కుటుంబ హింసను గుర్తించడానికి, దాని స్వభావాన్ని అర్థం చేసుకొని నిర్దిష్టమైన కార్యక్రమం నిర్వచించుకోవటానికి సామాజిక సంక్షేమ కార్యకర్తలకు, సంస్థలకు చాలా కాలం పట్టింది. 20వ శతాబ్ది మొదట్లో కుటుంబ హింసలో పురుషుల ప్రమేయం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. భార్యన్ని కొట్టడం అనేది ఒక హింసాపూరితమైన చర్యగా ఎవరూ భావించలేదు. భర్తల్ని వేలెత్తి చూపే అవకాశమూ లేదు. అందువల్ల కుటుంబ హింసగా కాకుండా కేవలం భార్యాభర్తల వ్యక్తిగత వ్యవహారంగానే భావించేవారు. సాధించే భర్తలను, భరిస్తున్న భార్యలనూ అర్థం చేసుకునే సమగ్ర దృష్టి లోపించింది. ఫలితంగా, స్త్రీలకు సమాజం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందలేదు. వారు ‘పిల్లల సంరక్షణ – భవిష్యత్తుల’ కోసం తప్పని సరై కుటుంబ హింసని భరించాల్సి వచ్చేది.
తొలి నాళ్ళలో కుటుంబ హింస గురించి పనిచేసే సోషల్ వర్కర్లు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారు. అప్పటి సామాజిక వాతావరణంలో సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూపడంలో వాళ్ళకి చొరవ లేకపోయింది. కుటుంబాలలో హింసకి పాల్పడే పురుషుల్ని సంస్కరించాలన్న ధోరణే ఎక్కువగా కనిపించేది. వైవాహిక బంధం నుంచి స్త్రీలు తెగతెంపులు చేసుకుంటే పిల్లల భవిష్యత్తు నాశసనమౌతుందన్న అభిప్రాయం వారికెక్కువ వుండేది.
కుటుంబం అనేది సమాజంలో అవిభాజ్యమైన వ్యవస్థగా వుంది కనుక, కుటుంబ హింసకి గురయ్యే స్త్రీల పట్ల సమాజంలోని వైద్య సంక్షేమ, హౌసింగ్స్ (గృహనిర్మాణం), పోలీస్ విభాగాలు ఏ తీరున స్పందిస్తున్నాయి అన్నది కూడా ముఖ్యమైన విషయమే. అంతేకాదు, కుటుంబాల్లో స్త్రీలు తీవ్రమైన దాడికి గురైనప్పుడు లేదా దారుణమైన స్థితికి నెట్టబడ్డప్పుడు మాత్రమే – దాన్ని హింసగా భావించడం జరుగుతోంది. రోజువారి జీవితంలో కన్పించని స్థాయిలో జరుగుతున్న హింసని అర్థం చేసుకోవడంలో విఫలమౌతున్నారు.
స్త్రీల ఉద్యమం కుటుంబ హింసని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దృక్కోణాన్ని అందించింది. కుటుంబ హింస అనేది వ్యక్తుల సమస్యగానో, ఆయా కుటుంబాల నిర్దిష్ట సమస్యగానో కాకుండా అదొక సామాజిక సమస్యగా ముందుకు తీసుకువచ్చి చర్చించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కుటుంబ హింసని సామాజిక సమస్యగా గుర్తించడంవల్ల, ఆ సమస్యని ఎదుర్కొంటున్న స్త్రీలకి అనేక రకాల, అనేక సంస్థల మద్దతు లభించే అవకాశమేర్పడింది, కుటుంబ హింసకి బాధితులైన స్త్రీలు ఆ హింసని ఎదుర్కొంటూ నాలుగ్గోడల మధ్యే మిగిలిపోలేదు. ఇదొక రాజకీయ అంశంగా, బలమైన సైద్ధాంతిక అవగాహనతో బహిరంగ వేదికల మీద చర్చకు పెట్టారు. స్త్రీల ఉద్యమం ముందుకి తీసుకువచ్చిన అంశాలు కాలక్రమంలో అన్ని సంస్థలనూ ప్రభావితం చేశాయి.
కుటుంబ హింస గురించి పనిచేస్తున్న అనేక సామాజిక సంస్థలు, వాటి సభ్యులు కార్యాచరణలో అనేక అంశాలు ఒకదానికొకటి ముడిపడి వున్నాయి. సొషల్ వర్క్ కార్యకర్తలు ఈ అంశాన్ని అర్థం చేసుకున్న తీరు, ఈ అంశం మీద పనిచేయడానికి వారు పొందిన శిక్షణ, వివిధ కార్యాలయాల్లో ఈ విషయం గురించి లభిస్తున్న ప్రోత్సాహం లేదా ఆ లక్ష్యం, కార్యాచరణకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవడం, ఈ సమస్య మీద పని చేస్తున్న ఇతర సంస్థలకు మద్దతు ఇవ్వడం – కుటుంబ హింసకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలుపైన చెప్పిన అంశాలతో ముడిపడి వున్నాయి. అలాగే కార్యకర్తల వద్దకు ఆధిక సంఖ్యలో వస్తున్న కేసులు, అవి ఎలాంటి సందర్భాలలో వస్తున్నాయి. వాటిని ఎట్లా అర్థం చేసుకొంటున్నారు – సమస్యల్ని నమోదు చేయడమే కాక వాటిపట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా ముఖ్యమైనవి.
కుటుంబం అనే యూనిట్‌లో ప్రధాన భాగస్వాములుగా ముగ్గురు వుంటారు. వారు భార్య, భర్త, పిల్లలు, కనుక ఆ ముగ్గురి వైపు నుంచి అందే చిహ్నాల ఆధారంగా సోషల్ వర్కర్లు కుటుంబ హింసని అర్థం చేసుకోవాలి.
స్త్రీలలో:
తనను తనే తక్కువ చేసుకోవడం, మానసిక వ్యధ; ఒత్తిడి; జెలసీ; బాగస్వామితో తిట్లు, తన్నులు తినడం, దెబ్బల్ని తక్కువ చేసి చూపించడం; పీడకలలు; నిద్రలేమి; మందులకు అలవాటు పడడం; భాగస్వామి ప్రవర్తనకు భయపడడం; భాగస్వామి ప్రవర్తనను సమర్థించడం.
పురుషులలో:
హింసా పూరితంగా వుండడం, ఎప్పుడూ ఇతరుల్ని విమర్శించడం లేదా కించపరచడం; భాగస్వామిని కట్టుబాట్లతో వుంచడం; కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద వస్తువులు విసిరి వేయడం; ఇంటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తనే తీసుకోవడం; అతి జాగ్రత్తగా వుండడం; జెలసీ, అనుమానం; కొట్టడం; కొట్టి సమర్థించుకోవడం.
పిల్లలలో:
స్కూల్లో ఇబ్బందులు పడడం, దేనిమీదా దృష్టి పెట్టకపోవడం; దిగాలుపడడం; భయం ఎక్కువవడం; మగపిల్లల్లో పెరిగే హింసా ప్రవృత్తి; దెబ్బలు తినడం; మానసిక సమస్యలు; ప్రవర్తనా సమస్యలు; నిద్రపట్టకపోవడం.
కుటుంబ హింసపై పనిచేసే సోషల్ వర్కర్లకు కొన్ని సూచనలు:
– కుటుంబ హింసకు కారకులైన వ్యక్తుల సమక్షంలోనూ లేదా ఇంట్లోనూ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో, బాధితురాలి మనోగతాన్ని, అభిప్రాయాన్ని, నిర్ణయాల్ని తెలుసుకోవాలి.
– బాధితురాలి వెంట ఆమె పిల్లలుంటే అభిప్రాయ సేకరణ సమయంలో ఆ పిల్లల సంరక్షణకు వేరే వారిని పురమాయించాలి.
– బాధితురాలు తమ సమస్యను చెప్పుకుంటున్నప్పుడు మీరు సరైన వ్యక్తులా కాదా అని తేల్చుకునే హక్కు వారికి వుంది.
– ఆమె సమస్యలు వింటున్న వారిలో మీరు మొదటి వారై వుండొచ్చు. మరీ ముఖ్యంగా వృత్తిపరంగా, ఆ సందర్భంగా ఆమె సమస్యల్ని సావధానంగా విని అర్థం చేసుకోగలగాలి.
– ఒక స్త్రీ తనకెదురైన కుటుంబ హింస గురించి తన అనుభవాలు – భాదల అధారంగా చెప్తున్నప్పుడు – ఆమె నిబద్ధతని గుర్తించాలి.
– కుటుంబ హింసని ఎదుర్కోవడంలో ఆమెకు ఇతరేతరమైన మద్దతులు లభిస్తున్నాయేమో తెలుసుకోవాలి. అవి అమెకు అందజేస్తున్న మద్దతు ఏ స్థాయిలో వుందో అంచనా వేయాలి. ఉదా: కుటుంబం – స్నేహితులు – సహచరులు.
– మీరు ఏం ఆలోచిస్తున్నారో కాకుండా, బాధితురాలు తన గురించి తాను ఏం ఆలోచిస్తోందో, ఏం చేయాలనుకుంటోందో ముందుగా తెలుసుకోవాలి. స్త్రీలు ఇల్లు వదిలి పెట్టడం ఎంత కష్టమో, ఈ మాత్రం బయటికి రావడానికి ఆమెకు ఎంతకాలం పట్టిందో అర్థం చేసుకోవాలి.
– స్థానికంగా ఉండే సహాయ వనరుల గురించి ఎప్పటికప్పుడూ సమాచారం ఉండాలి. ముఖ్యంగా చట్టపరమైన సహాయం, వసతి గృహాల సమాచారం మొదలైనవి.
– హింసించే భర్త దగ్గరకే మళ్ళీ ఆమె వెళ్ళిపోతాననవచ్చు. దానికీ మీరు సిద్దపడే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాల్సి వుంటుంది. చాలా మంది స్త్రీలు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు తమదైన పద్ధతిలో ఇలాంటి ప్రయత్నాలూ చేస్తారు.
ఈ క్రింది విషయాలు సంస్థాపరంగానూ, వ్యక్తిగతంగానూ సోషల్ వర్కర్లు అనుసరించదగ్గవి; సంస్థాపరమైనవి.
– బాధతులైన స్త్రీల సమస్యల్ని విని సహానుభూతి చూపడం, వాళ్ళ లోపలి శక్తిని గుర్తించేలా చెయ్యడం, తమ సమస్యను ఆలకించి అర్థం చేసుకునే వాళ్ళు వున్నారు అన్న భావన వాళ్ళని వాళ్ళు లోకువ చేసుకునే పరిస్థితిని దూరం చేస్తుంది.
– మానసికంగానూ, సంఘపరంగానూ స్త్రీల నిర్ణయాల ఆచరణకు మద్దతు నిచ్చే స్థానిక వనరుల గురించి సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడం, వివిధ భాషల్లో ఉన్న ఈ సమాచారం విస్త ృతంగా ప్రచారం చేయాలి.
– ఈ సమస్య మీద పని చేసే వివిధ సంస్థల్ని అనుసంధానించగలిగే శిక్షణ పొందిన కార్యకర్తలు ఉండాలి.
– బాధితుల రోజు వారి జీవితంలో ఎప్పుడు సహాయం కావాలని కోరుకున్నా అందుకు తగ్గ రీతిలో సోషల్ వర్కర్లు అందుబాటులో ఉండాలి.
– కుటుంబ హింసపై పనిచేసే సోషల్ వర్కర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన శిక్షణ నైపుణ్యాలు అందించాలి.
వ్యక్తులుగా:
– కుటుంబాలలో స్త్రీలు అనుభవిస్తున్న హింసని అనేక పార్శ్వాల నుంచి సమూలంగా అర్థం చేసుకోవాలి.
– కుటుంబ హింస ప్రభావం ఎన్ని రకాలుగా వుంటుందో అర్థం చేసుకోవాలి.
– ఈ హింసని అనుభవిస్తున్న స్త్రీల సజీవ చరిత్రలను రికార్డు చేయాలి.
– బాధితులకు తక్షణమూ లేదా దీర్ఘకాలికంగా అందించే సహాయం ఏ రీతి వుండగలదో స్పష్టమైన అంచనాతో వ్యవహరించాలి.
– పిల్లల సంరక్షణకు సంబంధించిన బాధ్యతల గురించి గానీ, స్త్రీలు చెప్పే విషయాల్ని అవసరమైన పక్షంలో గోప్యంగా వుంచడంలో గానీ జాగ్రత్తలు తీసుకోవాలి.
..ఖీaఎఱశ్రీవ ఙఱశీశ్రీవఅషవ aఅస షaతీఱఅస్త్ర జూతీశీటవరరఱశీఅరఁ వసఱ్‌వస పవ జూaబశ్రీ సఱఅస్త్రర్‌శీఅ aఅస పతీఱసస్త్రవ్ జూవఅష్ట్రaశ్రీవ, కూశీఅసశీఅ, వీaషఎఱశ్రీశ్రీaఅ, 1995. సిబాన్ లాయిడ్ రాసిన ‘సోషల్ వర్క్ అండ్ డొమెస్టిక్ వయోలెన్స్’ (అధారంగా)