ఈ మధ్య ఎక్కడ నలుగుర్ని కలుసుకున్నా, స్త్రీ వాదుల పట్ల నిరసన ప్రకటించడం వినవలసివస్తోంది. పురుషుల కన్న స్త్రీలే స్త్రీ వాదుల్ని ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆశ్చర్యం కలగడంతో పాటు, ఆలోచించవలసిన అవసరం కూడా ఉందనిపించింది. లోపం స్త్రీ వాదులలో ఉందా, స్త్రీలలో ఉందా?
‘ఆడపనులు’, ‘మగపనులు’ అని విభజించకుండా, వంటింటి పనులు, ఇంటి పనులు, పిల్లల పెంపకం బాధ్యతలూ భార్యాభర్తలిద్దరూ పంచుకోవాలనీ, భర్త భార్యకి సహకరించాలనీ కోరుకుంటారు ఉద్యోగాలు చేసే స్త్రీలు, ఉద్యోగాలు చెయ్యని స్త్రీలు కూడా – చదువుకున్న స్త్రీలయితే – ఇంటి పనులలో మునిగిపోవాలని కోరుకోరు. పురుషులు చెయ్యగలిగిన పనులు కూడా చెయ్యకుండా తప్పించుకుంటూంటే బాధపడని స్త్రీలు ఉండరు సాధారణంగా.
కానీ భర్త సహకారాన్ని అర్థించే స్త్రీలని ‘స్త్రీవాదులు’ అంటూ విమర్శించే స్త్రీలు చాలా మంది కనిపిస్తున్నారు. ‘నేనొక ప్లేటు తోమితే, నువ్వొక ప్లేటు తోమాలి. నేనొక గది ఊడిస్తే నువ్వొక గది ఊడవాలి…” అని స్త్రీ వాదులు అంటారనే ఒక అభియోగం వినవచ్చింది! ఏ భార్య అయినా అంత అర్థరహితంగా, మూర్ఖంగా షరతులు విధిస్తుందా?! తమ అంట్లు తోమే లోపల భర్తని పక్కలనీ సర్దుమనో, తమ సాయంత్రం వంటపూర్తి చేసే లోపున భర్తవెళ్లి మర్నాటికి కావల్సిన కూరలవీ తెచ్చిపెట్టాలనో కోరుకోవడంలో తప్పేముంది? లేకపోతే – భర్త పొద్దున్నపూట న్యూస్ పేపర్ చదువుతూనో, సాయంకాలం స్నేహితులతోకాలక్షేపం చేస్తూనో ఇంటి పనులన్నిటినీ భార్య మీదికి తోసేస్తూ ఉంటాడు – అవి ఆవిడ సహజ బాధ్యతలు అన్నట్లు, పిల్లల చేత హోంవర్క్ చేయించడం, గ్యాస్ అయిపోతే బుక్ చేయించడం, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, బందువులకు సరియైన అతిథి సత్కారాలు చేయడం మొదలైన పనులన్నీ భార్యా భర్తలిద్దరూ సమంగా చేసుకోవాలంటే తప్పేముది?
ఇప్పుడిప్పుడు కొందరు భర్తలు ఇంటిపనుల్లో భార్యలకు కొంత సహకరిస్తున్నారు. టూత్‌పేస్ట్, తువ్వాలు, బూట్లూ దగ్గర నుంచి ప్రతిదీ భార్య అందించాలని ఎదురు చూడటం లేదు కనీసం! తమంతట తామే చేసుకుంటున్నారు. అయితే, తల్లి ఎదుట మాత్రం భార్యకి వంటింటి పనుల్లో సహాయపడటానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు కొడుకులు కొందరు. పని మనిషి చూస్తుండగా భర్త వంటింట్లో కొచ్చి సహాయం చేయడం నచ్చదు కొందరు భార్యలకి – ఈ రకంగా తల్లులు, భార్యలూ కలిసి పురుషాధిక్యతని భద్రంగా పోషిస్తున్నారు. తరతరాలుగా స్త్రీలు పురుషాధిక్య సంస్క ృతిని జీర్ణించుకోవడం వల్ల స్త్రీవాదులు చేప్పే విషయాలు అసంబద్ధంగా, ‘అసహజంగా’ అనిపిస్తున్నాయి సామాన్య స్త్రీలకి.
ఆ విధంగా జీర్ణించుకున్న సంస్క ృతిలో భాగమే ”సుమంగళిగా పోవాలి” అనే వాంఛ. ‘ముత్తయిదువ’కి సమాజంలో ఉన్న పవిత్ర స్థానం, గౌరవం ఇతర స్త్రీలకు లేదు. అందుకే గౌరవహీనమయిన బతుకు బతికే కన్న ‘సుమంగళి’గా పోవడం నయం అనుకుంటారు స్త్రీలు. అంతేకానీ, స్త్రీని ఒక వ్యక్తిగా గౌరవించవలసిన అవసరం ఉందని తోటి స్త్రీలే అనుకోరు.
ఈ మధ్య ఒక ప్రఖ్యాత గాయనీమణికి షష్టిపూర్తి సందర్భంగా నగరంలో కొన్ని సన్మాన సభలు జరిగాయి. సాధారణంగా మన సంప్రదాయంలో పురుషుల షష్టిపూర్తికే గుర్తింపు. వారే ఉత్సవం జరుపుకుంటారు. అటువంటి ఒక స్త్రీకి ఒక సాంస్క ృతిక సంస్థ సన్మానం జరుపుతుందంటే సంతోషం కలిగింది. అయితే, ఆ సన్మానోత్సవంలో పాల్గొనమని ఆహ్వానిస్తూ, ఆ సంస్థ నిర్వాహకులు ఒక ప్రత్యేక విన్నపం చేశారు – ”అ గాయనీ మణికి ముత్తయిదువలందరు సన్మాన పూర్వకంగా కుంకుమ భరిణలనో చీరలనో బొట్టుపెట్టి ఇస్తారు. మీరు కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకురాగలిగితే బావుంటుంది”. అని ఆ సూచన విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది.
వైవాహిక స్థితినీ, మాతృత్వాన్నీ బట్టి కాకుండా స్త్రీని ఒక వ్యక్తిగా గుర్తించడం జరగదా? స్త్రీ ‘ప్రతిభ’ని బట్టి మాత్రమే గుర్తించడం సాధ్యంకాదా?
ఆడపిల్లలు ఈ నాటికే ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా ”ఇంకా పెళ్లి కాలేదన్న” వ్యాఖ్యానం వినిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లకి పెళ్ళితోనే జీవితం ప్రారంభమవుతుందన్నట్లుగా, పెళ్ళయిపోతే ఆడపిల్ల సమస్య తీరిపోతుందన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ, పెళ్ళికాని ఆడపిల్లల మనసులు కుంచించుకుపోయేట్లు చేస్తారు. వైవాహిక జీవితంలోని సుఖాన్ని అందరూ వాంఛిస్తారు. అయితే పెళ్ళికాకుండా స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధాన్ని అనుమతించదు మన సమాజం. కానీ వివాహం అవాలంటే ఎన్నో అడ్డంకులు – ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ప్రతిబంధకాలు. వాటికి తోటి స్త్రీలు ఎంతవరకు బాధ్యులవుతున్నారన్న విషయం గురించి స్త్రీలు పునరాలోచించాలి. పెళ్లి సులభ సాధ్యం అయేట్లు చూడాలి.
స్త్రీలు తమప్రగతి గురించీ, తోటి స్త్రీ ప్రగతి గురించి స్పష్టంగా ఆలోచించడం. ప్రగతికి దోహదం చేసేట్లుగా ప్రవర్తించడం అలవరుచుకోవాలి. ‘స్త్రీవాద’ అంతర్యాన్ని అవగాహన చేసుకోవాలి.
వైవాహిక స్థితినీ, మాతృత్వాన్నీ బట్టి కాకుండా స్త్రీని ఒక వ్యక్తిగా గుర్తించడం జరగదా? స్త్రీ ‘ప్రతిభ’ని బట్టి మాత్రమే గుర్తించడం సాధ్యంకాదా?