తొలి మేజర్‌ ఫెమినిస్ట్‌’ – మేరీ ఊల్‌స్టన్‌ క్రాప్ట్‌ -పి.సత్యపతి

 

స్త్రీవాద సాహిత్యాన్ని ఒక క్రమ పద్దతిలో అధ్యయనం చేయడానికి ఉపక్రమించినట్లయితే మొట్టమొదట చదవవలసిన గ్రంథం – ‘విండికేషన్‌ ఆఫ్‌ ద రైట్స్‌ ఆఫ్‌ విమెన్‌’. తొలి మేజర్‌ ఫెమినిస్ట్‌ అని స్త్రీ వాదులంతా అంగీకరించిన మేరీ ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌ అద్భుత రచన.

రెండు శతాబ్దాల క్రిందట-

ఊపందుకుంటున్న మానవ హక్కుల ఉద్యమాలు, తీవ్రవాద భావాలు, సమాజాన్ని సంస్కరించాలని నిజాయితీతో చేసే ప్రయత్నాలు, ది ఇంగ్లీష్‌ పార్లమెంటుని వణికిస్తున్న సమయంలో కళ్ళు తెరిచింది మేరీ ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌.

మానవ హక్కుల ఉద్యమాలని సమర్థిస్తూ మానవ హక్కులనేవి పురుషులకే కాదు, స్త్రీలకి కూడా ఉండాలని, ఉన్నాయని నమ్మి వాదిస్తుంది.

ఏటువంటి హక్కులూ లేని స్త్రీలు, తాము తక్కువ వారిగానే సృష్టించబడ్డామని నమ్మి, వ్యవస్థలో యిమిడి పోయిన కాలంలో, వారికీ హక్కులున్నాయని తార్కికంగా నిరూపించిన ఈ గ్రంథాన్ని, అనాటి ఫెమినిస్టులు కూడా సంతోషంగా ఆహ్వానించలేదు. గ్రంథాన్ని హేళన చేయ్యడమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా దుయ్యబట్టారు. ఇది చదివిన స్త్రీ లెవరూ గోడలు బ్రద్దలు కొట్టడానికి విప్లవ స్ఫూర్తిని పొందలేదు. – అట్లా జరిగినట్లయితే ‘విండికేషన్‌…’ ఒక్క చరిత్రకారుల దృష్టికే పరిమితం అయి ‘వుండేది. ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌ వాదనకి ఒక తాజాదనం వుండడం ఈ రోజు చదివినా, కాస్తా కూస్తా సమకాలీనత ఇందులో కనపడుతుంది. ఆమె పోరాటం ముగియలేదనిపిస్తుంది. ఆమె ప్రతిపాదనల పట్ల ఆమె పట్ల ఆసక్తి కలుగుతుంది.

‘విండికేషన్‌…’ లో మేరీ తన ఆగ్రహాన్నీ, కుతూహలాన్నీ, పొగడ్తలనీ, ఆఖరికి ఉచ్ఛరించడానికి వీల్లేని తిట్లనీ కూడా జోడించింది. ఆమె సమకాలికులు కొందరు ఆమెని, ‘సిగ్గులేని తిరుగుబోతు’ అనీ – ‘పెట్టీకోట్‌ ధరించిన హైనా’ అనీ – ‘బోధించే సర్పం’ అనీ వ్యాఖ్యానించారు కూడా.

ఓటు హక్కుల ఉద్యమకారిణులు కొందరు (సఫ్రగేట్స్‌) ఆమెను ‘పవిత్రమైన విలువలను నాశనం చేసిన స్త్రీ’గా అభివర్ణించారు.

ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో కూడా ఆమెను ‘ఫురుష ద్వేషి’ అనీ, కేవలం ‘పీనిస్‌ ఎన్వీ’ (penis Envy) కారణంగానే ఈమె స్త్రీ వాద ఉద్యమం ప్రారంభించిందనీ విమర్శించారు. ఇటీవల (1959) వరకూ ఫెమినిస్ట్‌లు కూడా ఆమె మేధను గుర్తించలేదు. 1959లో ఆమె 200 జన్మదినోత్సవం సందర్భంగా సెంట్‌ ఫ్రాంకాస్‌ పాత చర్చిలో గల ఆమె సమాధి పైన, ‘ఫాసెట్‌ సొసైటీ’ పుష్పగుచ్చం వుంచి ఆమెని గుర్తించింది.

ఇప్పుడు మళ్ళీ ఊల్‌స్టన్‌ క్రాస్ట్‌ పఠనీయం అయింది. ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించిన మేరీ – బ్రతుకు నిరంతర పోరాటమే అయింది. ఆమె పుట్టి పెరిగిన పురుషాధిక్య, వర్గ సమాజంలోని ఆమె వ్యక్తిగత అనుభవాలే ఆమె ఆలోచనలకు పధునుపెట్టాయి. ఆర్థిక స్వాతంత్య్రం కోసం, అభద్రతా భావం నుంచీ విముక్తి కోసం ఆమె పడిన ఆవేదన, చేసిన పోరాటం, వ్యక్తిగా తన గురించే కాక స్త్రీలందరి విముక్తి కోసం ఆరాటపడేలా ప్రేరేపించాయి.

స్త్రీలకి ఎటువంటి జీవన విధానం అవసరమో చెబుతూ ఆమె చేసిన ప్రతిపాదనలు, వాదనలు, సమర్థనలు, ఖండనలు, ‘విండికేషన్‌…’ నిండా వుంటాయి.

లండన్‌ బయట వున్న విస్సింగ్‌ ఫారెస్ట్‌లోని ఒక చిన్న వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌ దంపతులకి 1759లో జన్మించిన మేరీయే ప్రథమ సంతానం. – ఆమె తరువాత మరొక అరుగురు. ఈ కుటుంబం ఎక్కడా స్థిరంగా వుండేది కాదు. ఒక క్షేత్రం నుంచీ మరొక క్షేత్రానికి మారుతూ వుండేది. నిత్యదరిద్రంతో పోరాటం చేసే మేరీ తండ్రి తన కోపాన్ని, అసమర్ధతనీ భార్యని తిట్టడంగా, కొట్టడంగా ప్రదర్శించేవాడు. తల్లితండ్రుల తగవులు మేరీ తీరుస్తూ వుండేది. ఆమె తన తల్లికి ఎంత చేదోడు వాదోడుగా ఉన్నా, తల్లికి మాత్రం తన పెద్ద కొడుకుపైన మక్కువ ఎక్కువ. భర్త పీడనను కూడా ఆమె యిష్టంతోనే భరించేది.

పేదరికం తనకొక విధంగా మేలే చేసిందంటుంది మేరీ. ఆర్థికంగా మెరుగైన మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లల్ని సోమరులుగా పెంచుతారనీ – బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకోనివ్వరనీ ఆమె అభిప్రాయం. తనకీ ప్రపంచజ్ఞానం కలగడానికి పేదరికం కూడా ఒక విధంగా సహాయపడిందంటుంది.

1768లో ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌ కుటుంబం మళ్ళీ తన బస మార్చి యార్‌షైర్‌లోని మరో వ్యవసాయ క్షేత్రానికి చేరింది. మధ్య తరగతి బాలికలవలె డ్రాయింగ్‌ రూంకే పరిమితం కాక, ఆరు బయట తాజాగాలిలో తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో ఎగురుతూ, దూకుతూ ఆడుకోగలిగింది కానీ, పేదరికం ఆమె పఠనాభిలాషకూ, విద్యాభ్యాసానికీ అడ్డు అయింది.

ఆర్థిక స్వాతంత్య్రం ఆమె జీవిత ధ్యేయం అప్పట్లో….

1778లో, తల్లితండ్రులతో సుదీర్ఘ పోరాటం తరువాత ఇల్లు వదలి ఉద్యోగాన్వేషణకి బయలు దేరింది. ఎక్కువ చదువుగానీ, సాంకేతిక నైపుణ్యంగానీ లేని మేరికి వచ్చిన వుద్యోగం, ఒక వృద్ధ వితంతువుకి తోడుగా వుండడం. ఏ మాత్రం సంతృప్తి నివ్వని ఈ

ఉద్యోగాన్ని తల్లి జబ్బు కారణంగా వదిలేసి వచ్చింది. 1780లో తల్లి మరణం తరువాత ఆ కుటుంబం చీలిపోయింది. అప్పటికీ కుదురైన ఉద్యోగంలో వున్న మేరీ తమ్ముడు (కుటుంబానికి పెద్ద కొడుకు)కాక, మేరీయే తన తండ్రినీ, తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ అదుకోవలసి వచ్చింది.

1783లో మేరీ తన స్నేహితురాలైన ఫానీబ్లడ్‌తోనూ, తన చెల్లెళ్ళతోనూ కలిసి ‘న్యూయింగ్‌టన్‌ గ్రీన్‌’ అనే చోట ఒక చిన్న పాఠశాల స్థాపించింది. ఆ ప్రదేశంలో ధనవంతులైన ‘అసమ్మతి వాదులు’ ఎక్కువ మంది వుండేవారు. ఉదారవాద మేధావులు, మంత్రులు, ‘జేమ్స్‌ బర్గ్‌’ వంటి వారుండేవారు. న్యూయింగ్‌టన్‌ మీటింగ్‌ హౌస్‌లో బోధ చేసే ప్రముఖులలో రిచర్డ్‌ ప్రయిస్‌ ఒకరు. ఆయన పార్లమెంటు సంస్కరణలనూ, ఆమెరికన్‌ , ఫ్రెంచి విప్లవాలనూ సమర్థించేవాడు. స్త్రీవాద వ్యతిరేక భావాలకు నిలయమైన సంప్రదాయ వాదులు అక్కడ ఎక్కువ మంది లేకపోవడం మేరీకి చాలా నచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం కోసం కష్టపడుతున్న ఈ ఉపాధ్యాయ యువతులు కూడా అక్కడి వారికి నచ్చారు.

తల్లిదండ్రుల అదుపు, అధికారాలపై తిరుగుబాటుగా మొదలైన స్వాతంత్య్ర కాంక్ష. సమస్తమైన అధికారాలనూ నిరసించే స్థాయికి అధిగమించింది.

‘విండికేషన్‌…’లో ఆమె డాక్టర్‌ ప్రయిస్‌ ప్రతిపాదించిన మోరల్‌ థియాలజీ (నీతికి సంబంధించిన మత మీమాంస) -ని స్త్రీ వాదానికి అన్వయిస్తూ, దైవాజ్ఞ చేత, స్త్రీలు ‘తక్కువ వారు’ అనడానికి నిరసించింది.

ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే తన మేధా సంపదను అభివృద్ధి పరుచుకుంది. ఫానీబ్లడ్‌ ఆకస్మిక మరణం తరువాత పాఠశాల నిర్వహణ కష్టరతం అయినప్పటికీ, ఆ క్లిష్ట సమయాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదుర్కోగలిగింది. ఋణభారాన్ని తట్టుకోవడం కోసం రచనలు చేసి సంపాదించమనే మిత్రుల సలహా మేరకు, ‘థాట్స్‌ ఆన్‌ ది ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ డాటర్స్‌’ అనే పుస్తకం వ్రాసింది. అప్పట్ల్లో ‘రచన’ స్త్రీల రంగం కానేకాదు. అంతేకాక డాక్టర్‌ జేమ్స్‌ ఫోర్‌డైస్‌, డాక్టర్‌ జాన్‌ గ్రెగోరీ వంటివారు బాలికల శిక్షణ గురించి వ్రాసిన పుస్తకాలు బాగా ప్రజాదరణ పొంది ఉన్నాయి అప్పటికే. అంతేకాక మేరీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలతో విభేధించడంతో ఆమె పుస్తకాన్ని ప్రజలు ఆదరించలేదు. పుస్తకంపై వచ్చిన పది ‘గీనీ’లు ఫానీబ్లడ్‌ కుటుంబానికి ఇచ్చింది. దానితో

వాళ్ళు ఐర్‌ల్యాండ్‌లో స్థిరపడ్డారు. ఆర్థిక బాధలు తట్టుకోవడానికి తను కూడా ఐర్‌ల్యాండ్‌లోనే ఒక ధనిక భూస్వామి ఇంట్లో ‘గవర్నెస్‌’గా కుదిరింది. ఈ అనుభవం కూడా ఆమె ఆలోచనా పరిధిని విస్తరింపజేసింది. స్త్రీలు ఎలా ఉండకూడదో అర్థం చేసుకుంది. ఎక్కువ తీరికతో, అవసరాన్ని మించిన డబ్బుతో, అంతులేని సుఖలాలసతో బ్రతికే ఒక కుటంబాన్ని సమీపంలో నుంచి చూసే అవకాశం కలిగింది. యజమానురాలు లేడీ కింగ్స్‌బరో జీవన శైలినీ, తన తల్లి తన తండ్రికి చూపిన అంతులేని విధేయతనీ బహు దగ్గరగా చూసిన మేరీకి స్త్రీలు ఎలా ప్రవర్తించకూడదో స్పష్టమైనట్లనిపించింది. ముఖ్యంగా ధనిక స్త్రీలు ఎలా ప్రవర్తించకూడదో స్పష్టమైనట్లనిపించిది. ముఖ్యంగా ధనిక స్త్రీల జీవనశైలి ఆమెకి కంపరం కలిగించింది. వారి స్వార్థాన్నీ, విలువలు లేని అభిరుచినీ ఏవగించుకుంది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న పేదరికాన్ని పట్టించుకోకపోవడం ఆమె కసలు నచ్చలేదు. అటువైపు నుంచీ లేడీ కింగ్స్‌బరోకి మేరీ ‘వాడి అయిననాలుక’ అసలు నచ్చలేదు. ఈలోగా ఆమె తన ప్రచురణ కర్త అయిన జోసెఫ్‌ జాన్సన్‌తో ఉత్తరాలు నడుపుతూనే ఉంది. అతను ఆమె తొలి నవల ‘మేరీ-ఎఫిక్షన్‌’ (1788)ను ప్రచురించడానికి అంగీకరించాడు. ఆమె లండన్‌ రాగలిగితే ఏదైనా ఉద్యోగం కూడా చూపగలనన్నాడు.

లండన్‌లోని జోసెఫ్‌ జాన్సన్‌, పుస్తకాల షాపుపైన గదులలో తరచు ఉదారవాదులు, తీవ్రవాద మేధావులు సమావేశమవుతూ వుండేవారు. వీరిలో చిత్రకారుడు హెన్రీ ఫ్యూసిలీ, జోసెఫ్‌ ప్రీస్ట్‌లీ, విలియం బ్లేన్‌ (కవి) విలియం గాడ్విన్‌ (రాజకీయ తత్వవేత్త, తరువాత మేరీని వివాహం చేసుకున్నవాడు). థామస్‌ ఫెయిన్‌ వంటి వారు వుండేవారు.

తనను తాను పోషించుకుంటూ, మహానగరంలో జీవిస్తున్న మేరీ, తను వృత్తిరీత్యా ఒక రచయితననీ, ‘ఒక క్రొత్తజాతికి ప్రారంభకురాలి’ననీ చెప్పుకునేది. ఉపాధ్యాయవృత్తికి స్వస్థిచెప్పి రచయితగా స్థిరపడింది. క్రియాశీలి, ఉత్సాహవంతురాలు, జీవితానికి ఒక ప్రయోజనం వుందని భావించే వ్యక్తి అయిన మేరీలో అంతర్వాహినిగా భావుకత కూడా ఉంది. కొన్ని ఆమె చిత్రాలలో కలలతో నిండిన ఆమె కళ్ళు ఇందుకు సాక్ష్యం. ‘విధానం’ ‘ఆలస్యం’ అనేవి ఆమె స్వభావానికి పూర్తిగా విరుద్ధం. పట్టుదల ఆమె అయుధం.

ఆమె కొంత నిధానంగా, స్థిరంగా కూర్చుని వ్రాసి వుంటే ‘విండికేషన్‌…’తో సహా తక్కిన పుస్తకాలన్నీ కూడా ఇంకా బాగా వ్రాసి

ఉండగల్గేదని ఆమె స్నేహితులంటారు.

అలంకరణ పట్ల అమిత ఆశ్రద్ధ. తల కూడా సరిగ్గా దువ్వేది కాదు. పొడవాటి నల్లని స్టాకింగ్స్‌ ధరించేది. ‘మురికిగా ఉండే తత్వవేత్త’ అని ఫ్యూసిలీ అనేవాడు.

‘విండికేషన్‌…’ ని అంకితం పొందిన ‘టెలిరాండ్‌’ ఈమె యింటికి వెళ్లినప్పుడు పగిలిన కప్పుతో కాఫీ యిచ్చింది. ఆమె ఉద్దేశ్యంలో ”సులభంగా సంపాదించలేని డబ్బుని సులభంగా ఖర్చుపెట్టకూడదు…’

కాన్సన్‌ పత్రిక ‘ఎనలటికల్‌ రివ్యూ’ కోసం అనువాదాలు చేస్తూ, పుస్తక సమీక్షలు వ్రాస్తూ రాజకీయ, సామాజిక, సాంస్కృతికాంశాలను అధ్యయనం చేస్తూ, స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ, ఆత్మవిశ్వాసంతో వుండేది. ఎన్నో పుస్తకాలు, ‘కరపత్రాలు, ఆమెలో ఆలోచనని, నూతనోత్సాహాన్నీ విమర్శనా దృష్టిని పెంచేవి.

కాథరీన్‌ మెకాలే వ్రాసిన ‘లెటర్స్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌’ – డాక్టర్‌ ప్రయిస్‌ ‘అన్‌ ది లవ్‌ ఆఫ్‌కంట్రీ’ అనే ఉపన్యాసం వంటివి ‘విండికేషన్‌..’ వ్రాయడానికి నేపథ్యాన్ని సమకూర్చాయి.

‘అన్‌ ది లవ్‌ ఆఫ్‌ కంట్రీ’ అనే ఉపన్యాసం విని చాలామంది ప్రతిస్పందించారు. ఎడ్మండ్‌ బర్క్‌, ‘రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ది ఫ్రెంచ్‌ రివొల్యూషన్‌’ అనే పుస్తకం వ్రాశాడు. దీని ప్రేరణతో థామస్‌ పెయిన్‌ ‘రౖౖెట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌’ వ్రాశాడు. డాక్టర్‌ ప్రయిస్‌ ప్రసంగం మేరీ ఆలోచనలకు పదును పెట్టింది. సత్తాగల రచయితగా ఎదగడానికి దోహదం చేసింది.

ఫ్రెంచి నేషనల్‌ అసెంబ్లీని అభినందిస్తూ ప్రారంభమైన ప్రయిస్‌ ప్రసంగం, ఉద్వేగ భరితంగా సాగింది. ఫ్రాన్స్‌లో వచ్చిన పౌర, రాజకీయ, మత, సామాజిక స్వేచ్ఛల పట్ల సంతోషం ప్రకటించాడు. 1789లో ‘బేస్టిలీ’ని ఆక్రమించినప్పటి సంతోషం, తదనంతర పరిణామాల వలన ఏమాత్రం బెదిరిపోలేదన్నాడు.

సంప్రదాయ సిద్దంగానూ, వారసత్వంగానూ సంక్రమించే అధికారాలు, రాజుల అధిక్యతలకి బదులు, మానవ హక్కులు నెలకొనడం, ‘బర్క్‌’ వంటి సంప్రదాయ వాదులకొక అపశకునంగా తోచింది. డాక్టర్‌ ప్రయిస్‌ వారి భయాలను మరింత ఎక్కువ చేశాడు. ప్రపంచ పౌరులుగా ఎదగడం గురించి, సామాజిక మార్పులకీ అనుగుణంగా వ్యక్తుల స్వభావాలు, నమ్మకాలు మారవలసిన అవసరం గురించి గట్టిగా మాట్లాడాడు. సంప్రదాయ వాదులకు నచ్చని విషయాలను ఎన్నింటినో ప్రస్తావించాడు. వారు ప్రతిస్పందించారు. తేనెటీగల తుట్టి కదిలింది. అవి అందర్నీ కుట్టడం ప్రారంభించాయి. ఎడ్మండ్‌ బర్క్‌ ‘రిప్లె˜క్షన్స్‌’ గ్రంథం ఈ కోవలో ముఖ్యమైనది.

మానవ హక్కులు, ఫ్రాన్స్‌లోని అవ్యక్త పరిస్థితి ప్రజలను భీతావహులను చేస్తున్నాయన్నాడు. ఫ్రాన్స్‌లోని జాకోబిన్‌ తీవ్రవాదులు కులీన వర్గాలపై చేస్తున్న దాడిని ఖండించాడు. ‘దయతో కూడిన శౌర్యం’ అధికారాన్ని మెత్తబరుస్తుందనీ, నాగరికులుగా చేస్తుందని, అటువంటి ‘షివల్రి’ ఫ్రాన్స్‌లో అంతరించి పోకుండా ఉంటే, ఫ్రెంచి రాణిని రక్షించడానికి వేలాది చేతులు కత్తులు దూసి ఉండేవంటాడు, మేరీ ఊల్‌స్టన్‌ క్రాప్ట్‌ దృస్టిలో మేరీ ఆంటోనియట్‌ (రాణి)కి తాను పని చేసి వచ్చిన లేడీ కింగ్స్‌ బరోకి తేడా ఏం లేదు, బర్క్‌ చెప్పిన ‘షివల్రి’ కపటంతో కూడినదంటుంది మేరీ ఊల్‌స్టన్‌ క్రాస్ట్‌.

‘పీడితులైన వేలాది మంది స్త్రీలను వదిలి, బర్క్‌ పేరు ప్రతిష్టలున్న కొద్దిమంది ధనిక స్త్రీలపై జాలిపడ్డాడు. అతడికి వేలాది మంది కార్మిక స్త్రీల, వారి బిడ్డల ఆక్రందనలు వినబడలేదు’ అని అంటుంది.

బర్క్‌కి సమాధానంగా ఆమె వ్రాసిన ‘విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌’ లోని ‘విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ విమెన్‌’ అనే ఈ గొప్ప పుస్తకానికి బీజాలు పడ్డాయి. ‘మానవ’ అనే పదంలో ‘స్త్రీ’ కూడా వుందని ఆమె అభిప్రాయం.

1791లో ‘విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ విమెన్‌’ వెలువడింది. ఒక సిద్ధాంతీకరింపబడిన నైతిక వ్యవస్థపై ఆధారపడిన, స్త్రీ విముక్తి గురించిన మొట్టమొదటి వాదన యిది. సహజంగానే, ఇటువంటి వాదనలకి శత్రువులు, మిత్రులు కూడా వుంటారు.

ఫ్రాన్స్‌లో వస్తున్న మార్పుల్ని శంకతో పరిశీలించేవారూ, కుతూహలంతో పరిశీలించేవారూ ఈ శతృ, మిత్ర వర్గాలుగా మారారు.

”పురుషుల నిరంకుశత్వాన్ని సమర్థించేవారు చేతనైతే ఈ వాదనకి సమాధానం చెప్పండి” అన్నాడు థామస్‌ కూపర్‌. సంప్రదాయ వాదులు కొంతమంది, దీనికి సమాధానం చెప్పడం కూడా అనవసరం అనీ, మరి కొంత మంది ఈ పుస్తకం పేరే హస్యాస్పదంగా వుందనీ, ఇంకా కొందరు ‘ఫాన్స్‌లోని అపవిత్రమైన ‘ఆమెజాన్స్‌’లో ఈ రచయిత్రి కూడా ఒకరు’ అని అన్నారు.

ఇందులోని ప్రతిపాదనలన్నీ దుష్టమైనవనీ, ఆమె జీవిత విధానమే సంప్రదాయ విరుద్ధం కనుక, ఆమె వ్రాతల్ని పట్టించుకోనువసరం లేదనీ కూడా వ్యాఖ్యానించారు. నీతి నియమాలు లేని ఈమె ప్రవర్తనని స్త్రీవాదంలో సహజంగా వుండే ‘చెడు’కు ఉదాహరణ అని తేల్చివేశారు. అయితే అప్పుడే విప్లవీకరింపబడుతున్న ఫ్రాన్స్‌లో ఈ పుస్తకానికి వచ్చిన స్పందన మరో విధంగా వుంది. 1792లో మేరీ ఫ్రాన్స్‌ వెళ్ళింది. ఫ్రెంచి భాష నేర్చుకోవాలనే నెపంతో .. నిజానికి ఫ్రెంచి విప్లవాన్ని మరింత దగ్గరగా చూడాలని వెళ్ళింది. అప్పుడు ‘విండికేషన్‌’ ఫ్రెంచి భాషలోకి అనువాదం అయింది. ఆమె రాక కన్నా ముందే ఫ్రెంచ్‌ వారికి ఆమె గురించి తెలిసింది.

ఒక అంతర్జాతీయ రచయితలు, రాజకీయ వాదుల ‘సంఘం అమెకు సభ్యత్వం కూడా యిచ్చింది.

వ్యవస్థల పట్ల ఆమెకున్న ఏ కొద్ది గౌరవమో ఫ్రెంచి విప్లవం పరిశీలనతో తుడిచి పెట్టుకుపోయింది. అయితే ఆమె ఫ్రాన్స్‌లో వుండగానే విప్లవం సాగుతున్న తీరు ఆమెలో కొంత ఆశాభంగాన్నీ భేదాన్నీ కూడా కలిగించింది. మానవ సమాజాలలో ముఖ్యమైన మార్పులు అనుకున్నంత సులభంగా సాధ్యం కావని తెలిసింది. క్రూరత్వం నుంచి నిరంకుశత్వం నుంచి, కొత్తగా విముక్తి పొందిన మనుష్యులు, మరింత ధర్మబద్దంగా తయారుకాలేదని కలత పడింది. ఉన్నత వంశాలకు చెందినంత మాత్రం చేతనే చాలామందిని

ఉరికంబం ఎక్కించడం గురించి జాన్సన్‌కి లేఖ వ్రాసింది.

ఒకసారి ఆమె రక్తం ఓడుతున్న ఒక ఉరికంబాన్ని చూసి భయభ్రాంతురాలె కేక వెయ్యబోతే, ఆగంతుకుడొకతను ఆమెను ప్రక్కకు తీసుకువెళ్ళి సముదాయించవలసి వచ్చింది.. – ఆమె ఇంగ్లిషు స్త్రీ కావడం, ఆ సమయంలో రెండు దేశాలకూ మధ్య పోరు జరుగుతుండడం కారణంగా.

1794లో ‘ఫ్రెంచి విప్లవం – పుట్టుక అభివృద్ధిని గురించిన చారిత్రాత్మక నైతిక దృక్కోణం” – అనే పుస్తకం వ్రాసే నాటికి ఆమెలోని అనేక భ్రమలు తొలగిపోయాయి. క్రొత్త ఆశావాదం మొదలైంది.

ఫ్రాన్స్‌లోని ఆవ్యక్త పరిస్థితి నుంచి ఒక మంచి ప్రభుత్వం ఆవిర్భవిస్తుందని, మనుష్యులలో మంచితనం అనేది సహజాతం అనీ ఆమె నమ్ముతుండగానే ఆమెకు గిల్బర్ట్‌ ఇమ్లే అనే అమెరికన్‌తో పరిచయం అయింది. స్నేహం పెరిగింది. చాలా మంది వీరిద్దరికీ వివాహం అయిందని కూడా అనుకున్నారు. ఆమెను మిసెస్‌ ఇమ్లే అనికూడా పిలిచేవారు. రాజకీయ ఉధృతిలో వివాహం చేసుకోవడం కష్టం అని వివాహాన్ని వాయిదా వేసింది మేరీ. మూడు సంవత్సరాలు కొనసాగిన వీరి స్నేహ సంబంధంలో అనేక తుఫానులు చెలరేగాయి. వివాహం కాక ముందే 1794లో మేరీ ఫానీ ఇమ్లే జన్మించింది. ఇమ్లేకి డబ్బు పిచ్చి. తన అదృష్టాన్ని వెతుక్కుంటూ దేశాలు తిరిగేవాడు. బిడ్డని పోషించడానికి అనువైన మంచి యిల్లు – స్థిరమైన జీవితం, ఉన్న దానితో తృప్తి పడడం మేరీకి అభిమతమైతే, ధన సంపాదన, చపల చిత్తం ఇమ్లే స్వభావం.

1795లో మేరీ ఇమ్లే వెంట స్కాండినేవియా వెల్లింది. అక్కడ అతని బిజినెస్‌ ఏజెంట్‌గా కూడా వ్యవహరించింది. అక్కడ నుంచి వ్రాసిన లేఖలు, ”లెటర్స్‌ రిటెన్‌ డ్యూరింగ్‌ ఎ షార్ట్‌ రెసిడెన్స్‌ ఇన్‌ స్వీడన్‌, నార్వే అండ్‌ డెన్మార్క్‌” అనే శీర్షికలో 1796లో ఒక పుస్తకంగా వెలువడ్డాయి.

తన జీవితంలో అతి క్లిష్ట దశలో వుంది ఆమె వ్రాసిన ఈ పుస్తకం చాలా మందికి నచ్చింది. వివాహం, మాతృత్వం ఆమె హృదయాన్ని మెత్తబరచాయన్నారు. కొంత కవితా ధోరణీ, కొంత విమర్శ, ప్రకృతి వర్ణన, స్థానిక ప్రజల జీవన శైలి, స్వభావాలను మిళితం చేసే వ్రాసింది. అయితే అధికారం యొక్క కలుషిత స్వభావం ‘నీతి’పై ఎట్లా పనిచేస్తుందో ఆమె ఎల్లప్పుడు గమనిస్తూనే వుండేది. క్రూరత్వం, నిరంకుశత్వం సర్వాంతర్యాములు. డెన్మార్క్‌ బలహీనమైన పొరుగు దేశాలపై క్రూరత్వం చూపుతుంది. పురుషులు స్త్రీల పట్ల క్రూరంగా వుంటారు. క్రూరత్వానికీ, నిరంకుశత్వానికి మూలం ఆస్థే నంటుంది మేరీ ఊల్‌స్టన్‌ క్రాప్ట్‌. పేదల బాధే ధనికులకి అనందం అని కూడా ఉంటుంది.

ఒకసారి రోడ్డు నిర్మిస్తున్న ఖైదీల ప్రక్కగా నడుస్తూ ఇలా ఉంటుంది. ‘ఉన్నత హోదాలో వుండే వారి కోట్లకి (జశీa్‌ర)వుండే బంగారు నక్షత్రాలు, ఖైదీల చేతులకుండే సంకెళ్ల కన్నా తలవంపులు తెచ్చేవిగా వుంటాయి. వ్యవస్థ సక్రమంగా వుంటే – మనిషిని ఏ ధైర్యం అయితే కూృరుడిగా, దుర్మార్గుడిగా మారుస్తుందో, అ ధైర్యాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోగలిగేది.

అప్పటికే ఆమెకీ, ఇమ్లేకి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయి. 1795లో అతను వేరొక స్త్రీతో వుంటున్నాడని తెలుసుకుంది. – (బహుశా – ఆ స్త్రీ ఇమ్లేకి ధనకాంక్షపైనా, స్త్రీవాదం గురించీ వుపన్యాసం ఇస్తూ వుండి వుండదా-)

జీవితంలో ఆర్థికంగా ఎన్నో యిబ్బందుల్నీ, సామాజికంగా ఎంతో విమర్శనీ ఎదుర్కొని, పట్టుదలతో జీవించిన మేరీ, ఇమ్లేపై తను పెంచుకున్న నమ్మకానికి అతను అర్హుడు కాదని తెలుసుకుని, అతని నీతి బాహ్యతతో విసుగుచెంది, ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె నీళ్ళలో దూకుతూ వుండగా చూసిన వాళ్ళు రక్షించారు. అయితే తనా పని చేసినందుకు తరువాత విచారించి, ఇమ్లేని మర్చిపోయింది.

1797లో ఆమెకి తత్వవేత్త అయిన విలియం గాడ్విన్‌తో వివాహం అయింది. వివాహ ‘ఒడంబడిక’ అనేది చాలా కృత్రిమమైనదనీ, సద్భావం కల ఇద్దరు వ్యక్తుల్ని కలపడానికి ఇలాంటి ‘ఒడంబడిక’లు అవసరం లేదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

స్వతంత్ర భావాలు కల ఇద్దరు వ్యక్తులు ఒక కప్పు క్రింద ఎక్కువ కాలం యిమడడం కష్టం అంటాడు గాడ్విన్‌.

ఒకరి వ్యక్తిగత సమయంలోకి మరొకరు చొరబడకుండా, ఎవరి స్వాతంత్య్రం వారు కాపాడుకుంటూ స్నేహన్ని నిలుపుకున్న వీరి సఖ్య సహజీవనం ఎక్కువ కాలం కాపాడుకుంటూ స్నేహాన్ని నిలుపుకున్న వీరి సఖ్య సహజీవనం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1797 ఆగష్టులో ఒక బిడ్డను కని చనిపోయింది మేరీ ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌. ఆ బిడ్డ పెద్దయిన తర్వాత షెల్లీ కవిని పెళ్ళి చేసుకుని మేరీ షెల్లీగా ప్రఖ్యాతి చెందింది. కవి షెల్లీని పెళ్ళి చేసుకుని మిసెస్‌ షెల్లీగా ప్రఖ్యాతి చెందడం కాదు. – ‘ఫ్రాంకెన్‌స్టెయిన్‌’ అనే సంచలనాత్మక గ్రంథాన్ని రచించడం ద్వారా ప్రఖ్యాతి పొందింది.

ఆధునిక స్త్రీవాదానికి భవిష్యత్తు చెప్పింది మేరీ ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌.

(‘విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ విమెన్‌’ పెంగ్విన్‌ ఎడిషన్‌లోని ఇంట్రడక్షన్‌కు స్వేచ్ఛానుసరణ)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.