఓసారి రంగనాథానికి ఫోన్‌ చేసి మాట్లాడతాను” అన్నాడు భాస్కరం.

ఓ రోజు సాయంత్రం భాస్కరం రామాయమ్మకు ఫోన్‌ చేశాడు. ”అతను రేపు ఉదయం డబ్బు తీసుకు వచ్చి ఇస్తాడట. కొంత కాష్‌గాను, కొంత చెక్కు రూపంలోను ఇస్తాడట. నువ్వు శ్రీరామ్మూర్తి గారికి ఫోన్‌ చేసి రమ్మని చెప్పు. కాష్‌ రేపే బాంక్‌లో పడిపోవాలి. అంత డబ్బును ఇంట్లో ఉంచుకోటం మంచిది కాదు. నేను కూడా వస్తాను” అని చెప్పాడు. రామాయమ్మా ఖంగారు పడి శ్రీ రామ్మూర్తి గారికి ఫోన్‌ చేసింది. ఆయన తప్పకుండా వస్తానని చెప్పాడు.

మర్నాడు పది గంటల ప్రాంతంలో అతను డబ్బు తీసుకుని వచ్చాడు. భాస్కరం కూడా వచ్చాడు. అంతకు మునుపే శ్రీరామ్మూర్తి గారు వచ్చారు, కూడా ఇంకొకతన్ని తీసుకు వచ్చారు. అతనిచేతిలో ఓ పెద్ద ‘జిప్‌బాగ్‌’ ఉంది.

లెక్క చూసి డబ్బు ఇవ్వటం, దానికి సంబంధించిన రాతకోతలు, రసీదులివ్వటం, అన్నీ జరిగి చెక్కు కూడా ఇచ్చి అతను వెళ్లిపోయాడు. శ్రీరామ్మూర్తి గారు ఫారాలు మొదలగునవి తీసి టర్మ్‌ డిపాజిట్లను నింపారు. ఒకటి ప్రత్యేకంగా రామాయమ్మ పేరు మీద, ఓ దాని మీద కొడుకు పేరును, ఓ దాని మీద కూతురి పేరును నామినేట్‌ చేయించారు. సరిగ్గా ఉన్నాయో లేవో అని ఆ సర్టిఫికెట్లను భాస్కరం కూడా పరిశీలించాడు. ఫారాలను నింపేటప్పుడు శ్రీరామ్మూర్తి గారు టెర్మ్‌ డిపాజిట్‌ కాలపరిమితిని అడిగినప్పుడు రామాయమ్మ ‘మాక్జిమమ్‌ పీరియడ్‌’ అయిన ఐదు సంవత్సరాలకు పెట్టించింది. శ్రీరామ్మూర్తిగారు కావలసిన చోట్ల రామాయమ్మ సంతకాలు తీసుకుని పని పూర్తిచేసి సర్టిఫికెట్లు ఆమె చేతికిచ్చారు. ఓచర్‌ రాసిచ్చి చెక్‌ను బాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు తీసుకుని ”ఇది కాష్‌ అవగానే వచ్చి దీని పని కూడా పూర్తి చేస్తాను” అని చెప్పి కూడా వచ్చినతని సాయంతో డబ్బంతా జిప్‌బాగ్‌లో పెట్టుకుని రామాయమ్మ దగ్గర, భాస్కరం దగ్గర ఆయన సెలవు తీసుకుని వచ్చినతనితో సహా శ్రీరామ్మూర్తిగారు వెళ్లిపోయారు.

కాలగర్భంలో ఐదు సంవత్సరాలు కలిసిపోయాయి. రామాయమ్మ వేసిన టెర్మ్‌ డిపాజిట్లు ‘మెచ్యూర్‌’ అయ్యే రోజు దగ్గరకు వచ్చింది. వాటిని ‘రిన్యూ’ చేయించాలి. ఇలాటి వాటిలో రామాయమ్మ చాలా జాగ్రత్తగా ఉంటుంది. మర్చిపోతానన్న భయంతో ఇలాంటి విషయాలు ‘నోటుబుక్‌’ లో రాసి ఉంచుకుంటుంది. మధ్య మధ్యన ఆ నోట్‌ బుక్‌ చూసుకుంటూ ఉంటుంది. ‘ఓసారి రామ్మూర్తి గార్కి ఫోన్‌ చేసి జ్ఞాపకం చెయ్యాలి. ఆయనకుండే బోలెడన్ని పనులలో ఈ విషయం జ్ఞాపకం ఉంటుంది అనుకోవటం తెలివితక్కువ తనం’ అనుకుంది. మరునాడు మెచ్యూర్‌ అవుతాయనగా ముందు రోజు బాంక్‌కు ఫోన్‌ చేసింది. అవతలివైపు నుండి హలో అని వినపడగానే ”యస్‌.బి.హెచ్‌ బాంకేనాండి” అనడిగింది. ”అవునండి” అని సమాధానం వచ్చింది. ”మేనేజర్‌ గారు శ్రీ రామ్మూర్తి గారేనా మాట్లాడుతున్నది” అని అడిగింది. ”శ్రీరామ్మూర్తి గారు ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయారండి” అని జవాబు వచ్చింది. రామాయమ్మ దిగ్భ్రాంతికి లోనయింది. అయినా కొంచెం నిగ్రహించుకుని ”ఎన్నాళ్లయిందండీ” అని అడిగింది. ”ఆర్నెల్లయింది. ఆయన స్థానంలో నేను వచ్చాను. మీకేం కావాలి?”

”నేను రామాయమ్మను మాట్లాడుతున్నాను. నన్ను గురించి ఆయన మీకేమన్నా చెప్పారా?”

”సారీ, నాకేమీ చెప్పలేదండి. మావల్ల మీకేమైనా సహాయం కావలిస్తే మా బాంకుకు రండి” అని ఆయన ఫోన్‌ పెట్టేశాడు. మినుకు మినుకు మంటున్న ఆశాదీపం పూర్తిగా ఆరిపోయింది. ఆమెను నిస్సత్తువ ఆవహించి కుర్చీలో కూలబడింది. పని అయేదాకా ఎంత నమ్మకంగా మాట్లాడాడు! కనీసం వెళ్లే ముందు ఒక ఫోన్‌ కూడా చెయ్యలేదు. పోనీ వృత్తి ధర్మ రీత్యా వెళ్లక తప్పక పోయినా వెళ్లేముందు, ”నేనిలా వెడుతున్నాను. మీ విషయం మా కొత్త మేనేజరుకి లేదా ఓ సీనియర్‌ ఆఫీసర్‌కి చెప్పాను. మీరొచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కువసేపు నిరీక్షింప చెయ్యకుండా మీ పనిని తొందరగా చేసి పెట్టెయ్యమని, మీ కన్నివిధాలా సహాయపడమని వాళ్లకి చెప్పాను” అని ఫోన్‌ చేసి అయినా చెప్పవచ్చుగా! చాలా పెద్ద మనిషి లాగ కనపడ్డాడు, ఇలాగా చెయ్యటం! ఇది నమ్మక ద్రోహం లాంటిది కాదా? ఆనాడు శ్రీరామచంద్రుడు ‘తను అన్నమాట ‘కాదు’, తండ్రి అన్నమాట’కు కట్టుబడి రాజ్యం వదిలేసుకుని అడవులు పట్టిపోయాడు! ఎంత వ్యత్యాశముంది ఆనాటి శ్రీరామచంద్రులకు ఈనాటి శ్రీరామమూర్తులకు! ఏరు దాటే దాకా ‘ఏరు మల్లన్న’, ఏరు దాటాక ‘బోడి మల్లన్న’! రామాయమ్మ లోకమనే క్లాసులో ఓ కొత్త పాఠం నేర్చుకుంది.

 

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.